🌹🌹🌹🌷🌷🌹🌹🌹
నాకు నచ్చిన ఓ వాట్సాప్ సందేశం.
🌷🌷🌷
"టిఫిన్ తినండి" అంటూ మా ఆవిడ అందించిన ప్లేట్ లోకి ఉప్మా యేమో అని ఆశగా తొంగి చూస్తే తెల్లటి నాలుగు ఇడ్లీ లు కనపడ్డాయి.
ఉస్సురంటూ "ఉప్మా చేయలేకపోయావా" అన్నాను ప్లేట్ అందుకుంటూ
"మొన్నంతా కడుపు గాభరాగా ఉందని, పడుతూ లేస్తూ ఆపసోపాలు పడ్డారనిన్ను, తేలికగా అరుగుతాయనిన్ను, ఇడ్లీ చేసాను" అంది శంకరాభరణం లో అల్లు గారిలాగ.
"అబ్బే...గ్యాస్ ప్రాబ్లెమ్ ...అంతే... ఆ సాయంకాలానికే సెట్ అయిపోయింది కదా"అన్నాను ఇడ్లీ తుంచి అల్లప్పచ్చడి లో అద్దుకుంటూ
"వెధవ ఉప్మా కి ఏముంది...రేపు చేస్తాను లెండి. ఇవాళ్టికి ఇవి కానీండి"
"అయ్యో... ఉప్మా ని ఎంత మాట అనేశావ్.. వెధవఉప్మా నా?? లెంపలు వేసుకో.
ఇంత అల్లం పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి జారుగా బొంబాయి రవ్వతో మంచి ఉప్మానే చేయి..
ఇంతకీ వంటేమిటి చేస్తున్నావు?"
అన్నాను రేపు ఉప్మా చేస్తుంది అన్న వాగ్దానం దొరికిన ఆనందంతో నవ్వుతూ
"రామచంద్రా...టిఫిన్ ఇంకా తినడం కాలేదు...అప్పుడే మధ్యాహ్నం భోజనం గురించి , రేపటి టిఫిన్ గురించి ఆలోచన....ఇంక మొదలెట్టండి.. కోరికల చిట్టా విప్పండి"
"అరటికాయ అల్లం పచ్చి మిర్చి వేసి ఉప్మా కూర వండవోయి" అన్నాను అర్ధనీమీలనేత్రాలతో
"మీ ఉప్మా పిచ్చితో చచ్చిపోతున్నా బాబోయ్....అయినా ఈ హైదరాబాద్ లో దొరికే అరటికాయలు తో కూర చేస్తే ఎందుకో బాగుండదు. ఎంత ఉడకబెట్టినా మంచిగా ఉడకవు, రాళ్ళల్లా ఉంటాయి. కూర తిన్నట్టే ఉండదు. అదే మా బాపట్ల ఇంట్లో అరటికాయల తో చేస్తే ఎంత కమ్మగా ఉండేదో కూర.... గెల లోంచి ఓ రెండు కాయలు అప్పటికప్పుడు కోసి మా అమ్మ వండితే ఇంట్లో ఆరుగురు తృప్తిగా తిన్నా, ఇంకొంత మిగిలేది కూర...అంత పెద్దగా ఉండేవి కాయలు"ఎక్కడికో వెళ్ళిపోతోంది మా ఆవిడ
నేను కూడా ఆలస్యం చేయకుండా ఆవిడ కొంగు కొట్టుకుని ఆవిడ వెనకాలే వెనకటి రోజుల్లోకి అడుగులేస్తూ "అవును. నాకూ జ్ఞాపకమే. నాలిక మీదే ఉంది ఆ కూర రుచి. మీ బాపట్లలో ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర , ఎంత లేతగా ఉండేదో..దానితో మజ్జిగ పులుసు పెడితే...నా సామి రంగా...అద్భుతం అనుకో"అన్నాను పెదాలు తడుపుకుంటూ😋😋😋
"ఒక్క తోటకూర అనేమిటి అన్ని ఆకు కూరలు బాగుండేవి. బచ్చలికూర ఎంత బాగుండేది? మా అమ్మ వండిన కంద బచ్చలి కూర మర్చిపోయారా?"
"ఎలా మరుస్తాను అనుకున్నావు..ఇంక ఎక్కడా దొరకని మీ బాపట్ల స్పెషల్ వంకాయల మాటేమిటి? అంత పెద్దగా ఉన్నా గుత్తి వంకాయ కూర వండితే లేహ్యంలా ఉడికేది కాదూ" లొట్టలు వేస్తూ అన్నాను
"మరే...మీకిష్టమని మా అమ్మ మీరున్నన్నాళ్లు అదే వండేది. మేము తినలేక విసుక్కునేవాళ్ళం"
"దంత సిరి లేనివాళ్ళే విసుక్కుంటారు"అన్నాను నవ్వుతూ
"ఇంకా నయం..ఎంత ఇష్టమైనా, రోజూ ఎక్కడ తినగలం ఆ వంకాయని"
"అందుకేగా..'వదిలేయమంటే మీకు బాగా ఇష్టమైన కూర వదలాలి...అంతే గానీ మీరు తిననివి కాదు' అని ఆ బ్రాహ్మడు గారు గయలో చెబితేనే గదా పెద్ద మనసు చేసుకుని వంకాయని త్యాగం చేసాను"అన్నాను గొప్పగా
"అదే చెబుతున్నా. వదిలేసిన శాకాన్ని మళ్లీ మళ్లీ తలుచుకోకూడదుట.
స్థితప్రజ్ఞత పాటించాలిట. లేకపోతే ఫలితం దక్కదుట. టీవీ లో ఎవరో చెబుతుంటే విన్నాను"
"అవును..నిజమే"అన్నాను అపరాధ భావంతో లెంపలు వేసుకుంటూ
"సరే చప్పున చెప్పండి... ఏమి వండను?"
"నిజమే, నువ్వన్నట్లు ఇక్కడి అరటి కాయలు బాగుండవు కనక, అవి క్యాన్సల్. పోనీ దొండకాయలు చీలికలు చేసి ఉల్లికారం వేసి కూర చేయి" అన్నాను
"మీ తిండి గోలలో
పడి వారం, వర్జ్యం , తిథి కూడా మర్చిపోతున్నారు..ఇవాళ ఏకాదశి,
పైగా శనివారం.. నో ఉల్లి నో వెల్లుల్లి"
"అదొకటి ఉంది గదా..మర్చిపోయా..పోనీ క్యాప్సికం చీలికలు చేసి సెనగపిండి కూరి గుత్తుల్లా చేసేస్తావేమిటి...బాగుంటుంది"
గుత్తుల కూరలంటే తెగ ఇష్టపడే నేను అడిగాను గుటకలు వేస్తూ
"రామచంద్రా...గాస్ అని మొన్నంతా బాధ పడ్డారు...మళ్లీ సెనగపిండి తోనా...వద్దులెండి...మళ్లీ వారం చేసుకుందాము"
"అదీ నిజమే...మరి ఏం చేస్తానంటావు?"
అడిగాను బిక్క మొహం వేసి
"పోనీ బీరకాయ గుత్తులు వండనా... కొంచెం తక్కువ కారం వేసి?"
"బీరకాయా....వద్దులే నీళ్లొడుతూ ఉంటుంది కూర" అన్నాను మొహం అదోలా పెట్టి
"పోనీ బెండకాయలు వేయించనా?"
"బెండకాయ వేపుడు ఎప్పుడూ వేడివేడిగా డిన్నర్ లోకి బాగుంటుంది...లంచ్ లోకి కాదు. ఇంకో మాట చెప్పు"
"లంచ్ కూర, డిన్నర్ కూర అని కూడా ఉందా?...చస్తున్నా బాబోయ్ మీ కోరికల తోటి..పోనీ కారట్, కొబ్బరి కోరు వేసి కూర చేయనా?"
"ఆబ్బే...పిల్లకాయలు తినే కూర అది...కేరట్ పైగా కొబ్బరి తోటి.. తియ్యగా ఉంటుంది..వద్దు"
"ప్రతీదానికి ఇలా వంక పెడితే కష్టం.. పక్కింటి లలితమ్మ గారి మొగుడు ఏమి వండినా మాట్లాడకుండా తింటాడుట. ఇలా కడుపుతో ఉన్నవాళ్ళల్లా సవా లక్ష కోరికలు కోరడుట" అంది కోపంగా
"హలో...ఆయనకి అజీర్తి సమస్య. ఏమి తిన్నా హరాయించుకోలేడు. అందుకే ఆవిడే చప్పటి పత్యం వంటలు వండుతుంది. ఆయన మాట్లాడకుండా తింటాడు. ఆవిడ ఆ అసలు విషయం దాచేచి నా మొగుడిలా, నా మొగుడలా అంటూ గొప్పలు చెప్పుకుని ఉంటుంది నీ
దగ్గిర" అన్నాను అక్కసుగా
"ఆదా సంగతి...సర్లెండి. వాళ్ళ గొడవ మనకెందుకు గానీ, ఇంక ఫ్రిజ్ లో మనకు నిషిద్ధాక్షరి అయిన వంకాయలు తప్ప ఏమీ లేవు..." అంటూ దీర్ఘం తీసింది
"మరి మనం తినకూడనివి ఎందుకు కొన్నావు?" ఆడిగాను ఉక్రోషంగా
"బాగుంది ...వెనకటికి సామెత చెప్పినట్లు...మనం వదిలేస్తే ఇక ఇంట్లో ఎవరూ తినకూడదని రూలు ఉందా?
కొడుకు కోడలు మనవడు ఇష్టంగా తింటారు. మీ మనవడు అయితే రోజూ వంకాయ చేసినా తింటాడు"
"సరే...ఎదో నీ ఇష్టం వచ్చింది చేయి" అన్నాను నీరసంగా
"కమ్మగా బీరకాయ పత్యం కూర చేస్తాను
నిమ్మకాయ పచ్చడి తీసి తాజాగా పోపు పెడతాను. వాము, జీలకర్ర, మెంతులు వేసి మెంతి మజ్జిగ పెడతాను. గ్యాస్ గీస్ పోతాయి. చక్కగా తిని పడుకోండి"అంది
"సరేలే...ఏంచేస్తాను.. నీ దయ..నా ప్రాప్తం..అలాగే కానీ"అన్నాను నీరసంగా.
చిట్టాలో ఇంకా చాలానే ఉన్నాయి
పనసపొట్టు కూర
కంద బచ్చలి
బంగాళదుంప ఉప్మా కూర....
వగైరా
కానీ ఏది చెప్పినా మొన్నటి సంగతి ఎత్తుతుందే....?
సరే ఏమి చేస్తాము..ఒక నాలుగు రోజులు ఆగుదాము అనుకుంటూ సోఫాలో వెనక్కి వాలి పేపర్ తీసాను.
😂😂😂😂😂😂
అందుచేత మిత్రులారా, పైన లిస్టులో చెప్పిన వంటకాలలో మీ కిష్టమైనవి వండుకునో, వండించుకునో తృప్తిగా కడుపు నిండా భోంచేసి హాయిగా నిద్రపోండి.. ఎలాగూ బయటికి వెళ్లే పరిస్థితి లేదు మనకి...
😋😋😋😂😂😂
ఈ గంభీర వాతావరణం లో మనం పడుతున్న టెన్షన్ లను పక్కన పడేసి సరదాగా కాసేపు మిమ్మల్ని నవ్విద్దామనే నా ఈ ప్రయత్నం. సఫలీకృతుడిని అయ్యానో లేదో మీరే చెప్పాలి...
సేకరణ: వాట్సాప్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి