చెంత నుండ లేని సంతు నూర్గుర దేల ?
కడను శ్వాస తాను విడుచు నపుడు,
సంతు యొక్కడున్న చాలదా ! బ్రతుకున
హరిని చేర్చు ముక్తి ననయ మీయ.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
చెంత నుండ లేని సంతు నూర్గుర దేల ?
కడను శ్వాస తాను విడుచు నపుడు,
సంతు యొక్కడున్న చాలదా ! బ్రతుకున
హరిని చేర్చు ముక్తి ననయ మీయ.
Srimadhandhra Bhagavatham -- 36 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ కౄరుల వైపునుండి బాధ. యజ్ఞయాగాది క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు. ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. ‘వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను’ అన్నది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు.
ప్రతివాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రారు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగి దొంగతనములు పెరిగిపోయాయి.
ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీతీరంలో సమావేశం అయ్యి రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకుని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. ‘రాజా! నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో’ అని చెప్పారు. వేనుడు ‘అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగితిపోతాయి’ అన్నాడు.
ఋషులు ఇక అతడు మారడు. ‘వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు.’ అనుకున్నారు. ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచ్చిపోయాడు. అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీథ గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వేనుని శరీరమును కాపాడింది. ఆశరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు. ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేదు. ఋషులు ‘ మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. మనం మన తపశ్శక్తితో రాజు శరీరములో నుంచి రాజు సంతానమును తీసుకురావాలి’ అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు. ఋషులు వెళ్ళి మొట్టమొదట తపశ్శక్తితో ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి పాపము పైకి రావడం మొదలు పెట్టింది. బాహుకుడు అనబడే ఒక నల్లటివాడు పొట్టి పొట్టి కాళ్ళు, పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగిజుట్టుతో పుట్టుకొచ్చాడు. ‘నేను ఏమి చేయాలి’ అని ఋషులను అడిగాడు. ఋషులు వానివంక చూసి ‘వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకోని నీవేమీ చేయవద్దు అన్నారు. సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే ‘నిషాదులు’ అని పేరు వచ్చింది.
ఋషులు ‘స్వామీ! ఒక కొడుకు పుట్టాలని మేము అడగడము లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము శ్రీమహావిష్ణువా! నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా’ అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. ‘ఓహో మనం ప్రార్థన చేసినట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు’ అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు ‘అర్చిస్సు’ అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు.
ఆయన విష్ణుఅంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము దిక్పాలకులు పట్టుకుని వచ్చారు. కుబేరుడు ఆయన కూర్చోవడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మెడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మెడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కత్తి పెట్టడానికి ఒర కావాలి. పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను ఇచ్చింది. సోముడు గుఱ్ఱమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్తదేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు. పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి ‘మహానుభావా! ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా ! అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది’ అన్నారు.
పార్వతీదేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. ‘అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను’ అన్నాడు. పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. ‘స్వామి ! నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు. యజ్ఞయాగాదులు మానడము ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను(నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉన్నది. నేను గోరూపంలో తిరుగుతాను. జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు’ అని అడిగింది.
అపుడు పృథు మహారాజు ‘ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు’ అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది. స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి. ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలము అయింది.
ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది. విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాల సంతోషించారు. భూమిని పృథుమహారాజు పిండితే ‘పృథ్వి' అనే పేరు వచ్చింది. జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
Srimadhandhra Bhagavatham -- 37 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
పృథుమహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఇంద్రుడిని దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి ‘వీర్యము’, ‘ఓజము’, ‘ఋతము’ అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది.
రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహపాత్రలలో మూడురకముల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టిపాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిలమహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణనే శక్తిని పిండుకున్నారు. యక్ష, భూత, పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చేసుకుని తమ పుట్టలనబడే పాత్రలలోకి ‘పురువులు’ ‘ఫలములు’ అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి ఉండి మనకు రసపోషణము చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషముగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి ‘సరస్వతి’ ‘తృషద్వతి’ అనబడే రెండు నదుల మధ్యప్రాంతంలో యజ్ఞశాల కట్టి తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశాడు. నూరవయజ్ఞం చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపముతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి ‘గుర్రమును ఎత్తుకు పోతున్నవాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా బాణము వదిలెయ్యి అన్నాడు. బాణము వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుఱ్ఱమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి ‘విజితాశ్వుడు’ అని పేరు పెట్టారు.
మరల యజ్ఞం జరుగుతున్నది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణముగా మాంత్రికశక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసినవాడయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాపవిముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడుకూడా అయి ఉంటాడు. అతనిని వధించాలా! వద్దా! అని పృథువు అనుమాన పడుతున్నాడు. అత్రి ‘నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వెయవలసింది’ అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. ఇంద్రుడు ఆ రూపమును, గుఱ్ఱమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు ‘పాఖండరూపము’ అని పేరు. పాఖండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేద విరుద్ధమయిన మార్గములో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. ఋషులు ‘నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవయజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఇంద్రుడిని ఈ హోమములో పడేస్తాము’ అన్నారు.
ఇంద్రుని మీద క్షాత్రశక్తి, తపశ్శక్తి రెండూ కలిసిపోయాయి. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ‘మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే’ అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరముగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనము దిగి ‘పృథూ, ఇప్పటికి నువ్వు తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా? తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు. నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయి ఉండేవాడివి. ఇంద్రుడి మీద బాణం వేయడములో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గుర్తించావా? నీయందు జ్ఞానము కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. అతని చర్య పైకి దోషముగా కనపడుతున్నది. నీవు బాణం వేయవలసింది ఇంద్రుని మీద కాదు. ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపంనుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేస్తున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనము చెయ్యి’ అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.
పృథుమహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!
అర్చన భక్తికి పృథుమహారాజు గొప్పవాడు. పృథుమహారాజు జీవితములో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది. శ్రీమహా విష్ణువు ‘పృథూ! నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. పృథుమహారాజు ‘స్వామీ! నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరములు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడము వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు’ అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజానిష్ఠ. అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.
ఒకనాడు సత్రయాగము చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందాది మహర్షులు క్రిందికి దిగారు. మహాపురుషులయిన వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు. సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి ‘స్వామీ! మేము సంసారమునందు ఉన్న మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి’ అని ‘బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత’ అని అడిగితే సనక సనందనాదులు ‘ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటివాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు’ అని చెప్పారు. వాళ్లు ఇంకా ఇలా ‘గృహస్థాశ్రమంలో ఉండి చాలాకాలము పాపకర్మలయందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగనివాడు జీవితము తరించడానికి చేయవలసిన మొట్టమొదటి పని భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగి ఆ నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకోవాలి. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమముగా నిష్కామయోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్నిపాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతే సాయుజ్యము కలుగుతుంది’ అన్నారు.
సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తరదిక్కుకు ప్రయాణించి ఆశ్రమవాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథివికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణుసాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేసాడు. ఈవిధముగా పృథుమహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేస్తూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.
ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభాఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథుమహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానారాజ్యం కావాలని పృథుమహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథుమహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారములో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించేతత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియనివాడు కూడా ఇటువంటి పృథుచరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వపాపములు నశించి శ్రీకృష్ణపరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహముతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
Srimadhandhra Bhagavatham -- 39 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు. నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.
కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’ దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమన్నది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడు వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో అన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఈకోట శిధిలం అయిపోయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది.
ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి' అని నారదుడిని అడిగాడు. నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పడడము ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.
పంచమ స్కంధము – ప్రియవ్రతుని చరిత్ర.
భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే!
స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారదమహర్షి గురుత్వం లభించింది. నారదమహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. ‘నాయనా! నీకు పట్టాభిషేకము చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు’ అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. ప్రియవ్రతుడు ‘నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.
ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. ‘నాయనా ప్రియవ్రతా! సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి ఉంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము. నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆయన – మహానుభావా ! మీరు వచ్చి ఈ మాట చెప్పారు. నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
Srimadhandhra Bhagavatham -- 38 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
4. పురంజనోపాఖ్యానం:
భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్త్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్త్వమును మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేమిటో చాలా భయంకరంగా ఉన్నది – ఇదంతా తమకు అందదని అంటారు. ఋషులు బోధ చేసేటప్పుడు తత్త్వమును కథతో కలిపేస్తారు. నారదుడు ప్రాచీనబర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానమును వివరించాడు.
ప్రాచీనబర్హి కేవలము ఈ శరీరమే శాశ్వతము అనుకుని, తాను భూమిమీద శాశ్వతంగా ఉండి పోతాననుకొని ఎటువంటి మార్గములో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకుని ఒక రకమయిన అజ్ఞానములో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడయిన నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన కథకు ‘పురంజనోపాఖ్యానం’ అని పేరు.
పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నీ తిరిగాడు. ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణకొసన ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అందులోనుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలలపాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండుమంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూరుగురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు. పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాలే ఉంటాడు. పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు. అపుడు ఆమె ‘ఏమో నాకు తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటాను. నువ్వు మంచి యౌవనములో ఉన్నావు. నా పేరు ‘పురంజని’ నీ పేరు పురంజనుడు. నువ్వు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని. ఈ కోటకు ఒక గమ్మత్తు ఉన్నది. ఈ కోటకు తూర్పుదిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది.
ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. పురంజనుడు అంటే ఎవరో కాదు మనమే. మనకథే అక్కడ చెప్పబడింది. పురంజనుడు కోటకోసం వెదుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగమునందు వ్రేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణదిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. ఏనాటికయినా శ్మశానములో చేరవలసినటువంటి శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్లేసరికి ఒక అందమయిన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరములో గల తల. శరీరమునకు పైన చక్కటి ఒక అందమయిన తలకాయ ఉంటుంది. దానిమీద ఉన్న వెంట్రుకలే పూలలతలు. చేతులు కాళ్ళు ఇవన్నీ అగడ్తలు. లోపల ఉన్నటువంటి ఇంద్రియములు భోగస్థానములు. రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయస్థానము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది. దానిమీద మనం రాత్రివేళ నిద్రపోతాము. ఇంద్రియములు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది.
పురంజని ఎదురువచ్చి తనను వివాహం చేసుకోమన్నది. పురంజనుడు ఆమెను నీవు ఎవరని ప్రశ్నించాడు. ఆవిడ నాకు తెలియదు అన్నది. ఆవిడ బుద్ధి. ఆవిడని అయిదు తలలపాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే అయిదు ప్రాణములు. ఈవిడతో పాటు పదకొండుమంది భటులు వచ్చారు. వారే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు. ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక వున్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడ వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు చేసుకున్నది. ఆవిడ ఒక మాట చెప్పింది ఈ కోటకు తూర్పుదిక్కుగా అయిదు ద్వారములు ఉన్నాయి – అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నీవు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది.
మనం అందరమూ అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారములు. పనులు చేయడానికి మనం అందరం ద్వారంలోంచే కదా బయటకు వెళతాము. జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున ఉన్న రెండుద్వారములే రెండుకళ్ళు. ఈ రెండుకళ్ళతో జీవుడు బయటి ప్రపంచమును చూసి దానితో సమన్వయము అవుతూ ఉంటాడు. ఒకటవ ద్వారము పేరు ‘ఖద్యోత’, రెండవ ద్వారము పేరు ‘ఆవిర్ముఖి’. ఎంతో చిత్రమయిన పేర్లు. ఈ రెండుద్వారములలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకొక్క స్నేహితుడితో వెళతాడు. ఒకడు ‘ద్యుమంత్రుడు’, రెండవ వాని పేరు ‘మిత్రుడు’. ‘ద్యు’ అంటే కాంతి. మిత్రుడు అంటే సూర్యుని పేరు. మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురు ఉన్నపుడు మాత్రమే చూడగలరు. ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకుని ‘విభ్రాజితము’ అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకమునంతటిని చూస్తూ ఉంటాడు. ఇవి రెండూ రెండు ద్వారములు.
క్రిందను మరో రెండుద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు ‘నళిని’, ‘నాళిని’. ఈరెండు ద్వారముల నుండి బయలుదేరినపుడు ‘అవధూతుడు’ అనే స్నేహితుడితో వెడతాడు. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు వాయువు. వాయువనే స్నేహితునితో ‘సౌరభము’ అనే దేశమునకు వెళతాడు. ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు. సౌరభము అంటే వాసన. ఈవిధంగా అవధూతుని సాయంతో నళిని, నాళిని ద్వారా సౌరభమనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. మూడవది ఒకటే ద్వారం. దీనిపేరు ‘వక్తము’ నోరు. ఈ ద్వారంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేస్తాడు. ఆయన పేరు ‘రసజ్ఞుడు’. ఒకోసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు. ‘విపణుడు’ అనే ఆయనను పిలిచి ఆయన భుజమ్మీద చేయివేస్తాడు. ‘రసజ్ఞుని’తో వెళ్ళినప్పుడు ‘బహూదకము’ అనే దేశమునకు వెళతాడు. ‘విపణుడి’తో వెళ్ళినప్పుడు ‘అపణము’ అనే దేశమునకు వెడతాడు. రసజ్ఞుడితో వెళ్ళడం అంటే పండు కాయ అన్నం పులిగోర చక్రపొంగలి మొదలయినవి నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకొనుట. విపణుడితో వెళ్ళినపుడు ‘ఆపణం’ చేస్తాడు. ఆపణం చేయడం అంటే మాట్లాడడం. పనికిమాలినవి మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వర సంబంధమయిన విషయములు తప్ప అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు.
కుడిపక్కన ద్వారం ఉంది. దీనిపేరు ‘పితృహు’. ఇది కుడిపక్క చెవి. ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటకు వెళ్ళాలి. ఆయన పేరు ‘శృతిధరుడు’. అనగా వేదం. దీనితో వెళ్ళినపుడు పాంచాల రాజ్యమునకు వెడతాడు. వేదములో పూర్వభాగమయిన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు. చాలాకాలమయిన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమ చెవిద్వారం లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా శ్రుతిధరుడి మీదనే చేయి వేసుకుని బయటకు వస్తాడు. ఉత్తర పాంచాల రాజ్యమునకు వెళతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గము. సుఖములను కోరుకోడు. అది వేదము ఉత్తర భాగము. అందుకని ఎడమచెవి ద్వారంలోంచి వెళ్ళినపుడు మోక్షమును కోరతాడు.
ఆ తర్వాత ఉత్తరమునుండి వెళ్ళే ద్వారమునకు ‘దేవహూ’ అని పేరు. అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగములో ఒక ద్వారం ఉన్నది. అదే మూత్ర ద్వారం. దాని పేరు ‘దుర్మదుడు’ అక్కడ మదమును కల్పించే ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళినపుడు దుర్మదుని భుజమ్మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును చేరతాడు. ఆ సామ్రాజ్యము పేరు ‘గ్రామికము’ పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు. అందుకని గ్రామికమయిన దేశమునకు వెళతాడు.
పడమట అనగా వెనకభాగమందు ఒక ద్వారమున్నది. అది మలద్వారము. దాని పేరు ‘లుబ్ధకుడు’. అంటే ఉన్నదానిని బయట పెట్టనివాడు. లోపలే కూర్చుని ఉంటుంది. బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది. అందుకని దానిపేరు ‘వైశసము’. అలా రెండురకములుగా వెళుతుంది. జీవుడు నేను వెళ్ళనని ఈ పురమును పట్టుకు కూర్చుంటాడు. ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు. అంత పేచీపెట్టి తన శరీరము మీద భోగముల మీద తన ఐశ్వర్యము మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరములో అధోభాగమున ఉన్న అపానవాయు మార్గము ద్వారా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనే భయంకరమయిన నరకములో యాత్ర మొదలుపెడతాడు.
ఇన్ని ద్వారములు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ప్రజలు ఉన్నారు. అందులో ఇద్దరు కళ్ళులేని వాళ్ళు ఉన్నారు. వారు పుట్టుకతో అంధులు. పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాడు. ఒకాయన భుజమ్మీద చేయి వేస్తే ఆయన తీసుకువెళుతూ ఉంటాడు. కళ్ళు లేని వాడు. ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. ఆయన పేరు ‘దిశస్మృత్’. రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి. ఇంకొక అంధుడిమీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులకు కన్నములు ఉండవు. వాటిని ఏమి చెయ్యమంటే దానిని చేస్తూ ఉంటాయి. అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానే బంధింపబడుతూ ఉంటాడు. ఇద్దరు గుడ్డివాళ్ళతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు ‘విషూచుడు’ అనబడే వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒకరోజున గుర్రం ఎక్కాడు. దానికి తన పక్కన పదకొండుమంది సేనాపతులను పెట్టుకున్నాడు. ఇవి పది ఇంద్రియములు, ఒక మనస్సు. వాటికి ఒకటే కళ్ళెం. ఒకడే సారధి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి, చంపకూడని వాటిని కూడా చంపేశాడు. తాను చెయ్యవలసిన, చెయ్యకూడనివి అయిన పనులను చేశాడు. చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగబట్టి ఇనుపకొమ్ములు ధరించి కూర్చున్నాయి. అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ‘అయ్యో నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాను. బాగున్నావా? అన్నాడు. ఆవిడ అలకగృహంలో ఉన్నది. అనగా మరల సాత్విక బుద్ధియందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదయిపోతోందేమోనని అనుమానం వచ్చింది. అనగా మెల్లిమెల్లిగా బుద్ధియందు స్మృతి తప్పుతోంది. వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ‘ఉజ్వలము’ అనే వస్త్రం కట్టుకుని వచ్చింది. ‘అబ్బో మా ఆవిడకి యౌవనం తరగడం ఏమిటి’ అనుకున్నాడు. మళ్ళీ కౌగలించుకున్నాడు. ‘ఉజ్వలము’ అంటే తన బుద్ధియందు తనకు భ్రాంతి. అయినా ‘నా అంతవాడిని నేను’ అంటూ ఉంటాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
Srimadhandhra Bhagavatham -- 40 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu
ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తాను చేసిన పనులన్నింటిని ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏది చేసినా భగవంతుడిని తలుచుకుని చేశాడు. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు, సంసారమును వదిలిపెట్టి వెళ్ళి హిమాలయములలో కూర్చుని కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందాడు. ఆయనకు ఒక విచిత్రమయిన కోరిక పుట్టింది. మేరుపర్వతమునకు ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నపుడు భూమికి దక్షిణం దిక్కు చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణదిక్కున ఉంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. ‘నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీమహావిష్ణువు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమ గొప్పతనం ఏమిటో శాశ్వతముగా లోకమునకు తెలిసేటట్లు చేయాలి. ఏడురోజులు ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథమునెక్కి అంత తేజోవంతమయిన రథం మీద, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో, సూర్యుడు ఉత్తరమున ఉంటే నేను దక్షిణమున ఉంటాను. సూర్యుడు దక్షిణమునకు వచ్చేసరికి నేను ఉత్తరమునకు వెళ్ళిపోతాను. అలా ఏడురోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటిలేకుండా అపరసూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసినవాడు ఈ స్థితిని పొందగలడని నిరూపిస్తాను’ అని రథం ఎక్కాడు. ఏడురోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణము చేశాడు. ఆ ఏడురోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు.
ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయి. ఏడుసార్లు ప్రదక్షిణములో ఏడుజాడలలో లోతుగా పడిన చారికల లోనికి వచ్చి ఏడు సముద్రములు నిలబడ్డాయి. అవి – లవణ సముద్రము, ఇక్షుసముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోదసముద్రము, శుద్దోదక సముద్రము, ఘృత సముద్రము. రథపు గాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటూ ఇటూ నీరుండగా మధ్యలో ద్వీపములు ఏర్పడ్డాయి. ఇలా సప్తద్వీపములు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్వీపములు అన్నీ ప్రియవ్రతుడు తిరిగినపుడు ఏర్పడిన ద్వీపములు. ఆవిధముగా రథపుగాడి మధ్యలో జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అను ఏడుద్వీపములు ఏర్పడ్డాయి. ఈ ద్వీపముల పేర్లు విన్నంత మాత్రం చేత పాపములు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు.
ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారములో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇక నేను ఇప్పటివరకు అనుభవించిన భోగముల వలన కలిగిన సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేనివలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. సత్యమునందు నేను లీనమయిపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈవిధంగా అరణ్యములకు వెళ్ళి ఘోరమయిన తపమాచరించి తనలోవున్న తేజస్సును ఈశ్వరతేజస్సుతో కలిపి మోక్షమును పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమమునందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు.
ప్రియవ్రతుని పెద్దకొడుకు అగ్నీధ్రుడు. అతడు రాజ్యమునకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావలసి ఉన్నది. అందుకని యోగ్యమయిన భార్యను పొందడం కోసమని హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చుని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యతాయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు ‘పూర్వచిత్తి’. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్తి ఉన్నచోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉండి వానియందే పూనిక ఉన్నట్లయితే మనసు ఈశ్వరుడు వైపుకి తిరగక పోయినట్లయితే ఆ సుఖములు సుఖములు కావనే భావన కలగక పోయినట్లయితే మీరు పూర్వచిత్తికి లొంగుతున్నట్లు భావించుకోవాలి. దానివలన ఫలితం తెలుసుకోవాలంటే అగ్నీధ్రుడి చరిత్ర వినాలి.
ఆగ్నీధ్రుడు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారిని గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పేవరకు వేచి వుండాలి. ఈయనకు సుఖము అన్నది కనపడితే చాలు అక్కడ మనసు లగ్నమవుతుంది. ఆయనకు అదొక అలవాటు. ఆయన పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తి లొంగింది. ఆమెతో కలిసి చాలా సంతోషముగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా గడపగా ఆయనకు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భ్రద్రాశ్వువు, కేతుమానుడు అనే తొమ్మండుగురు కుమారులు జన్మించారు. వారు తొమ్మండుగురు అతి బలిష్ఠమయిన శరీరము ఉన్నవారు. పూర్వచిత్తి చాలాకాలం అగ్నీధ్రుడితో సంసారం చేసి ఆఖరుకి తన లోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయనను విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. అగ్నీధ్రుడు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చివరకు ఆమె వున్న లోకమును పొందాడు.
ప్రియవ్రతునికి అగ్నీద్రుడికి ఉన్న తేడాను ఒకసారి గమనించండి. ప్రియవ్రతుడు తాను చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. అగ్నీధ్రుడు పూర్వచిత్తి ఉన్న లోకమును పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తిరహిత శాశ్వతశివసాయుజ్యమును పొందాడు.
అగ్నీధ్రుడి పెద్ద కుమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు అగ్నీధ్రుడు. యజ్ఞము చేసి కొడుకును పొందాడు నాభి. నాభి పరిపాలించాడు కాబట్టి ఈయనకు వచ్చిన రాజ్యమును ‘అజనాభము’ అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞమునకు సంతసించి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కలుగగానే వారందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి ‘స్వామీ! నువ్వు పరాత్పరుడవు. నేను నిన్ను ఒక కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేసాను. నీవు ప్రత్యక్షమయినపుడు నిన్ను మోక్షం అడగడము మానివేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడిని దోసెడు ఊకను దానం చేయమని అడగడముతో సమానం. అయినా నేను అదే అడుగుతాను’ అన్నాడు. గృహస్థాశ్రమము పట్ల నాభికి వున్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృఋణం నుండి తాను విముక్తుడు కాడు. ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి. అటువంటి కొడుకును పొందాలనుకున్నాడు.
శ్రీమహావిష్ణువు ‘అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా? లేక దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా? అని అడిగాడు. నాభి ఒక తెలివైన పని చేశాడు. నాభి ‘ఈశ్వరా! నాయందు వున్న భక్తిని నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్నొక కోరిక కోరుతున్నాను. నీలాంటి కొడుకును నాకు ప్రసాదించవలసినదని కోరాడు. శ్రీమహావిష్ణువు ‘నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తథాస్తు అన్నందుకు లొంగాలో – ఏమయినా నేను నీకు లొంగవలసిందే. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభి తినే ఆహారంలోంచి నాభిలోనికి వెళతాను. నాభి జీర్ణం చేసుకున్న తరువాత నాభి వీర్యకణములను ఆశ్రయిస్తాను. నాభి తేజస్సుగా నాభి బార్య అయిన మేరుదేవిలోకి వెళతాను. మీరు తథాస్తు అన్నందుకు పదినెలలపాటు గర్భస్థమునందు అంధకారంలో పడివుంటాను. నాభికుమారుడనని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను’ అన్నాడు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు లొంగిపోతాడు!
ఈమాట వినిన తరువాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భమును ధరించింది. ‘నల్లనివాడు’ నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడన్నమాట! అన్ని రంగులు తెలుపులోంచి పైకి వచ్చి మరల తెలుపులోకి వెళ్ళిపోతాయి అనగా సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతోందో చెప్పే మహాజ్ఞాని రాబోతున్నాడు. దానివలన తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి. జ్ఞాని పుట్టుకచేతనే కదా ఏడుతరాలు తరిస్తాయి! ఇపుడు తెల్లటివాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి ‘ఋషభుడు’ అని పేరు పెట్టుకున్నాడు.
ఋషభుడు బాహ్యపూజ చేసేవాడు కాదు. అంతరమునందు విశేషమయిన యోగమును అనుసంధానము చేస్తూ ఉండేవాడు. ఋషభుడు బాహ్యకర్మలు చేయడం లేదని ఇంద్రునికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. ‘మన రాజ్యంలో వర్షం పడడము లేదు. క్షామం వచ్చేటట్లు ఉన్నది’ అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు. ఋషభుడు ఒకనవ్వు నవ్వి తన యోగబలంతో మేఘములను సృష్టించి తన రాజ్యం ఎంత వరకు ఉన్నదో అంతవరకూ వర్షము కురిపించాడు. దానిచేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమై పోయి నాభి పరమసంతోష పడేటట్లుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషమును పొంది ఋషభుడికి పట్టాభిషేకము చేసి తపస్సు చేసుకునేందుకు నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
*రామాయణానుభవం_191*
మహాహస్త బలుడైన ప్రహస్తుడు మరణించాడన్న వార్తను రావణాసురుడు జీర్ణించుకోలేక పోయాడు. ప్రహస్తుడు రామలక్ష్మణులను, వానర సేనను తప్పక చంపి. విజయంతో తిరిగి వస్తాడని విశ్వాసంతో ఉన్నాడు.
ప్రహస్తుడు కూడ మరణించాడంటే సైన్యంలో అధిక భాగము నశించినట్లే. ఇక
తాను తన బంధువులు సైనికులు మాత్రమే మిగిలారు.
తన మహాసేనాని మరణము రావణునికి దుఃఖాగ్రహాలను కలిగించింది. ఇక స్వయంగా తానే రణరంగానికి పోక తప్పదు. తన ప్రతాపాగ్నితో వానర సేనా సముద్రాన్ని ఎండింపక తప్పదు.
అందువలన అగ్ని వంటి ప్రకాశము కల్గి, అనేకోత్తమహయాలతో కట్టబడి, రత్న
ఖచితమైన దివ్య రధాన్ని ఎక్కాడు.
రుద్రుని వెంట ప్రమధ గణాలవలె, రావణుని వెంట భయంకరమైన రాక్షసగణము బయలు దేరింది. వంది మాగధుల జయజయ ధ్వానాల
మధ్య రావణరధము యుద్ధ రంగానికి బయలుదేరింది.
*నానా పతాకా ధ్వజ శస్త్ర జుష్టం*
*ప్రాసాసి శూలాయుధ చక్ర జుష్టమ్*
*సైన్యం గజేంద్రోపమా నాగ జుష్టమ్*
*కస్యేదమ క్షోభ్యమభీరు జుష్టమ్*
శ్రీరామచంద్రుడు "ఇంత ఆర్భాటముతో వస్తున్న సేన ఎవ్వరిదని" విభీషణుని ప్రశ్నించాడు.
విభీషణుడు రావణసేనలోని ముఖ్యులు గురించి తెలుపసాగాడు.
"రామభద్రా !
వచ్చేసేనలో ముందు భాగములో చీకటి కొండ వంటి ఏనుగును అధిరోహించి, మహాధుజ బలముతో వస్తున్నవాడు రావణపుత్రుడైన "అకంపనుడు".
(సూచన: ఇది వరకు వచ్చి చనిపోయిన అకంపనుడు ఒక సైనికాధికారి. ఈయన స్వయంగా రావణుని కొడుకు)
ఇంద్రధనుస్సు వంటి గొప్ప విల్లును చేబూని సింహ ధ్వజము గల గొప్ప రధముపై వస్తున్నవాడు ఇంద్రుని ఓడించిన "ఇంద్రజిత్తు"
వేయి గుజ్జలను పూన్చిన మహారధముపై ఎక్కి పర్వతము వంటి పెద్ద శరీరముతో
ధనుస్సును చేబూని వచ్చేవాడు "అతికాయుడు".
ఉదయిస్తున్న సూర్యునివలె ఎఱ్ఱని కళ్లు కలిగి, గంటలు కట్టిన మహా గళాన్ని అధిరోహించి, భయంకరమైన స్వరముతో శత్రు భయంకరంగా వస్తున్నవారు. "మహోదరుడు".
పడమటి కొండవంటి దేహకాంతి గల్గి బంగారునగలతో, అలంకరింపబడిన గుఱ్ఱముపై ఎక్కి "కుంతము"అను ఆయుధాన్ని పిడికిలితో పట్టుకొని యుద్ధానికి వస్తున్నవాడు 'పిశాచుడు'.
వేగవంతమైన ఎద్దుపై ఎక్కి, మెరుస్తుండే 'శూలాన్ని' ధరించి వేగంగా వస్తున్నవాడు 'త్రిశిరుడు'.
పాము గుర్తు జండాను గలిగి, తాటి చెట్టంత విల్లుతో, విశాల వక్షస్థలముతో, దేవతా గణాలను వధించడలో సమర్ధుడై వస్తున్నవాడు 'కుంభుడు' వీడు కుంభకర్ణుని కొడుకు.
భయంకర శరీరంతో, భయంకరంగా యుద్ధం చేయగలిగిన వాడు బంగారు రంగుతో ప్రకాశించే రోకలిని ఆయుధంగా కలవాడు 'నికుంభుడు' ఈయన కుంభకర్ణుని కొడుకే.
అగ్ని వర్ణం గల జండాతో, సమస్త శస్త్రాస్త్రాలతో, కాంతివంతములైన గుఱ్ఱాలు గల రథముపై వస్తున్న భయంకర శరీరుడు 'నరాంతకుడు'.
గజ, వ్యాఘ్ర, హయముల వంటి, జింక, ఒంటెల వంటి ముఖాలు గల అనేక పిశాచాలు కొలుస్తుండగా అపరరుద్రునివలె, వెన్నెల వంటి తెల్లని గొడుగుతో, కిరీటకుండల ప్రకాశంతో, చీకటి కొండవంటి నల్లని పెద్ద దేహము గలవాడు. దేవతలకుసింహస్వప్నమైనవాడు, సూర్య ప్రతాపుడైన "రావణాసురుడు"
విభీషణుని వాక్యాలు విని రఘురాముడు రావణుని పైననే దృష్టి నిలిపాడు.
రావణుని వీర్య తేజస్సులు శ్రీ రామునికి కూడ ఆశ్చర్యం కలిగించాయి.
*ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్యో రశ్మిభిర్ భాతి రావణః*
*సువ్యక్తం లక్షయే హస్య రూపమ్ తేజః సమవృతమ్*
"రాక్షస రాజు తన తేజస్సు చేత మధ్యాహ్న సూర్యుని వలె చూడరాకున్నాడు. దేవ, దానవాది సకల ప్రాణులలో ఇంతటి ప్రకాశవంతమైన శరీరము ఎవ్వరికి లేదు. ఈయన పరివారంలోని వారందరు. పర్వత దేహులే పర్వత స్థైర్యులే.
*దిష్ట్యా యమద్య పాపాత్మా మమ దృష్టి పథం గతః*
*అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహారణ సంభవమ్*
ఈ రోజు ఈ దురాత్ముడు అదృష్టవశంగా నా కంటబడ్డాడు. ఇక వీడిని లంకకు తిరిగి మామూలుగా వెళ్లనివ్వను. నా సీతను అపహరించిన నాటి నుండి నేటి వరకు క్షణం క్షణం పెరిగి పోతున్న నా కోపాగ్నిని వీడిపై ప్రయోగిస్తాను" అని లక్ష్మణునితో సహా ధనుర్బాణాలను ధరించి రామ భద్రుడు నిలిచాడు.
రావణుడు తన పరివారాన్ని చూచి "ఇంతమంది నా వెంట వచ్చారే ? మీరందరు నా వెంట ఉంటే ఈ వానరులు వీరులు లేని లంకానగరాన్ని అనాయాసంగా ఆక్రమిస్తారు. కనుక మీరు తిరిగి వెళ్లండి" అని ఆజ్ఞాపించాడు.
తానొక్కడే ధనుర్ధారి అయి వానర సేనా మధ్యభాగాన్ని చీల్చుకొంటూ ముందుకు వెళుతున్నాడు.....
**
అహంకారంతో ముందుకు ఉరుకుతున్న రావణాసురుని చూచి ఆగ్రహావేశాలతో సుగ్రీవుడు ఒక కొండ శిఖరాన్ని పెకిలించి రాక్షస రాజుపై ప్రయోగించాడు.
ధనుర్ధారి అయిన రాక్షస రాజు ఆ పర్వతాన్ని అవలీలగా తునాతునుకలుగా పగులగొట్టాడు. అంతే కాదు వందలాది క్రూర బాణాలతో సుగ్రీవుని వక్షస్థలాన్ని చీల్చివేశాడు. సుగ్రీవుడు బాధతో నేలగూలాడు.
*స సాయకార్తో విపరీత చేతాః*
*కూజన్ పృథివ్యాం నిపపాత వీరః*
*తం ప్రేక్ష్య భూమౌ పతితం విసంజమ్*
*నేదుః ప్రహృష్టా యుధి యాతు ధానాః*
సుగ్రీవ పతనానికి వానరులు హాహా కారాలు చేయగా, రాక్షసులు రావణుని ప్రశంసిస్తూ జయజయ ధ్వానాలు చేశాడు.
సుగ్రీవుని పరాభవించిన రావణ ప్రభువును ఎదుర్కోవడానికి జ్యోతిర్ముఖ, గవయ, గవాక్ష, ఋషభులనే వానర వీరులు ఒక్కుమ్మడిగా రావణునిపై పడ్డారు. రావణుడు వారిని లక్ష్యపెట్టక వారి ఆయుధాలను మధ్యలోనే ఖండించి వారిని తన పదునైన బాణాలతో పడగొట్టాడు. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రుడు మధ్యాహ్న మార్తాండునివలె భయంకరుడైన రావణాసురుని ప్రతాపాన్ని అణచివేయడానికే తానే విల్లమ్ములతో బయలుదేరాడు.
రామచంద్ర స్వామి తొందరను చూచి ఆయన అనుజుడు లక్ష్మణుడు "అన్నా! మా వదినను అపహరించిన అతినీచుడైన రావణుని అవమానించే అవకాశము నాకివ్వుమని" ప్రార్ధించాడు.
*కామమార్యః సుపర్యాప్తో వధాయ అస్య దురాత్మనః*
*విధామి ష్యామిహమ్ నీచమ్* *అనుజానీహి మాం ప్రభో*
శ్రీరాముడు సోదరునికి జాగ్రత్తలన్ని చెప్పి పంపాడు. అయితే లక్ష్మణుడు బయలు దేరడం చూచిన హనుమ ఆ అవకాశాన్ని తానే వాడుకోవాలనుకొని రావణుని తానే ముందుగా ఎదుర్కొన్నాడు. రావణుని రధము పైకి ఎగిరి ఓరీ రావణా! నీవు దేవదానవ, గంధర్వాదుల నుండి మరణం లేకుండా వరం కోరుకున్నావు. కాని వానరులమైన మా నుండి కాదు ఇదిగో
నా పిడికిలి దెబ్బతో నీవు యమలోకానికి వెళ్లుతావు" అని హనుమ హుంకరించాడు.
రావణుడు మహాగ్రహంతో "ఓరీ వానరా! ఏదీ నీ ప్రతాపాన్ని చూపు. ముందు నా చేతి దెబ్బను రుచి చూడ"మని తన బలాన్నంతటిని ఉపయోగించి హనుమను తన పిడికిలితో దెబ్బకొట్టాడు.
హనుమ ఆ దెబ్బతో ఊగి పోయాడు. తన శక్తినంతా కూడదీసికొని పడిపోకుండా ఎలాగో నిలదొక్కుకొన్నాడు. తేరుకొన్న తరువాత హనుమ బలంగా తన పిడికిలితో రావణుని కొట్టాడు.
రావణునికి కళ్లు బైర్లు కమ్మాయి. ఆ దెబ్బను తట్టుకోలేక విలవిలలాడాడు. కొంత సేపు స్పృహను కోల్పోయాడు. హనుమంతుని దేవతలు, వానరులు ప్రశంసలతో ముంచెత్తారు. కొంతసేపటికి రావణుడు తేరుకొని “హనుమా నేనింత వరకు ఇంత బలమైన పిడికిలి దెబ్బను చూడలేదు". అని ప్రశంసించాడు.
*సాధు వానర వీర్యేణ శ్లాఘనియోసి మే రిపుః*
వాడి ప్రశంసలకు హనుమ సిగ్గుపడి "ఛీ చీ నా దెబ్బతిని కూడ నీవు బ్రతికి ఉన్నావంటే ఇంత బలహీనంగా ఉంటుంది. నా పిడికిలి పోటు" అని నేను ఎన్నడు. అనుకోలేదు.
*ధిగ్ అస్తు మమ వీర్యం తు యత్ త్వం జీవసి రావణా*
"మరొక సారి మన బలాలను చూచుకొందాము" అని రావణునికి సవాలు విసిరాడు.
రావణుడు ఆ అవమానాన్ని భరింపజాలక మరింత బలంగా పిడికిలితో హనుమ వక్షాన్ని కొట్టాడు. హనుమ ఆ దెబ్బకు తల్లడిల్ల సాగాడు.
*హనుమాన్ వక్షసి వ్యూఢే సమ్చచాల హతః పునః*
*విహ్వలం తతు తదా దృష్ట్వా హనుమంతం మహా బలమ్*
వానర సేనాని అయిన నీలుడు హనుమ ప్రమాదాన్ని పసిగట్టి తాను ముందుకొచ్చి రావణుని ఎదురించాడు....
*రామాయణానుభవం_ 192*
రావణుడు నీలునిపై భయంకరమైన బాణవర్షాన్ని కురిపించాడు. నీలుడు నేర్పుతో తప్పించుకోని రావణుని పై పెద్ద పర్వత శిఖరాన్ని విసిరాడు. అంతలో తెప్పరిల్లిన హనుమ రావణుని పైకి దుముక దలచి ఇంకొకరితో పోరాడుతున్న వానిపై దండెత్తుట మంచిది కాదని ఊరుకొన్నాడు.
రావణాసురుడు నీలుడు ప్రయోగించిన పర్వతాన్ని దారి మధ్యలోనే ఖండించి, ఆయన వరుసగా వేస్తున్న మహా వృక్షాలను నేలకూల్చాడు. నీలునిపై అపార శరవర్షాన్నికురిపించ సాగాడు.
ఆ బాణ వర్షాన్నుండి తప్పించుకోవడం కొరకు నీలుడు తన దేహాన్ని చిన్నగా చేసికొని, రావణుని రధముపై, ధ్వజముపై, ఆయన భుజములపై, కిరీటముపై మహావేగంగా వాలుతూ ఆయనను నొప్పించాడు.
నీలుని వేగానికి, ఆయన నేర్పుకు దేవతలు, నరులు వానరులు ఆయనను ప్రశంసించారు. రావణుడు కూడ నీలుని, చురుకుదనానికి ఆశ్చర్యపడి, ఆయనను సంహరించడానికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు.
ఆ ఆగ్నేయాస్త్రానికి అగ్ని తనయుడైన నీలుడు అసువులు పోగొట్టుకోలేదు. కాని తెలివి తప్పి నేలపై పడిపోయాడు.
అంతవరకు అవకాశము కొరకు ఎదురుచూస్తున్న లక్ష్మణుడు రావణునెదిరించి "ఓరీ రాక్షసాధమా! వానరులపై నీ పరాక్రమాన్ని చూపి, దానికే గర్విస్తున్నావా ? ఇదే నీ గర్వాన్ని నేల మట్టము చేస్తాను" అని హుంకరించాడు. లక్ష్మణుని మాటలను లక్ష్యపెట్టక రావణుడు "రాజకుమారా! నీకు నరకానికి వెళ్లాలని కోరిక ఉంటే నా ముందు వచ్చి నిలువు. నిన్ను క్షణంలో పంపిస్తాను" అని భయంకరంగా అరిచాడు.
*దిష్ట్యాసి మే రాఘవ దృష్టి మార్గం*
*ప్రాప్తో అంత గామీ విపరీత బుద్ధిః*
*అస్మిన్ క్షణ యాస్యసి మృత్యుదేశం*
*సంసాద్యమానో మమ బాణ జాలైః*
"మాటలను చాలించి సమరానికి సమాయత్తం కమ్మని" లక్ష్మణుడు అధిక్షేపించాడు. రావణుడు ప్రయోగించిన ఏడు భయంకర బాణాలను లక్ష్మణుడు తన బాణాలతో మధ్యనే ఖండించాడు.
కోపంతో రావణుడు మరింత తీవ్రంగా బాణాలను వేశాడు. లక్ష్మణుడు వాటిని
చాల దూరంలోనే వ్యర్ధం చేశాడు. లక్ష్మణుడు రావణుని గర్వమణచదలచి వజ్రాయుధమువలె తీక్షములై, యమ దండము వలె క్రూరమైన బాణ పరంపరను రావణునిపై ప్రయోగించాడు.
రావణుడు ఆ బాణాలను మధ్యలోనే త్రుంచివేసి, ఇక లక్ష్మణుని బ్రతుకనివ్వ వద్దని తలచి తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన అమోఘమైన బాణాలను లక్ష్మణుని పై ప్రయోగించాడు. వాటిని కూడా లక్ష్మణుడు మధ్యలోనే ఖండించి, తక్షణమే మూడు పదునైన బాణాలను రావణుని గుండెను పగులగొట్టడానికి ప్రయోగించాడు. రావణుని వక్ష స్థలము రక్తసిక్తమైంది. ఆయన తెలివి తప్పాడు. కొద్ది సమయంలో రావణుడు తేరుకొని బాణ యుద్ధంలో లక్ష్మణుని జయించుట అసాధ్యమని గ్రహించి తనకు బ్రహ్మ వరప్రసాదంగా లభించిన, అగ్నివలె మండుతున్న ఆది ఘంటాశక్తిని లక్ష్మణునిపై ప్రయోగించాడు.
సౌమిత్రి ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి అనేక శరాలను ప్రయోగించాడు. కాని వర ప్రసాద లబ్ధమైన ఆ మహాశక్తి లక్ష్మణుని అశక్తుని చేసింది. లక్ష్మణుడు తెలివి తప్పినేల కూలాడు.
*స శక్తిమాన్ శక్తిసమాహతః సన్*
*ముహుః ప్రజజ్వాల రఘుప్రవీరః*
*తం విహ్వలంతం సహసాభూపేత్య*
*జాగ్రాహ రాజా తరసా భుజాభ్యాం*
రావణుడు లక్ష్మణుని శరీరాన్ని ఎత్తుకొని పోవదలిచాడు. నేలపై పడిన లక్ష్మణుని దేహాన్ని తన బలాన్నంతటిని ప్రయోగించి ఎత్తదలిచాడు. అయితే అది రావణునికి సాధ్యముకాలేదు. ఆయన తల వంచుకొని తిరిగి పోయాడు.
లక్ష్మణుని నేల పాలుచేసి అతనిని ఎత్తుక పోవాలనుకొన్న రావణుని చూచి, అమిత బలపరాక్రముడైన హనుమ శత్రువును సమీపించి, ఆయన వక్షస్థలంలో వజ్ర సమానమైన తన పిడికిలితో తీవ్రమైన దెబ్బను కొట్టాడు. ఆ దెబ్బకు తాళలేక రాక్షస రాజు మోకాళ్లపై నేల కూలాడు. రక్తం కక్కుకో సాగాడు. అతి కష్టం మీద రథములో వాలిపోయాడు.
హనుమంతుడు అతి సులభంగా లక్ష్మణుని తన భుజాలపై వేసికొని శ్రీరాముని సన్నిధికి తెచ్చాడు.
*వాయుసూనోస్సుహృత్వేన*
*భక్త్యా పరమయాచ సః*
*శత్రూణామకంప్యోపి* *లఘుత్వమగమత్కపేః*
"మూడు లోకాలను గడగడలాడించిన, కైలాస పర్వతాన్ని కదిలించివేసిన శత్రు భయంకరుడైన రావణాసురుడు తన సైనికులతో సహా ఏ కొంచెము కూడ కదలించజాలని లక్ష్మణునిని ఒక కోతి, దాని స్నేహ భావము వలన, దాని పరమ భక్తి వలన తేలికగా ఎత్తాడు" అంటాడు వాల్మీకి మహర్షి.
**
హనుమంతుని ముష్టిఘాతము నుండి తేరుకొన్న రావణుడు మళ్లీ ధనస్సునెత్తి వాసర సేనపై భయంకర బాణాలను ప్రయోగించసాగాడు. వానర సైన్యమంతా భయంతో చెల్లాచెదురైంది.
అప్పుడు రామభద్రుడు స్వయంగా రణానికి సమాయత్తమయ్యాడు. అంతలో హనుమ ముందుకు వచ్చి తన వీపుపై ఎక్కి రావణునితో యుద్ధం చేయుమని శ్రీ రాముని ప్రార్ధించాడు. వైరోచనుని పైకి విష్ణువు వెళ్లినట్లు రావణుని పైకి శ్రీరాముడు వెళ్లి గంభీరంగా ఇలా అన్నాడు.
"రావణా నిలువు! నీవు ఇంద్రుడిని, యముడిని, భాస్కరుని, అగ్నిదేవుని, శంకరుని ఆశ్రయించినా నా నుండి తప్పించుకోలేవు.
*యదీంద్రవైవస్వతభాస్కారాన్వా*
*స్వయంభు వైశ్వానరశంకరాన్వా*
*గమిష్యసి త్వమ్ దశవా దిశో థవా*
*తథాపి మే నాద్య గతో విమోక్ష్యసే*
నేనొక్కడినే సకలాయుధ సంపన్నులైన పద్నాలువేల రాక్షస సైనికులను మూడు గడియలలో పాతమార్చాను" శ్రీరాముని మాటలకు కోపించిన రావణుడు _రామవాహనమైన హనుమను అగ్ని సమాన బాణములతో బాధించాడు. బాణాలను సహిస్తూ హనుమ తన తేజస్సును మరింత పెంచుకొన్నాడు.
అప్పటికే లక్ష్మణుని శక్తితో కొట్టిన రావణునిపై రామునికి అగ్రహము జ్వలించింది. ఇప్పుడా అగ్రహ జ్వాల హనుమను బాధించుట అనెడి నేయితో మరింత జ్వలించింది.
శ్రీరాముడు సహజ శాంత స్వభావుడు. తనకేదైనా ప్రమాదము కలిగితే సహిస్తాడు.
'క్షమయా పృథివీ సమః' అంటాడు మహర్షి ఓర్పులో భూమి అంతటివాడు.
అయితే తన ఆశ్రితులకు ఎవ్వరైనా బాధకల్గిస్తే సహించడు. రావణుడు లక్ష్మణుని మూర్ఛాక్రాంతుని చేయగానే రామునికి కోపము కలిగింది. ఇప్పుడు హనుమను రావణుడు గాయపరచగానే రాముడు కోపానికి వశమయ్యాడు.
మొదటి దానితో రాముడు కోపాన్ని తెచ్చుకొన్నాడు. ( *క్రోధమాహరయద్రామః* ) • రెండవ దానితో కోపానికి వశుడయ్యాడు (*కోపస్యవశమేయివాన్* )
శ్రీరాముడు క్రూర బాణ పరంపరతో రావణుని రథాన్ని సారధి అశ్వ, సమస్తాయుధ సమేతంగా పగులగొట్టాడు. మరొక వజ్రకఠోర బాణంతో రావణుని హృదయాన్ని ఛేదించాడు. రావణుడు ఆ బాణ తీవ్రతకు తట్టుకోలేక మిక్కిలి ఆర్తి (బాధ) చెంది, ఒక చోట నిలువ లేక, తన చేతిలోని చాపాన్ని కూడ వదలివేశాడు.
ఎవ్వడైతే వజ్రపు దెబ్బలను, పిడుగుపాటులను తిని కూడా ఏమాత్రము బాధపడలేదో, కదలలేదో, అటువంటి రావణుడు రామ బాణంతో అమితంగా బాధచెంది చక్కగా నిలువలేక, చేతిలోని చాపాన్ని కూడ వదలి వేశాడు.
*యోవజ్రపాతాశని సన్నిపాతాత్* *సచుక్షుభేనాపిచచాల రాజా*
*స రామబాణాభిహతో బృశార్త*
*చచాల చాపం చ ముమొచ వీర* అంటాడు మహర్షి
శ్రీరాముడు మరొక అర్ధ చంద్రాకార బాణంతో రావణుని కిరీటాన్ని నేలపాలు చేశాడు.. కాంతిని కోల్పోయిన సూర్యుని వలె, నిప్పు ఎల్లారిన బొగ్గువలె, తెగిపడిన కిరీటంతో తేజస్సును కోల్పోయిన రావణుని చూచి, శ్రీరాముడు "ఇప్పుడు నీవు చాల అలసిపోయావు అందువలన ఇప్పుడు నీతో యుద్ధం చాలిస్తున్నాను.
*గచ్ఛ అనుజానామి రణార్ధితస్త్వం*
*ప్రవిశ్య రాత్రించర*
*రాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహిరథీ చ* *ధన్వీ తదాబలం ద్రక్ష్యసిమే రథస్థః*
"రావణా నీవు యుద్ధములో చాల అలసిపోయావు. నిన్ను నేను అనుమతిస్తున్నాను. నీవు లంకకు వెళ్లు. వెళ్లి సేదదీరు, బాగా తిను, త్రాగు నీ గాయాలను మాన్పుకో. మళ్లీ నీవు వచ్చేటప్పుడు అనేక రథాలను, అనేక ధనుస్సులను తెచ్చుకో. ఎందుకంటే నేను నీ అన్ని రధాలను నేల కూలుస్తాను. నీధనుస్సులను విరిచి వేస్తాను. అందువలన "అన్నీ తెచ్చుకోలేదే" అనే బాధ లేకుండా, నేను ముందుగానే చెప్పుతున్నాను. కనుక నీ దగ్గర ఉన్నన్ని రధాలను, ధనుస్సులను తెచ్చుకో!
అప్పుడు నా నిజమైన బలాన్ని చూస్తావు "అన్నాడు రాఘవుడు.
" అదేమిటి ఇప్పుడు నీ బలాన్ని నేను చూడలేదా"? అంటే ఇప్పుడు నాబలాన్ని కొంత రుచి చూచావు. నీవు
మళ్లీ వచ్చినప్పుడు పూర్తి బలాన్ని చూస్తావు".
ఇప్పుడు పూర్తి బలాన్ని ఎందుకు చూపలేదు ? అంటే రావణునికి ఒక అవకాశము ఇవ్వాలనుకొని కిరీటాన్ని మాత్రమే పడగొట్టాడు. లేక పోతే తలనే పడగొట్టేవాడు కదా! అయినా కిరీటం పోయినా, అభిమాన ధనుడైన రావణునికి ప్రాణం పోయిననట్లే కదా!.......
*రామాయణానుభవం_ 193*
రావణాసురుడు అవమానభారంతో అతివేగంగా లంకలోకి ప్రవేశించాడు. ఆ తరవాత శ్రీరాముడు విశల్యకరణాషధంతో వానరవీరులనూ లక్ష్మణుడినీ అందరినీ కుదుట పరిచాడు.
*స ప్రవిశ్య పురీం లన్కాం రామబాణ భయార్దితః*
*భగ్నదర్పస్తదా రాజా బభూవ వ్యథి తేంద్రియః*
రామబాణ పీడితుడై దర్పమూ రాజసమూ కోల్పోయి కలతచెందిన రావణుడు లంకలో ప్రవేశించి సింహపీడితమైన గజేంద్రంలాగా, గరుత్మద్బాధితమైన పన్నగేంద్రంలాగా అవమానంతో సెగలూ పొగలు కక్కుతున్నాడు. నిప్పులు గ్రక్కుతూ మీదమీదకి వచ్చిపడుతున్న రామబాణాలు అతని కళ్ళముందు ఆడుతున్నాయి. బంగారు సింహాసనంమీద సమావిష్టుడై రాక్షస మహావీరుల నుద్దేశించి ఇలా ప్రసంగించాడు
మహావీరులారా ! నేను చేసిన ఘోర తపస్సులు ఓడిపోయాయి. దేవేంద్ర సమానుడనని విర్రవీగిన నేను కేవలం ఒక మానవమాత్రుడి చేతిలో పరాజితుడనయ్యాను. మనుష్యునివల్ల నీకు ప్రమాదం ఉందని తెలుసుకో అన్న బ్రహ్మవాక్కు నిజమవుతోంది.
*ఇదం తద్బ్రహ్మణో ఘోరం వాక్యం మామభ్యుపస్థితమ్*
*మానుషేభ్యో విజానీహి భయం త్వమితి తత్తథా*
దేవదానవ గంధర్వయక్ష రాక్షస పన్నగాలనుంచే అవధ్యత్వం అడిగాను కానీ మానవులనుంచి అవధ్యత్వం అడగకపోయాను. నా వంశంలో పుట్టిన మహాపురుషుడు నిన్నూ నీ వంశాన్నీ సర్వనాశనం చేస్తాడని అనరణ్యుడు అలనాడు నన్ను శపించాడు. ఈ రాముడు అదే ఇక్ష్వాకువంశంలో పుట్టిన దశరథాత్మజుడు- మానవుడు. నన్ను శపించిన వేదవతియే ఈ సీత.
శప్తోహం వేదవత్యా చ యదా సా ధర్సితా పురా*
*సేయం సీతా మహాభాగా జాతా జనకానందిని*
ఉమ, నందీశ్వరుడు, రంభ, వరుణకన్యక పుంజకస్థల వీరు నలుగురూ ఇచ్చిన శాపాలు ఊరికే పోతాయా? ఋషివాక్కు వ్యర్థం కాదు.
*ఉమా నందీశ్వరశ్చాపి రంభా వరుణకన్యకా *
*యథోక్తాస్తపసా ప్రాప్తం న మిథ్యా ఋషిభాషితమ్*
ఇదంతా మనసులో ఉంచుకునే మనం యుద్ధం చెయ్యాలి. గోపురాగ్రభాగాలకూ, ప్రాకారాలకూ, ప్రాసాదాలకూ మహారాక్షసులు రక్షగా నిలవండి. నిద్రపోతున్న కుంభకర్ణుణ్ని లేపండి. నేను ఓడిపోయాననీ, ప్రహస్తుడు సంహరింపబడ్డాడనీ అతడికి చెప్పండి. ఈ కుంభకర్ణుడు నిశ్చింతగా సుఖంగా ఏడేసి నెలలు ఎనిమిదేసి నెలలు తొమ్మిదేసి నెలలు హాయిగా నిద్రపోతూంటాడు. నేటికి తొమ్మిది రోజుల క్రితం యుద్ధారంభంలో మనంచేసిన మంత్రాంగంలో పాల్గొన్నాడు. వెళ్ళి నిద్రలో మునిగిపోయాడు. వాడిని నిద్ర లేపండి..
*మంత్రం కృత్వా ప్రసుప్తోయామియస్తు నవమేహని*
*తం తు బోధయత క్షిప్రం కుంభకర్ణం మహాబలం*
**
రాక్షసవీరులు వేల సంఖ్యలో కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు. గంధమాల్యాదులనూ, మాంసభోజనాలనూ, రక్తకుంభాలనూ తీసుకుని యోజన విశాలమైన ద్వారంగుండా అతడి శయనాగారంలోకి ప్రవేశించారు. అది సర్వ సుగంధ పరిమళాలతో సుఖావహంగా ఉంది. కుంభకర్ణుడి నిఃశ్వాసాలతో ఎగిరిపోతున్న రాక్షసవీరులు ఆ గుహగోడలు ఆలంబనగా లోపలికి ప్రవేశించారు. చిదికిపోయిన పర్వతంలాగా బంగారు కుట్టిమం మీద వికృతంగా పడి నిద్రిస్తున్న ఆ కుంభకర్ణుడిని లేపడానికి రాక్షసులు విశ్వ ప్రయత్నం చేసారు.
భయంకరాలై అతడి నాసాపుటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. తెరుచుకున్ననోరు పాతాళ గహ్వరంలా ఉంది. బంగారు భూషణాలతో శరీరం ఒత్తుకుంటోంది. కిరీటం అట్టే ఉంది. మాంసం, రక్తం, కొవ్వు- ఇవ్వి నిలవవున్న వాసన కొడుతున్నాడు.
వాడి ఎదురుగా మాంసం రాసి పోసారు. మృగమహిష వరాహ జంతుజాలాన్ని చంపి పడేశారు. అన్నం మరో రాసిగా, రక్తకుంభాలనూ అక్కడ ఉంచారు. దివ్య సుగంధాలు వాడి శరీరమంతా పులిమారు. గంధ మాల్యాలు అలంకరించారు. ఏ సుగంధానికీ వాడు మేల్కోలేదు.
శంఖభేరీ పటహధ్వనులు చేసారు. ఆస్ఫోటిత కేళిత సింహనాదాలు చేసారు. అయినా వాడు లేవలేదు. ఇక ఇలా కాదని ఆ రాక్షసులు గదలతో శూలాలతో ముష్టిఘాతాలతో అన్ని వైపులనుంచీ కుళ్ళబొడిచారు. కేకలు అరుపులు బొబ్బలతో పెద్దకోలాహలం చేసారు. లేపలేకపోయారు. గుర్రాలతో, ఒంటెలతో, గాడిదలతో, ఏనుగులతో తొక్కించారు. ఇంతటి కోలాహలంతో లంకారాజ్యం అంతా మారుమ్రోగింది కానీ కుంభకర్ణుడు లేవలేదు. వెయ్యిభేరులను ఒకేసారి మ్రోగించారు. లాభం లేకపోయింది. నీటి కడవలు తెచ్చి చెవులలో పోసారు. కుంభకర్ణుడు కదలలేదు. మెదలలేదు.
ఒకే దెబ్బకు నూరుమందిని చంపగల ప్రచండగదలను (శతఘ్ని) తాళ్లకు కట్టి గిరగిరా త్రిప్పి కొట్టారు. ఏమిచేసినా వాడిలో చలనం లేదు. చివరగా ఒక వెయ్యి ఏనుగులను రప్పించి ఒక్కసారిగా వాడి శరీరంమీద పరుగులు పెట్టించారు. అప్పుడు వాడికి మెలకువ వచ్చి స్పర్శ తెలుసుకున్నాడు.
నిద్రాభంగం అవ్వడంతో ఆకలిగొని ఆవలిస్తూ లేచి కూచున్నాడు. పాముపడగల్లాగా ఉన్న బాహువులను సారించి పాతాళంవంటి నోటిని తెరచి వాడు భీకరంగా ఆవులించాడు. ఎర్రటి నోరు మేరుపర్వతం మీద సూర్యబింబంలా కనబడింది. గిరిశిఖరంనుంచి మేఘం కదలినట్టు లేచి నిలబడ్డాడు. మెరుపుల్లా మెరిసిపోతున్న వాడి కళ్ళు రెండు మహాగ్రహాల్లాగా ఉన్నాయి. ఎదురుగావున్న మాంసరాశినీ, శోణిత మధ్య కుంభాలనూ మహిషాదులనూ తేరిపారజూసాడు. ఆరగించడం మొదలుపెట్టాడు. తింటూ తాగుతున్నాడు. తాగుతూ తింటున్నాడు. అన్నీ కానిచ్చి తృప్తి చెందాడు.
ఈ తరుణంలో రాక్షసులు వంగి వంగి దండాలు పెడుతూ సమీపించారు. నిద్రాకలుషిత నేత్రాలతో అన్ని వైపులకూ దృష్టి సారించి రాక్షసులను చూసాడు. వాళ్ళ భయాన్ని గుర్తించాడు. అభయం ఇచ్చాడు.
*కిమర్థమహామాదృత్య భవద్భిః ప్రతిబోధితః*
*కచ్చిత్సుకుశలం రాజ్ఞో భయం వానేష వానకిం*
రాక్షసులారా ! ఎందుకు నన్ను నిద్రలేపారు. రాజు కుశలమేనా? ఏదయినా ప్రమాదం ముంచుకు వచ్చిందా? చెప్పండి. దేవేంద్రుణ్ణి చంపేసి అగ్నిదేవుణ్ని ఆర్పేసి రాజుకు వచ్చిన భయం తొలగిస్తాను. చెప్పండి. చిన్నపనికోసమే అయితే అన్నగారు. నన్ను నిద్రలేపడు. ఏదో పెద్దకారణమే ఉండి ఉండాలి. అదేదో సత్యం చెప్పండి.......
*రామాయణానుభవం_ 194*
రావణమంత్రి సత్తముడు యూపాక్షుడు కుంభకర్ణునికి నమస్కరించి- మహానుభావా! దేవతలవల్ల భయంలేదు. కానీ ఇప్పుడు రాజుగారికి మానవమాత్రుడివల్ల ప్రమాదం ముంచుకు వచ్చింది- అనిమొదలుపెట్టి రావణ పరాజయం వరకూ జరిగినదంతా విన్నవించాడు.
అన్నగారి ఓటమి కుంభకర్ణుడికి కోపకారణం అయ్యింది. కళ్ళు విప్పార్చి- ఇప్పుడే వెళ్ళి వానర సైన్యాన్నీ రాముణ్నీ పరిమార్చి తిరిగి వచ్చాకనే రావణాసురుణ్ని చూస్తాను. కపివీరుల మాంసశోణితాలతో మీకందరికీ నేడు విందు చేస్తాను. రామలక్ష్మణులు రక్తం మాత్రం నేనే త్రాగుతాను అంటూ కదలబోతున్న సమయంలో
మహాత్మా! ముందు భ్రాతృదర్శనంచేసి వారి మాటలు విని గుణదోష విమర్శచేసి అటుపిమ్మటనే శత్రువధకు పూనుకోవచ్చును గదా! అని మహోదరుడనే మరోమంత్రి సలహా ఇచ్చాడు.
కొందరు రాక్షసులు పరుగు పరుగున వెళ్ళి కుంభకర్ణుడు నిద్రలేచాడనే శుభవార్తను రావణుడికి అందించారు. అటునుంచి అటే రణరంగానికి వెళ్ళమంటావో లేక ఇటువచ్చి వెళ్ళమంటావో అడిగి రమ్మన్నాడు ప్రభూ ! అంటూ విన్నవించారు.
ముందుగా నేను సోదరుణ్ని చూడాలనుకుంటున్నాను. యథోచిత సత్కారాలతో ఇటు తీసుకురండి అని రావణుడు ఆజ్ఞాపించగా ఆ వర్తమానం విని కుంభకర్ణుడు ముఖప్రక్షాళనం చేసుకుని, స్నానం చేసి, దివ్య వస్త్ర విభూషణాలంకృతుడై, రాజసభా మంటపానికి కాలయముడులా కదలివచ్చాడు.
*ప్రక్షాల్య వదనం హృష్టః స్నాతః పరమభూషితః*
*పిపాశుస్త్వరాయమాస పానం బాలసమీరనామ్*
అతడు అడుగుతీసి అడుగు వేస్తోంటే. భూమి కంపిస్తోంది. తన ఎత్తయిన శరీరపు కాంతులు సౌధాగ్రాలపై పడి వాటిని ప్రకాశింపజేస్తున్నాయి. పౌరులంతా అంజలిబద్ధులై ఇరువైపులా నిలబడి చూస్తుండగా ఠీవిగా తరలి వచ్చాడు.
తన తేజస్సుతో సూర్యుణ్ని తాకుతున్న ఈ కుంభకర్ణుడి మహాద్భుత స్వరూపాన్ని లంకా ప్రాకారంనుంచి చూసిన కపివీరులు - కొందరు గుండెలు పగిలి జారిపడగా, కొందరు రామునిదగ్గరకు పరుగుతీసి రొప్పుతూ రోజుతూ శరణువేడారు. మరికొందరు దిక్కులుపట్టి పారిపోతే ఇంకొందరు భయంతో, పారిపోవడానికి కాళ్ళు ఆడక ఉన్నచోటనే పరుండి పోయారు.
ఈ కోలాహలం అంతా గమనించిన రాముడు ధనుర్ధారియై నిలిచి, ఎదురుగా ప్రాకారం మీదనుంచి కనబడుతున్న పర్వతాకారాన్ని చూసి ఆశ్చర్యచకితుడై వీడు ఎవడు? వీడి కథ ఏమిటి? అని విభీషణుడిని అడిగాడు.
సూర్యవంశ సంభవా ! ఎవడిచేత యుద్ధంలో వైవస్వతుడూ దేవేంద్రుడూ ఓడింపబడ్డారో ఆ మహావీరుడు విశ్రవసుని కుమారుడు కుంభకర్ణుడు వీడే. వీడిచేతిలో ఓడిపోని దేవతలు లేరు. దేవతలపాలిట యముడు. తక్కిన రాక్షసులకు బలం తపస్సులవల్ల వచ్చింది. వీడిబలం మాత్రం సహజసిద్ధం. ఒకప్పుడు మానవులను దేవతలనూ ఋషులనూ గుంపులు గుంపులుగా చంపి ఏడు నమిలి మింగేస్తూంటే అంతా వెళ్ళి దేవేంద్రుడికి మొరపెట్టుకున్నారు. అతడు యుద్ధానికి దిగాడు. వజ్రాయుధం విసిరాడు. అది వీడిని ఏమీ చెయ్యలేక ఓడిపోయింది. ఐరావతం కోరను అనాయాసంగా పెరికి దానితో దేవేంద్రుణ్ని వక్షఃస్థలంమీద పొడిచిన మహాఘనుడు వీడు. వీడికి ప్రజాభక్షణము, దేవతా పీడనము, ఆశ్రమ ధ్వంసనము, పరస్త్రీహరణము ఇవి నాలుగే పనులు. ఇది తెలిసిన బ్రహ్మ కోపించి ఈ రోజునుంచి నువ్వు మృతప్రాయుడవై పడి ఉంటావు అని శపించాడు.
రావణాసురుడు ప్రార్ధించగా ఆరునెలలు నిద్రిస్తాడు. ఒకరోజు మేల్కొంటాడు. మళ్ళీ ఆరునెలలు నిద్రిస్తాడు అని శాపవిమోచనం ఇచ్చాడు..
*రావణస్య వచః శ్రుత్వా స్వయంభూరిదమబ్రవీత్*
*శాయితా హ్యేసా షణ్మాసానేకాహం జాగరీస్యతి*
మెలకువగా ఉన్న ఒక్కరోజులోనూ వీడు చేసే జీవహింస, ప్రాణి భక్షణలకు అంతులేదు. బ్రహ్మదేవుడు ఆ శాపమే ఇచ్చి ఉండకపోతే ఈపాటికి ఈ భూమిమీద ఏ ప్రాణీ మిగిలి ఉండేదికాదు. రామభద్రా! -
నీకు భయపడిన రావణాసురుడు ఈ కుంభకర్ణుణ్ని నిద్రలేపి యుద్ధానికి పంపుతున్నాడు. ప్రాకారంనుంచి బయటకు వచ్చి ఆవురావురుమంటూ వానరులను వందలూ వేలూగా భక్షిస్తాడు.
చూడు ప్రభూ! వానరులంతా చెట్టుకొకరూ పుట్టకొకరూగా బెదిరి పారిపోతున్నారు. అందుచేత త్వరగా నీవు వెళ్ళి వాడు రాక్షసుడు కాదు ఒక యంత్రము అని ప్రకటించు వానరుల భయం కొంత తగ్గుతుంది.
*ఉచ్యంతాం వానరాః సర్వే యంత్రమేతత్సముచ్ఛ్రితం*
*ఇతి విజ్ఞాయ హరయో భవిష్యం తీహ నిర్భయాః*
**
కుంభకర్ణుడు రావణ భవనాన్ని చేరాడు. పరాకుతో ఉన్న ప్రభువుకు వందనము చేసి తనను అత్యవసరంగా లేపిన కారణాన్ని తెలుపుమని కోరాడు.
కుంభకర్ణుడు నిద్రించే సమయంలో రాక్షసులకు కలిగిన విపత్తును రావణాసురుడు తమ్ముడికి వివరింపసాగాడు. "సోదరా! నీవు అదృష్టవంతుడవు. కంటినిండా నిద్రించడము, కడుపునిండా తినడం నీకు లభించిన వరాలు. నేను నీపట్ల ప్రేమతో నీ నిద్రాహారాలకు ఎన్నడూ భంగం కలిగించ లేదు.
అంతమాత్రాన అనేక సమయాలలో శత్రువులతో యుద్ధాలు కలిగినప్పుడు, వాటిలో నేను విజయాలు సంపాదించడంలో నీ సహాయాన్ని నేనెన్నడు మరువజాలను. ఇప్పుడు కూడ నాకు భయంకరమైన ప్రమాదము సంభవించింది. ఒక మానవ మాత్రుడైన రాముడు ఎవ్వరు ఎన్నడు ఊహించని విధంగా సముద్రముపై సేతువును నిర్మించి దాని ద్వారా లంకలో ప్రవేశించాడు. ఆయన లంకానగరాన్ని అల్లకల్లోలం చేశాడు. అకంపనుడు, ప్రహస్తుడు మొదలైన విఖ్యాత వీరులు అనేకులు రాముని చేతిలో చచ్చారు. అంతెందుకు? యుద్ధరంగానికి వెళ్లిన ఏ వీరుడు కూడ సురక్షితంగా తిరిగి రాలేదు.
నీవిప్పుడు యుద్ధం చేసి ఆ రామలక్ష్మణులను, వానర వీరులను చిత్రవధ చేయక పోతే మన లంకలో స్త్రీలు, బాలురు, వృద్ధులు మాత్రమే మిగులుతారు. రాక్షస జనులను రక్షించేవాడివి నీవు ఒక్కడివే". దీనంగా తన పరాక్రమాన్ని ప్రశంసిస్తూ తన సహాయాన్ని అర్ధిస్తున్న అన్నను చూచి కుంభకర్ణుడు నవ్వాడు.
*దృష్టో దోషో హి యో అస్మాభి పురా మంత్ర వినిర్ణయే*
*హితే ష్వనభిరక్తేన సోయా మాసాది తస్త్వయా*
హితోపదేశము "అన్నా ! ఆనాడు మేము చెప్పిన మాటను విన్నావా ? యుద్ధము వలన సర్వ రాక్షస సంహారము జరుగుతుందని మేము చెప్పినప్పుడు" జనన మరణాలు సహజాలే! యుద్ధంలో వీరులకు మరణము ద్వారా స్వర్గము లభిస్తుంది" అన్నావే?
ఒక ఆడదానిపై కామం వలన అందరిని వదలు కోవడానికి సిద్ధమయ్యావే ? నీవు
"సీతాపహరణమనే" మహా పాపాన్ని చేసినందు వలన ఆ పాప ఫలాన్ని నీవు ఇప్పుడు అనుభవిస్తున్నావు.
"సీతను తీసుక రావడానికి ముందు ఎవ్వరినైనా అడిగావా? రాముడు ఖరదూషణాది, పద్నాల్గు వేల రాక్షసులను నిష్కారణంగా వధించాడు. రామునిపై ప్రతీకారం తీర్చుకోవ డానికి నేను సీతను అపహరించి తెస్తాను. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి?" అని మాతో విచారించావా ?
చిన్న వ్యాపారము చేయ దలచినవాడు దాని వలన కలిగే లాభనష్టాలను విచారించి, ఒక నిర్ణయాన్ని తీసికొంటాడే! ఇంత పెద్ద యుద్ధాన్ని నెత్తిపై తెచ్చుకోవడం రాజనీతి లక్షణమా?
యుద్ధనీతి నీకు తెలియదా ? శత్రువు బలహీనుడైనప్పుడు ఆయనపై దండెత్తి వెళ్లాలి. శత్రువు మనతో సమాన బలుడైతే "సంధి" చేసికోవాలి. శత్రువు బలవంతుడైతే, ఆయన కోరినదేదో ఇచ్చి అతని నాశ్రయించాలి.
మంత్రులైన వారు శాస్త్రాలను చక్కగా చదివి, దేశకాల పాత్రాలను చక్కగా పరిశీలించి రాజుకు హితకరమైన సలహా ఇవ్వాలి కాని రాజుకు ముఖ ప్రియమైన మాటలు చెప్పే స్వభావం కలిగి ఉండకూడదు.
నీ మంత్రులు నీకు మిత్రులవలె కనబడు శత్రువులు. వారు నిన్ను నిరంతరము మెచ్చుకొంటూ నీ వలన లాభపడేవారే కాని నీకు హితము చెప్పేవారు కాదు.
మహారాజు తన మంత్రులు చెప్పే సలహాలలో మంచివి స్వీకరించి చెడును వదిలితే, ఆ మంత్రులు కూడ జాగ్రత్తగా ఆలోచించి సలహాలిస్తారు.
చక్కని మంత్రులు లేని రాజు చిల్లులుపడిన ఓడ వంటివాడు. ఆయన పతనం కాక తప్పదు" అని విరమించాడు......
*రామాయణానుభవం_ 195*
రావణునికి మహోదరుడు ఒక దుష్టోపాయాన్ని తెలిపాడు. "మహారాజా! కుంభకర్ణునితో పాటు నేను, ద్విజిహ్వుడు, వితర్దనుడు, సంప్రది అనే నల్గురము కలసి యుద్ధరంగానికి వెళ్ళుతాము. మా శాయశక్తుల యుద్ధము చేసి రామలక్ష్మణులను సంహరించడానికి ప్రయత్నిస్తాము.
ఒకవేళ మా ప్రయత్నము ఫలిస్తే నీకే బాధ ఉండదు. చనిపోగా మిగిలిన వానర సైన్యము కిష్కంధకు వెళ్ళిపోతుంది.
ఒకవేళ మా ప్రయత్నం ఫలించుకున్నా రామబాణాలతో మా శరీరాలు గీరుకొని, రక్తము కారే దేహాలతో లంకకు తిరిగివచ్చి, "మాకు రామలక్ష్మణులకు మధ్య ఘోర యుద్ధము జరిగిందని, ఆ యుద్ధములో రామలక్ష్మణులను చంపివచ్చామని చెపుతాము". ఆ వార్తను లంకానగరమంతట చాటించు, మాకు అందరి సమక్షంలో బహుమానాలు ఇవ్వు.
దీనివలన లంకానగర రాక్షసులే కాక సీత కూడా రామలక్ష్మణుల మరణ వార్తను నమ్మి తీరుతుంది.
తన రామలక్ష్మణులు, మరణించారని, వానరులెవ్వరు తనను రక్షించడానికి సిద్ధంగా లేరని తెలిసికొన్న సీత విధిలేక నీ ఆశ్రయాన్ని .అప్పుడు నీవు కోరుకొన్న అమర సుఖాలను ఆమె ద్వారా పొందవచ్చు".
ఈ కపటోపాయాన్ని కుంభకర్ణుడు తీవ్రంగా ప్రతిఘటించాడు. "అయితే రామలక్ష్మణులను యుద్ధంలో చంపాలి, లేదా తాను చావాలి కాని, పిరికిపందలవలె రక్తము శరీరానికి పూసుకొనివచ్చి, రామలక్ష్మణులను సంహరించి వచ్చామని గొప్పగా చెప్పుకొంటే ఆ నటన ఎంతవరకు నిలుస్తుంది?
రామలక్ష్మణుల, వానర వీరుల విజయధ్వనులు విన్న రాక్షస సైనికులు మన గురించి ఏమనుకుంటారు? సీతాదేవి రామలక్ష్మణుల పరాజయ వార్తను ధృవపరచుకోకుండా ఉండగలుగుతుందా? వెంటనే తొందరతో తాను లొంగిపోతుందా? ఇవన్నీ పిరికిపందల ఊహలు, పిరికపందల చర్యలు" అని కుంభకర్ణుడు మహోదరుని నోరు మూయించాడు.
తనకు మహోదరుని వంటి పిరికిపందల సహాయమేమి అవసరములేదని, తానొక్కడే పోయి రామలక్ష్మణులను సంహరించి, వానర సైన్నాన్ని చీల్చిచెండాడి వస్తానని తెలిపాడు.
రావణుడు మహోదరుని మందలించి కుంభకర్ణుని ధైర్యాన్ని ప్రశంసించాడు. "అంతటి ఆపద అనే సముద్రం నుండి తమను గట్టెక్కించే గట్టి పడవ ఆయనే" అని కుంభకర్ణుని వెన్నుదట్టి మెచ్చుకున్నాడు..
*కశ్చిన్మే త్వత్సమో నాస్తి సౌహృదేన బలేన చ*
*గచ్ఛ శత్రువధాయ త్వం కుంభకర్ణజయాయ చ*
తమ్ముడా! నీ దేహాన్ని చూడగానే వానరులు ప్రాణాలను భయంతో కోల్పోతారు.
రామలక్ష్మణుల గుండెలవిసిపోతాయి. అయినా నీవు ఒక్కడివి యుద్ధానికి వెళ్ళకూడదు. వానరులు ప్రచండవీరులు. కంపన ప్రహస్తాదులను యమలోకానికి పంపినవారు.
నీవు మహాసేనను తీసికొని వెళ్ళు. మన శత్రువులందరిని సంహరించి తిరిగిరమ్మని చెప్పి రావణుడు తన బంగారు పీఠాన్ని దిగి, మెరిసే రత్నహారాన్ని, రత్న ఖచితమైన ఉంగరాన్ని, బంగారు నగలను, భుజకీర్తులను, చెవి కుండలాలను తమ్ముడికి తానే అలంకరించాడు.
*దివ్యాని చ సుగంధినీ మాల్యదామాని రావణః*
*శోత్రేచా సంజయామాస శ్రీమతి చాస్య కుండలే*
ఆ సొమ్ములతో ఆ మహావీరుడు హోమాగ్ని జ్వాలలాగా మెరిసిపోయాడు.
నల్లని మొలత్రాడు ధరించి, వాసుకి అని నల్లని పాముచే చుట్టబడిన మందర పర్వతము వలె ప్రకాశించాడు. చందన, పుష్పహారాలను ధరించాడు.
శత్రు రక్తధారలతో ఎఱ్ఱబడి, ఉక్కుతో నిర్మంపబడి, బంగారుచే భూషింపబడిన తన భయంకరమైన శూలాన్ని ధరించి, అన్నకు ప్రదక్షిణము చేసి, ఆయనకు నమస్కరించి, ఆయన కౌగిలించబడి యుద్ధరంగానికి భయంకర రూపంతో, మహాబలగర్వంతో బయలుదేరాడు.....
**
*తస్య నిష్పతతస్తుర్ణం కుంభకర్ణస్య ధీమతః*
*బభూవుర్ఘోరరూపాని నిమిత్తాని సమంతతః*
కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్లే దారి మధ్యలో అనేక అపశకునాలు ఎదురయ్యాయి.
అయినా ఆయన బెదరలేదు.
నిప్పు కణికల వంటి కళ్ళతో, భయంకరమైన కంఠధ్వనితో పిడుగులు వంటి అడుగు దెబ్బలను కల్గిస్తూ దేవతలకు సింహస్వప్నమైన కుంభకర్ణుడు యుద్ధభూమిలో ప్రవేశించాడు. ఘోర స్వరూపుడైన కుంభకర్ణుని చూచి పాదరసమువలె కపిసేన చెల్లాచెదరైంది.
అంగదుడు నీల, కుముద, గవాక్షాదులను చూచి, "మీరందరు మహావీరులే? ప్రాణములొడ్డి పోరాడడానికి వచ్చారే? శత్రువు రూపాన్ని చూడగానే పారిపోతున్నారా? ఎంత అవమానము?" అని వానరవీరులందరినీ సమీకరించాడు.
వారందరూ ధైర్యం తెచ్చుకొని మహావృక్షాలతో, పర్వతాలతో కుంభకర్ణునిపైబడ్డారు. ఆయన శరీరానికి తాకి, ఆయన దేహ బలానికి వృక్షాలు, పర్వతాలు చూర్ణమైపోయాయి.
ఆయన ఆగ్రహంతో పాములను గరుత్మంతుడు భక్షించునట్లు వేలాది కపులను నమిలి మ్రింగసాగాడు.
ద్వివిదుడు ఒక పర్వత శిఖరాన్ని కుంభకర్ణునిపైకి విసిరాడు. అది మధ్యలోనే రాక్షస సైన్యముపైబడి రాక్షస మూకలను, రధ, గజ, అశ్వ, సారధులతో చంపివేసింది.
ద్వివిదుడు మరొక కొండను రెండు చేతులతో బలంగా విసిరాడు. అది కూడా మధ్యలోనే పడి రాక్షస సైన్యాన్ని అధికంగా హతమార్చింది.
రాక్షసులు కూడ తమ బాణాలతో, ఆయుధాలతో వానరులను చెల్లాచెదరు చేశారు.
కుంభకర్ణుని చూచి, ప్రాణాలను దక్కించుకోదలచి వానరసేనలు చెల్లాచెదరయ్యే సమయంలో మహావీరుడైన ఆంజనేయుడు అనేక వృక్షాలను, పర్వత శినాలను కుంభకర్ణునిపై జడివానవలె ఎడతెరపి లేకుండా ప్రయోగించాడు. కుంభకర్ణుడు వాటిని తన శూలంతో తునాతునకలు చేశాడు.
ఆంజనేయుడు మరొక పెద్ద కొండ శిఖరాన్ని కుంభకర్ణునిపైకి విసిరాడు. అతడు దానితో చాలా బాధపడి రక్తము కక్కాడు. రాక్షసుడు కోపావేశంతో తన శూలాయుధాన్ని హనుమ వక్షస్థలముపై వేశాడు. అది తన వక్షాన్ని చీల్చగా రక్తము క్రక్కుతూ, పెద్దగా హనుమ అరుస్తూ నేలకూలాడు.
*స శూలనిర్భిన్నా మహాభుజాంతరః*
*ప్రవిహ్వలః శోణితముద్వామన్ముఖాత్*
*నానాద భీమం హనుమాన్ మహాహవే*
*యుగాంతమేఘస్తనితస్వనోపమం*
ఆంజనేయుడు పడిపోగానే వానర సైన్యము భయంతో పారిపోసాగింది. వారిని నిలిపి నీలుడు మరొక పర్వత శిఖరాన్ని కుంభకర్ణునిపై ప్రయోగించగా, రాక్షసుడు తన పిడికిలి దెబ్బతో ఆ పర్వత శిఖరాన్ని చూర్ణము చేశాడు.
నీలునితో పాటు శరభ, గవాక్ష, గంధమాదన, ఋషభులు చెట్లు, కొండలు, రాళ్లు, పిడికిలి దెబ్బలతో రాక్షసుని బాధించారు. అవన్నీ రాక్షసునికి ఈగ వాలినట్లు అనిపించాయి.
ఆ వానర వీరులను రాక్షసవీరుడు రెండు చేతుల నడుమ ఒత్తి, ముష్టి దెబ్బలతో పొడిచి, మోకాలుతో అదిమి, చేతితో కొట్టగా వారు నెత్తురు కక్కుతూ నేలబడ్డారు.
మిగిలిన వానరులను రావణ సోదరుడు నమిలి మ్రింగసాగాడు. వానర సైన్యంలో హాహాకారాలు చెలరేగాయి....
*రామాయణానుభవం_ 196*
వానరులందరూ కుంభకర్ణునితో యుద్ధం చేయసాగారు
అంగదుడు,హనుమ, సుగ్రీవుడు ఇలా అందరితో పోరు సల్పాడు....
సుగ్రీవుణ్ణి మూర్ఛితున్నిచేసి తన భుజం మీద వేసుకొని లంకవైపు వెళుతుండగా స్మృతి వచ్చి కుంభకర్ణుని భుజం నుండి జారిపోయాడు.
ముకు చెవులు కొరికి శ్రీరాముని సమీపం లో వాలాడు.
లక్ష్మణుడు రాక్షసుని నిలుపడానికి ఏడు భయంకరమైన బాణాలతో కొట్టాడు. వాటి దెబ్బలను లక్ష్మణుని లెక్క పెట్టని కుంభకర్ణుడు రామునివైపు ఒక కొండ శిఖరాన్ని విసిరాడు. రాముడు ఆ పర్వత శిఖరాన్ని ఏడు బాణాలచే ఖండించి వాటిని మధ్యలో పొడి చేశాడు.
వానరులు గుంపులుగా రాక్షసుని శరీరంపై ఎక్కారు. వాళ్ళను ఒక్కసారిగా రాక్షసుడు విదిలించివేశాడు.
శ్రీరాముడు బాణహస్తుడై రాక్షస సైనికులను అడ్డగించి, తన వింటి నారిని భయంకరంగా ధ్వనింపజేస్తూ, కుంభకర్ణునికి ఎదురుగా వెళ్ళాడు. "రాక్షసవీరా! ఇదిగో నేను రాముడిని, ధనుర్బాణహస్తుడినై నీకెదురుగా వచ్చాను.
నిన్ను ఇప్పుడే యమనగరానికి పంపడానికి సిద్ధంగా ఉన్నాను" అన్నాడు..
కుంభకర్ణుడు రాముని మాటలు విని పకపక నవ్వి "రామచంద్రా! నేను నీతో
సంహరింపబడిన వాలి, ఖరవిరాధ, కబంధాది సామాన్య వీరుల వంటి వాడిని కాను.
దేవదానవ, గంధర్వాదులకు భయంకరుడనైన కంభకర్ణుడిని. నీకు ప్రాణాంతమైన ముద్గరాన్ని చేతబట్టుకొని నిలుచున్నాను. నా ముక్కు చెవులను చూచి నవ్వవలసిన అవసరం లేదు. ముందు నీ పరాక్రమాన్ని కొంత పరీక్షించి తరువాత నిన్ను మింగివేస్తాను" అని గర్జించాడు.
*దర్శయేక్శ్వాకుశార్దుల వీర్యం గాత్రేషు మే లఘు*
*తతస్త్వాం భక్షాయిష్యామి దృష్ట పౌరుష విక్రమమ్*
రాముడు వేస్తున్న బాణాలను తన ముద్గరంతో ఎదుర్కొంటూ, వానరులను భయకంపితులుగా చేశాడు.
శ్రీరాముడు "వీడు సామాన్య శస్త్రాలకు లొంగడని గ్రహించి" "వాయవ్యాస్త్రాన్ని” ప్రయోగించి కుంభకర్ణుని చేతిని నరికివేశాడు.
మరొక చేతితో రాక్షసుడు ఒక వృక్షాన్ని ధరించి తనను కొట్టరాగా రాముడు "ఐంద్రాన్ని ప్రయోగించి, ఆ చేతిని కూడ నరికివేశాడు.
చేతులు నేలరాలినా కుంభకర్ణుడు రాముని పైబడుటకు రాగా రెండు అర్ధచంద్రాకార బాణాలతో అసురుని రెండు కాళ్ళను రాముడు విరుగగొట్టాడు.
కాళ్ళు, చేతులు విరిగినా కుంభకర్ణుడు కొండగుహ, వంటి నోరు తెరచిరాగా, శ్రీరాముడు వాడి నోటిలోకి బాణాలను క్రుచ్చాడు. అయినా పెద్దగా గర్జించి, రాక్షసుడు. పైపైకి రాగా, ప్రళయకాల మృత్యువు వలె భయంకరమై, వజ్రాయుధము వలె కఠినమై, వాయువు వలె వేగము గలదై, అగ్నిజ్వాలల వలె మండుతున్న ఐంద్రాస్త్రాన్ని శ్రీరాముడు ప్రయోగించగా, అది ఆ రాక్షసుని శిరస్సును నేలరాల్చింది.
సురులు, నరులు, ఋషులు, వానరలందరు శ్రీరాముని అసమాన పరాక్రమాన్ని వేనోళ్ళ ప్రశంసించారు. రాక్షసులు ఏడ్చారు. వృత్రాసురుని సంహరించిన ఇంద్రుని వలె రాముడు కూడా సంతోషించాడు....
**
కుంభకర్ణుని మరణవార్తను రాక్షస భటులు పరుగు పరుగున వెళ్ళి రావణునికి తెలిపారు.
పద్య లొకేటర్
*తం శ్రుత్వా వనిహతం సాంఖ్యే కుంభ కర్ణం మహా బలమ్*
*రావణ శోక సమ్తప్తో ముమోహ చ పాపాత చ*
రావణుడు ఆ వార్తను విని భరించలేక చాలాసేపటి వరకు మూర్ఛపోయాడు. రావణుని పుత్రులైన త్రిశిర, అతికాయ, నరాంతక దేవాంతకులు యముని వంటి భయంకరుడైన తమ పినతండ్రి మరణించాడని ఆయన బలాన్ని, ధైర్యాన్ని పొగడుతూ ఏడ్చారు.
రావణుడు, “తమ్ముడూ! ఇంద్రుని వజ్రాయుధానికి కూడా భయపడని నిన్ను రామ బాణాలు సంహరించాయా?
సోదరా! ఈ విషాద సమయానికెదురు చూచిన వానరులు కోట బురుజులపైకి ఎక్కి లంకలోకి దిగితే నేనేమి చేయాలి?
ఇంద్రుడు ఇప్పుడు దండెత్తి వస్తే నేనేమి చేయాలి? అయ్యో! అప్పుడు విభీషణుని మాటలు వింటే బాగుండేది కదా! ఆయన మాట విననందువలన ఇంత దుస్థితి దాపురించింది కదా? ధర్మాత్ముడైన విభీషణుని వెడలగొట్టిన పాపము నన్నిలా బాధిస్తున్నదే.
ప్రళయ కాలంలోని అగ్నివలె, మహారుద్రునివలె శత్రు భయంకరుడవైన నీవు నీ ప్రియ సోదరుని వదిలి ఎందుకు వెళ్ళావురా? నన్ను విడిచిపోవడం నీకు న్యాయమా? నీవు పోయాక నాకు ఎవ్వరు దిక్కురా? అని బేలతనంతో ఏడ్వసాగాడు.
తండ్రి దుఃఖాన్ని చూసి త్రిసురుడు ధైర్య వచనాలు పలుక సాగాడు.
రావణుని పుత్రులు నరాంతక, దేవాంతక, అతికాయ, త్రిశిరులనే వారు మహావీరులు. ఆకాశంలో సంచరింపగలవారు. శత్రు భయంకరులు, యుద్ధములో అపరాజయమెరుగని వారు.
వాళ్ళు మాత్రమేకాక, మహోదర, మహోపార్శ్వులు కూడా యుద్ధానికిసన్నద్ధులు అయ్యారు.
రావణుడు వారిని ప్రేమతో కౌగిలించుకొని, వారికి అనేక ఆభరణాలను అలంకరించి, ఆశీస్సులిడి, సమరానికి సాగనంపాడు. సూర్యుడస్తాద్రిని అధిరోహించినట్లు నల్లమబ్బువంటి రంగుగల్గి, ఐరావత వంశంలో జన్మించిన “సుదర్శన”మనే ఏనుగును మహోదరుడు అధిరోహించాడు.
మహాపార్శ్వుడు గదాయుధుడై కుబేరునివలె వెలిగిపోయాడు. త్రిశిరుడు ఉత్తమ జాతి గుఱ్ఱాలచే కట్టబడిన రథముపై భయంకరమైన ధనస్సును, మూడు బంగారు కిరీటాలను ధరించి బయలుదేరాడు.
ధనుర్థరులందరి చేత ప్రశంసింపబడిన పరాక్రమం గల అతికాయుడు మేరు పర్వతమువలె బంగారు భూషణకాంతులతో ప్రకాశిస్తూ, సర్వాయుధోపేతమైన రధముపై వెళ్ళాడు.
ఉచ్పై శ్రవంతో సమానంగా తెల్లని, స్వర్ణాభరణ భూషితమై, మహావేగంగల గుజ్జముపై వేలాయుధుడై నరాంతకుడు సమరానికి వెళ్ళాడు.
వజ్రాలచే అలంకరింపబడి, అతి భారవంతమైన ఇనుప గుదియను తీసుకొని దేవాంతకుడు యుద్ధానికి వెళ్ళాడు.
వారివెంట అసంఖ్యాకమైన రాక్షస సైన్యము రణరంగానికి భయంకర ధ్వనులతో వెళ్లింది.
"కుంభకర్ణుడనే మహా సముద్రాన్నే మట్టికరిపించిన మనకు ఈ పిల్లకాలువలు ఒక లెక్కా? అని మహోత్సాహంతో రాక్షస వీరులను ఎదుర్కోవడానికి వానరులు ఉత్సాహంగా ఉన్నారు.
వానరులు భూమిపై నిలిచి, ఆకాశానికి ఎగిరి శిలా వృక్షాలను వర్షించారు. రాక్షసులు బాణాలతో, ఆయుధాలతో వాటిని ఎదుర్కొన్నారు.
వానరవీరులు రాక్షసుల రధాలపై, గుఱ్ఱాలపై దుమికి ముష్టి దెబ్బలు కొట్టగా రాక్షసులు నేలపైబడి మరణించారు.
రాక్షసవీరులు ఇనుప గుదియలతో, శూలాలతో బాణ వర్షంతో వానరులను నిర్వీర్యం చేశారు.
ఈ విధంగా యుద్ధభూమి భయంకరంగా జరిగి సమర భూమి అంతా రక్త ప్రవాహంతో నిండిపోయింది.......
*రామాయణానుభవం_ 197*
అనేక రాక్షసుల తలలు ఏకకాలంలో నేలపాలు కావడాన్ని నరాంతకుడు చూడలేకపోయాడు.
నరాంతకుడు మరీ విజృంభించి ఖడ్గంతో వేటుకు ఏడుగురుచొప్పున సంహరిస్తున్నాడు. అప్పుడు సుగ్రీవుడు అంగదుణ్ని నరాంతకుడిమీదకు పంపించాడు. వెడుతూనే అంగదుడు వాడి రథాశ్వాలను చేతితో గుద్ది సంహరించాడు. రథం భగ్నం చేసాడు. మీదకి లంఘించబోతూంటే వాడి ఖడ్గాన్ని లాగి ముష్టిప్రహారంలో నెత్తురు కక్కించాడు. ఇంక మరి వాడు తేరుకోలేదు.
*అథాంతరిక్షే త్రిదశోత్తమానాం*
*వనౌకసాం చైవ మహా ప్రణాదః*
*బభూవ తస్మిన్ నిహతే అగ్ర్య వీరే*
*నరాంతకే వాలీ సుతేన సంఖ్యే*
ఇది చూసిన దేవాంతక త్రిశిర మహోదరులు కోపావేశంలో ఉన్మత్తులయ్యారు. అంగదుణ్ని ఎదుర్కొన్నారు. అంతలో కీ నీలుడువచ్చి మహాసాలవృక్షంతో మహోదరుణ్ని రథాశ్వాలతో సహా చిత్తుచిత్తు చేసాడు. వాడు మరింక లేవలేదు.
పినతండ్రియైన మహోదరుడు గతించడం కళ్ళారాచూసిన త్రిశిరుడు మరీ విజృంభించాడు. వాడియైన బాణాలతో హనుమదంగదులను హింసించాడు.
హనుమంతుడు కోపావేశంతో ఒక్క గెంతువేసి వాడి రథాశ్వాలను గోళ్ళతో చీల్చి చంపాడు. వాడు మహాశక్తిని ప్రయోగించాడు. దానిని హనుమంతుడు సగంలోనే అందుకొని తుత్తునియలు చేసాడు. వాడు ప్రచండవేగంతో ఖడ్గం విసిరాడు. నేర్పుగా దానిని పట్టుకొని కిరీట కర్ణకుండల విభూషితాలయిన వాడి శిరస్సులను మూడింటినీ త్రుటిలో తిరిగివేసాడు ఆంజనేయుడు. ఆపై దేవాంతకుడు కూడా మరణించాడు.
ఇలా ఒకరి తరవాత ఒకరుగా నలుగురూ వానరమహావీరుల చేతిలో మరణం పొందారు. ఇంకా మత్తానీకుడు, ఉన్మత్తుడు మొదలైన రాక్షస యూధముఖ్యులు ఎందరో మరణించారు. సుగ్రీవ సుషేణ నీల హనుమదంగదుల విజృంభణ రాక్షసులను సుడిగాలిలా చుట్టివేసింది.
రావణాసురుడి కుమారుడైన అతికాయుడు ధనుర్విద్యా విశారదుడు. అతడు లక్ష్మణుడితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. సమ ఉజ్జీగా పోరాడాడు. అస్త్ర ప్రయోగంలో ఒకరికొకరు తీసిపోలేదు. తనవద్ద ఉన్న సర్వాస్త్రాలనూ సర్వశస్త్రాలనూ లక్ష్మణుడు ప్రయోగించాడు. అవి ఏవీ అతికాయుణ్ని ఏమీ చెయ్యలేకపోయాయి. సౌమిత్రికి ఆశ్చర్యం వేసింది.
*బ్రహ్మదత్తవరో హ్యేషా అవధ్య కవచావృతః*
*బ్రాహ్మేణాస్త్రేణ భింధ్యేనమేష వధ్యో హి నాన్యథా*
*అవధ్యా ఏషా హ్యన్యే షామస్త్రానాం కవచీ బలి*
అప్పుడు వాయుదేవుడు వచ్చి - లక్ష్మణా ! ఈ అతికాయుడు బ్రహ్మదత్త వరంవల్ల అస్త్రశస్త్రాలకు అవధ్యుడు. ఒక్క బ్రహ్మాస్త్రానికే వీడు మరణిస్తాడు. క్షణం ఆలస్యం చేస్తే ప్రమాదం. వెంటనే బ్రహ్మాస్త్రం ప్రయోగించు అని ఉపదేశం చేసాడు. అంతే సౌమిత్రి బ్రహ్మాస్త్ర ప్రయోగంతో అతికాయుణ్ని భస్మం చేసాడు.
వీరందరి మరణవార్తలూ తెలిసి రావణుడు దిక్కుతోచక దుఃఖించాడు. సుగ్రీవ విభీషణాదులతో ఉన్న రామలక్ష్మణులను ఇంక ఎదుర్కోగల వాడెవ్వడు? మహారాక్షసవీరులంతా నిహతులయ్యారు.
*తం మన్యే రాఘవం వీరం నారాయణ మనామయమ్*
వర బలగర్వితులైన రాక్షస వీరులందరూ శ్రీరాముని పరాక్రమాగ్నికి దీపపు పురుగులై మాడిపోయారే? ఆ రాముడు ఎవ్వరు? నిజంగా నారాయణుడేనా? కాకుంటే అంతటి అసురమహావీరులు, అరివీర భయంకరులు యుద్ధానికి వెళ్ళినవారు అక్కడే మరణిస్తారా? అందులో ఎవ్వరు లంకకు తిరిగిరారా? అని రావణాసురుడు దుఃఖాన్ని, భయాన్ని పొందారు......
**
ఆ సమయంలో ఇంద్రజిత్తు వచ్చాడు.
*న తాత మోహమ్ ప్రతిగంతుమర్హసి*
*యత్రేంద్ర జిజ్జీవతి రాక్షసేంద్ర*
*నేంద్రారిబాణాభిహతో హి కశ్చిత్*
*ప్రాణాన్సమర్థః సమరేభిపాతుమ్*
తండ్రీ! ఈ ఇంద్రజిత్తు ఇంకా జీవించే ఉన్నాడు. నీవు ఇంతగా దుఃఖపడవలసిన పనిలేదు. నా బాణాలతో చీరుకుపోయిన శరీరాలు కలవారై రణరంగంలో పడి ఉన్న రామలక్ష్మణులను ఈరోజే చూస్తావు - అంటూ సెలవు తీసుకొని గాడిదలు పూన్చిన రథం అధిరోహించి వాయువేగంతో యుద్ధభూమికి తరలివచ్చాడు. భీషణాయుధాలు ధరించిన రాక్షసవీరులు భేరీ శంఖనినాదాలతో అతని వెంట వచ్చారు.
రణాగ్రభాగంలో సేనలను నిలిపి ఇంద్రజిత్తు అక్కడ అగ్నిని ప్రజ్వలింపజేసి లాజలతో (పేలాలు) హోమం చేసాడు. పుష్పాక్షతలతో అగ్నిని అర్చించాడు. తన ఆయుధాలు అన్నీ అగ్నిముందు ఉంచి నల్లని మేకను బలి ఇచ్చాడు.
ఇంద్రజిత్తు రథారూఢుడై ఆకాశంలో నిలబడి వానరులపై బాణవర్షం కురిపించాడు. పద్దెనిమిది బాణాలతో గంధమాదనుడిని, తొమ్మిది బాణాలతో దూరంగా ఉన్న నలుడిని, ఏడు బాణాలతో జాంబవంతుడిని, ముప్పది బాణాలతో నీలుడుని - ప్రాణస్నాయువులలో (ఆయువుపట్లు) తగిలేట్టు కొట్టి హింసించాడు.
సుగ్రీవ ఋషభ అంగద ద్వివిదులను దైవ ప్రసాదసిద్ధాలయిన తీవ్ర బాణాలతో కొట్టి సొమ్మసిల్లజేసాడు. ఒక్కక్షణంలో మనిషి కనబడుతున్నాడు. మళ్ళీ అంతలోకే మాయమవుతున్నాడు. ఇలా మాయాయుద్ధంతో అందరినీ దారుణంగా హింసించి రావణి వికటాట్టహాసం చేసాడు.
సుగ్రీవ, హనుమత్, అంగద, జాంబవత్, గంధమాదన, సుషేణ, వేగదర్శి, మైంద, ద్వివిద, నీల, గవాక్ష, గజముఖ, గోముఖ, కేసరి, హరిలోమ, విద్యుద్దంష్ట్రాది వానర మహావీరుల నందరినీ మంత్రసహితాలయిన వివిధాయుధాలతో వేధించాడు. అటుపైని రామలక్ష్మణులమీద బాణాలవర్షం కురిపించాడు.
ఆకారం కనబడడంలేదు. ఎటునుంచి ఎవరు వేస్తున్నారో తెలియడం లేదు. బాణాలుమాత్రం పిడుగులుగా వచ్చిపడుతున్నాయి. రాముడు గ్రహించాడు.
లక్ష్మణా ! మొన్నటిరోజున నాగాస్త్రంతో మనల్ని బంధించి వెళ్ళిపోయిన ఇంద్రజిత్తు ఇప్పుడు మళ్ళీ వచ్చాడయ్యా బ్రహ్మదేవుడిచ్చిన వరంవల్ల అంతర్హితుడై కూటయుద్ధం చేస్తున్నాడు. శరీరం కనబడని వ్యక్తిని చంపడం ఎలాగ? మొత్తం వానరసైన్యాన్ని బాణప్రవాహంలో ముంచెత్తి, మనల్ని ఇద్దరినీ మూర్ఛిల్లజేసి చనిపోయారని నిశ్చయించుకొని వీడు మళ్ళీ లంకలో కి వెళ్ళిపోతాడు. అందాకా ఓర్చుకో.
*అవాంతుదృష్ట్వా పతితౌ విసంజ్ఞౌ*
*నివృత్త యుద్ధౌ గతరోషహర్షౌ*
*ధ్రువం ప్రవేక్ష్యత్యమరారివాసః*
*మసౌ సమాదాయ రాణాగ్రలక్ష్మీమ్*
సరిగ్గా రాముడు ఊహించినట్టే ఇంద్రజిత్తు తీవ్రబాణాలతో వానరులను అందరినీ హింసించి చిట్టచివరకు సర్వసమ్మోహకమయిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వెనుదిరిగి లంకలోకి వెళ్ళిపోయాడు.....
*రామాయణానుభవం_ 199*
రావణాసురుడు పరమ క్రుద్ధుడై కుంభకర్ణుడి కుమారులైన కుంభనికుంభులను యుద్ధానికి పంపించాడు. వారితోపాటు యూపాక్ష, శోణితాక్ష, ప్రజంఘ, కంపనులు కూడా మహారాక్షస సైన్యంతో వానరసేనపై వచ్చిపడ్డారు. సంకులసమరం జరిగింది.
మహాబలశాలియైన అంగదుడు కంపనుణ్ని ఎదిరించి గిరిశృంగం విసిరి సంహరించాడు. అప్పుడు శోణితాక్షుడు వాలిపుత్రుడిపై బాణవర్షం కురిపించాడు. అంగదుడు సాలవృక్షంతో వాడి ధనుస్సును ఎగురగొట్టాడు. అన్ని ఆయుధాలనూ తునియలు చేసాడు. అదే సమయంలో శోణితాక్షుడికి తోడుగా యూపాక్షుడూ, ప్రజంఘుడూ వచ్చి నిలిచారు. మైంద ద్వివిధులు అంగదుడికి రక్షణగావచ్చి నిలిచారు. ముగ్గురికీ ముగ్గురితో ఘోరసంగ్రామం జరిగింది. అంగదుడి చేతిలో ప్రజంఘుడు చనిపోయాడు. ద్వివిదుడి దెబ్బకు యూపాక్షుడు కళ్ళు తేలవేసాడు. మైందుడిచేతిలో శోణితాక్షుడు మృతి చెందాడు.
ఈ ఘోరం చూసి అతిశయించిన కోపంతో కుంభకర్ణాత్మజుడయిన కుంభుడు అంగదాదులను దారుణంగా పీడించాడు. ముగ్గురూ వాడి ధాటికి ఆగలేకపోయారు. అంగదుడు అలిసిపోవడాన్ని శ్రీరాముడు గుర్తించి జాంబవత్ప్రముఖులను పంపించాడు. సుషేణుడు వేగదర్శి మొదలైన వారితో కలిసి జాంబవంతుడు కుంభుణ్ని ఎదుర్కొన్నాడు. కానీ నిలవలేకపోయారు. దేవతలిచ్చిన వరాలవల్లా తన తండ్రి ప్రసాదించిన బలపౌరుషాలవల్లా కుంభుడు సింహకిశోరమై పోరాడుతున్నాడు. సుగ్రీవుడు స్వయంగా రంగానికి దిగాడు, రథాశ్వాలనూ ధనుర్బాణాలనూ నుగ్గు నుగ్గుచేసాడు. వాడు మల్లయుద్ధానికి దిగాడు.
రెండు మదపుటేనుగులులాగా పోరాడుతుంటే వాళ్ళ పాదఘట్టనలకు భూమి కంపించింది. సముద్రం అల్లకల్లోలమయ్యింది. సుగ్రీవుడు ఎట్టకేలకు కుంభుణ్ని ముద్దచుట్టి అరచేతులపై పైకెత్తి గిరగిరా తిప్పి సముద్రంలోకి విసిరేసాడు. ఆవేగానికీ ఆ బరువుకీ వింధ్య మంధర సంకాశమైన తరంగాలు లేచాయి. అయినా వాడు చావలేదు. సముద్రంనుంచి లేచివచ్చి సుగ్రీవుణ్ని గుండెలపై పొడిచాడు. సుగ్రీవుడు వజ్రకల్పమైన పిడికిలిని బిగించి కుంభుడి వక్షఃస్థలాన్ని తుత్తునియలు చేసి సంహరించాడు.
ఇక నికుంభుడు విజృంభించాడు. అలసిపోయిన సుగ్రీవుడు వీడి ధాటికి నిలవలేకపోయాడు. అప్పుడు ఆంజనేయుడు మార్కొన్నాడు. సర్వాయుధాలనూ ఎగరగొట్టి నికుంభుణ్ని ఉండజుట్టి పీడించాడు. నేలపై వెల్లకిలా పరుండబెట్టి గుండెలపైకి ఎగిరి దూకాడు. వాడి పక్కటెముకలు చూర్ణమయిపోయాయి. అయినా ఆపుకోలేని కోపంతో అనిలసుతుడు వాడి గుండెలపై కూర్చుని - భయభ్రాంతుడై భైరవంగా అరుస్తున్న వాడి శిరస్సును రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుని బలవంతంగా ఊడబీకి సంహరించాడు.
**
మకరాక్షుడు ఖరుని కుమారుడు. యుద్ధంలో అసమాన పరాక్రముడు. తన తండ్రి ఖరుని చంపాడని తెలిసినప్పటి నుండి రామునిపై పగబట్టాడు.
కుంభకర్ణుని కుమారులు ఇద్దరు కుంభనికుంభులు యుద్ధరంగంలో మరణించారని తెలిసికొని రావణుడు దుఃఖంతో, కోపంతో మూర్ఛపోయాడు. కొంతసేపటికి తేరుకొని తన ముందు ఉన్న మహాయోధుడైన మకరాక్షుని చూచి, "కుమారా! నీ తండ్రి అయిన ఖరుని చంపిన క్రూరుడు రాముడు. ఆయనపై పగతీర్చుకోవడానికి ఇదే తగిన సమయము. యుద్ధంలో పరాక్రమించి, రామలక్షణులను సంహరించి, నీకు, నాకు ఆంనందాన్ని కలిగించమని ఆదేశించాడు.
మకరాక్షునికి ఇది ఒక మహావకాశమనిపించింది. రావణునికి ప్రదక్షిణం చేసి, మహాసేనతో యుద్ధరంగంలో ప్రవేశించాడు. అయితే దారి మధ్యలో ఆయనకు అనేక అపశకునాలు ఎదురయ్యాయి.
ఆ అపశకునాలను లక్ష్యపెట్టక, మకరాక్షుడు, ఆయన సైన్యము భయంకరంగా సమరము చేయసాగారు. ఇటు వానర వీరులు కూడా ప్రాణాలకు తెగించి పోరాడారు. అయితే మకరాక్షుని సైన్యము వానర వీరులను వివశుల జేసింది.
ఆ పరిస్థితిని గమనించిన శ్రీరామభద్రుడు తన కోదండాన్నుండి బాణవర్షాన్ని కురిపించి, రాక్షసులను ముందుకు రానీయకుండా నిలిపాడు.
మకరాక్షుడు శ్రీరాముని ముందుకు వచ్చి, "రామా! నిలువు. నా ముందు నీవు నిలువడం నా అదృష్టము. నేను లేనప్పుడు నా తండ్రిని నీవు చంపడం విన్నప్పటి నుండి నాకు కోపము పెరిగిపోతున్నది.
*యత్తదా దణ్డకారణ్యే పితరమ్ హతవాన్మమ*
*తదాగ్రతః స్వకర్మస్థం దృష్ట్వా రోషో అభివర్ధతే*
ఇవ్వాళ్ల నా తండ్రి మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకొనే అవకాశాన్ని కల్గించినందుకు నీకు కృతజ్ఞుడిని. రామా! నీకు అవకాశమిస్తున్నాను. నీవు శస్త్రాస్త్రయుద్ధాన్ని కోరుకొంటావా? మల్లయుద్ధాన్ని వరిస్తావా? నీ ఇష్టము" అని పరుషంగా మాట్లాడాడు.
శ్రీరామచంద్రుడు మకరాక్షుని ప్రగల్యాలకు చిరునవ్వు నవ్వి “ఓరీ! రాక్షసాధమా! నీవు నీ పరాక్రమాన్ని గొప్పగా ఊహించుకొని, నా గురించి తెలియక వదురుతున్నావు..
*చతుర్దశ సహస్రాణి రక్షాసాం త్వత్పితా చ యః*
*త్రిశిరా దూషణాశ్చైవ దండకే నిహతా మాయా*
పదునాల్గువేల రాక్షస వీరులతో, దూషణ, త్రిశిరస్క సేనానులతో నీ తండ్రి ఖరుడు కేవలము మూడు గడియల సమయం కూడ నాతో పోరాడలేక పోయాడు. నీవు అల్పుడవు.
చేతనైతే మాటలు మాని, నీ పరాక్రమాన్ని ప్రదర్శించుమ"ని సమాధానమిచ్చాడు. శ్రీరామ, మకరాక్షుల మధ్య యుద్ధము మొదలైంది. అది క్రమంగా భయంకరం కాసాగింది.
చేతిలో విల్లు ఉన్నంతవరకు మకరాక్షుడు మహా యుద్ధాన్ని చేస్తాడని గ్రహించిన శ్రీరాముడు ఆయన విల్లును, రథాన్ని విరగగొట్టి, అశ్వాలను హతమార్చాడు.
మకరాక్షుడు మరుక్షణంలో శూలాయుధుడై రథము నుండి దుమికాడు. రామచంద్రుడు. ఆ శూలాన్ని ముక్కలు చేశాడు. అయినా రాక్షసుడు వెనుకంజ వేయక తన ముష్టిని చూపి ముందుకు రాసాగాడు.
ఇక ఆ దుర్మార్గుని బ్రతుకనీయకూడదని తీర్మానించుకొన్న శ్రీరాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ క్షణంలోనే మకరాక్షుడు విగత ప్రాణుడై నేలపై పడ్డాడు.
రాక్షస సైన్యము భయంతో పరుగెత్తింది. వానర సైన్యము శ్రీరాముని జయజయ ధ్వానాలతో ప్రశంసించింది.
*రామాయణానుభవం_ 198*
బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడంకోసం క్షణకాలం మూర్ఛను అభినయించిన హనుమంతుడూ విభీషణుడూ వెంటనే తేరుకొని, ఈ వానర మహాసైన్యంలో బాణాఘాతాలకు ప్రాణాలు వదలకుండా జీవించి ఉన్నవారిని ఓదారుద్దామని బయలుదేరారు. ఆ రాత్రిపూట కాగడా వెలిగించి చేత పట్టుకొని సంచరించారు.
కాళ్లు విరిగి, చేతులు తెగి, తోకలు ఊడి, శిరస్సులు పోయి, రక్తంలో మలమూత్రాలలో మునిగితేలుతున్న వానర కళేబరాలనూ సుగ్రీవ అంగదాది నాయకుల శరీరాలనూ చూసుకుంటూ సాగిపోయారు.
ఆ సాయంకాలం పూట, కొన్ని క్షణాలలో ఇంద్రజిత్తు మొత్తం అరవయ్యేడు కోట్లమంది వానరులను సంహరించి వెళ్ళిపోయాడు.
*సప్తషష్టిర్హతాః కోట్యో వానరాణాం తరస్వినామ్*
*అహ్నాః పంచమశేషేణః వల్లభేన స్వయంభువః*
అందరినీ చూస్తూ వెళ్ళి వెళ్ళి ఒకచోట వృద్ధమూర్తి అయిన జాంబవంతుణ్ని చూసారు. అసలే వృద్ధుడు. ముసలితనమే క్రుంగదీసింది. ఇప్పుడు వందలబాణాలు శరీరంలో గుచ్చుకున్నాయి. చల్లారుతున్న అగ్నిలా ఉన్న ఆ ప్రజాపతికుమారుణ్ని చూసాడు.
హనుమంతుడికన్నా ఒక్క అడుగు ముందుకువేసి విభీషణుడు ఆర్యా! కుశలమా? అని అడిగాడు. ఆ గొంతు సవ్వడి విని ఆ వృద్ధమూర్తి అతిప్రయత్నం మీద ఇలా పలికాడు.
విభీషణా! గొంతును బట్టి నిన్ను గుర్తించాను. బాణాలు గుచ్చుకుని కళ్ళు కనబడడంలేదు. అంజనానందనుడూ వాయుసూనుడూ అయిన హనుమంతుడు జీవించి ఉన్నాడా?
ఈ మాటలు వింటూనే విభీషణుడికి ఒక సందేహం వచ్చింది. తాతా! రామలక్ష్మణుల క్షేమం అడగలేదు. సుగ్రీవాంగదులను గురించి అడగలేదు. ఆంజనేయుడిపట్ల నీకు ఎందుకింత స్నేహమూ వాత్సల్యమును! అని ఆశ్చర్యం ప్రకటించాడు.
*శృణు నైరృతశార్దూల! యస్మాత్ పృచ్ఛామి మారుతిమ్* |
*తస్మిన్ జీవతి వీరే తు హత మప్యహతం బలమ్* |
*హనుమత్యుజ్ఘిత ప్రాణే జీవంతో ఽపివయం హతాః* ||
విభీషణా..మారుతి బ్రదికి ఉంటే మనమంతా చనిపోయినా బ్రదికి ఉన్నట్టే. అతడే లేకపోతే మనమంతా ఉండీ లేనట్టే. అంచేత మారుతి జీవించి ఉన్నాడా? అని అడిగాను.
విభీషణుడి వెనకాల నిలబడి ఈ మాటలన్నీ విన్న హనుమంతుడు ముందుకు వచ్చి వినయంగా జాంబవంతుడి పాదాలకు నమస్కరించాడు.
నాయనా ఆంజనేయా ! సర్వవానరులనూ నీవు మాత్రమే రక్షించగలవు. నీవు పరాక్రమించవలసిన సమయం ఇది. అందరినీ విశల్యులను చేసి బ్రదికించాలి. మహావీరా! అది నీవే చెయ్యగలవు.
ఆకాశమార్గంలో ఎగిరి సముద్రం దాటి హిమాలయాలకు వెళ్ళు. అక్కడకైలాసశిఖరం కనబడుతుంది. ఆ శిఖరాల మధ్యలో మెరిసిపోయే ఓషధిపర్వతం ఉంది. అన్ని ఓషధులకూ అది నిలయం. ఆ ఓషధుల కాంతులతో దశదిశలూ వెలిగిపోతూ మిరుమిట్లు గొలుపుతాయి. మృతసంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అనే ఓషధులను తీసుకుని వెంటనే తిరిగిరా. ఇక్కడ అందరినీ బ్రతికించు.
**
జాంబవంతుని మాట నోటివెంబడి వచ్చిన తక్షణమే పవనసుతుడు మహోత్సాహంతో బయలుదేరి "త్రికూట" పర్వతశిఖరముపైకి ఎగిరాడు.
ఆయన పాదముల తాకిడికి పర్వత శిఖరాలు కంపించాయి. చెట్లు నేలకూలాయి. లంకానగర ద్వారాలు విరిగిపడ్డాయి. ఇండ్లు నేలమట్టమయ్యాయి. నగరమంతా నృత్యం చేస్తున్నట్లు వణికిపోయింది.
హనుమ మహాబలశాలి. అయినా తన "స్వశక్తి"పై ఆధారపడక, శ్రీరామచంద్రుని శ్రీపాదాలను మనసారా ధ్యానించి, రామనామాన్ని మాటిమాటికి స్మరించి, మహావేగంగా హిమవత్పర్వతాన్ని చేరుకున్నాడు. హనుమ వేగాన్ని వర్ణించడానికి ఎంతవారికైనా మాటలు చాలవు. ఊహించడానికి మనస్సులు చాలవు.
ఋషభ, కైలాస శిఖరాల మధ్యగల ఓషధీ పర్వతాన్ని, వేయి యోజనాల స్థలము వెతికాదు. అయినా ఓషధులు కనిపించలేదు.
హనుమకు ఆగ్రహము కలిగింది. రామభద్రునిపై దయలేకపోవడాన్ని, తనను నిర్లక్ష్యం చేయడాన్ని సహించని హనుమ ఆ పర్వతాన్ని బ్రద్దలుచేయాలని సంకల్పించాడు. అప్పుడు ఆ మొత్తము పర్వతాన్ని సమూలంగా పెకిలించి, సకల దేవతలు సంతోషింపగా దానిని చేతిలో పట్టుకొని చక్రాయుధునివలె శత్రువులు భయపడుతుండగా ఆకాశంలోకి ఎగిరి, త్రికూట పర్వతముపై వాలాడు. అప్పుడు ఆ ఓషధుల వెలుగుచే ఆ పర్వతమొక సూర్యునివలె, హనుమ మరొక సూర్యుని వలె ప్రకాశించారు.
*స భాస్కరధ్వాన మనుప్రపన్నాః*
*తద్భాస్కరాభమ్ శిఖరం ప్రగృహ్య*
*బభౌ తదా భాస్కరసన్నికాశో*
*రవేః సమీపే ప్రతిభాస్కరాభః*
“సంజీవని” వాసనలు తగులగానే వానరులు పునర్జీవితులయ్యారు. వారు సంతోషోత్సాహాలతో చేసిన మహాగర్జనలకు లంకానగరంలోని రాక్షసులు భయకంపితులయ్యారు.
*తావప్యుభౌ మానుషరాజపుత్రౌ*
*తం గంధమాఘ్రాయ మహౌషాధినామ్*
*బభూవతుస్తత్ర తదా విశల్యా*
*ఉత్తస్తురణ్యే చ హరిప్రవీరాః*
రామలక్ష్మణులు, సుగ్రీవాంగద, జాంబవదాదులందరు మూర్ఛనుండి తేరుకొన్నారు. వానర సైన్యంలో ఒక క్రొత్తకాంతి కలిగింది.
యుద్ధంలో చనిపోయిన రాక్షస సైనికులందరిని ఎవ్వరైనా గుర్తుపడితే, అది తనకు అవమానమని భావించి, రావణాసురుడు ప్రతిరోజు యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరిని సముద్రంలోకి త్రోయించాడు. అందువలన రాక్షసుల శరీరాలు యుద్ధరంగంలో మిగులలేదు. అందువలన మృత రాక్షసులెవ్వరు తిరిగి బ్రతకలేదు.
*యదాప్రభృతి లంకాయాం యుధ్యంతే కపిరాక్షసాః*
*తదాప్రభృతి మానార్థమాఙ్ఞాయా రావణస్య చ*
*యే హన్యంతే రానే తత్ర రాక్షసాః కపికుజఞ్జరైః*
*హతా హతాస్తు క్షిప్యంతే సర్వ ఏవ తు సాగరే*
సుగ్రీవుడు హనుమదాదుల తో మాట్లాడుతూ....
మిత్రమా! ఆంజనేయా! కుంభకర్ణుడు చనిపోయాడు. అతికాయుడు చనిపోయాడు. సోదరమరణాన్నీ, పుత్రశోకాన్నీ రావణాసురుడు ఇప్పటిలో దిగమింగలేడు. తేరుకునే వరకూ యుద్ధానికి రాడు. అందుచేత మనం ఈ రాత్రికే ముందంజవెయ్యాలి. రాత్రి కాగానే వానరులంతా కాగడాలతో ప్రాకారం దాటి లంకలో ప్రవేశించి గృహాలూ ఉద్యానవనాలూ స్కంధావారాలూ ఆయుధాగారాలూ అన్నీ తగులబెట్టాలి. ద్వార ప్రాంతాలు ఆక్రమించి రాక్షసులను మట్టుపెట్టాలి. మనలో బలవంతులూ నేర్పరులూ అంతా ఈ పనికి పూనుకోవాలి.
ఈ సుగ్రీవాజ్ఞ వానరులకంతా అందింది. సూర్యుడు అస్తమించగానే వానర మహావీరులు లంకలో ప్రవేశించి ఆజ్ఞను అక్షరాలా అమలుపరిచారు. వీథులలో, భవనాలలో,ఉద్యానవనాలలో, గుడారాలలో, మహాప్రాసాదాలలో సర్వత్ర అగ్ని ప్రజ్వరిల్లింది. సౌధాలు కూలిపోతున్న చప్పుడు, గృహాలు పేలిపోతున్న చప్పుడు, రాక్షసస్త్రీల దీనారావాలూ, హాహాకారాలూ, పట్టుకో, చంపు, పాడు అనే సింహనాదాలూ దశదిశలా మారుమ్రోగిపోయాయి. పర్వతశిఖరాగ్రంమీద లంకాపట్టణం మొత్తం భగ్గున మండిపోతోంది.
మంటలు సముద్రంలో ప్రతిఫలించి జేగురు నీళ్ళుగా కనిపించాయి. లోహితసముద్రం అనిపించింది.
శ్రీరాముడు ధనుష్టంకారం చేసాడు. సారపుంఖాలైన బాణాలతో పురగోపురాన్ని కూలగొట్టాడు. లంకాప్రాకారం అంతా తూట్లు పడిపోయింది. ప్రతిసౌధం బాణాలతో నిండిపోయింది. సుగ్రీవుని ఆజ్ఞతో ఆసన్నద్వారాలను అధిరోహించిన వానరవీరులు రాక్షససంహారం కావిస్తున్నారు. పదులూ ఇరవైలుగా లెక్క పెట్టి చంపుతున్నారు.
వెన్నెల వెలుగులో భూషణాల కాంతులలో మంటల తళతళలో వానర రాక్షస సైన్యాలు ధగధగ మెరిసిపోయాయి.....
*
[(1) మృతులను బ్రతికించేది "సంజీవకరణి",
(2) శరీరంలో చిక్కుకొన్న బాణాలను, ఇతర పదార్థాలను వెలికితీసేది "విశల్యకరణి",
(3) విరిగిన ఎముకలను అతికించేది "సంధానకరణి",
(4) గాయాలను తక్షణమే మానిపించి పూర్వపు రంగును కలిగించేది “సౌవర్ణకరణి”.
స్వామి హనుమకు సంజీవరాయుడు అనే విశేష నామము కలదు.
కడప జిల్లాలో వెల్లాల అనే గ్రామం లో హనుమ కు సంజీవరాయుడు గా ప్రసిద్ధి.
ఇటువంటి ఓషధ పర్వతాలను తెచ్చే రూపం చాలా ప్రసిద్ధి.
ఆయనకే వీరాంజనేయుడు గా రామభక్తులందరికి ఆయన ఎంతో ఇష్టం. కడప జిల్లాలో నే ఇలాంటి రూపం తో గండి క్షేత్రం లో కూడా విరాజిల్లుతున్నారు.]
*రామాయణానుభవం_ 200*
రావణుడు మకరాక్షుని మరణాన్ని విన్న తరువాత ధైర్యాన్ని కోల్పోయాడు. ఆయన తన కుమారుడైన ఇంద్రజిత్తును మళ్లీ పిలిపించి "పుత్రా! నీ వొక్కడివే రామలక్ష్మణులను వధింప సమర్ధుడవు, యుద్ధము సాగినా కొద్ది మన వీరులు కుప్పలు కుప్పలుగా చచ్చి పడుతున్నారు. ఇప్పుడీ యుద్ధాన్ని మనకు విజయంగా మార్చగల మహావీరుడవు నీవు
రామలక్ష్మణులను ధర్మయుద్ధంలో ఓడించడం అసాధ్యమయిన పని. అందువలన నీవు ధర్మంగానో, అధర్మంగానో ఏదో ఒక పద్ధతిలో యుద్ధం చేసి రామలక్ష్మణుల పీడ శాశ్వతంగా తొలిగించిరా" అని ఇంద్రజిత్తును ప్రేరేపించాడు.
ఇంద్రజిత్తు సహజంగా యుద్ధ విశారదుడే. అయినా ఆయన ఎప్పుడు సహజ యుద్ధంతో తృప్తిపడక మాయా యుద్ధాన్ని చేసి విజయాన్ని సంపాదిస్తాడు.
ఇంతవరకు ఆయన రామలక్ష్మణులను, హనుమ అంగదాది వానర వీరులను,
మాయా యుద్ధాలతోనే పడగొట్టాడు. అందువలన ఆయన శత్రు వినాశకరమైన అభిచారహోమాన్ని ముందుగా చేయదలిచాడు.
ఆ హోమాన్ని నిర్వహించే ఋత్విజులు ఎఱ్ఱని వస్త్రాలు ధరిస్తారు. వారు ఎఱ్ఱని తలపాగలను ధరిస్తారు. ఇంద్రజిత్తు కూడ రక్తాంబరాలను ధరించాడు. పేలాలను, గంధాన్ని, మాలలను సమకూర్చాడు. అగ్నిహోత్రుని కొరకు దర్భలను పరిచాడు. తాండ్ర శాఖలతో సమిధలను చేశాడు. ఒక నల్లని మేకను బలి ఇచ్చాడు.
*సర్వతోఅగ్నిమ్ సమస్తీర్య శరపత్రైః సతోమరైః*
*ఛాగస్యకృష్ణ వర్ణస్య గలం జగ్రాహ జీవతః*
అగ్నిదేవుడు స్వయంగా హవిస్సును గ్రహించాడు.
ఆ అగ్ని జ్వాలల నుండి నాలుగు గుఱ్ఱాలను గలిగి బంగారు కప్పు గలిగి, ప్రకాశిస్తున్న రధముపైకి వచ్చింది. దానిలో అనేక అర్ధచంద్రాకార బాణాలు ఉన్నాయి. వైడూర్యాలతో రధధ్వజము మెరుస్తున్నది. ఆ రధానికి అదృశ్యము కాగల శక్తి ఉంది.
దానిని ఎక్కి బ్రహ్మాస్త్ర బలంతో ఇంద్రజిత్తు రాక్షస సైన్యానికి ధైర్యాన్ని కలిగిస్తూ ఈ రోజుతో రామలక్ష్మణులు, కపివీరులు ప్రాణాలను కోల్పోతారు. రాక్షస రాజుకు వారి తలలను కానుకలుగా సమర్పిస్తాను" అని పలికాడు. లంకానగరాన్ని వదలి సైన్యంతో యుద్ధభూమికి వెళ్లాడు.
రామలక్ష్మణులపై బాణవృష్టిని కురిపించాడు. రామలక్ష్మణులు కూడ ఆ బాణవర్షాన్ని నిరోధించడానికి అనేక బాణాలను ఎడతెరిపిలేకుండా ప్రయోగించారు. అయినా ఒక్క బాణము కూడ ఇంద్రజిత్తును తాకలేదు..
ఇంద్రజిత్తు చిమ్మ చీకటిని వ్యాపింపజేశాడు. రధచక్రాల ధ్వనితప్ప వేరే శబ్దమేది వినిపించడం లేదు. అయినా రామలక్ష్మణులు "శబ్దవేది" బాణాలతో రాక్షసుని నొప్పించారు. రాక్షసుడు కూడ కనబడకుండా ఉండి రామలక్ష్మణుల శరీరాలను శరమయం చేశాడు" అంతే కాదు వేలాది వానరులను నేలకూల్చాడు.
ఇంద్రజిత్తు చేసే యుద్ధాన్ని చూచి లక్ష్మణుడు ఆగ్రహావిష్ణుడై బ్రహ్మాస్త్రంతో రాక్షస జాతి మొత్తాన్ని నశింపజేయాలనుకొన్నాడు.
కాని రాముడు ఒక్క ఇంద్రజిత్తు మూలంగా సమస్త రాక్షస జాతిని సంహరించడం.
మంచిది కాదని, లక్ష్మణుని ప్రయత్నాన్ని మానిపించాడు.
*తమువాచ తతో రామో లక్ష్మణం శుభలక్షాణామ్*
*నైకస్య హేతో రక్షాంసి పృథివ్యామ్ హంతుమర్హసి*
శ్రీరాముని ఆగ్రహాన్ని గమనించిన ఇంద్రజిత్తు ఇకవారితో యుద్ధం చేయడం సాధ్యము కాదని గ్రహించి హనుమ నిలిచిన పశ్చిమ ద్వారాన్ని చేరాడు.
అంతేకాదు వానరుల శక్తి సామర్థ్యాలను రూపుమాపదలచి మాయ ద్వారా సీతాదేవి
శరీరాన్ని సృష్టించి ఏడుస్తున్న ఆమె తల వెండ్రులకను పట్టుకొని రథము మీద వానర
సేనల మధ్యలో అగుపించాడు.
*తాం స్త్రియం పశ్యతాామ్ తేషామ్ తాదయామాస రావణిః*
*క్రోశంతీం రామ రామ రామేతి మాయాయా యోజితాం రథే*
ఆమె తలను నరకటానికి కత్తిని దూశాడు. హనుమ ఆ దృశ్యాన్ని చూచి, "ఓరీ దుర్మార్గుడా! ఒక మహాపతివ్రత తలవెండ్రుకలను పట్టుకొన్న నీవు నశించిపోతావు.
అయినా ఇంద్రజిత్తు తన మూర్ఖత్వాన్ని వదలక హనుమంతుడు చూస్తుండగా ఆ మాయా సీత శిరస్సును రెండు ముక్కలుగా తన కత్తితో నరికాడు.
*తామింద్రజిత్ స్వయం హత్వా హనుమంతమువాచ హ*
*మాయా రామస్య పశ్యేమాం కోపేన చ నిషూదితామ్*
*ఏశా విశస్తా వైదేహీ విఫలో వః పరిశ్రమః*
వానరులు హాహాకారాలు చేస్తూ, తలో దిక్కుకు పారిపోయారు. వారిని నిలిపి హనుమంతుడు రాక్షస మూకను ఎదుర్కొన్నాడు.
అయినా యుద్ధాన్ని నిలిపి, వానర సేనతో శ్రీరామచంద్రుని దగ్గరకు వెళ్లి ఇంద్రజిత్తు సీతా శిరమును సంహరించిన వార్తను తెలుపాలనుకొన్నాడు. యుద్ధాన్ని ఆపివెళ్లాడు. ఇంద్రజిత్తు కూడ తన పాచిక పారిందని సంతోషించి శత్రు సంహారకమైన నికుంభిలా హోమాన్ని ఏకాంత ప్రదేశంలోకి వెళ్లి చేయసాగాడు.
**
హనుమ వెళ్లి రామలక్ష్మణులకు సీతావధ వార్తను తెలిపాడు.శ్రీరామచంద్రుడు ఆ వార్త వినగానే మొదలు తెగిన చెట్టు వలే నేల కొరిగాడు.
లక్ష్మణుడు తన అన్న శరీరాన్ని కౌగిలించుకొని బిగ్గరగా రోధిస్తున్నాడు.
విభీషణుడు తన వైపు యుద్ధంలో చేయదగిన ఏర్పాట్లను పర్యవేక్షించి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. పశ్చిమ ద్వారము ముందు ఇంద్రజిత్తు మాయా సీత శిరాన్ని ఖండించిన విషయాన్ని, దాని కారణంగానే రామలక్ష్మణులకు కలిగిన దుస్థితిని ఆయన గమనించలేదు.
అందువలన వానరవీరులు, లక్ష్మణుడు దుఃఖించడానికి కారణాన్ని అడిగాడు. లక్ష్మణుడు సీత ఇంద్రజిత్తు వలన వధించబడిందని, అందువలననే తాము ఇంతగా దుఃఖిస్తున్నామని హీన స్వరంతో చెప్పాడు.
విభీషణుడు శ్రీరామునితో"మహాత్మా! ఇంద్రజిత్తు సీతను వధించాడనడం అసత్యం. అసాధ్యము కూడ తరంగాలతో ఆకాశాన్ని అంటుతున్నట్లు ఎగిసిపడే సముద్రము ఎండిపోయిందనడం ఎంత సత్యవిదూరమో ఇది కూడ అంత సత్య విదూరమే.
*మనుజేంద్రార్తరూపేనా యదుక్తస్త్వాం హనుమాతా*
*తదయుక్తమహమ్ మన్యే సాగరస్యేవ శోషణమ్*
నాకు మా అన్న రావణాసురుని స్వభావము పూర్తిగా తెలుసు. ఆయనకు సీత తన ప్రాణం కంటె ప్రియమైనది. సీతను లంకలో ఉంచుకోవడం లంకా వినాశకారణమవు తుందని నేను, కొందరు ఆయన వదలుకోవడానికి అంగీకరించలేదు. కొంతమంది రాక్షస స్త్రీలకు, స్వయంగా తనకు తప్ప ఇతరులెవ్వరికి సీతాదేవిని చూచే అధికారమే లేదు. రావణాజ్ఞను ధిక్కరించే సాహసము ఇంద్రజిత్తుకు కూడ లేదు.
అందువలన సీతను యుద్ధరంగానికి తీసికవచ్చి, ఆమె తలను ఇంద్రజిత్తు నరకడము ఊహకు కూడ సాధ్యము కాదు. ఇదంతా ఇంద్రజిత్తు మాయ. అందులో అణువంత నిజం కూడ లేదు" అని విభీషణుడు స్పష్టం చేశాడు.
అయితే ఇంద్రజిత్తు ఇంతటి మాయను కల్పించడానికి కారణము తెలుపుతున్నాడు. విభీషణుడు. "రామభద్రా! ఒకవైపు రాక్షసవీరులు మనపైకి యుద్ధానికి తరలివస్తుంటే, మరొక వైపు ఇంద్రజిత్తు అభిచార హోమాలు చేస్తు వచ్చాడు. వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేసి ఆ శక్తితో ఆయన మనపైకి దండెత్తి వచ్చేవాడు. అందువలననే ఆయన అదృశ్యంగా ఉండి యుద్ధము చేస్తూ అందరిని బాధించి వెళ్లేవాడు.
ఇప్పుడు లంకలో మిమ్మల్ని ఎదిరించగల రాక్షస వీరులెవ్వరు లేరు. కనుక ఆయన నిర్విఘ్నంగా అభిచార హోమం చేయజాలడు.
అందువలన ఆయన సీతను కల్పించి, ఆమె శిరస్సును ఖండించినట్లు మాయచేసి వెళ్లాడు. మనము ఆ దృశ్యాన్ని చూచి దుఃఖిస్తామని, ఆయన ఈ మధ్యలో నికుంభిలా హోమాన్ని, నిర్విఘ్నంగా పూర్తి జేసికోవచ్చునని భావించాడు.
*సమాప్తకర్మా హి స రాక్షసాధిపో*
*భవత్యాదృశ్యం సమరే సురాసురైః*
*యుయుత్సతా తేన సమాప్తకర్మణా*
*భవేత్సురాణామపి సంశయో మహాన్*
యజ్ఞము పూర్తి అవుతే ఆయనను జయించేవాడు విశ్వంలోనే ఉండడు. యజ్ఞము విఘ్నమవుతే వాడు మరణించక తప్పదు. “అభిచార" హోమాన్ని ఆపగలిగిన వానిచేతిలోనే వాడు హతుడవుతాడ"ని బ్రహ్మ తెలిపాడు.
అందువలన నిష్కారణంగా సీతాదేవి కొరకు దుఃఖించడము మాని, వాడి యజ్ఞాన్ని విఘ్నం చేయడం గురించి మనము ఆలోచించాలి. వాడు ఆ యజ్ఞము చేసే చోటు నాకు తెలుసు. కాబట్టి మహావీరుడైన లక్ష్మణుని, మరికొంతమంది వానర వీరులను నాతో పంపు. ఇంద్రజిత్తు వధ తప్పదని ఖచ్చితంగా శ్రీరామునికి వివరించాడు.
శ్రీరాముడు ఇంద్రజిత్తు మాయా యుద్ధం లోనే కాక సహజ సమరంలో కూడ సులభంగా వధింపబడడని నిర్ణయించి లక్ష్మణుని ఆయనతో పాటు సుగ్రీవాంగద, హనుమ, జాంబవదాది వీరులను కూడ పంపాడు.