11, ఏప్రిల్ 2022, సోమవారం

రాజకుమారీ! విను.

 ॐ  సీతాదేవికి ఉపదేశం పేరుతో, అనసూయ తెల్పిన లోకహితం 

  


రాజకుమారీ! విను. 

    తల్లిదండ్రులు, సోదరులు, అందఱూ హితాన్ని గూర్చేవారే.  సహృదయులే కానీ, 

    వీరందఱూ కొంత పరిమితి వఱకే మేలు చేకూర్చగలరు. 

    కానీ పతి అపరిమిత సుఖాలనిస్తాడు. అంతేకాదు, మోక్షప్రాప్తికి తోడ్పడతాడు. కనుక పతికి సేవలొనర్పని సతి నిజంగా అధమురాలు. 

    ఆపదలయందే ధైర్యము, ధర్మము, మిత్రుడు, భార్య -  వీరికి పరీక్ష జరుగుతుంది. 

    వృద్ధుడు, రోగి, మూర్ఖుడు, నిర్ధనుడు, అంధుడు, బధిరుడు, కోపిష్ఠి, అతిదీనుడూ - ఐన పతిని గూడ అవమానపఱచు స్త్రీ నానావిధ నరకయాతనలూ పొందుతుంది. 

    త్రికరణశుద్ధిగా పతిపాదములను సేవించడమే స్త్రీకి ఏకైక ధర్మము, వ్రతము, నియమము. 


    ప్రపంచమున పతివ్రతలు నాలుగు విధాలుగా ఉంటారు.  

1. తన పతిని దప్ప కలలో కూడా పరపురుషుని స్మరింపని స్త్రీయే "ఉత్తమ పతివ్రత" యని వేదాలు, పురాణాలు తెలుపుతాయి. సజ్జనులు కూడా వక్కాణిస్తారు. 

2. పరపురుషుని తన సొంతసోదరుని/తండ్రిని/కుమారునివలే భావించే స్త్రీ మధ్యమ శ్రేణికి చెందిన పతివ్రత. 

3. తన ధర్మాన్ని విచారించి, తన వంశమర్యాదలను పాటించి, మనో నిగ్రహం కలిగియుండే స్త్రీ తృతీయ శ్రేణికి చెందినదని వేదాలు పేర్కొంటున్నాయి. 

4. గత్యంతరంలేని కారణాన భయంచే పతివ్రతగా ఉండే స్త్రీ ప్రపంచంలో "అధమాధమురాలు" అని ఎఱగాలి. 

    పతిని మోసగిస్తూ, పరపురుషుని ప్రేమించే స్త్రీ అనేక కల్పాలవరకూ రౌరవాది నరకయాతనలకు గురవుతుంది. 

    కోటి జన్మలవఱకూ ప్రాప్తించే దుఃఖాలని కూడా సరకుచేయకుండా, క్షణికసుఖానికై కక్కుర్తిపడే స్త్రీ "కులట" అనబడుతుంది. 

    మోసం, కపటం లేకుండా పతివ్రతాధర్మాలను పాటించే స్త్రీ అనాయాసంగానే పరమపదాన్ని పొందుతుంది. 

    పతికి ప్రతికూలంగాసంచరించే స్త్రీ, మఱుజన్మలో చిన్న వయస్సులోనే వైధవ్యాన్ని పొందుతుంది. 

    స్త్రీ పతిసేవా పరాయణయై ఆయన సంరక్షణలో ఉన్నచో ఆమె పవిత్రతకు ఏమాత్రం భంగం వాటిల్లదు. 

    లేనచో స్త్రీ ప్రకృతిననుసరించి, ఆమె పవిత్రతను కోల్పోయే ప్రమాదముంది. 

    పతి సేవలో ఆమెకు సద్గతి లభిస్తుంది. 

    తన పాతివ్రత్య ప్రభావంచే తులసి ఈ నాటికీ శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. లోకంలో పూజలందుకొంటోంది. వేదాలు ఆమె కీర్తిని గానం చేస్తాయి. 


    సీతా! విను. 

    నీ నామాన్ని స్మరించిన స్త్రీలెల్లరూ పాతివ్రత్య ధర్మాలను పాటిస్తారు. 

    నీవు శ్రీరామునికి ప్రాణప్రియమైనదానవు. 

    ఈ పతివ్రతా ధర్మాలని లోకహితార్థమై నీకు తెలిపాను. 


चौपाई 


मातु पिता भ्राता हितकारी। मितप्रद सब सुनु राजकुमारी।।

अमित दानि भर्ता बयदेही। अधम सो नारि जो सेव न तेही।।

धीरज धर्म मित्र अरु नारी। आपद काल परिखिअहिं चारी।।

बृद्ध रोगबस जड़ धनहीना। अधं बधिर क्रोधी अति दीना।।

ऐसेहु पति कर किएँ अपमाना। नारि पाव जमपुर दुख नाना।।

एकइ धर्म एक ब्रत नेमा। कायँ बचन मन पति पद प्रेमा।।

जग पति ब्रता चारि बिधि अहहिं। बेद पुरान संत सब कहहिं।।

उत्तम के अस बस मन माहीं। सपनेहुँ आन पुरुष जग नाहीं।।

मध्यम परपति देखइ कैसें। भ्राता पिता पुत्र निज जैंसें।।

धर्म बिचारि समुझि कुल रहई। सो निकिष्ट त्रिय श्रुति अस कहई।।

बिनु अवसर भय तें रह जोई। जानेहु अधम नारि जग सोई।।

पति बंचक परपति रति करई। रौरव नरक कल्प सत परई।।

छन सुख लागि जनम सत कोटि। दुख न समुझ तेहि सम को खोटी।।

बिनु श्रम नारि परम गति लहई। पतिब्रत धर्म छाड़ि छल गहई।।

पति प्रतिकुल जनम जहँ जाई। बिधवा होई पाई तरुनाई।। 

   Ramacharitamanas Aranya Kanda 5/3-10  


दोहा/सोरठा  


सहज अपावनि नारि पति सेवत सुभ गति लहइ।

जसु गावत श्रुति चारि अजहु तुलसिका हरिहि प्रिय।।5(क)।।

सुनु सीता तव नाम सुमिर नारि पतिब्रत करहि।

तोहि प्रानप्रिय राम कहिउँ कथा संसार हित।।5(ख)।।  


    ఇది అసలైన భారతీయత. 

    ప్రస్తుతం నేతిబీరకాయలో నెయ్యి అయింది కదా! 


                              =x=x=x=  


  — రామాయణం శర్మ  

          భద్రాచలం

నచికేతుని కథ*


         *నచికేతుని కథ*

కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన 'వాజశ్రవసుడు' అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్‌ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి , వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి , నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ , దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని… వట్టిపోయిన ముసలి ఆవులనూ , అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటినీ దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలివాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ , తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. పైగా బాల్యచాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి 'ఇలా నీకు పనికిరానివాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే ! ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు ?' అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది, 'నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు.'

 

తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. 'ఏదో పొరపాటున అనేశాను. ఊరుకో' అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞసమయంలో , అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. 'పొరపాటున అనేశాను' అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యయునికి తనను తాను అర్పించుకునేందుకు బయల్దేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ , సమయం వచ్చినప్పడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడి తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు.


'ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ? ఇంటికి ఫో !' అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా , జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. 'ఏదో తొందరపాటుగా అన్నంతమాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి , నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో !' అన్నాడు యముడు , నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి.

 

'నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా , నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక' అన్నాడు నచికేతుడు. దానికి యముడు 'తథాస్తు' అన్నాడు. ఇక రెండవ కోరికగా 'ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమ'న్నాడు నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది - 'స్వర్గలోకే న భయం కించనాస్తి' అంటాడు నచికేతుడు , అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు 'నాచికేత యజ్ఞం' పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా 'చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు ?' అని అడుగుతాడు నచికేతుడు. తనంతటివాడు ప్రత్యక్షమై కావల్సిన కోరికలు కోరుకోమంటే 'నా తండ్రి నన్ను అభిమానించాలి , భయాన్ని జయించే స్వర్గం కావాలి , మరణ రహస్యం తెలియాలి' అంటూ ఈ పిల్లవాడు పరమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే 'నువ్వు చిన్నపిల్లవాడివి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జననమరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదన్నా కోరుకో. నీకు ఏం కావాలన్నా వరమిస్తాను.' అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకి ఇస్తేగిస్తే ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు.

 

నచికేతుని పట్టుదల , తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. 'సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా , అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక , పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే ! దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు ?.... అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు.

 

ఆత్మజ్ఞానం గురించి యముడికీ , నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. 'నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పదిపన్నెండు మంది పిల్లలు ఉంటే , ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను' అంటారు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే 'ఉత్తిష్ఠత జాగ్రత' (లేవండి , మేలుకోండి) అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే !