🌹రామాయణానుభవం_ 39
చిత్రకూటం లో రామ భరత సంవాదం కొనసాగుతోంది....
అన్నయ్యా ! నీవంటివాడు లోకంలో మరొకడు ఉండడు. ఇదేమిటిది! దుఃఖం నిన్ను బాధించడంలేదు. ప్రీతి నిన్ను ఆనందింపజెయ్యడం లేదు. నువ్వు సర్వజ్ఞుడివి, మహాత్మడివి. సర్వదర్శివి, బుద్ధిమంతుడివి, జ్ఞానివి. నిన్ను ఏ దుఃఖమూ ఏమీ చెయ్యలేదు. నా తల్లి చేసిన పని నాకు అనిష్టం. నువ్వు నాపట్ల అనుగ్రహం చూపాలి. దయ తలచాలి. ధర్మబద్ధుణ్ని కాబట్టి ఊరుకున్నానే గానీ లేకపోతే ఈ పాటికి కైకేయిని సంహరించి ఉందును. అటువంటి జుగుప్సితాన్ని రఘువంశంలో పుట్టిన నేనెలా చేస్తాను చెప్పు!
అలాగే తండ్రినీ నిందించలేక పోతున్నాను. ఇల్లాలికి ప్రియం చెయ్యాలని ఏ ధర్మాతుడైనా ఇలాంటి పాపం చేస్తాడా?. సరే ఏదో అయిపోయింది. తండ్రి చేసిన పనికి ప్రతిక్రియ చెయ్యాలి నువ్వు. అలాచేసి సరిదిద్దినవాడే పుత్రుడనిపించుకుంటాడు. మా అందరికీ నువ్వే దిక్కు. నువ్వే రక్షకుడివి.క్లిష్టమైన ధర్మాన్నే నువ్వు అనుసరించాలి అనుకుంటే రాజ్యపాలనకూడా క్లిష్టమైనదే. ఆశ్రమాలు నాల్గింటిలోనూ గృహస్థాశ్రమమే గొప్పదంటారు. మరి నువ్వు దీన్ని వదిలేస్తానంటే ఎలాగ! అడవుల్లో తపస్విలా గడుపుతానంటే ఎలాగ ! అన్నింటా నీకంటే బాలుణ్ని, నువ్వు ఉండగా నేను ఎలా రాజ్యాన్ని పరిపాలించగలను చెప్పు.
నువ్వులేనిదే నేను జీవించలేను. క్షాత్రధర్మమైన అభిషేకానికి అంగీకరించు. వీరంతా ఇక్కడే నిన్ను అభిషేకిస్తారు. మంత్ర కోవిదులైన వసిష్ఠాదులు ఉన్నారు. ఋత్విక్కులు ఉన్నారు. అభిషిక్తుడవై అయోధ్యా పరిపాలనకు బయలుదేరు. శత్రువులు భయపడి పారిపోయేట్టు పాలించు. ప్రత్యక్ష ధర్మాన్ని కాదని పరోక్షమూ సంశయస్థమూ అయిన ధర్మాన్ని ఆచరిస్తాననడం సమంజసంకాదు. నన్నూ నాతల్లినీ
దశరథ మహారాజునూ పాపంనుంచి ఉద్ధరించు.
తమ్ముడూ ! నువ్వు చెప్పింది సమంజసంగానే ఉంది. దశరథ మహారాజుకు పుత్రుడవుగదా ! కానీ ఒక్క విషయం గమనించు కైకేయిని రాజ్యశుల్కంతో దశరథుడు వివాహమాడాడు. దేవాసుర సంగ్రామంలో సంతోషించి వరాలూ ఇచ్చాడు. అవి రెండూ ఇలా అడిగింది మీ తల్లి, తండ్రిమాట నిలబెట్టడానికే - సత్యవాదిని చెయ్యడానికి నేను అడవులకు వచ్చాను. నువ్వుకూడా వెంటనే అభిషేకం జరిపించుకుని తండ్రిమాట నిలబెట్టు. నా కోసమైనా మహారాజును ఋణవిముక్తుణ్ణి చెయ్యి. మీతల్లి కి ఆనందం కలిగించు. పున్నామ నరకం నుంచి కాపాడేవాడే పుత్రుడు. తండ్రిని కాపాడు. అయోధ్యకు వెళ్ళు. ప్రజానురంజకంగా పరిపాలన సాగించు. శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు.
నువ్వు ప్రజలకు పరిపాలకుడవైతే నేను అరణ్యంలో మృగాలకు పరిపాలకుడనవుతాను.
*త్వం రాజా భరత! భవ స్వయం నరాణాం*
*వన్యానామహమపి రాజరాణ్మృగాణామ్.*
నువ్వు అయోధ్యకు వెళ్ళు,. నేను దండకారణ్యాలకు వెడతాను. సితచ్చత్రం నీకు నీడ ఇస్తుంది. వృక్షచ్ఛాయలలో నేను సుఖిస్తాను.
నీకు శత్రుఘ్నుడు - నాకు లక్ష్మణుడు. మనం నలుగురమూ తండ్రిగారిని సత్యసంధుణ్ని
చేద్దాం. భరతా! విచారించకు.
*శత్రుఘ్నః కుశలమతిస్తు తే సహాయస్సౌమిత్రిర్మమ విదితః ప్రధానమిత్రమ్.*
*చత్వారస్తనయవరా వయం నరేన్ద్రం సత్యస్థం భరత చరామ మా విషీద*
రాముడు భరతుణ్ణి ఇలా ఓదారుస్తుంటే ప్రక్కనే ఉన్న జాబాలి మహర్షి కల్పించుకొన్నాడు.....
**
జాబాలి మాట్లాడుతూ...
రఘురామా ! చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నీ తెలివి తేటలు నిరర్ధకం కాకుండుగాక! ఎవడు ఎవడికి బంధువు? ప్రతిమనిషీ ఒంటరిగా పుడతాడు ఒంటరిగా మరణిస్తాడు.
*కః కస్య పురుషో బన్ధుః కిమాప్యం కస్య కేనచిత్.*
*యదేకో జాయతే జన్తురేక ఏవ వినశ్యతి*
తల్లి అనీ తండ్రి అనీ ఈ అనుబంధాలన్నీ ఉన్మత్త ప్రలాపాలు. ఎవడికీ ఎవడూ ఏమీకాదు.
*తస్మాన్మాతా పితా చేతి రామ సజ్జేత యో నరః.*
*ఉన్మత్త ఇవ స జ్ఞేయో నాస్తి కశ్చిద్ధి కస్యచిత్*
గ్రామాంతరం వెళ్ళి ఒకడు ఒకచోట కొంతసేపు ఉంటాడు. మర్నాడు వెళ్ళిపోతాడు. ప్రాణులంతా ఇంతే. తల్లీ, తండ్రీ, ఇల్లూ వాకిలీ, డబ్బూ అన్నీ ఆవాసమాత్రాలే. వీటి విషయంలో సజ్జనులు చిక్కుకోరు.
వారసత్వంగా వచ్చిన రాజ్యాన్ని విడిచిపెట్టి నువ్వు అడవుల్లో కష్టాలు పడటం ఎంతమాత్రమూ సమంజసం కాదు.
అయోధ్య నీకోసం ఏకవేణీధరలా నిరీక్షిస్తోంది. అభిషేకం జరిపించుకో. నీకు దశరథుడని ఒకడు లేడు. నువ్వు అతడికి ఏమీ కావు. ఆయనెవరో నువ్వెవరో. ఈ ప్రజలంతా నిన్నే రాజుగా కోరుతున్నారు. అంగీకరించు. చెప్పినట్టు చెయ్యి
ఏ జంతువుకైనా తండ్రి బీజమాత్రమే. శుక్లరుధిరాలు తల్లి అను గ్రహించి జన్మనిస్తుంది.
ఆ మహారాజు వెళ్ళవలసినచోటికి వెళ్ళిపోయాడు. అది ప్రాణిధర్మం. ప్రకృతి సహజం. మిథ్యాదుఃఖానికి లోనుకాకు.
*గత స్స నృపతిస్తత్ర గన్తవ్యం యత్ర తేన వై.*
*ప్రవృతతిరేషా మర్త్యానాం త్వం తు మిథ్యా విహన్యసే*
సర్వజన సమ్మతమైన సద్బుద్ధిని స్వీకరించు. భరతుడు ప్రసాదిస్తున్న రాజ్యాన్ని అంగీకరించు -
రాముడు శ్రద్ధగా విన్నాడు. నిశ్చలమైన స్వబుద్ధితో ఆలోచించి భక్తిగా సమాధానం చెబుతున్నాడు.....
[శ్రీరామచంద్రుడు అరణ్యవాసమునుండి తిరిగి ఎలాగైనా అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతో భరతునితో కూడావెళ్ళిన పరివారములో ఒకడు జాబాలి మహర్షి, దశరథుని రాచపురోహితుడు. జాబాలి రామచంద్రునితో భౌతికవాదము చెప్పారు. అప్పుడు శ్రీరాముడు కృద్ధుడై "నీవంటి నాస్తికుని మా తండ్రి ఎలా చేరదీశాడు" అంటూ జాబాలి చేసిన వాదన్ని తీవ్రంగా ఖండిచివేస్తాడు. అప్పుడు వశిష్టుడు కలుగచేసుకుని, "శ్రీరామా! నిన్ను అయోధ్యాధీశునిగా పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతోనే జాబాలి అలా మాట్లాడాడు గాని, నిజానికి అతను నాస్తికుడు కాడు" అంటూ శ్రీరాముని అనునయిస్తాడు. ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి