*పాండురంగ మహత్యం*
లోహదండపురంలో మహాభక్తులైన బ్రాహ్మణదంపతులకు పుండరీకుడనే కుమారుడున్నాడు. అతడు యవ్వనంలో అనేక దురలవాట్లకు లోనై తల్లి దండ్రులను కష్టపెట్టాడు. అతడికి చక్కని కన్యను చూచి పెళ్ళిచేశారు. భార్యా వ్యామోహంలోపడి తల్లిదండ్రులను ఇంకా ఇంకా బాధలు పెట్టాడు కుమారుడు.
ఒకనాడు భార్యతో కలసి కాశీక్షేత్రం బయలుదేరాడు. మార్గమధ్యంలో కుక్కుట మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ ముగ్గురు స్త్రీలు ఆ ఆశ్రమ ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తుండగా చూచి 'మీరెవరు?" అని అడిగాడు.
"నాయనా మేము గంగ, యమున, సరస్వతులం. పవిత్రులమైన మాలో పాపాత్ములు స్నానం చెయ్యటంవల్ల వారి పాపాలు మాకు చుట్టుకుంటున్నాయి. ఆ పాపపరిహారం కోసం ఈ మహాత్ముని ఆశ్రమాన్ని ఇలా ప్రతిరోజూ శుభ్రం చేసి పరిశుద్ధులమౌతున్నాం. అన్నారు వారు. (ఇదే స్థాన శుశ్రూష)"
కుక్కుట మహాముని యొక్క శక్తికి ఆశ్చర్యపోయిన పుండరీకుడు సతీసమేతంగా ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ ఆ మహాముని తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తున్నాడు. పుండరీకుడు ఆయనకు నమస్కరించి, మహాత్మా గంగ, యమున, సరస్వతుల పాపాలను కూడా కడిగి వేయగల అద్భుతశక్తిని మీరెలా సాధించగలిగారు? అని అడిగాడు.
దానికా ముని "నాయనా! నాకు ఏ సాధనలు తెలియవు. తల్లిదండ్రుల పాదసేవయే పరమాత్మసేవగా భావించాను. నాకు దీనియందే మనస్సు నిలిచిందిలీ బుద్ధి ప్రశాంతతను పొందింది. ఇంతకన్న నాకు కావాల్సిందేమీ లేదు. తల్లిదండ్రుల పాదసేవ చేసుకొనే అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే కలుగుతుంది" అన్నాడు. దానితో పుండరీకునికి జ్ఞానోదయమయ్యింది. "తానింత వరకు తల్లిదండ్రుల పట్ల చేసిన అపరాధానికి తనను క్షమించ మని ముని పాదాలపై బడ్డాడు పుండరీకుడు. ముని ఆశీర్వాదాన్ని పొంది, కాశీ ప్రయాణం మానుకొని, లోహదండపురం వచ్చి తల్లిదండ్రుల పాదాలను పట్టుకొని తనను మన్నించమని కంటికి మింటికి ఏకధారగా విలపించాడు. తల్లిదండ్రులు కుమారునిలో కలిగిన పరివర్తనకు ఎంతో ఆనందించారు. అది మొదలు చంద్రభాగా నదీతీరంలో ఒక కుటీరాన్ని ఏర్పాటుచేసి తల్లిదండ్రులను అక్కడే ఉంచి, నిత్యం వారి సేవనే చేస్తూ తన జన్మను చరితార్థం చేసుకుంటున్నాడు పుండరీకుడు. అతడి భార్య కూడా అతడికి ఎంతగానో సహకరిస్తున్నది. తల్లిదండ్రుల సేవయే అతడికి జపం- తపం-ధ్యానం.దానితో అతడి అంతఃకరణం శుద్ధమైంది. అహరకారం నశించింది. రాగద్వేషాలు తొలగిపోయాయి. అజ్ఞానం అంతరంగం ప్రశాంతమైంది. ఆత్మానుభూతికి హృదయకవాటాలు తెరుచుకోబోతున్నాయి.
భక్తుని అనుగ్రహించటానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆశ్రమ గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యాడు. 'పుండరీకా! ఇలా చూడు. నేను జగన్నాథుడను. నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహించుటకు వచ్చాను. నాతో రా! అన్నారు. దానికి పుండరీకుడు "స్వామీ! శతకోటి జన్మల పుణ్యఫలం ఉంటేగాని మీ దర్శనం లభించదు. నాయందు మీకు గల కరుణ వల్లనే నాకీ అదృష్టం కలిగింది. నాజన్మ తరించింది. కానీ. భగవాన్! నీవు నన్ను క్షమించాలి. నీ ఆదేశం ప్రకారం నేను నీతో రావటానికి వీల్లేదు. నేను నా తల్లిదండ్రుల సేవలో పూర్తిగ మునిగి ఉన్నాను. వారిసేవను మధ్యలో ఆపి నేను మీతో రాలేను. ఈ సేవ పూర్తికాగానే తప్పక వస్తాను. అప్పటిదాకా మీరు దీనిపై నిలబడి వుండండి అంటూ ఒక ఇటుకరాయిని భగవంతుని వైపుకు విసిరివేశాడు.
పుండరీకుని సేవాపరాయణతకు సంతసించిన భగవానుడు ఆ ఇటుకపై నిలిచి కటిహస్తుడై (నడుముపై చేతులు పెట్టుకొని) సుందరవిగ్రహంగా నిలిచాడు. ఆయనే పాండురంగడు - పండరినాథుడు.పండరిలో వెలసిన దేవుడు.
తల్లిదండ్రుల సేవకు ఫలితం భగవత్సాక్షాత్కారం. భగవంతుడే వచ్చి పిలిచినా ఆ సమయంలో కూడా అతడికి తల్లిదండ్రుల సేవ మీదనే దృష్టిగాని ఫలితం మీద లేదు. భగవద్భావనతోనే తల్లిదండ్రుల సేవ చేస్తున్నాడు తప్ప అతడికి శరీరదృష్టి లేదు. (సాక్షాత్ భగవంతుని సేవయే అని చేస్తున్నాడు) తల్లిరూపంలో, తండ్రిరూపంలో, భార్యరూపంలో, భర్తరూపంలో, బిడ్డలరూపంలో, గురువురూపంలో అన్ని రూపాలలో ఉండేది ఆ భగవంతుడే అని భక్తుని అభిప్రాయం. "త్వమేవ సర్వం మమదేవ దేవ!"
పుండరీకుడు భగవంతుని అలా ఇటుక మీద నిలబెట్టినప్పుడు తుకారాం స్వామి అక్కడికి వచ్చాడు. అతడు పుండరీకునితో "ఏమిటోయ్ పుండరీకా! అతడెవరనుకున్నావు? సాక్షాత్తు జగన్నాథుడు, భగవంతుడు, ఏమిటింత నిరాదరణ. ఆయనకు సత్కారాలు చేసి జన్మచరితార్థం చేసుకో!" అన్నాడు తుకారాం. ఆ మాటకు పుండరీకుడు "స్వామీ! వీరు దేవుళ్ళు కారా? ఆయనేనా దేవుడు? ఈ దేవుళ్ళను వదిలి ఆ దేవుణ్ణి పట్టుకోమంటావా? నాది 'ఏ' సిద్ధాంతం కాదు. 'ఊ' సిద్ధాంతం. అతడే దేవుడు అనను. అతడూ దేవుడే అంటాను. నా తల్లిదండ్రులూ దేవుళ్ళే. ఇతడూ దేవుడే అని నాభావన" అన్నాడు. పుండరీకుని కర్మనిష్ట అలాంటిది. అతడికి కర్మయందే ఆసక్తి కర్మఫలంపై ఎలాంటి ఆసక్తి లేదు. అలా చెయ్యాలి కర్మలను.
*యే మనుష్యః మాం ఆశ్రతః!*
*తాన్ సర్వేస్యః కర్మ వినాశనః లభై!!*