కథ*
🌷🌷🌷
"సార్ !మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు" అటెండర్ వచ్చి వినయంగా చెప్పాడు. "లోపలకి పంపించు" అన్నాను." సరే సార్!" అంటూ అటెండర్ వెళ్ళాడు.
కొద్దిసేపు సేపటికి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అతని వంక పరిశీలనగా చూస్తూ "కూర్చోండి "అన్నాను. అతను ముఖానికి పట్టిన చెమట తుడుచు కోవటానికి కళ్ళజోడు తీసి జేబురుమాలుతోముఖం తుడుచుకున్నాడు.
క్షణమాగి "నాపేరు పురుషోత్తం.తాలూకా ఆఫీస్ లో యూడీసీ గాపని చేస్తున్నాను" అని పరిచయం చేసుకున్నాడు.నేను అతనివంక సాలోచనగా చూసాను."మీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను" అన్నాడు." చెప్పండి" అన్నాను. అతను కుర్చీలో కొంచెం ఇబ్బందిగా కదలడం గమనించాను.అతని మౌనం నాకు కాస్తంత చిరాకు తెప్పించింది. అది బయటకు కనిపించకుండా
" వచ్చిన విషయం చెప్పండి "అన్నాను
అతను తనఇబ్బంది పక్కన పెట్టి" మీ అబ్బాయి సందీప్ మా అమ్మాయి వెంట పడి అల్లరి చేస్తున్నాడు" అని చెప్పాడు. అతను చెప్పింది వినగానే నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మనసులో అలజడిమొదలైంది.అతను చెప్పింది ఒప్పుకోవడానికి నా మనసు అంగీకరించలేదు .కానీ అకారణంగా ఏ ఆడపిల్ల తండ్రీ వచ్చి నా కూతుర్ని నీ కొడుకుఅల్లరి పెడుతున్నాడని చెప్పడు. అతను
చెప్పేది జీర్ణం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.
నా కన్నులముందు సందీప్ ముఖం కదలాడింది. ఇంటికి వెళితే "డాడీ !డాడీ!" అంటూ ఇంకా చిన్నపిల్లాడిలా కబుర్లు చె ప్తూ ఎంతో అమాయకంగా కనిపించే సందీప్ ఒక ఆడపిల్ల వెంటపడి అల్లరి చేసే స్థాయికిదిగజారడం నిజమేనా ?నిజమే అయితే నా పెంపకంలో ఎక్కడుంది లోపం? చిన్నప్పటినుంచి సందీప్ కి నేనుచెప్పిన నీతి కథలు గుర్తుకు వచ్చాయి. వాడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నేను పడిన తపన నన్ను వెక్కిరించింది.
చదువులో సందీప్ ఫస్ట్ వస్తే నేను ఎంతో సంతోషించేవాడిని. మంచి గిఫ్ట్ కొనిచ్చి ప్రోత్సహించే వాడిని. అవన్నీ ఎదుటి వ్యక్తి చెప్పిన ఒకే ఒక్క మాటతో చెల్లాచెదురయ్యాయి. నా ముఖంలోని భావాలు ఎదుటి వ్యక్తి గమనించినట్లు ఉన్నాడు" క్షమించండి!ఈ విషయం మీ వరకు తీసుకు రాకూడదు అనే అనుకున్నాను. అందుకే నేను వ్యక్తిగతంగా మీ అబ్బాయిని కలిసి మంచిగా చెప్పి చూసాను. అయినా సరే పరిస్థితిలో మార్పు రాలేదు. అందుకే మిమ్మల్ని కలవక తప్పలేదు" అన్నాడు." మావాడు నిజంగానే అలా ప్రవర్తించి ఉంటే హృదయపూర్వకంగా క్షమార్పణలు కోరుతున్నాను. మీ సమస్య నేను సరి చేస్తాను" అన్నాను.
నేను అన్న మాటల్లో "నిజంగానే" అన్న పదం వాడటం సందీప్ మీద నాకున్న నమ్మకాన్ని పూర్తిగా విచ్చిన్నం చేయలేదని గమనించాను." మీరు ఎక్కడ ఉంటున్నారు" అని ప్రశ్నించి అతను చెప్పిన అడ్రస్ నోట్ చేసుకున్నాను.
అతను పైకి లేచి" మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి "అని రెండుచేతులు జోడించాడు. "క్షమార్పణ చెప్పవలసింది నేను. వెళ్ళిరండి" అన్నాను. అతను వెళ్ళిపోయాడు.
వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి నా మనసుఎదురు తిరుగుతున్నది. సందీప్ భవిష్యత్తును ఉజ్వలంగా చేయడానికి నేను అందరి తండ్రుల కంటే ఎక్కువ తపన పడ్డాను. వాడిని ఎల్కేజీ లో జాయిన్ చేసిన దగ్గర్నుంచి బీటెక్ లో జాయిన్ చేసే వరకు ఎంతో శ్రమించాను. నిజానికి మగపిల్లలు తల్లికి ఎక్కువ మాలిమి అవుతారు. కానీ మా సందీప్ విషయంలో అలా కాదు. వాళ్ళ అమ్మతో కంటే నాతోనే చనువుగామసలేవాడు. అది తెలిసిన నా భార్య కౌసల్య ఉడుక్కున్నసందర్భాలు ఉన్నాయి.
సందీప్ కి నేనంటే ఎంతో గౌరవం. నా మాట ఎప్పుడూ కాదు అనడు. ఒకరకంగా చెప్పాలంటే నా మాట వాడికి వేదం. సందీప్ చిన్నప్పుడు నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి కౌసల్య" ఈ పూట వీడుచదవలేదు" అని ఫిర్యాదు చేసేది. "ఏం సందీప్" అనగానే వాడు నిజాయితీగా తప్పు ఒప్పుకునే వాడు. అప్పటికప్పుడు స్కూల్ బ్యాగ్ తెచ్చుకొని కూర్చొని చదివేవాడు. వాడలా చదవడం చూస్తే నాకు ఇచ్చే గౌరవానికి ముచ్చట వే సేది ."అయితే డాడీ చెప్తేనే గాని చదవవు అన్నమాట అనేది కౌసల్య .అలా అన్నప్పుడు నేను చూడకుండా వెక్కిరించే వాడని కౌసల్య చెప్పేది.
సందీప్ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక కోరిక కోరాడు." డాడీ !నాకు ఎంసెట్ లో మంచి ర్యాంకు వస్తే హీరో హోండా కొనిపెట్టండి" అని అడిగాడు." మంచి ర్యాంకు తెచ్చుకో! కొనిపెడతాను" " అన్నాను.
సందీప్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు.
మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది.
అదీమా సిటీ లోనే .వాడికి హీరో హోండా కొనిచ్చి నా మాట నిలబెట్టుకున్నాను.
హీరో హోండా డ్రైవ్ చేస్తూ సందీప్ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్న దృశ్యం ఊహించుకుంటూ ఉంటేనే నా మనసు బాధతో విలవిలలాడింది.తప్పు ఎక్కడ జరిగి ఉంటుందా?
అని ఆలోచించసాగాను.ఆ పూట ఆఫీస్ పని అటెండ్ కాలేకపోయాను. సాయంత్రం ఐదింటికే ఆఫీస్ నుంచి బయలుదేరి పోయాను
సమయానికి డ్రైవర్ లేడు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఉదయం పురుషోత్తం చెప్పిన గుర్తుల ప్రకారం అతని ఇల్లు చేరాను. అప్పటికే నా మనసు ఒక నిర్ణయానికి వచ్చేసింది.
నేను వెళ్లే సరికి పురుషోత్తం ఇంట్లో లేడు. అతని భార్య నన్ను చూడగానే
" మీరు... "అని సందిగ్ధంగా ఆగింది.
సందీప్ తండ్రి గా తొలిసారి సిగ్గుపడుతూ పరిచయం చేసుకున్నాను.
సందీప్ పేరు వినగానే ఆమె ముఖంలో రంగులు మారడం గమనించాను. తన భావాలు
కప్పి పుచ్చుకుంటూ "లోనికి రండి" అని మర్యాదగా లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చో పెట్టింది .
పురుషోత్తం భార్య ఇచ్చిన కాఫీ తీసుకుంటూ సందీప్ విషయం కదిలించాను. "ఉదయం పురుషోత్తం గారు ఆఫీస్ కి వచ్చి విషయం చెప్పారు. సందీప్ తరఫున కమార్పణ వకోరడానికి వచ్చాను" అన్నాను.
ఒక్కసారిగా అలా అనేసరికి ఆమె తడబడి "అంత మాట వద్దు. మీ బాబుని మందలిస్తే సరిపోతుంది"అన్నది." నిజంగా సందీప్ ఇటువంటి పని చేస్తాడని ఊహించ లేదు. నేను ఎరిగిన సందీప్ బుద్ధిమంతుడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది" అన్నాను.
అంతలో ఒక అమ్మాయి చేతిలో బుక్స్ తో ఇంట్లోకి వచ్చింది. ఆ అమ్మాయి అందంగా...నాజూగ్గా ఉంది." మా అమ్మాయి దివ్య" అని పరిచయం చేసింది ఆమె." నమస్తే!" అన్నది దివ్య. ప్రతి నమస్కారం చేశాను.ఆ అమ్మాయి ముఖంలోని ప్రశ్నార్థకం గుర్తించిన పురుషోత్తం భార్య "సందీప్ నాన్నగారు" అని పరిచయం చేసింది.
అంతే ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ముఖంలో రంగులు మారాయి." కూర్చో దివ్యా!" అన్నాను. దివ్య చేతిలోని బుక్స్ టేబుల్ మీద పెట్టి వచ్చి నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ."సూటిగా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. సందీప్ ఎప్పటి నుంచి నీ వెంట పడుతున్నాడు?" అని ప్రశ్నించాను ."సుమారు రెండు నెలల నుంచి " అన్నది దివ్య ."వాడి కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా? "అని అడిగాను." ఇంకో అబ్బాయి ఉంటాడు. అతని ఫ్రెండ్ అనుకుంటాను .బండి వెనక కూర్చొని మీ అబ్బాయి కామెంట్స్ విసరడానికి హుషార్ చేస్తుంటాడు"చెప్పింది దివ్య .
నాకు విషయం అర్థమైంది .సందీప్ కొత్తగా బీటెక్ లో జాయిన్ అయ్యాడు. కొత్త స్నేహితుల ప్రభావం అతని మీద పడింది.
అంతలో పురుషోత్తం వచ్చాడు. నన్ను చూడగానే నమస్కరిస్తూ "మీ వంటి పెద్దవారు మా బోటి వారింటికి రావడం...." అంటూ మాట పూర్తి చేయలేకపోయాడు. అతను దివ్య పక్కన ఉన్న కుర్చీ లో కూర్చున్నాక ,దివ్య ఏ కాలేజీలో చదువుతున్నదో ... ఏం చదువుతుందో అడిగి తెలుసుకున్నాను. దివ్య ఉమెన్స్ కాలేజ్ లో బి.ఏ చదువుతున్నది. ఏం చేయాలో ఆలోచించాను.సందీప్ పట్ల ఎలా వ్యవహరించాలి? అన్నది నా మనసు ఒక నిర్ణయం తీసేసుకుంది.
పురుషోత్తం తో "మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నాతో మా ఇంటికి తీసుకు వెళతాను. గంటలో తెచ్చి డ్రాప్ చేస్తాను "అన్నాను. పురుషోత్తం ఏమనుకున్నాడో "ఎందుకండి? ముందుగా సందీప్ తోమంచిగా చెప్పి చూడండి. అమ్మాయిని తీసుకుని వెళ్లి తన ముందు మందలించడం బాగుండదేమో!" అన్నాడు. నేను చిన్నగా నవ్వాను." నేను సందీప్ మందలించను. దయచేసి మరేం ప్రశ్నించకుండా దివ్య ను నాతో పంపండి" అన్నాను .అతను మరి ఇంకేం మాట్లాడకుండా దివ్య తో "అంకుల్ తో
వెళ్ళమ్మా!" అన్నాడు.
" ఒక్క నిమిషం" అని దివ్య లోనికి వెళ్లి ముఖం కడుక్కుని ఫ్రెష్ గా వచ్చింది. నేను ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని మా ఇంటికి తీసుకు వెళ్ళాను. అప్పటికి ఇంకా సందీప్ ఇంటికి రాలేదు. నా భార్య కౌసల్యకు దివ్యనునా స్నేహితుడు కూతురు గా పరిచయం చేశాను.
మరో పావు గంటలో బయట హీరోహోండా చప్పుడు వినిపించింది. కొద్ది సేపటికి సందీప్ లోనికి వచ్చాడు.సోఫాలో నాతోపాటు కూర్చున్న దివ్యను చూడగానే సందీప్ కంగారు పడ్డాడు.అది నేనుస్పష్టంగా గమనించాను .గమనించనట్లు ఈ అమ్మాయి దివ్య .నా ఫ్రెండ్ కూతురు.కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చారు" అని పరిచయం చేసాను. "హలో!" అని గొణిగాడు సందీప్.దివ్య తలదించుకుంది. సందీప్ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయాడు.
మరో అరగంట తర్వాత దివ్యను కారులో తీసుకుపోయి డ్రాప్ చేసి వచ్చాను .మధ్యలో "దివ్యా! నా అంచనా తప్పకపోతే సందీప్ నీ వెంట ప డడు. పడితే మాత్రం సందేహించక నాకు ఫోన్ చెయ్యి" అని నా విజిటింగ్ కార్డ్ అందిం చాను .
ఆ తర్వాత వారం రోజులు నేనుసందీప్ తో
ముభావంగా వ్యవహరించాను. నేనెందుకు ముభావంగా ఉన్నానన్నది సందీప్ గ్రహించే ఉంటాడు. నాతో మాట్లాడడానికి
ప్రయత్నించాడు కానీ నేనే కట్ చేశాను.
వారం తర్వాత ఒకరోజు "సందీప్! నాకు డబ్బులు అవసరం వచ్చింది. నీ హీరో హోండా అమ్మే ద్దామనిఅనుకుంటున్నాను" అన్నాను.
" మీ ఇష్టం" అన్నాడు సందీప్.
" మరి కాలేజీకి బస్సులో వెళ్లి రాగలవా?" అన్నాను ." ఇబ్బంది లేదు అన్నాడుసందీప్. పది రోజుల్లో హీరో హోండా అమ్మేశాను.
నా భార్యకు సూచాయగా విషయం చెప్పాను.
" ఈమధ్య వాడికి సురేష్ అనే వాడితో పరిచయం అయిందట. దివ్య వెంటపడి అల్లరి చేయడానికి కారణం సురేష్ అట. మీరు వాడి హీరో హోండా అమ్మి వేసిన దానికంటే మీరు వాడితో సరిగ్గా మాట్లాడనందుకే వాడు ఎక్కువ బాధ పడుతున్నాడు" అని చెప్పింది నా భార్య.
నేను వాడిని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి పురుషోత్తం కలిసి "సందీప్ మునుపటిలా ప్రవర్తించడం లేదు" అని చెప్పాడు. అప్పుడప్పుడు దివ్యను మా ఇంటికి పంపమని పురుషోత్తం తో చెప్పాను.
దివ్య అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. ఇప్పుడు వాళ్ళుఇద్దరూ మంచి స్నేహితులు.
సందీప్ బీటెక్ పూర్తయింది నా పరపతితో పనిలేకుండానే మంచి ఉద్యోగం వచ్చింది. పోస్టింగ్ ఢిల్లీలో ఇచ్చారు .
సందీప్ జాబ్ లో చేరడానికి ఢిల్లీ బయలుదేరాడు.
వాడితో పాటు స్టేషన్ కి నేను, కౌసల్య వెళ్ళాము .ట్రైన్ వచ్చింది. కొత్త ప్రదేశం జాగ్రత్తగా ఉండమని కౌసల్య పదేపదే చెప్పింది. ట్రైన్ బయలుదేరే సమయం అయింది. సందీప్ ఒంగి నా పాదాలు తాకి" థాంక్యూ డాడీ" అన్నాడు." ఎందుకు ?"అన్నాను .
గతంలో నేను దివ్యను అల్లరి చేసినప్పుడు మీరు నన్ను సూటిగా అడిగినా, మందలించినా తప్పక ఎదురు తిరిగి ఉండేవాడిని .ఎందుకంటే అప్పుడు సురేష్ ప్రభావం నా మీద అంతగా ఉండేది. కానీ మీరు ఆ విషయాన్ని చాలా సున్నితంగా డీల్ చేశారు.నన్ను చెడు మార్గం నుంచి బయటకు లాగి నా భవిష్యత్తు పాడవకుండా చూశారు" అన్నాడు.
" నిజానికి ఇందులో నీవు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నేను చేసింది కేవలం నీ తప్పు నువ్వు గ్రహించేలా దివ్యను మా ఫ్రెండ్ కూతురు గా పరిచయం చేశాను. నేను ఊహించినట్లే నువ్వు చేసిన తప్పు గ్రహించావు.ఆ తప్పును సరిదిద్దుకున్నావు. అది నీ గొప్పతనం" అన్నాను.
గార్డ్ విజిల్ వేసి పచ్చ జండా ఊపాడు.
ట్రైన్ కదిలింది.కను చూపు మేర వరకూసందీప్ చేయి ఊపుతూనే ఉన్నాడు." థాంక్యు డాడీ" అన్నవాడి మాట నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది .
ట్రైన్ వేగం పుంజుకుంది.
గాడి తప్పిన రైలును పట్టాలు ఎక్కించడం కష్టం.ఆ తరువాత ఆ వేగం సహజం.
సందీప్ విషయం లో నేను చేసింది అంతే!!