బమ్మెర పోతనామాత్యుల వారి - గజేంద్రమోక్షంలోని త్రికూట పర్వతవర్ణనము
8-23 సీస పద్యము
రాజేంద్ర! విను సుధారాశిలో నొక పర్వ;
తము త్రికూటం బనఁ దనరుచుండు;
యోజనాయుతమగు నున్నతత్వంబును;
నంతియ వెడలుపు నతిశయిల్లుఁ;
గాంచనాయస్సారకలధౌతమయములై;
మూఁడు శృంగంబులు మొనసియుండుఁ;
దట శృంగబహురత్న ధాతుచిత్రితములై;
దిశలు భూనభములుఁ దేజరిల్లు;
తేటగీతము
భూరి భూజ లతా కుంజ పుంజములును
మ్రోసి పఱతెంచు సెలయేటి మొత్తములును
మరఁగి తిరిగెడు దివ్యవిమానములును
జఱులఁ గ్రీడించు కిన్నరచయముఁ గలిగి.
తాత్పర్యము
“మహారాజా! పాలసముద్రంలో త్రికూటమనే పర్వతం ఉంది. దాని ఎత్తు, వెడల్పు ఒక్కొక యోజనము (4 కోసులు అంటే సుమారు 14 కిలో మీటర్లు). దానికి బంగారం వెండి ఇనుప శిఖరాలు మూడు (3) ఉన్నాయి. కొండ సానువుల లోను శిఖరాలలోను యున్నట్టి రత్నాలు ధాతువులు వలన దిక్కులు భూమి ఆకాశం చిత్రమైన రంగులతో మెరుస్తుంటాయి. దాని మీద పెద్ద పెద్ద చెట్లు తీగలు పొదలు గలగలలాడే సెలయేర్లు ఉన్నాయి. వీటికి అలవాటుపడిన దేవతలు విమానాలలో తిరుగుతుంటారు. ఆ కొండ చరియలందు కిన్నరలు విహరిస్తుంటారు.
రహస్యార్థం: సుధారాశి, పాలసముద్రం అనగా ఇతరం ఏది చూడని, వినని, ఎరుగని, చలించని అట్టి సహజ బ్రహ్మానంద స్థితి యగు పరబ్రహ్మము అందు. యోజననోన్నతం అనగా అనంత స్వరూపం గల పొడవు వెడల్పు అనే పడుగు పేకలుగా కూర్చబడిన పరబ్రహ్మము అందు. గుణసామ్యం అగు ప్రకృతి, రజో గుణం (కాంచనం, బంగారం), తమోగుణం (అయస్సారం, ఇనుము), సత్వగుణం (కలధౌత, వెండి) అనే త్రిగుణాలతో కూడినదిగా వ్యక్తమగుచున్నది. ఆయా త్రిగుణాల ప్రతిబింబాలు అయిన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనే మూడు శృంగములచే త్రికూట పర్వతం ప్రకాశించుతున్నది. అక్కడి చరియల సూత్రాత్మ (సూర్య చంద్రాది) కాంతులచే భాసమానములు అయిన సంసారం అనే మహా వృక్షాలు, ఆశ అనే లతలచే నిర్మితమైన పొదరిళ్ళు, వాసనా ప్రవాహాలు అనే సెలయేర్లు మరిగి దివ్యవిమానాలు అనే శరీరాలు మరియు విశ్వ, తైజస, ప్రాజ్ఞులు అను కిన్నరులు తిరుగుతున్నాయి.
8-24 వచనము
అది మఱియును మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకీ, భల్లాత, కామ్రాతక, సరళ, పనస, బదరీ, వకుళ, వంజుల, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, మందార, జంబూ, జంబీర, మాధవీ, మధూక, తాల, తక్కోల, తమాల, హింతాల, రసాల, సాల, ప్రియాళు, బిల్వామలక, క్రముక, కదంబ, కరవీర, కదళీ, కపిత్థ, కాంచన, కందరాళ, శిరీష, శింశు పాశోక, పలాశ, నాగ, పున్నాగ, చంపక, శతపత్ర, మరువక, మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, ఫలిత, లలిత, విటప, విటపి, వీరున్నివహాలంకృతంబును; మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును; కనకమయ సలిల కాసార కాంచన, కుముద, కల్హార, కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీంకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీప సంచార సముదంచిత శకుంత, కలహంస, కారండవ, జలకుక్కుట, చక్రవాక, బక, బలాక, కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీ భూత భూనభోంతరాళంబును; తుహినకరకాంత, మరకత, కమలరాగ, వజ్ర, వైఢూర్య, నీల, గోమేధి,క పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతట దరీ విహరమాణ విద్యాధర, విబుధ, సిద్ధ, చారణ, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును; గంధగజ, గవయ, గండభేరుండ, ఖడ్గ, కంఠీరవ, శరభ, శార్దూల, శశ, చమర, శల్య, భల్ల, సారంగ, సాలావృక, వరాహ, మహిష, మర్కట, మహోరగ, మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు నప్పర్వత సమీపము నందు.
తాత్పర్యం
ఆ త్రికూట పర్వతం నిండా ఎప్పుడు మాదీఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడిమామిడి, అంబాళం, తెల్ల తెగడ, పనస, రేగు, పొగడ, మఱ్ఱి, కొండమల్లి, కుంద, ఎఱ్ఱ గోరింట, పచ్చ గోరింట, కాంచనం, ఖర్జూరం, కొబ్బరి, వావిలి, చందనం, వేప, మందారం, నేరేడు, నిమ్మ, గురివింద, ఇప్ప, తాడి, తక్కోలం, చీకటి మాను, గిరికతాడి, తియ్యమామిడి, మద్ది, మోరటి, మారేడు, ఉసిరి, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోక, మోదుగ, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువక, మంచి మల్లె మొదలైనవి వసంత కాల శోభతో అలంకరింపబడి ఉంటాయి. ఆ చెట్లు కొమ్మలు పొదలు అన్ని ఎప్పుడు చక్కగా చిగుర్లు చిగురిస్తు, రెమ్మలు పల్లవిస్తు, మొగ్గలు తొడగుతు, పూలు పూస్తు, పండ్లు కాస్తు ఉంటాయి. ఎఱ్ఱమన్ను ఇసుకలు కలిగిన అనేకమైన చక్కటి ఇసుకతిన్నెలు కల సెలయేర్లు ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు కోయిలలు తమ వాడి ముక్కులతో పొడుస్తున్నాయి. ఆ పండ్ల రంధ్రాలనుండి రసాలు కారి కాలువ కాలువలుగా ప్రవహిస్తున్నాయి. ఆ కొండలో బంగారంలాంటి మంచినీటి సరస్సులున్నాయి. వాటిలో పసుపు కలువలు, తెల్లకలువలు, ఎఱ్ఱ కలువలు, పద్మములు ఉన్నాయి, వాటి సువాసనల మధువు ఎడతెగకుండ తాగి మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాళ్ళతో చేరి విహరిస్తున్నాయి. ఆ దగ్గరలోని చక్కటి శకుంతపక్షులు, కలహంసలు, కారండవాలు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకుకొక్కెరలు మొదలైన నీటిపక్షుల గగ్గోలుతో ఆకాశం నేల గింగిర్లెత్తుతోంది. చలువరాళ్ళు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు నీలాలు, గోమేధికాలు పుష్యరాగాలు నిండిన మనోహరమైన బంగారు వెండి శిఖరాలు చరియలు ఉన్నాయి. అక్కడ విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరలు, కింపురుషులు తమ ప్రియురాళ్ళతో కలిసి జంటలు జంటలుగా విహరిస్తున్నారు. వారు రసవంతంగా మాట్లాడుతూ పాటలు పాడుతున్నారు. ఆ కొండ శుభాలకు శాశ్వతమైన అలవాలంగా ఉంది. అందులో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గ మృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చమరీమృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్ళు, అడవిపందులు, అడవిదున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి. అవి ఎప్పుడు పోరాటాలు చేస్తుంటే చూసిన, యమ భటులు సైతం భయపడి శరణు వేడుతుంటారు.
రహస్యార్థం: వసంత సమయ సౌభాగ్య సంపద అనగా ఈశ్వర ధ్యానం అంకురిస్తున్న, సంసారం అనే అరణ్యంలో రాగాది పల్లవములు, విషయ పుష్పములు మొదలుగా గల వృక్షాలతో శోభాయుక్తం అయి, మోహాన్ని కలిగిస్తున్నది. ఆ సంసృతి అనే పాదపములకు బీజము అజ్ఞానం. దేహమే ఆత్మ అనెడి భావన అంకురం. లేచిగురు అనే రాగం. కర్మం అను దోహజం (జలం), కలిగిన చెట్ల వేళ్ళకు కొమ్మలకు మధ్య ఉండే కాండం స్థూలోపాధి. చివరి కొమ్మలు ఇంద్రియాలు. పుష్పములు శబ్దాది విషయములు. ఫలములు అనేక జన్మల నుండి వస్తున్న కర్మ వాసనలచే జనించు ప్రారబ్దానుభవాలైన దుఃఖాదులు. ఆ ఫలాల్ని అనుభవించేవి అయిన పక్షులు అను జీవులు. కలిగి ఉన్నాయి ఆ పాదపాలు. మణివాలుకానేక విమల పులినతలములు అనే రాబోవు దుఃఖాదులను మరగు పరచి తాత్కాలిక ఫలాలు అను ఆభాససుఖాలను కలిగిస్తున్నాయి. ఆయా సౌఖ్యా లను దుఃఖాలుగా గ్రహించి భక్తి జ్ఞాన ప్రవాహాలు తీరస్థ జ్ఞాన ఫల రంధ్ర స్రావకములు అనే ఆనంద రసాసావాదకములు శుక, పికాది పక్షులు కలిగి ఉన్నవి అగు ఆ వనాలు. భక్తి లతలు గుబురులు పుట్టి ప్రాకినవి. పుణ్యాలు అనే చివుర్లు చిగురించాయి. సచ్చిదానందం అను పుష్ప రస స్రావంతో కూడిన బ్రహ్మజ్ఞానం అనే ఫలం ఫలించింది. కనకమయ అనగా హిరణ్మయ మండలం. దాని యందలి హృత్పద్మాలు అందు నివసించే తృష్ణ సంబంధి మధుపాలు సంచరిస్తున్నాయి. మధుపాలు కనుక పైకి కిందకి అసంతుష్టిచే వ్యభిచరిస్తూ సంచరిస్తూ ఉంటాయి. సమీప సంచార నభోంతరాళ కల హంస పాలునీరు వేరు చేసి గ్రహించగల పక్షిరాజు అను పరమహంస. నామరూపాత్మక మాయాకల్పిత జగత్తు అనే నీరు వదలి. సచ్చిదానందరూప బ్రహ్మము అనే పాలు వేరు చేసి గ్రహిస్తాడు. అట్టి ద్విజ(పక్షి) శ్రేష్ఠులు పరమ హంసలు ఉన్నారు. ఇంకా లింగ శరీరాణ్యంలో ఉండే, క్రోధం అన్ పెద్దపులి, లోభం అనే శరభం (సింహాలను చంపే క్రూర మృగం). మోహం అనే పంచాననం (సివంగి), కామం అనే భల్లూకం (ఎలుగుబంటు), మదం అను జంబుకం (నక్క), మత్సరం అను కోక (తోడేలు, అడవి కుక్క) కలిసి చిత్తం అనే హరిణం (లేడిని) బాధిస్తున్నాయి. అట్టి త్రికూటమునందు
8-25 కంద పద్యము
భిల్లీ భిల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక కిటి
మల్లాద్భుత కాక ఘూక మయమగు నడవిన్.
తాత్పర్యము
ఆ త్రికూటం దగ్గర ఉన్న అడవి నిండా చెంచిత స్త్రీలు, చెంచు పురుషులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గ మృగాలు, గురు పోతులు, కొండముచ్చులు, చమరీమృగాలు, ఈలపురుగులు, సింహాలు, శరభాలు, సీమపందలు, కోతులు, కాకులు, గుడ్ల గూబలు ఉంటాయి.
రహస్యార్థం: తృష్ణ అనే చపల స్వభావ కోతులు, కామం అనే కాముకుని తీవ్ర సంకల్పం గల ఈల పురుగులు, పగ అనే రాత్రి తప్ప పగలు దృష్టి లేని గుడ్లగూబలు, కలిగి ఆత్మ దృష్టి లేక ప్రాపంచిక దృష్టి కలిగి ఉన్న సంసారం అనే అడవి అందు.
8-26 శార్దూల విక్రీడితము
అన్యాలోకన భీకరంబులు జితాశా
......నేకపానీకముల్
వన్యేభంబులు కొన్ని మత్తతనులై
......వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరి భూధరదరీ
......ద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలిపడి
...... కాసారావగాహార్థమై.
తాత్పర్యము
ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించినవి. వాటిలో కొన్ని కొండగుహల నుండి బయలు దేరాయి. చెర్లాటాలు ఆడుతు దప్పి గొన్నాయి. జల క్రీడల కోసం సరస్సులవైపు నీటిగాలి వాలు పట్టి నడిచాయి.
రహస్యార్థం: అభయం అయిన సమాధిలో యోగులు (ద్వైతులు) భయం కల్రించుకొని దుర్ణిరీక్షణం అని చెప్పదగ్గ కూటస్థాది చైతన్య రూప ఏనుగులు. మూలాధారాది గుహల నుండి బయలుదేరి పరాగ్దృష్టులకు భయంకరములై దిగ్దేవతలగు ఇంద్రాదులను జయించునవి అయి సంచరిస్తున్నాయి. కర్మాది, అభాస సుఖాలు అయిన విలాసేచ్ఛలచే క్షుత్పిపాసాది షడూర్ముల స్థానం అగు మనస్సు అను కాసారం (సరస్సు) కోసం బయలు దేరాయి. (ఆకలి దుప్పులు, శోక మోహములు, జరామరణములు షడూర్ములు)
8-27-ఆ.ఆటవెలది
అంధకార మెల్ల నద్రిగుహాంతర
వీథులందుఁ బగలు వెఱచి డాఁగి
యెడరు వేచి సంధ్య నినుఁడు వృద్ధత నున్న
వెడలె ననఁగ గుహలు వెడలెఁ గరులు.
తాత్పర్యము
చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండగుహలలో దాక్కొని సాయం కాలం సూర్యుడి శక్తి సన్నగిల్లటం కనిపెట్టి బయటకొచ్చాయా అన్నట్లు ఆ త్రికూట పర్వతం నుండి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి.
రహస్యార్థం: బ్రహ్మజ్ఞానం ప్రకాశించే సమయంలో (పగలు) కనబడని చీకటి అనే అవిద్య కొండ గుహలు అను హదయ కుహరాలలో దాగి ఉండి, జీవుని వృత్తి బహిర్ముఖం అయినప్పుడు అవరించి నట్లు అజ్ఞానవృత్తులు బయలుదేరాయి.
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం