5, మార్చి 2022, శనివారం

ఆవు-పులి

 🌸🌸🌸🌸🌸🌸🌸

ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.


ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.


దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.


అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.


ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.


కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది, 

" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,


నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..

అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.


అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.


అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, 


"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.


ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.


ఈ కథలో...


 *ఆవు* -  సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.


 *పులి* -  అహంకారం నిండిఉన్న మనస్సు.


 *యజమాని* - సద్గురువు/పరమాత్మ.


 *బురదగుంట* - ఈ సంసారం/ప్రపంచం


మరియు,


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.


 *నీతి :* 


ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,


" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.


 దీనినే ' *అహంకారము* ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.


ఈ జగత్తులో *'సద్గురువు'*(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.


ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.


పరమాత్మా నీవే ఉన్నావు...!

అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!

T నవ గోప్యాలు

 నవ గోప్యాలు

1 ఆయువు,


2 విత్తము,


3 ఇంటిగుట్టు,


4 మంత్రం,


5 ఔషధం,


6 సంగమం,


7 దానం,


8 మానము,


9 అవమానం


  అనే ఈ తొమ్మి దింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచా ల్సినవి.


  భగవంతుడు మనిషితో పాటు జీవులన్నిటికీ శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.


 1 ఆయువు :- రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. జరిగేది జరగకమానదు అని వివేకంతో ఆలోచిస్తాడు కాబట్టి మనిషి నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి ఆయుః ప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు.


 2 ధనం ( విత్తం) :- ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగా రంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం.


  అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగు తుంది.


 3 ఇంటి గుట్టు:- ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్నే ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమపూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని.


 సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.


4 మంత్రం:- ‘మననం చేసేది మంత్రం’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.


5 ఔషధం:- ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరిస్తే ఎవ్వరంటేవారు తయారుచేస్తారు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.


6 సంగమం:- సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.


7 దానం:- దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.


 8 శీలం ( మానం ):- మానం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.


9 అవమానం :- తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవ మానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగు తుంది. దాంతో పగ.. ప్రతీకారాలు.. ఇక వాటికి అంతనేది ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. 


 ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధను మనం తప్పక ఆచరించాలి.

స్వస్తి🙏🙏🙏🙏

కూరగాయల మనోభావాలు..*

 *కూరగాయల మనోభావాలు..* 


*గోంగూరకి* ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...

*పొట్లకాయకి* పొగరు ఎక్కువ.. 

ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....

*చిక్కుడుకు* చికాకు ఎక్కువ.. 

ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....

*కందకి*..వెటకారం ఎక్కువ..

ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....

*వంకాయకి* గర్వమెక్కువ ..

కూరగాయలన్నింటికీ తనే రారాజునని....

*బెండకాయకి* ఆనందమెక్కువ..

తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....

*దొండకాయకి* ఆందోళనెక్కువ.. 

కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....

*కాకరకాయకి* శాంతమెక్కువ.. 

ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....

*బంగాళాదుంపకి* సహనమెక్కువ..

కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....

*గుమ్మడికాయకి* గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....

*ఉల్లిపాయకి* టెక్కు ఎక్కున..

తానులేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....

*మిర్చికి* కోపమెక్కువ..

ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....

*కరివేపాకుకి* మిడిసిపాటు ఎక్కువ..

తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....

*బీరకాయకి* దిగులెక్కువ..

తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....

*కారెట్ కి బీట్ రూట్ కి* హంగామా ఎక్కువ..

తమంతటి రంగు ఎవరికీ లేదని....!

కమ్మని కవితల

 భీమవరం

-------------

శ్రీతుమ్మిడి నాగభూషణంగారు

------------ ------------------------

కమ్మని కవితల ఋక్కుల

తుమ్మిడి'నానీ'లపొల్చు తోరపుచుక్కల్

నెమ్మెయి మోదకణంబులె

నెమ్మదినెమ్మదిగారాల్చునేర్పులస్రక్కుల్.


గీ" వృత్తివాణిజ్యశాఖ ప్రవృత్తివాణి

     పదసమారాధనానందభాగ్యలబ్ధి

     బుర్రకథచెప్పుజనమె ప్రమోదమొంద

     ఏకపాత్రాభినయమున సోకుగూర్చు

గీ" నాటికలపాత్రధారణానయము, హాస్య

     భాషణాచతురతయు ,సద్వేషధారి

     ఆటగద'నుసోమేశముక్తావళియును

      స్పందన'కవితాలతలునువంద్యములగు

గీ" పెక్కుహైకూల్ సమీక్షలు చొక్కజేయు

      భీమవర పురాత్మజులలోపేరుగలుగు

      మాన్యులౌనాగభూషణుల్మాపురంబు

      భూషణంబు,తుమ్మిడివంశభూషణంబు.


రాయప్రోలు సీతారామశర్మ భీమవరం .

సుగుణాలు

 శ్లోకం:☝️

 *గుణో న లోకాస్తుతిమూలకారణం*

*ధనం కులం వస్త్రమపీహ పూరణం l*

 *పురాంతరే వీక్ష్య సువస్త్రధారణం*

*స్తుతే జనో నాత్ర గుణావధారణం ll*


భావం: వ్యక్తి యొక్క సుగుణాలు చూసి లోకం గౌరవించదు. వాని ఐశ్వర్యము, వంశము లేక కనీసం ధరించిన వస్త్రాలను చూసి మాత్రమే గౌరవిస్తుందిట. అదే వేరే ఊరు వెళితే కనిపించని గుణాలకన్నా, మంచి వస్త్రాల వల్ల మాత్రమే గౌరవం లభిస్తుందిట! గౌరవించబడాలంటే ఉండాల్సిన ఐదు 'వ' కారాలలో మొదటిది మంచి వస్త్రమే అని ఈ క్రింది శ్లోకం చెబుతున్నది...

_వస్త్రేణ వపుషా వాచా_

   _విద్యయా వినయేన చ l_

_వ కారైః పంచభిర్యుక్తః_

   _నరో భవతి పండితః ll_

మీ పుణ్యాన్ని

 కాశీ పట్టణం లో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.


అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.


 ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.


 పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి 

వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును 

అని సలహా ఇస్తుంది.


 బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధ

పడక తప్పలేదు.


 దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.


   అతను నడుచుకుంటు అడవిలోనుండి పోయేవేళ

ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.

 

బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.


 కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.


 బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.


  బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.

 

 అప్పుడు సేఠ్ నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అని అంటాడు.


 మధ్యాహ్నం సేఠ్ ఇంటికి భోజనానికి వెళ్లి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా

అడుగుతాడు.


 సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.


కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యం ను

బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.


 సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు.

 

ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనకొంటున్నాను.


 బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు. నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా

అని.


 ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకూ ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు అదే యజ్ఞం అని సేఠ్ అంటాడు.  


నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని

అనుకొంటున్నాను అని అంటాడు.


 బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.  


దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం 

జరిగిపోతాయి.


 నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.

  

రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. 


త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.  


రెండవ సంచీ ఉంచిన కూడ కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి సేఠ్ తన దగ్గర 

వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు 

ఆశ్చర్య పోతారు.

 

అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను." ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు. 


 ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి,

 దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.


 ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడుగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి

అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.


 ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటం తో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.


 బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది.


 మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి 


 వజ్రాలు, నగలా ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు బ్రాహ్మణుడు.

 

భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే

అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.


 అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.

 

విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.

 

ఇదీ కథ. 

నిజానికి ఇది కథ కాదు. జీవితం. 

ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు. 

అలాగే పాపాన్ని కూడా ఎవరూ దొంగలించలేరు.పాప పుణ్యాల లెఖ్ఖ మీదే.

భగవద్గీత

 🌹భగవద్గీత🌹


పదకొండవ అధ్యాయము

విశ్వరూపదర్శన యోగము 

నుంచి 50 వ శ్లోకము


          సంజయ ఉవాచ 


ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా

స్వకం రూపం దర్శయామాస భూయః ౹

ఆశ్వాసయామాస చ భీతమేనం

భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ౹(5౦)


ఇతి , అర్జునమ్ , వాసుదేవః , ష్క్తథా , ఉక్త్వా ,

స్వకమ్ , రూపమ్ , దర్శయామాస , భూయః ౹

ఆశ్వాసయామాస , చ , భీతమ్ , ఏనమ్ ,

భూత్వా , పునః , సౌమ్యవపుః , మహాత్మా ౹౹(50)


వాసుదేవః = వాసుదేవుడు (శ్రీకృష్ణుడు) 

అర్జునమ్ = అర్జునుని గూర్చి (అర్జునునితో) 

ఇతి , ఉక్త్వా = ఈ విధముగా పలికి 

భూయః = అనంతరము 

తథా = అదేవిధముగా 

స్వకమ్ , రూపమ్ = తన చతుర్భుజరూపమును 

దర్శయామాస = దర్శింపజేసెను 

చ = మఱియు 

పునః = తర్వాత 

మహాత్మా = మహాత్ముడైన శ్రీకృష్ణుడు 

సౌమ్యవపుః , భూత్వా = సౌమ్య స్వరూపుడై (ప్రసన్నమైన తన కృష్ణరూపమును దాల్చి) 

భీతమ్ , ఏనమ్ = భయపడుచున్న ఈ అర్జునుని 

ఆశ్వాసయామాస =ఓదార్చెను 


తాత్పర్యము:- సంజయుడు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకుతన చతుర్భుజరూపమున దర్శనమిచ్చెను. అనంతరం శ్రీకృష్ణ రమాత్మ సౌమ్యమూర్తియై తన కృష్ణరూపమును స్వీకరించి, భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. (50)

    

          అందరికీ శుభ శుభోదయం

              Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

రసాదిదోషాలు

 శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ - 


 * రసం దోషం పొందిన కలుగు వ్యాధులు - 


    అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం , శరీరం నొప్పులు , జ్వరం, గుండెపీకుట , వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం , శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు , పాండురోగం , శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును.


 * రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


     కుష్టు , విసర్ప, పిడక ,మశక ,నీలిక , తిలకాలకా, నశ్చ , వ్యంగ అను చర్మవ్యాధులు , పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు , విద్రది అను వ్రణం , గుల్మవాతం, శోణిత, క్యాన్సర్ , రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును.


 * మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


     ఆసనము , నోరు , నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు , కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు , గలగండిక ( టాన్సిల్స్ ) , పెదవులు పుండ్లు పడుట, గొంతు చుట్టూ కణుతులు వచ్చుట, గొంతు వాచుట మొదలైన వ్యాధులు సంభంవించును.


 * మేథస్సు అనగా కొవ్వు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


     శరీరంపై గ్రంథులు లేచుట , అండవృద్ధి, గొంతు వ్రణాలు , క్యాన్సర్ , మధుమేహం , శరీరం లావెక్కుట , అధికమైన చెమట మొదలయిన రోగాలు సంభంవించును.


 * ఎముకలు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


      ఎముకపై ఎముక పెరుగుట, దంతముల పై దంతము పెరుగుట, ఎముకలపై సూదులతో పొడిచినట్లు అగుట, పిప్పిగొళ్ళు మొలుచుట మెదలైనవి ఎముకలలో దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 


 * మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


        అజ్ఞానము కలుగుట, మూర్చ వచ్చుట, శరీరం తిరిగినట్లు అనిపించటం, జాయింట్లలో వాపులు , బాధ కలుగుట, కళ్ళకలక మొదలైనవి శరీరంలో మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 


 * శుక్రం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు - 


       నపుంసకత్వం ,సంతోషం లేకపోవటం , రోగంతో ఉన్న నపుంసకునకు అల్ప ఆయుర్దాయం , వికృత రూపం కలిగిన సంతానం కలుగుట, గర్భస్రావం మెదలైనవి శరీరంలో శుక్రం దోషం పొందుట వలన కలుగును.


 * మలము దొషం పొందట వలన కలుగు వ్యాధులు - 


       మలము వెలువరించుటకు అవరోధం కలుగుట, లేదా అధికంగా వెలువడుట, సకాలంలో విరేచనం అవ్వకపోవుట, కడుపులో వికారాలు, చర్మవ్యాదులు సంభవించుట జరుగును.


        పైన చెప్పిన విధముగా ఆయా శరీరంలోని ముఖ్య భాగాలకు దోషాలు సంభవించినప్పుడు అయా వ్యాధులు కలుగును.


    

     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034