7, మే 2021, శుక్రవారం

టిఫిన్ తినండి

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

నాకు నచ్చిన ఓ వాట్సాప్ సందేశం.

               🌷🌷🌷

"టిఫిన్ తినండి" అంటూ  మా ఆవిడ అందించిన  ప్లేట్ లోకి  ఉప్మా యేమో అని ఆశగా  తొంగి చూస్తే   తెల్లటి నాలుగు ఇడ్లీ లు కనపడ్డాయి.


ఉస్సురంటూ "ఉప్మా చేయలేకపోయావా" అన్నాను  ప్లేట్ అందుకుంటూ


"మొన్నంతా కడుపు గాభరాగా ఉందని, పడుతూ లేస్తూ ఆపసోపాలు పడ్డారనిన్ను, తేలికగా అరుగుతాయనిన్ను, ఇడ్లీ చేసాను" అంది శంకరాభరణం లో అల్లు గారిలాగ.


 "అబ్బే...గ్యాస్ ప్రాబ్లెమ్ ...అంతే... ఆ సాయంకాలానికే సెట్ అయిపోయింది కదా"అన్నాను ఇడ్లీ తుంచి అల్లప్పచ్చడి లో అద్దుకుంటూ


"వెధవ ఉప్మా కి ఏముంది...రేపు చేస్తాను లెండి. ఇవాళ్టికి ఇవి కానీండి"


"అయ్యో...  ఉప్మా ని ఎంత మాట అనేశావ్.. వెధవఉప్మా నా?? లెంపలు వేసుకో.

ఇంత అల్లం పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి జారుగా బొంబాయి రవ్వతో మంచి ఉప్మానే చేయి.. 

ఇంతకీ వంటేమిటి చేస్తున్నావు?"

అన్నాను రేపు ఉప్మా చేస్తుంది అన్న వాగ్దానం దొరికిన ఆనందంతో నవ్వుతూ


"రామచంద్రా...టిఫిన్ ఇంకా తినడం కాలేదు...అప్పుడే మధ్యాహ్నం భోజనం గురించి , రేపటి టిఫిన్ గురించి ఆలోచన....ఇంక మొదలెట్టండి.. కోరికల చిట్టా విప్పండి"


"అరటికాయ అల్లం పచ్చి మిర్చి వేసి ఉప్మా కూర వండవోయి" అన్నాను అర్ధనీమీలనేత్రాలతో


"మీ ఉప్మా పిచ్చితో చచ్చిపోతున్నా బాబోయ్....అయినా ఈ హైదరాబాద్ లో దొరికే అరటికాయలు తో కూర చేస్తే ఎందుకో  బాగుండదు. ఎంత ఉడకబెట్టినా మంచిగా ఉడకవు, రాళ్ళల్లా ఉంటాయి. కూర తిన్నట్టే ఉండదు.  అదే మా బాపట్ల  ఇంట్లో అరటికాయల తో చేస్తే ఎంత కమ్మగా ఉండేదో కూర.... గెల లోంచి ఓ  రెండు కాయలు అప్పటికప్పుడు కోసి మా అమ్మ వండితే ఇంట్లో ఆరుగురు తృప్తిగా తిన్నా, ఇంకొంత మిగిలేది కూర...అంత పెద్దగా ఉండేవి కాయలు"ఎక్కడికో వెళ్ళిపోతోంది మా ఆవిడ


నేను కూడా ఆలస్యం చేయకుండా ఆవిడ కొంగు కొట్టుకుని ఆవిడ వెనకాలే వెనకటి రోజుల్లోకి అడుగులేస్తూ "అవును. నాకూ జ్ఞాపకమే. నాలిక మీదే ఉంది ఆ కూర రుచి. మీ బాపట్లలో ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర ,  ఎంత లేతగా ఉండేదో..దానితో మజ్జిగ పులుసు పెడితే...నా సామి రంగా...అద్భుతం అనుకో"అన్నాను పెదాలు తడుపుకుంటూ😋😋😋


"ఒక్క తోటకూర అనేమిటి అన్ని ఆకు కూరలు బాగుండేవి.  బచ్చలికూర ఎంత బాగుండేది?  మా అమ్మ వండిన  కంద బచ్చలి కూర మర్చిపోయారా?"


"ఎలా మరుస్తాను అనుకున్నావు..ఇంక ఎక్కడా దొరకని మీ బాపట్ల స్పెషల్ వంకాయల మాటేమిటి? అంత పెద్దగా ఉన్నా గుత్తి వంకాయ కూర వండితే లేహ్యంలా ఉడికేది కాదూ" లొట్టలు వేస్తూ అన్నాను


"మరే...మీకిష్టమని మా అమ్మ మీరున్నన్నాళ్లు అదే వండేది. మేము తినలేక విసుక్కునేవాళ్ళం"


"దంత సిరి లేనివాళ్ళే విసుక్కుంటారు"అన్నాను నవ్వుతూ


"ఇంకా నయం..ఎంత ఇష్టమైనా, రోజూ ఎక్కడ తినగలం ఆ వంకాయని"


"అందుకేగా..'వదిలేయమంటే మీకు బాగా ఇష్టమైన కూర వదలాలి...అంతే గానీ మీరు తిననివి కాదు' అని ఆ బ్రాహ్మడు గారు గయలో చెబితేనే గదా పెద్ద మనసు చేసుకుని వంకాయని త్యాగం చేసాను"అన్నాను గొప్పగా


"అదే చెబుతున్నా. వదిలేసిన  శాకాన్ని మళ్లీ మళ్లీ  తలుచుకోకూడదుట.

స్థితప్రజ్ఞత పాటించాలిట. లేకపోతే ఫలితం దక్కదుట. టీవీ లో ఎవరో చెబుతుంటే విన్నాను"


"అవును..నిజమే"అన్నాను అపరాధ భావంతో లెంపలు వేసుకుంటూ


"సరే  చప్పున చెప్పండి... ఏమి వండను?"


"నిజమే, నువ్వన్నట్లు ఇక్కడి  అరటి కాయలు బాగుండవు కనక, అవి క్యాన్సల్. పోనీ దొండకాయలు చీలికలు చేసి ఉల్లికారం వేసి కూర చేయి" అన్నాను 


"మీ తిండి గోలలో

పడి వారం, వర్జ్యం , తిథి కూడా మర్చిపోతున్నారు..ఇవాళ ఏకాదశి, 

పైగా శనివారం.. నో ఉల్లి నో వెల్లుల్లి"


"అదొకటి ఉంది గదా..మర్చిపోయా..పోనీ క్యాప్సికం చీలికలు చేసి సెనగపిండి కూరి గుత్తుల్లా చేసేస్తావేమిటి...బాగుంటుంది"

గుత్తుల కూరలంటే తెగ ఇష్టపడే నేను  అడిగాను గుటకలు వేస్తూ


"రామచంద్రా...గాస్ అని మొన్నంతా బాధ పడ్డారు...మళ్లీ సెనగపిండి తోనా...వద్దులెండి...మళ్లీ వారం చేసుకుందాము"


"అదీ నిజమే...మరి ఏం చేస్తానంటావు?"

అడిగాను బిక్క మొహం వేసి


"పోనీ బీరకాయ గుత్తులు వండనా... కొంచెం తక్కువ కారం వేసి?"


"బీరకాయా....వద్దులే నీళ్లొడుతూ ఉంటుంది కూర" అన్నాను మొహం అదోలా పెట్టి


"పోనీ బెండకాయలు వేయించనా?"


"బెండకాయ వేపుడు ఎప్పుడూ  వేడివేడిగా డిన్నర్ లోకి బాగుంటుంది...లంచ్ లోకి కాదు. ఇంకో మాట చెప్పు"


"లంచ్ కూర, డిన్నర్ కూర అని కూడా ఉందా?...చస్తున్నా బాబోయ్ మీ కోరికల తోటి..పోనీ కారట్, కొబ్బరి కోరు వేసి కూర చేయనా?"


"ఆబ్బే...పిల్లకాయలు తినే కూర అది...కేరట్ పైగా కొబ్బరి తోటి.. తియ్యగా ఉంటుంది..వద్దు"


"ప్రతీదానికి ఇలా వంక పెడితే కష్టం.. పక్కింటి లలితమ్మ గారి మొగుడు ఏమి వండినా మాట్లాడకుండా తింటాడుట. ఇలా కడుపుతో ఉన్నవాళ్ళల్లా సవా లక్ష కోరికలు కోరడుట" అంది కోపంగా


"హలో...ఆయనకి  అజీర్తి సమస్య. ఏమి తిన్నా   హరాయించుకోలేడు. అందుకే ఆవిడే చప్పటి పత్యం వంటలు వండుతుంది. ఆయన మాట్లాడకుండా తింటాడు. ఆవిడ  ఆ అసలు విషయం దాచేచి నా మొగుడిలా, నా మొగుడలా అంటూ గొప్పలు చెప్పుకుని ఉంటుంది నీ 

 దగ్గిర" అన్నాను అక్కసుగా


"ఆదా సంగతి...సర్లెండి. వాళ్ళ గొడవ మనకెందుకు గానీ, ఇంక ఫ్రిజ్ లో  మనకు నిషిద్ధాక్షరి అయిన వంకాయలు తప్ప ఏమీ లేవు..." అంటూ దీర్ఘం తీసింది


"మరి  మనం తినకూడనివి ఎందుకు కొన్నావు?" ఆడిగాను ఉక్రోషంగా


"బాగుంది ...వెనకటికి సామెత చెప్పినట్లు...మనం వదిలేస్తే ఇక ఇంట్లో ఎవరూ తినకూడదని రూలు ఉందా?

కొడుకు కోడలు మనవడు ఇష్టంగా తింటారు. మీ మనవడు అయితే రోజూ వంకాయ చేసినా తింటాడు"


"సరే...ఎదో నీ ఇష్టం వచ్చింది చేయి" అన్నాను నీరసంగా


"కమ్మగా బీరకాయ పత్యం కూర చేస్తాను 

నిమ్మకాయ పచ్చడి తీసి తాజాగా పోపు పెడతాను. వాము, జీలకర్ర, మెంతులు వేసి మెంతి మజ్జిగ పెడతాను. గ్యాస్ గీస్ పోతాయి. చక్కగా తిని పడుకోండి"అంది


"సరేలే...ఏంచేస్తాను.. నీ దయ..నా ప్రాప్తం..అలాగే కానీ"అన్నాను నీరసంగా.


చిట్టాలో ఇంకా చాలానే ఉన్నాయి


పనసపొట్టు కూర


కంద బచ్చలి


బంగాళదుంప ఉప్మా కూర....


వగైరా

కానీ ఏది చెప్పినా మొన్నటి సంగతి ఎత్తుతుందే....?


 సరే ఏమి చేస్తాము..ఒక నాలుగు రోజులు ఆగుదాము అనుకుంటూ  సోఫాలో వెనక్కి వాలి పేపర్ తీసాను.


😂😂😂😂😂😂


అందుచేత మిత్రులారా, పైన లిస్టులో చెప్పిన వంటకాలలో మీ కిష్టమైనవి వండుకునో, వండించుకునో తృప్తిగా కడుపు నిండా భోంచేసి హాయిగా  నిద్రపోండి.. ఎలాగూ బయటికి వెళ్లే పరిస్థితి లేదు మనకి...

😋😋😋😂😂😂


ఈ గంభీర వాతావరణం లో మనం పడుతున్న  టెన్షన్ లను పక్కన పడేసి సరదాగా కాసేపు మిమ్మల్ని నవ్విద్దామనే నా ఈ ప్రయత్నం. సఫలీకృతుడిని అయ్యానో లేదో మీరే చెప్పాలి...


సేకరణ: వాట్సాప్.

*కర్మ ఫలం

 🌷🙏*కర్మ ఫలం*🙏🌷


ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది..


ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆదుంగని కొట్టబోయాడు. వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది,అందులో ఉన్న అమ్మ.. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో..


అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని.. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నాకడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆబోయవాడిని కనికరించిందా! అని,పూజారి ఆ  గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో, పూజారి కళ్ళు పోయాయి. చూపు పోయింది.


అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను అని, నువ్వుఅనుకొని నువ్వు కూడా అదేపని చేయబోయావు. ఏమితెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి.. అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు, అని పలుమార్లు పూజారి వేడుకొనగా, అమ్మ  కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు,వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే, ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి..


బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడాలి.బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయారు.. అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆసంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.


మనకు ఏది కావాలో మనకు తెలీదు. 

మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చేవరకు వేచి చూడాల్సిందే.. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. 


దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతిపనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది అప్పుడు ఎంచక్క

ప్రతి క్షణం ఒకే స్థితి..ఆనందమే ఆనందం..ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు. 🙏

షణ్ముఖుడు-శుద్ధవాచాలత

             🌷🌷🌷

*షణ్ముఖుడు-శుద్ధవాచాలత ( పాత హాస్యకథ)* 


తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేదపాఠశాలలో మహోపాధ్యాయులు విద్యార్ధులను మౌఖికంగా పరిక్షిస్తున్నారు. 


మంచి బ్రహ్మవర్చస్సుతో కనిపించిన ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడిని పిలిచి.." ఏవోయ్! నచికేతుడెవరో చెప్పగలవూ?" అంటూ ముద్దుగా ప్రశ్నించారు. 


వెంఠనే ఆ పిల్లవాడు.." ఆర్యా! వాజశ్రవుడి కొడుకు వాడు. వాళ్ళ నాన్న విశ్వజితయజ్ఞం చేస్తూ... పనికిరాని ఆవుల్ని బ్రాహ్మణులకు దానంచేస్తుంటే... వీడు వెళ్ళి...."... అప్పటికే పిల్లవాడి ఉపనిషత్తు జ్ఞానానికి మురిసి ముక్కలవుతున్న పండితులవారు.. " ఆ చెప్పు నాయనా! వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నచికేతుడు హేవన్నాడూ? ".... అని అడిగారో లేదో వాడు......


.." బుద్ధీజ్ఞానం లేదా నాన్నా? అన్నం తింటున్నావా? గడ్డితింటున్నావా? ఈ వట్టిపోయిన ఆవుల్ని వీళ్ళనమొహానపడేస్తే...పాలా? పేడా?  వాళ్ళకు గడ్డిదండగ! యజ్ఞం చేస్తున్నావా? వట్టిఆవులు వదిలించుకుంటున్నావా? కళ్ళుపోయి గుడ్డిముండాకొడుకువి అయిపోగలవు.. ఇలాంటి వెధవపాపాలు చేస్తే! నువ్వు ముసలయ్యాకా నేనూ అదే పనిచేస్తే! ఆపుతావా లేక నువ్వు చేస్తున్నది నలుగురికీ చెప్పమంటావా?! "...... అంటూ... వీరావేశంతో..ఆ పిల్లవాడు ఇంకా చెప్పేవాడే.. ఈలోపునే గురువులు వాడి నోరుమూసేసి ఈడ్చుకుని పోయారు. 


మహోపాధ్యాయుల వారు కందగడ్డవంటి ముఖబింబంతో..." ఈ బాలుడు వాచాలుడు. వాగుడుకాయ! అత్యుత్సాహి! గెంటివేయుడు! "... అని టీసీ ఇచ్చేసి వాళ్ళూరు విశాపట్నం పంపేసారు. 


అన్నగారి పంచను తలచెడి చేరిన పిల్లాడితల్లి.." హేవిటన్నయ్యా ఈ ప్రారబ్దం?" అనగానే..


" ప్రారబ్దం కాదూ, ఆబ్దీకం కాదే చెల్లాయ్.. ఇదంతా ఆ ముత్తాతగారి వారసత్వం. ఆయన మహాపండితుడే! ఆరోజుల్లో తన పాండితీప్రకర్షతో రాజులను ఆకర్షించి..సరిగ్గా వాళ్ళతో గండపెండేరాలు తొడిగించుకునే సమయానికి...నాలికమీద సరస్వతి తొలిగిపోయి శనిమహాదేవుడు తిష్టవేసేవాడు. 


ఇక చూసుకో....ఆ మహారాజుల్ని.. ఆశీర్వదించడం మాని.. " వెధవల్లారా! బడుద్దాయిల్లారా! మీ దినం పెట్టా! ఇదిట్రా మీరు నాకు ఇచ్చేది. సన్మానాలేవి? సత్కారాలేవి? అగ్రహారాలేవి? అపరంజి పళ్ళాలేవి? మీ మొహాలుమండా!మీ మొహాలు  కుమ్మొంకాయలా పచ్చడయిపోనూ...చూస్తా! నువ్వూ నీవంశస్థులూ...వైతరణి ఎలా దాటతారో చూస్తా! !".... అంటూ వైనవైనాలుగా దూషణభాషణాలతో వారిని  ఎదురు సత్కరించి... ఉన్న అగ్రహారాలు కూడా ఊడగొట్టుకున్నాడు. 


విచిత్రంగా ఆయన నోరుపడేసుకున్న జమీందారు చక్రవర్తి అయ్యేవాడుష! ...మళ్ళీ ఆ వారసత్వం ఇదిగో ఈ వెధవాయికి వచ్చింది. ఎవడికి తప్పినా నాకు తప్పదు కదా వీడి బాధ్యత".... అంటూ నెత్తినేసుకున్నాడు ఆ మేనమావ , ప్రముఖ పౌరహిత్యబ్రహ్మ  రామశాస్త్రి గారు... తన దురాలాప ప్రేలాప ...మేనల్లుడు షణ్ముఖశాస్త్రిని! 


     ఇహ మా భాగ్యవశాత్తు ... మా ఇంటి సర్వకార్యాలకూ ఈ మామాఅల్లుళ్ళు రావలసిందే పుణ్యంతో పాటూ పురిషెడు వినోదం అందించాలిసిందే! 


ఒకేడు వినాయకచవితికి... తనకు మినిస్టర్ గారింట్లో పూజ ఉండడంతో తప్పనిసరయి... వందవార్నింగులిచ్చి షణ్ముఖుడిని పంపారు రామశాస్త్రిగారు! 


అసలే మా మావగారు పరమకోపిష్టి. అకారణంగానే అగ్నిహోత్రావధాని అవగలిగే అవలక్షణం మెండుగా ఉన్నవారు! పురోహితుడు చూస్తే షణ్ముఖుడు. మాకు ఆ గణపతే దిక్కని ఆశలు వదిలేసుకున్నాం పూజమీద. 


ఊహలు తారుమారుచేస్తూ ధ్యానావాహనాది షోడశోపచారాలతో, నీరాజన, మంత్రపుష్పాలతో మహాద్భుతంగా చేయించాడు పూజ! 


కధ వినడానికి ఉపక్రమించాం! శ్రీకృష్ణుడు, సాంబుడు, ధర్మరాజు వరకూ సవ్యంగానే సాగింది! ఇక " మన వినాయకుడు ఉండ్రాళ్ళు ఎక్కువగా తిని... ఆపసోపాలు పడుతూంటే … ఆయన పొట్టపగిలింది...అది చూసి చంద్రుడు నవ్వాడుట..."... ఆ ఘట్టం వచ్చేసరికి మన మర్కటశాస్త్రికి మెల్లగా తోక మొలవడం మొదలు పెట్టింది. అంతే కధ మారిపోయింది. 


వినాయకుడు:- అమ్మా ఈ బాబాయ్  చూడు ఎలా నవ్వుతున్నాడో. నువ్వు గాట్టిగా శపించు! 


పార్వతి:- ఏడవకు నా చిట్టినాన్నా. ఈరోజు నీ హేపీబడ్డే కూడా. నేను చెప్తాగా బాబాయ్ పని. ఏవండీ! మీ మెడలో ఓ పాము ఇలా విసరండి. ఇంట్లో దారం కనబడ్డం లేదు... పెద్దబాబు పొట్టకుట్టడానికి! 


వినా:- అమ్మా! బాబాయ్ మళ్ళీ నవ్వాడే! 


పా:- ఏవయ్యా మరిదీ! చంటిపిల్లాడిని అదియునూ వాని పుట్టినరోజున … చూసి నవ్వడానికి సిగ్గులేదూ! సిగ్గే ఉంటే నా ఇరవైయేడుగురు చెల్లెళ్లను ఎందుకు పెళ్ళి చేసుకుంటావులే! చేసుకున్నావే ఫో! ఆ రోహిణిని తప్పా మిగిలిన ఇరవై ఆరుగుర్నీ కాల్చుకుతిన్నావు! మళ్ళీ ఆ గురుపత్ని తారను చేరదీసావు! ఇన్ని వెధవ్వేషాలేస్తుంటే మానాన్న శాపమిస్తే మా ఆయన నెత్తినెక్కావు. మా ఇంట్లో తింటూ , మా నెత్తినుంటూ....నాబిడ్డ నంటావా! ఉండు నీ పని చెప్తా! ఓ మాంఛి శాపం పడేస్తే... నాకొడుకు కాళ్ళు పట్టుకుంటావ్! బాబూ గణేష్ ఏం శాపమిద్దాం నీ బడ్డే గిఫ్టుకింద బాబాయికీ...!.... అంటూ పార్వతి వినాయకుడిని అడిగింది! 


అప్పుడు గణేషు.....ఏమన్నాడంటే...”అంటూ శుద్ధ వాడుకభాషలోకి దిగిపోయాడో లేదో... సాంప్రదాయాలను వెంట్రుకవాసి తప్పినా ఒప్పుకోని మా మావగారు  ఆగ్రహోదగ్రులై షణ్ముఖుడిని ఆయనకున్న మూడోనాలుగో కన్నులు పెట్టి కాల్చేస్తున్నారు పళ్ళునూరుకుంటూ! 


బ్రహ్మహింసాపాతకం ఎక్కడ చుట్టుకుంటుందా అని మా అత్తగారు వణికిపోతూ...గణగణగణా గంట వాయించేసి... హారతి వెలిగించి...షణ్ముఖుడిని ఈలోకంలోకి తెచ్చి పూజ అయింది అనిపించారు. 


మేము మాత్రం  ...పడీపడీ నవ్వుకుని పొరపాటున చవితిచంద్రుడిని చూసేసాం ఆయేడు! 


ఆయేడే సహస్రచంద్రదర్శనం చేసుకోబోతున్న మా మావగారు.. ఇంట్లోజరిగిన ఈ చంద్రదూషణ వలన చంద్రుడు హర్టయ్యి ఆయన ఆరోగ్యాన్ని ఎక్కడ కెలుకుతాడా అని మహాభయపడిపోయారు. 


అయితే ఆయన దివ్యమైన ఆరోగ్యంతో తొంభై ఎనిమిదేళ్ళు చులాగ్గా లాగించేసి  వెళ్ళిపోయారు. అది అప్రస్థుతం! 


ఆ  సంఘటన తరువాత ఓ ఐదేళ్ళు షణ్ముఖుడిని  చూడలేదు మేము! సింహాచలంలో శ్రీ నరసింహశాస్త్రిగారు షణ్ముఖుడికి వేదం, స్మార్తం, జ్యోతిష్యశాస్త్రాలలో బాగా తర్ఫీదు ఇస్తున్నారని చెప్పారు అతని మేనమామ! 


మళ్ళీ అతన్ని చూసింది... నా స్నేహితురాలింట్లో... కొత్తగా పెళ్ళయిన తన కొడుకూ కోడలితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తూ! 


నన్ను చూస్తూనే.. చేస్తున్న పూజ ఆపేసి.." రండి! రండమ్మా! మా ప్లీడరుగారి మూడవకోడలుగారు! మహా దొడ్డయిల్లాలు!"... అంటూ నన్ను సర్టిఫై చేసి మరీ ఆహ్వానించాడు షణ్ముఖ. పాతరోజుల్లో మా మావగారు కోప్పడ్డవన్నీ మర్చిపోయిన అతని మనసులోని స్వచ్ఛతకు ముచ్చటేసింది నాకు! 


అంతలో పూజ మొదలుపెట్టాడు! ఆ పూజచేయిస్తున్న విధం, మంత్రోచ్ఛరణ చూస్తుంటే... ఇదివరకటి షణ్ముఖశాస్త్రి కాదని , గురువుగారు బాగా సాగదీసారని అర్ధమయ్యి పరమానందపడిపోయా! 


పూజానంతరం...అందరికీ అక్షింతలు పంచి వ్రతకధ మొదలుపెట్టాడు. మొదటి రెండు అధ్యాయాలూ సంస్కృతశ్లోక పూర్వకంగా చక్కగా చెప్పాడు. 


మూడవ, నాల్గవ, ఐదవ అధ్యాయాలు సాధువు అనే శ్రేష్టిగారి కధకదా. నా స్నేహితురాలు వైశ్యులు! వెంఠనే మన షణ్ముఖుడు.." సోరీ శ్రేష్టిగారూ! ఇలా కులాల పేర్లతో కధలు చెప్పాలంటే మహాఇబ్బంది సుమండీ. మీరూ వైశ్యులు. అయితే మాత్రం ధర్మప్రభువులు. అబ్బాయి పెళ్ళికి మా దక్షిణలే ఏభైవేల వరకూ ఇచ్చినవారు! ఈకధలో వర్తకశ్రేష్టుడు పొదుపరి! స్వామివారి వ్రతం వాయిదాలు వేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. మీముందు ఆకధ చెప్పాలంటే మొహమాటంగా ఉందంటే నమ్మండి"... అని అన్నాడో లేదో... నా కుడికన్ను అదరడం మొదలుపెట్టింది. 


అయితే నా మిత్రురాలి భర్త చక్కని క్రీడాస్ఫూర్తితో... " కానీయండి స్వామీ! " అని పర్మిషన్ ఇవ్వడమేంటి  విజృంభించేసాడు. కధలు వింటూ అందరూ నవ్వులే నవ్వులు. 


  " ఆగండాగండి! అసలు కధ మరోటుంది "..అన్నాడు... అప్పటికే అతని మెదడులో మరలు కాస్త వదులవుతున్నాయని నేను పసికట్టగలిగేను. ఆ కధ ఇలా సాగింది! 


తుంగధ్వజుడనే రాజు అడివికెళ్ళి, అక్కడ గోపాలకులిచ్చిన సత్యనారాయణస్వామి ప్రసాదాన్ని తీసుకోకుండా... " ఎంత ధైర్యంరా మీకు.ఈదేశాన్నేలే రాజుగారికే ప్రసాదం పెట్టేంత వాళ్ళయ్యారా మీరు? మర్యాదగా నా ఆవులు నాకప్పగించేసి ఫోండి. మీ ఉద్యోగాలు ఊడిపోయాయి! హయ్! " అని కసిరి ముందుకెళ్ళిపోతాడు. 


ఈ లోపున భటులొచ్చి.." రాజుగారూ! రాజుగారూ! మీ సహస్ర భార్యలంతా రోగంతో పోయారనగానే రాజు.." పోతే పోయారు ముసలిరాణులు. ఎప్పుడూ రోగాలే! నా సగం సంపద వీళ్ళ వైద్యాలకే సరిపోయింది! ఈసారి మాంచి పడుచురాకుమార్తెలను పెళ్ళాడతాను... "...అనుకుని ఆనందంగా సాగిపోతుంటే.." రాజా! మీ నూరుగురు కొడుకులూ సడన్ గా చనిపోయారు"... అంటూ మంత్రులు వచ్చారట! 


అప్పుడు రాజు..." పీడాపోయింది. వెధవలు నా సింహాసనం కోసం కొట్టుకు చస్తున్నారు! మళ్ళీ పిల్లలను కంటాను"... అంటూ తన రాజ్యం వేపుకు వెళ్తుంటే.." హే రాజన్! నీ రాజ్యం శత్రువుల పాలయ్యింది. నేనిప్పుడు వాళ్ళ సైన్యాధికారిని. మా గుర్రం మాకిచ్చేయ్"... అని సైన్యాధికారి తుంగధ్వజుడిని గుర్రం మీంచి లాగి తోసేయగానే... రాజుగారికి జ్ఞానోదయం అయ్యి... వెనక్కెళ్ళి గోపాలకులిచ్చిన దేవుడి  ప్రసాదం కళ్ళకద్దుకుని తినడంతో మళ్ళీ ఆయన పోగొట్టుకున్నవన్నీ ఆయనకు తిరిగొచ్చాయి...! " 


చూసారా మోష్ట్ పవర్ ఫుల్ గాడ్ శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామివారు. ఆయనతో పెట్టుకోకండి".... అంటున్న ...షణ్ముఖుడి వాక్ప్రవాహం కట్టలుతెంచుకుంటోందని గ్రహించి….. నేనే పూనుకుని...గబగబా…గణగణమని గంట వాయించేసి కుర్రాడిని ఇహలోకంలోకి తెచ్చాను! 


           ఇలా అన్నిచోట్ల...వానరవాలం బయటపెట్టుకుని... పానకంలో పుడకపడ్డట్టు...చక్కని పాండిత్యమున్నా... తన అస్థవ్యస్థ కధాప్రవచనాలతో...అన్ పాప్యులర్ అయిపోయాడు షణ్ముఖశాస్త్రి. 


ఈ మధ్యలో మేనమావ కూతురితో పెళ్ళికూడా అయ్యింది! ఒకసారి మా అమ్మాయి పెళ్ళిముహుర్తాలు పెట్టించుకోడానికి రామశాస్త్రిగారితో పనిపడి వారింటికి వెళ్ళా! వీధివీధంతా... ఖరీదయిన కారులబారు! వారిల్లుకూడా రీమోడల్ చెయ్యబడి రిచ్చుగా కనపడుతోంది. 


ఇంటిముందు... "దీర్ఘదర్శి- దూరదర్శి- జ్యోతిష్యప్రబుద్ధ -విద్వాన్ శ్రీషణ్ముఖశాస్త్రి అని పెద్దబోర్డ్ ఉంది. ఇంట్లోకి అడుగుపెట్టబోతుంటే లోపల్నుండి పెద్దపెద్ద అరుపులు వినిపిస్తున్నాయి.


 " హేవిటీ! నువ్వు సూపర్నెంట్ అవ్వాలా? మొహం చూడూ ఎలా ఉందో!మలేరియాదోమలు కుట్టి ఫైలేరియా వచ్చినదానిలా!  ఏరోజయినా వైద్యం చేసిన మొహవేనా అది! నీలాంటి లంచగొండి సూపర్నెంట్ అయితే ఆస్పత్రి గతి అధోగతే! ముందు ఇండీషన్ చెయ్యడం నేర్చుకో! ఆనక సూపరెంటు అవ్వచ్చు! " ...


ఆ అరుపులకు జవాబుగా... " చిత్తం స్వామీ! మీదయ! మీరెంత తిడితే అంత ఆనందం నాకు! మరికాస్త తీవ్రంగా తిట్టచ్చు కదా ఈ దీనుడిని".... అంటూ గోముగా వేడుకున్న... ఒకాయన బ్రహ్మానందంతో బయటకొచ్చి బెంజ్ కారు ఎక్కి చక్కాపోయాడు! 


ఈసారి మరెవరినో…మరింత తీవ్రస్థాయిలో దుర్భాషలు వినిపిస్తున్నాయి. ఎవరో రాజకీయనాయకుడనుకుంటా! కాసేపట్లో…ఆయన పరమానందంగా బయటకొచ్చి... వేచివున్న తన అనుచరగణాలతో... " స్వామివారు పిచ్చబూతులు తిట్టారు. ఎంఎల్యే ఏం ఖర్మ...ఇహ  మినిస్టర్ నే అయిపోతాను! ".... అనుకుంటూ కండువా సవరించుకుంటూ ఊరేగింపుగా సాగిపోయాడు.


 " ఎవరీ స్వామి! ఏంటి కధాకమామీషు "..అనుకుని లోపలికి వెళ్ళా! మన షణ్ముఖుడే! " ఏవిటండీ ఇదంతా"... అన్నానో లేదో.."


 నా ప్రారబ్దం ఉమాదేవిగారూ! వాక్శుద్ధి అబ్బిందట. రెండేళ్ళ క్రితం ఒకపెద్దాయన కాస్త విసికిస్తే... నీ దినంపెట్టా! నీ పిండాకూడు! అని నోరుపారేసుకున్నా. ఎక్కడో అడివిలో మందుపాతర పేలి అందరూ చచ్చి ఈయన బయటపడ్డాడు. మినిస్టరయ్యి... నాకాళ్ళ మీద పడ్డాడు! ఇదిగో అప్పటినుండి ఈ పాపభూయిష్ట చరిత్రులంతా నామీద పడ్డారు. 


విద్య ప్రసాదించిన అమ్మవారు నాలుకకి తేలుకొండి తగిలించింది. ఇప్పుడు నా మాట కాటుకు ఈ పాతకులంతా పావనులవుతున్నారు! ఐ యాం నాటెటాల్ హేపీ ఉమాదేవిగారూ! మరికాస్త ధనం సంపాదించుకుని నార్త్ ఇండియా మైగ్రేట్ అయిపోదామనుకుంటున్నా!మనమేం తిట్టినా ఆ కుంకలకు తెలీదు! పైగా  హిందీలో పెద్దగా తిట్లుకూడా రావుగా మనకు"! .... అంటూ అమాయకంగా...కొంత నవ్వు, కొంత విషాదం కలిపి చెప్తున్న ఆ షణ్ముఖుడు నాకెప్పుడూ ఇష్టుడే! 


తన ప్రమేయం లేకుండానే... బుర్రకంట్రోల్ తప్పి..తను నమ్మిన నిజాలను హాస్యం మేళవించి... తన ధోరణిలో...చెప్తూ..నవ్వించే అతనికి ఎక్కడో అక్కడ నిజమైన మనశ్శాంతి, అతని వైదుష్యానికి తగిన మన్నన దొరకాలి... అని ప్రార్ధించుకున్నా మనసులో!  


ధన్యవాదాలతో! 


*శశికళ ఓలేటి* 


..🙏🙏స్వీయ అనుభవాల ఆధారంగా రాసినది. కల్పితం కాదు.