*ఇంటింటా శ్రీరామాయణ*
*దివ్యకథా పారాయణం*
*9 వ రోజు*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం*
శ్రీ సీతా లక్ష్మ ణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజలు సంబరాలలో మునిగితేలుతున్నారు.
శ్రీరామ పట్టాభిషేకానికి సుముహూర్తం నిశ్చయమయ్యింది. సుగ్రీవాజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు సుషేణుడు, గవయుడు, నలుడు నదీనద సముద్ర జలాలు తెచ్చారు. వసిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతారాములను రత్న సింహాసనంపై కూర్చుండబెట్టారు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, తరువాత ఋత్విక్కులు, బ్రాహ్మ ణులు, కన్యలు, యోధులు వారిని పుణ్యనదీ జలాలతో అభిషేకించారు. వారితోబాటే లోకపాలకులు, దేవతలు శ్రీరామచంద్రుడిని అభిషేకించారు. వాయుదేవుడు స్వయంగా బంగారు తామరపూల మాలికను రాముని మెడలో వేశాడు. వేద వేత్తలు మంత్ర పఠనం సాగిస్తున్నారు. శ్రీ సీతారామచంద్రమూర్తి కీ జై అంటూ జనం జేజేలు పలుకుతుండగా,రత్న కిరీటాన్ని వశిష్ఠులవారు రాముడి శిరస్సుపై అలంకరింప చేశారు .
దేవతలు పుష్ప వర్షం కురిపించారు. రాముడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది మహావీరులకు అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.
శ్రీరాముడు సీతకు నవరత్నాలూ పొదిగిన ఒక ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత ,శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ,ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. రాముని వద్ద సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.
యువరాజుగా ఉండమని రాముడు,లక్ష్మణుడిని కోరాడు. లక్ష్మణుడు అందుకు సమ్మతించలేదు. భరతునకు యువరాజ్యాభిషేకం చేశాడు రాముడు. తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా రాముడు జనమనోభిరాముడై రాజ్యపాలన చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు.
ప్రజలు ధర్మపరాయణులై ఉండేవారు. ఎవరి నోట విన్నా రామ, రామ , రామ అన్న మాట తప్ప మరో మాట లేదు.
******
*ఉత్తర కాండ*
******
శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా, గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే రాముడు బాధపడతాడు.
*సీత గురించిన నింద*
ఒక రోజు రాముడు తన పరిపాలన ఎలా సాగుతున్నదో తెలుసుకోవడానికసన్నిహితుడైన భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలూ లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరాక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతమ్మను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు. రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు. రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. జనం తమ తప్పు తెలుసుకునే వరకు , ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడడం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు ముని ఆశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు.
*సీతమ్మను*
*ముని ఆశ్రమాలవద్ద*
*వదిలిన లక్ష్మణుడు*
రాముడి ఆదేశం మేరకు, లక్ష్మణుడు మారుమాటాడక ఉదయాన్నే రథం సిద్ధం చేసి సీతమ్మవారిని ముని ఆశ్రమాల వద్ద వదలి వస్తాడు.ముని బాలకుల ద్వారా ఈసంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. అని పలికాడు. అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవ కుశలనే పేరుతో దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.
*అశ్వమేథయాగం*
రాముడు అశ్వమేథయాగం తలపెట్టాడు. ఆ యాగ సమయంలోనే సీతామాత పాతివ్రత్యాన్ని సామాన్యులకు తెలియజేయాలని వాల్మీకి మహర్షి నిర్ణయించుకుని అక్కడకు శిష్యసమేతంగా విచ్చేసాడు. వాల్మీకి లవకుశలను కూర్చోపెట్టుకొని" చిరంజీవులారా! మీకు నేర్పిన రామాయణాన్ని రాజమార్గాల్లోనూ, ముని వాసాల్లోనూ, యజ్ఞవాటిక దగ్గర రాముని మందర శ్రావ్యంగా, శ్రుతి బద్ధంగా మధురంగా ఆలపించండి అని చెప్పాడు. వారు రామాయణ గానం చేశారు. రాముడు కూడా విని ఆనందించాడు. మరునాడు సభకు చేరిన వాల్మీకి, సీతమ్మ పరమ సాధ్వి అని,లోకనిందకు భయపడి రాముడు ఆమెను పరిత్యజించాడని, ఇందులో ఏదైనా అసత్యం ఉంటే నా వేల ఏళ్ల తపస్సు వ్యర్థమైపోవుగాక అని పలికాడు. వెంటనే రామచంద్రమూర్తి లేచి లోకానికి మీవంటి మహర్షులు సత్యం తెలిపే రోజువస్తుందనే తాను వేచి చూస్తున్నానని చెప్పాడు.
మునీంద్రా! దివ్యజ్ఞాన సంపన్నులైన తమ వాక్యములు సత్యభూషణములు. నా దేవేరి శీలమును గురించి నాకు ఏమాత్రమూ సందేహము లేదు. ఆమె మహా సాధ్వి అని నాకు తెలియును. మరి లోకులకు కూడా తెలియడం అవసరమని నేనట్లు నడుచుకోవలసి వచ్చింది అని అన్నాడు. వాల్మీకి మహర్షి తన తపో నిష్టతో సీతమ్మవారిని అక్కడికి వచ్చేలా చేశాడు.
.సీత కాషాయాంబరాలు ధరించి సభా మందిరంలో ప్రత్యక్షమైంది." నేను రాముడ్ని తప్ప అన్యుల్ని తలచనిదాననే అయితే భూదేవి నా ప్రవేశానికి వీలుగా దారి తీయుగాక. త్రికరణ శుద్ధిగా నేనెప్పుడూ రాముని పూజించేదానను అయితే భూదేవి నా ప్రవేశానికి మార్గం చూపుగాక అని ప్రార్ధించింది. సీతా దేవి ప్రార్థన ముగించీ ముగించగానే భూమి బద్దలు అయింది. నాగరాజులు మోస్తున్న దివ్య సింహాసనమొకటి పైకి వచ్చింది. భూమాత రెండు చేతులతో సీతను తీసుకొని పక్కన కూర్చోపెట్టుకొంది. ఆకాశం నుంచి పూల వాన కురుస్తుండగా సింహాసనం పాతాళంలోకి దిగిపోగా అక్కడ ఏమీ జరగనట్టు మళ్ళీ మామూలుగా అయిపోయింది.
సభాసదులు దీనులై విలపిస్తూ రాముడి వంక చూడసాగారు. రాముడి దుఃఖానికి అంతే లేదు. "నా కన్నుల ముందే నా భార్య మాయమయింది. లంకలో నుంచి తీసుకొని వచ్చిన ఆమెను భూమినుండి తెచ్చుకొనలేనా? భూదేవీ! అత్తగారివైన నిన్ను మర్యాదగా అడుగుతున్నాను. తక్షణం సీతను తెచ్చి ఈయకుంటే జగత్ప్రళయం సృష్టిస్తాను." అన్నాడు.
అప్పుడు బ్రహ్మ వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది. మీ అవతరణ కార్యం పరిసమాప్తమవుతున్నది అని చెప్పాడు.
*లక్ష్మణునికి ధర్మ సంకటం*
కాలం భారంగా నడుస్తున్నది. ఒక నాడు ఒక ముని వచ్చి రాముడిని చూడాలని లక్ష్మణుడిని కోరాడు. రామాజ్ఞతో లక్ష్మణుడు ఆ మునిని రాముడి మందిరంలోకి ప్రవేశపెట్టాడు. వచ్చిన ముని కాలపురుషుడు. " రామా! మనం మాటాడే విషయాలు పరమ రహస్యాలు. ఇతరులు ఎవరూ వినరాదు.వారికి తెలియరాదు. ఒక వేళ అలా మన మాటల మధ్యలో ఎవరైనా ప్రవేశించినా మన మాటలు విన్నా వారికి నువ్వు మరణదండన శిక్ష విధిస్తానని మాట ఇస్తేనే, నీతో ముచ్చటిస్తాను" అన్నాడు. రాముడు సరేనని లక్ష్మణుడిని ద్వారం వద్ద కాపలాగా ఉండమన్నాడు. ఆ తరువాత ఆ వచ్చిన ముని ఇలా అన్నాడు," రామ చంద్రా! నేను మునిని కాదు. కాల పురుషుడిని. నీవు ఈ లోకానికి వచ్చిన కార్యం ఎప్పుడో నెరవేరింది. బ్రహ్మ మిమ్మలను, తిరిగి పుణ్యలోకాలకు వచ్చి ఈ జగత్తును పరిపాలించమని కోరాడు. " అన్నాడు.
దీనికి రాముడు నవ్వి " కాలపురుషా! నిజమే, భూలోకానికి వచ్చిన పని ఎప్పుడో ముగిసింది. ముల్లోకాలను రక్షించడమే నా బాధ్యత. నా స్వస్థానానికే రావడానికి నేను సిద్ధమౌతున్నాను." అన్నాడు. ఇలా వీరు సంభాషించుకొంటున్న వేళ దుర్వాసుడు రాముడి దర్శనానికి వచ్చాడు. లక్ష్మణుడు లోపలికి వెళ్లడం కుదరదన్నాడు. కాస్త ఓపికపట్టి ముని వెళ్లిన తర్వాత వెళ్లవచ్చన్నాడు.. ముక్కోపి అయిన దుర్వాసుడు "ఓరీ! ఈ.. రామ దర్శనానికి నేను వేచివుండాలా? తక్షణం నేను రాముడ్ని కలవాలి. లేకుంటే నీ దేశం, వంశం , మీ అన్నదమ్ములు నాశనం కావాలని శపిస్తాను " అన్నాడు. దుర్వాసుని కోపం ఎంత ముప్పు కలిగిస్తుందో ఎరిగిన వాడైన లక్ష్మణుడు, తన వంశం దేశం నాశనమయ్యే కంటే ,తాను రాముడి ఆజ్ఞను ధిక్కరించి తానొక్కడూ మరణశిక్ష పొందడమే మేలని తలచి వెంటనే , దుర్వాసుడు బయట వేచి ఉన్న విషయం చెప్పేందుకు లోపలకు వెళ్లాడు. అలా లక్ష్మణుడు, యముడు– రాముడు మధ్య సాగుతున్న సంభాషణకు అంతరాయం కలిగిస్తూ " అన్నా! నీకోసం దుర్వాసుల వారు వచ్చారు" అని అన్నాడు. కాలపురుషుడు, ఇదేమిటి; మనం మాట్లాడుకునేటపుడు మధ్యలో ఎవరూ రావద్దని షరతు విధించాను కదా అని రాముడివైపు చూశాడు.
*లక్ష్మణుడి యోగ సమాధి*
రాముడు కాలపురుషుడిని వడి వడిగా పంపేసి, దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. అయితే తాను కాలపురుషుడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని రాముడు విచారంలో మునిగిపోయాడు. కలపురుషుడికి ఇచ్చిన మాట ప్రకారం మధ్యలో వచ్చిన వ్యక్తి ప్రాణాలు తీయాలి.. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా నాకు శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్యంగా చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత, శతృఘ్నులను సమావేశ పరచి విషయం వవరించాడు. వశిష్ఠుడు " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు అది మరణ సమానమే." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణశిక్ష తో సమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే లక్ష్మణుడు తన ఇంటి వైపు కూడా చూడకుండా సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని అమరావతికి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం దేవలోకం చేరినందుకు దేవతలు సంతోషించారు. లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు..
*అవతార సమాప్తి*
మరునాడు తెల్లవారింది. బ్రాహ్మణులు అగ్ని హోత్రాలు, వాజపేయచ్చత్రాన్ని పట్టుకొని ముందుకు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి, మంత్రోచ్చారణ చేస్తూ వెడుతునాడు.. శ్రీ రాముడు అర్ధ యోజన దూరం నడచి, పడమట దిక్కుగా ప్రవహిస్తున్న సరయూ నది చేరుకొన్నాడు. అప్పటికే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడ వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. వేదవేత్తలు మంత్రోచ్చారణలుచేస్తున్నారు. దేవతలు దుందుభులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తోంది. పూలవాన కురవడం మొదలయింది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు రాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు"
మహావిష్ణూ ! నీకు శుభమగుగాక!
నీ తమ్ముళ్ళతో కూడా స్థూల శరీరాలు విడిచి దివ్యశరీరాన్ని ధరించు. నీకు కావలసిన రూపం అందుకో తండ్రీ! సకల భువనాలకూ నువ్వే ఆధారం."
అనగానే రాముడు తన అవతార కార్రక్రమం పరిసమాప్తమైనందున, విష్ణుమూర్తి రూపం స్వీకరించాడు. అక్కడ చేరినవారంతా విష్ణుమూర్తి దర్శనంతో తరించి,జయజయ ధ్వానాలు చేసి విష్ణువుకు భక్తిగా మొక్కారు. అప్పుడు బ్రహ్మతో విష్ణువు "నావెంట వచ్చిన వారంతా నా భక్తులు. సర్వం త్యజించి నన్ను అనుసరించినవారు. వారికి పుణ్యలోకాలు ప్రసాదించు" అని అజ్ఞాపించాడు.
హనుమ చిరంజీవిగా ఉంటాడని ,రామభక్తులను కంటికి రెప్పలా కాపాడుతుంటాడాని చెప్పి రామచంద్రమూర్తి, విష్ణువుగా విష్ణులోకానికి పయనమయ్యాడు.
*ఫలశ్రుతి*
మహర్షి వాల్మీకి రచించిన శ్రీరామాయణాన్ని చదివినవారు,విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్య సంపదలను పొందుతారు.
వారికి కీర్తి, విజయం లభిస్తాయి.
కష్టాలను అధిగమిస్తారు.
వంశ వృద్ధి కలుగుతుంది.
దీర్ఘాయుష్మంతులౌతారు. సకల శుభాలూ పొందుతారు. ధర్మబద్ధ జీవనం సాగిస్తారు. రామాయణాన్ని శ్రద్ధతో పారాయణం చేసే వారి యందూ, వినేవారియందు శ్రీరాముడు దయాపరుడై ఉంటాడు.
రామాయణ పారాయణ చేస్తున్న వారి ఎదురుగా కూర్చుని,హనుమ అదృశ్యరూపంలో ఆనంద పారవశ్యంతో రామకథను వింటుంటాడని భక్తుల విశ్వాసం. అలా ఈ 9 రోజులూ హనుమ మీ ప్రాంగణాన్ని పావనం చేసివుంటారు.
మీ మనసు నిండా శ్రీసీతారామచంద్రులు,హనుమ ఉండగా, మీరు శ్రద్ధతో సాగించిన ఈ శ్రీ రామాయణ దివ్య కథా పారాయణం మీకు,మీ కుటుంబసభ్యులకు
సర్వశుభాలను కలుగజేస్తుంది. ధర్మబద్ధ జీవనానికి వీలు కల్పిస్తుంది.
మీ పిత్రు దేవతలు సంతోషిస్తారు.
శుభ వర్తమానాలు అందుతాయి.
శుభకార్యాలు చేస్తారు .సర్వత్రా జయం లభిస్తుంది. సదా రామభక్తులను కంటికి రెప్పలాకాపాడే హనుమ ఈబాధ్యత తీసుకుంటాడు.
*మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే,*
*చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.*
*వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే,*
*పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్*
**
*ఆంజనేయం మహావీరం* *బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ !*
*తరుణార్క ప్రభం శాన్తం* *రామదూతం* *నమామ్యహమ్ !!*
*****
*హనుమంతుని ద్వాదశనామాలు*
హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః
రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విమహాబలఉధధిక్రమణశ్చ్చైవ,
సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః,
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్
**
*( ఈ 9 రోజులూ సంక్షిప్త శ్రీ రామాయణాన్ని పఠించిన వారికి, విన్నవారికి ప్రత్యేక ధన్యవాదాలు)* *జై శ్రీసీతారామ్*
*సర్వే జనా*
*సుఖినోభవంతు*
*సమస్త సన్మంగళాని భవంతు*
🪷*స్వస్తి* 🪷