పూజా నియమాలు
జ: 1. పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.
2. నేతిదీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.
3. ఎడమచేతితో ఉద్ధరణె నీళ్ళు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.
4. ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మిసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.
5. గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదు.
6. పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.
7. పూజులో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది.
8. తూర్పు - ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.
9. పూజలకు, జపానికి వినియోగించే ఆసనం - అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి - ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.
10. జపం చేసేటప్పుడు మాలమధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.
11. నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపుల కొనలకు పసుపుపెట్టి ఇవ్వాలి.
12. అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.
13. వట్టి నేలపై కూర్చొని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు.
14. ''పూజ'' అంటే ''భోగములను ప్రసాదించునది (కలిగించునది)'' అని అర్ధం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.
15. మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప ధూపాలు, కుసుమాలు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుకే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.
16. బహిష్టులు స్త్రీలు మసలేచోట వారి దృష్టి పడేచోట దేవతాపూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో, ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.
- Subrahmanya Sharma