18, జులై 2021, ఆదివారం

సాధనకు సమయం?*

 *సాధనకు సమయం?*

    🕉️🌞🌎🏵️🌼🚩

                  

 *పడకగదిలో తన మంచంపై పడుకుని ఉన్న రాధాకృష్ణ ఏదో అలికిడి కావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. అతని ఎదురుగా ఒక దివ్యకాంతి ప్రకాశిస్తూ కనబడింది. చూస్తూండగా ఆ కాంతి ఒక స్త్రీ రూపాన్ని దాల్చింది.* *దేదీప్యమైన కాంతులను వెదజల్లుతున్న ఆ స్త్రీమూర్తి సాక్షాత్తు ఆ జగన్మాతేనని గ్రహించిన రాధాకృష్ణ, "అమ్మా!" అంటూ ఆ తల్లి పాదాలపై పడాలని అనుకున్నాడు. కాని, మంచంపై అతనిని ఎవరో కట్టేసినట్లు అనిపించడంతో ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. 'ఏమైంది నాకు?' అనుకుంటూ రాధాకృష్ణ తన వంక తాను ఒకసారి చూసుకుని ఆశ్చర్యపోయాడు.* *అతని శరీరం బక్కచిక్కిపోయి, చర్మం ముడతలు పడిపోయి ఉంది. లేచేందుకు ఏమాత్రం ఓపిక తనలో మిగలలేదని, తన అంత్యకాలం సమీపించిందని అర్థం చేసుకున్న రాధాకృష్ణ ఆ పరమేశ్వరి వంక చూస్తూ, "తల్లీ! నన్ను నువ్వే* *కాపాడాలి... నాకు నీ వద్దకు రావాలని ఉంది!" అన్నాడు.* 


“అవును, కుమారా! నాకూ నిన్ను నాతో తీసుకెళ్లాలని ఉంది కానీ, నీవు ఈ జన్మలో చేసిన పుణ్యం అందుకు సరిపోయేటట్టు లేదు. అదే నా బాధ", అంది జగన్మాత విచారంగా.  


"అమ్మా! నేను ఇప్పటివరకూ ఎవ్వరికీ కష్టం కలిగించకుండా ఉన్నానే... అది సరిపోదా?" అడిగాడు రాధాకృష్ణ. 


“సరిపోదు, నాయనా! నువ్వు నాతో రాగలిగేందుకు కావలసిన అర్హతను పొందాలంటే నీకు లభించిన మానవ జన్మను భగవత్సేవకు అంకితం చెయ్యాలి. నేను నీకిచ్చిన ఈ తొంబై అయిదు సంవత్సరాలలో నువ్వు ఏనాడూ నా సన్నిధిలో దీపం కూడా వెలిగించినట్టు లేవు" అంది పరమేశ్వరి. 


"నిజమేనమ్మా! నువ్విచ్చిన సుఖాలను అనుభవించానే తప్ప ఇన్నాళ్లు నిన్నెలా సేవించాలో నేనసలు ఆలోచించలేదు. నన్ను మన్నించమ్మా... నాకు ముక్తిని ప్రసాదించు తల్లీ," అని అమ్మను వేడుకున్నాడు రాధాకృష్ణ.


"సరే నాయనా! నా బిడ్డవు కాబట్టి నీకొక చివరి అవకాశం... నీకు కచ్చితంగా పది నిమిషాల వ్యవధి ఇస్తున్నాను. ఈ పది నిమిషాలలో నీకు తోచిన విధంగా నన్ను సేవించి, నాతో వచ్చేందుకు అర్హతను సంపాదించు, నాయనా!" అంది పరమేశ్వరి. 


“ఆహా... అమ్మా! నువ్వు కరుణామయివి. నేను ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను" అని అమ్మను ఎలా సేవించాలా అని, ఆలోచనలో పడ్డాడు రాధాకృష్ణ. 

'పత్రం, పుష్పం, ఫలం, తోయం' అన్నారు కాబట్టి పెరటిలో ఉన్న నాలుగు పుష్పాలు కోసుకుని వచ్చి అమ్మ పాదాలపై వేద్దామనుకున్నాడు రాధాకృష్ణ. లేచే ప్రయత్నం చేసినప్పుడు కానీ రాధాకృష్ణకి అతడు లేవలేని స్థితిలో ఉన్నానని గుర్తుకు రాలేదు. చేతులు జోడించి అమ్మనుగూర్చి ప్రార్థన చేద్దామని రాధాకృష్ణ తన రెండు చేతులను ఒక దగ్గరకు అతికష్టం మీద తీసుకుని వచ్చాడు. నరాల బలహీనతవల్ల చేతులు వణికిపోయాయి. రెండు నిమిషాలన్నా నమస్కార ముద్రను నిలపలేకపోయాడు రాధాకృష్ణ. 

తనకు తెలిసిన పాటను సంగీత సేవగా భావిస్తూ శ్రావ్యంగా పాడదామని రాధాకృష్ణ అనుకున్నాడు. కానీ, వృద్ధాప్యం వల్ల గొంతులో కఫం అడ్డుపడి పాడలేకపోయాడు.


'ఇక నావల్ల కాదమ్మా! నువ్వే దారి చూపించు' అని అమ్మవంక దీనంగా చూశాడు రాధాకృష్ణ. 


"అయ్యో నాయనా! నువ్వు పడుతున్న అవస్థను చూడలేకపోతున్నాను. పోనీ నీకు వచ్చిన స్తోత్రంతో నన్ను స్తుతించు." అడిగింది జగజ్జనని.


 "అలాగేనమ్మా!" అంటూ రాధాకృష్ణ తను చిన్నప్పటినుండీ విన్న శ్లోకం ఒకటి టకాటకా చెప్పేశాడు కానీ అతని పళ్ళన్నీ ఊడిపోవడంవల్ల ఆ శ్లోకంలో చాలా పదాలు స్పష్టంగా పలకలేకపోయాడు. అందువల్ల కొన్ని పదాల అర్థాలు కూడా మారిపోయాయి.


 "పోనీలే నాయనా! నన్ను చూసి నా రూపాన్ని వర్ణించు... తృప్తి చెందుతాను" అంది ఆ తల్లి. 


రాధాకృష్ణకు వయసు వల్ల చూపు బాగా మందగించింది. తన కళ్ళను ఎంత చిట్లించి చూసినా అమ్మ రూపు స్పష్టంగా కనబడలేదు. 


"నాయనా! నా చుట్టూ ఉన్న తరంగాలు నా బీజాక్షరాన్ని నిరంతరం ప్రతిధ్వనించేలా చేస్తాయి. జాగ్రత్తగా విను" అంది జగన్మాత. 

రాధాకృష్ణ తన డెబ్భైయ్యవ ఏటనే వినికిడి శక్తిని కోల్పోవడంతో చెవులు రిక్కించి విన్నప్పటికీ తనకు ఎటువంటి శబ్దమూ వినబడలేదు. 


'అమ్మా! ఇప్పుడేం చెయ్యనూ?' అన్నట్టు అమ్మవంక చూశాడు రాధాకృష్ణ.


"ఇక ఆఖరి ప్రయత్నంగా నీ మనసు ఒక రెండు నిమిషాలపాటు నాపై లగ్నం చెయ్!" అంది తల్లి. 


రెండు నిమిషాలు ప్రయత్నించిన తర్వాత, "మహానీయులకు సైతం మనసును ఏకాగ్రచిత్తముతో నీపై నిలపడం సులభం కాదు. నావంటి అల్పునికి అదెలా సాధ్యపడుతుంది అమ్మా? నావల్ల కాదు" అని అన్నాడు రాధాకృష్ణ దీనంగా. 


జగన్మాత రాధాకృష్ణకు ఇచ్చిన పది నిమిషాల గడువు ముగిసింది. 


"అమ్మా నిన్ను ఏ విధంగానూ సేవించలేకపోయాను" అని కడు దుఃఖంతో అన్నాడు రాధాకృష్ణ. పశ్చాత్తాపంతో అతని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. 


"ఇదంతా నీ స్వయంకృతం, నాయనా! నువ్వు తరించడానికే నికీ మానవజన్మ లభించిందన్న విషయం నువ్వు విస్మరించావు. నీ పేరు చెప్పినప్పుడల్లా నా నామాన్ని స్మరించావు కనుకనే ఈ విధంగానైనా నీకు నా దర్శన భాగ్యం కలిగింది. భగవద్విషయాలను జీవిత చరమాంకంలో తెలుసుకోవచ్చులే అని అనుకోవడం అవివేకం. నీకు మానవజన్మ లభించిన దగ్గరినుండి ప్రతి నిమిషం అమూల్యమే, నాయనా! భగవద్భక్తికి బాల్యంలోనే బీజం పడాలి. జీవితం చివర్లో సత్యాన్ని గ్రహించినా, చేసేందుకు శరీరం సహకరించకపోయే ప్రమాదం ఉంది. సమయం విలువను తెలుసుకో... ఇకనైనా మేలుకో అని చెప్పి ఆ దివ్యకాంతి అంతర్థానమయ్యింది. 


"అమ్మా... అమ్మా! నాకు నువ్వు కావాలి" అని ఏడుస్తూ నేలపై పడ్డాడు రాధాకృష్ణ.


అంతలో, "నాయనా రాధా! నేనురా నీ అమ్మను. కలేమైనా కన్నావా? లే నాయనా లే" అంటూ, నిద్రపోతూ మంచంపై నుండి కిందపడ్డ రాధాకృష్ణను అతని తల్లి లేవదీసింది.


రాధాకృష్ణ కళ్ళు నులుముకుంటూ తనకొచ్చినది కల అని తెలిసి ఆశ్చర్యపోయాడు. కలలో జగన్మాత చేసిన బోధను గుర్తుచేసుకుంటే రాధాకృష్ణకు తను చేస్తున్న తప్పులన్నీ తెలియవచ్చాయి. తనకు పాతకాలం నాటి పేరు పెట్టినందుకు పెద్దలను నిందించిన సందర్భాలూ గుర్తుకు వచ్చాయి. 


రోజూ ఇంట్లోని పెద్దవాళ్ళు వెంటపడితే కానీ స్నానం చెయ్యని రాధాకృష్ణ ఆ రోజు పూర్తిగా తెల్లవారకమునుపే స్నానం ముగించి, ఇంట్లోని దేవుని మందిరం దగ్గరకు వెళ్లి, భగవంతునికి భక్తిగా నమస్కరించి, ఆ తర్వాత తన బామ్మవద్దకు వెళ్లి, "బామ్మా! ప్రతిరోజూ నీతో గుడికి రమ్మని నన్ను అడుగుతూ ఉంటావుగా... ఇవాళ నువ్వు గుడికెళ్లేటప్పుడు చెప్పు నేను కూడా వస్తాను" అని అన్నాడు రాధాకృష్ణ. 


ఎప్పుడూ - నేనింకా చిన్నవాడిని! నాకప్పుడే గుళ్ళూ, గోపురాలూ, భగవంతుడూ, భక్తి ఎందుకే బామ్మా?" అంటూ చిరాకుపడే తన పన్నెండేళ్ల మనవడు రాధాకృష్ణలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతూ, 'అమ్మా పరమేశ్వరీ! ఇన్నాళ్ల నా ప్రార్థనను విన్నావా తల్లీ' అని అనుకుంటూ ఆనందపడిపోయింది రాధాకృష్ణ బామ్మ.✍️


        🌷🙏🌷

సేకరణ. మానస సరోవరం 👏

*(చారు)

             *(చారు)* 

(దీని రచయిత పేరు తెలియదు

      వారికి ధన్యవాదములతో)


🔅🔅🔅😇😇😇🔅🔅🔅

             *ఆటవిడుపు ...*


*చారుకి చారని పేరెందుకంటే నవ్వుతారేంటో...*నవ్వకండి, ఇది చిత్తగించండి...*


 *చింతపండు* 

 *ఇంగువ* 

 *పోపు దినుసులు* 

 *ఉప్పు* 


*ఈ నాలుగు(చార్) కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారౌతుందని దానిని చారన్నారో మరేమో....*

*చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారౌతుంది....*


*పప్పేస్తే పప్పు చారు*


*టమాటాలతో టమాటా చారు*


*మునగేస్తే మునగచారు*


*మిరియం వేస్తే మిరియాల చారూ*


*ఏక్ దో తీన్ చార్ అని నాలుగు నిమిషాలలో.......*


*ఇలా పాపం దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది.*


*పళ్ళు రాని పాపడి నుంచి  పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ....*


*అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే.*

*మారాం చేసే బుజ్జి గాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే...*


*మీకు ఉప్మా నచ్చదా...ఐతే ఓ రెండు చెంచాల చారు కలుపుకొండి...*

*అమృతమే....* 😋😋😋


*జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే...*


*ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే(వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే...* *అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా....నిజం ఒప్పుకోండి....* 


*ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే...మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే...*


*ప్రియే....చారు శీలే ... అన్నారు గుర్తుందండీ జయదేవులవారు...*


*చారు అంటే అందమైనది అద్భుతమైనది అని..*  


*అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా... చెప్పండి...* 


*మరి చారు  తాగే జయదేవులు  అష్టపదులు చెప్పుంటారు లెండి మరి...ఒడిషా మరి తెలుగు దేశానికి దగ్గరే కదా....*


*మరి వేడి చారు తాగడానికి సమయం సందర్భం అవసరం లేదని నా అభిప్రాయం....*


*వేడి వేడి చారు  పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే... మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి... అద్భుతః, అమోఘః......*


*మా అమ్మమ్మ పెట్టేది కుంపటి పై కాచిన సత్తుగిన్నెలో చారు....ఆ పోపుకొచ్చిన ఘాటు నాకు ఇప్పటికీ జ్ఞాపకం....ఆ రుచి....ఇప్పటికి మళ్ళీ చూడలేదు....*


*మరి చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది....*  

*గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు...*


 *ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు....*

*ఇలా చెప్పుకుంటూ పోతే..*


*అహో ఏమి చెప్పను చారు...*

*వేడి వేడిగా గొంతులో జారు..* *చెవులనుండి వచ్చు హోరు..*

*జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు......*


 *ఇంకే ద్రవమేనా చారు ముందు*  

 *బేజారు* 


 *చార్ మినిట్ మే బనే చారు*

 *ఆ ఘాటుకు  మాత్రం నా* 

 *జోహార్లు!*

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

మలబద్ధక సమస్య

 మలబద్ధక సమస్య గురించి వివరణ  - 1.


     

     కొంతమందిలో విరేచనం సాఫీగా ఉండదు. ఎక్కువ సమయం  లెట్రిన్ లో గడపవలసి వస్తుంది. మలము ఒకేసారి విసర్జించకుండా కొంచం కొంచం విసర్జించడం జరుగుతుంది. ఇలా జరుగుతూ మరలా అర్థగంట తరువాత మరలా మలవిసర్జనకు వెళ్ళవలసి వస్తుంది. ఇలా ఉదయాన్నే 2 నుంచి 3 సార్లు వెళ్లవలసి వస్తుంది. అయినను సంపూర్ణముగా విరేచనం అవ్వదు . కడుపు తేలికగా ఉండకుండా బరువుగా అనిపించును. ఇంకా కొంత మలము ప్రేవులలో ఉండినట్లు అనిపించును. 


            ఈ సమస్య ఎక్కువుగా కూర్చుని పనిచేయు ఉద్యోగస్తులలోను , వ్యాపారస్తులలోను కనిపించును. చాలా మంది ఉదయం లేవగానే విరేచనముకు వెళ్తున్నాము ఎటువంటి సమస్య లేదని పొరబడుతున్నారు. నిజానికి ఆరోగ్యకరమైన మనిషి రోజుకు రెండుసార్లు విరేచనముకు వెళ్లవలెను . ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషదాలు సేవించి కడుపును శుభ్రపరచుకోవలెను . ఈ కాలంలో ఈ నియమాలను ఎవరూ పాటించటం లేదు . 


               మలబద్దకం వలన ప్రేవులలోని వ్యర్దాలు బయటకి విసర్జించక పోవడం వలన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువ అయ్యి అనేక రోగాలు వస్తాయి. రోగాలు రావడానికి మొదటి మెట్టు మలబద్దకం . ఎక్కువ కాలం ప్రేవులలో మలం సంపూర్ణముగా విసర్జించకుండా ఉండటం మూలాన ప్రేవులలో సీసం తయారగును. 


 మలబద్దకం లక్షణాలు  - 


 *  ఆకలి సరిగ్గా లేకుండా ఉండటం . 


 *  తలనొప్పి . 


 *  నిద్ర సరిగ్గా పట్టకపోవుట . 


 *  ముఖంపైన మొటిమలు వచ్చును . 


 *  శరీరం నందు వేడి పెరుగును . 


 *  కంటి క్రింద నల్లటి చారలు వచ్చును. 


 *  తలలో చుండ్రు పెరుగును . వెంట్రుకలు రాలును . 


 *  కడుపులో మంట . 


 *  నడుమునొప్పి . 


  మలబద్దకం రావడానికి గల కారణాలు  - 


  *  ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుగా లేకుండా ఉండటం. పాలిష్ పట్టిన బియ్యం , మైదా పిండి వంటి వాటిలో పీచుపదార్థం అసలే ఉండదు . 


 *  కాఫీ , టీ , మద్యము విపరీతముగా తాగుట వలన కూడా మలబద్దకం వచ్చును . 


 *  నీరు తక్కువ తాగుట కూడా మలబద్ధకానికి కారణం అగును. 


 *  శారీరక శ్రమ లేనందువలన మరియు మానసిక ఆందోళనకు తరచుగా గురగుట వలన కూడా మలబద్దకాన్ని కలుగచేయును . 


     తరవాతి పోస్టు నందు పాటించవలసిన ఆహార నియమాలు వివరిస్తాను . మరింత విలువైన సమాచారం మరియు అత్యంత సులభ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  

    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

దండెం

 దండెం:


పరంధామయ్య బ్రాహ్మణ వృద్ధాశ్రమం లో చేరాడు.కొడుకు ఉన్నా వృద్ధాశ్రమం లో ఎందుకు చేరాడు అంటే చిన్న కథ ఉంది.


పరంధామయ్య భార్య పోయాక హైదరాబాద్ లో కొడుకింటికి చేరాడు.


కొడుకు ఇల్లు చక్కగా, శుభ్రంగా,విశాలమైన హాలు,ఖరీదైన సోఫా సెట్టు,పెద్ద టీ.వీ.తో అద్భుతంగా ఉంటుంది.


ఓ‌రోజు కొడుకు,కోడలు బయటికి ‌వెళ్ళారు.రాత్రి ఇంటికొచ్చేసరికి ఆలస్యమైందని పడుకున్నారు.


మర్నాడు ఉదయం హాలులో కి వచ్చి చూసి విస్తుపోయారు.హాలులో ఈ మూల నుంచి ఆ మూలకి దండెం కట్టుబడి,దానిమీద ధావళీలు,పట్టు పంచెలు,మడి పంచెలు ఆరేయ బడి ఉన్నాయి.


అది చూసి పరంధామయ్య గారి కొడుకు చిరాకు పడి, నాన్నగారూ ఈ దండెమేమిటి? శుభ్రమైన హాలు అందమంతా ‌పోయింది.మన వంటాయన తో చెబితే మీ మడి బట్టలు చక్కగా బయట ఆరేసి  పెట్టి‌ మీరు పూజ చేసుకునే టైముకి ఇస్తాడు అని పనివాణ్ణి పిలిచి దండెం తీయించేసాడు.


దాంతో అహం దెబ్బ తిన్న పరంథామయ్య కొడుకు,కోడలు ఎంత చెప్పినా వినకుండా ఎరుగున్న వారి ద్వారా వృద్ధాశ్రమంలో చేరాడు.


పరంధామయ్య తో పాటు,మరో నలుగురు చేరారు.కొత్తగా చేరిన

మెంబర్లు అందరికి వృద్ధాశ్రమం మేనేజర్ నిబంధనలు అన్నీ చెబుతూ,మీ అందరికి ఓ మనవి.


ఏమిటంటే! దయచేసి  ఎవరూ మీమీ గదుల్లో దండేలు కట్టి బట్టలు ఆరేయకండి.గదుల్లో ఆరేయడం వల్ల‌ సరిగా ఆరక ముక్క కంపు కొడుతుంది.దయచేసి సహకరించే గలరు. మా నిబంధనలు నచ్చక పోతే వెళ్ళి పోవచ్చు అని చెప్పాడు.


సాయంకాలం, స్నాక్స్ తిని,టీ తాగి‌ వృద్ధాశ్రమం ఆవరణలో కూర్చున్న పరంధామయ్య కి అంతర్మథనం ఆరంభమై,తప్పు చేశా నేమో అనిపించింది.కానీ వెనక్కి పోడానికి

అహం అడ్డొచ్చింది.


ఆలోచిస్తూ,మథన పడ్తున్న పరంథామయ్యకి నాన్నగారూ అన్న కొడుకు పిలుపు చల్లగాలి లా తాకింది.


మేనేజరుతో మాట్లాడి కొడుకు పరంథామయ్యని ఇంటికి తీసుకు పోయాడు.


ఇంటికి చేరిన పరంథామయ్య మరేనాడు తన చాదస్తాలని ప్రదర్శించ లేదు.

#జయంతి లక్ష్మీ నరసింహం#

పెద్దన్నయ్య

 పెద్దన్నయ్య*

      *సి.ఎన్.చంద్రశేఖర్*    


👉🏻  మంచి కథ

       


        "దివాకర్. మీ అన్నయ్య వస్తున్నాడు"

             ప్రక్క సీట్లోని అక్కౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్. 

            బ్యాంకు గేటు నుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి.

         బ్యాంక్ స్టాఫ్ కొంతమంది శివరాం ను చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు. కొంతమంది పలకరిస్తున్నారు.

             శివరాం తన దగ్గరికి రాగానే "కూర్చో అన్నయ్యా" అన్నాడు దివాకర్.

            శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతిరుమాలుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.

అతని ముఖం వాడిపోయి ఉంది.

                    "ఏమిటి...ఇలా వచ్చావు? బ్యాంకులో ఏమైనా పనిబడిందా?" దివాకర్ అడిగాడు.

      "మీ వదిన చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతూంది. ఈరోజు స్పెషలిష్ట్ దగ్గరకు తీసుకెళ్ళాను. ఆపరేషన్ చేయాలన్నారు" అన్నాడు శివరాం దిగులుగా చూస్తూ.

        "ఎంతవుతుందట?"

     "యాభైవేలు అవుతుందని చెప్పారు"

        కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్. తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి             " "చూద్దాం అన్నయ్యా. నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మంచి సర్జన్లు కూడా. వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుంటాను" అన్నాడు.

       "ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నారు"

       దివాకర్ ఇబ్బందిగా చూసి "ఇలా బ్యాంక్ లో ఉన్నప్పుడు చెబితే నాకు ఏమీ తోచదన్నయ్యా. పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు. సాయంత్రం నేను ఇంటికొచ్చి మాట్లాడుతాను" అన్నాడు.

        "అలాగే...నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు. మనం తర్వాత మాట్లాడుకుందాం" అంటూ లేచాడు శివరాం.

         అంతలో..అటుగా వెళ్తున్న మెసెంజర్ - శివరాం ని చూసి "నమస్తే సార్.- నేను కుమార్ ని. సంతపేట హైస్కూల్ లో మీ శిష్యుణ్ణి" అన్నాడు రెండుచేతులూ జోడించి.

           "నీ పేరు గుర్తులేదు గానీ నువ్వు గుర్తున్నావు...  బాగున్నావా?" ఆప్యాయంగా అడిగాడు శివరాం.

            "బాగున్నాను సార్! ఈమధ్యే అనంతపూర్ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుని వచ్చాను. రాగానే దివాకర్

సార్ ని మీ గురించి అడిగాను. కూర్చోండి సార్...టీ తాగి వెళుదురుగాని" అంటూ బాయ్ ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్.

      "ముందు కాస్త మంచినీళ్ళు ఇప్పించు కుమార్" అభ్యర్థనగా అడిగాడు శివరాం. కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు.

        టీ తాగుతున్న శివరాం వైపే చూస్తూండిపోయాడు దివాకర్.

           'టీ ఆఫర్ చేయాలని ఆ పాత శిస్యుడికి తోచింది తనకెందుకు తోచలేదు? ఎండనపడి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు? ' అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు. 

     *          *          *           *

               ఆరోజు సాయంత్రం మారుతీ కారు షోరూం నుంచి వచ్చిన రెప్రెజెంటేటివ్ దివాకర్ ని కలిశాడు.

          "రేపు మీరు డ్రాఫ్ట్ సిద్దం చేసుకున్నారంటే...ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది" అన్నాడతను దివాకర్ తో.

           "అదేం పెద్ద పని కాదు. బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాను కాబట్టి ఓచర్లు నింపడమే నా పని. నా మార్జిన్ ఎలాగూ సిద్దంగా ఉంది" అన్నాడు దివాకర్.

                 రెప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అక్కౌంటెంటు వేణు వచ్చి "ఎప్పుడు కొంటున్నావు కారు?" అని అడిగాడు- ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. 

             "రేపు లోన్ కోసం ఆప్లై చేస్తాను. ఎల్లుండి కారు డెలివరీ చేస్తారు"

            కాసేపు కారు రంగు, మోడల్,రేటు గురించి మాట్లాడుకున్నాక "మీ అన్నయ్య ఈరోజు ఎప్పటిలా ఉత్సాహంగా కనిపించలేదు. చాలా డల్ గా కనిపించారు" అన్నాడు వేణు.

           "అవును. మా వదినకు ఆపరేషన్ చేయాలట. అందుకు యాభైవేలు...."

                  దివాకర్ మాట పూర్తికాకముందే "మీ అన్నయ్య వస్తున్నారు. నూరేళ్ళు ఆయుస్సు ఆయనకు!" అన్నాడు వేణు గేటు వైపు చూస్తూ.

       దివాకర్ తలెత్తి చూశాడు. శివరాం ని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది. 

        "నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు" అన్నాడు వేణుతో.

           "నేనెందుకు ఎత్తుతాను" అంటూ వేణు తన సీటుకు వెళ్ళిపోయాడు. అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.

       దివాకర్ ని చూసి శివరాం నవ్వుతూ "ఈ రోజు పని పూర్తయిందా?" అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

       "పని ఇంకా పూర్తికాలేదు. నేను ఇంటికొచ్చి మాట్లాడతానన్నాను కదా..మళ్ళీ నువ్వు రావడం ఎందుకు? వదిన ఆరోగ్యం గురించి నాకూ కన్సర్న్ ఉంది. కానీ, నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు?"

          దివాకర్ ముఖంపై నవ్వు పులుముకుని ఆ మాటలు అన్నా..అతని మాటల్లో అసహనం, విసుగును గ్రహించాడు శివరాం.

       "సారీరా! నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు. ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం..."

          శివరాం కుర్చీలోంచి లేచి బయటకు నడిచాడు. వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు. అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది.

    *         *         *           *

         దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చి "శివరాం బావగారు ఫోన్ చేశారు" అని చెప్పింది.

      "ఎన్ని గంటలకు చేశాడు"        విసుగ్గా అడిగాడు శివరాం.

        "ఏడు గంటలకు చేశారు. అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు. మీరు బ్యాంకు నుంచి వచ్చారా...అని అడిగారు. ఇంకా రాలేదని చెప్పాను"

            "బ్యాంకుకు వచ్చి మాట్లాడాడ్లే. వదిన ఆపరేషన్ కు యాభైవేలు కావాలని అడిగాడు"

     "మీరేమని చెప్పారు?"

"ఆలోచించి చెబుతానన్నాను" 

          "బాగా ఆలోచించండి. ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు. కూతుర్ల దగ్గర ఆయన డబ్బులు తీసుకోరు. యాభైవేలు మరి ఆయన ఎలా తీరుస్తారు?"

        "అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు?"

         "అయిదో,పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి "

         "కానీ మనం కారు కొంటున్నాం"

            "కాబట్టే డబ్బుకు ఇబ్బందని చెప్పండి. ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకు ముందే డబ్బులిచ్చేశామని చెప్పండి"

     "అలాగే చెప్తా. నాకు కాస్త త్రాగడానికి నీళ్ళివ్వు" అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్.

       *           *         *         *

           మరుసటి రోజు బ్యాంకు లోన్ తీసుకోవడం, డ్రాఫ్ట్ షోరూంలో ఇవ్వడం, తర్వాతి రోజు కారును ఇంటికి తీసుకురావడం,గుడికి తీసుకెళ్ళి పూజ చేయించడం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్.

            ఆరోజు ఆదివారం కావడంతో క్రొత్త కారు డ్రైవ్ చేసుకుంటూ శివరాం ఇంటికి వెళ్ళాడు. శివరాం ఇల్లు తాళం వేసిఉండటంచూసి ఆశ్చర్యపోయాడు. శివరాం ప్రక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు. 

             దివాకర్ ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ. అతడు దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచిలో పనిచేస్తున్నాడు.

          "చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు. నాకు చాలా అనందంగా ఉంది" అన్నాడు రామకృష్ణ.

           "నాకూ అలాగే ఉంది. కొత్త కారు కొన్నాను. నీకూ, అన్నయ్యకూ చూపిద్దామని తెచ్చాను"

         "అలాగా...కంగ్రాట్స్"

         "అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా?"

        "నీకు తెలుసో,తెలియదో నాకు తెలియదుగానీ...మీ వదినగారికి ఈమధ్య అనారోగ్యం చేసింది. ఆపరేషన్ చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు"

           "ఆపరేషన్ విషయం అన్నయ్య నాతో చెప్పాడు. చెన్నై లో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు"

        "ఆ విషయం వాళ్ళకూ తెలియదు. మీ అన్నయ్య స్టూడెంట్ ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఆవిడ చెన్నై లో పెద్ద డాక్టరట. మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని-తను ఆ కేసులో స్పెషలిష్టుననీ, తన హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకోమనీ, మందులూ ఇతర ఖర్చులూ భరిస్తే ఆపరేషను తను ఫ్రీగా చేస్తాననీ చెప్పి, వాళ్ళను ఒప్పించి, తనతోపాటే కారులో చెన్నై పిలుచుకెళ్ళారు. మీ అన్నయ్య తరచూ అంటూండేవాడు- 'బీ గుడ్, డూ గుడ్...హి విల్ డూ  గుడ్' అని! ఆ మాట ఆయన విషయంలో నిజమైంది.  ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు"

               రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ "మీ ఆవిడ ఇంట్లో లేరా?" అని రామకృష్ణని అడిగాడు దివాకర్.

              "లేదు. మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను. ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందనీ, మీ వదిన బాగున్నారనీ చెప్పింది"

        'తను ఊర్లో ఉండీ వాళ్ళకు ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో...?' అనుకున్నాడు దివాకర్. ఆ తర్వాత- "అన్నయ్య ఆపరేషన్ కు డబ్బు అడిగాడు. రెండురోజుల్నుంచీ రావాలని ప్రయత్నిస్తున్నా కానీ సమయం దొరకలేదు. ఈ రోజు డబ్బు తీసుకుని వచ్చాను....వాళ్ళు లేరు" అన్నాడు నిరుత్సాహంగా.

                 "రాలేకపోయానని చెప్పు-ఒప్పుకుంటాను కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను. రోజూ షేవింగ్ చేసుకుంటున్నావా, స్నానం చేస్తున్నావా, భోజనం చేస్తున్నావా, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా? ఇంటికి కావలసిన సరుకులు,కూరగాయలు తెస్తున్నావా, నీ భార్యకు,పిల్లవాడికి కావలసినవి అమర్చిపెడుతున్నావా? మరి, వీటికి సమయం ఎక్కడనుంచి వచ్చింది నీకు? అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది. మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడం లేదు. నీకు గుర్తుందా... మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకుచిత్తూరుకు ట్రాన్స్ ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు. అదృష్టవశాత్తూ ఆయన పక్క ఇల్లే ఖళీగా ఉండటంతో అందులో చేరిపోయాను. అప్పట్నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన్ను చూస్తూంటే నాకేమనిపించేదో తెలుసా?

'మనుషులు-నా బిడ్డ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంకోటి కావాలి- అని కోరుకుంటారు కానీ...నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలి..అని ఎందుకు కోరుకోరు?' అనిపించేది. మంచి పొరుగువారివల్ల ఇరుగుపొరుగు వాళ్ళకు ఎంత లాభమో మీ అన్నావదినల ద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు. మరి, వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి. కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్వు మరచిపోయినట్లున్నావు.

            దివాకర్. ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి? ఈరోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు. ఈ మూడేళ్ళలో ఎంత మార్పు నీలో? దీనికి కారణం ఏమై ఉంటుంది? నీ ప్రొమోషనా? లేక పెరిగిన నీ ఆర్థిక స్థితా? మీ అన్నయ్య కూడా నీలాగె 'నేనూ, నా భార్యాపిల్లలూ' అని గిరిగీసుకుని ఉండి ఉంటే మీరంతా ఎక్కడుండేవారో అలోచించు."

        దివాకర్ మౌనంగా వింటూ ఉండిపోయాడు.

            రామకృష్ణ ఉన్నట్టుండి లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు. ఐదు నిమిషాల తరువాత చేతిలో ఓ కవరుతో వచ్చాడు-

       "నేను మీ అన్నయ్యవాళ్ళ ప్రక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోన్ చేసి చెప్పగానే- నువ్వు రాసిన ఉత్తరం ఇది. ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు. ఇది నీ గతాన్నీ, మీ అన్నయ్యతో నీ అనుబంధాన్నీ, ఆయన నీకు చేసిన సహాయాల్నీ గుర్తుకుతెస్తుందేమో ప్రయత్నించు."

             దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు.

రామకృష్ణ కారు వరకూ వచ్చి "దివాకర్. డబ్బు ఎంత సంపాదించినా...అది మనకు సంతోషాన్నీ, ధైర్యాన్నీ ఇవ్వగలదేమో గానీ - తృప్తిని ఇవ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వడం, కష్టాల్లో ఉంటే సహాయపడటం వల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు. నిన్ను నొప్పించి ఉంటే సారీ...గుడ్ నైట్" అన్నాడు.   

"గుడ్ నైట్" అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్.

    *          *          *          *

"రామకృష్ణా...

        నువ్వు మా అన్నయ్య ప్రక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శుభసందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తోంది. అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నెమరువేసుకునే అవకాశం కూడా నాకు కలుగుతుంది. 

             శివరాం నా సొంత అన్నయ్య కాదు. మా పెదనాన్న కొడుకు. మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం. నాన్నావాళ్ళు నలుగురు అన్నదమ్ములు. వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు, ఇద్దరివి చిరుద్యోగాలు. అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు. ఇది ఆడవాళ్ళకు నచ్చేది కాదు. క్రమంగా వాళ్ళ మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి కుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది. మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు. పెద్దల మధ్య విభేదాలు- పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి.

        అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీకి వచ్చాడు. ఆయనకు ఈ వాతావరణం నచ్చలేదు. నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది. ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని కథలు,జోక్స్ చెప్పి నవ్విస్తూ..ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు. పెద్దలమధ్య కూర్చుని చాడీలు వింటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదనీ,చదువు చెడితే జీవితాంతం బాధపడాలనీ మాకు చెప్పేవాడు. అందరూ బాగా చదువుకుని,ఉద్యోగాలు తెచ్చుకుని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతకొచ్చనీ, అందువల్ల తమ మధ్య విభేదాలు రావనీ, అందరూ ఐకమత్యంగా ఉండొచ్చనీ చెప్పాడు. మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం. ఆయన చెప్పినట్లే చేశాం.

        తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు. వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేశాడు. చదువుకోని ఆడవాళ్ళకు మాటలతోనే అన్ని విషయాలు తెలియజేసి వాళ్ళలో సంస్కారాన్ని పెంచాడు. త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు. పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు. అన్నయ్యను అభినందించారు. క్రమంగా పెద్దలమధ్య విభేదాలు దూరమయ్యాయి. కాపురాలు వేరైనా పండుగల్ని కలసి జరుపుకునేవారు. అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది.

            'తనొక్కడు చదివి బాగుపడితే చాలు ‘ అనుకోలేదు అన్నయ్య. మేమందరం కూడా బాగుండాలని కోరుకున్నాడు. ఆయన తర్వాత మేము ఆరుగురం అన్నదమ్ములం. మాతో పాటు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం. అందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం. మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని జరిపించాడు అన్నయ్య.

        మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో తెలియదుగానీ-తర్వాత హైస్కూల్ చదువు దగ్గర్నుంచి ఎం.ఎస్.సి.వరకు, తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు తనొక్కడే వెళ్లేవాడు. పెదనాన్న ఆఫీసు పనులతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. తన స్నేహితులకు తోడుగా వచ్చిన తండ్రుల్నీ,సోదరుల్నీ చూసి 'తన తండ్రి కూడా తనతోపాటే వచ్చిఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా!' అనుకునేవాడు. ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాలకోసం పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు.

                ఒకరకంగా నాకు జీవితాన్నిచ్చింది మా అన్నయ్యే. నేను ఇంటర్ ఫస్టియర్ లో ఓ పరీక్ష తప్పాను. ఇంట్లో అందరూ బాగా తిట్టారు. నేను హర్ట్ అయి,ఇల్లు వదలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని రైల్వేస్టేషన్ చేరుకున్నాను. అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతూంటే...ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను.

'ఎక్కడికి పోతున్నా 'వని అడిగాడు. సమాధానం చెప్పలేదు నేను.

      పరీక్ష ఏమైందని అడిగాడు. చెప్పాను.

        'ఫరవాలేదు. ఫస్టియరే కదా. ..సంవత్సరం వృధా కాదు. ఈసారి ఇంకా బాగా చదివి రాయి ' అన్నాడు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. చదువు ప్రాముఖ్యం గురించి అంతగా చెప్పే అన్నయ్య- నా ఫెయిల్యూర్ ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు. 

అన్నయ్య నా భుజంపై చెయ్యి వేసి నన్ను ఇంటికి పిలుచుకెళుతూ అన్నాడు-"మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడనవసరం లేదు. ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లే ఉండవు. ఒక్కోసారి తారుమారవుతాయి కూడా. అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు."

           ఆ మాట నేను ఏనాటికీ మర్చిపోలేదు. నాకు ఎంతో ఓదార్పునూ, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చిన మాట అది. 

          తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో, డిగ్రీ డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆరోజు అన్నయ్య స్టేషన్లో కనబడకపోయి ఉంటే..నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో? ఏమయ్యేవాడినో? ఈరోజు ఇలా బ్యాంక్ లో ఆఫీసరుగా ఉన్నానంటే - ఇది ఆయన పెట్టిన బిక్షే. 

            అన్నయ్య ఎం.ఎస్.సి. చదివినా..మమ్మల్ని విడిచి వెళ్ళడం ఇష్టం లేక చిత్తూరులోనే టీచరు పోస్టులోనే   స్థిరపడిపోయాడు. పైగా టీచరు పోస్టంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఆ ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్ తో చేశాడు. మా గురించి ఎలా పట్టించుకునేవాడో-తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు. తన పూర్తి సమయాన్ని వాళ్ళకోసం వెచ్చించి, వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు. మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసేది. ఇద్దరూ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్ 'లా ఉంటారు. 

          మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి ఓసారి పనిఒత్తిడిలో సర్వీస్ చేయకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు, అరిచిపోయిన వాళ్ళున్నారు. కానీ, వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే, అభిమానపు పలకరింపులే. సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీసుకు వెళ్ళినా...వాళ్ళ శిష్యులే కనపడతారు. కావలసిన పని చేసిపెడతారు.

              అన్నయ్య మాతో, ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటూండేవాడు - 'ప్రతి మనిషీ ఓ అబ్దుల్ కలాం, ఓ రెహమాన్, ఓ తెందూల్కర్ కాలేరు. కానీ, ప్రయత్నిస్తే ప్రతి మనిషీ ఓ మదర్ థెరెసా కాగలరు. ఇందుకు మేధస్సు,ప్రతిభ అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు!' అని.  ఈ మాట అనడమే కాదు,ఆచరించి చూపించాడు కూడా. ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావలసి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు. అందుకోసం అయ్యే వ్యయప్రయాసల్ని పట్టించుకునేవాడు కాడు.

             మనం బ్యాంకులో కూర్చుని డెబిట్లు, క్రెడిట్లు, టార్గెట్లు ...ఇవే జీవితం అనుకుంటాం. అన్నయ్యలాంటి వాళ్ళను చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసినది చాలా ఉందనిపిస్తుంది. ఆయన మా అన్నయ్య అయినందుకు నేను గర్వపడుతుంటాను. అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే. ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు.

ఉంటాను.

నీ...దివాకర్.

              ఉత్తరం చదవడం పూర్తిచేసిన దివాకర్ కంటిచివర నుంచి రాలిన కన్నీటి చుక్క ఆ ఉత్తరంలోని  అతని సంతకం పై పడి, అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనపడసాగింది.

     *        *         *         *

            ఆరోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్ కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది.

                "దివాకర్. మీ అన్నయ్య,వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు..."అని చెప్పాడు రామకృష్ణ.

           "అలాగా...నేను వచ్చి చూస్తాను.రామకృష్ణా. నీవిచ్చిన నా ఉత్తరం చదివాను. 'పని ఒత్తిడి ' అంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకుని, నామీద నేనే సానుభూతి చూపుకుంటూ, భార్య చెప్పిందే వేదమనుకుంటూ, ఆమె ఆలోచనలే నా అలోచనలుగా భావిస్తూ, అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకు ప్రపంచంలో ఉండిపోయాను ఇన్నాళ్ళూ. ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తియ్యగా ఉంటుందో, అనురాగం ఎంత హాయిగా ఉంటుందో, jఐకమత్యం ఎంత ధైర్యాన్నిస్తుందో..మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు"

          "మీ అన్నయ్యతో నువ్వు ఇదివరకు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు. నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు"

         "తప్పకుండా. నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఉంటాను..."

             తర్వాత భార్యకు విషయం చెప్పి వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్.

       హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నావదినల మాటలు వినిపించి-గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు.

        "మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండీ! నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకుగానీ, స్నేహితులకు గానీ, ఆఖరికి కన్నబిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు. బాధ,భయం,కష్టం,నష్టం అన్నీ మీరే భరించి- చివరికి విజయం సాధించారు!" జానకి శివరాంతో అంటూంది. 

     "ఎక్కడో ఉన్నవాళ్ళకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు. అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు. అతనూ తన వంతు సాయం చేసి తన మంచితనం నిరూపించుకున్నాడు"

            "కానీ మీరు దివాకర్ దగ్గరకు వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరచింది. ఈమధ్య మన ఇంటివైపే రాని అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకెందుకు అనిపించింది?"

      "డాక్టరుగారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకు ఎంతో భయమేసింది. నా భయం నీతో చెప్పుకోలేను...నువ్వే పేషంట్ వి కాబట్టి. ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు. వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి, ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటి దగ్గర వదిలి, వెంటనే బ్యాంకుకు వెళ్ళాను. వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను. పాపం...వాడు అప్పుడూ బిజీనే!"

         'అన్నయ్య బ్యాంకుకు వచ్చింది...నన్ను డబ్బులు అడగటానికి కాదా?' అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్.

             "కానీ...అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు? మీరు దివాకర్ కు ఎంత చేశారు? అతని అభివృద్ది కోసం ఎంతగా తపించారు? అతను ఈరోజు అవన్నీ మర్చిపోయాడు" జానకి అంది.

         "తప్పు...అలా అనకు! నేను ఎదో ఆశించి వాళ్ళకు చెయ్యలేదు.  ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలనుకున్నాను. దివాకర్ స్వతహాగా మంచివాడే. పనిఒత్తిడిలో అలా మాట్లాడాడు. ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టినా...తరువాత ఆలోచిస్తే -పనిఒత్తిడి వల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్ గా ఉపయోగపడ్డానన్న విషయం స్ఫురించి ఎంతో ఆనందించాను" అన్నాడు శివరాం.

              దివాకర్ ఇక నిలబడలేకపోయాడు. పరుగున వెళ్ళి శివరాం చేతులు పట్టుకుని- ఆ చేతుల్లో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ.


     (ఈనాడు ఆదివారం 2009)

*ఇంత హృద్యమైన మానవ విలువలు కలిగిన కథ అందించిన చంద్రశేఖర్ గారు,

*సేకరణ: కెయస్వీ కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు,