ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
25, డిసెంబర్ 2024, బుధవారం
11. వ పాశురం
_*రేపటి తిరుప్పావై పదకొండోవ రోజు పాశురము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*🌴11. వ పాశురం🌴*
*కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు*
*శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్*
*కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే*
*పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్*
*శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్*
*ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*
*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి , నీ*
*ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.*
*🌳భావం:🌳*
ఓ గోపాలకుల తిలకమా ! ఓ చిన్నదానా ! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును , శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును , ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా ! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా ! ఓ వనమయూరమా ! రమ్ము. నీ సఖులు , బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక , మాటాడక , ఏల నిదురించుచున్నావు ? అని అనుచున్నారు. అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక , పలకక (ధ్యానములో) ఎందుకున్నావు ? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా ! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలెకాన , మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.
*☘️అవతారిక:☘️*
అన్ని విషయములందును , అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని , యీ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీ కృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్నివిధాలా ఆరాధ్యుడు. ఆదరణీయుడు. అట్లే యీ గోపిక కూడ అతనితో సమానముగా ఆరాధ్యురాలు. ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు , చేసే పనులు అన్నీ భగవదారాధనగాను , భాగావత్కైంకర్యంగాను వుండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏదీ వుండరాదని ఈమె భావన. అందువల్ల ఈమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే వుండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి వుంటుంది. అందులోనే తాదాత్త్యం చెందుతూ వుంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే వుండటాన బాహ్యమైనవేవీ వినపడవు. కనపడవు. పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి. అందరినీ ఆకట్టుకొనే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింప చేసినట్లు ఈమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్యరాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన ఈమెను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు.
*🌹11. వ మాలిక🌹*
*(శుద్ధ సావేరిరాగము - ఝంపెతాళము)*
ప.. మాటాడవేలనే ? ఓ చిన్నదాన ?
ఇటు నిదుర వీడవు ! తామస మదేలనే ?
అ..ప.. ఇటు వినవదేలనే ? మా కృష్ణ గీతముల !
పటువైన శ్రీకృష్ణ సంశ్లేష మోహమా ?
1. చ.. ఈ గో సమూహముల గాచు వీరెల్లరు
తగిన వీరులు శత్రు సైన్యాల నణతురు
బంగారు లతవె ! గోపాల కుల తిలకమా !
అంగనా లేవనే ! ఓ చిన్నదాన !
2. చ.. చెలియలందరు వచ్చి నీ వాకిట న్నిలిచి
నీలమేఘశ్యాము తిరు నామములు పాడ
ఏల కదలక యుంటివో వనమయూరీ !
ఏల మాటాడవో అహినితంబా ! సఖీ !
మాటాడవేలనే ? ఓ చిన్నదాన ?
🙏💐🌼🌻🌸🌺🦚🦜🌞🌝
స్వర్గారోహణ
పాండవులు స్వర్గారోహణ కి సశరీరంగా వెళ్ళే క్రమంలో ఒక్కొక్కరుగా పడిపోతూ ఉంటే భీముడు ధర్మరాజుని ప్రశ్నిస్తాడు..
ముందుగా ద్రౌపతి పడిపోతుంది.. భీముడు చూసి ద్రౌపది ఏ పాపం చేయలేదు యోగబలం ఎందుచేత తగ్గి పడిపోయింది? అని అడిగాడు..
అప్పుడు యుధిష్ఠిరుడు : ఈవిడ పతులలో అర్జునుడి పట్ల పక్షపాత బుద్ది కలిగి ఉంది. 5గురు భర్తలపై సమబుద్ది రాలేదు. దాని ఫలమే ఇది..
తరువాత సహదేవుడు పడిపోయాడు? భీముడు మళ్ళీ ప్రశ్నించాడు సహదేవుడు ఎందుకు పడిపోయాడు?
సహాదేవుడికి నాతో సరితూగే తెలివైన వాడు లేడు అనే భావన చేత పడిపోయాడు.
నకులుడు పడిపోయాడు. నకులుడు ఎందుకు పడిపోయాడు? ఇతడెప్పుడు ధర్మమార్గాన్ని తప్పలేదు. అని అడిగాడు.
నాఅంత అందగాడు లేడు ఈ ప్రపంచంలో అనుకుంటాడు. అందువల్ల పడిపోయాడు.
కొంతదూరం వెళ్ళేసరికి అర్జునుడు పడిపోయాడు. భీముడు ఖిన్నుడై అర్జునుడు ఎందుకు పడిపోయాడు? అంటే
అర్జునుడు ముందు వెనుక చూడకుండా ఒక ప్రతిజ్ఞ చేశాడు. 1రోజులో శత్రువులతో పాటు 11అక్షౌహిణుల సన్యాన్ని దగ్ధం చేస్తానన్నాడు. చేయలేకపోయాడు. అంతేకాదు నన్ను మించిన శూరుడు లేడనే అహంకారం ఉన్నది. అప్పుడప్పుడు ధనుర్ధారులని అవమానించాడు. శ్రేయఃకాముడు అయినవాడు ఇలా చేయకూడదు కదా.. అందుకు పడిపోయాడు..
ఆ తరువాత అయ్యో నేను పడిపోతున్నాను.. నేనెందుకు పడిపోతున్నాడు చెప్పమని అడిగాడు.
నువ్వు భోజన విషయంలో నియమం పాటించవు. అంతేకాదు నువ్వు కూడా అవతలి వాడు ఏలాంటి వాడు అని చూడకుండా నీ బలాన్ని చూసి గర్విస్తావ్.. అందుకు నువ్వు పడిపోతున్నావ్.
పక్షపాతం, బలగర్వం, సౌందర్య గర్వం, తెలివితేటల గర్వం, శౌర్య గర్వం.. ఇలా ఏ ఒక్క లోపం ఉన్నా యోగబలాన్ని దెబ్బతీస్తుంది. తపశ్శక్తినీ పాడుచేస్తుంది.
ఆఖరికి ధర్మరాజు ఒక్కడు మిగిలాడు.. ఆయనతో వచ్చిన కుక్క మిగిలింది. కుక్కతో ప్రారంభమైన భారతం, కుక్కని స్వర్గానికి తీసుకెళ్ళడంతో ముగుస్తుంది..
ధర్మరాజు ఏ తప్పు చేయలేదా అనేకదా సందేహం.. ద్రోణ పర్వంలో ద్రోణ వధ కోసం శ్రీకృష్ణుడు అశ్వద్ధామ హతః అనమని మాత్రమే చెప్తే, అబద్ధం అనుకొని చెప్పడానికి సంకోచిస్తాడు.. ఇంతలో భీముడు అశ్వద్ధామ అనే గజాన్ని ఇందాకే చంపాను కాబట్టి భయపడకు అన్నయ్య.. అని చెబితే అశ్వద్ధామ హతఃఅని కుంజరః అని చిన్నగా అంటాడు.. శ్రీకృష్ణుడు కూడా ఆశ్చర్యపోతాడు.. దీనివల్ల అప్పటివరకు భూమికి 4అంగుళాల ఎత్తులో ఉన్న ధర్మరాజు రథం కుంజరః అనగానే భూమిని తాకుతుంది.. ఎందుకంటే శ్రీకృష్ణుడు "అశ్వద్ధామ హతః" అని మాత్రమే చెప్పారు. సొంత పైత్యం వాడే సరికి యోగశక్తి కాస్త తగ్గి రథం భూమి మీదకి వచ్చేసింది.
కుంజరః అనే దోషం వల్ల అంటే కపటం వల్ల కపట నరకం చూడల్సి వచ్చింది. అందులో ద్రౌపతి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆర్తనాదాలు చేస్తూ ఉండటం చూసి నివ్వెరపోయి బాధపడతారు.. అది చూసిన ఇంద్రుడు ధర్మరాజా బాధపడకు..నువ్వు ద్రోణుడి వద్ద కపటంతో అన్న మాటకి, కపట నరకం చూశావ్.. దానికి ఇది చెల్లు.. కావాలంటే చూడు అని చెబితే అంతవరకు కనిపించిన నరకం మాయమై దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వర్గం దర్శనం ఇచ్చింది..
చిన్నమాటకి నరకం చూడాల్సి వచ్చింది.. ద్రౌపతి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులుకి ఉన్న కొద్దిపాటి అహంకారం శరీరంతో స్వర్గాన్ని చేరుకునే యోగశక్తిని బ్రష్టం చేసింది.. ఈలెక్కన మన ఎలా ఉన్నామో ఆలోచిస్తే ఏమైపోతమో కూడా చెప్పలేని పరిస్థితి..
మన గ్రంథాలు జీవుడు ఎలా ఉంటే మోక్షం పొందుతాడు అనే నిర్ధారణ చేసి మరి నిరూపించి బోధిస్తున్నాయి. అందుకే శాస్త్ర ప్రకారం నడుచుకోమని పెద్దలు చెప్తారు.. ఇలా ఎందుకు అలా ఎందుకు అని ఎదురు ప్రశ్నలు వేయకూడదు
శాస్త్రం శాసనం.. పాటించాలి. పాటించిన వారికి మేలు చేస్తుంది తప్ప పొరపాటున కూడా కీడు జరగదు..
#మహాభారతం
దేవీదాస శర్మ
ద్వాదశ ఆళ్వారులు-*
🙏 *ద్వాదశ ఆళ్వారులు-*
*2. పూదత్తాళ్వార్ :*
💫 పొయ్‌గై అళ్వార్ కు సమకాలికులైన ఈ రెండవ ఆళ్వార్, శ్రీహరి యెక్క 'కౌమోదకి' గదాంశతో, ఒకానొక పుష్పంలో జన్మించారని ప్రతీతి. పుష్పంలో నుండి ఉద్భవించిన కారణంగా వీరిని *'పూదత్తాళ్వార్'* గా వ్యవహరిస్తారని కొందరు అభిప్రాయపడతారు.
💫 వీరు కూడా మొదటి ఆళ్వార్ వలె సిద్ధార్థి నామ సంవత్సరం లోనే జన్మించారు. తులామాసపు ధనిష్ఠానక్షత్రం, నవమి తిథినాటి బుధవారపు దినాన వీరి జననం సంభవించింది. ఈనాడు మహాబలిపురంగా ప్రసిద్ధికెక్కిన 'మామల్లపురం' వీరి జన్మస్థలం.
💫 వీరికి భూతాళ్వార్, ఉత్పలముని, ద్వితీయయోగి అనే నామాంతరాలు కూడా ఉన్నాయి. పంచభూత తత్వాన్ని ఆమూలాగ్రం ఎరిగిన వారు కావున 'భూతాళ్వార్' గాను; ఆళ్వార్ లలో రెండవ వారు గావున 'ద్వితీయముని' గాను పిలువ బడుతున్నారని కొందరు విశ్వసిస్తారు.
💫 స్వామిని దర్శించాలనే దృఢసంకల్పంతో, కౄరమృగాలు, ఎండవానల వంటి ఈతిబాధలను లక్ష్య పెట్టకుండా, తిరుగులేని భక్తివిశ్వాసాలతో తిరుమలక్షేత్రాన్ని సందర్శించుకున్న వీరు పర్వతమార్గం లోని అందచందాలను, మార్గమధ్యంలో వారి అనుభూతులను తమ పాశురాలలో హృద్యంగా వర్ణించారు. వేంకటాచల క్షేత్రాన్ని ఆకుపచ్చటి వెదురుపొదలకు, నిత్యం పర్వతసానువుల నుండి జాలువారే జలధారలకు, తామరపూలతో నిండి ఉండే సరోవరాలకు నిలయంగా తమ పాశురాలలో అభివర్ణించారు. మదపుటేనుగులు లేత వెదురుకాండాలను పుట్టతేనెలో రంగరించి తమ ప్రియురాళ్ళకు అందజేస్తాయంటూ మూగజీవుల ప్రేమను కవితాధోరణిలో వెలువరించి; తన సృజనాత్మకతను చాటుకున్నారు.
💫 వీరు రచించిన నూరు పాశురాల సంకలనాన్ని *'ఇరండాం తిరువందాది'* గా పేర్కొంటారు. ఇందులో తిరువేంగడపు ప్రాకృతిక శోభనే కాకుండా, విష్ణుమహిమను కూడా అత్యద్భుతంగా తెలియజెప్పారు. ఈ పాశురాలను బ్రహ్మోత్సవాలలో రెండవరోజు ఉదయం, సాయంత్రాలలో జరిగే చిన్నశేషవాహనము, హంసవాహన ఉత్సవాల సందర్భంగా పఠిస్తారు.
⚜ శ్రీ రాండు మూర్తి ఆలయం.
🕉 మన గుడి : నెం 969
⚜ కేరళ : తిరువలత్తూరు, పాలక్కాడ్
⚜ శ్రీ రాండు మూర్తి ఆలయం.
💠 ప్రతి దేవాలయం తనదైన రీతిలో అందంగా ఉంటుంది. అయితే, కొన్ని ఆలయాలు దైవత్వం యొక్క అదనపు ఆకర్షణను వెదజల్లుతున్నాయి.
మీరు కళ్ళు మూసుకుని, అత్యున్నత శక్తితో ఒక్కటిగా ఉన్నప్పుడు మీరు దానిని అనుభవించవచ్చు.
తిరువలత్తూరు భగవతి దేవాలయం అటువంటి ఆరాధనా స్థలం, ఇది పవిత్రత యొక్క అద్భుతమైన ప్రకాశాన్ని సృష్టిస్తుంది.
💠 తిరువలత్తూరు శ్రీ రాండుమూర్తి దేవాలయం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అలత్తూరులో ఉంది. ఈ ఆలయం తిరువలత్తూరులో సోకనాసిని నది ఒడ్డున ఉంది.
ఈ ఆలయం కేరళలోని 108 దుర్గా దేవాలయాలలో ఒకటి.
ఇది పాలక్కాడ్ జిల్లాలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి.
💠 ఆలయంలో ఇద్దరు దేవతలు పూజిస్తారు. అన్నపూర్ణేశ్వరి కిజెకావులో మరియు మహిషాసుర మర్దిని మెల్కవిల్‌లో పూజిస్తారు.
💠 అన్నపూర్ణేశ్వరి యొక్క మూర్తి స్వయంభూ - దైవిక మూలం. మహిషాసుర మర్దిని మూర్తి 7 అడుగుల పొడవు మరియు చెక్కతో చెక్కబడింది.
💠 ఈ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పం మరియు నిర్మాణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది.
ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు లేదా కొడిమారం ఉన్నాయి.
ఈ ఆలయంలో వృత్తాకార గర్భగుడి (వట్ట శ్రీకోవిల్) ఉంది.
🔆 అలత్తూరు రాండు మూర్తి ఆలయ కథ
💠 భగవతి మూర్తి చుట్టూ ఉన్న గర్భగుడి మరియు ఇతరులు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉన్నారని మరియు ప్రజలు దీనిని "పాణి తీరత కోవిల్" (అసంపూర్ణ ఆలయం.) అని పిలిచేవారు.
💠 14 రోజుల పాటు పనిచేసిన భూత గణాల సైన్యం ఆలయ బయటి గోడను నిర్మించిందని పురాణాలు చెబుతున్నాయి.
14వ రోజు, తెల్లవారుజామున వారు మానవులకు కనిపించకూడదని దానిని అసంపూర్తిగా వదిలేశారు.
తరువాత ప్రయత్నాలు చేసినప్పటికీ, పని పూర్తి కాలేదు మరియు మానవులు ఈ పనిని పూర్తి చేయలేరని నమ్ముతారు.
💠 ఇద్దరు భగవతులు రెండు వేర్వేరు ఎత్తులలో ఉన్నారు.
అన్నపూర్ణేశ్వరి తక్కువ ఎత్తులో మరియు మహిషాసుర మర్దిని ఎత్తులో ఉంది.
💠 మహిషాసుర మర్ధిని చెక్కతో చేయబడింది. ఆమెకు 8 చేతులు ఉన్నాయి మరియు ఆ చేతుల్లో తన ఆయుధాలన్నింటినీ పట్టుకుంది. పనస చెక్కతో చేసిన మూర్తిలతో ఉన్న ఇతర ఆలయాల మాదిరిగా కాకుండా, ఇక్కడ చంతట్టం (విగ్రహానికి కుంకుంతో రంగు వేయడం) చేయరు. అయినప్పటికీ, విగ్రహం కొద్దిగా కూడా దెబ్బతినలేదు.
💠 మహిషాసుర మర్దిని ఉత్సవ మూర్తి ఉంది మరియు దానిపై అభిషేకం జరుగుతుంది.
ఈ మూర్తి ఏడు దుర్గల చుట్టూ ఉంది - బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి.
💠 ఈ ఆలయ మండపం పైకప్పులో మొత్తం రామాయణం ఆరు భాగాలుగా చిత్రీకరించబడింది.
నిర్వహణ లేనప్పటికీ, ఈ చిత్రాలు కేవలం పెయింట్ చేయబడినట్లుగా కనిపిస్తాయి.
💠 ఈ ఆలయంలోని మరో విశేషమేమిటంటే, కేరళలోని అన్ని ఆలయాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలో గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో బ్రాహ్మణులు కూర్చోవడానికి వీలు లేదు.
💠 పాలక్కాడ్ బస్ స్టాండ్, సుమారు 7.3 కి.మీ.
రచన
©️ Santosh Kumar
తిరుమల సర్వస్వం -98*
*తిరుమల సర్వస్వం -98*
*జయ విజయులు*
శ్రీవారు కొలువుండే వైకుంఠానికి ఏ విధంగా జయవిజయులు కాపుంటారో, అదేవిధంగా బంగారువాకిలికి దక్షిణాన జయుడు, ఉత్తరాన విజయుడు; శంఖు, చక్ర, గదాధారులై, సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపాల్లా దర్శనమిస్తుంటారు. వీరిని *"చండ-ప్రచండులు"* అని కూడా వ్యవహరిస్తారు. పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరిస్తుంటాయి. స్వామి పుష్కరిణిలో పవిత్రస్నానమాచరించి, శుచిగా ఆలయంలోకి ప్రవేశించి, ఆలయ నిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారేమో!
ఈ మూర్తులను జాగ్రత్తగా గమనిస్తే, వారి నోళ్లకు చిన్నచిన్న కోరలుంటాయి. దానికి కారణం పూర్వజన్మలో వారు రాక్షసులుగా జన్మించడమే.
పురాణాల్లోకి వెళితే ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండే జయ-విజయులు, కారణాంతాన బ్రహ్మమానస పుత్రులైన సనకసనందనాది మునులచే శపించబడి, కృతయుగంలో *హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు* గానూ, త్రేతాయుగంలో *రావణ కుంభకర్ణులు* గానూ, ద్వాపరయుగంలో *శిశుపాల దంతావక్రులు* గానూ జన్మించి, వారి వారి దుష్క్రుత్యాల వల్ల శ్రీవారి చేతిలో సంహరింప బడ్డారు. శాపకాలం పూర్తయిన తర్వాత, శ్రీమహావిష్ణువు కటాక్షంతో తిరిగి కలియుగంలో శ్రీనివాసునికి ద్వారపాలకులుగా నియమింపబడ్డారు. ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు తరువాత, విష్ణుమూర్తి పరివార దేవతలలో అత్యంత ప్రముఖులు వీరే! శ్రీవారిసన్నిధి యందున్న బంగారు కటాంజనాలలో నిరంతరం నిలుచుని ఉండే మహద్భాగ్యానికి నోచుకున్న జయవిజయులకు భక్తిపూర్వకంగా నమస్కరించి, వారి అనుమతితో, శ్రీవారి దర్శనార్థం, *"బంగారువాకిలి"* ముంగిట చేరుకున్నాం. ఇప్పుడు *బంగారువాకిలి,* దాని లోపల ఉన్న *ఇతర మండపాలు* మరియు *"గర్భాలయం"* గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
[ రేపటి భాగంలో..... *బంగారువాకిలి,* ఇత్యాదుల గురించి తెలుసుకుందాం]
*బంగారువాకిలి*
శ్రీవారి ఆలయానికి మూడవది (మొదటిది "మహాద్వారం" లేదా "పడికావలి", రెండవది "వెండివాకిలి" లేదా "నడిమి పడికావలి"), అత్యంత ముఖ్యమైనది అయిన ఈ *"బంగారువాకిలి"* పేరుకు తగ్గట్లే, పసిడి కాంతులతో తళతళలాడుతూ, లక్ష్మీవల్లభుడైన శ్రీనివాసుని అనంతమైన ఐశ్వర్యాన్ని, వైకుంఠ వైభవాన్ని చాటుతూ ఉంటుంది. [ *Note: చిన్న మనవి: కొన్ని ఆర్జిత సేవలలో పాల్గొనేవారు, విఐపి బ్రేక్ దర్శనం అనుమతి ఉన్న భక్తులు మాత్రమే బంగారువాకిలి దాటి లోనికి ప్రవేశించగలరు. మిగతా భక్తులందరూ,ఇక్కడినుండే, "లఘుదర్శనం" ద్వారా శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని, మహామణి మంటపానికి దక్షిణంగా ఉన్న కటకటాల ద్వారం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.*]
బంగారువాకిలి గుమ్మం పైభాగాన, గుమ్మానికి ఇరుప్రక్కలా, జయ-విజయుల మధ్యనున్న ప్రదేశమంతా కడు రమణీయమైన పుష్పాలు, లతలు చెక్కబడి బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటాయి. ఈ రెండు తలుపులు గళ్ళు - గళ్ళుగా విభజించబడి, ప్రతి గడిలోనూ ఒక్కో అద్భుతమైన ప్రతిమ అచ్చెరువు గొల్పుతూ ఉంటుంది. సుదర్శనచక్రం, శ్రీవేంకటేశ్వరుడు, మహావిష్ణువు, పాంచజన్యం, వాసుదేవుని విభిన్నరూపాలు, కేశవుని ద్వాదశమూర్తులు (కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు), దశావతారరాలు కన్నులకింపుగా చెక్కబడి, సాక్షాత్తూ వైకుంఠమే ఇక్కడికి చేరుకున్నట్లుగా గోచరిస్తుంది. పై గడపకు ఇరుపార్శ్వాలలో గజరాజులచే పూజింపబడుతున్న గజమహాలక్ష్మి పద్మాసీనురాలై ఉంటుంది.
బంగారువాకిళ్ళను సుప్రభాత సమయంలో *"కుంచెకోల"* అనే పరికరంతో, జియ్యంగార్లు, అర్చకులు, ఆలయ అధికారుల వద్దనున్న తాళంచెవులతో అందరి సమక్షంలో తెరిచే విస్తారమైన ప్రక్రియను మనం *"సుప్రభాతసేవ"* లో తెలుసుకున్నాం.
. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు చేరుకున్న భక్తులు, పూటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి, మ్రొక్కుబడులు చెల్లించుకుని, బంగారువాకిలి వెలుపలి నుండే క్షణకాల దర్శనంతో సంతృప్తిపడి, శ్రీనివాసుని దివ్యమంగళమూర్తి నుండి దృష్టి మరల్చుకోలేక, రెప్పవేస్తే కన్నుల ముందున్న పెన్నిధి కనుమరుగవుతుందేమోనన్న బెంగతో, అతికష్టం మీద ముందుకు సాగిపోతారు
. స్వామివారిని ఎన్నెన్నో కోర్కెలు కోరుదామని వచ్చిన భక్తులు ఆనందాతిశయంతో, భక్తిపారవశ్యంతో, తన్మయంతో తమను తాము మైమరచిపోతారు. *మనం కోరుకోగలిగింది అత్యల్పం, స్వామివారు ప్రసాదించ గలిగింది అనంతం! భక్తుని మానసం భగవంతు డెరుగడా?*
కొండంత దేవుడిని కోటి కోర్కెలతో కష్టపెట్టకుండా, క్షణకాల దర్శనంలో ఆ చిన్మయానంద రూపాన్ని గుండె గుడిలో పదిలంగా కొలువుంచు కోవడం శ్రేయస్కరం!
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
11-26,27-గీతా మకరందము
11-26,27-గీతా మకరందము
విశ్వరూపసందర్శనయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసజ్ఘైః |
భీష్మో ద్రోణస్సూతపుత్ర స్తథాఽసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ||
వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః ||
తా:- ఈ ధృతరాష్ట్రుని కుమారులందఱును, భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారిసేనయందలి సమస్తరాజసమూహములును, అట్లే మనసేనయందలి సైనికప్రముఖులును - నిన్ను త్వరితముగ జేరుచున్నవారై కోరలచే భయంకరములుగ నున్నట్టి మీనోళ్లయందు ప్రవేశించుచున్నారు. (వారిలో) కొందఱు మీ పండ్లసందులయందు చిక్కుకొనినవారై చూర్ణమొనర్పబడిన శిరస్సులతో కనుపించుచున్నారు.
వ్యాఖ్య:- పరమాత్మయందు
భూతభవిష్యద్వర్తమానకాలభేదము లేదు. కాలాతీతుడగు భగవానునియందు కాలమునకు సంబంధించిన విభేదములుగాని, విభజనలుగాని ఉండనేరవు. కనుకనే భవిష్యత్తునందు జరుగబోవునదియంతయును వర్తమానమందే విశ్వరూపమున అర్జునునకు గోచరించుటకు కారణమైనది. భీష్మద్రోణకర్ణాది కౌరవపక్షవీరులు, మరియు పాండవపక్షమువారు భవిష్యత్కాలమున మృతినొంది కాలగర్భమున ప్రవేశించుటను అర్జునుడు విశ్వరూపమున స్పష్టముగ గాంచగల్గెను. దీనిభావమేమి? భూతభవిష్యద్వర్తమానములన్నియు పరమాత్మయందు ఒకటే. గడచిన అనేకయుగములకాలము. రాబోవు అనేకయుగములకాలము పరమాత్మయందు వర్తమానకాలమేయగును. ఆతడు కాలాతీతుడు, కాలకాలుడు. కాలము వారియందు కల్పింపబడినది.
ఈ శ్లోకమందు వ్యక్తమొనర్పబడిన భావములను బాగుగ విచారించిచూచినచో గొప్పవైరాగ్యము జీవునియం దుదయింపగలదు. ఏలయనిన, ప్రత్యక్షముగ కానుపించు భీష్మద్రోణాదులు, తక్కిన వీరులు ఆ క్షణముననే భయంకరమగు కాలముయొక్క కరాళవదనమందు త్వరితముగ ప్రవేశించుచున్నట్లు అర్జును డెట్లు గాంచగల్గెనో ఆ ప్రకారమే ఇపుడు ప్రత్యక్షముగా గానుపించు ఈ బంధుమిత్రదారాసుతాదులు, ధనధాన్యాదులు, భవనములు, క్షేత్రారామములు, సంపదలు అన్నియు కాలగర్భమున విలీనమైపోవునవే యనియు - జీవుడు భావించుకొనవలెను. ఈ సత్యమును చక్కగ భావించుకొనినచో దృశ్యపదార్థములం దంతట వైరాగ్యభావ ముప్పతిల్లగలదు.
భవిష్యత్తును వర్తమానమున జూడగల్గుటయే జ్ఞానదృష్టి. రాబోవు మృత్యువును ఇప్పుడు భావించగల్గుటయే జీవుని విఙ్ఞతయైయున్నది. అట్టి భవిష్యద్భావనచే, మృత్యుచింతనచే జీవుడు వైరాగ్యోపేతుడై జీవితమును జాగ్రత్తగ నడుపు కొనగలడు. అత్తఱి భోగాదులం దాతనికి విరక్తియు, భగవంతునియందు భక్తియు ఉదయించును. మరణము సంభవింపకమునుపే లక్ష్యప్రాప్తినొందవలెనను దృఢనిశ్చయము కలుగజేసికొని అందులకై తీవ్రతరముగ ప్రయత్నించును.
కాబట్టి విశ్వరూపమున అర్జునుడు చూడగల్గిన భవిష్యత్కాలచిత్రమును ప్రతిముముక్షువు తన హృదయవీధియందు చిత్రించుకొని, వైరాగ్యయుక్తుడై లక్ష్యమగు పరమాత్మ ప్రాప్తికై అనవరతము యత్నము గావించుచుండవలెను.
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*భీష్మ పర్వము ప్రథమాశ్వాసము*
*236 వ రోజు*
ఆ మాటలకు అర్జునుడు గడగడా వణుకుచూ " వాయుదేవుడను, వరుణ దేవుడవు, అగ్ని దేవుడవు, సూర్యుడు, చంద్రుడు నీవే. అనేక తత్వసారము నీవే, నీవే పుండరీకాక్షుడవు, శాశ్వతుడవు, అచ్యుతుడవు నీవే. నీ మహిమ ఎరుగక నీవు యాదవుడవని సఖుడవని నా మేన బావవవి నీతో సరస సల్లాపములు ఆడాను. సఖుడవన్న చనువుతో నీ పట్ల తెలియక అపరాధం చేసి ఉంటాను. నీ దివ్య రూపం కనులారా చూసాను ఆనందం, భీతిని కలిగిస్తున్నది తల్లి తండ్రులు బిడ్డల అపరాధములు మన్నించినట్లు నన్ను మన్నించు దేవా " ని ప్రార్ధించాడు. " అర్జునా ! అనేక తపములు ఆచరించిన వారికి, వేదాధ్యయనం చేసిన వారికి దుర్లభమైన నా దివ్యరూపం నీ యందు కలిగిన ప్రీతి చేత నీకు నాయందు కలిగిన భక్తి భావం చేత నీకు లభించింది. నీవు భయభ్రాంతులు విడిచి సంప్రీత మనస్కుడవు కమ్ము " అని పలికి శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం ఉపసంహరించి సహజ రూపం ధరించాడు . స్వస్థత చెందిన అర్జునిని చూసి కృష్ణుడు " అర్జునా ! నా యందు అచంచల భక్తి ఉంచి నన్నే పూజించు వాడు నన్నే పొందగలడు. అత్యంత గుహ్యమైన జ్ఞానమును నీకు అందించాను. సర్వ ధర్మములను నాకు సమర్పించి నన్ను శరణు వేడుము. నన్ను ఆశ్రయించిన నీ సకల దురితములు తొలగించి నీకు మేలు చేస్తాను. నా యందు భయ భక్తులైన వారికి ఈ శాస్త్రమును ప్రీతితో చెప్పుము . అర్జునా చక్కగా వింటివా నీ అజ్ఞానం తొలగి పోయిందా " అన్నాడు. అర్జునుడు " దేవా! నీ దివ్యరూపం చూసిన నా సందేహాలు తొలగి పోయాయి. సర్వలోక నిర్వాహకుడైన నీ మాటలు నాకు శిరోధార్యము. స్థిర చిత్తుడనై నీవు చెప్పినట్లు నడచుకుంటాను " అని చెప్పి శ్రీకృష్ణునికి నమస్కరించి గాండీవాన్ని చేత ధరించాడు.
*గీత పరిసమాప్తి*
శ్రీకృష్ణుని జ్ఞాన భోధను చూసిన సంజయుడు " దేవా! వ్యాసుని దయ వలన కృష్ణార్జుల సంవాదం విన్నాను. మహా యోగీంద్ర ఆనంద కరుడైన పరమాత్ముని దివ్యరూప సందర్శనం నాకు లభించింది. ఆ మహాను భావుని అమృత తుల్యమైన పలుకులు విని ధన్యుడనైనాను. నా మనసు ఆనందంతో నిండి పోయింది. గుహ్యమైన జ్ఞానం విని పులకించాను. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ధర్మము, నీతి, సిరి సంపదలు, విజయము ఉంటాయి " అని భక్తి పారవశ్యంతో చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *భాషాసు ముఖ్యా మధురా*
*దివ్యా గీర్వాణ భారతీ* |
*తస్యాం హి కావ్యం మధురం*
*తస్మాదపి సుభాషితం* ||
*తా𝕝𝕝 భాషలన్నిటిలోనూ ముఖ్యమైనది, తీయనిది, దివ్యమైనది (విశేషమైనది) గీర్వాణ భారతి అనగా సంస్కృత భాష.....*
*అందులోకూడా కావ్యం మధురమైనది.... దాని కంటెనూ కూడా సుభాషితం మధురమైనది* *అని సుభాషితాన్ని గురించి చెప్పిన ఒక చక్కటి సుభాషిత శ్లోకం.....*
✍️💐🌹🌷🙏
తిరుప్పావై 10పాశురం*
*తిరుప్పావై 10పాశురం*
🕉🌞🌏🌙🌟
🕉🌞🌏🌙🌟
*నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!*
*మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్*
*నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్*
*పోత్తప్పఱై తరుమ్* *పుణ్ణియనాల్! పణ్డోరునాళ్*
*కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్*
*తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?*
*ఆత్త* *అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!*
*తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.*
*భావం*
ॐॐॐॐॐॐॐ
నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను (పఱై) ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపు చున్నారు.
మేము రాకముందే నోమునోచి, దానిఫలముగ సుఖానుభవమును పొందిన తల్లీ ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాట ఐననూ పలుకవా ! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమియూలేని మావంటి వారము మంగళము పాడినను 'పఱ' అను పురుషార్థమును ఇచ్చెడి పుణ్యమూర్తి, ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఒడింపబడి తనసొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఇచ్చినాడా ! ఇంట అధికమగు నిద్రమత్తు వదలని ఓతల్లీ ! మాకందరకు శిరోభూషణమైనదానా ! నిద్రనుండి లేచి, మైకము వదిలించుకొని, తేరుకొని వచ్చి తలుపు తెరువుము. నీనోరు తెరచి మాట్లాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు.
*అవతారిక:-*
ॐॐॐॐॐॐॐॐॐ
తనను పొందుట భగవానునికి ఫలము కాని, తనకు కాదు కనుక ఉద్వేగము పొందవలసినది పరమాత్మనే కానీ - తనకెందుకు అని నిశ్చలముగా ఉండెను. ఒకవేళ బ్రహ్మానుభవ సుఖము లభించినను దానియందు మమకారము లేకయుండును. ఆ సుఖము వానిదికదా ! తనకెందుకు సుఖమునందు మమకారము ? శ్రీకృష్ణునికి పొరుగింటనున్నది, నిరంతరము క్రిష్ణానుభావమునకు నోచుకొన్నదియై ఉన్నది. అట్టి ఆ గోపికను (ఈ పాశురములో) నిద్దురలేపుచున్నారు.
వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా! ఆ వూరి యంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్ధురాలైన ఒక గోప కన్యక, యీ గోపకన్యలందరును కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీ కృష్ణుడే పడునట్లు చేయ సమర్ధురాలైనది, శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదియై, నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదియై వున్నది. అట్టి ఆ గోపికను (యీ పదవ మాలికలో) లేపుచున్నారు.
*(బిలహరి రాగము - రూపక తాళము)*
ప.. నోము నోచి సుఖములను పొందగ దలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయ వేలనో యమ్మా!
అ..ప.. ఏమి తలుపు తీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
చ.. పరిమళించు తులసి మాలల కిరీటధారుడు
నారాయణుడే మనచే కీర్తింపబడువాడు
పురుషార్థము నిచ్చునట్టి శ్రీహరి ధర్మాత్ముడు
పురుషోత్తము గొలువ తెలివిగొని తలుపులు తీయవె!
చ.. శ్రీరాముని కాలమందు మృత్యు నోట బడె నొకడు
ఘోర నిద్ర కామించెడి వీర కుంభకర్ణుడు
ఆ రాక్షసుడోడి నీకు దీర్ఘనిద్ర నిచ్చెనో - మా
శిరోభూషణమ్మ! తెలివి చెంది తలుపు తీయవె!
నోమునోచి సుఖములను పొందదలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయవేలనో యమ్మా!
*ముని యొక్క దశ*
*ఆండాళ్ తిరువడిగలే శరణం*
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
ఆండాళ్ తల్లియొక్క సంకల్పం అందరూ కలవాలి,వైయత్తు వాళ్ వీర్గాళ్ ఈ భూమిమీద ఉన్నవాళ్ళంతా ఒకటి, ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దూ అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది.
శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెపుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం.
మానవ జీవితం అనగా సుఖ దుఖాఃలు నదీ తరంగాలుగా ఒక దానివెంట ఒకటి వస్తూనేవుంటాయి. సుఖమైనా దుఖఃమైనా ఎప్పటికి నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి.
సుఖ దుఖాఃలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది, అయితే దుఖం వల్లనన్నా లేక సుఖం వల్ల నన్నా చెడుతుంది.
సుఖం వచ్చినప్పుడు మిడిసి పడ కూడదు. సుఖః దుఖాఃలు ప్రమాదకరం కాదు, వాటియందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏంచెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.
*దుఖేఃషు అణుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్పృహః |*
*వీత రాగ భయ క్రోదః స్తితధీః మునిరుచ్యతే ||*
మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి- వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై సృహ ఉండకుండా చేసుకోకు, దుఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విజ్ఞం చెందకుండా ఉండాలి.
మనకు వీటియందు పట్టు ఉండకుండాచూసుకోవాలి. మనలోని రాగం భయంగా మారి క్రోధం గా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కల్గి ఉన్నది.
*"నోత్తు"* మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు, కానీ నీనోము అయిపోయింది.
ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. *"చ్చువర్ క్కం పుగుగిన్ఱ"* నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు, అంటే కృష్ణుడు నీవద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సకలలోకాలనన్నినింటిని తనలో చూపించాడుకదా, ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం.
ఆయనలో సకలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. *"తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః "* ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు.
*"అమ్మనాయ్"* ఓ యజమానురాలా! యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. *"మాత్తముం తారారో"* ఒక మాట మాతో మాట్లాడరాదా *"వాశల్ తిఱవాదార్"* తలుపులు తర్వాత తీద్దువుగాని, లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నీన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష.
వీళ్ళు కృష్ణుడులోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తున్నారు, ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోప బాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు. *"నాత్తత్తుళాయ్ ముడి"* లోపలుండే వాడు మన స్వామియే, ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం.
లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడెక్కడినుండి వస్తాడు అని అంది.
*"నారాయణన్"* అంతటా వ్యాపించినవాడేకదా ఆయన, సకల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా! *"నమ్మాల్ పోత్త ప్పఱై తరుం"* దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులందరికి అందేవాడు ఆయన. *"పుణ్ణియనాల్"* పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు. ఆయన అందరికి అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా!
*"పండొరునాళ్"* ఇదివరకు ఒకనాడు *"కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం"* మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు.
రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకర్ణుడిని చంపలా, కుంభకర్ణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీప కాంతికోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా!
బుద్దిమంతుడూ ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు, బుద్ది హీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. *"తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో"* ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా. పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాళ్ తల్లి.
ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే, కుంభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటుంది.
అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టిన వాడు. శివుని వివాహానికి హిమాలయాపర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలుపర్వతానికి పోటితో పెరుగుతుంటే దేవతలంతా గాబరా పడి ఈయనని అడిగితే, వింధ్య పర్వతం ఈయన శిష్యుడు.
ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్ప తనం. మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అదిష్టాన శక్తివిశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం.
ఈ భూమినీ మనం అలాగే భావిస్తాం, ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు, అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి ఆంటాం. అగం-పర్వతం స్త- పెరుగుదలని నిలిపిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన.
ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది.
లోపల గోపబాలిక లేచి కృష్ణా అంటూ లేచింది, *"ఆత్త అనందల్ ఉడైయాయ్!"* పెద్ద బద్దకం కల దానా, *"అరుంగలమే"* అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారుకాదు. *"తేత్తమాయ్ వందు తిఱవ్"* తొందరగా సర్దుకొని రావమ్మా.
*తిరుప్పావై 10వ పాశురం అనువాద పద్యం*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
ॐॐॐॐॐॐॐॐॐॐ
*నోత్తుచ్చు వర్గం పుహునిన్ఱ*
*సీ,ద్వారంబు తీయక దారిని చూపక*
*నిద్ర వీడని కళ్ళు నిద్ర నుంచు*
*మాట మాత్రము కూడ మాకైన తెలుపక*
*మౌన ముద్రను దాల్చె మగువ యిపుడు*
*స్వర్గ సుఖములెల్ల చక్కగా పొందుచు*
*ఆనంద మందెడు చాన యగుచు*
*నారాయణుని చేరి నారీ శిరోమణి*
*బృందమై కదలెను సుందరముగ*
*తే.గీ. తులసి మాలికలను తెచ్చి తోయజాక్షు*
*కంఠమునలంకరించగా కదలినారు*
*కరుణజూపుము వాయిద్య పరను యిమ్ము*
*వరము లొసగెడు స్వామికి వందనములు*
*శ్రద్ధ భక్తిని యందించి బుద్ధినిమ్ము*
*శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!*
🕉🌞🌎🌙🌟🚩
తమకై త్యాగమొనర్చి నట్టి
మ.తమకై త్యాగమొనర్చి నట్టి ఘనులన్ ధన్యాత్ములన్ సర్వదా
తమ అభ్యున్నతికై తపించు హితులన్ ధర్మాత్ములన్ భక్తితో
తమ చిత్తమ్మున సంస్మరించుకొని సంధానైక లక్ష్యమ్ముతో
సుమతిన్ వందన మాచరించుట సదా శోభా
ప్రదమ్మై చనున్౹౹ 95
ఉ. ఓ కమనీయ వాక్సుధల నున్నతిఁ గూర్చెడు దేవి! సర్వదా
నీ కరుణాప్త దృక్కుల వినిర్మల కాంతుల భక్త జాలము
న్నీకృపఁ బ్రోచి యేవిధి ననేక విధమ్ముల నాదు కొందువో
నాకు నదే విధిన్ దయ ననంతముగా సమకూర్చ వేడెదన్౹౹96
తిలాపాపం తలాపిడికెడు*
*తిలాపాపం తలాపిడికెడు*
అడపా తడపా ఇటువంటి చందమామ కథలు చెప్పుకోవలసి వస్తుంది.
ఒక పాలవాడు ఒక సత్రానికి రోజూ పాలు పోస్తాడు. ఒకనాడు ఎప్పటిలాగే పాల కుండను తలపైన పెట్టుకొని వెళుతుండగా ఆకాశంలో ఒక గ్రద్ద ఒక నాగు పామును వేటాడి తీసుకెడుతూ ఉంటే ఆ పాము నుంచి చిమ్మబడ్డ విషం పాలకుండలో పడుతుంది.
ఇది తెలియని పాలవాడు సత్రంలో పాలు పోస్తాడు. ఆ విషపుపాలతో వండిన వంటకాలు తిన్న వారందరూ చనిపోతారు.
ఈ విషయంపై యమసభలో విచారణ......
పాలవాడు... నాకు విషము పడిందని తెలియదు. పాపం నాది కాదు అని అంటాడు.
పాము... నా చావు బ్రతుకుల్లో అనంకల్పితముగా కారిన విషమది. ఆపాపం నాది కాదు అని అంటుంది.
గ్రద్ద... నా ఆహారపు వేట అది… నా పాపం కాదది అని అంటుంది.
వంటవాడు... పాలు విషపూరితమైనవి అని నాకు తెలియదు. అది నా పాపం కాదు అని అంటాడు.
వడ్డించినవాడు... భోజనం విషపూరితమైనది నాకు తెలియదు. అది నా పాపం కాదు అని అంటాడు.
చనిపోయిన వారు... భోజనంలో విషం ఉందని మాకు తెలియదు కాబట్టి తిన్నాం. అది మా పాపం కాదు.
మరి తెప్పెవరిది? దానికి బాధ్యత ఎవరిది? ఆ పాపం ఎవరిది? ఎంతో తర్జన భర్జన తర్వాత ఆ పాపానికి అందరూ కారకులే, కాబట్టి వారందరికీ తలా పిడికెడు ఆ పాపాన్ని పంచమని యమధర్మరాజు నిర్ణయిస్తాడు…
అలా… తిలా పాపం తలా పిడికెడు అనే నానుడి వచ్చింది.
కర్మ మేదియొ పట్టియున్నది
కర్మ మేదియొ పట్టియున్నది కాయమున్ భువనేశ్వరీ!
మర్మవేద్యవు ముక్తి నీయవె మాయకర్మలు వీడగా
ధర్మమార్గము నాకు జూపుమ ధర్మకర్మల జేయగా
శర్మదాఖ్యవు నర్మగర్భవు సన్మతిన్ దయజూడుమా!
*~శ్రీశర్మద*
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5125*
*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - దశమి - చిత్ర / స్వాతి - సౌమ్య వాసరే* (25.12.2024)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
-----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
సావడి కబుర్లు -2
సావడి కబుర్లు -2
*వందేమాతరం*
ఈమధ్య ఇతరత్రా కార్యక్రమాల వల్ల సాయంత్రం వ్యాహ్యాళికి, అదేనండి నేడు మనం మాట్లాడుకునే ఈవినింగ్ వాక్ వెళ్లడం కుదరలేదు. మొన్న ఆదివారం బజార్లో శ్రీకృష్ణభగవాన్లు గారు కలిసి అవీ ఇవీ మాట్లాడుతూ నువ్వు అమ్మ పక్షపాతివయ్యా అన్నారు. అదేంటండి అంత మాట అనేసారు అంటే, ఆరోజు అమ్మ గురించి బాగానే చెప్పావు మరి నాన్నని మర్చిపోయావేం అన్నారు.
అమ్మంటే ప్రొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే అన్ని పనుల్లోనూ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వెంటనే చెప్పగలిగాను. మరి నాన్న అలా కాదు కదా, సంసార సాగరంలో ఎన్నో విస్ఫోటనాలు తనలో దాచుకుని పైకి పున్నమి రోజు చంద్రోదయంలో అందరిని మైమరపించే సముద్రపు అలలలా కనిపిస్తాడు. అమ్మ చూసేది ఆకలి, నాన్న చూసేది అభివృద్ధి, నేర్పేది పాలన. మార్గం అమ్మ చూపిస్తే, మార్గనిర్దేశం నాన్న ఆలోచిస్తాడు. వర్తమానాన్ని అమ్మని నడిపిస్తుంటే, మన భవిష్యత్తుని మనకంటే ముందు నాన్న ఆలోచిస్తాడు. దానికై రేయింబగళ్లు శ్రమిస్తూ మన నడకకి బంగారు బాట నిర్మించే కృషీవలుడు నాన్న. నాన్న మన బలానికి క్రమశిక్షణకి మూల స్తంభం వంటివాడు. అమ్మతో గడిపిన అంత సమయం నాన్నతో గడిపే అదృష్టం ప్రపంచంలో ఎవరికో గాని దొరకదు. అందుకే తల్లితో ఉన్నంత చనువు తండ్రి దగ్గర ఉండదు. తండ్రి నిస్వార్ధంగా నిరంతరం కుటుంబం గురించి రగిలే ఒక జ్వాల. ఆ బాధ్యత అనే వేడి పిల్లలకు తెలియకూడదని వారు భరించలేరని దానిని తనలోనే రగులుచుకుంటూ చాలా సందర్భాల్లో తండ్రి ఒంటరితనం అనే యాత్ర సాగిస్తుంటాడు. విచిత్రం ఏమిటంటే మన అవసరాలకు పోపులుడబ్బాలో దాచిన డబ్బులు ఇచ్చిన అమ్మని దేవతలా చూస్తాం కానీ తన కష్టాలని ఆ డబ్బులుగా మార్చిన నాన్నను గుర్తించం. అమ్మది భూదేవంత ఓర్పు సహనం అనే చెప్పకుంటాం కానీ ఆకాశమంత నాన్న ఔనిత్యాన్ని గుర్తించం. మనల్ని నవమాసాలు మోసిన అమ్మని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం కానీ మనతో పాటు అమ్మను కూడా మోసే నాన్న గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం. చిన్నప్పుడు మనల్ని దండించిన నాన్న గుర్తుంటాడు, గానీ దానికి కారణమైన మన తప్పును దిద్ది క్రమశిక్షణ నేర్పించిన తండ్రి మార్గదర్శకత్వాన్ని మర్చిపోతాం. ఆ కోపం వెనక నాన్న మనసులోని చల్లదనం గుర్తించం. నాన్న కూడా అంతే ఎప్పుడూ తన గుర్తింపు కోరుకోడు. గుర్తింపు తెచ్చుకున్న పిల్లలను చూసి గర్వించడం తప్ప. ప్రపంచానికి మనని పరిచయం చేసేది అమ్మ అయితే ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది నాన్న.
అమ్మంటే బోళా, నాన్నేమో కాఠిన్యం అనుకుంటారు అందరూ, కానీ ఆ కోపం వెనుక నాన్నకు ప్రేమ లేక కాదు మన విజయానికై ఉన్న ఆరాటం అలా కనిపిస్తుందని గుర్తించాలి. మనం గెలిస్తే అభినందిస్తాడు ఓడిపోతే ధైర్యం చెబుతాడు అదే నాన్నంటే.
అభిజ్ఞాన శాకుంతలంలో
*‘అంగాదంగాత్ సంభవతి పుత్రః*
*హృదయాదభిజాయతి ఆత్మావై పుత్ర నామాసి* అంటారు, అంటే పుత్రుడు తండ్రి శరీర కణాల నుంచే కాదు, హృదయ అనుభూతితో జన్మించేవాడు అని. ఆ అదృష్టాన్ని పుత్రులు నిలుపుకోవాలి కానీ, దురదృష్టం ఏమిటంటే చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం, కానీ పెద్దయ్యాక ఆ రెక్కల భారాన్ని పంచుకునే ప్రయత్నం కూడా చేయం. ఒకవేళ అరా-కొర చేయి వేసినా ఆ భారాన్ని మొత్తం తామే మోసినట్లు చెమటలు ఓడ్చే పిల్లలను చూస్తున్నాం. పైగా వారి ఢాంబికాలు, అతిశయోక్తులు ప్రచారం చేసుకునేందుకు ఈ మధ్య సాంఘిక మాధ్యమాలు కూడా తోడయ్యాయి. అటువంటి పిల్లలను తండ్రులు క్షమించాలి. అయినా క్షమ తండ్రులకు కొత్త కాదులే, వారు ఎన్ని క్షమిస్తే, ఎన్ని భరిస్తే ఈరోజు ఈ స్థితిలో ఉన్నమో పిల్లలు గుర్తించాలి.
మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన అభివృద్ధే నాన్న జ్ఞాపకం, మన భవిష్యత్తే నాన్న వ్యాపకం. మన ఆలోచనలే నాన్న జీవితం. ఒక కవిగారు అంటారు నాన్న తన భుజాల మీద మనని ఎందుకు కూర్చోబెట్టుకుంటాడో తెలుసా, తన పిల్లలు తనకంటే ఎత్తు నుండి ప్రపంచాన్ని చూడాలని. నాన్న చూపించిన దారిలో మనం అనుకున్న విజయాలు సాధించవచ్చు సాధించకపోవచ్చు, కానీ అపజయం మాత్రం ఉండదు. పిల్లల గెలుపులో తన ఓటమిని ఆనందించేవాడు తండ్రి ఒక్కడే. నాన్న అమ్మని ఎందుకు గౌరవిస్తాడో తెలుసా? అమ్మ గౌరవం పిల్లలకు సురక్షితం కాబట్టి.
చివరిగా అమ్మది ప్రేమ, నాన్నది దీవెన.
*యస్మాత్పార్దివ దేహః ప్రాదుర*
*భూద్యేన భగవతా గురుణా*
ఎవరివల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అలాంటి భగవత్ స్వరూపుడు, సర్వజ్ఞమూర్తి అయిన తండ్రికి వేలాది నమస్కారాలు'
ఉంటా
మృశి
దశిక ప్రభాకర శాస్త్రి
23.12.2024
మారేడు ఆకుతో ధన ప్రాప్తి
☘️☘️☘️☘️☘️
మారేడు ఆకుతో ధన ప్రాప్తి
ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది ఇటువంటి డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. కొంతమందికి అతి సులభంగానే డబ్బు రూపంలో ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరగడానికి ధనం కలిసి రావడానికి మారేడు ఆకుతో చిన్న పరిహారం చేస్తే ధన అభివృద్ధి జరుగుతుంది. మారేడు ఆకు పరమేశ్వరుడికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మికి కూడా మారేడు చెట్టు ఇష్టమని, శ్రీ మహాలక్ష్మి మారేడు చెట్టు రూపంలో ఉంటుందని శ్రీ సూక్తం లో తెలియజేయబడినది. ధన ఆదాయం వృద్ధి చెందాలి అనుకున్న వారు మారేడు చెట్టు వద్ద ఒక చిన్న పరిహారం చేయండి. గురువారం నాడు దగ్గరలో ఉన్న ఒక మారేడు చెట్టు వద్దకు వెళ్లి ఆ చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్ళు పోసి, రెండు అగరబత్తిలను వెలిగించండి. మారేడు చెట్టుకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఆవు నేతితో రెండు ఒత్తులు వేసి దీపం పెట్టండి.మారేడు చెట్టు మొదట్లో రెండు తమలపాకులు ఒక వక్క అరటి పండుతో కూడిన తాంబూలం సమర్పించండి. మారేడు చెట్టుకు నమస్కరించి ఈరోజు నుండి ధనపరమైన సమస్యలు తీరిపోవాలి ధన ఆదాయం వృద్ధి చెందాలి అని చెప్పి మూడు ఆకులతో కూడిన మారేడు దళాన్ని కోసి ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ మారేడు ఆకును మీ పూజ మందిరంలో ఉంచండి లేదా మీ పర్సులో గాని జేబులో కానీ ఉంచుకోండి. దీనివలన ఆదాయం వృద్ధి చెందుతుంది ధనపరమైన సమస్యల నుండి బయటపడతారు. చక్కటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది
☘️☘️☘️☘️☘️