*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*భీష్మ పర్వము ప్రథమాశ్వాసము*
*236 వ రోజు*
ఆ మాటలకు అర్జునుడు గడగడా వణుకుచూ " వాయుదేవుడను, వరుణ దేవుడవు, అగ్ని దేవుడవు, సూర్యుడు, చంద్రుడు నీవే. అనేక తత్వసారము నీవే, నీవే పుండరీకాక్షుడవు, శాశ్వతుడవు, అచ్యుతుడవు నీవే. నీ మహిమ ఎరుగక నీవు యాదవుడవని సఖుడవని నా మేన బావవవి నీతో సరస సల్లాపములు ఆడాను. సఖుడవన్న చనువుతో నీ పట్ల తెలియక అపరాధం చేసి ఉంటాను. నీ దివ్య రూపం కనులారా చూసాను ఆనందం, భీతిని కలిగిస్తున్నది తల్లి తండ్రులు బిడ్డల అపరాధములు మన్నించినట్లు నన్ను మన్నించు దేవా " ని ప్రార్ధించాడు. " అర్జునా ! అనేక తపములు ఆచరించిన వారికి, వేదాధ్యయనం చేసిన వారికి దుర్లభమైన నా దివ్యరూపం నీ యందు కలిగిన ప్రీతి చేత నీకు నాయందు కలిగిన భక్తి భావం చేత నీకు లభించింది. నీవు భయభ్రాంతులు విడిచి సంప్రీత మనస్కుడవు కమ్ము " అని పలికి శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం ఉపసంహరించి సహజ రూపం ధరించాడు . స్వస్థత చెందిన అర్జునిని చూసి కృష్ణుడు " అర్జునా ! నా యందు అచంచల భక్తి ఉంచి నన్నే పూజించు వాడు నన్నే పొందగలడు. అత్యంత గుహ్యమైన జ్ఞానమును నీకు అందించాను. సర్వ ధర్మములను నాకు సమర్పించి నన్ను శరణు వేడుము. నన్ను ఆశ్రయించిన నీ సకల దురితములు తొలగించి నీకు మేలు చేస్తాను. నా యందు భయ భక్తులైన వారికి ఈ శాస్త్రమును ప్రీతితో చెప్పుము . అర్జునా చక్కగా వింటివా నీ అజ్ఞానం తొలగి పోయిందా " అన్నాడు. అర్జునుడు " దేవా! నీ దివ్యరూపం చూసిన నా సందేహాలు తొలగి పోయాయి. సర్వలోక నిర్వాహకుడైన నీ మాటలు నాకు శిరోధార్యము. స్థిర చిత్తుడనై నీవు చెప్పినట్లు నడచుకుంటాను " అని చెప్పి శ్రీకృష్ణునికి నమస్కరించి గాండీవాన్ని చేత ధరించాడు.
*గీత పరిసమాప్తి*
శ్రీకృష్ణుని జ్ఞాన భోధను చూసిన సంజయుడు " దేవా! వ్యాసుని దయ వలన కృష్ణార్జుల సంవాదం విన్నాను. మహా యోగీంద్ర ఆనంద కరుడైన పరమాత్ముని దివ్యరూప సందర్శనం నాకు లభించింది. ఆ మహాను భావుని అమృత తుల్యమైన పలుకులు విని ధన్యుడనైనాను. నా మనసు ఆనందంతో నిండి పోయింది. గుహ్యమైన జ్ఞానం విని పులకించాను. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ధర్మము, నీతి, సిరి సంపదలు, విజయము ఉంటాయి " అని భక్తి పారవశ్యంతో చెప్పాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి