శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలోని శ్రీసిద్ధేశ్వర కోనలో ఉన్నది.
చాలా పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం కొంతకాలంపాటు ఆదరణ లేక శిధిలావస్థకు చేరుకునే దశలో కాశీనాయన స్వామి పునరుద్ధరించారు. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య ఘటిక సిద్దేశ్వరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల నుండేకాక పర్యాటకులు చాలా మంది వస్తూ ఉంటారు. అత్యంత ప్రాచీన శైవక్షేత్రాల్లో ఇది ఒకటి. 6వ శతాబ్దానికి పూర్వం వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది.
సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కల్యాణం జరిపినట్లు నిత్యనాథ సిద్ధాచార్యులు రసరత్నాకర గ్రంథంలో పేర్కొన్నారు. ఆగస్త్యముని ఒక ఘటిక కాలం స్మరించగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనందున ఈ క్షేత్రం ఘటికసిద్ధేశ్వరంగా ప్రసిద్ధి చెందినట్లు పురాణాలు చెబుతున్నాయి.
1406లో విజయనగరం సామ్రాజ్యాన్ని పాలించిన రెండో హరిహరరాయులు, ఆయన తనయుడు మొదటి దేవరాయులు ఈ ఆలయానికి ప్రాకార మండపం నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. 1974లో అవధూత కాశినాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ప్రకృతి సౌందర్యం చాలా బాగుంటుంది ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల నడుమ మనసును మైమరపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది.
ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు శ్రీ సిద్ధివినాయక స్వామి, శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి, శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, శ్రీ సద్గురు కాశీనాయన స్వామి, శ్రీ వృద్ధ సిద్దేశ్వర స్వామి, నవగ్రహ మండపం, ఏకశిలా ధ్వజ స్తంభం, మహా బిల్వ వృక్షం, అగస్త్య పీఠం, వీరభోగ వసంతరాయలు, కైలాస కోన (తపోవనం), అయ్యప్ప స్వామి గుడి, ధ్యాన మందిరం, సప్త కోనేరులు, పాలకోనేరు, నంది ధార మొదలగు వాటిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇచట కొలువుదీరిన ఇష్టకామేశ్వరీదేవి అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలందుకుంటారు.
ఇక్కడకు వచ్చే భక్తులు సొంత వాహనాలపై ఆధారపడవలసి ఉంటుంది. శివరాత్రి సమయంలో బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కొండపై నుంచి ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తున్నందు వలన మంచినీటికి ఇబ్బంది లేదు. ఇక్కడకు వచ్చిన భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తూనే ఉంటారు వివిధ రకాల సత్రాల వారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వసతి సౌకర్యం కూడా ఉన్నది.
సర్వేజనా సుఖినోభవంతు
************
శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం, మురడి
రాయలసీమ.. అనంతపురం జిల్లా లో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం. అత్యద్భుతమైన శక్తి గల ఆంజనేయ స్వామి దేవస్థానం. కసాపురం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అంత ఖ్యాతి గల
దివ్య క్షేత్రమే మురడి.
శ్రీ వ్యాస రాయులు ఒకే ముహూర్తం లో మూడు చోట్ల విగ్రహ ప్రతిష్టాపణ చేశారు. ఒకటి శ్రీ కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం గుంతకళ్ళు దగ్గర,శ్రీ మురిడి ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు శ్రీ నేమకల్లు ఆంజనేయ స్వామి దేవస్థానం రాయదుర్గం దగ్గర. ఈ మూడు దేవస్థానాలు ఒకే జిల్లా లో ఉండటం విశేషం..
ఈ ఆలయాలను క్రీ.పూ 450 సంవత్సరంలో ఆలయాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
ఒకే నక్షత్రంలో ప్రతిష్టించిన శ్రీఆంజనేయస్వామి ఆలయాలను పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శనివారాల్లో దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు.
ఇక్కడ స్వామి వారు మూడు అడుగులు ఉండటం చేత మురడి అని పేరు వచ్చింది. కన్నడం లో మురడి అంటే మూడు అడుగులు అని అర్ధం.
ఆలయ రాజా గోపురం చాల బాగుంటుంది ... గోపురం లో హనుమంతుడు చుట్టూ రామాయణ గాద సంబందించిన చిత్రాలను మనం చూడవచ్చు. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకలోని డీ హీరేహాళ్ మండల పరిధిలో ఉన్న మురడి గ్రామంలో శ్రీ మురిడి ఆంజినేయస్వామి ఆలయం ఉంది.
ఇక్కడికి చేరుకోవడానికి అనంతపురం నుంచి రాయదుర్గం మీదుగా వెళ్ళాలి. రాయదుర్గం నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. కర్ణాటక ప్రాంతామైన బళ్లారి నుంచి 45 కిలోమటర్ల దూరంలో ఉంది.
సర్వేజనా సుఖినోభవంతు