శ్రీనాథరచనాచమత్కృతులు!!
శా. అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనా
పాంగ ప్రాంతమునం దిగుర్ప నొక సయ్యాటంబు గల్పించి నా
యంగుళ్యాభరణంబు బుచ్చుకొనవా! ఆ యుంగరంబిప్పుడే
సింగారింపని చేత బావకునకున్ జేయన్ హవిర్దానమున్
– ఈ పద్యంలోని సొగసు శ్రీనాథుని కవిత్వంలో ప్రత్యేకతా తెలియాలంటే, మూలంలో యీ సన్నివేశం ఎలా ఉందో చూడాలి. కాశీఖండం స్కంధ పురాణంలో ఒక భాగం. మూలంలో యజ్ఞదత్తుడు రుసరుసలాడుతూ ఇంటికి వస్తూనే, “దీక్షితాయని కుత్రాస్తి ధూర్తే గుణనిధి స్సుతః” అంటాడు. మొదలుపెట్టడంతోనే “ఓ ధూర్తురాలా!” అని తిడతాడు.
“అథ తిష్ఠతు కిం తేన క్వ సా మమ శుభోర్మికా
అంగోద్వర్తన కాలే యా త్వయా మేంగులీ హృతా
సా త్వం రత్నమయీం శీఘ్రం తామానీయ ప్రయచ్ఛమే”
అని అంటాడు.
“ఎక్కడ నీ కొడుకు? అయినా వాడి సంగతి ఎందుకులే. శుభకరమైన నా ఉంగరం ఎక్కడ? అంగోద్వర్తన వేళ నువ్వు తీసుకున్న ఆ రత్నపుటుంగరాన్ని వెంటనే తెచ్చి నాకివ్వు” అని గద్దిస్తాడన్న మాట. సంస్కృతంలో యజ్ఞదత్తుడు, భార్య తననుండి ఉంగరం కాజేసిన సందర్భం మాత్రం చెప్పి ఊరుకున్నాడు, “అంగోద్వర్తన కాలే” అని.
అంగోద్వర్తనం అంటే ఒంటికి నలుగుపెట్టడం. కానీ మన శ్రీనాథునికి అంతటితో ఆపేస్తే తృప్తి ఎక్కడిది! ఆ సరసమైన సన్నివేశాన్ని తాను ఊహించి, పాఠకులకి చూపిస్తే కాని అతనికి మనసొప్పదు! ఇదే సన్నివేశంలో శ్రీనాథుని యజ్ఞదత్తుడు, తనకున్న ఆవేశాన్నంతటినీ వెంటనే వెళ్ళగక్కడు. భార్యతో వ్యంగ్యంగా మొదలుపెడతాడు. ఇంటికి వచ్చి, “సోమిదమ్మ! ఏమి చేయుచున్నావు? ఇటు రమ్మ! నీ కొడుకెక్కడం బోయె? బోవగా కేమి? విను మిట్లనియె”, అని పై పద్యం చెపుతాడు. ఎక్కడా తిట్టుపదం లేదు. కానీ పలికే తీరులో ఒలికే వ్యంగ్యమంతా సహృదయులైన పాఠకులు ఊహించుకోవలసిందే!
“దరహాసాంకూరముల్ లోచనాపాంగ ప్రాంతమునం దిగుర్ప, ఒక సయ్యాటంబు గల్పించి, నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా!” అని అనిపించాడు. ఇదీ యీ పద్యంలోని ఆయువుపట్టు! దరహాస అంకూరముల్ – చిరునవ్వుల చిగురులు. లోచన అపాంగ ప్రాంతము – కంటి తుదలు, ఇగురుచు – చిగురించు.
ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించండి. సోమయాజులుగారి ఒంటికి సోమిదేవమ్మగారు నలుగు పెడుతున్నారు. అలా పెడుతూ పెడుతూ, చిరునవ్వు మొలకలు తన కడకంట చిగురింపజేస్తూ, అతన్ని మురిపిస్తూ, ఒక సయ్యాట కల్పించి, అలా అలా, ఆ చేతినున్న ఉంగరాన్ని లాఘవంగా లాగేశారు సోమిదమ్మగారు! ఎంత సొగసైన సన్నివేశమో! ఇలాంటి సన్నివేశ చిత్రణ అంటే శ్రీనాథునికి ప్రాణం. పురాణాన్ని కవిత్వంగా మలిచే విద్య యిది. “సయ్యాటంబు” అన్న పదంలో “య్యా” అక్షరం యతిస్థానంలో ఉంది. సంస్కృతంలో లాగా తెలుగులో యతి విరామం కాదు. అంటే, యతిస్థానంలో కొత్త పదం మొదలవ్వాలని లేదు. కాని పద్యం చదివేటప్పుడు యతి అక్షరం మీద కొంచెం ఊనిక యివ్వడం ఆనవాయితీ. “సయ్యాటంబు” అన్న పదాన్ని అలా, కాస్త సాగదీసి పలికినప్పుడు, ఆ గొంతులో మరింత వెటకారం ధ్వనిస్తుంది. సంస్కృత దీక్షితులవారు ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో చెప్పలేదు. అంటే అప్పటికే అతనికి ఉంగరం సంగతి తెలిసిపోయిందన్న విషయం సోమిదమ్మగారికి తెలిసిపోతుంది. మన తెలుగు దీక్షితులవారు మరి కాస్త గడసరి. ఆ విషయం వెంటనే తన భార్యకు తెలియకుండా ఉండాలని, తాను ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో కారణం చెపుతున్నారు. ఆ ఉంగరం తొడగని చేతితో అగ్నిహోత్రం చెయ్యరట. పద్యమంతా సమాసాలతో ధారగా సాగి, చివరికి వచ్చేటప్పటికి, “పావకునకున్ చేయన్ హవిర్దానమున్” అని, ముక్కా ముక్కా తెగిపోతోంది. అతను పుల్ల విరిచినట్టు, ఖరాఖండీగా మాట్లాడడం ఇందులో ధ్వనిస్తుంది. ఈ ‘ధ్వనించ’డాలన్నీ పద్యాన్ని ‘సరిగ్గా’ చదవగలిగే వాళ్ళు చదివినప్పుడు మాత్రమే బోధపడే విషయాలు. మాటల్లో వ్రాసి చెప్పడం కష్టం!
కడకంటి చూపుల్లో చిరునవ్వులు చిగురించడం అనేది శ్రీనాథునికి బాగా యిష్టమైన ఒక సున్నిత శృంగారలీల.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷