ధర్మనందన రాజ్యాభిషేకము
1-231-క.కంద పద్యము
"కురుసంతతికిఁ బరీక్షి
న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ
ధరణీరాజ్యమునకు నీ
శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించెన్.
కురు = కురువంశపు; సంతతి = వారసత్వము; కిన్ = నకు; పరీక్షిత్ = పరీక్షిత; నరవరు = మహారాజును; అంకురము = వంశాకురముగ; చేసి = చేసి; నారాయణుఁడు = కృష్ణుడు; ఈ = ఈ; ధరణీ = భూ; రాజ్యమున్ = మండలము; కున్ = నకు; ఈశ్వరుఁగాన్ = అధిపతిగా; ధర్మజుని = ధర్మరాజుని; నిలిపి = నియమించి; సంతోషించెన్ = సంతోషించెను.
"పరీక్షిత్తును కురువంశాంకురంగా నిలబెట్టి, యుధిష్టిరుణ్ణి సమస్త సామ్రాజ్యానికి అధినేతగా నిలిపి శ్రీకృష్ణుడు సంతుష్టాంతరంగుడైనాడు.
1-232-వ.వచనము
ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబుగా దనునది మొదలగు భీష్ముని వచనంబులం గృష్ణుని సంభాషణంబులం ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును నివర్తిత శంకా కళంకుండునునై నారాయణాశ్రయుం డైన యింద్రుండునుం బోలెఁ జతుస్సాగరవేలాలంకృతం బగు వసుంధరామండలంబు సహోదర సహాయుండై యేలుచుండె.
ఇట్లు = ఈ విధముగ; జగంబు = ప్రపంచము; పరమేశ్వర = పరమమైన ఈశ్వరునికి, హరికి; ఆధీనంబు = లోబడి ఉండునది; కాని = కాని; స్వతంత్రంబు = స్వంతముగా నియత్రించుకొనగలది; కాదు = కాదు; అనునది = అన్నది; మొదలగు = మొదలగు; భీష్ముని = భీష్ముని; వచనంబులన్ = ఉపదేశములవలనను; కృష్ణుని = కృష్ణుని; సంభాషణంబులన్ = ఉపదేశములవలనను; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు- యమధర్మరాజు కొడుకు, ధర్మరాజు}; ప్రవర్ధమాన = పెరుగుచున్న; విజ్ఞానుండును = విజ్ఞానము కలవాడును; నివర్తిత = నివృత్తి చేయబడిన; శంక = అనుమానము అను; కళంకుండును = మచ్చకలవాడును; ఐ = అయి; నారాయణ = హరి {నారాయముడు - నారములందు వసించు వానిని, హరి}; ఆశ్రయుండు = ఆశ్రయించినవాడు; ఐన = అయిన; ఇంద్రుండునున్ = ఇంద్రుడును; పోలెన్ = వలె; చతుస్ = నాలుగు; సాగర = సముద్రములు; వేల = సరిహద్దులుగా; అలంకృతంబు = అలంకరింపబడినది; అగు = అయినట్టి; వసుంధర = భూ; మండలంబు = మండలమును; సహోదర = సోదరుల యొక్క; సహాయుండు = సహాయము కలవాడు; ఐ = అయి; ఏలుచుండెన్ = పరిపాలించుచుండెను..
ఈ విధంగా భీష్మాచార్యుని ఉపదేశాలవల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాలవల్ల ధర్మరాజు జగత్తు స్వతంత్ర మైనది కాదు పరమేశ్వరాధీనం మొదలైన విజ్ఞానాన్ని పెంపొందించుకొని, తన సందేహా లన్నింటిని నివర్తించుకొని, ఉపేంద్రుని సహాయంతో అతిశయించే మహేంద్రుని వలె, శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్ర ముద్రితమైన మహీమండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు.
1-233-సీ.సీస పద్యము
సంపూర్ణ వృష్టిఁ బర్జన్యుండు గురియించు;
నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు;
ఫలవంతములు లతాపాదపములు
పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల;
ధర్మ మెల్లెడలను దనరి యుండు
దైవభూతాత్మ తంత్రము లగు రోగాది;
భయములు సెందవు ప్రజల కెందు
1-233.1-ఆ.
గురుకులోత్తముండు గుంతీతనూజుండు
దాన మానఘనుఁడు ధర్మజుండు
సత్యవాక్యధనుఁడు సకలమహీరాజ్య
విభవభాజి యయిన వేళ యందు
సంపూర్ణ = సంపూర్ణమైన; వృష్టిన్ = వర్షమును; పర్జన్యుండు = మేఘుడు {పర్డన్యుడు - ఉరిమెడువాడు, మేఘుడు}; కురియించు = కురిపించును; ఇల = భూమి; ఎల్లన్ = సమస్తమైన; కోర్కులన్ = కోరికలను; ఈనుచుండున్ = పుట్టించును; గోవులు = ఆవులు; వర్షించున్ = ఎక్కువగా ఇచ్చును; ఘోషభూములన్ = గొల్లపల్లెలలో; పాలు = పాలు; ఫల = ఫలములతో; వంతములున్ = నిండి ఉండును; లతా = తీగలు; పాదపములు = చెట్లు; పండు = పండును; సస్యములున్ = ధాన్యములు; తప్పక = తప్పకుండగ; ఋతువులన్ = ఋతువులలో; ఎల్లన్ = సమస్తమును; ధర్మము = ధర్మవర్తనము; ఎల్ల = సమస్త; ఎడలను = స్థలములందును; తనరి = విస్తరించి; ఉండున్ = ఉండును; దైవ = దేవతలు; భూత = భూతములు; ఆత్మ = ఆత్మలు; తంత్రములు = హేతు భూతములు; అగు = అయినట్టి; రోగ = రోగములు; ఆది = మొదలగు; భయములు = భయములు; చెందవు = కలుగవు; ప్రజలు = లోకులు; కున్ = కు; ఎందున్ = ఎక్కడాకూడ; కురు = కురు; కుల = వంశములో; ఉత్తముండు = ఉత్తముడు; కుంతీ = కుంతియొక్క; తనూజుండు = పుత్రుడు;
దాన = దానమునందును; మాన = మానమునందును; ఘనుఁడు = గొప్పవాడు; ధర్మజుండు = ధర్మరాజు; సత్య = సత్యమైన; వాక్య = వాక్కు; ధనుఁడు = ధనముగాగలవాడు; సకల = సమస్త; మహీ = భూమియందలి; రాజ్య = రాజ్యములలోను; విభవ = (తన) వైభవము; భాజి = భజింపబడువాడు; అయిన = అయినట్టి; వేళ = సమయము; అందున్ = లో;
దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురులాలంకారుడు, కుంతికుమారుడు ఐన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడు; పృథివి బంగారు పంటలు పండించింది; గోశాలలోని గోవులు కుండల కొద్దీ పాలిచ్చాయి; వృక్షాలూ, లతలూ సంపూర్ణంగా ఫలించాయి; ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి; దేశమంతటా ధర్మం పాతుకున్నది; ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాదులు అయిన తాపత్రయాలు, వ్యాధులు ప్రజలను బాధించలేదు.
1-234-వ.వచనము
అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయు కొఱకును, సుభద్రకుఁ బ్రియంబు సేయు కొఱకును, గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయం దలంచి, ధర్మనందనునకుం గృతాభివందనుం డగుచు నతనిచే నాలింగితుండై, యామంత్రణంబు వడసి, కొందఱు దనకు నమస్కరించినం గౌఁగలించుకొని, కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు, రథారోహణంబు సేయు నవసరంబున సుభద్రయు, ద్రౌపదియుఁ, గుంతియు, నుత్తరయు, గాంధారియు, ధృతరాష్ట్రుండును, విదురుండును, యుధిష్ఠిరుండును, యుయుత్సుండును, గృపాచార్యుండును, నకుల, సహదేవులును, వృకోదరుండును, ధౌమ్యుండును సత్సంగంబు వలన ముక్తదుస్సంగుం డగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరం బగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువ నోపం డట్టి హరి తోడి వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబులవలన నిమిషమాత్రంబును హరికి నెడ లేని వారలైన పాండవులం గూడికొని హరి మరలవలయునని కోరుచు హరి చనిన మార్గంబు సూచుచు హరి విన్యస్త చిత్తు లయి లోచనంబుల బాష్పంబు లొలుక నంత నిలువంబడి రయ్యవసరంబున.
అంతన్ = అంతట; కృష్ణుండు = కృష్ణుడు; చుట్టాలు = బంధువులు; కున్ = కు; శోకంబు = బాధ; లేకుండన్ = లేకుండగ; చేయు = చేయుట; కొఱకును = కోసమును; సుభద్ర = సుభద్ర; కున్ = కు; ప్రియంబు = సంతోషము; చేయు = కలుగ చేయుట; కొఱకును = కోసమును; గజపురంబునన్ = హస్తినాపురములో; కొన్ని = కొన్ని; నెలలు = నెలలు; ఉండి = ఆగి ఉండి; ద్వారకా = ద్వారక అను; నగరంబున్ = నగరము; కున్ = నకు; ప్రయాణంబు = ప్రయాణము; చేయన్ = చేయ వలెనని; తలంచి = అనుకొని; ధర్మనందనున = ధర్మరాజున {ధర్మనందనుడు - యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు; కున్ = కు; కృత = చేసిన; అభివందనుండు = నమస్కారము కలవాడు; అగుచున్ = అవుతూ; అతని = అతని; చేన్ = చేత; ఆలింగితుండు = కౌగలింపబడినవాడు; ఐ = అయి; ఆమంత్రణంబు = అనుమతి; వడసి = పొంది; కొందఱు = కొందరు; తన = తన; కున్ = కు; నమస్కరించినన్ = నమస్కారముచేసిన; కౌఁగలించుకొని = ఆలింగనము చేసికొని; కొందఱు = కొందరు; తనున్ = తనను; కౌఁగిలింపన్ = ఆలింగనముచేయగ; ఆనందించుచున్ = సంతోషించుచు; రథ = రథమును; ఆరోహణంబున్ = ఎక్కుట; చేయు = చేయుచున్న; అవసరంబునన్ = సమయమున; సుభద్రయున్ = సుభద్ర; ద్రౌపదియున్ = ద్రౌపది; కుంతియున్ = కుంతి; ఉత్తరయున్ = ఉత్తర; గాంధారియున్ = గాంధారి; ధృతరాష్ట్రుండును = ధృతరాష్ట్రుడును; విదురుండును = విదురుడును; యుధిష్ఠిరుండును = యుధిష్టరుడును; యుయుత్సుండును = యుయుత్సుడును; కృపాచార్యుండును = కృపాచార్యుడును; నకుల = నకులుడును; సహదేవులును = సహదేవుడును; వృకోదరుండును = భీముడును {వృకోదరుడు - వృకము వంటి పొట్ట ఉన్నవాడు, భీముడు}; ధౌమ్యుండును = ధౌమ్యుడును; సత్ = మంచివారితో; సంగంబు = కలిసి ఉండుట; వలనన్ = వలన; ముక్త = విడువబడిన; దుర్ = చెడ్డవారి; సంగుండు = చేరిక గల వాడు; అగు = ఐన; బుధుండు = జ్ఞాని; సకృత్కాల = ఎప్పుడైనా ఒకసారి; సంకీర్త్యమానంబు = స్తుతింపబడినది; ఐ = అయినను; రుచికరంబు = రుచించునది; అగున్ = అగునదై; ఎవ్వని = ఎవని యొక్క; యశంబు = కీర్తిని; ఆకర్ణించి = విని; విడువనోపండు = వదిలిపెట్టలేడో; అట్టి = అటువంటి; హరి = కృష్ణుని; తోడి = తోని; వియోగంబున్ = దూరమగుటను, విరహము; సహింపక = ఓర్చుకొనలేక; దర్శన = కనిపించుట; స్పర్శన = తాకుట; ఆలాప = కలిసి మాట్లాడుట; శయన = కలిసి పండుకొనుట; ఆసన = కలిసి కూర్చుండుట; భోజనంబుల = కలిసి తినుటలు; వలనన్ = వలన; నిమిష = నిమిషము; మాత్రంబును = మాత్రపు సమయమైన; హరి = హరి; కిన్ = కి; ఎడ = దూరముగా; లేని = ఉండలేని; వారలు = వారు; ఐన = అయిన; పాండవులన్ = పాండురాజు పుత్రులను; కూడికొని = కలిసి ఉంటూ; హరి = హరి; మరల = వెనుకకు వచ్చుట; వలయునని = చేయవలెనని; కోరుచున్ = కోరుతూ; హరి = హరి; చనిన = వెళ్ళిన; మార్గంబున్ = దారిని; సూచుచున్ = చూస్తూ; హరి = హరి యందు; విన్యస్త = ఉంచబడిన; చిత్తులు = చిత్తము కలవారు; అయి = అయి; లోచనంబులన్ = కన్నులనుండి; బాష్పంబులు = కన్నీరు; ఒలుకన్ = కారుచుండగా; అంతన్ = అక్కడే; నిలువంబడిరి = నిలుచుండిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున.
ప్రియ సోదరి సుభద్ర మనస్సుకు సంతోషం సమకూర్చుటం కోసం, బంధువులైన పాండవుల శోకం పోకార్చటం కోసం, యశోదానందనుడు హస్తినాపురంలో కొన్ని మాసాలపాటు ఉండి, పిమ్మట తన నగరానికి బయలుదేరాడు. తనకు అభివందనాలు సమర్పిస్తున్న నందనందనుణ్ణి ధర్మనందనుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకొని వీడ్కోలిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నుండి నమస్కారాలు అందుకొన్నాడు. కొందరిని కౌగిలించుకొన్నాడు. కొందరు తనను కౌగిలించుకొనగా వారికి శుభాకాంక్ష లందించాడు. సజ్జనసాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు హరి మధురగాథలు ఒక్కమాటు వింటే మళ్లీ విడిచి పెట్టలేడు. అలాగ గోవిందుడు రథం ఎక్కబోతున్న సమయంలో సుభద్రా ద్రౌపదులు, కుంతీ గాంధారులు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు మొదలైన వారంతా, శ్రీకృష్ణుని ఎడబాటు సహించలేనివారయ్యారు. అనుక్షణం ఆయనను చూస్తు, తాకుతు, మాట్లాడుతు, ఆయనతో కలిసి శయనిస్తు, కూర్చుంటు, భుజిస్తు ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరిలి రావాలని అభిలషిస్తు, ఆయన వెళ్లిన మార్గాన్ని అవలోకిస్తు, హరిమయాలైన హృదయాలతో, అశ్రు నయనాలతో అల్లంత దూరంలో నిలబడి పోయారు.
1-235-సీ.సీస పద్యము
కనకసౌధములపైఁ గౌరవకాంతలు;
గుసుమవర్షంబులు గోరి కురియ
మౌక్తికదామ సమంచితధవళాత;
పత్త్రంబు విజయుండు పట్టుచుండ
నుద్ధవసాత్యకు లుత్సాహవంతులై;
రత్నభూషితచామరములు వీవ
గగనాంతరాళంబు గప్పి కాహళభేరి;
పటహశంఖాదిశబ్దములు మొరయ
1-235.1-ఆ.
సకలవిప్రజనులు సగుణనిర్గుణరూప
భద్రభాషణములు పలుకుచుండ
భువనమోహనుండు పుండరీకాక్షుండు
పుణ్యరాశి హస్తిపురము వెడలె.
కనక = బంగారు; సౌధములన్ = మేడల; పైన్ = మీదనున్న; కౌరవ = కౌరవ వంశపు; కాంతలు = స్త్రీలు; కుసుమ = పూల; వర్షంబులు = వానలు; కోరి = ఇష్టముతో; కురియన్ = కురిపించగ; మౌక్తిక = ముత్యాల; దామ = దండలు; సమంచిత = అలంకరింపబడిన; ధవళ = తెల్లని; అతపత్త్రంబు = గొడుగు; విజయుండు = అర్జునుడు; పట్టుచుండన్ = పట్టుతుండగ; ఉద్ధవ = ఉద్ధవుడు; సాత్యకులు = సాత్యకియు; ఉత్సాహవంతులు = ఉత్సాహముకలవారు; ఐ = అయ్యి; రత్న = రత్నములతో; భూషిత = అలంకరింపబడిన; చామరములు = చామరములు; వీవ = వీస్తుండగా; గగన = ఆకాశముయొక్క; అంతరాళంబున్ = లోపలంతా; కప్పి = నిండిన; కాహళ = బాకాలు; భేరి = భేరీవాద్యాలు; పటహ = పెద్దడోలు / రాండోలు; శంఖ = శంఖములు; ఆది = మొదలగువాని; శబ్దములు = శబ్దములు; మొరయ = చెలరేగు చుండగ;
సకల = సమస్త; విప్ర = బ్రాహ్మణ; జనులు = ప్రజలు; సగుణ = సగుణ; నిర్గుణ = నిర్గుణ; రూప = రూపములలో; భద్ర = శుభమైన; భాషణములు = సంభాషణలు; పలుకుచు = పలుకుతూ; ఉండ = ఉండగా; భువన = లోకమును; మోహనుండు = మోహింపజేయువాడు; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పద్మముల వంటి కన్నులవాడు / కృష్ణుడు}; పుణ్యరాశి = పుణ్యముల కుప్ప / కృష్ణుడు; హస్తిపురము = హస్తినాపురము నుండి; వెడలె = బయలుదేరెను.
భువనమోహనుడు, పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడు ఘనీభవించిన పురజనుల పురాకృత పుణ్యంలా హస్తినాపుర వీథుల వెంట సాగిపోతున్నాడు. అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి నందనందనునిపై పుష్ప వర్షాలు కురిపించారు. విజయుడు వెనుక నిలబడి ముత్యాలసరాలతో విరాజిల్లే శ్వేతచ్ఛత్రాన్ని పట్టాడు. ఉద్ధవుడు, సాత్యకి ఉత్సాహంతో అటునిటు నడుస్తు రత్మఖచితాలైన పిడులు పట్టుకొని వింజామరలు వీస్తున్నారు. బాకాలు, నగారాలు, తప్పెటలు, శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా మ్రోగుతున్నాయి. వేదవేత్తలైన బ్రాహ్మణులు సగుణ నిర్గుణ స్వరూప నిరూపకంగా స్వస్తివచనాలు పలుకుతున్నారు.
1-236-వ.వచనము
తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాదశిఖరభాగంబుల నిలిచి గోపాలసుందరుని సందర్శించి, వర్గంబులై మార్గంబు రెండు దెసల గరారవిందంబులు సాచి యొండొరులకుం జూపుచుం దమలోనం దొల్లి గుణంబులం గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు బ్రవర్తింపని సమయంబున నొంటి దీపించు పురాణపురుషుం డితం డనువారును; జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యెట్లనువారును; జీవనోపాధి భూతంబు లయిన సత్త్వాదిశక్తుల లయంబు జీవుల లయం బనువారును; గ్రమ్మఱ సృష్టికర్త యైన యప్పరమేశ్వరుండు నిజవీర్యప్రేరితయై నిజాంశ భూతంబు లైన జీవులకు మోహిని యగుచు సృష్టి సేయ నిశ్చయించి నామ రూపంబులు లేని జీవు లందు నామరూపంబులు గల్పించుకొఱకు వర్తిల్లు స్వమాయ నంగీకరించు; ననువారును నిర్మలభక్తి సముత్కంఠావిశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహానుభావు నిజరూపంబు దర్శింతు రను వారును; యోగమార్గంబునం గాని దర్శింపరాదను వారును నై; మఱియును.
తత్ = ఆ; సమయంబునన్ = సమయములో; పౌర = నగరమందలి; సుందరులు = స్త్రీలు; ప్రాసాద = మేడల; శిఖర = చివరి, డాబాలపై; భాగంబులన్ = భాగములందు; నిలిచి = నిలువబడి; గోపాలసుందరుని = గోపాలురలో సుందరుని, కృష్ణుని; సందర్శించి = చూసి; వర్గంబులు = వరుసలు తీరినవారు; ఐ = అయి; మార్గంబుల = వీధులకు; రెండు దెసలన్ = రెండుపక్కల; కర = చేతులు అనే; అరవిందంబులు = పద్మములు; సాచి = చాచి; ఒండొరుల = ఒకరింకొకరు; కున్ = కి; చూపుచున్ = చూపుకొనుచూ; తమలోనన్ = తమలోతాము; తొల్లి = పూర్వము; గుణంబులన్ = గుణములు {త్రిగుణములు - సత్త్వ, రజస్, తమస్}; కూడక = కలిగి ఉండక; జీవులు = సర్వ జనులు; లీన = పరబ్రహ్మలో లీనమైన; రూపంబులు = రూపములగలవి; ఐ = అయి; ఉండన్ = ఉండగా; ప్రపంచంబు = ప్రపంచము; ప్రవర్తింపని = నడచుట ఉండని; సమయంబున = సమయములో; ఒంటిన్ = ఒంటరిగా; దీపించు = ప్రకాశించు; పురాణ = పురాతనమైన; పురుషుండు = పురుషుడు; ఇతండు = ఇతడు; అను = అనెడి; వారును = వారును; జీవులు = మానవులు; కున్ = కు; బ్రహ్మత్వంబు = బ్రహ్మత్త్వము; కలుగ = కలుగగ; లయంబు = లయము {లయము - జీవాత్మ బ్రహ్మాత్మలో లయించుట}; సిద్ధించుట = సిద్ధించుట; ఎట్లు = ఏవిధముగ సాధ్యము; అను = అనెడి; వారును = వారును; జీవన = జీవనమునకు; ఉపాధి = ఆధార; భూతంబులు = భూతములు; అయిన = అయినట్టి; సత్త్వ = సత్త్వము; ఆది = మొదలగు; శక్తుల = శక్తుల; లయంబు = లయము; జీవుల = జీవుల; లయంబు = లయము; అను = అనెడి; వారును = వారును; క్రమ్మఱ = మరల; సృష్టి = సృష్టిని; కర్త = చేయువాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరుండు = పరమమైన ఈశ్వరుడు; నిజ = తనయొక్క; వీర్య = వీరత్వమువలన; ప్రేరిత = ప్రేరింపబడినది; ఐ = అయి; నిజ = తన; అంశ = అంశతో; భూతంబులు = కూడినవి; ఐన = అయినట్టి; జీవులు = జీవులు; కున్ = కు; మోహిని = మోహింపజేయునది; అగుచున్ = అవుతూ; సృష్టి = సృష్టి; చేయన్ = చేయుటకు; నిశ్చయించి = నిశ్చయించుకొని; నామ = పేర్లుగాని; రూపంబులు = రూపములుగాని; లేని = లేనట్టి; జీవులు = జీవులు; అందున్ = లో; నామ = నామములు; రూపంబులు = రూపములు; కల్పించు = ఏర్పరుచుట; కొఱకున్ = కోసము; వర్తిల్లు = ప్రవర్తిల్లు; స్వ = తనయొక్క; మాయన్ = మాయను; అంగీకరించున్ = అంగీకరించును; అను = అనెడి; వారును = వారును; నిర్మల = నిర్మలమైన; భక్తి = భక్తివలన; సముత్ = మిక్కిలి; ఉత్కంఠా = ఉత్కంఠల యొక్క; విశేషంబుల = విశిష్టలతో; అకుంఠితులు = కుంటుపడనివారు; ఐ = అయి; జిత్ = జయించిన; ఇంద్రియులు = ఇంద్రియములు కలవారు; అగు = అయినట్టి; విద్వాంసులు = పండితులు; ఈ = ఈ; మహానుభావు = మహానుభావుని యొక్క; నిజ = స్వంత; రూపంబు = రూపమును; దర్శింతురు = దర్శింప కలరు; అను = అనెడి; వారును = వారును; యోగ = యోగపద్ధతి; మార్గంబునన్ = పాటించుట ద్వారా; కాని = కాని; దర్శింప = దర్శించుటకు; రాదు = వీలుకాదు; అను = అనెడి; వారును = వారును; ఐ = అయి; మఱియును = ఇంకనూ.
ఆ సమయంలో యాదవసింహుణ్ణి దర్శించడానికి హస్తినానగరకాంతలు నగరంలోని భవనాలపై కెక్కారు. మార్గానికి ఇరువైపుల గుంపులు గూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి ఒకరికొకరు చూపించుకోసాగారు. సృష్టి ఆదిలో జీవులు త్రిగుణాలతో కూడక ముందు, ప్రపంచం అంతా ఆయనలో లీనమై ఉండేది అని; అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూప మీయనే అని కొందరు అంటున్నారు; జీవులు పరబ్రహ్మత్వం కలిగితే లయం అనేది ఎలా కలుగుతుంది అని కొందరు అంటున్నారు; జీవనాలకి ఉపాధిభూతాలైన సత్వాది శక్తులు లయం కావటమే జీవుల లయం అని కొందరు చెప్తున్నారు; మరల సృష్టికి కారణభూతు డైన విశ్వేశుని ఆత్మ శక్తిచేత తన మాయను చేపట్టి నామరూపాలు లేని జీవులందు నామరూపాలు ఏర్పరచాడు అని కొందరు చెప్తున్నారు; నిర్మమైన భక్తిగలవారు, కుంటుపడని ఉత్కంఠభరిత యత్నులై, జితేంద్రియులైన పరమ జ్ఞానులు ఈ భగవానుని దర్శించగలరు అని మరికొందరు అంటున్నారు; యోగ మార్గం ద్వారా తప్ప పరమేశ్వర సాక్షాత్కారం అసాధ్య మని యింకొందరు అంటున్నారు.
1-237-మ.మత్తేభ విక్రీడితము
"రమణీ! దూరము వోయెఁ గృష్ణురథమున్ రాదింక వీక్షింప నీ
కమలాక్షుం బొడఁగానలేని దినముల్ గల్పంబులై తోఁచుగే
హము లం దుండఁగ నేలపోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం
దము రమ్మాయనె నొక్క చంద్రముఖి కందర్పాశుగభ్రాంతయై.
రమణీ = రమణతో కూడిన దానా, స్త్రీ; దూరము = దూరముగ; వోయెన్ = పోయెను; కృష్ణు = కృష్ణుని; రథమున్ = రథము; రాదు = వీలుకాదు; ఇంక = ఇకపైన; వీక్షింపన్ = చూచుటకు; ఈ = ఈ; కమలాక్షున్ = కృష్ణుని {కమలాక్షుడు - కమలములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; పొడఁగాన = చూడగలగుట; లేని = లేని; దినముల్ = రోజులు; కల్పంబులు = కల్పములు {బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి అయిన కాలము - కల్పము}; ఐ = అయి; తోఁచున్ = తోచుచుండగ; గేహములు = గృహములు; అందున్ = లో; ఉండఁగన్ = ఉండుట; ఏల = ఎందులకు; పోయి = వెళ్ళి; పరిచర్యల్ = పరిచర్యలు; చేయుచున్ = చేస్తూ; నెమ్మిన్ = చక్కగా; ఉందము = ఉండెదము; రమ్మా = రావమ్మా; అనెన్ = అనెను; ఒక్క = ఒక; చంద్రముఖి = సుందరి {చంద్రముఖి - చంద్రునివంటి మోము కలామె, స్త్రీ}; కందర్ప = మన్మథుని {కందర్పుడు - సుఖం తత్ర ద్రపో యస్య, బవ్రీ., సుఖ విషయమున గర్వము కలవాడు, మన్మథుడు}; ఆశుగ = బాణములవలన; భ్రాంత = భ్రాంతితో కూడినది; ఐ = అయి.
1-238-మ.మత్తేభ విక్రీడితము
తరుణీ! యాదవరాజు గాఁ డితఁడు; వేదవ్యక్తుఁడై యొక్కఁడై
వరుసన్ లోకభవస్థితిప్రళయముల్ వర్తింపఁగాఁ జేయు దు
స్తరలీలారతుఁడైన యీశుఁ, డితనిన్ దర్శించితిం బుణ్యభా
సుర నే నంచు నటించె నొక్కతె మహాశుద్ధాంతరంగంబునన్.
తరుణీ = తరుణ వయసు లోనున్న దానా, స్త్రీ; యాదవ = యాదవుల; రాజు = రాజు; కాడు = కాడు; ఇతఁడు = ఇతడు; వేద = వేదములవలన; వ్యక్తుఁడు = తెలియబడువాడు; ఐ = అయి; ఒక్కఁడు = ఒక్కడే; ఐ = అయి; వరుసన్ = వరుసగా; లోక = లోకముల; భవ = సృష్టి; స్థితి = స్థితి; ప్రళయముల్ = లయములను; వర్తింపఁగాన్ = ప్రవర్తించునట్లు; చేయు = చేయును; దుస్తర = దాటుటకువీలుకాని; లీలా = లీలతో; రతుఁడు = కూడినవాడు; ఐన = అయినట్టి; ఈశుఁడు = ఈశుడు, కృష్ణుడు; ఇతనిన్ = ఇతనిని; దర్శించితిన్ = చూడగలిగితిని; పుణ్య = పుణ్యముతో; భాసుర = ప్రకాశించుదానను; నేన్ = నేను; అంచున్ = అనుచు; నటించెన్ = నటించెను; ఒక్కతె = ఒకతె; మహా = గొప్ప; శుద్ధాంతరంగమునన్ = పరిశుద్ధమైన + అంతరంగముతో, అంతఃపురములో.
“చెలీ! వేదవేద్యుడైన ఆదినారాయణుడే గాని ఈ కృష్ణుడు యాదవప్రభువు కాదే. ఈ దేవాధిదేవుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే మహానుభావుడే. ఈయన లీలలు మనం తెలుసుకోలేం. లోకేశ్వరుణ్ణి కనులారా దర్శించిన నేను ఎంత అదృష్టవంతురాలనో” అని ఒక అంగన ఆనంద తరంగాలు పొంగిపొరలే అంతరంగంతో చిందులు వేసింది.
1-239-క.కంద పద్యము
తామసగుణు లగు రాజులు
భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స
త్త్వామలతనుఁడై యీతఁడు
భామినివారల వధించుఁ బ్రతికల్పమునన్.
తామస = తామసమైన; గుణులు = గుణముగలవారు; అగు = అయిన; రాజులు = రాజులు; భూమిన్ = భూమిమీద; ప్రభవించి = పుట్టి; ప్రజలన్ = ప్రజలను; పొలియింపఁగ = చంపగ; సత్త్వ = సత్త్వగుణముతో; అమల = స్వచ్ఛమైన; తనుఁడు = తనువు కలవాడు; ఐ = అయి; ఈతఁడు = ఇతడు; భామిని = కాంతా; వారలన్ = వారిని; వధించున్ = సంహరించును; ప్రతి = ప్రతియొక్క; కల్పమునన్ = కల్పములోను.
“భామినీ! ప్రతికల్పంలోనూ ఈ పుడమిమీద తమోగుణ దూషితులైన భూపతులు పుట్టి ప్రజానీకాన్ని బాధించి వేధించే సమయంలో, ఆ జగత్కంటకులను సత్య స్వరూపుడై సముద్భవించి సంహరించే స్వామిని చూడవే” అన్నది ఒక కలహంసగామిని.
1-240-వ.వచనము
ఇదియునుం గాక.
ఇదియునున్ = ఇదే; కాక = కాక.
వారు ఇంకా ఈ విధంగా అనుకొన్నారు
1-241-సీ.సీస పద్యము
ఈ యుత్తమశ్లోకుఁ డెలమి జన్మింపంగ;
యాదవకుల మెల్ల ననఘ మయ్యె
నీ పుణ్యవర్తనుం డే ప్రొద్దు నుండంగ;
మథురాపురము దొడ్డ మహిమఁ గనియె
నీ పూరుషశ్రేష్ఠు నీక్షింప భక్తితో;
ద్వారకావాసులు ధన్యులైరి
యీ మహాబలశాలి యెఱిఁగి శిక్షింపంగ;
నిష్కంటకం బయ్యె నిఖిలభువన
1-241.1-తే.
మీ జగన్మోహనాకృతి నిచ్చగించి
పంచశర భల్ల జాల విభజ్యమాన
వివశమానసమై వల్లవీసమూహ
మితని యధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు.
ఈ = ఈ; ఉత్తమశ్లోకుఁడు = కృష్ణుడు {ఉత్తమశ్లోకుడు - ఉత్తములచే స్తుతింపబడువాడు, కృష్ణుడు}; ఎలమిన్ = సంతోషముగా; జన్మింపంగ = అవతరించగా; యాదవ = యాదవులయొక్క; కులము = వంశము; ఎల్లన్ = సమస్తము; అనఘము = పాపము లేనిది; అయ్యెన్ = అయ్యెను; ఈ = ఈ; పుణ్య = పుణ్యమైన; వర్తనుండు = ప్రవర్తన కలవాడు; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడును; ఉండంగ = ఉంటుండగ; మథురా = మథుర అను; పురము = పట్టణము; దొడ్డ = మిక్కిలి; మహిమన్ = గొప్పతనమును; కనియెన్ = పొందెను; ఈ = ఈ; పూరుష = పురుషులలో; శ్రేష్ఠుని = ఉత్తముని; ఈక్షింపన్ = చూచుచుండగ; భక్తి = భక్తి; తోన్ = తో; ద్వారకా = ద్వారకలో; వాసులు = నివసించువారు; ధన్యులు = ధన్యమైనవారు; ఐరి = అయ్యిరి; ఈ = ఈ; మహా = మిక్కిలి; బలశాలి = బలముగలవాడు; ఎఱిఁగి = తెలిసి; శిక్షింపంగన్ = శిక్షించగా; నిష్కంటకంబు = కష్టములు లేనిది; అయ్యెన్ = ఆయెను; నిఖిల = సమస్త; భువనము = ప్రపంచము; ఈ = ఈ;
జగత్ = లోకములను; మోహన = మోహింపచేయు; ఆకృతిన్ = ఆకారమును; ఇచ్చగించి = ఇష్టపడి; పంచశర = మన్మథుని {పంచశర - ఐదుబాణములవాడు, మన్మథుడు}; భల్ల = బాణముల; జాలన్ = సమూహముచేత; విభజ్యమాన = బద్దలుకొట్టబడుచున్న; వివశ = వశముతప్పిన; మానసము = మనసుకలది; ఐ = అయ్యి; వల్లవీ = గోపికాస్త్రీల; సమూహము = గుంపు; ఇతని = ఇతని; అధర = పెదవి వలన; అమృతమున్ = అమృతమును; క్రోలున్ = క్రోలును; ఎల్లప్రొద్దు = ఎల్లప్పుడు.
“ ఈపుణ్యమూర్తి జన్మించటం మూలంగానే యాదవవంశం పవిత్రమైనది. ఈ సచ్చరిత్రుడు నివసిస్తు ఉండటం వలననే మధురానగరం మహిమాన్వితమై ప్రసిద్ధమైనది. ఈ పురుషోత్తముణ్ణి అనుక్షణం వీక్షించటం చేతనె ద్వారకలో ఉండే పౌరులు ధన్యాత్ములైనారు. ఈ వీరాధివీరుడు క్రూరాత్ములను ఏరి పారవేయటం ద్వార ఈ విశాల విశ్వం ప్రశాంతంగా మనగలుగుతున్నది. ఈ జగన్మోహనుని సౌందర్యాన్ని సందర్శించి, మన్మథ శరపరంపరలకు చలించిన హృదయాలతో వ్రేపల్లెలోని గోపస్త్రీలు ఎల్లవేళల ఈ నల్లనయ్య మోవి తేనియలు త్రావుచూ ఉంటారు.
1-242-ఉ.ఉత్పలమాల
ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁగాఁ
జేకొని వేడ్కఁ గాపురము సేయుచు నుండెడు రుక్మిణీముఖా
నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా
స్తోకవిశేషతీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోఁచిరో."
ఈ = ఈ; కమలాక్షున్ = కృష్ణుని; ఈ = ఈ; సుభగు = కృష్ణుని {సుభగు - సౌభాగ్యస్వరూపుడు, కృష్ణుడు}; ఈ = ఈ; కరుణాంబుధిన్ = కృష్ణుని {కరుణాంబుధి - కరుణకు సముద్రమైన వాడు, కృష్ణుడు}; ప్రాణనాథుఁగాన్ = భర్తగా, ప్రాణము లకు అథిపతిగా; చేకొని = స్వీకరించి; వేడ్కన్ = కోరికతో; కాపురము = కాపురము; సేయుచున్ = చేస్తూ; ఉండెడు = ఉండునట్టి; రుక్మిణీ = రుక్మిణి; ముఖ = మొదలగు; అనేక = అనేకమైన; పతివ్రతల్ = పతివ్రతలు; నియతి = నియమముతో; నిర్మల = నిర్మలమైన; మానసలు = మనసు కలవారు; ఐ = అయి; జగత్ = లోకముచేత; నుత = స్తుతింపదగిన; అస్తోక = మిక్కిలి; విశేష = విశేషముగల; తీర్థములన్ = పవిత్రస్థలములలో; తొల్లిటి = పూర్వపు; బాములన్ = జన్మములలో; ఏమి = ఏమి; నోఁచిరో = (నోములు) నోచినారో.
ఈ కమలాలాంటి కళ్ళున్నవానిని, ఈ సౌందర్య రాశిని, ఈ దయాసముద్రుణ్ణి తమ జీవితేశ్వరునిగా స్వీకరించి ఆనందంగా కాపురం చేస్తున్న ఆ రుక్మిణీ, సత్యభామా మొదలైన సాధ్వీమణులు నిష్కల్మష హృదయాలతో పూర్వజన్మలో ఏ పుణ్యతీర్థాలు సేవించారో, ఏ మంచినోములు నోచారో కదా.”
1-243-వ.వచనము
అని యిట్లు నానావిధంబులుగా బలుకు పురసుందరుల వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె; ధర్మజుండును హరికి రక్షణంబులై కొలిచి నడువం జతురంగ బలంబులం బంచినఁ దత్సేనా సమేతులై దనతోడి వియోగంబున కోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మరలించి; కురుజాంగల, పాంచాల దేశంబులు దాటి శూరసేన యామున భూములం గడచి బ్రహ్మావర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌవీరాభీర సైంధవ విషయంబు లతిక్రమించి, తత్తద్దేశవాసు లిచ్చిన కానుకలు గైకొనుచు నానర్తమండలంబు సొచ్చి, పద్మబంధుండు పశ్చిమ సింధు నిమగ్నుం డయిన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చనిచని.
అని = అని; ఇట్లు = ఈవిధముగ; నానా = అనేక; విధంబులుగా = రకములుగా; పలుకు = స్తుతించుచున్న; పుర = పురమున కల; సుందరుల = అందమైన వారి; వచనంబులు = మాటలు; ఆకర్ణించి = విని; కటాక్షించి = కడగంటి చూపులతో చూసి; నగుచున్ = నవ్వతూ; నగరంబున్ = పురమునుండి; వెడలెన్ = వెలువడెను; ధర్మజుండును = ధర్మరాజుకూడ; హరి = హరి; కిన్ = కి; రక్షణంబులు = రక్షణచేయునవి; ఐ = అయి; కొలిచి = సేవించి; నడువన్ = నడుచుచుండగ; చతురంగ = నాలుగు విభాగములు కల {చతురంగబలములు - రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, కాల్బలములు. - 4సైనిక విభాగములు}; బలంబులన్ = సేనలను; పంచినన్ = పంపించగా; తత్ = ఆ; సేనా = సేనతో; సమేతులు = కూడినవారు; ఐ = అయి; తన = తన; తోడి = తోటి; వియోగంబున్ = ఎడబాటు; కున్ = నకు; ఓర్వక = ఓర్చుకొనలేక; దూరంబు = దూరము; వెను = వెంట; తగిలిన = వచ్చిన; కౌరవులన్ = కౌరవులను; మరలించి = వెనుకకు పంపి; కురు = కురుభూములందు; జాంగల = మెరకప్రదేశములు; పాంచాల = పాంచాల; దేశంబులు = దేశములు; దాటి = దాటి; శూరసేన = శూరసేన; యామున = యమున ఒడ్డున ఉన్న / యామున; భూములన్ = ప్రదేశములను; గడచి = దాటి; బ్రహ్మావర్త = బ్రహ్మావర్తము; కురుక్షేత్ర = కురుక్షేత్రము; మత్స్య = మత్స్య; సారస్వత = సారస్వత; మరుధన్వ = మరుధన్వ; సౌవీర = సౌవీర; ఆభీర = ఆభీర; సైంధవ = సైంధవ; విషయంబులు = ప్రదేశములు; అతిక్రమించి = దాటి; తత్తత్ = ఆయా; దేశవాసులు = దేశములలో నివసించు వారు; ఇచ్చిన = ఇచ్చినట్టి; కానుకలు = కానుకలను; కైకొనుచున్ = స్వీకరించుచు; ఆనర్త మండలంబు = ఆనర్తమండలము {కృష్ణుని ద్వారక ఆనర్త మండలము లో ఉన్నది}; చొచ్చి = ప్రవేశించి; పద్మబంధుండు = సూర్యుడు {పద్మబంధుడు - పద్మములకు బంధువు, సూర్యుడు}; పశ్చిమ = పడమటి; సింధున్ = సముద్రమున; నిమగ్నుండు = క్రుంకినవాడు; అయిన = అయిన; సమయంబునన్ = వేళకు; పరిశ్రాంత = అలసిన; వాహుండు = గుఱ్ఱములు కలవాడు; ఐ = అయి; చనిచని = వెళ్ళివెళ్ళి.
గోవిందుడు మున్ముందుకు సాగాడు అలా పలు విధాల సంభాషించుకొంటున్న పౌర కాంతామణుల పలుకులు వింటూ, క్రీగంటి చూపులతో కనుగొంటూ, మందహాస వదనారవిందంతో. ధర్మరాజు శ్రీకృష్ణునికి అంగరక్షకులుగ చతురంగబలాలను పంపించాడు. ఆ సైన్యంతో పాటు తన ఎడబాటుకు ఓర్వలేక సాగనంపడానికి బహుదూరం వచ్చిన పాండునందనులను వెనుకకు పంపించి, వసుదేవనందనుడు యమునాతీరంలో ఉన్న కురుజాంగల పాంచాల శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్నీ, కురుక్షేత్రాన్ని గడిచాడు. మత్స్య సారస్వత మరుధన్వ దేశాల గుండా సాగి ఆభీర సౌవీర సింధుదేశాలను దాటాడు. ఆ యా దేశప్రజలు సమర్పించిన కానుకలు అందుకొంటు ద్వారకలో అంతర్భాగమైన ఆనర్తమండలాన్ని చేరుకొన్నాడు. సంధ్యాసమయం సమీపించింది. అశ్వాలు అలిసిపోయాయి. అల్లంత దూరంలో ద్వారకానగరం కనిపించింది.