*సేవకు ప్రతిఫలం..*
"అంకుల్ నన్ను గుర్తుపట్టారా?.." అంటూ ఆ అమ్మాయి అడిగింది..తలయెత్తి చూసాను..గుర్తుపట్టినట్లుగా తలవూపి.."అమ్మా..ఇప్పుడేనా రావడం?.." అని అడిగాను.."మధ్యాహ్నం వచ్చాము..మా ఆయన కూడా వచ్చాడు.." అన్నది.."మంచిదమ్మా..మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది..?" అని అడిగాను.."ఇప్పుడు బాగుంది అంకుల్..తనపని తాను చేసుకుంటున్నది.." అని చెప్పింది..ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నలభైరోజులు ఉన్నది..వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడం..అప్పుడప్పుడూ విపరీతంగా కేకలు వేస్తూ పరుగెత్తడం..లాంటి సమస్యల తో బాధపడుతూ ఉంటే..తల్లిని తీసుకొని స్వామివారి మందిరం వద్దకు వచ్చింది..స్వామివారి సన్నిధి లోనే నలభైరోజులు ఆ తల్లీకూతుళ్ళు వున్నారు..ఆ నలభైరోజుల్లో ఈ అమ్మాయి ప్రవర్తన మందిరం వద్ద ఉన్న మా సిబ్బందికి..అర్చకులకూ బాగా నచ్చింది..అదే సమయం లో ఆ తల్లికి కూడా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టాయి..తల్లీకూతుళ్ళు ఇద్దరూ స్వామివారి సేవ చేసుకునేవారు..మా సిబ్బంది తోపాటు మందిరాన్ని శుభ్రం గా ఊడ్చేవారు..స్వామివారి కి వాడే వస్తువులను కడిగిపెట్టేవారు..శనివారం నాడు మందిరానికి వచ్చే పూలను మాలలుగా కట్టి పెట్టేవారు..వారికి చేతనైన పని చేస్తూనే ఉండేవారు..అలా ఈ అమ్మాయి స్వామివారి మందిరం లో ఒక మనిషిగా కలిసిపోయింది..తన తల్లి ఆరోగ్యం బాగుపడగానే ఒక ఆదివారం నాడు స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టుకొని ..తల్లిని తీసుకొని తన ఊరుకు వెళ్ళిపోయింది..
"నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు..మా అమ్మే కూలిపని చేసుకుంటూ నన్ను పెంచింది..మాకు పెద్దదిక్కు ఎవ్వరూ లేరు..అమ్మకు ఆరోగ్యం సరి లేకపోతే..వైద్యం చేయించడానికి స్తోమత లేదు..ఏ దిక్కూ తోచక అల్లాడుతుంటే..స్వామివారి గురించి విని ఇక్కడికి తీసుకొచ్చాను..స్వామివారి దయవల్ల అమ్మ బాగుపడింది..ఇక్కడినుంచి వెళ్లిన తరువాత..ఒక స్కూల్లో టీచర్ గా చేరాను..అమ్మచేత కూలీపని మానిపించి న నా వద్దే ఉంచుకున్నాను..పోయిన సంవత్సరం నాకు వివాహం అయింది..ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం..ఆయనకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు..మా పెళ్లి తరువాత కూడా మా అమ్మ మా వద్దే ఉంటున్నది..పెళ్లికి ముందుగానే అమ్మ గురించి ఆయనతో చెప్పాను..ఒప్పుకున్నారు..ఈ స్వామివారి గురించి..మా అమ్మ ఆరోగ్యం బాగుపడటం గురించి ఆయనకు పదే పదే చెప్పడం వల్ల..ఈరోజు నాతోబాటు ఇక్కడకు వచ్చారు..ఈరాత్రికి ఇక్కడ నిద్రచేసి..రేప్పొద్దున స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోతాము.." అని చెప్పి..తన భర్తను పరిచయం చేసింది.."సరే తల్లీ..స్వామివారు మీ తల్లికి ఆరోగ్యం బాగు చేశారు..నీ కళ్లారా చూశావు..మీ ఆయన లో కూడా దేవుడంటే భక్తి కలిగిస్తారేమో చూద్దాం.." అన్నాను..స్వామివారి చిత్రపటం వైపు తిరిగి నమస్కారం చేసుకున్నది..
ఆ దంపతులు ఆరోజు స్వామివారి మందిరం లోనే నిద్ర చేసారు..మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ స్వామివారి సమాధి దర్శించుకొని వాళ్ళ ఊరెళ్లిపోయారు..మరో పదిహేనురోజుల తరువాత..ఒక శనివారం నాటి సాయంత్రం..ఆ అమ్మాయి తన భర్త తో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది..నేరుగా నేను ఉన్న చోటుకి వచ్చి.."అంకుల్..స్వామివారు తన మహిమ చూపారు..ఈరోజు మా ఆయన పట్టుబట్టి నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు..స్వామివారి మందిరానికి వెళదాము..అక్కడ నిద్ర చేద్దాము..అని ఆయనే నాకు చెప్పి తీసుకొచ్చారు.." అన్నది..అతని వైపు చూసాను.."అవునండీ..పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు..స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నప్పుడు..మనసులో అనుకున్నాను..నాకు నిదర్శనం చూపిస్తే నేను నమ్ముతాను అని అనుకున్నాను..చాలారోజుల నుంచీ నా ఉద్యోగం తాలూకు సమస్య కోర్టు లో ఉన్నది..ఇక్కడ నుంచి వెళ్లిన మూడోరోజే అది నా కనుకూలంగా తీర్పు వచ్చింది..స్వామివారి వల్లే అని నాకు నమ్మకం ఏర్పడింది..ఆ తీర్పు వల్ల నాకు ప్రమోషన్ కు కూడా అడ్డంకులు తొలగిపోయాయి..పైవాళ్ళు ఆ ఫైలు కూడా సిద్ధం చేశారు..అందువల్ల స్వామివారి వద్దకు రావాలని అనుకోని..తనకు చెప్పి తీసుకొచ్చాను.." అన్నాడు..
"అమ్మా..నువ్వు నీ వివాహానికి ముందు ఇక్కడ కొన్నాళ్లపాటు వుండి స్వామిసేవ చేసుకున్నావు..అదే నీకు అదృష్టం..ఆ సేవ ఫలితమే నీ భర్తకు కూడా స్వామివారి మీద భక్తి ఏర్పడింది..ఇకనుంచీ ఇద్దరూ స్వామివారి వద్దకు సంకోచం లేకుండా రావొచ్చు.." అన్నాను..
స్వామివారు కరుణామయులు..ఆ విషయం మాకు పదే పదే ఋజువు చేస్తూనే వున్నారు..చూస్తూనే ఉన్నాము..కానీ అదేమి చిత్రమో..మాకు ప్రతిసారీ కొత్తగా వుంటుంది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).