15, జులై 2020, బుధవారం

" దాగుడు మూతలు దండాకోర్ ,పిల్లి వచ్చే,ఎలుక గప్ చుప్ సంబారు బుడ్డి’’


ఇవి చిన్నపుడు పిల్లలు ఆడుకునే ఆటల్లో,కళ్ళు మూసి చెప్పే మాటలు.ఇందులోని సంబారు బుడ్డి అంటే ఏమిటో వివరించమని మిత్రులు సాయి వంశీ,ఇంకా కొందరు అడిగారు.వారికోసం,మరియు నా మిత్రులైన మీ అందరి కోసం నాకు తెలిసిన ఈ వివరణ...
పల్నాడు ప్రాంతాలలో,[నరసరావుపేట,పిడుగురాళ్ళ,సత్తెనపల్లి,గుంటూరు జిల్లాలోని ఇంకా కొన్ని ప్రాంతాలలో]కూరలలో వాడుకోవటానికి ఏడాదికి సరిపడా,ఎండాకాలంలోనే,సంబారు తయారుచేసుకుని పెట్టుకుంటారు.కూరల్లో పసుపు వాడరు.దీన్నే వాడతారు.దీని రుచి,వాసన చాలా బాగుంటుంది.కూరలకు అదనపు రుచి వస్తుంది.చంటిబిడ్డలకు వేడ న్నంలో నేయి,ఈ సంబారు పొడి వేసి కలిపి ముద్దలు పెడుతూ వుంటే,పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.ఇది మంచి అరుగుదల నిస్తుంది.
ఇది ఎలా తయారుచేస్తారంటే ఒకకిలో మంచి పసుపుకొమ్ములు తీసుకుని,ముక్కలుగా నలగగొట్టి ఎండలో పెడతారు.కిలో ధనియాలు,పావుకిలో చొప్పున మెంతులు,జీలకర్ర,కల్లుప్పు తీసుకుని,నూనె లేకుండా,మాడకుండా వేపుతారు.పసుపుకొమ్ములువేపిన ఇవన్నీ,ఇంకా ఎండబెట్టిన కరివేపాకు చాలా ఎక్కువ మోతాదులో తీసుకుని,ఇవన్నీ కలిపి మర పట్టిస్తారు..
ఇందులో ఎండు మిరపకాయలు గానీ,కారం గానీ వేయరు..
ఇంటికి తెచ్చాక,పొట్టు వలవని పావుకిలో వెల్లుల్లి పాయలు[ఎల్లిగడ్డలు]ఈ పొడిలోవేసి కచ్చాపచ్చాగా దంచి,ఒక బేసిన్ లోకి తీసుకుని దానిలో పావుకిలో వంటాముదం పోసి బాగా కలిపి ఒక మట్టిబుడ్డికి [మట్టిదుత్త]ఎత్తి పెట్టుకుంటారు.ఈ సంబారు బుడ్డి చిన్న కుండ సైజ్ లో వుండిమూతి సన్నగా,చేయి పట్టేంత సన్నగా వుంటుంది.అచ్చం దీపం బుడ్డి ఆకారంలో వుంటుంది.
మా చిన్నపుడు ఇళ్ళలో కాస్త చీకటిగా వుండే గదిని స్టోర్ రూమ్ గా వాడుకునేవారు.మా ఇంట్లో అయితే మా పడమటింటి గదిని అలా వాడేవారు.ఆ గదిలో అనేక సైజ్ లలో బాన లు,కుండలు,బుడ్లు ఉండేవి. బానల్లో జొన్నలు,సజ్జలు,బియ్యం కుండల్లో ఉప్పు గోంగూర,గోంగూర ,పండు మిరపకాయ పచ్చళ్లు,చింతాకు,కరివేపాకు లాంటి పొడులు,ఒరుగులు,వడియాలు ఇలా నిలువ చేసే ఆహార పదార్ధాలు,బుడ్డిల్లో కారం,సంబారు,ఆవకాయ,ఇంకా రకరకాల పచ్చళ్ళ జాడీలు,ఇంకా ఏవో పెట్టెలు ఉండేవి.అవసరమైనప్పుడు దీపం ముట్టించుకుని వెళ్ళి కావలసినవి తెచ్చుకునే వారు.ఆ పెద్దపెద్ద బానల మాటున ఈ చిన్ని సంబారు బుడ్డి , కనీ,కనపడకుండా,నక్కి వుంటుంది.
అందుకే ఈ దాగుడు మూతల  ఆటలో, సంబారు లాగా నక్కి,దాగి వున్న,దొంగను పట్టుకోవాలి.
 సాంబారు బుడ్డి మూత తీయగానే ఒక్కసారిగా గుప్పున,సువాసన ఎలా వెదజల్లు తుందో,అలాగే  దొంగ పట్టుబ డ,గానే దాంకుని వున్న  పిల్లలందరూ ఘోల్లున నవ్వుతూ ఒక్కసారిగా బయటకు వస్తారు.. ఇంకా సాంబారు  బుడ్డి లాగ చీకటిలో పెద్ద వాటి మాటున దొంగ పెట్టినవారికి కనపడకుండా నక్కి కూర్చో అనే అర్ధంలో ‘గప్ చుప్ సంబారు బుడ్డి’ అంటారు.ఇదండీ కత..ఇందులోనే దండాకోరి అనే పదం వుంది.దండాకోరి అంటే మొండి అని అర్ధం వుంది.అంటే భయపడకుండా మొండిగా,దైర్యంగా వెళ్ళిదొంగని పట్టుకో అని చెప్పుకోవచ్చు.
               పూదోట.శౌరీలు.బోధన్.

కామెంట్‌లు లేవు: