*శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ విష్ణు షట్పది స్తోత్రం*
ఆది శంకరులు రచించిన స్తోత్రాలలో విష్ణు షట్పది ఒకటి. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం.
భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు.
భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.
*౧. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |*
*భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ||*
ఓ విష్ణో! నాలోని అహంకారాన్ని తొలగించు. మనస్సును శాంతితో నింపుము. పాశవిక కోరికలనుంచి నన్ను దూరము చేయుము. సకల ప్రాణుల పట్ల నేను దయతో ఉండునట్లు చేయుము. ఈ భవసాగరాన్ని దాటుటకు చేయూతనీయుము.
*౨. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగసచ్చిదానందే |*
*శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ||*
సంసార సాగరములోని భయాన్ని, దుఖాన్ని పోగొట్టే, పవిత్రమైన పుప్పొడి నది వంటి, సచ్చిదానందాన్ని ఇచ్చే దివ్య సుగంధము వంటి నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను.
*౩. సత్యపి భేదాపగమే నాథ తవాஉహం న మామకీనస్త్వమ్ |*
*సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ||*
ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.
*౪. ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |*
*దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ||*
పర్వతమును ఎత్తిన వాడవు { కృష్ణుడవు, కూర్మావతారము కూడా } , పర్వతరాజు శత్రువైన ఇంద్రుని సోదరుడవు, అసురుల శత్రువువు, సూర్య చంద్రులు కన్నులుగా చూసేవాడవు, నిన్ను చూసిననంత లోకపు శోకము పోవును. నిన్ను చూసిన తర్వాత ఇంకా జరుగ వలసినది ఏమైనా ఉందా?
*౫. మత్స్యాదిభిరవతారైరవతారవతాஉవతా సదా వసుధామ్ |*
*పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోஉహమ్ ||*
మత్స్య రూపము మొదలకొని వివిధ అవతారములతో ఈ భువిని కాపాడుతున్నావు. పరమేశ్వరా! ఈ భవసాగరమును చూసి భయపడుతున్న నన్ను కాపాడుము.
*౬. దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |*
*భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే ||*
నడుమునకు త్రాడు కట్టుకున్న విష్ణో { దామోదరా } ! సకల సద్గుణ సంపన్నా! కలువ వంటి అందమైన ముఖము కలవాడా ! అందరి రక్షకుడా ! ఈ భవ సాగరాన్ని మధించ అత్యుత్తమ సాధనమైన వాడా ! ఈ జీవనసాగరంలో నా భయాలను పోగొట్టుము.
*నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |*
ఓ నారాయణా ! కరుణామయా ! నా చేతులు నీ పదములకు మ్రొక్కనీ !
*ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు |*
ఈ ఆరు శ్లోకములు నా వదనములో ఎల్లప్పుడూ నిలవనీ !
🚩
*శ్రీవిష్ణు షట్పది స్తోత్రం భావం:*
మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.
🚩
*భ్రమర నాదాలు*
భ్రమరం అంటే తుమ్మెద. దీనికి మధువ్రతం, మధుకరం, మధుపాళి, ద్విరేఫం, భృంగం, షట్పదం, అళి మొదలైన పేర్లు ఉన్నాయి. పూలలోని తేనెను తాగుతూ, ఝుమ్మని నాదాలు చేయడం తుమ్మెదకు అలవాటు. విష్ణువును స్తుతించిన శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’ రచించి, లోకానికి ప్రసాదించారు. షట్పది అనే మాటకు అర్థం ‘ఆరు పదాలు గలది’. తుమ్మెదకు ఆరు కాళ్లుంటాయి కాబట్టి, ఆ పదం సరిపోతుంది. భగవత్పాదుల స్తోత్రంలోనూ ఆరు పదాలు విరాజిల్లుతున్నా, అవి తుమ్మెదకు సంబంధించినవి కావు. విష్ణువును ఉద్దేశించిన నామాలు అవి. అందువల్ల ఆ స్తోత్రం ‘షట్పది’ అయింది. పద్మం చుట్టూ తుమ్మెద తిరిగినట్లే, తన ముఖం అనే పద్మం చుట్టూ ఆరు పదాలూ తిరుగుతుండాలని హరిని భగవత్పాదులు కోరుతున్నారు. ‘నారాయణా, కరుణామయా, శరణం కరవాణి తావకౌ చరణౌ’ అనే వాక్యంలో ఆరు పదాలు ఉన్నందువల్ల, అది షట్పదీ స్తోత్రమైంది.
తుమ్మెదలు పద్మం నుంచి మకరందాన్ని తాగుతాయి. అలాగే ముఖపద్మంలో నుంచి ఆరు విష్ణు పదాల మకరందం గ్రోలడానికి స్తోత్రం అనే తుమ్మెద తిరుగుతుండాలని సారాంశం. ఆ ఆరింటి మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాల్సిందే.
‘ఓ హరీ! మొదట నా అవినయాన్ని పోగొట్టు. నా మనసును నియంత్రించు. భూతదయను పెంపొందించు. సంసారం అనే సముద్రం నుంచి నన్ను ఒడ్డుకు చేర్చు. నీ పాదాలు కమలాలు. ఆ పాదాల నుంచి ఉద్భవించిన ఆకాశ గంగ మకరంద ప్రవాహం వంటిది. సచ్చిదానందాలే ఆ పద్మాల సుగంధాలు. సంసార బంధాలవల్ల కలిగే భయాల్ని పోగొట్టేవి ఆ పాదపద్మాలే !
హరీ! నీకు, నాకు భేదం లేకున్నా- ఎప్పుడూ నేను నీవాణ్ని అవుతాను కానీ, నువ్వు నా వాడివి కాదు. అదెలా అంటే- కెరటాల్ని చూసే జనం అవి సముద్రానివే అంటారు. అంతే తప్ప, సముద్రమే కెరటాలకు సంబంధించినదని ఎవరూ అనరు.
పర్వతాల రెక్కల్ని తొలగించిన ఇంద్రుడి సోదరుడివి నువ్వు. అందుకే నీకు ‘ఉపేంద్రుడు’ అని పేరు. రాక్షసులకు నువ్వు శత్రువు. సూర్యచంద్రులే నీ కళ్లు. ఇంతటి మహిమ గల నిన్ను చూస్తే చాలు, సంసార దుఃఖాలన్నీ దూరమవుతాయి.
ఓ హరీ! లోకాల్ని రక్షించడం కోసం నువ్వు ఎన్నో అవతారాలెత్తావు. ఎందరినో రక్షించావు. సంసార బంధాలతో భయపడుతుండే నన్ను కాపాడేదీ నువ్వే! నువ్వు వనమాల ధరించావు. గుణాలన్నీ నీలో మణుల్లా వెలుగుతున్నాయి. నీ వదనం అనే పద్మం ఎంతో అందమైనది. సంసార సాగరాన్ని మధించడానికి మందర పర్వతంలా నిలుస్తావు నువ్వు. నా భయాలన్నింటినీ పోగొడతావు...’- ఇలా షట్పదీ స్తోత్రం అంతా మానవుడిలోని ఆర్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఆర్తుల్ని ఉద్ధరించాలంటూ స్వామిని స్తుతించడమే భగవత్పాదుల పరమార్థంగా స్పష్టమవుతుంది.
మహర్షులు, యోగులు, మహాకవులు విశ్వక్షేమాన్నే కాంక్షిస్తారు. లోకుల భయాల్ని పోగొట్టడానికి త్రికరణశుద్ధిగా కృషిచేస్తారు. అదే పనిని శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’లో చేశారు. ఆరు శ్లోకాలు, ఆరు విష్ణునామాంకిత పదాలు మకరంద బిందువుల వంటివి. వాటిని ఆస్వాదించే ఆ స్తోత్రమే ఒక తుమ్మెద. ‘అది ఎప్పుడూ ఇలాగే నా వదన సమీపంలో తిరుగుతుండాలి’ అని కోరడం అంటే, స్తోత్రాన్ని నిరంతరం పఠించే భాగ్యాన్ని అర్థించడమే! ఇదే ఆ స్తుతిలోని అసలు రహస్యం.
మనిషిని సంసారం అనేక విధాలుగా బాధిస్తుంది. ఇలాంటి భయాలు, బాధల నుంచి మనసుకు శాంతి కావాలి. అది భగవన్నామ స్మరణతోనే సాధ్యమని పెద్దల మాట. షట్పదీ స్తోత్రం ద్వారా శంకర భగవత్పాదులు చేసిన మహోపదేశం ఇదే. మనిషి తనలోని ఆత్మశక్తిని విస్మరించకూడదు. మనిషిలోనే శాంతి ఉంటుందని, దాన్ని అతడే తెలుసు కోవాలని స్తోత్ర భ్రమరం ఉపదేశిస్తుంది. ఆ భ్రమర నాదం హృదయంగమం!
🕉🕉🕉🕉🕉🕉