కనువిప్పు కలిగించే యదార్ధ గాథ. 🙏
‘ ఓమ్ భూర్భువస్సువః –తత్సవితు ర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి– థియో యోనః ప్రచోదయాత్-‘
అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న’ గాయత్రీ మంత్రా’ న్ని విని వినోద్, వనజా నవ్వుకున్నారు.
“తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు గంటల సమయం వృధా చేసుకుంటున్నారు. దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా!” అన్నాడు వినోద్. వంటగదిలోంచి వీరి మాటలు వింటున్న బామ్మ భవాని ” ఏరా! తాతగారిని విమర్శించేంత గొప్పవారా మీరు! మీకేం తెల్సురా ‘ గాయత్రీ ‘ మాత ప్రభావం ? “అంది కోపంగా.
“ఏంటర్రా! పిల్లలూ! మీ బామ్మ ఏదో చెప్తున్నట్లుంది ? ఏదైనా కధా?” అని అడిగాడు తాత తారకరామయ్య.
“వీరికి కాస్త గాయత్రి గురించి చెప్పండి .’గాయత్రీ మాత ‘మహత్వం తెలీక ఏదో అనుకుంటున్నారు . పైకి అనలేదు కానీ వీరి మనస్సుల్లో ‘ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?’ అనే సందేహం మాత్రం ఉంది .” అంటూ బామ్మ వంట గదిలోకి వెళ్ళింది.
తారకరామయ్య తన వాలు కుర్చీలో కూర్చున్నాక, పిల్లలిద్దరూ వెళ్ళి ఆయన కిరువైపులా స్టూల్స్ లాక్కుని కూర్చుని ” తాతగారూ చెప్పరూ! ప్లీజ్ ! ” అని అడిగారు.
ఆయన గొంతు సవరించుకుని చెప్పసాగారు. “ఇది నిజంగా జరిగిన సంఘటన, కల్పనా కాదు, ఎవరో రాసిన కధా కాదు. యదార్ధగాధ. అది ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పటి విషయం, అప్పటి ఒక ఆంగ్ల దొర ‘ధామస్ మన్రో ’ అనే ఆయన పేరని గుర్తు. క్యాంప్ మీద కన్నడదేశానికి వచ్చి, ఒక రోజున తన గుఱ్ఱం మీద తుంగభద్రా నది ఒడ్డున షికారుకు బయల్దేరాడు . ఆయన తోటి షుమారుగా అరడజను మంది జవాన్లు గుఱ్ఱంతో పాటుగా పక్కనే పరుగెడుతూ అనుసరించ సాగారు.
” మన గురించీ ఏమనుకుంటున్నారు జనం?” ధామస్ తన వెంట ఉన్న వారిని అడిగాడు. ” “చాలామంచివారనుకుంటున్నారు దొరా!” వారిలో ఒక ముఖ్య సేవకుడు, బాపన్న చెప్పాడు.
” మీరంటే అందరికీ భయమే దొరా!” ముఖప్రీతికై మరో జవాన్ చెప్పాడు.
” సరి, సరి.ఈ రోజు విశేషాలేంటి?” ధామస్ మళ్ళీ అడిగాడు.
“ఏమున్నాయ్ దొరా! మీరీ సమయంలో షికారుకు వస్తున్నారు కదా ఈ వారంగా ఒక్కపిట్టా ఈ దారంట రాదు.”
“ఓహ్! అక్క డ చాలామంది జనం ఉన్నారు? ఏంటి విశేషం! ” ఆశ్చర్యంగా అడిగాడు ధామస్ .
” దొరా! అక్కడ నది ఒడ్డున ‘ శృంగేరి పీఠాధిపతులు’ కొలువు చేసి ఉన్నారు , ఆయన శిష్యులూ , స్వామి వారి ప్రవచనం ఆలకించను ఊరి జనమూ చేరి ఉన్నారు దొరా!”
“శృంగేరీ పీఠమా! అదేంటీ ఎన్నడూ విన లేదే?”
” దొరా ! మీరిక్కడికి ఎప్పుడూ రాలేదు కదా ! అంచేత విని ఉండరు. ఈ కన్నడదేశంలోని , చిక్క మగళూరు దగ్గరే శృంగేరి ఉంది. ఆది శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం మొదటి మఠాన్ని ఇక్కడ శృంగేరీ లో స్థాపించారు.”
” శృంగేరి అంటే అర్ధమేంటి ? దానికా పేరు మఠస్థాపన తర్వాత వచ్చిందా ? లేక ముందు నుంచే ఉందా? “ “శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది దొరా!. తుంగభద్ర నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం , తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉన్నాయి . శృంగేరి అనే పేరు ‘ఋష్యశృంగగిరి ‘నుండి వచ్చిందని అంటారు దొరా! శృంగేరికి సమీపంలో ’ శృంగపర్వతం’ ఉన్నది . విభండక మహర్షి కుమారు డు ‘ ఋష్యశృంగ ‘ మహర్షి. ఈ యోగి మహానుభావుడు ఒకసారి ‘రోమపాదు’ డనే రాజు పాలిస్తున్న ‘అంగ రాజ్యం’ క్షామానికి గురై , జనం బాధపడసాగారుట. ఆ సమయంలో, ఋష్యశృంగుడు అడుగు పెట్టగానే వర్షాలు పడి, క్షామ నివారణ ఐనదని అంటారు . ఈ గ్రామములో శంకరాచార్యులు అద్వైతాన్ని వ్యాప్తి చేయ టానికై స్థాపించినదే ఈ శృంగేరీ శంకరమఠం. ”
” ఎంతైనా మీ భారతదేశం చాలా గొప్పదోయ్ ! మహాను భావులు ఎంతోమంది ధర్మస్థాపనకై కృషి చేసిన ‘పుణ్యభూమి’ మీది. నాకెంతో ఇష్టం మీ దేశమంటే , నేనిక్కడ పుట్టకపోతినే అని బాధపడుతుంటాను అప్పుడప్పుడూ.” ధామస్ మనస్పూర్తిగా అన్నాడు.
“ఔ దొరా! మాదేశం మహా గొప్పది!” మురిసిపోతూ తన దేశాన్ని గురించీ చెప్పుకున్నాడు మరో జవాన్ రొప్పుతూ వెంట నడుస్తూ.
” శంకరాచార్యుల వారు మఠాన్నిఇక్కడే ఎందుకు స్థాపించాలనుకున్నారో తెల్సా?” థామస్ అడిగాడు.
“శంకరాచార్యుల వారు, తన పరివార శిష్యులతో ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతూ ఇక్కడ పర్యటిస్తూన్నప్పుడు, ఆయన ఒక చిత్రం చూశారు దొరా! ఒక సర్పం ప్రసవిస్తున్నఒక కప్పకు ఎండ పడకుండా తన పడగ నీడ పడుతున్న దృశ్యం , ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు , ఈ స్థల మహత్యం గొప్పదని గమనించారు . అంతే కాక ఇక్కడ వరకు వచ్చేసరికి మండన మిశ్రుడి భార్య ఐన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారి పోతుంది. ఆ కధ చాలాపెద్దది ఇంకోమారు చెప్తాను దొరా! ఈ రెండు సంఘటనలు చూసిన ఆయన ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మఠాన్ని స్థాపిస్తారు . ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెప్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం ఈ శృంగేరి.”
“మరి ఆ మహాపురుషుడేనా ఈయన? ”
” కాదు దొరా అది జరిగి చాలా ఏళ్ళైంది . ఈయన ఆ గురు పరంపరలోనివారే ! వీరంతా బాల్యంలోనే పీఠాన్ని చేరి వేద వేదాంగాలూ , శంకరాచార్యుల వారు ప్రవచించిన విశేషాలన్నీ అధ్యయనం చేస్తారు దొరా ! వీరంతా బ్రహ్మచారులు, ఎవ్వరూ వారిని ముట్టుకోడం కాదుగదా! దరిదాపులకు వెళ్ళనే ఝడుస్తారు , స్త్రీలైతే బహు దూరం నుంచీ దర్శించవలసినదే! వారు అనుగ్రహ భాషణంలోని ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పవి దొరా! ఒక్కటి ఆచరిస్తే చాలు జన్మ సార్ధకమవుతుంది.” దూరం నుంచీ ఆ ఆచార్యులను గమనించిన ధామస్ ” ఆహా! ఆ ముఖ వర్చస్సెంత గొప్పగా ఉంది! వెయ్యి వాల్టుల బల్బు వెలుగుతున్నట్లుంది వారి తేజస్సు! మరి బాపన్నా! ఆచార్యుల చెంతగా ఉన్న ఆ స్త్రీ మూర్తి ఎవరు? స్త్రీలకు ప్రవేశమే లేదన్నట్లు చెప్పావు ? మరి వారికి అంత దగ్గరగా ఉన్న ఆ అందమైన , అద్భుతమూర్తి, టీనేజ్ గాళ్ !ఎవరు బాపన్నా! వెళ్ళి తెల్సుకుని వస్తావా? ఈజ్ షీ హిజ్ సిస్టర్ !” ” దొరా! మాకక్కడ ఎవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే! మీకెవరు కనిపిస్తున్నారు?”
” అదో బాపన్నా! అంత బాగా కనిపిస్తుంటే లేదంటావేం? వెళ్ళి అడిగిరాపో?” అన్నాడు ధామస్ దొర .
దొర ఆదేశం మేరకు బాపన్న చేతులు కట్టుకుని దగ్గరగా వెళ్ళి వినయంగా , ఆచార్య శిష్యులకు తమ దొర సందేహం విన్నవించాడు .
ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ” అక్కడ మాకెవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే ! అసలిక్కడ స్త్రీలకు ప్రవేశమేలేదే?” అన్నాడు. బాపన్న” ఔ స్వామీ! మాకూ కనిపించడంలేదు . కానీ మా దొరకు కనిపిస్తున్నదిట! అడిగి వివరం తెల్సుకు రమ్మన్నారు. పీఠాధిపతులకు విన్నవించండి”అన్నాడు.
ఆ శిష్యుడు పీఠాధిపతులను సమీపించి , ఆ దొరగారి సందేహాన్ని చెప్పగానే , ఆశ్చర్యంగా ఆయన తలెత్తి దూరంగా గుఱ్ఱం దిగి తననే దీక్షగా చూస్తున్న ఆ దొరను చూసి,” నాయనా! నా సమీపంలో ఉన్నది శారదా మాత! ఆ తల్లి దర్శనం ఎవరికో నిష్టగా గాయత్రి చేసే వారికి కానీ లభించదు . నేను ఇక్కడ ప్రవచిస్తున్నప్పుడంతా ఆ మాత నా సమీపంలో ఉండి సద్వాఃక్కులను నా నోట పలికిస్తుంటుంది . నాశిష్యులైన మీరే కాంచలేని ‘అమ్మ’ను ఆ దొర దర్శించాడంటే ఆయన పూర్వజన్మలో భారతదేశంలో జన్మించి , గాయత్రీ జపం సంపూర్ణంగా , నిష్టగా గావించి ఏదో ఒక కారణాంతరంవల్ల ఆంగ్లేయుడై , ఆ ప్రాచ్యదేశంలో జన్మిం చాడు. నేను పీఠాధిపతిని కనుక ఆయనకు నమస్కరించరాదు . లేనిచో ఆయన నమస్కార అర్హుడని వెళ్ళి చెప్పిరా!” అని శృంగేరీ పీఠాధిపతి చెప్పిపంపారు. ‘
“అదిరా గాయత్రీ మంత్ర మహత్యం అర్ధమైందనుకుంటా ! నియమంగా భక్తితో జపించిన వారికి ఈ జన్మలోనే కాక మరు జన్మలోనూ రక్షణ నందిస్తుంది.” అని తాతగారు వివరంగా చెప్పారు. .
పిల్లలిద్దరూ ” మన్నించండి తాతగారూ!! మాకివన్నీతెలీక తేలిగ్గా మాట్లాడాము. మాకూ ’ గాయత్రి’ ఉపదేశించండి.. ఈ వేసవిలో ఇక్కడ ఉన్నన్నాళ్ళూ మీతో పాటు రోజూ గాయత్రి చేస్తాము . మా ఊరువెళ్ళాక వీలున్నంత సేపు నిత్య గాయత్రీ చేసేందుకు ప్రయత్నిస్తాము.” అన్నారు.🕉🚩🕉️