*మే 12 న హనుమజ్జయంతి*
*సకలాభీష్టాలూ సిద్ధింపజేసే సంజీవరాయుడు*
శ్రీరామభక్త హనుమది ఒక విశిష్ట మైన అవతారం.
ఆయనకు సంబంధించిన వేర్వేరు పురాణగాథలను ఈ సందర్భంగా తెలుసుకుందాం.
ఆయన మాతృమూర్తి అంజనాదేవి, పూర్వజన్మలో పుంజికస్థల అనే పేరున్న అప్సరస.ఆమె లావణ్యానికి మోహితు డైన వాయుదేవుడు, కేసరి అనే వానర రూపంలో హనుమంతునికి తండ్రి అయ్యాడు. అందుచేతనే హనుమంతుడు, మనోజవం, మారుతతుల్య వేగం కలవా డయ్యాడు. జితేంద్రియుడు, బుద్ధిమంతుడూ ఐన హనుమను, "రామచరితమానస్" గ్రంథకర్త ఐన గోస్వామి తులసీదాసు, తనకు బుద్ధిబలాలను, విద్యనూ ప్రసాదించ మని ప్రార్థించాడు. బుద్ధిమంతుడే కాక హనుమ, అపారపాండిత్యం ఉన్నవాడు కూడా. శ్రీరామభక్తుడు కనుక, సమస్తజీవులకూ ఐహికసుఖాలను కలిగించే వాడని చెప్తారు. ఆ పైన ఆధ్యాత్మికమార్గంలో నడిపించి, ముక్తినీ ప్రసాదిస్తాడు.
నవనిధభక్తులలో హనుమది దాసభక్తి. నిరంతరమూ స్వామి సన్నిధిలో ఉండి, రామకథను వినటం లోనే పరమానందాన్ని పొందిన భక్తాగ్రగణ్యుడు ఆంజనేయుడు.
*యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్*
*తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ l*
*బాష్పవారి పరిపూర్ణలోచనమ్*
*మారుతిమ్ నమత రాక్షసాంతకమ్ ll*
అని మారుతిని కీర్తిస్తారు. ఎక్క డెక్కడ శ్రీరామచంద్రునికి సంబంధించిన విషయాలు విన్నా, హర్షంతో పులకించిన శరీరం కలవాడు, తలపై చేతులు జోడించి నమనం చేసేవాడు, ఆనందబాష్పాలు నిండి జాలువారే కన్నులు కలవాడూ అయిపోతాడట! అంత గొప్ప భక్తి ఆయనది!
కర్ణుడు లేని మహాభారతకథ లేనట్లుగానే, హనుమంతుడు లేని శ్రీరామాయణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. తులసీదాసు రచించిన "హనుమాన్ చాలీసా"ను ప్రతిదినమూ పారాయణ చేస్తూ హనుమను కొలవటం మనలో ఎందరికో అలవాటు. కార్యసిద్ధికి స్వామి చాలా త్వరగా తోడ్పడుతా డని ప్రసిద్ధి.
జంటనగరాలలో తాడుబందు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. బోయినపల్లి, సిఖ్ విలేజ్ లకు వెళ్లే దారిలో ఉందీ దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం, స్వామి భక్తులకు కొంగు బంగార మైన వైనాన్ని తెలియజేస్తుంది. అతి ప్రాచీన మైన ఈ క్షేత్రంలో, ఆంజనేయస్వామిని జాబాలి మహర్షి ప్రతిష్ఠించా రని స్థలపురాణం చెబుతున్నది.
ఇక్కడ వినిపించే గాథలలో, హనుమ ఆజన్మ బ్రహ్మచారి కాడు, సూర్యపుత్రిక సువర్చలకు భర్త అని తెలిపేది ఉంది. శ్రీరామసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వాయు
పుత్రునికి, తన కుమార్తె నిచ్చి పెళ్లి చేసి, ఆయన బ్రహ్మచర్యానికి భంగం కలుగకుండా వర మిస్తాడు సూర్యభగవానుడు. సువర్చలాదేవి కూడా ఆయన బ్రహ్మచర్య వ్రతానికి భంగం రాకుండా ప్రవర్తిస్తుంది. రాబోయే కల్పంలో హనుమ నవబ్రహ్మ లలో ఒక డవుతాడు. అంటే బ్రహ్మ పదవిని అలంకరిస్తా డన్నమాట! ఆ కల్పంలో, అప్పుడు, తాను సువర్చల తో కూడి ఉంటా నని మాట ఇస్తాడు ఆంజనేయుడు. ఈ ఆలయం లోని హనుమ వాహనం ఒంటె. కేసరీనందనుని దివ్య లీలలను ప్రదర్శించే ఇక్కడి తైలవర్ణచిత్రాలు భక్తులకు కనుల పండుగ కావిస్తాయి.
ఆంజనేయుని అవతారానికి సంబంధించిన మరొక కథ ఉంది. పరమేశ్వరుని భక్తు డైన యాగాలుడు అనే రాక్షసుడు, మానవులకు కంటకుడుగా తయారవుతాడు. శ్రీమహావిష్ణువు, అతన్ని సంహరించ మని పరమేశ్వరుణ్ని కోరుతాడు. తన భక్తుడు కనుక తానా పని చేయలే నంటాడు పార్వతీ పతి. అంతే కాక, తన భక్తు డైన అతన్ని ఎవ్వరూ చంపలే రని కూడా అంటాడు. తాను తప్పకుండా యాగాలుణ్ని వధిస్తా నని, ఆ విధంగా చేయలేకపోతే, మహాశివునికి దాసుడి నవుతాననీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేస్తాడు. అదే జరిగితే, తాను విష్ణుదాసుడి నవుతానని మహాదేవుడూ ప్రతిన పూనుతాడు. ఆ తర్వాత మోహినీరూపంతో యాగాలుణ్ని మోహింపజేసి, అతని చేత సురాపానం చేయించి, స్పృహ పోయిన అతన్ని, విష్ణువు, వృకరూపంలో - తోడేలు - వధిస్తాడు. అప్పుడు పరమేశుడు వచ్చి, తాను విష్ణుదాసుడి నవుతానంటాడు. త్రిమూర్తులలో ఎవరూ ఎవరికీ దాసులు కారని విష్ణువు ఎంత చెప్పినా శివుడు వినడు. అప్పుడు విష్ణుమూర్తి, రామావతారంలో హనుమంతుడుగా పుట్టి, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకో మంటాడు. అదీ హనుమ, రామదాసుడు కావడానికి వెనుక ఉన్న రహస్యం!
మరొక గాథ ఇట్లా ఉంది -
పార్వతీపరమేశ్వరులు ఒకనాడు ఆకాశమార్గాన సంచరిస్తున్నారు. వేంకటాచలం వద్ద ఒక వానర మిథునాన్ని చూస్తుంది దేవి. ఆమె ఇంగితం గ్రహించిన పార్వతీపతి, ఆ విధంగానే ఆమె కోరిక తీరుస్తాడు. అతిశక్తిమంత మైన ఆ తేజస్సును భరించలేని దేవి, దాన్ని అగ్నిలో పడేస్తుంది. అగ్నిదేవుడు, వాయుదేవునికి ఇస్తే, వాయుదేవుడు అంజనాద్రిపై తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి చేతికి ఇస్తాడు. అదేదో ఫలం అనుకుని, ఆమె స్వీకరిస్తే, ఆమెకు పుత్రుడు పుడతాడు. అంజనాదేవి సుతుడు కనుక, ఆంజనేయు డయ్యాడు.
ఈ తాడుబందు క్షేత్రంలో హనుమను ప్రతిష్ఠించిన జాబాలి మహర్షిని, శ్రీరాముడు శపిస్తాడు. హనుమద్విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఆ శాపం నుండి విముక్తి పొందుతారు జాబాలి మహర్షి. అందుచేత ఈ క్షేత్రాన్ని "పాశబంధహర పురం" అనీ వ్యవహరిస్తారు. అదే క్రమంగా "తాడుబొందు"గా మారింది. హనుమ జన్మ శనివారం నాడు జరిగింది కనుక, ఆ నాడు స్వామికి విశేషార్చనలు జరుగుతాయి. మంగళవారం కూడా ప్రత్యేకపూజలు చేస్తారు.ఈ రెండు దినాలూ ఈ క్షేత్రం, భక్తులతో కిట
కిటలాడుతూ ఉంటుంది.
కడప జిల్లాలో వెల్లాల అనే చోట మారుతిని "సంజీవరాయుడు"గా కొలుస్తారు. ప్రాణం పోసే ఓషధులను తెమ్మంటే, సంజీవని పర్వతాన్నే మోసుకు వచ్చి, లక్ష్మణస్వామికి ప్రాణదాత అయినవాడు ఆంజనేయుడు. ఇక్కడి ఆలయాలకు చెందిన స్థల పురాణాలలో, ఈ కథకే అధిక ప్రాముఖ్యం. దర్శన మాత్రం చేతనే, సమస్తపాపాలనూ హరించి, కోరిందే తడవుగా కోరికలు తీర్చే దైవంగా పేరు పొందిన పావని, ఈ వెల్లాల సంజీవరాయ స్వామి!
ఈ స్థలమే త్రేతాయుగం నాటి దండకారణ్యం. సంజీవని కొరకు బయలుదేరిన ఆంజనేయుడు, సంధ్యాసమయానికి కుముద్వతీ నదీతీరానికి చేరుతాడు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. హనుమను గమనించిన అక్కడి ఋషులు, అక్కడే ఉండి తమకు ఆయన సేవాభాగ్యం కలిగించ మని ప్రార్థించారు. స్వామి కార్యం మీద వెళుతున్నాడు కనుక ఉండే వీలు లేదని చెప్పి, వారికి తన రూపం లోని ఒక ప్రతిమను అనుగ్రహించాడు, ఆ కపీశుడు. ఆ ప్రతిమే సంజీవరాయస్వామి.ఆయన అక్కడ స్నానం మాచరించిన గుండానికి "హనుమంత గుండం" అనే పేరు వచ్చింది.
ఆలయం లోని ఆంజనేయుని ప్రతిమకు వెండి తొడుగు ఉంటుంది. ఈ విగ్రహం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండేదట. స్వామి తల మీద రాగికలశాన్ని ఉంచిన పిదప, అట్లా పెరగడం ఆగిపోయిందట. ఈ సంజీవరాయుణ్ని సేవించు కునేందుకు, మన రాష్ట్రాల నుండే కాక, మొత్తం దక్షిణాది నుండి కూడా భక్తులు వస్తుంటారు. నిత్య పూజలతో పాటుగా శ్రావణమాసంలో విశేషంగా పూజలు, ఉత్సవాలూ జరుగుతాయి. శ్రీరామనవమి, హనుమజ్జయంతి పండుగల దినాలలో గ్రామోత్సవాలూ చేస్తారు.
హనుమంతుడు మహావీరుడు, మహాభక్తుడు. గొప్ప జ్ఞాని. మహా పండితుడు. వజ్రాంగబలుడు. అంటే ఆయన శరీరం వజ్ర మంత దృఢంగా, ఎంతో బలిష్ఠంగా ఉంటుంది. ఈ "వజ్రాంగబలి" పదమే ఉత్తరాది జనంలో "బజరంగబలి"గా మారింది. బజరంగబలిని ఉపాసించడం అంటే జ్ఞానోపాసన చేయడమే!
ఆంజనేయస్వామి పూజ శనిదేవునికి విరుగుడుగా భావిస్తారు. శనిగ్రహపు దుష్ప్రభావాల నుండి విముక్తి కలుగడానికి, సిందూరం, జిల్లెడు పూలు, తమలపాకులతో హనుమను పూజిస్తారు. ఆంజనేయుడు, తన భక్తులను శనిగ్రహం దుష్టవీక్షణం తగులకుండా రక్షిస్తా డని విశ్వసిస్తారు. రావణాసురుడు, నవగ్రహాలనూ తన అధీనం లోనికి తెచ్చుకుని, తన పాదాల కింద శనైశ్చరుణ్ని ఉంచి నలిపి వేస్తుంటాడు. రావణసభ లోనికి బంధితుడై వెళ్లిన హనుమంతుడు, రెప్పపాటు కాలంలో, శనిదేవుణ్ని తన వాలం - తోక - తో రావణుని పదఘట్టన నుండి చెప్పిస్తాడు. తనను విముక్తుణ్ని చేసినందుకు, శని, కృతజ్ఞతగా హనుమదుపాసకుల జోలికి వెళ్లడు అని చెబుతారు.
హనుమంతుడు స్వరూపంలో వానరుడే అయినా, జ్ఞానానికి మాత్రం నిధి. ఖగోళం, వ్యాకరణం, సంగీతం మొద లైన వాటిలోనే కాక, వేద పురాణాలలోను, విజ్ఞానశాస్త్రాల లోను ఆయనకు తిరుగు లేదు! తొలి కలయిక లోనే శ్రీరామచంద్రుడు, హనుమ సంభాషణ చాతుర్యానికి పరవశించా డంటే, ఆయన ఎంతటి పండితుడో తెలుస్తూంది కదా!
ఆధ్యాత్మ రామాయణంలో మారుతి, యోగాంజనేయుని రూపంలో దర్శనం అనుగ్రహిస్తాడు. అంటే ఒక గురువు స్థానం. ఆయన మరొక రూపం పంచముఖ ఆంజనేయుడు. ఈ రూపంలో ఐదు ముఖాలు, పది చేతులతో సాక్షాత్కరిస్తాడు. వానరరూపం, నారసింహం, గరుత్మంతరూపం, వారాహం, హయగ్రీవం - ఈ రూపాలను క్రమంగా ధైర్యబలాలకు; భయవిముక్తికి; మంత్రి తంత్ర సిద్ధి, సర్పదోష నివారణకు; ఆరోగ్యం, భూతప్రేతాల నుండి రక్షణకు; శత్రువిజయం, జ్ఞానాలకు సేవించు కుంటారు. ఏకాదశరుద్రులలో ఒకడుగానూ కీర్తి పొందాడు వాయుపుత్రుడు.
పంచ ముఖ ఆంజనేయుణ్ని ఆశ్రయిస్తే, అన్ని కోరికలూ సిద్ధించినట్లే! సిందూరం జ్ఞానానికి చిహ్నం కనుకనే హనుమను సిందూరలేపనంతో అర్చిస్తారు.
వారణాసి లోని హనుమదాలయాన్ని తులసీదాసు నిర్మించాడు. శ్రీరామ భక్తుడుగా మన మనోమందిరాలలో స్థిరపడిన రూపాన్ని తీర్చిదిద్దిన వాడు తులసీదాసే! మరో విశేషం ఏమిటంటే, మన దేశంలో రామాలయాల కన్నా ఆంజనేయుని ఆలయాలే అధికంగా ఉండడం!
"సుందరుడు" అనే పేరు హనుమకు ఉండడం చేతనే, ఆయన దివ్య, అద్భుత లీలలను వివరించిన శ్రీరామాయణంలో ఒక కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టారు వాల్మీకి మహర్షి.
*"సుందరే సుందరో రామః*
*సుందరే సుందరీ కథా l*
*సుందరే సుందరీ సీతా*
*సుందరే సుందరమ్ వనమ్ ll*
*సుందరే సుందరం కావ్యమ్*
*సుందరే సుందరః కపిః l*
*సుందరే సుందరమ్ మంత్రమ్*
*సుందరే కిం న సుందరమ్? ll*
ఈ శ్లోకాలు చెప్పుకోకపోతే, హనుమను గురించి పూర్తిగా చెప్పుకున్నట్లు కాదు.
శ్రీరామాయణం నాయకుడు రామచంద్ర ప్రభువు సుందరాతి సుందరుడు. సీతమ్మతల్లి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ స్వరూపం. స్వామి మారుతి ఆత్మయోగి అయిన సౌందర్యరాశి. లంకలోని అశోకవనం ఎంతో అందంగా ఉంటుంది. ఇక లంకా పట్టణమూ బహుసుందరమే. మంత్రం సుందరం. ఇక వీటిలో సుందరం కాని దేమిటి? అన్నీ సౌందర్యభరితాలే! ఈ కారణం చేత మిగిలిన అన్ని కాండలకూ కథోచితంగా, యథోచితంగా పేర్లు పెట్టిన వాల్మీకుల వారు, ఈ కాండకు మాత్రం "సుందరకాండ" అని పేరు పెట్టారు.
మనమూ ఆ దివ్యశక్తిమంతు డైన హనుమను,
*"ఆంజనేయం అతిపాటలాననమ్*
*కాంచనాద్రి కమనీయవిగ్రహమ్ l*
*పారిజాత తరుమూల వాసినమ్*
*భావయామి పవమాన నందనమ్ ll"*
అని ప్రార్థించుకుందాం.
*జై హనుమాన్!*