శ్రీశ్రీశ్రీ
*సంక్షిప్త రామాయణ*
*పారాయణం*
*శ్రీరామనవమి వరకు*
********
*4వ రోజు పారాయణం*
🌸 *కిష్కింధ కాండ*🌸
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
***
శ్రీ రామ లక్ష్మణులు శబరి ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపా సరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. సీతాపహరణం గురించి విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు.
శ్రీరామా నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు.ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. నీవు లోకైక వీరుడవు. దుఃఖం, శోకం, భయం, ప్రతిభను బయటకు రాకుండా చేస్తాయి. ఈ అడ్డు తొలగించుకో, నీకు చెప్పేటంతటివాడను కాను. అన్నయ్యా ఉత్సాహాన్ని పుంజుకో, ఈ బాధ విడిచిపెట్టి జరగవలసిన దాని గురించి ఆలోచించు అన్నాడు. తమ్ముడి మాటలు రాముడికి ఉత్సాహాన్నిచ్చాయి.
క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.
*శ్రీరాముడి వద్దకు*
*హనుమ*..
తన అన్న వాలి కోపానికి గురై తరిమి వేయబడిన సుగ్రీవుడనే వానరుడు తనవారితో కలసి ఋష్యమూక పర్వతం పైననే తిరుగుతున్నాడు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. వాలి వీరిని తన పైకి యుద్ధానికి పంపాడేమోనని సుగ్రీవుడి భయం. వారెవరో తెలుసుకుని రమ్మని హనుమంతుడిని పంపాడు.
హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు–
ఓ పుణ్యపురుషులారా! తమరు, వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి సర్వ శత్రు సంహరణా దక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల లాగా, సూర్యచంద్రులలాగా, అశ్వినీ దేవతల లాగా కనిపిస్తున్నారు. నేను సుగ్రీవుడు అనే వానరుని మంత్రిని. అతడు తన అన్న వాలి ఆగ్రహానికి గురై దీనుడై ఉన్నాడు. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కామరూపుడను గనుక బ్రహ్మచారి వేషంలో మిమ్ములను కలవడానికి వచ్చాను. నేను వానరుడను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి అని మృదువైన మాటలతో అన్నాడు.
హనుమంతుని మాటలకు, వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు.
లక్ష్మణుడివైపు తిరిగి రాముడు,....
చూశావా లక్ష్మణా....
ఇతని మాటలలో ఎక్కడా అనవసర శబ్దం గాని, అపశబ్దం గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వానిని మంత్రిగా కలిగిన రాజు ఏదయినా సాధించగలడు అని చెప్పాడు.
రాముడి అనుమతి తీసుకుని లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు.
*శ్రీరామ, సుగ్రీవుల మైత్రి*:
హనుమంతుని ద్వారా రామ లక్ష్మణుల గురించి తెలుసుకుని సుగ్రీవుడు వారికి స్వాగతం పలికి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడతానన్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ ని రాక్షసుడు అపహరించుకుపొతుండగా చూశాం. ఆమె జారవిడచిన నగలు మావద్ద ఉ న్నాయి అని వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. కన్నీళ్లతో కళ్లు మసకబారాయి.
ఈ ఆభరణాలు మీ వదిన సీతమ్మవో కాదో చూడమని,లక్ష్మణుడికి చెప్పాడు రాముడు.
*నాహం జానామి కేయూరే* *నాహం జానామి కుండలే*
*నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్*
అన్నయ్యా.... ఈ కేయూరాలు, కుండలాలను నేను గుర్తించలేను. కాని నిత్యం వదినకు పాదాభివందనం చేయడం వలన ఈ నూపురాలు ఆమెవని మాత్రం చెప్పగలను అన్నాడు . ఆ ఆభరణాలను చూస్తూ
రాముడు ఇంకా దుఃఖిస్తున్నాడు. రామా చింతించకు సీత జాడ తెలుసుకుని తెచ్చి అప్పగించే బాధ్యత నాది అని అనునయవాక్యాలు పలికాడు సుగ్రీవుడు.
రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి కుదుర్చుకున్నారు.
అన్న అయిన వాలితో సుగ్రీవుడికి వైరం ఎందుకు వచ్చిందో రాముడు అడిగి తెలుసుకున్నాడు.
కిష్కింధకు రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. ఒక సారి మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే కాపలాగా ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒక నెల గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని, రాక్షసుడు బయటకు వస్తాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజును చేశారు.
కొంతకాలానికి వాలి బిలంలోంచి బయటకు వచ్చి , సుగ్రీవుడు రాజ్యం కాజేయడానికి బిలానికి బండరాయిని అడ్డంగా పెట్టి వచ్చాడని భావించి అతడిని నిందించాడు. సుగ్రీవుడి భార్య రుమను చేపట్టి
సుగ్రీవుడిని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.
దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.
*వాలి- సుగ్రీవుల పోరు*
రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీ కొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో తనను కాపాడనందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.
వాలి , సుగ్రీవులు ఇద్దరూ ఒకేరకంగా ఉండడంవల్ల కాపాడలేక పోయానన్నాడు. మరో సారివెళ్ల మన్నాడు రాముడు. సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు. ఈ సారి ఒక పుష్పమాలను గుర్తుగా సుగ్రీవుని మెడలో వేసి పంపాడు . మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార అడ్డుకునింది. సుగ్రీవుడితో పోరు వద్దని వారించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు వెంటనే యుద్ధానికి వస్తున్నాడంటే, రామ లక్ష్మణుల అండ చూసుకుని వస్తున్నాడని గ్రహించమనింది. కాని వాలి తన భార్య తార మాట వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.
అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు చెట్టు చాటునుంచి కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపైకిసంధించాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.
కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనిపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--
*రాముని వాలి నిందించుట*:
రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చాటుగా వేసిన బాణం వల్ల నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, నీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. ధర్మం తప్పి వ్యవహరించావు అని రాముడిని నిందించాడు.
నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? – అని వాలి అన్నాడు.
*రాముని సమాధానం*
వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.
నేను వేట మిష మీద నిన్ను చంపలేదు. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. కిష్కింధ మా రాజ్యంలోదే నని మరువకు.
నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు అధిపతివైన నీకు తెలుసు.
ఇక చెట్టుమాటునుండి చంపానంటున్నావు... నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయం చేత నిన్ను కూల్చాను. పైగా నీది జంతు సంతతి .మాటు వేసి చంపడం సరయినదే.
అధర్మ వర్తనుడిని వధించడానికి యుద్ధ ధర్మాలు కూడా వర్తించవు. నీవు శిక్షార్హుడవు అన్నాడు. రాముడి సమాధానంతో వాలి తృప్తి చెందాడు. ధర్మసూక్ష్మాలను గ్రహించాడు.
రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. అయితే గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో, సుగ్రీవుడు నా భార్య తారను హింసించకుండా చూడు. నా అపరాధాలనూ మన్నించు అని వాలి వేడుకున్నాడు.
తరువాత వాలి సుగ్రీవుని పిలిచి ప్రాణాలు పోయే లోగా తన మెడలోని కాంచనమాలను తీసి అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. తార మాట విననందువల్లే తనకు ఈ దుర్గతి పట్టిందన్నాడు.. రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నాడు. అలక్ష్యం చేయవద్దన్నాడు.
పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని వాలి ప్రాణాలు వదిలాడు.
అనంతరం రాముడి ఆజ్ఞపై రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు సుగ్రీవ పట్టాభిషేకానికి కిష్కింధకు వెళ్ళలేదు.
అప్పటికే వర్షరుతువు వచ్చేసింది. వర్షఋతువులో సీతా అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే. సీతాన్వేషణకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవుడికి చెప్పాడు.
*లక్ష్మణుని ఆగ్రహం*
వర్షా కాలం అయిపోయింది. ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధ విముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. రామకార్యం మరచిపోయాడు . ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని పొందడానికి కారణమైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. శ్రీరామ చంద్రునికి కోపం తెప్పించకు. వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని మంచి మాటలు చెప్పాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుడిని పిలిచి, అన్ని దిశలనుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.
రాముడు సీతా వియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి సుఖభోగాలలో మునిగి తేలుతున్నా సుగ్రీవుని ప్రవర్తన రాముడికి మరీ బాధ కలిగించింది. అది చూసి లక్ష్మణునికి ఆగ్రహం పెల్లుబుకింది. ఆగ్రహంతో కిష్కింధకు వెళ్ళాడు. కోపంతో వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేశారు. వినయంతో మెలిగి లక్ష్మణుడిని ప్రసన్నం చేసుకోమని హనుమంతుడు హితవు చెప్పాడు. భయంతో సుగ్రీవుడు ముందుగా తారను పంపాడు.
తార వచ్చి సుగ్రీవుని తప్పుని మన్నించమనీ, అతడు తన మిత్ర ధర్మాన్ని తప్పక నెరవేరస్తాడనీ లక్ష్మణుని ప్రాధేయపడుతూ విన్నవించుకొని అతనిని శాంతింపజేసింది. దానితో సుగ్రీవుడు కాస్త ధైర్యం తెచ్చికొని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. సమస్త వానర గణాలనూ కిష్కింధకు రావాలని ఆజ్ఞాపించాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని వద్దకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.
*సీతాన్వేషణ ఆరంభం*
సుగ్రీవుని ఆజ్ఞపై తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వానర సేన వెళ్లింది.. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.
ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియదని విచార వదనంతో మనవి చేశారు.
*దక్షిణ దిశలో అన్వేషణ*
దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు
రామ లక్ష్మణుల జననం నుంచి సీతా అపహరణమ్ వరకు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు. అక్కడ కొండపైన ఉండే వృద్ద పక్షి సంపాతి ఇదంతా వింటున్నాడు. సంపాతి జటాయువు సోదరుడు. ముందు వానర మూకను తినవచ్చని అనుకున్నాడు. కానీ వారి మాటలలో వానరులు దశరధుడి కుమారుడయిన రాముడికి సహాయం చేస్తున్నారని గ్రహించాడు. దశరధుడి తో తనకు గల స్నేహం గుర్తు చేసుకున్నా డు. తమ్ముడు జటాయువు మరణ వార్త విని బాధపడ్డాడు. రావణాసురుడు సీతమ్మ ను అపహరించి ఆకాశ మార్గంలో లంకకు తీసుకుపోతుండగా సంపాతి చూసి వున్నాడు.
రావణుడు సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలోసీతమ్మని దాచాడని వారికి చెప్పాడు.
*హనుమంతుని సంకల్పం*
సంపాతి ద్వారా సీత జాడ తెలిసి వానరులు ముందు సంబరపడ్డారు. అయితే సముద్రం దాటడం ఎలా అన్న ప్రశ్నతో ఉత్సాహం నీరుగారిపోయింది. గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు. అందరిమాటలూ విన్నతర్వాత....
జాంబవంతుడు హనుమంతునితో ఇలా అన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహువర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు మాత్రమే సాధ్యం. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరచాడు.
ఆంజనేయుడు సముద్రంలా ఉప్పొంగిపోయాడు.
దీర్ఘ దేహుడై విజృంభించాడు. జాంబవంతునికీ, వానర ప్రముఖులకూ వందనం చేశాడు.సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను. అనేక శుభశకునాలు కనిపిస్తున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి. అన్నాడు.
కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలు పెట్టిన చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి.
శత్రు నాశన సమర్ధుడు, వాయువేగంతో ప్రయాణించగల ధీరుడు అయిన హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంక వైపు తిరిగి నిలుచున్నాడు.
శ్రీరామ రామ రామేతి
రమే రామేమనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే
*****
*మనోజవం మారుత తుల్యవేగం*
*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం!*
*వాతాత్మజం వానరయూధ ముఖ్యం*
*శ్రీరామదూతం మనసా స్మరామి!!!*
(కిష్కింధ కాండ సమాప్తం)