*తిరుమల సర్వస్వం -98*
*జయ విజయులు*
శ్రీవారు కొలువుండే వైకుంఠానికి ఏ విధంగా జయవిజయులు కాపుంటారో, అదేవిధంగా బంగారువాకిలికి దక్షిణాన జయుడు, ఉత్తరాన విజయుడు; శంఖు, చక్ర, గదాధారులై, సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపాల్లా దర్శనమిస్తుంటారు. వీరిని *"చండ-ప్రచండులు"* అని కూడా వ్యవహరిస్తారు. పది అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉండే ఈ పంచలోహ విగ్రహాలు తర్జనితో భక్తులను ఎల్లవేళలా హెచ్చరిస్తుంటాయి. స్వామి పుష్కరిణిలో పవిత్రస్నానమాచరించి, శుచిగా ఆలయంలోకి ప్రవేశించి, ఆలయ నిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారేమో!
ఈ మూర్తులను జాగ్రత్తగా గమనిస్తే, వారి నోళ్లకు చిన్నచిన్న కోరలుంటాయి. దానికి కారణం పూర్వజన్మలో వారు రాక్షసులుగా జన్మించడమే.
పురాణాల్లోకి వెళితే ఒకప్పుడు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండే జయ-విజయులు, కారణాంతాన బ్రహ్మమానస పుత్రులైన సనకసనందనాది మునులచే శపించబడి, కృతయుగంలో *హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు* గానూ, త్రేతాయుగంలో *రావణ కుంభకర్ణులు* గానూ, ద్వాపరయుగంలో *శిశుపాల దంతావక్రులు* గానూ జన్మించి, వారి వారి దుష్క్రుత్యాల వల్ల శ్రీవారి చేతిలో సంహరింప బడ్డారు. శాపకాలం పూర్తయిన తర్వాత, శ్రీమహావిష్ణువు కటాక్షంతో తిరిగి కలియుగంలో శ్రీనివాసునికి ద్వారపాలకులుగా నియమింపబడ్డారు. ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు తరువాత, విష్ణుమూర్తి పరివార దేవతలలో అత్యంత ప్రముఖులు వీరే! శ్రీవారిసన్నిధి యందున్న బంగారు కటాంజనాలలో నిరంతరం నిలుచుని ఉండే మహద్భాగ్యానికి నోచుకున్న జయవిజయులకు భక్తిపూర్వకంగా నమస్కరించి, వారి అనుమతితో, శ్రీవారి దర్శనార్థం, *"బంగారువాకిలి"* ముంగిట చేరుకున్నాం. ఇప్పుడు *బంగారువాకిలి,* దాని లోపల ఉన్న *ఇతర మండపాలు* మరియు *"గర్భాలయం"* గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
[ రేపటి భాగంలో..... *బంగారువాకిలి,* ఇత్యాదుల గురించి తెలుసుకుందాం]
*బంగారువాకిలి*
శ్రీవారి ఆలయానికి మూడవది (మొదటిది "మహాద్వారం" లేదా "పడికావలి", రెండవది "వెండివాకిలి" లేదా "నడిమి పడికావలి"), అత్యంత ముఖ్యమైనది అయిన ఈ *"బంగారువాకిలి"* పేరుకు తగ్గట్లే, పసిడి కాంతులతో తళతళలాడుతూ, లక్ష్మీవల్లభుడైన శ్రీనివాసుని అనంతమైన ఐశ్వర్యాన్ని, వైకుంఠ వైభవాన్ని చాటుతూ ఉంటుంది. [ *Note: చిన్న మనవి: కొన్ని ఆర్జిత సేవలలో పాల్గొనేవారు, విఐపి బ్రేక్ దర్శనం అనుమతి ఉన్న భక్తులు మాత్రమే బంగారువాకిలి దాటి లోనికి ప్రవేశించగలరు. మిగతా భక్తులందరూ,ఇక్కడినుండే, "లఘుదర్శనం" ద్వారా శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని, మహామణి మంటపానికి దక్షిణంగా ఉన్న కటకటాల ద్వారం నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.*]
బంగారువాకిలి గుమ్మం పైభాగాన, గుమ్మానికి ఇరుప్రక్కలా, జయ-విజయుల మధ్యనున్న ప్రదేశమంతా కడు రమణీయమైన పుష్పాలు, లతలు చెక్కబడి బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటాయి. ఈ రెండు తలుపులు గళ్ళు - గళ్ళుగా విభజించబడి, ప్రతి గడిలోనూ ఒక్కో అద్భుతమైన ప్రతిమ అచ్చెరువు గొల్పుతూ ఉంటుంది. సుదర్శనచక్రం, శ్రీవేంకటేశ్వరుడు, మహావిష్ణువు, పాంచజన్యం, వాసుదేవుని విభిన్నరూపాలు, కేశవుని ద్వాదశమూర్తులు (కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు), దశావతారరాలు కన్నులకింపుగా చెక్కబడి, సాక్షాత్తూ వైకుంఠమే ఇక్కడికి చేరుకున్నట్లుగా గోచరిస్తుంది. పై గడపకు ఇరుపార్శ్వాలలో గజరాజులచే పూజింపబడుతున్న గజమహాలక్ష్మి పద్మాసీనురాలై ఉంటుంది.
బంగారువాకిళ్ళను సుప్రభాత సమయంలో *"కుంచెకోల"* అనే పరికరంతో, జియ్యంగార్లు, అర్చకులు, ఆలయ అధికారుల వద్దనున్న తాళంచెవులతో అందరి సమక్షంలో తెరిచే విస్తారమైన ప్రక్రియను మనం *"సుప్రభాతసేవ"* లో తెలుసుకున్నాం.
. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు చేరుకున్న భక్తులు, పూటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి, మ్రొక్కుబడులు చెల్లించుకుని, బంగారువాకిలి వెలుపలి నుండే క్షణకాల దర్శనంతో సంతృప్తిపడి, శ్రీనివాసుని దివ్యమంగళమూర్తి నుండి దృష్టి మరల్చుకోలేక, రెప్పవేస్తే కన్నుల ముందున్న పెన్నిధి కనుమరుగవుతుందేమోనన్న బెంగతో, అతికష్టం మీద ముందుకు సాగిపోతారు
. స్వామివారిని ఎన్నెన్నో కోర్కెలు కోరుదామని వచ్చిన భక్తులు ఆనందాతిశయంతో, భక్తిపారవశ్యంతో, తన్మయంతో తమను తాము మైమరచిపోతారు. *మనం కోరుకోగలిగింది అత్యల్పం, స్వామివారు ప్రసాదించ గలిగింది అనంతం! భక్తుని మానసం భగవంతు డెరుగడా?*
కొండంత దేవుడిని కోటి కోర్కెలతో కష్టపెట్టకుండా, క్షణకాల దర్శనంలో ఆ చిన్మయానంద రూపాన్ని గుండె గుడిలో పదిలంగా కొలువుంచు కోవడం శ్రేయస్కరం!
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి