🙏మహాభారతం _ శాంతి పర్వం 🙏
తొమ్మిదవ భాగం
అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! తినకూడనివి ఏవి ? త్రాగ కూడనివి ఏవి ? ఎవరు యోగ్యులు ? ఎవరు అయోగ్యులు ? వివరించండి " అని ఆడిగాడు. వ్యాసుడు బదులుగా " ధర్మనందనా ! గుర్రము, ఒంటె, గాడిద పాలు త్రాగ కూడదు. బ్రాహ్మణుడు ఆడగుర్రము, ఆడఒంటె, ఆడగాడిద దరిదాపులకు వెళ్ళ కూడదు. మనిషిపాలు అసలు త్రాగ కూడదు. ఈనిన పది రోజుల లోపల ఆవు పాలు త్రాగ కూడదు. ప్రేతము వెళ్ళిన ఇంటి భోజనం, పురుటి భోజనం, తలారి ఇచ్చిన భోజనం, కులట ఇచ్చిన భోజనం, స్త్రీ సంపాదన మీద బ్రతికేవాడు పెట్టిన అన్నం, ఆట పాటలతో జీవించేవాడు ఇచ్చే అన్నం, జూదరి ఇచ్చే అన్నం, పూలు అమ్ముకునేవాడు ఇచ్చిన అన్నం, ఊరి నుండి వెలివేసినవాడు ఇచ్చే అన్నం, అన్న కంటే ముందు వివాహంచేసుకునే వాడు ఇచ్చే అన్నం తినరాదు. అవి అభోజ్యములు. ఇతరులను పొగడుతూ జీవించేవాడు ఇచ్చిన అన్నం అత్యంతహేయం. నిలవఉన్న అన్నం పాచిపోయిన అన్నం తినరాదు. సురాపానంతో సంబంధించిన అన్నం తినరాదు. పులగము, పాయసం, అప్పములు, నువ్వులతో చేసిన వంటకములు, దేవుడికి అర్చనచేసి నివేదన చేసిన తరువాత కాని తినకూడదు. ఇవి మామూలుగా వండుకుని తినరాదు.
గృహస్థాశ్రమ ధర్మమును పాటించే వారు దేవతార్చన చేయకుండా దేవతలకు నివేదించక, పితృదేవతలకు పెట్టక, అతిథులకు పెట్టక తినరాదు. గృహస్థు అయిన వాడు భార్యాబిడ్డలు బంధువులతో సంచరిస్తూనే అంటీ అంటక ఉండాలి. వారి ప్రేమాభిమానాలాకు పూర్తిగా లొంగకూడదు. ధర్మనందనా ! ఇంక అయోగ్యుల గురించి చెప్తానువిను. పాటలుపాడుతూ నృత్యములు చేస్తూ జీవించేవారు. విదూషకులు, దుర్జనులు, నపుంసకులు, మోసగాళ్ళు, వేదం చదవనివాళ్ళు, తక్కువ కులమువాళ్ళు, ఇతరులకు హానిచేయడమే వృత్తిగాపెట్టుకున్న వాళ్ళు దానం స్వీకరించడానికి అనర్హులు. పేదవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, దానానికి అర్హులు. నీకు దానగుణం ఎక్కువగా ఉన్నా చెడ్డవాళ్ళకు దానం చేయకూడదు. దాని వలన ప్రయోజనం శూన్యం. అపాత్రాదానం మంచిది కాదు. అనర్హులకు చేసే దానం నపుంసకుడికి కన్యను ఇచ్చినట్లు, బూడిదలో నెయ్యిపోసినట్లు, ఓటికుండలో నీళ్ళుపోసినట్లు ఔతుంది. అర్హుడైనవాడికి చేసేదానం చేసినవాడికి పుచ్చుకున్న వాడికి ఇహ లోకసౌఖ్యం పరలోక సౌఖ్యం కలుగుతుంది. ధర్మజా ! నీకు నేను మంచీచెడు సంక్షిప్తంగా మంచిచెడు గురించి వివరంగా చెప్పాను. నా పలుకులు మన్నించి ధర్మబద్దంగా ప్రవర్తించు " అన్నాడు.
ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! మీరు చెప్పిన మాటలు నా మనసుకు చాలా హర్షం కలిగించాయి. మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను ధర్మమార్గం అవలంబించి రాజ్యభారం వహించి అమంగళం కలగకుండా చూస్తాను. నా మీద కృపతో మీరు రాజధర్మములు వర్ణాశ్రమ ధర్మాలు ఆపద్ధర్మాలు నాకు తెలియ చెప్పండి. నాకు రాజధర్మం ధర్మాచరణ పరస్పర విరుద్ధం తోస్తుంది. అందుకని మిమ్ము ఇలా ప్రార్ధిస్తున్నాను " అన్నాడు. అప్పుడు వ్యాసుడు నారదుడిని చూసి " మహర్షీ ఈ మహారాజును భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాలి. భీష్ముడే ధర్మజుడికి సకల ధర్మములు చెప్పగల సమర్ధుడు " అన్నాడు. అప్పుడు నారదుడు " మహర్షీ ! మీరు చెప్పినది చాలా యుక్తంగాఉన్నది " అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు ధర్మనందనుడితో " ధర్మనందనా ! భీష్ముడు కురువృద్ధుడు. ఇంద్రాదులకు కూడా పూజనీయుడు. కుటిలత్వం తెలియనివాడు. పరశురాముడి వద్ద విద్యలునేర్చి విలువిద్యా రహస్యాలను తెలుసుకున్న వాడు. పవిత్రగంగా గర్భమున జన్మించిన వాడు. సుగుణాలకు పుట్టిల్లు. ఆయనకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. చ్యవనుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు మొదలగు మహర్షుల వద్ద ధర్మసూక్ష్మములు తెలుసుకున్న వాడు. తండ్రినుండి స్వచ్ఛందమరణం వరంగాపొంది తన ప్రాణములు మేనిలో నిలుపుకుని ఉన్నాడు. నీవంటే ఎంతో అభిమానం ఉన్న అంతటి మహానుభావుడి వద్దకు నీవు వెళ్ళి ప్రార్ధించిన అతడు నీకు అత్యంత వాత్సల్యంతో నీకు ధర్మసూక్ష్మములు తెలుపగలడు. దీనివలన నీవు ఎంతో కీర్తిమంతుడవు కాగలవన్నది మా అందరి అభిమతం. పైగా భీష్ముడికి అవసాన కాలం సమీపిస్తుంది. ఇంక ఆలస్యంచేయకు " అన్నాడు.
ధర్మరాజు వ్యాసుడితో " మునివర్యా ! ఎంతో మంది బంధువులను, మిత్రులను వధించిన వాడను ఆయన ఎదుట ఎలా నిలువగలను ? విలువిద్యా విశారదుడైన భీష్ముడిని కృత్రిమసమరంలో కూల్చిన పాతకుడిని తిరిగి ఆయన ఎదుట ఎలా నిలువగలను ఆయన మొహంచూసి ధర్మసూక్ష్మములు చెప్పమని ఎలా అడగను " అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మజా ! అలా అనుకోవడం ఎందుకు. నీవు వ్యాసమహాముని ఆజ్ఞమేరకు భీష్ముడి వద్దకు వెళుతున్నావు. కాని ఇంతశోకంతో భీష్ముని వద్దకు వెళ్ళకు ముందు నీవు రాజ్యానికి వెళ్ళు తరువాత భీష్ముడి వద్దకు వెళ్ళవచ్చు. నీకొరకు నీతమ్ములు, బ్రాహ్మణులు, పురజనులు ఎదురుచూస్తున్నారు. హస్థినాపురప్రవేశం చేసి వారందరికి ఆనందం కలిగించు " అని పలికాడు. ఈ ప్రకారం వ్యాసుడు, నారదుడు, శ్రీకృష్ణుడు, దేవలుడు చెప్పిన మాటలతో తన శోకమును వదిలిపెట్టిన ధర్మరాజుకు రాజ్యపాలన పట్ల ఆసక్తి కలిగింది. ధర్మరాజు ఆ మునులందరికీ ప్రదక్షిణంచేసి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తరువాత మునులందరూ తమతమ స్థానాలకు వెళ్ళారు.
ధర్మరాజు దేవతలను బ్రాహ్మణులను పూజించాడు. తనదర్శనం కొరకు వేచిఉన్న సామంతులను కలుసుకుని వారిచ్చిన కానుకలను స్వీకరించాడు. మరునాడు వేకువనే లేచి అభ్యంగనం ఆచరించి తెల్లనివస్త్రములు విలువైననగలు అలంకరించుకున్నాడు. పదునారు తెల్లనిగుర్రములను కట్టిన రథమును అధిరోహించాడు. భీముడు సారథిస్థానమున కూర్చున్నాడు. అర్జునుడు వెనుక నిలబడి తెల్లనిగొడుగు పట్టుకున్నాడు. నకులసహదేవులు వింజామరలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి వెంటవస్తున్నారు. విదురుడు, కుంతీదేవి, ఇతర అంతఃపుర స్త్రీలు వారవారి వాహనములలో పల్లకీల మీద వస్తున్నారు. సామంతరాజులు తమతమ సైన్యములతో పక్కన వస్తున్నారు. ఇలా ధర్మరాజు హస్థినాపురానికి పయనమయ్యాడు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి