40. " మహాదర్శనము " ---నలభైయవ భాగము --జ్యోతిర్దర్శనము
40. నలభైయవ భాగము-- జ్యోతిర్దర్శనము
యాజ్ఞవల్క్యునికి ఇంతవరకూ లేని ధర్మ సంకటమొకటి ప్రాప్తమైంది . ఇంతవరకూ తన బ్రహ్మ కర్మలు ముగిసిన తర్వాత జపమునకు కూర్చొనేవాడు .
ఒక్కో దినము అప్రతిమమైన తేజోమండలము ఒకటి కనిపించేది . అది సర్వ దిక్కులనూ తన వెలుగుతో నింపుతూ అది ఉన్నంత వరకూ తేజస్సు తప్ప ఇంకేదీ కనిపించేది కాదు . అది చక్షుర్గోచరమగు ప్రకాశమా ? లేక అలౌకికమైన ఇంకేదైనా ప్రకాశమా -అనునది తెలుసుకోవలెనని కుతూహలము కలిగేది . అయితే , ఆ మండలము ఉన్నపుడు మాత్రము ఆ కుతూహలమునకు అవకాశమే లేదు . మనో బుద్ధులు ఆ మండలమును తప్ప ఇతరమైన దేనినీ గమనించవు . ఆ తేజస్సు ఎదురుగా ఉన్నపుడు చెవులు బాహ్య శబ్దములను వినుచుండుట లేదు . ఊపిరాడుచుండెడిదో లేదో , అదికూడా తెలియదు . స్పర్శ యైతే ఎక్కడికో పారిపోయి ఉండెడిది . ఆ తేజస్సు లేనపుడే ఈ కుతూహలము కలిగేది , కలిగినపుడు మనసు ," ఇది జాగ్రత్స్వప్నము అయిఉండాలి . మెలకువ లో నున్నట్లే బాహ్య స్మృతి ఉన్నది . కలలో వలె జ్ఞానేంద్రియముల కర్మ నడచుచున్నది . " అంటుంది . ఆలోచనలు దానికన్నా ముందుకు పోయేవి కావు. అక్కడికే తుంచివేసినట్లు కుతూహలమే ఆరిపోయేది .
ఇప్పుడు యాజ్ఞవల్క్యునికి అగ్ని దేవుడి ఆదేశము వచ్చినది . " పంచ భూతములను ప్రత్యేక ప్రత్యేకముగా చూడు ." అని . కానీ చూచుటెలా ? ఎటు తిరిగిననూ పంచభూతములనుండీ ఏర్పడిన వస్తుజాలమే కంటికి కనబడుతున్నది . కావలెనన్న , అగ్ని ధ్యానము వలన పంచభూతములు గూడు కట్టుకొని యున్న చేతనా ప్రకాశమును చూడ వచ్చును . తానే ఆ గూడు అనుకొని ఆ చైతన్యము పుట్టుచున్నది . అది గర్భములో నున్నపుడు దానిని మాట్లాడించి చూడవలెను . కానీ బ్రహ్మచారియైన తనకు అదెలా సాధ్యము ?
ఇలాగ అసాధ్యమైన దానిని వదలి , సాధ్యమైన జపమును చేస్తూ ఉందామా అంటే ఒకసారి ప్రశ్న మనసులోకి వచ్చినాక , ఊరికే కూర్చొనుటకు సాధ్యము కాదు . దీని వలన , దీర్ఘ కాలము జరుగుతున్న జపము కొంచము సేపే క్లుప్త కాలములో జరిగి , మిగిలిన సమయమంతా ఆ విచారములోనే గడచిపోతున్నది . ఒకటే ప్రశ్న. పంచభూతములను ప్రత్యేకముగా చూచుట ఎలా ? వెనుకా ముందూ తిరిగి తిరిగీ అదే ప్రశ్న , అదే ప్రశ్న , అదే ప్రశ్న .
ఇలాగ ప్రశ్నను ముందుంచుకొని పరిభావిస్తున్నపుడు ఆ దినము ధేనువు మాట్లాడినది జ్ఞాపకము వచ్చినది . ధేనువు చెప్పినదంతా గుర్తొచ్చింది . " ఉత్తరము చెప్పునది ఉదానము . ఉదానపు వెనుకల ఉన్న ప్రాణము వరకూ నా ప్రశ్న పోవలెను . అప్పుడు కోష్ఠగతమైన ప్రాణము , విశ్వములోనున్న ప్రాణమును చేరి , విశ్వపు ఏమూలనో ఉన్న ఉత్తరమును పట్టుకొని తెచ్చును . అయితే , ఇప్పుడు నాకు కావలసినది క్రియ. ఈ క్రియ , మొదట వాగ్రూపముగా ఉత్తరమును పొందవలెను . దానికేమి చేయవలెను ? ... సరే , మొదట వ్యాపారపు కథను విందాము , తర్వాత వ్యాపారము చేయు ఆలోచన " అను సిద్ధాంతమునకు వచ్చినాడు .
" ప్రాణదేవుడినే సాక్షాత్కరించుకొని ఏల అడుగరాదు ? " అని ఇంకొక ప్రశ్న లేచింది . అయితే అతడిని అడుగుటకు ఏదో బెదురు . " ’అడగమని అగ్ని దేవుని అనుమతి యైనది’ , అనిన చాలు " అని ఇంకో ధైర్యము . అయినా నిశ్చయము చేసుకోలేదు . ఎందుకో దిగులవుతుంది . " నేనిన్ని దినములు ప్రాణ పరిచర్యను చేసినాను . అదీకాక, ప్రాణ దేవుడు నాకు కొత్తవాడేమీ కాదు , కాబట్టి దిగులెందుకు ? " అని అధైర్యమును పోగొట్టు నమ్మకము ఒకటి .
ఇలాగే నలిగిపోయి మరలా పయోవ్రతమును ఆరంభించినాడు . ఒక మండలము పయోవ్రత మందుండి ప్రాణదేవుని అడుగవలెను అని నిర్ణయించుకున్నాడు .
అయితే , ఇంకొకరి ఆశ్రమములో ఉండి , వారిని అడుగక , తానే స్వతంత్రించుటెలా ? కాబట్టి , ఉద్ధాలకుల అనుమతి పొంది , ఆచార్యాణి అనుజ్ఞతో పయోవ్రతమును ఆరంభించవలెను అనుకున్నాడు .
ఒక దినము ఆచార్య ఉద్ధాలకులు దిగుపొద్దులో ఆశ్రమపు తల వాకిట్లో ఉన్న రాతి పానుపు పైన కృష్ణాజినమును పరచుకొని కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు వస్తున్నది చూచినాడు . వారికి యాజ్ఞవల్క్యుడంటే అమితమైన అభిమానము . దానికి తోడు , ఆచార్యాణులనుండీ ప్రాణాగ్ని సంభాషణమును విన్న తరువాత ఆ అభిమానము గౌరవముగా మారింది . ఇప్పుడు వస్తున్న వాడినీ ఆముఖములోని భావమునూ చూచి , " ఏదో అడుగవలెనని వస్తున్నట్లుంది . ఇతడు అగ్ని, ప్రాణ , ఆదిత్యులను వదలి ఇక దేనినీ అడిగేవాడు కాదు , ఏది అడిగిననూ చెప్పవలెను " అనుకున్నారు . వారు తమ అంగాంగములూ యాజ్ఞవల్క్యుని చూచి ప్రసన్నములైనది చూచినారు . ఆశ్చర్యమైనది . అంటే దేవతలు తమ భక్తులను చూచి ఇంత విశ్వాసము చూపెదరా ? ఇకముందు ఏమగునో గానీ , ఈతడి వలన మాకు ఇప్పుడే ప్రయోజనమైనట్లయింది . " అని ప్రసన్నులై, సావధానులై కూర్చున్నారు .
యాజ్ఞవల్క్యుడు వచ్చినాడు . వచ్చి , పెద్దవారిని చూచినపుడు చిన్నవారికి కలుగు సహజమైన వినయ విశ్వాసములతో అభివాదనము చేసి ఆశీర్వాదమును పొంది వారి అనుమతితో నేలపైన కూర్చున్నాడు. ఆచార్యుడు వద్దని , ఎవరినో పిలచి లోపలినుండీ ఒక కృష్ణాజినమును తెప్పించి పరచి , దానిపైన కూర్చోమని అన్నారు . యాజ్ఞవల్క్యుడు అటులే చేసినాడు .
అదే సమయానికి ఆచార్యాణి కూడా అటు వచ్చి , " చూచితిరా ? ఇదిప్పుడు సరియైన జోడి . ఆ దినము అగ్నిదేవుని అనుమతియైనది . మీరు వచ్చిన తరువాత మీ వద్ద పంచాత్మ సంక్రమణ విద్యనూ , అవస్థా క్రమ విచారమునూ గురించి ప్రస్తావించవలెనని ! ఈ దినము కుమారుడు దానికే వచ్చినాడేమో ? " అన్నారు .
యాజ్ఞవల్క్యుడు ఏమి చెప్పవలెనో తెలియక, తల పంకించినాడు . ఆచార్యుడు అప్పుడే సరిగ్గా అన్నాడు , " వాడికేమి , పుణ్యవంతుడు .! వాడు జాతవేదుడు . వాడికి తెలియనిది లేదు . అయినా , రాజ్యపు విస్తారమునూ , వైభవమునూ చూడని యువరాజు వలె ఉన్నాడు . మేమైతే ఎప్పుడో చెప్పినాము , అతడికి కావలసినది అడగవచ్చునని . ఒకవేళ అతడు అడిగే విషయము మాకు తెలియదనుకుందాము , అతనిచేత పరిచర్యలను చేకొన్న అగ్ని ప్రాణులే దానిని చెపుతారు . దీనికి నువ్వే సాక్షి ! " అన్నారు .
వారి మాట విని యాజ్ఞవల్క్యునికి ఆలోచనలు చుట్టుముట్టినాయి . వీరు , జాతవేదుడిని అంటున్నారు . ఆచార్యాణి నోటి ద్వారా , అగ్నిదేవుడు సర్వజ్ఞ బీజముందని చెప్పినాడు . అలాగయితే నేను చేయవలసినది ఒక్క తపస్సు మాత్రమే . సకాలములో ఋతులింగ న్యాయము ( బాహ్య ప్రపంచములో ఆయా ఋతువులకు తగ్గట్టుగా చెట్లు , పక్షులు మొదలైన ఆయా గుర్తులు ఎవరి అపేక్ష లేకుండా వ్యక్తమగును --అను న్యాయము ) వలన అది తానే కనిపిస్తుంది . అలాగే కానిమ్ము , నేను ఆగి వేచియుంటే నష్టమేమిటి ? వారినోటనే వస్తున్నది కదా , నన్ను కాపాడుటకు ప్రాణాగ్నులిద్దరూ సిద్ధముగా ఉన్నారని ? " అని ఊరకే కూర్చున్నాడు .
ఆచార్యులు , " యాజ్ఞ వల్క్యా , వచ్చిన కారణమేమో చెప్పనేలేదే ? " అన్నారు . అతడేమి చెప్పవలెను , ? తన ప్రశ్నను పక్కకుపెట్టి , " తల్లిగారు అప్పుడే చెప్పినారు , ఇక నేను దానినే మరలా చెప్పుట ఎందుకని ఊరకే ఉన్నాను " అన్నాడు .
ఆచార్యులు , ’ అలాగా ? ’ అని వెనక్కు తిరిగి చూచినారు . ఆలాపిని ఒక కృష్ణాజినమును తెచ్చి గడప లోపల వేసుకొని కూర్చున్నది . అది చూచి ఉద్ధాలకులకు బహు సంతోషమైనది . " నువ్వున్నావో లేదో యని తిరిగి చూచితిని . ఇదిగో , చూడు . అమృత మేఘము వచ్చింది . నానుండీ అమృత వర్షము కురిపిస్తున్నది . ఇద్దరం ఆ వర్షపు ప్రయోజనమును పొందెదము " అని యాజ్ఞవల్క్యుని వైపుకు తిరిగినారు .
" చూడు యాజ్ఞవల్క్యా , పంచాత్మ సంక్రమణము , అవస్థాత్రయముల విచారములో మొదట అవస్థాత్రయమును తీసుకొనవలెను . ఈ అవస్థాత్రయమును గురించి చెప్పుటకు ముందే చెప్పవలసినది ఇంకాఉంది ,అది విను . అజ్ఞులు ( తెలియని వారు ) అవస్థ నుండీ అవస్థకు ప్రకృతి వశమున వెళ్ళి వచ్చెదరు . విజ్ఞుడయినవాడు ( తెలిసినవాడు ) వాటికి సాక్షి కావలెను . వాడికి కల , నిదుర అనునవి ఒక గది నుండీ ఇంకొక గదికి వెళ్ళివచ్చు నట్లుండవలెను . విజ్ఞుడగువరకూ ఇది సాధ్యము కాదు . ఇది అగువరకూ విజ్ఞుడు కాలేడు . ఇదే ఇక్కడున్న రహస్యము . "
యాజ్ఞవల్క్యుడు ఒళ్ళంతా చెవులై వింటున్నాడు . ఆలాపిని ఆ విద్య తెలిసినదాని వలెనే అనుసంధానము చేస్తున్నది . అప్పటికే ఆమెకు సాక్షీభావము కూడా వచ్చింది .
ఆచార్యులు కొనసాగించినారు : " చూడు , ఈ రహస్యమును తెలుసుకొనుట కోసము ఇంద్రుడు నూటొక్క సంవత్సరములు బ్రహ్మచర్యము పాటించినాడు . ఇంకొక మార్గము ద్వారా దానిని ఛేదించిన యమధర్మరాజు నచికేతునికి ఆ రహస్యమును చెప్పినాడు . జాగృదవస్థ చివర , స్వప్నావస్థ ఆరంభమున ఉన్న స్థితిలో ఈ సాక్షీభావము లభించును . జాగృదవస్థలో కర్మేంద్రియములతో చేరిన మనసు వాటినుండీ విడిపించుకొని స్వప్నపు జ్ఞానేంద్రియములకు ఇంకా దొరకని సంధి సమయములో దీనిని చూడవలెను . మనసు , ఇటు ఇంద్రియాలు అటు బుద్ధి , రెండింటికీ సంబంధించినట్లు ఉంటే , అప్పుడు లాగి కట్టిన తాడువలె జీవము తన సంకల్ప వికల్పములను చేస్తూ కూర్చొనును . అలాకాక, ఇంద్రియ సంబంధమును వదలి బుద్ధికి మాత్రమే సంబంధించునట్లు ఉంటే , మనసు నేలపై పడియున్న తాడు వలె ఏ పనీ లేక , తానున్ననూ లేనట్లే అగును . అప్పుడు కనిపించు జాగృత్ , స్వప్న , సుషుప్తి అను మూడు అవస్థలూ కాక, నాలుగవ అవస్థలో సాక్షి దర్శనమగును . అలాగయినపుడు జాగృత్ కాదు , స్వప్నము కాదు , సుషుప్తి అసలే కాదు , ఈ స్థితిలో కూర్చొని చూచుట నేర్చినవాడికి తత్త్వ దర్శనమగును . ఆ దర్శనము ఇటు జాగృత్తు , అటు సుషుప్తి లను ఆవరించినపుడు ఆ రెండు అవస్థలూ లేకుండాపోవును . ఇలాగ జాగృత్సుషుప్తులు రెండూ ఉన్ననూ లేకుండా పోయినపుడు , ఆ సాక్షీ భావము అంతటా తానే నిండి మహా దర్శనమగును . తెలిసిందా , యాజ్ఞవల్క్యా ? "
యాజ్ఞాల్క్యుడు వెనుక తనకు కలిగిన జ్యోతిర్దర్శనమును జ్ఞాపకము చేసుకున్నాడు . వాన పడగానే తడిసిపోవు నేల వలె , అతని జీవము తన విశ్వ స్థానమైన భ్రూ మధ్యమును వదలినది .( జీవుడికి విశ్వతైజస్యప్రాజ్ఞుడు అని మూల నామము . భ్రూ మధ్యమము , కంఠము , హృదయము అను మూడు స్థానములు . ) తైజస స్థానమగు కంఠమును ఇంకా చేరలేదు . ఇంద్రయోని స్థానములో ఎవరో పైనుండీ లాగుతున్నారు . కిందకు వెళ్ళకుండా ఎవరో నిలిపివేసినారు . కుమారునికి ఈ విశాల జగత్తంతయూ ఆచార్యుల మాటలలో కేంద్రీకృతమైనట్టుంది . లాగుతున్నది ఎవరు ? తనను కిందకు పడకుండా నిలుపుతున్నదెవరు ? అనునది చూచుటకు కూడా అవకాశము లేదు . దేహమంతా చెవులే అయితే ఎలా వినవచ్చునో అలాగ వింటున్నాడు .
ఆచార్యులు దానిని చూచినారు . వారు అతడి దేహమును ప్రవేశించకయే అతడి స్థితిని కనిపెట్టినారు . అంతా అద్దములో చూచినట్లే వారికి స్ఫురించినది . దానిని , అతడి స్థితినీ భార్యకు కూడా చూపించవలెనని వారికి ఇష్టము . అయితే ఆమెకూడా అనుసంధానము చేస్తున్నది .
ఆచార్యులు ఒక ఘడియ ఊరికే ఉన్నారు . అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది : " యాజ్ఞవల్క్యుడు ఇలాగ వ్యాపారవంతుడైనదెలాగ ? తన మాటయొక్క బలము వలన అనునట్లయితే , ఇంతవరకూ ఈ విషయమును అనేకులకు చెప్పియున్నాను . వారెవరికీ మొదటిసారికే ఇలాగ వ్యాపారము ఆరంభము కాలేదు . కాబట్టి ఇది యాజ్ఞవల్క్యుని పూర్వపుణ్యమై యుండవలెను " అనుకున్నారు .
అంతలో యాజ్ఞవల్క్యుడు వ్యాపారమును ముగించి బయటికొస్తున్నట్లు కనిపించినది . మరలా అతడిని సంబోధించి అన్నారు : " చూడు యాజ్ఞవల్క్యా , అక్కడున్నపుడే చూడు. నిన్ను కిందకు పడకుండా ఆపుతున్నది ఎవరు ? పైకి లాగుతున్నది ఎవరు ? " ఈసారి మాటలో ఆజ్ఞాభావము ఉంది . పెద్దవారు చిన్నవారికి చెప్పునపుడు కనిపించు వాత్సల్యము , అధికారమూ రెండూ ఉన్నాయి .
యాజ్ఞవల్క్యుడు చూచినాడు : తనను పైకి లాగుతున్నవి సూర్య కిరణములు . తానున్నది భూమ్యాకాశములు రెండూ కాని అంతరిక్షము . అక్కడ నుండీ కిందకు పడకుండా , తరుణి ఒకతె తన చేతులను చాచి అతడిని పట్టిఉన్నది . ఆమెను అడిగితే , " నేను సూర్యగణమునకు చెందినదానిని . ఇప్పటికింతే చాలు " అని దాక్కుంటున్నది . ఆమె మాయమైనట్లే సూర్య కిరణములు కూడా మాయమగుచున్నవి . అయితే , ఆ పైని లాగుట , కింది పట్టు ఇవి తప్పలేదు .
ఆచార్యులు ఆమె ఆడిన మాటను అలౌకిక శ్రవణ శక్తితో విన్నారు . బహు సంతోషమయినది . కుమారుడికి తనకుతానుగా మెలకువ కానీలెమ్మని నెమ్మదితో కాచి కూర్చున్నారు .
కొంతసేపటికి యాజ్ఞవల్క్యుడు మేలుకున్నాడు . అంతవరకూ అతడు చేసిన , చేస్తున్న వ్యాపారమంతా తన ముందున్న పాత్రలోని నీటిలో ఈదుతున్న చేపల వ్యాపారము వలె స్పష్టముగా కనపడుచున్ననూ ఆచార్యులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నారు . యాజ్ఞవల్క్యుడు కనులు తెరచి నవ్వుచూ ఆచార్యునికి నమస్కారము చేసినాడు . ఆచార్యులు అడిగినారు :
" ఏమేమి చూచితివి యాజ్ఞవల్క్యా ? "
" ఏమి చెప్పుదును ఆచార్యా ? నేను చూచినది చెప్పుటకు నాకు మాటలు చాలడము లేదు . కాబట్టి కొంచము హెచ్చుతక్కువ అయితే క్షమించవలెను . మొదట భ్రూమధ్యము నుండీ ఏదో ఒక అదృశ్య పదార్థము మెరిసి కిందికి దొరలినట్లాయెను . అప్పుడు నా తల ముందుకు వాలి పడిపోవలసినది . ఎవరో పడుతున్న తలను అలాగే నిలిపివేసినారు . లోపల , పడుచున్న ఆ పదార్థమును ఎవరో ఆదుకొని అక్కడే నిలిపినారు . నేను ఉన్నది భూమికాదు , ఆకాశమూ కాదు అనిపించినది . వెంటనే తానుగా అర్థమైనది , ఇది అంతరిక్షము అని . అక్కడ తమరు చెప్పుచున్నవి , నేనాడినవి మాటలు గా కాకుండా , వ్యాపారమును ప్రచోదించు క్రియల వలె ఉన్నాయి . అటు ఆదిత్యుని కిరణాలు , ఇటు ఆదిత్యగణపు దేవియొకతె , ఇద్దరూ ఒక జ్యోతిర్మండలమును పట్టుకొనియున్నారు . ’ఆ జ్యోతిర్మండలమే నేను ’ అన్నది స్ఫురించుచుండెను . ఆ పక్కలోనే , తమరు చెప్పినట్లు ఒక తాడు వదులుగా వేలాడుతూ యుండెను . ఆ మండలమునకు తానొక సంపుటములో నున్నట్లు తోచినది . తాను జ్యోతియై ఉన్నందు వల్లనో ఏమో , అంతటా జ్యోతియే కనిపించు చుండినది . "
" ఆ సంపుటమే బుద్ధి , యాజ్ఞవల్క్యా . ఆ వేలాడుతున్న తాడు వలె నిర్వ్యాపారముగా నున్న ప్రకాశమే మనసు . నిన్ను కిందకు పడకుండా పట్టుకున్నామె ఉషా దేవి . ఇదిగో , ఆమెయే వచ్చినది . ఋగ్వేదపు ఉషా సూక్తముతో ఆమెను ఆరాధించు "
ఆచార్యుల అనుజ్ఞమేరకు యాజ్ఞవల్క్యుడు ఉషా సూక్తమును చెప్పినాడు . అది సామముగా పరిణమించినది .
ఇటూ ఆచార్యులూ , ఆచార్యణీ ఆ సామము ముగియువరకూ చేతులు జోడించి నిలుచున్నారు .
అంతా ముగిసిన తరువాత ఆచార్యులు అన్నారు , " యాజ్ఞవల్క్యా , ఈ దినము నీకు సాక్షీ దర్శనమైనది . ఇకముందు నీకు తత్త్వ శాస్త్రమును అభ్యాసము చేయుటకు అధికారము వచ్చినది . ఇప్పుడు నీకు అయినది దర్శనము . నువ్వు తత్త్వమును సమగ్రముగా తెలుసుకుంటే అది ’ మహా దర్శనమగును ’ . "
యాజ్ఞవల్క్యుడు ఆచార్యవాక్కును ఆశీర్వాదమని పరిగ్రహించి , నమస్కారము చేసినాడు . ఆచార్యాణి , తనకు నమస్కారము చేయుటకు వచ్చిన కుమారుని వారించి , " అది మాకు మూల స్థానము , అక్కడ అయినదంతా మాకూ అయినట్లే " అని అంటున్ననూ , యాజ్ఞవల్క్యుడు ఆమెకూ నమస్కారము చేసినాడు .
Janardhana Sharma