21, అక్టోబర్ 2022, శుక్రవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 36 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వేనుడు రాజు అయిన తరువాత ప్రజలకు ఇటు రాజు వైపునుండి బాధ కౄరుల వైపునుండి బాధ. యజ్ఞయాగాది క్రతువులు లేవు. రాజు ఈశ్వరుడు. మీరు యజ్ఞం చేస్తే నాకు చెయ్యాలి. నా చిత్రపటములకే ఆరాధన చేయాలి అని వేనుడు ప్రకటించాడు. ఇపుడు భూదేవికి కోపం వచ్చింది. ‘వీళ్ళు తమ కొరకు మాత్రమే తింటున్నారు. వీళ్ళకి కృతజ్ఞత లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. నేను ఓషధీశక్తిని ఉపసంహారము చేస్తున్నాను’ అన్నది. భూమికి ఓషధీ శక్తి ఉంటేనే బ్రతుకుతారు.

ప్రతివాడికి దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట కడుపులోకి పదార్ధం దొరికినంత సేపే ఉంటాయి. అసలు తినడానికి దొరకకపోతే భాగవతం చెపుతాను రమ్మనమంటే ఎవరయినా వస్తారా? ఎవరూ రారు. ఎక్కడ చూసినా దేశంలో అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. నేరముల సంఖ్య పెరిగి దొంగతనములు పెరిగిపోయాయి.

ఋషులు ఈ పరిస్థితిని గమనించారు. వారు సరస్వతీ నదీతీరంలో సమావేశం అయ్యి రాజ్యంలోని అప్పటి దారుణ పరిస్థితులకు కారణం ఏమిటని ఆలోచన చేశారు. మహర్షులం అందరం వెళ్ళి వేనుడితో ఒక మాట చెబుదాం. అతడు మన మాటవిని మారిపోతే సంతోషం. మారక పోతే ఇంకా ఆ రాజు ఉండకూడదు కాబట్టి మన తపశ్శక్తి చేత వానిని సంహారం చేసేద్దాం అనుకుని బయల్దేరారు. రాజుకు ఆశీర్వచనం చేసి ఒకమాట చెప్పారు. ‘రాజా! నీవు యజ్ఞయాగాదులు చేసి ఈ భూమిని రక్షించాలి. శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలి. ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో’ అని చెప్పారు. వేనుడు ‘అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కనపడని విష్ణువుకు యజ్ఞం చెయ్యమంటున్నారా? ఇంకొకసారి నోరు విప్పితే మీ కుత్తుకలు ఎగితిపోతాయి’ అన్నాడు.

ఋషులు ఇక అతడు మారడు. ‘వీనికి బోధ అనవసరం. వీనవలన మొత్తం రాజ్యం నాశనం అయిపోతోంది. వీడు ఉండడానికి వీలులేదు.’ అనుకున్నారు. ఋషులందరూ కోపం తెచ్చుకొని హుంకారమును చేశారు. అంతే! వేనుడు చచ్చిపోయాడు. అహంకారం ప్రబలి ప్రబలి మహాత్ముల జోలికి వెళ్ళిన వారికి చిట్టచివరికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. వేనుని తల్లి అయిన సునీథ గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది. తన మంత్రశక్తితో వేనుని శరీరమును కాపాడింది. ఆశరీరమునకు అంత్యేష్టి సంస్కారమును చేయలేదు. ఋషులు కొంతకాలం చూశారు. ఇపుడు నేరముల సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. శిక్షించే నాథుడు లేదు. ఋషులు ‘ మనం ఎలా అయినా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. రాజు మరణించి ఉన్నాడు. మనం మన తపశ్శక్తితో రాజు శరీరములో నుంచి రాజు సంతానమును తీసుకురావాలి’ అనుకున్నారు. తపశ్శక్తి ఉన్నవారు మూఢుల్ని మార్చలేకపోయారు. క్షేత్రములేకుండా శరీరంలోంచి సంతానమును సృష్టిస్తున్నారు. ఋషులు వెళ్ళి మొట్టమొదట తపశ్శక్తితో ఆయన తొడమీద మథనం చేశారు. అందులోంచి పాపము పైకి రావడం మొదలు పెట్టింది. బాహుకుడు అనబడే ఒక నల్లటివాడు పొట్టి పొట్టి కాళ్ళు, పొట్టి పొట్టి చేతులు ఎర్రటి కళ్ళు రాగిజుట్టుతో పుట్టుకొచ్చాడు. ‘నేను ఏమి చేయాలి’ అని ఋషులను అడిగాడు. ఋషులు వానివంక చూసి ‘వీడు రాజ్యపాలనము చేయగలిగిన వాడు కాలేడు అనుకోని నీవేమీ చేయవద్దు అన్నారు. సరియైన పిల్లవాడు రావాలి అంటే ఎక్కడ మథనం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయి అక్కడ ఉండే కొండలలో నివసించడం మొదలు పెట్టాడు. అతని వంశీయులకే ‘నిషాదులు’ అని పేరు వచ్చింది.

ఋషులు ‘స్వామీ! ఒక కొడుకు పుట్టాలని మేము అడగడము లేదు. లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాము శ్రీమహావిష్ణువా! నీవే నీ అంశ చేత నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటకు రా’ అని బాహువులను మథించారు. ఆశ్చర్యకరంగా బాహువుల నుండి ఒక అందమయిన పురుషుడు, ఒక అందమయిన స్త్రీ పుట్టారు. ఆ పుట్టిన వారి పాదములను చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనబడ్డాయి. ‘ఓహో మనం ప్రార్థన చేసినట్లు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. ఇక రాజ్యమునకు ఇబ్బందిలేదు’ అనుకున్నారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరుపెట్టారు. ఆయన వెంటనే యౌవనమును సంతరించుకున్నాడు. ఆవిడకు ‘అర్చిస్సు’ అని పేరు పెట్టారు. ఆయనే పృథు మహారాజు అయ్యారు.

ఆయన విష్ణుఅంశతో ఋషులు మథిస్తే పుట్టిన వాడు కనుక ఆయన రాజ్యపాలనం చేయడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము దిక్పాలకులు పట్టుకుని వచ్చారు. కుబేరుడు ఆయన కూర్చోవడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు. వరుణుడు గొడుగు తెచ్చాడు. వాయువు చామరం, ధర్ముడు మెడలో వేసుకునేందుకు సుగంధమాల తీసుకువచ్చారు. బ్రహ్మగారు వేదమనబడే కవచమును ఇచ్చారు. సరస్వతీ దేవి మెడలో వేసుకునే హారమును, పూర్ణాంశలో ఉండే స్వామి శ్రీమహావిష్ణువు సుదర్శనమును, లక్ష్మీదేవి ఐశ్వర్యమును, పరమశివుడు దశచంద్రమనబడే కత్తిని ఇచ్చాడు. ఈ కత్తి పెట్టడానికి ఒర కావాలి. పార్వతీదేవి శతచంద్రమనబడే ఒరను ఇచ్చింది. సోముడు గుఱ్ఱమును, త్వష్ట రథమును, అగ్ని ధనుస్సును, సూర్యుడు బాణమును, సముద్రుడు శంఖమును ఇచ్చాడు. స్వామి జన్మించగానే సమస్తదేవతలు తమ శక్తులు ధారపోశారు. పృథు మహారాజు పరిపాలన చేయడం కోసం సింహాసనం మీద కూర్చోగానే వంధిమాగధులు స్తోత్రం చేశారు. పృథువు వాళ్లకి బహుమానములను ఇచ్చి సంతోషించాడు. ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి ‘మహానుభావా! ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి దిక్కు ఎవరూ లేరు. ఆకలితో అన్నమో రామచంద్రా ! అని అలమటించి పోతున్నాము. ఎందుకు అంటే భూమి ఓషధీ శక్తులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మేము పంటలు పండిద్దామన్నా పండడం లేదు. నీవు మమ్మల్ని అనుగ్రహించవలసినది’ అన్నారు.

పార్వతీదేవి శాకాంబరి అయినట్లు వెంటనే పృథు మహారాజు తన ధనుస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. ‘అసలు ఈ భూమి పంట పండుతుందా? పండదా? నా బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తాను’ అన్నాడు. పృథు మహారాజు గారి ఆగ్రహమును చూసి భయపడి భూమి గోరూపమును పొంది పరుగెడుతోంది. ఏ దిక్కుకి పరుగెడితే ఆ దిక్కుకు ఎదురువచ్చాడు. అపుడు గోవు ప్రార్థన చేసింది. ‘స్వామి ! నీవే ఒకనాడు యజ్ఞవరాహామై నీ దంష్ట్రలతో భూమిని పైకి ఎత్తావు. నీవే ఈ భూమిలోంచి అన్ని రకములైన శక్తులు కలిగే అదృష్టమును నాకు కటాక్షించావు. ప్రజలు ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేనుడు చెయ్యవద్దని శాసించాడు. ప్రజలు మానివేశారు. యజ్ఞయాగాదులు మానడము ఎంతటి ప్రమాదకరమో భాగవతం చెపుతోంది. అందుకని నేను నా ఓషధీ శక్తులను గ్రసించాను(నమలకుండా మ్రింగివేయడం). అలా గ్రసించడం వలన ఓషధీశక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు లేదు. కానీ ఒక లక్షణం ఉన్నది. నేను గోరూపంలో తిరుగుతాను. జీర్ణమయిన శక్తి మరల పాలరూపంలో బయటకు వస్తుంది. నేను పాలరూపంలో ఈ శక్తులన్నీ నీకు ఇవ్వాలి. నువ్వు రాజ్య క్షేమము కోరిన వాడివి కనుక నీకోసం విడిచిపెడతాను. కానీ నీవు వచ్చి దూడగా నిలబడతానంటే కుదరదు. ఇపుడు దూడ రూపంలో ఎవరయినా రాగలరా? దూడగా ఎవరిని తీసుకు వస్తావు’ అని అడిగింది.

అపుడు పృథు మహారాజు ‘ఇప్పుడు నీవు చెప్పిన మాటకు చాలా సంతోషం. తల్లీ, నీకు నమస్కారం. నీకు దూడగా స్వాయంభువ మనువును తీసుకువస్తాను. ఆయన భూమిని చాలా గొప్పగా పరిపాలించినవాడు’ అని చెప్పాడు. స్వాయంభువ మనువు పేరు వినగానే భూమాత చాలా సంతోషించింది. స్వాయంభువ మనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయాయి. ఈ ఓషధీశక్తిని పితకగలిగిన వాడు ఉండాలి. ఎవరు పితకాలి? పృథు మహారాజు వెళ్ళి పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఓషధీశక్తులను తట్టుకోగలిగిన పాత్ర కావాలి. తన చేతిని పాత్రగా చేసి రెండవ చేతితో పాలు పితికాడు. ఆ పాలను భూమిపై చల్లాడు. వెంటనే పంటలు పండాయి. భూమి సస్యశ్యామలము అయింది.

ఇపుడు ఆకలి ఎక్కువ పండేటటువంటి భూమి తక్కువ. పృథువు తన ధనుస్సును చేతపట్టి వంచి ధనుస్సు చివరి భాగంతో కొన్ని పర్వతములను పడగొట్టి భూమిని సమానం చేశారు. అలా చేసేసరికి కొన్ని వేల ఎకరముల భూమి మరల వ్యవసాయ యోగ్యమయింది. దీని మీదకు వచ్చి నీరు నిలబడింది. విశేషమయిన పంటలు పండాయి. పృథివి మీద ఉన్నవాళ్ళు అందరూ చాల సంతోషించారు. భూమిని పృథుమహారాజు పిండితే ‘పృథ్వి' అనే పేరు వచ్చింది. జీవితంలో పృథు మహారాజు గురించి వినినట్లయితే మన కోరికలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెపుతారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 37 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


పృథుమహారాజు ఎప్పుడయితే పిండుకున్నారో దేవతలు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఇంద్రుడిని దూడగా వదిలారు. అమ్మ వాళ్లకి ‘వీర్యము’, ‘ఓజము’, ‘ఋతము’ అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది.

రాక్షసులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకొని లోహపాత్రలలో మూడురకముల సుర పిండుకున్నారు. గంధర్వులు అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యమును మధువును పిండుకున్నారు. అందుకే పద్మము అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు అర్యముని దూడగా చేసి పచ్చి మట్టిపాత్రలో దవ్యమును పిండుకున్నారు. సిద్ధులు కపిలమహర్షిని దూడగా చేసి ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతుంటారు. కింపురుషులు మయుడిని దూడగా చేసి యోగమనే పాత్రలోనికి ధారణనే శక్తిని పిండుకున్నారు. యక్ష, భూత, పిశాచాది గణములు రుద్రుడిని దూడగా చేసుకుని కపాలంలోకి రక్తమును పిండుకున్నారు. పాములు తక్షకుడిని దూడగా చేసుకుని తమ పుట్టలనబడే పాత్రలలోకి ‘పురువులు’ ‘ఫలములు’ అనే వాటిని పిండుకున్నాయి. వృక్షములు తమ పట్టలలోనికి రసమును పిండుకున్నాయి. అందుకే మనకి అన్ని రకముల రుచులు చెట్లనుండే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి ఉండి మనకు రసపోషణము చేస్తున్నాయి. అలా పృథు మహారాజు ఆనాడు ఎవ్వరూ పొందనటువంటి విజయమును సాధించి భూమండలమును అద్భుతముగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు అందరూ పరమ సంతోషముగా జీవితములను గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన నూరు అశ్వమేధ యాగములు చేయాలి అని సంకల్పించాడు. బ్రహ్మావర్తము అని స్వాయంభువ మనువు పరిపాలించిన ప్రాంతమునకు వెళ్ళి ‘సరస్వతి’ ‘తృషద్వతి’ అనబడే రెండు నదుల మధ్యప్రాంతంలో యజ్ఞశాల కట్టి తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశాడు. నూరవయజ్ఞం చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపముతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వమును ఎత్తుకు పోతున్నాడు. దానిని అత్రిమహర్షి కనిపెట్టాడు. బాణం వేసి యాగాశ్వమును వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషి వేషధారియై ఉన్న వాడిమీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రిమహర్షి ‘గుర్రమును ఎత్తుకు పోతున్నవాడు ఇంద్రుడే. నువ్వు నిర్భయంగా బాణము వదిలెయ్యి అన్నాడు. బాణము వదలడానికి పృథు కుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపమును, అశ్వమును విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుఱ్ఱమును వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి ‘విజితాశ్వుడు’ అని పేరు పెట్టారు.

మరల యజ్ఞం జరుగుతున్నది. ఒకరోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లు చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వమును అపహరించి తీసుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అత్రి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్వాంగము చేతితో పట్టుకుని దానిమీద ఒక పుర్రె బోర్లించి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణముగా మాంత్రికశక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసినవాడయి ఉంటాడు. లేదా బ్రహ్మహత్యా పాపవిముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడుకూడా అయి ఉంటాడు. అతనిని వధించాలా! వద్దా! అని పృథువు అనుమాన పడుతున్నాడు. అత్రి ‘నీవేమీ బెంగ పెట్టుకోనవసరం లేదు. అతడు ఇంద్రుడే. బాణం వెయవలసింది’ అని చెప్పాడు. పృథువు బాణం తీశాడు. ఇంద్రుడు ఆ రూపమును, గుఱ్ఱమును అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపమునకు ‘పాఖండరూపము’ అని పేరు. పాఖండము అంటే పాప ఖండము. అందులోంచి పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసేవారిలా కనపడతారు. కానీ వాళ్ళు వేద విరుద్ధమయిన మార్గములో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. రెండుమార్లు యాగాశ్వమును అపహరించాడనే కోపంతో పృథువు యజ్ఞం పాడయిపోతే పాడై పోయిందని లేచి నిలబడి ధనుస్సు పట్టుకుని బాణమును సంధించి ఇంద్రుని మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. ఋషులు ‘నీవు యజమానివి. నీవు ఎందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న నూరవయజ్ఞం పాడుచేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఇంద్రుడిని ఈ హోమములో పడేస్తాము’ అన్నారు.

ఇంద్రుని మీద క్షాత్రశక్తి, తపశ్శక్తి రెండూ కలిసిపోయాయి. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ‘మీరిద్దరూ పొరపాటు పడ్డారు మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారెయ్యడానికా! పృథూ నీకింత క్షాత్ర శక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి సంహరించడానికా! మీరు ఇద్దరు చేసింది పొరబాటే’ అన్నారు. అదే సమయానికి ఆశ్చర్యకరముగా సభలోనికి పూర్ణాంశతో శ్రీమహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడవాహనము దిగి ‘పృథూ, ఇప్పటికి నువ్వు తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేశావు. ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? సంఖ్య పెరుగుతుంది. ఇలా జరిగిపోతుంటే ఈ కర్మకు అంతమేమయినా ఉందా? తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేసి నీవు ఏమి తెలుసుకున్నావు? ఏమీ తెలియలేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయనను చంపి అవతల పారేస్తాను అంటున్నావు. నీకు దేహాత్మాభిమానము ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉండి ఉంటే నీవు బ్రహ్మజ్ఞానివి అయి ఉండేవాడివి. ఇంద్రుడి మీద బాణం వేయడములో దేహాత్మాభిమానంతో క్రిందికి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గుర్తించావా? నీయందు జ్ఞానము కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీయందు అమర్యాదగా ప్రవర్తించలేదు. అతని చర్య పైకి దోషముగా కనపడుతున్నది. నీవు బాణం వేయవలసింది ఇంద్రుని మీద కాదు. ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపంనుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మతవ్యాప్తి చేస్తున్నారు. వారి మాటలను విని సంతోషపడి పోయి వేలకొద్దీ జనం పాషండులు అయిపోతున్నారు. నీ బాణం పట్టుకుని ఈ పాషండ మతమును నాశనము చెయ్యి’ అని చెప్పాడు. వెంటనే పృథువు ఇంద్రునితో స్నేహం చేశాడు.

పృథుమహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం!

అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

అర్చన భక్తికి పృథుమహారాజు గొప్పవాడు. పృథుమహారాజు జీవితములో ఈ ఘట్టములను వింటే సంతానము లేని వాళ్లకు సంతానము కలుగుతుంది. శ్రీమహా విష్ణువు ‘పృథూ! నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. పృథుమహారాజు ‘స్వామీ! నన్ను మరల మోహపెడదామని అనుకుంటున్నావా! నాకెందుకు స్వామీ వరములు. నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా! నీ పాదారవిందములను గూర్చి వర్ణన చేసి, నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెపుతుంటే అలా విని పొంగి పోయేటటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడము వలన మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెపుతుంటే విని పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకేమీ వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టమును నాకు కలిగించు’ అన్నాడు. ఇదీ పృథు మహారాజు గారి పూజానిష్ఠ. అందుకే మనకి షోడశోపచారములు వచ్చాయి. ఇటువంటి అర్చనను చేశాడు పృథువు. అలా అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయనపట్ల విశేషమయిన ఆనందమును పొందాడు.

ఒకనాడు సత్రయాగము చేసి అందరికీ బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. ఇపుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారి తీసింది. అపారమైన భక్తి వైరాగ్యమునకు దారితీసింది. ఒకరోజు సత్రయాగం జరుగుతుండగా సనకసనందాది మహర్షులు క్రిందికి దిగారు. మహాపురుషులయిన వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినపుడు నిలబడతారు. సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారిని ఉచితాసనమున కూర్చోబెట్టి ‘స్వామీ! మేము సంసారమునందు ఉన్న మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదయినా మార్గం ఉన్నదా? మాకు కృప చేయండి’ అని ‘బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడిలా కనిపించవచ్చు. ఒకడు దరిద్రుడిలా కనిపించ వచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు. వేరొకడు కటిక దరిద్రుడు. ఏకారణము చేత’ అని అడిగితే సనక సనందనాదులు ‘ఎవరు మహా పురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో వున్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నటువంటివాడు ఈశ్వరుని దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు’ అని చెప్పారు. వాళ్లు ఇంకా ఇలా ‘గృహస్థాశ్రమంలో ఉండి చాలాకాలము పాపకర్మలయందు మగ్నుడై ఈశ్వరుని వైపు తిరగనివాడు జీవితము తరించడానికి చేయవలసిన మొట్టమొదటి పని భగవంతుని పాదములు పట్టి నమస్కరించ గలిగి ఆ నిపుణత కలిగిన ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకోవాలి. మెల్లగా భగవంతునితో అనుబంధమును పెంచుకునేలా చేస్తారు. అటువంటి వారితో కలిసి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమముగా నిష్కామయోగమునకు దారితీసి ఉన్న ఒకే మట్టి ఇన్నిపాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో వున్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్లు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఃఖములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానముచేత ఈశ్వరునిలో కలిసిపోతే సాయుజ్యము కలుగుతుంది’ అన్నారు.

సనక సనందనాదుల బోధ చేత జ్ఞానమును పొందిన వాడై కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఉత్తరదిక్కుకు ప్రయాణించి ఆశ్రమవాసం చేసి, తపస్సు చేసి, ఇంద్రియములను గెలిచి, అంత్యమునందు తన గుదస్థానమునందు ఉన్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో వున్న పృథివీ తత్త్వమును బ్రహ్మాండములో వున్న పృథివికి కలిపి జలమును జలమునకు కలిపి, ఆకాశమును ఆకాశమునకు కలిపి, తనలో వున్న తేజస్సును ఊర్ధ్వముఖం చేసి పునరావృత్తి రహిత విష్ణుసాయుజ్యము కొరకు బ్రహ్మాండమంతా ఆవరించివున్న విష్ణుశక్తి వ్యాపకత్వమునందు కలిపి వేసాడు. ఈవిధముగా పృథుమహారాజు పునరావృత్తి రహిత మోక్షమును పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచి పెట్టి భర్తృ ధ్యానం చేస్తూ భర్త ఏ లోకమునకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆలోకమునకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తియందు లీనమయింది.

ఇంత పరమ పవిత్రమయిన ఈ ఆఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభాఫలితం కలుగుతుంది. సంధ్యావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథుమహారాజుగారి చరిత్ర వింటే ఆ దోషం నివారణయి బ్రహ్మ వర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానారాజ్యం కావాలని పృథుమహారాజు చరిత్ర విని యుద్ధమునకు వెడితే జగత్తునంతటిని గెలిచి సార్వభౌముడు అవుతాడు. వైశ్యుడు పృథుమహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారములో అనేకమయిన లాభములు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములయిన వారు పెద్దలను సేవించేతత్త్వము ఉన్నవారు పెద్దల అనుగ్రహమును పొంది వారి కుటుంబములు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియనివాడు కూడా ఇటువంటి పృథుచరిత్ర వింటే సర్వ సిద్ధులను పొంది సర్వపాపములు నశించి శ్రీకృష్ణపరమాత్మ పాదారవిందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంత్యమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మనమీద అనుగ్రహముతో మహాపురుషుడయిన పోతనామాత్యుడు ఆంధ్రీకరించారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 39 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు. నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.

కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’ దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమన్నది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడు వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో అన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తన భార్యను తలుచుకుని ఇంద్రియములతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. ఎవ్వరికి తెలియని ఒక రహస్యమయిన పనిని చేస్తుంది. ఈయనను ఆదమరపించి నిశ్శబ్దంగా కోటలో నుండి బయటకు తోసేస్తుంది. అనగా వానికి మృత్యువు వచ్చేసింది. అన్నమాట! మంచం చుట్టూ అందరూ ఉంటారు. ఎప్పుడు పోయాడో ఎటువైపు నుంచి పోయాడో ఎవరూ చెప్పలేరు. ఈ పని జర వలన జరిగిపోతుంది. దేవగుప్తము చేసేస్తుంది. ప్రజ్వరుడు భయుడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యమును నిర్వహిస్తారు. ఆఖరున పురంజయుడు బయటకు వెళ్ళి పోతున్నప్పుడు అయిదు పడగల పాము బయటకు వెళ్ళిపోయింది. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే అయిదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఈకోట శిధిలం అయిపోయింది. ఈ కోట అగ్నిహోత్రంలో పడిపోయింది. ఈ విధంగా పురంజనుడి కోట కాలిపోయింది.

ప్రాచీన బర్హి ఈ కథనంతటినీ విని మనుష్యుని జీవితం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. ‘ఇపుడు ఉత్తర క్షణం ఏమి చెయ్యాలి' అని నారదుడిని అడిగాడు. నారదుడు ‘నీవు చేయగలిగింది ఒక్కటే. భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి ఈ రెంటినీ పెంచుకో’ అని చెప్పాడు. ఇది పరమ పవిత్రమయిన ఆఖ్యానము. ఇది కథారూపంలో ఉంటుంది. కానీ గొప్ప రహస్యమును ఆవిష్కరిస్తుంది. మీరు మీ మనవలను, చిన్న పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఈ కథను చెపితే వారికి వేదాంతమునందు ప్రవేశము లభిస్తుంది. వారిలో వైరాగ్యమునకు బీజములు పడడము ప్రారంభమవుతాయి. అంతగొప్ప ఆఖ్యానం.

పంచమ స్కంధము – ప్రియవ్రతుని చరిత్ర.

భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే!

స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారదమహర్షి గురుత్వం లభించింది. నారదమహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. ‘నాయనా! నీకు పట్టాభిషేకము చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది ఉన్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు’ అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. ప్రియవ్రతుడు ‘నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.

ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. ‘నాయనా ప్రియవ్రతా! సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి ఉంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము. నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆయన – మహానుభావా ! మీరు వచ్చి ఈ మాట చెప్పారు. నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 38 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


4. పురంజనోపాఖ్యానం:

భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్త్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్త్వమును మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేమిటో చాలా భయంకరంగా ఉన్నది – ఇదంతా తమకు అందదని అంటారు. ఋషులు బోధ చేసేటప్పుడు తత్త్వమును కథతో కలిపేస్తారు. నారదుడు ప్రాచీనబర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానమును వివరించాడు.

ప్రాచీనబర్హి కేవలము ఈ శరీరమే శాశ్వతము అనుకుని, తాను భూమిమీద శాశ్వతంగా ఉండి పోతాననుకొని ఎటువంటి మార్గములో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకుని ఒక రకమయిన అజ్ఞానములో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడయిన నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన కథకు ‘పురంజనోపాఖ్యానం’ అని పేరు.

పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నీ తిరిగాడు. ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణకొసన ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అందులోనుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలలపాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండుమంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూరుగురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు. పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాలే ఉంటాడు. పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు. అపుడు ఆమె ‘ఏమో నాకు తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటాను. నువ్వు మంచి యౌవనములో ఉన్నావు. నా పేరు ‘పురంజని’ నీ పేరు పురంజనుడు. నువ్వు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని. ఈ కోటకు ఒక గమ్మత్తు ఉన్నది. ఈ కోటకు తూర్పుదిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది.

ఆయన చాలా సంతోషించి ఆవిడని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. పురంజనుడు అంటే ఎవరో కాదు మనమే. మనకథే అక్కడ చెప్పబడింది. పురంజనుడు కోటకోసం వెదుకుతున్నాడు. వెతికి వెతికి దక్షిణ దిక్కున హిమవత్ శృంగమునందు వ్రేలాడుతున్న కోటను చూశాడు. దక్షిణదిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. ఏనాటికయినా శ్మశానములో చేరవలసినటువంటి శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. పురంజనుడు అక్కడికి వెళ్లేసరికి ఒక అందమయిన మేడ కనిపించింది. ఇక్కడ మేడగా చెప్పబడినది శరీరములో గల తల. శరీరమునకు పైన చక్కటి ఒక అందమయిన తలకాయ ఉంటుంది. దానిమీద ఉన్న వెంట్రుకలే పూలలతలు. చేతులు కాళ్ళు ఇవన్నీ అగడ్తలు. లోపల ఉన్నటువంటి ఇంద్రియములు భోగస్థానములు. రత్నములతో కూడిన వేదికగా చెప్పబడినది హృదయస్థానము. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది. దానిమీద మనం రాత్రివేళ నిద్రపోతాము. ఇంద్రియములు మనస్సు బడలిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. మనకి ఏమీ తెలియని స్థితి ఏర్పడుతుంది.

పురంజని ఎదురువచ్చి తనను వివాహం చేసుకోమన్నది. పురంజనుడు ఆమెను నీవు ఎవరని ప్రశ్నించాడు. ఆవిడ నాకు తెలియదు అన్నది. ఆవిడ బుద్ధి. ఆవిడని అయిదు తలలపాము కాపాడుతూ ఉంటుంది. అవే పంచప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే అయిదు ప్రాణములు. ఈవిడతో పాటు పదకొండుమంది భటులు వచ్చారు. వారే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు. ఈ పదకొండింటికి ఒక్కొక్క దానికి కొన్ని వందల వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వారి వెనక వున్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడ వచ్చింది. వివాహం చేసుకోమన్నాడు చేసుకున్నది. ఆవిడ ఒక మాట చెప్పింది ఈ కోటకు తూర్పుదిక్కుగా అయిదు ద్వారములు ఉన్నాయి – అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నీవు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలి అని చెప్పింది.

మనం అందరమూ అనుభవించేటటువంటి సుఖములే ఈ ద్వారములు. పనులు చేయడానికి మనం అందరం ద్వారంలోంచే కదా బయటకు వెళతాము. జీవుడు కూడా వాటిలోంచే బయటకు వెళ్ళి వ్యాపకములు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కున ఉన్న రెండుద్వారములే రెండుకళ్ళు. ఈ రెండుకళ్ళతో జీవుడు బయటి ప్రపంచమును చూసి దానితో సమన్వయము అవుతూ ఉంటాడు. ఒకటవ ద్వారము పేరు ‘ఖద్యోత’, రెండవ ద్వారము పేరు ‘ఆవిర్ముఖి’. ఎంతో చిత్రమయిన పేర్లు. ఈ రెండుద్వారములలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకొక్క స్నేహితుడితో వెళతాడు. ఒకడు ‘ద్యుమంత్రుడు’, రెండవ వాని పేరు ‘మిత్రుడు’. ‘ద్యు’ అంటే కాంతి. మిత్రుడు అంటే సూర్యుని పేరు. మీరు ఈ కళ్ళతో లోకమును వెలుతురు ఉన్నపుడు మాత్రమే చూడగలరు. ఈ కంటితో ఈ ఇద్దరు మిత్రులను పట్టుకుని ‘విభ్రాజితము’ అనబడే దేశమునకు వెడుతూ ఉంటాడు. వెళ్ళి ఈ లోకమునంతటిని చూస్తూ ఉంటాడు. ఇవి రెండూ రెండు ద్వారములు.

క్రిందను మరో రెండుద్వారములు ఉన్నాయి. వాటి పేర్లు ‘నళిని’, ‘నాళిని’. ఈరెండు ద్వారముల నుండి బయలుదేరినపుడు ‘అవధూతుడు’ అనే స్నేహితుడితో వెడతాడు. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉండరు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు వాయువు. వాయువనే స్నేహితునితో ‘సౌరభము’ అనే దేశమునకు వెళతాడు. ఈ ముక్కుతో వాసనలు పీలుస్తూ ఉంటాడు. సౌరభము అంటే వాసన. ఈవిధంగా అవధూతుని సాయంతో నళిని, నాళిని ద్వారా సౌరభమనే దేశమునకు వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. మూడవది ఒకటే ద్వారం. దీనిపేరు ‘వక్తము’ నోరు. ఈ ద్వారంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేస్తాడు. ఆయన పేరు ‘రసజ్ఞుడు’. ఒకోసారి బయటకు వెళ్ళేటప్పుడు రసజ్ఞుడితో వెళ్ళడు. ‘విపణుడు’ అనే ఆయనను పిలిచి ఆయన భుజమ్మీద చేయివేస్తాడు. ‘రసజ్ఞుని’తో వెళ్ళినప్పుడు ‘బహూదకము’ అనే దేశమునకు వెళతాడు. ‘విపణుడి’తో వెళ్ళినప్పుడు ‘అపణము’ అనే దేశమునకు వెడతాడు. రసజ్ఞుడితో వెళ్ళడం అంటే పండు కాయ అన్నం పులిగోర చక్రపొంగలి మొదలయినవి నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకొనుట. విపణుడితో వెళ్ళినపుడు ‘ఆపణం’ చేస్తాడు. ఆపణం చేయడం అంటే మాట్లాడడం. పనికిమాలినవి మాట్లాడుతూ ఉంటాడు. ఈశ్వర సంబంధమయిన విషయములు తప్ప అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు.

కుడిపక్కన ద్వారం ఉంది. దీనిపేరు ‘పితృహు’. ఇది కుడిపక్క చెవి. ఈ ద్వారంలోంచి ఒకే స్నేహితుడితో బయటకు వెళ్ళాలి. ఆయన పేరు ‘శృతిధరుడు’. అనగా వేదం. దీనితో వెళ్ళినపుడు పాంచాల రాజ్యమునకు వెడతాడు. వేదములో పూర్వభాగమయిన కర్మలను చేసి ఇక్కడ సుఖములను స్వర్గాది పైలోకములలో సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక క్రిందకు తోసేస్తారు. చాలాకాలమయిన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఎడమ చెవిద్వారం లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు కూడా శ్రుతిధరుడి మీదనే చేయి వేసుకుని బయటకు వస్తాడు. ఉత్తర పాంచాల రాజ్యమునకు వెళతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గము. సుఖములను కోరుకోడు. అది వేదము ఉత్తర భాగము. అందుకని ఎడమచెవి ద్వారంలోంచి వెళ్ళినపుడు మోక్షమును కోరతాడు.

ఆ తర్వాత ఉత్తరమునుండి వెళ్ళే ద్వారమునకు ‘దేవహూ’ అని పేరు. అలాగే తూర్పున తిరిగి ఈ కోటకు క్రింది భాగములో ఒక ద్వారం ఉన్నది. అదే మూత్ర ద్వారం. దాని పేరు ‘దుర్మదుడు’ అక్కడ మదమును కల్పించే ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటకు వెళ్ళినపుడు దుర్మదుని భుజమ్మీద చెయ్యి వేసి సుఖమనే సామ్రాజ్యమును చేరతాడు. ఆ సామ్రాజ్యము పేరు ‘గ్రామికము’ పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖమును పొందుతున్నాడు. అందుకని గ్రామికమయిన దేశమునకు వెళతాడు.

పడమట అనగా వెనకభాగమందు ఒక ద్వారమున్నది. అది మలద్వారము. దాని పేరు ‘లుబ్ధకుడు’. అంటే ఉన్నదానిని బయట పెట్టనివాడు. లోపలే కూర్చుని ఉంటుంది. బలవంతంగా తోస్తే బయటకు వెళుతుంది. అందుకని దానిపేరు ‘వైశసము’. అలా రెండురకములుగా వెళుతుంది. జీవుడు నేను వెళ్ళనని ఈ పురమును పట్టుకు కూర్చుంటాడు. ఇందులోంచి బలవంతంగా తీసేస్తారు. అంత పేచీపెట్టి తన శరీరము మీద భోగముల మీద తన ఐశ్వర్యము మీద కాంక్ష పెంచుకున్న వాడిని తరిమి తరిమి ఇదే శరీరములో అధోభాగమున ఉన్న అపానవాయు మార్గము ద్వారా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనే భయంకరమయిన నరకములో యాత్ర మొదలుపెడతాడు.

ఇన్ని ద్వారములు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ప్రజలు ఉన్నారు. అందులో ఇద్దరు కళ్ళులేని వాళ్ళు ఉన్నారు. వారు పుట్టుకతో అంధులు. పురంజనుడు వారిద్దరి భుజముల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి వెళుతూ ఉంటాడు. ఒకాయన భుజమ్మీద చేయి వేస్తే ఆయన తీసుకువెళుతూ ఉంటాడు. కళ్ళు లేని వాడు. ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. ఆయన పేరు ‘దిశస్మృత్’. రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. వాటిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి. ఇంకొక అంధుడిమీద చెయ్యి వేసి వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులకు కన్నములు ఉండవు. వాటిని ఏమి చెయ్యమంటే దానిని చేస్తూ ఉంటాయి. అలా తాను చేతులతో చేసిన దుష్కర్మల చేత తానే బంధింపబడుతూ ఉంటాడు. ఇద్దరు గుడ్డివాళ్ళతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు ‘విషూచుడు’ అనబడే వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖములను అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒకరోజున గుర్రం ఎక్కాడు. దానికి తన పక్కన పదకొండుమంది సేనాపతులను పెట్టుకున్నాడు. ఇవి పది ఇంద్రియములు, ఒక మనస్సు. వాటికి ఒకటే కళ్ళెం. ఒకడే సారధి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి, చంపకూడని వాటిని కూడా చంపేశాడు. తాను చెయ్యవలసిన, చెయ్యకూడనివి అయిన పనులను చేశాడు. చంపకూడని వాటిని చంపడం వలన అవి అన్నీ పగబట్టి ఇనుపకొమ్ములు ధరించి కూర్చున్నాయి. అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యను చూశాడు. ‘అయ్యో నిన్ను విడిచి పెట్టి వెళ్ళిపోయాను. బాగున్నావా? అన్నాడు. ఆవిడ అలకగృహంలో ఉన్నది. అనగా మరల సాత్విక బుద్ధియందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదయిపోతోందేమోనని అనుమానం వచ్చింది. అనగా మెల్లిమెల్లిగా బుద్ధియందు స్మృతి తప్పుతోంది. వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ‘ఉజ్వలము’ అనే వస్త్రం కట్టుకుని వచ్చింది. ‘అబ్బో మా ఆవిడకి యౌవనం తరగడం ఏమిటి’ అనుకున్నాడు. మళ్ళీ కౌగలించుకున్నాడు. ‘ఉజ్వలము’ అంటే తన బుద్ధియందు తనకు భ్రాంతి. అయినా ‘నా అంతవాడిని నేను’ అంటూ ఉంటాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 40 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తాను చేసిన పనులన్నింటిని ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏది చేసినా భగవంతుడిని తలుచుకుని చేశాడు. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు, సంసారమును వదిలిపెట్టి వెళ్ళి హిమాలయములలో కూర్చుని కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందాడు. ఆయనకు ఒక విచిత్రమయిన కోరిక పుట్టింది. మేరుపర్వతమునకు ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నపుడు భూమికి దక్షిణం దిక్కు చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణదిక్కున ఉంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. ‘నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీమహావిష్ణువు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమ గొప్పతనం ఏమిటో శాశ్వతముగా లోకమునకు తెలిసేటట్లు చేయాలి. ఏడురోజులు ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథమునెక్కి అంత తేజోవంతమయిన రథం మీద, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో, సూర్యుడు ఉత్తరమున ఉంటే నేను దక్షిణమున ఉంటాను. సూర్యుడు దక్షిణమునకు వచ్చేసరికి నేను ఉత్తరమునకు వెళ్ళిపోతాను. అలా ఏడురోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటిలేకుండా అపరసూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసినవాడు ఈ స్థితిని పొందగలడని నిరూపిస్తాను’ అని రథం ఎక్కాడు. ఏడురోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణము  చేశాడు. ఆ ఏడురోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు.

ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయి. ఏడుసార్లు ప్రదక్షిణములో ఏడుజాడలలో లోతుగా పడిన చారికల లోనికి వచ్చి ఏడు సముద్రములు నిలబడ్డాయి. అవి – లవణ సముద్రము, ఇక్షుసముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోదసముద్రము, శుద్దోదక సముద్రము, ఘృత సముద్రము. రథపు గాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటూ ఇటూ నీరుండగా మధ్యలో ద్వీపములు ఏర్పడ్డాయి. ఇలా సప్తద్వీపములు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్వీపములు అన్నీ ప్రియవ్రతుడు తిరిగినపుడు ఏర్పడిన ద్వీపములు. ఆవిధముగా రథపుగాడి మధ్యలో జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అను ఏడుద్వీపములు ఏర్పడ్డాయి. ఈ ద్వీపముల పేర్లు విన్నంత మాత్రం చేత పాపములు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు.

ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారములో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇక నేను ఇప్పటివరకు అనుభవించిన భోగముల వలన కలిగిన సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేనివలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. సత్యమునందు నేను లీనమయిపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈవిధంగా అరణ్యములకు వెళ్ళి ఘోరమయిన తపమాచరించి తనలోవున్న తేజస్సును ఈశ్వరతేజస్సుతో కలిపి మోక్షమును పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమమునందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు.

ప్రియవ్రతుని పెద్దకొడుకు అగ్నీధ్రుడు. అతడు రాజ్యమునకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావలసి ఉన్నది. అందుకని యోగ్యమయిన భార్యను పొందడం కోసమని హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చుని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యతాయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు ‘పూర్వచిత్తి’. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్తి ఉన్నచోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉండి  వానియందే పూనిక ఉన్నట్లయితే మనసు ఈశ్వరుడు వైపుకి తిరగక పోయినట్లయితే ఆ సుఖములు సుఖములు కావనే భావన కలగక పోయినట్లయితే మీరు పూర్వచిత్తికి లొంగుతున్నట్లు భావించుకోవాలి. దానివలన ఫలితం తెలుసుకోవాలంటే అగ్నీధ్రుడి చరిత్ర వినాలి.

ఆగ్నీధ్రుడు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారిని గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పేవరకు వేచి వుండాలి. ఈయనకు సుఖము అన్నది   కనపడితే చాలు అక్కడ మనసు లగ్నమవుతుంది. ఆయనకు అదొక అలవాటు.  ఆయన పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తి లొంగింది. ఆమెతో కలిసి చాలా సంతోషముగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా గడపగా ఆయనకు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భ్రద్రాశ్వువు, కేతుమానుడు అనే తొమ్మండుగురు కుమారులు జన్మించారు. వారు తొమ్మండుగురు అతి బలిష్ఠమయిన శరీరము ఉన్నవారు. పూర్వచిత్తి చాలాకాలం అగ్నీధ్రుడితో సంసారం చేసి ఆఖరుకి తన లోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయనను విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. అగ్నీధ్రుడు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చివరకు ఆమె వున్న లోకమును పొందాడు.

  ప్రియవ్రతునికి అగ్నీద్రుడికి ఉన్న తేడాను ఒకసారి గమనించండి. ప్రియవ్రతుడు తాను చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. అగ్నీధ్రుడు పూర్వచిత్తి ఉన్న లోకమును పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తిరహిత శాశ్వతశివసాయుజ్యమును పొందాడు.

అగ్నీధ్రుడి పెద్ద కుమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు అగ్నీధ్రుడు. యజ్ఞము చేసి కొడుకును పొందాడు నాభి. నాభి పరిపాలించాడు కాబట్టి ఈయనకు వచ్చిన రాజ్యమును ‘అజనాభము’ అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞమునకు సంతసించి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది.   యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కలుగగానే వారందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి ‘స్వామీ! నువ్వు పరాత్పరుడవు. నేను నిన్ను ఒక కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేసాను. నీవు ప్రత్యక్షమయినపుడు నిన్ను మోక్షం అడగడము మానివేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడిని దోసెడు ఊకను దానం చేయమని అడగడముతో సమానం. అయినా నేను అదే అడుగుతాను’ అన్నాడు. గృహస్థాశ్రమము పట్ల నాభికి వున్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృఋణం నుండి తాను విముక్తుడు కాడు. ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి. అటువంటి కొడుకును పొందాలనుకున్నాడు.

శ్రీమహావిష్ణువు ‘అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా? లేక దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా? అని అడిగాడు. నాభి ఒక తెలివైన పని చేశాడు. నాభి   ‘ఈశ్వరా! నాయందు వున్న భక్తిని నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్నొక కోరిక కోరుతున్నాను. నీలాంటి కొడుకును నాకు ప్రసాదించవలసినదని కోరాడు.  శ్రీమహావిష్ణువు ‘నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తథాస్తు అన్నందుకు లొంగాలో – ఏమయినా నేను నీకు లొంగవలసిందే. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభి తినే  ఆహారంలోంచి నాభిలోనికి వెళతాను. నాభి జీర్ణం చేసుకున్న తరువాత నాభి వీర్యకణములను ఆశ్రయిస్తాను. నాభి తేజస్సుగా నాభి బార్య అయిన మేరుదేవిలోకి వెళతాను. మీరు తథాస్తు అన్నందుకు పదినెలలపాటు గర్భస్థమునందు అంధకారంలో పడివుంటాను. నాభికుమారుడనని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను’ అన్నాడు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు లొంగిపోతాడు!

ఈమాట వినిన తరువాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భమును ధరించింది. ‘నల్లనివాడు’ నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడన్నమాట! అన్ని రంగులు తెలుపులోంచి పైకి వచ్చి మరల తెలుపులోకి వెళ్ళిపోతాయి అనగా సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతోందో చెప్పే మహాజ్ఞాని రాబోతున్నాడు. దానివలన తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి. జ్ఞాని పుట్టుకచేతనే కదా ఏడుతరాలు తరిస్తాయి! ఇపుడు తెల్లటివాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి ‘ఋషభుడు’ అని పేరు పెట్టుకున్నాడు.

ఋషభుడు బాహ్యపూజ చేసేవాడు కాదు. అంతరమునందు విశేషమయిన యోగమును అనుసంధానము చేస్తూ ఉండేవాడు. ఋషభుడు బాహ్యకర్మలు చేయడం లేదని ఇంద్రునికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. ‘మన రాజ్యంలో వర్షం పడడము లేదు. క్షామం వచ్చేటట్లు ఉన్నది’ అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు. ఋషభుడు ఒకనవ్వు నవ్వి తన యోగబలంతో మేఘములను సృష్టించి తన రాజ్యం ఎంత వరకు ఉన్నదో అంతవరకూ వర్షము కురిపించాడు. దానిచేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమై పోయి నాభి పరమసంతోష పడేటట్లుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషమును పొంది ఋషభుడికి పట్టాభిషేకము చేసి తపస్సు చేసుకునేందుకు నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: