Vruddhula Kalyana Rama Rao గారు
ఓ వాం రోజుల కిందట 'తిరుపతి వేంకట' కవుల ఒక పద్యం పెట్టారు.. దాన్నిక్కడ ఏపాదానికాపాదంగా పెడుతున్నాను
1) ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స
2) న్మానము లందినాము బహుమానములన్ గ్రహించినార మె
3) వ్వానిని లెక్కపెట్టక నివారణ దిగ్విజయం బొనర్చి ప్ర
4) జ్ఞా నిధులంచు పేరుగొని నారము నీవలనన్ సరస్వతి..!
ఈ పద్యాన్ని వారు అప్పటి
పాలమూరు జిల్లాలోని
'ఆత్మకూరు' సంస్థానంలో చెప్పారని...దీనికి సంబంధించిన
పూర్వాపరాలు రాస్తానని వారి గోడమీద కామెంట్ పెట్టాను..
వెంటనే రాయలేకపోయినా..
నా మాటకు నేను కట్టుబడి
నాకు తెలిసిన మేరకు ఇక్కడ ఆ వివరాలు రాస్తున్నాను..
ప్రసిద్ధమైన ఆ పద్యానికి
ఓ వివాద చరిత్ర ఉంది.
ఆ పద్యం నేపథ్యం ఏమంటే..
తిరుపతి వేంకటకవులు సంస్థానాలను సందర్శిస్తూ, ఒకసారి పాలమూరు జిల్లాలోని ఆత్మకూరు సంస్థానానికి వచ్చి
కవి పండితుల సమక్షంలో
అవధానం చేశారు.. ఆ సందర్భంలో సమస్య పూరణంలో ఓ పదాన్ని ప్రయోగించారు.
(ఆ పదప్రయోగం గురించి మా మాన్న చెప్పారుగానీ, ఇప్పుడు గుర్తుకు రావడం లేదు)
ఆ పద ప్రయోగాన్ని ఆ సంస్థాన
ఆస్థాన కవి పండితులైన
'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్యులు' గారు తప్పుపట్టారు.. అట్లా ఇట్లాకాదు
'ఆ ప్రయోగం సంస్కృత భాషా వ్యాకరణ విరుద్ధ' మని ఆక్షేపించారు..
అవధానంలో ఎవరైనా కాదంటే
మరోపదం వేసి సర్దుబాటు చేసుకోగలిగే వెసలు బాటుంది..
కానీ చెళ్లపిల్ల వారి స్వాభావిక
మనస్తత్వం వేరే..పక్కనే ఉన్న
దివాకర్ల వారు మరోపదమేయ్
ఎందుకీ గొడవా..? అంటున్నా
వినిపించుకోకుండా..
'అవధానాన్ని నిలిపేస్తున్నాం..
రేపు సమాధానంతో వస్తాం' అని ప్రకటించారు..
బసకు చేరాక..
చెళ్లపిళ్ల వారి వ్యథేమంటే..
వ్యాకరణం ప్రకారం అసాధువైన పదం నా నోట్లోంచి ఎట్లా పడింది..? అనేదే ఆయన ఆవేదన..ఆ ఇద్దరు గుర్తు చేసుకుంటే...ఆ పదానికి
తిక్కన ప్రయోగం గుర్తుకొచ్చింది
ఆ మరునాడు
ఆ సభలో నిలిచి.. మా ప్రయోగం
తప్పుకాదు..దీనికి తిక్కన ప్రయోగముందని ధీమాగా చెప్పారట..అప్పుడు
ఈ 'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్య' గారిలా అన్నారట..
" మీరు చెప్పే ఆ తిక్కన మీకు ప్రమాణం కావొచ్చుగాక.. నాకెందుకు ప్రమాణం..?
ఇంతకూ వాడెవడు..?
ఈ పదాన్ని ఇట్లా ప్రయోగించిన ఓ సంస్కృత కవి ప్రయోగం మీరు చూపించగలరా..?" అన్నారట..
ఇంకేముంది..? ఓ ఆక్షేపణ
వివాదమై ముదిరి పాకాన పడింది.. జంటకవులు షాక్ తిన్నారు.. రాజుగారు
జోక్యం చేసుకుని
తన ఆస్థానానికొచ్చిన
ఆ కవులతో..
మీరేం చెబుతారో చెప్పమని కోరారట..వాళ్లన్నదేమంటే
" 'తిక్కన' తప్పయితే మేమూ తప్పే..ఈ వివాదాన్ని ఇతర సంస్థానాల పండితులకు పంపండి..వారందరి
అభిప్రాయం కోరుతున్నాం.."
అన్నారట.. వారి కోరిక మేరకు
ఆ రాజుగారు ఈ వివాదాన్ని
అన్ని రాజాస్థానాలకు పంపారు..
అదేదో తేలేవరకు చాలా రోజులు
పడుతుందిగా...? ఈలోగా మనం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం..
అప్పటిదాకా రంకలేసి తిరిగిన
ఆ కవియువ వృషభులకు
ముగుతాళ్లు వేసిన
ఆ 'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్యులు' ఎవరు..?
అష్టభాషావిశారదుడైన
ఆ మనిషి వెంటకవులకు అవధాన విద్య తెలియని నాడే.. మహా అవధాని..
సంస్కృత, ప్రాకృతాలలో
యావద్భారతంలోని అన్ని సంస్థానాలలో
శతావధానాలు చేసిన ఘనుడు
'అష్టభాషా విశారదు'డని శ్రీనాథుడు చెప్పుకున్నాడు..
ఆ తర్వాత
అలా రాజాస్థానాలు తిరిగి
'అష్టభాషా విశారద'
అనిపించుకున్న వాడు
ఈ 'బుక్కపట్నం' వారే..
మనం చెప్పుకునే జంటకవులు
'అటు గద్వాల ఇటు చెన్న పట్టణం' సంస్థానాలు తిరిగామని చెప్పుకున్నారు కదా..?
ఈ బుక్కపట్నం వారు
అటు గద్వాలేమిటి..? బెనారస్, బరోడా, లాహోరు సంస్థానాలపై
అవధాన దండయాత్ర చేశారు..
వారికి అనేక సంస్థానాలు
అనేక బిరుదులిచ్చాయి..
వాటిలో 'బాలసరస్వతి' బిరుదునే వారు ఇష్టపడ్డారు
ఆ బిరుదు నామాన్ని ఆనాటి
సమకాలీన పండితులు సైతం గుర్తించారు..
ఇక్కడ వారి ప్రతిభకు
ఓ రికార్డెడ్ ఫ్రూఫ్ గా
ఓ సందర్భాన్ని చెబుతాను..
ఓసారి మద్రాసులోని
'పచ్చయప్ప' కాలేజీలో
మహామహా పండితుల సమక్షంలో ఈ బుక్కపట్నం వారు
శతావధానం పూర్తి చేశారు.
ఆ సదస్సు సందర్భంగా..
ఆ సభకు అధ్యక్షత వహించిన
మహా పండితుడు
'సముద్ర మథనమ్' అనే ఇతివృత్తం (వర్ణన) పై
అష్టభాషల్లో అరగంటలో
50 పద్యాలు చెప్పగలరా..?
అని అడిగారట..
అష్ట భాషా అంటే
సంస్కృతం, మాతృభాష..
షట్ ప్రాకృతాలు అని అర్థం..
ఈ బుక్కపట్నం వారు
సంస్కృతం/తెలుగుతోపాటు
ప్రాకృత భాషలైన
'శౌరసేనీ, మాగధి, పైశాచీ, చూళికా పైశాచీ, అపభ్రంశ, చాయ' అనే ప్రాకృతాలలో..
విధించిన 30 నిముషాలకు
ముందే 24 నిముషాల్లో
ఎనిమిది భాషల్లో 50 పద్యాలు
చెప్పారట.. అంటే నిముషానికి
రెండు పద్యాలు చెప్పినట్టు..
ఆరోజు వారు చూపిన ప్రతిభ
1903 లో 'అర్ధఘంటా పంచాశత్' పేరుతో ముద్రితమైంది..
ఓకే భాషైతే.. ఆశువుగా
గంటకు నాలుగు వందలు చెప్పిన కొప్పరపు కవులున్నారు..
8 భాషల్లో నిముషానికి రెండు చొప్పున అంత వేగంగా చెప్ప గలిగిన అవధాని మనకెవడూ లేడుకాక లేడు.. దటీస్
'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్య'..
(వారు ఆరోజు చెప్పిన 50లో
8 పద్యాలు నా దగ్గరున్నాయి.
పోస్ట్ నిడివి పెరుగుతుందనే భయంతోనే వాటిని ఇక్కడ పెట్టడం లేదంతే)
మళ్లీ ఆ వివాద సందర్భంలోకి
వద్దాం..ఆ జంటకవుల్లో
చేళ్లపిల్ల నైజం వేరు..
తగ్గడం ఆయన జన్మతహః
స్వభావం కాదు..దివాకర్ల వారు
సత్వ గుణులు..చెళ్లపిళ్ల వారు
రజోగుణులు అదీ సంగతీ..
అవధానంలో ఓ పదం పడితే
ఆక్షేపించినపుడు మరో పదం
వేస్తే గొడవే ఉండదుగా..అని
మనం అనుకుంటాం గానీ
ఆయన నైజం అదికాదు మరి..
ఆ స్వభావానికి మరికొంత
జోడిస్తా..కొప్పర కవులేకాదు,
ఎందరితోనో ఈ జంటకవులు కయ్యానికి కాలుదువ్వారు..
ఆ వాగ్యుద్ధాలకంతా సూత్రధారి
ఈ 'చెళ్లపిళ్ల' వారే..పద ప్రయోగం మీద ఆయనకెంత పట్టుందనే
దానికన్నా..ఆయన పట్టుదలకు
అబ్బుర పోకుండా ఉండలేం..!!
చెళ్లపిళ్ల వారి స్వాభావిక నైజానికి
ఓ ఉదాహరణగా...
90 ఏళ్లకింద చెళ్లపిళ్ల వారు 'భారతి' లో
ఓ వ్యాసం రాశారు.. అందులో
ఓ పదాన్ని పట్టుకుని
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు
వివాదానికి దిగారు..
నిజానికి చెళ్లపిళ్ల వారికి
ఆయన గురువులు కూడా...
వారిదగ్గరే ఈయన యవ్వనంలో
'కుమారసంభవం, మేఘసందేశం' చదువుకున్నారు..
అయినా.. వాదం వాదమేగా..?
చెళ్లపిళ్ల వారు ఆ సందర్భంలో
" గురుడేమి లెక్క.. ఆ హరుడే
కాదాడ వాదాడెదన్' అని బదులిచ్చారు.. అదీ ఆయన నైజం..నాకు తెలిసి వారి పద్యాలలో ప్రసిద్ధమైన 'దోసమంటం చెరింగియు' పద్యం
ఈ ఆస్థానంలోనే చెప్పారని
అనుకుంటున్నా..అయినా కాకపోయినా..చెళ్లపిళ్ల వారి టెంపరిమెంట్ కు ఇదో మచ్చుతునక..
శాస్త్రం ప్రకారం వైదిక బ్రాహ్మడు
మీసం పెంచకూడదు.
దివాకర్ల వారికి మీసం లేదు
ఈ చెళ్లపిళ్ల మీసాల వారు
నిండు సభలో దాన్ని
కొందరు ఆక్షేపించారు..
అప్పుడు వారినోటి నుంచి
వచ్చిన సమర్థనా పద్య మిది..
"1) దోసమటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచినార మీ
2) మీసము రెండు బాసలకు మేమే కవీంద్రులమంచు తెల్పగా
3) రోసము కలిగినన్ కవివరుల్
మము గెల్వుడు, గెల్చిరేని యీ
4) మీసము తీసి మీ పద సమీపములం తలలుంచి మ్రొక్కమే.."
(సంస్కృతాంధ్రాల్లో మమ్మల్ని
ఎవరు గెలిచినా ఆ రెండు మీసాలను తీసి మీ పాదాల ముందుంచి మొక్కమా..!!?)
ఆక్షేపిస్తే..సవాలు విసరడం
వీరినుంచే నేర్చుకోవాలి మనం..
పైకి చూస్తే ఈ పోకడ 'అహంకారం' గా కనిపిస్తుంది గానీ.. తరచి చూస్తే..
చదువని వాడి అహం 'అహంకారం'
చదివినవాడి అహం
'అహమహ అలంకారం'..
(ఆ అహమహాలంకారులు ఎందరో ఉన్నారు..వారి గురించి మరోసారి రాస్తాను)
మళ్లీ మనం ఆ పండిత సభ
వివాదంలోకి వద్దాం..
అన్ని సంస్థానాల పండితుల
అభిప్రాయాలొచ్చాయి..
" జంటకవులు తెలుగులో అవధానం చేస్తున్నపుడు ఆపదం
సంస్కృత వ్యాకరణ విరుద్ధమైనా 'తిక్కన ప్రయోగంబు గ్రాహ్యంబు' " అని
ఈ జంటకవులను సమర్థించారు.
'బాలసరస్వతి' బుక్కపట్నం వారికి ఈ పండిత తీర్పు సంతృప్తికరంగా లేదు.
మౌనం వహించి సభలోంచి వెళ్ళిపోయారు..
ఇక్కడో విషయం చెప్పుకోవాలి
పండితుల అభిప్రాయం వచ్చే వరకు వాళ్లక్కడే ఉండిపోవాల్సి
వచ్చింది..ఆ మధ్యకాలంలో
ఖాళీగా ఉండకుండా..రాజావారి
కోరికమేరకు ఆ జంటకవులు
హొసదుర్గం శ్రీనివాసాచార్యులు
సంస్కృతంలో రాసిన 'శ్రీనివా విలాస' కావ్యాన్ని తెలుగులోకి
అనుదించారు..
ఈ 'హొసదుర్గం' వారు ఎవరోకాదు.. అప్పటికి వందేళ్ల కింద ఈ ఆస్థానం కవి పండితుడు..
అలా పండితాభిప్రాయం వచ్చాక
బాలసరస్వతి బిరుదాంకితులైన
బుక్కపట్నం ఆచార్యుల వారు
కినుక వహించి సభలోంచి
వెళ్లిపోయినా...రాజావారు మాత్రం ఆ యువకవులను ఘనంగా సత్కరించాలనుకున్నారు..
ఆ రోజు ఆత్మకూరు సభాస్థానం
కోలహలంతో నిండి పోయింది..
ఈ జంటకవులు
ఊహకందని గజారోహణంతో పాటు, కనివిని ఎరుగని
సన్మానాలను, బహుమానాలను
అందుకున్నారు.. వారెక్కిన ఏనుగు ఆత్మకూరు పురవీధుల్లో
ఊరేగింపుగా తిరుగుతోంది..చెళ్లపిళ్ల వారు
బుక్కపట్నం వారి ఇంటిముందు
ఏనుగును ఆపమని ఆదేశించారట..
అలాగే మావటి వాడు ఆపాడు
వారు ఏనుగు దిగారు.. ఆ
ఊరేగింపు వెంటనున్న సంస్థానం అధికారులు, ఆ సంస్థానంలోని ఇతర పండిత కవుల్లో
గుబులు పుట్టింది..మళ్లీ ఏపేచీ వస్తుందనని వారిభయం..
ఆ ఇద్దరూ ఆ ఇంట్లోకి
ప్రవేశించారు..ఆ సమయానికి
ఆచార్యులవారు పడక కుర్చీలో
కూర్చొని ఉన్నారు..
ఏనాడూ శిరసొంచని
ఈ జంటకవులు నేరుగా
ఆయనకు పాదాభివందనం చేశారట..! నిజానికి బుక్కపట్నం వారు వయసులో వారికంటే
40 ఏళ్ల పెద్దవాడు..అప్పటి ఆయన కోపతాపాలు, కినుక వగైరాలు
చిటుకలో కరిగిపోయి..వారిని
ఆత్మీయంగా హత్తుకున్నారట..!
'పెద్దల కోపం పాద నమస్కారంతో సరి' అనే మనపెద్దలమాటకు ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదు..
ఆ సందర్భంలో ఆ జంటకవుల నోట వెలువడినదే ఈ పద్యం..
1) ఏనుగు నెక్కినాము ధరణీంధ్రులు మ్రొక్కగ నిక్కినాము స
2) న్మానములందినాము బహుమానములన్ గ్రహించి నార మె
3) వ్వానిని లెక్కపెట్టక అనివారణ దిగ్విజయం బొనర్చి ప్ర
4) జ్జానిధులంచు పేరు గొనినారము నీవలనన్ సరస్వతీ..!!
బాల సరస్వతి బిరుదాంకితులైన
బుక్కపట్నం వారికీ...చదువుల తల్లి సరస్వతి కి అన్వయం కుదిరేలా...అలా ఆ సందర్భంలో
వారు చెప్పిన పద్యమే
ఈ సుప్రసిద్ధ పద్యం..
నిజానికి ఆనాడు ఆ 'బాలసరస్వతి' గారు వీరిని నిలదీయకపోయుంటే...వారు
ఏనుగు ఎక్కేవారే కాదు..
ఈ పద్యం పుట్టేదే కాదు కదా..!!ఏమైతేనేం, ఓ వివాదం కథ అలా సుఖాంతమైంది..
ఆక్షేపించిన ఆస్థాన కవే
వారిని కౌగలించుకున్నాక
ఆ రాజు ఆనందానికి అవధులుండవు గదా..?!
మరికొన్నాళ్లు ఉండమని
రాజుగారు కోరారు..
' ప్రేమ లేకపోతే అదో కష్టం
ప్రేమ మరీ ఎక్కువైతే అది మరింత కష్టం' కదా..?!
అది బంగారు పంజరమైనా
ఎగిరే చిలుకలకు బంధిఖాన కదా..!
తిరుపతి వేంకట కవులు
ఆత్మకూరు సంస్థానానికొచ్చి
ఈ వివాదం వల్ల అక్కడ
చాలా రోజులు వారుండాల్సి
వచ్చిందనడానికి ఆ సభలోనే వారు చెప్పిన
ఈ పద్యమే సాక్షం..తమకు సెలవిప్పించమని వారెంత సుతిమెత్తగా అడిగారో వినండి..
" 1) వేసవి దగ్గరాయె, మిము
వీడుటకున్ మనసొగ్గదాయె, మా
2) వాసము దూరమాయె, పరవాసమొనర్చుట భారమాయె, మా
3) కోసము తల్లిదండ్రులు లిదిగోనదిగో నని
చూచుటాయె, వి
4) శ్వాస మొలర్పవే సెలవొసంగిన పోయెదమయ్య భూవరా..!!
ఆ పద్యంలో విన్నపం ఎంతమెత్తగా ఉందో, భార్యాపిల్లలు అనకుండా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారనడం మరింత మెత్తగా గుండెకు తాకుతుంది..
మిత్రులారా..!
చివరిగా ఓమాట..వారిప్రజ్ఞ
ఆ ఇద్దరికే పరిమితం కాలేదు..
వారి శిష్య, ప్రశిష్యులలో
'ప్రజ్ఞానిధులంచు పేరుగొనిన' ప్రసిద్ధులు దాదాపు 30మంది దాకా ఉన్నారు...మా నాన్నగారు కూడా వారి ప్రథమ శిష్యులు వేలూరి శివరామ శాస్త్రిగారి శిష్యులు.. అలా ఆ జంటకవుల విద్యాకుటుంబంపై మరోసారి రాస్తాను..
(నాకు తెలిసిన నాలుగు విషయాలను మీతో పంచుకోవడానికి ప్రేరణ అయిన నాకు అగ్రజుడు Vruddhula వారికి ఈ పోస్ట్ అంకితం)