*నోటుకి ఓటూ ఒక ముందడుగే!*
అరవై ఏళ్ళ నాటిది 'మాటకి ఓటు.' ఆ తర్వాతది 'హామీకి ఓటు.' ఆ పిమ్మట 'జులుం కి ఓటు.' ఆ తర్వాతే 'మత్తుకి ఓటు.' చివరకు 'నోటుకి ఓటు.'
భారత ఎన్నికల వ్యవస్థ పరిణామ క్రమం ఈ ఆఖరి దశకు చేరడానికి అరవై ఏళ్ళు పట్టింది.
అది 'నోటుతో ఓటు' దగ్గరే ఆగలేదు. జీతంతో ఎన్నికల కూలీలు కూడా ఉనికిలోకి వచ్చారు. ఈ 'ఓటుకు నోటు' దశలో ఉపదశలు వున్నాయి. ఆఖరి ఉపదశ ముఖ్యమైనది.
మొదట ఒకే పార్టీ నుంచి నోటు తీసుకొని, అదే పార్టీకి ఓటు వేసే పద్ధతి అమలులో వుండేది. ఆనాడు 'తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు' అనే ఖర్మ భావన ఓటర్ల మనస్సుల్లో వుండేది.
అన్ని పార్టీల నుంచి నోటు తీసుకొని, తమకు నచ్చిన ఒకే పార్టీకి ఓటు వేయడమనే కొత్త పద్ధతి తర్వాత ఉపదశలో ఉనికిలోకి వచ్చింది.
*నాకు నోట్లు యివ్వడం అన్ని పార్టీల విధి. నా ఇష్ట ప్రకారం ఓటు వేసుకోవడం నా విధి* అనేది నేటి సగటు ఓటరు మనోభావన!
నిన్నటి ఖర్మ భావన నుంచి బయటపడి ఓటరు యిలా "స్వేచ్ఛ" ప్రదర్శించడం కూడా ముమ్మాటికీ ఓ ముందడుగే!
ఈసారి ఎన్నికలలో మా కుటుంబానికి ఫలానా మొత్తం డబ్బు వచ్చిందని నేడు సగటు ఓటర్లు కలుసుకున్నప్పుడు పరస్పరం నిర్మొహమాటంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అలాగే ఈసారి ఎన్నికల్లో నాకు ఫలానా మొత్తం కూలి వచ్చిందని చెప్పుకోవడం దినసరి ఎన్నికల కూలీల అలవాటుగానూ మారింది. ఎలాంటి అపరాధ భావం లేకుండా ఇలా సగర్వంగా సాధారణ ప్రజలు చెప్పుకునే పరిస్థితి రావడం యాదృచ్ఛిక పరిణామం కాదు. ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్ గా మారిన నూతన పరిస్థితికి ఇది అద్దంపడుతుంది.
మున్నెన్నడూ లేనంత స్దాయిలో ధన ప్రవాహంతో ముంచెత్తిన తాజా 16వ లోక్ సభ ఎన్నికలు యీ ప్రక్రియని పూర్తి చేశాయి. అంతేకాకుండా 'కూలికి ప్రచారం' 'ఓటుకి నోటు' లకు సగటు ప్రజల చేత ఆమోద ముద్ర వేయించాయి. తద్వారా సమాజంలో నూతన ఎన్నికల ఆచారాన్ని కూడా ఆవిష్కరింపజేశాయి.
సమాజంలో ఏ కాలంలో సగటు ప్రజలు ఏ ఆచరణను అనుసరిస్తే, అదో ఆచారమే! సారంలో సాంప్రదాయమది. అది సదాచారం కావచ్చు. దురాచారం కావచ్చు. అది సత్సంప్రదాయం కావచ్చు. దుస్సంప్రదాయం కావచ్చు. సగటు ప్రజల ఆచరణకి ఆలంబనగా అది మారితే చాలు! ప్రజల ఆదరణ లేకుండా ఏదీ ఆచారంగా మారదు. నిన్నటి సదాచారం నేడు దురాచారంగా, నేటి సదాచారం తిరిగి రేపటి దురాచారంగా కూడా మారే పరిస్థితులు సామాజిక గమనంలో సహజమైనవి!
'ఓటుకు నోటు' అనే పద్ధతికి అతీతంగా మిగిలిపోయిన ఓటర్లు నేటికీ లేరని కాదు. ముఖ్యంగా క్లాసుగా పిలిచే మధ్యతరగతి, మేధో వర్గాలు వున్నాయి. మాస్ లో కూడా మరికొంత శాతం మిగిలారు. కానీ నేడు సమాజంలో వారు అల్పసంఖ్యాకులుగా మారుతున్నారు. రానున్న కాలంలో యిది మరింత విస్తరిస్తుంది. నేడు మన సమాజంలో ఏది పెరిగే ధోరణి, ఏది తరిగే ధోరణి అన్నదే ముఖ్యమైనది. ఈ పరిణామం ఒక నూతన రాజకీయ సంస్క్రతిని ఏర్పరుస్తున్నది. అదో సహజ సంస్కృతిగా మారాక ప్రజల ప్రవ్రృత్తిని అవినీతి అందామా? ఇది ప్రగతిశీల శక్తులుగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న!
ఇదే నిజమైతే, నూటికి ఎనభై లేదా తొంభై మంది ప్రజలు అవినీతి పరులే! కోట్లాది మంది ప్రజల్ని గంపగుత్తగా మనం అవినీతిపరులుగా భావించాలి. ఐనప్పుడు సమాజ పురోగతి ఎవరితో సాధించగలం? ఇదే నిజమైతే ఇలాంటి అవినీతిపరులతో సమాజ పురోగతి సాధ్యమా? నేడు ప్రగతిశీల, ప్రజాతంత్ర, పురోగామి రాజకీయ శక్తులకు ఎదురవుతున్న ప్రశ్నలివి!
ఈ 'ఓటుకు నోటు' అనే కొత్త ఆచారం మీద సర్వులూ నేడు నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఆచారం పాటిస్తున్న సగటు ఓటర్లు (ప్రజలు) సైతం నేడు ఈ విమర్శకులతో గొంతు కలుపుతున్నారు. నిజానికి ఈ విమర్శను ఖండించేవాళ్ళు సమాజంలో మిగలడం లేదు. అయినా ఈ కొత్త ఆచారం క్రమంగా బలపడుతున్నది. దీన్ని ఎలా విశ్లేషించాలి?
లోతుగా పరిశీలిస్తే ఇది ఈ క్రింది రెండు ఆచారాల కలయికగా భావించాలి.
*నోటుతో ఓటు పొందడం ధనస్వామ్య పార్టీల ఆచారం.*
*ఓటుతో నోటు పొందడం సామాన్య ఓటర్ల ఆచారం!*
పార్టీల లక్ష్యం దీర్ఘకాలిక అధికార సాధన.
ప్రజల ఆశ, ఆకాంక్షలు తక్షణ ఉపశమనం మాత్రమే.
పైన పేర్కొన్న రెండు పరస్పర విరుద్ధ వర్గాల ఆచారాల పొందిక ఫలితమే నేడు *ఓటుకు నోటు* ఒక విధానంగా వర్ధిల్లడం!
నేడు ఓటు హక్కు అంగట్లో సరుకుగా మారిందని కొత్త ఆచారం నిరూపించుతోంది.
పైపైన చూస్తే ఒకే ఆచారమని అర్ధమౌతుంది. లోతుగా చూస్తే రెండు ఆచారాల మిశ్రమమిది.
ఎన్నికల వ్యవస్థ ఓ సరుకుల మార్కెట్ గా మారింది. రెండు పరస్పర విరుద్ధ వర్గాలతో ఎన్నికల మార్కెట్ వ్యవస్థ సహజీవనం చేస్తుంది. ఈ ఆచారాలను ఆచరించడానికి రెండు పరస్పర విరుద్ధ వర్గాలు ఉనికిలోకి వచ్చాయి. *ఒకటి ఓటును కొనుగోలు చేసే వర్గం కాగా, రెండవది ఓటును అమ్ముకునే వర్గం.*
ఉత్పత్తిదార్లతో పాటు మార్కెట్లో కొనుగోలు దార్లూ, అమ్మకందార్లూ వుంటారు. ఎన్నికల వ్యవస్థ కూడా ఒక మార్కెట్ వ్యవస్థే! సహజంగా ఓటుహక్కు అనే సరుకుకు కూడా కొనుగోళ్లు, అమ్మకాలు వుంటాయి. అవి లేకుండా ఎన్నికల మార్కెట్ వుండదు. ఇది మానవ సంబంధాల స్వరూప, స్వభావాలను మార్చివేస్తుంది. ఈ మార్పుకు గల మూలాలతో సంబంధం లేకుండా ఓటర్లని నిందించడం న్యాయం కాదు.
కళలూ, సంస్కృతులైనా; నీతి, నియమాలైనా; న్యాయ, ధర్మాలైనా; ఆచార, సంప్రదాయాలైనా, రాజకీయ వ్యవహారాలైనా; విలువలు, ఆదర్శాలైనా నిరంతరం చలనంలో వుంటాయి. ఇవేవీ జడపదార్ధాలు కాదు. పారే నదీ జలం వంటివే! సామాజిక పురోగమనం క్రమంలో నిత్యం మార్పుకు లోనవుతున్నవే. స్థల, కాలాదుల్ని బట్టే విశ్వంలోని ప్రతివస్తువుకి ఉనికి ఉంటుంది. ఇది ఐన్ స్టీన్ సాపేక్షిక సిద్ధాంత సారం. అది ఎన్నికల వ్యవస్థకి కూడా వర్తిస్తుంది. ఈ సాపేక్షిక దృష్టితో చూస్తే, నేడు ఓటర్లు 'ఓటుకు నోటును' ఆశించడం అవినీతి కాజాలదు. అది దారి తప్పిన ధిక్కార చైతన్యంగా చూడాలి. నిరంతర సామాజిక పురోగమన దారిలో కూడా అదో ముందడుగే!
ప్రజల ఆలోచనలూ, భావాలూ, నమ్మకాలూ ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడవు. ఈ అన్నిటికీ పునాది ఈనాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధే! అవి వ్యవస్థ పునాదుల్లో వస్తోన్న మార్పులకు అనుగుణంగా నిరంతరం మారుతుంటాయి. ఫలితమే ఆచారాలూ, అలవాట్లూ, అభిరుచులూ, సాంప్రదాయాలూ, నీతి నియమాలు, న్యాయ ధర్మాలూ ఎప్పటికప్పుడు మారుతుండటం! అవి ఒకేలా శిలా శాసనాలుగా వుండాలని కోరుకునే ' యధాతథవాదుల' కోరికలు వట్టి భ్రమలుగానే మిగులుతాయి.
ఎన్నికల మార్కెట్ వ్యవస్థతో సంబంధం లేకుండా పాత ఆలోచనలూ, భావాలూ యదాతధంగా కొనసాగవు. నేడు ఓటుకు 'నోటు' ఆశించే సామాన్య ఓటర్ల ఆలోచనలు, స్పందనల్ని నేరంగా భావించి విమర్శించడం చారిత్రక దృష్టి కాజాలదు. నిజానికి మొన్నటి విలువలూ, నీతి నియమాలే యధాతధంగా కొనసాగుతూ వుండాలనుకునే స్వీయాత్మక యధాతధవాదం ఆచరణలో నిలబడేది కాదు. మొదట ఈ భౌతిక సత్యాన్ని ప్రగతిశీల శక్తులు గ్రహించాల్సివుంది.
సతి సక్కుబాయి, సావిత్రి, అనసూయలను నేటికీ ప్రజలు ఆరాధిస్తారు. కానీ వారిని ఆచరించరు. తాను కట్టుకున్న ఆలిని అప్పు తీర్చడం కోసం అమ్మిన హరిశ్చంద్రుణ్ణి మన ప్రజలు ఆరాధిస్తారు. కానీ ఏ పరిస్థితుల్లో అనుసరించరు. నేడు ఆచరించకపోవడమే సరైనది. ఆదర్శంగా భావించి ఆరాధించడం సరైనది కాదు. ఇది ఓటర్లకు కూడా వర్తించే నియమమే.
మొన్నటి ఓటరు తన గ్రామ పెత్తందార్లు గుద్దమన్న పార్టీ గుర్తు మీద తన ఓటు ముద్రని గ్రుడ్డిగా గుద్దాడు. అతణ్ణి ప్రతిఫలాపేక్ష లేని *ఉత్తమ ఓటరు* గా నేటి సమాజం ఆరాధిస్తోంది. అలా గుడ్డిగా గుద్దననే ఈనాటి ఓటరుని విమర్శిస్తోంది. ఒక చెడ్డదారి నుంచి ఓ సరైన దారిలోకి వచ్చేముందు కొన్నిసార్లు ఒకింత ప్రక్కదారుల్లో సైతం నడవాల్సిన స్థితి రావచ్చు. బానిసత్వం నుంచి స్వేచ్చలోకి అడుగుపెట్టే సంధిదశలోనూ సహజంగా తప్పటడుగులు పడుతుంటాయి. జనం కొత్తగా వేసే తప్పటడుగులపై ఉండే వ్యతిరేకత గత బానిస ధర్మానికి బలం చేకూర్చేదిగా మారకూడదు. ఈ శాస్త్రీయ సామాజిక దృక్కోణంతో ఎన్నికల వ్యవస్థలో వస్తోన్న పరిణామక్రమాన్ని శాస్త్రీయ దృష్టితో పరిశీలించాల్సి ఉంది.
గత అరవై ఏళ్ళ ఎన్నికల వ్యవస్థకి తాత, తండ్రి, కొడుకు అనే మూడు తరాలకి చెందిన ఓ పేద కుటుంబాన్ని సాక్ష్యంగా తీసుకొని ఓటు హక్కుపై ఎలా స్పందించారో ఉదహరిద్దాం.
మొన్నటి తరానికి చెందిన తాత తన ఓటు తనది కాదని మానసికంగానే నమ్మాడు. *దొరా, మీ బాంచన్, మీ కాల్మొక్తా! ఇది మీ ఓటు, మీ ఇష్టమే* అని గ్రామదొరతో చెప్పాడు. ఓటు దొరదేనని చెప్పిన ఓటరు యొక్క ఓటు కోసం ఆ దొర పైసా ప్రతిఫలం చెల్లించే అవసరం రాలేదు. ఆ తాత స్వార్ధం లేని "ఆదర్శ ఓటరు" గా పేరొందాడు.
గ్రామదొరతో నిన్నటి తరానికి చెందిన తండ్రి *బాబూ, ఇది నా ఓటే, కానీ మీ ఇష్టం* అన్నాడు. *నీ ఓటును నా యిష్ట ప్రకారం వేసినందుకు ఈ మందూ, ఓ విందూ ఇస్తున్నా* అన్నాడు నిన్నటి తరం తండ్రితో గ్రామబాబు.
ఈరోజు మూడో తరానికి చెందిన కొడుకు *నా ఓటు- నా యిష్టం* అంటున్నాడు. పైగా *నా ఓటు కావాలంటే నాకు మీరేమిస్తారో కూడా చెప్పండి* అని సంకోచం లేకుండా ప్రశ్నిస్తున్నాడు.
ప్రతిఫలం ఆశించకుండా బానిస ధర్మంతో ఓటు వేసి, తమ ఉచిత ఓటుతో దొరను గెలిపించడమే కాకుండా ఆ విజయానికి మురిసి స్వంత డబ్బుతో త్రాగి దొర ఎదుట జైకొట్టాడు మొన్నటి ఓటరు. ఆయనే మొన్నటి తాత.
అందుకు భిన్నంగా ఆ బాబు ఇచ్చే నోటుతో మందు త్రాగి ఓటు వేసిన వాడు నిన్నటి ఓటరు. ఆయనే కొడుకు.
పై రెండు తరాల ఓటర్లకు భిన్నంగా నేటి ఓటరు స్పృహ ఉండడం గమనార్హం. అది దారితప్పినా ఓ ముందడుగు వేసినట్లే! ఒక కుటుంబంలో మూడు తరాలలో వచ్చిన పరిణామక్రమాన్ని శాస్త్రీయ దృష్టితో విశ్లేషించాలి.
ఈ వ్యవస్థ మనుగడకి అవసరమైన ఉత్పత్తుల్ని సృష్టించే కార్మిక, కర్షక, కూలీ వర్గాల ప్రజలే నేడు పేదరికం, దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అజ్ఞానం, వెనుకబాటు తనాలకి చిరునామాగా వున్నారు. ఈ పునాది వర్గాల ప్రజలలో కూడా అత్యధికులు దళిత, బహుజన, ఆదివాసీ, మైనార్టీ ప్రజలే! వీరికి తరతరాల అణిచివేత, దోపిడీ, పీడన, వివక్షతలను అనుభవించిన దుర్భర నేపథ్యం వుంది. తనకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే స్పృహ సైతం లేని తాత, తండ్రుల దుర్భరస్థితితో పోల్చితే ఏదో మేరకు మార్పు వచ్చింది. నేటి తరం కొంతైనా సంతృప్తి పొందడంలో ఒకింత న్యాయం ఉంది. దీనిని మరో కోణంలో చూస్తే అదో ధిక్కార చైతన్యంగా కూడా చెప్పొచ్చు. అది సరైన రాజకీయ చైతన్యం కాకపోవచ్చు. దారితప్పిన చైతన్యమే కావచ్చు. కానీ అది దారి తప్పినంత మాత్రాన ఆ ధిక్కారతలోని సానుకూల అంశాన్ని చూడకపోవడం సముచితం కాదు.
*కార్పొరేట్ పార్టీలు గడ్డి పెడతాయి. ప్రజలెందుకు తింటున్నారు* అనే వ్యాఖ్య విజ్ఞులు, వివేకవంతుల నుంచి నేడు బాగా వినిపిస్తోంది. ఇది తెలిసో, తెలియకో ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులను కూడా కొంత ప్రభావితం చేయడం విచారకరమైనది. సమాజ మనుగడకి కర్తలైన అట్టడుగు శ్రామిక ప్రజలను గడ్డితినే అవినీతిపరులుగా భావించి ప్రతికూల దృష్టితో విమర్శ చేయడం అవగాహనా రాహిత్యంతో కూడిందే.
ఓటుకి నోట్లు విసిరే ఈనాటి కార్పొరేట్ రాజకీయ వ్యవస్ధే ప్రజల జీవితాలపై తీవ్ర దాడి సాగిస్తున్నది. తమ జీవితాల్ని ఛిద్రం చేస్తున్న అలాంటి శక్తులే ఓటుకు నోట్ల పంపిణీని ఒక దురాచారంగా మార్చాయి. ఈ సత్యాన్ని ప్రజలచే గ్రహింప చేయడం ఓ ముఖ్య కర్తవ్యం. అది ప్రగతిశీల, ప్రజాతంత్ర సంస్థలు, శక్తుల రాజకీయ బాధ్యత!
ప్రజలతో మమేకమై, వారిని ఈనాటి దోపిడీ వ్యవస్ధపై ధర్మయుద్ధానికి సిద్ధం చేసే కర్తవ్యాన్ని వారు చేపట్టాలి. అట్టడుగు సామాజిక పునాది వర్గాల ప్రజలలో ఒకసారి ప్రజాతంత్ర చైతన్యం వెల్లివిరిస్తే, 'ఓటుకి కోటి' యిచ్చినా గడ్డి పరకలా తిరస్కరిస్తారు. వారు ఈనాటి మధ్యతరగతి, విద్యాధిక మేధో వర్గాలకంటే వందరెట్లు దృఢంగా నిలుస్తారు. ఆ పని చేపట్టకుండా, కోట్లాదిమంది సామాన్య ప్రజల బలహీనతని అవినీతిగా జమకట్టితే చరిత్ర క్షమించదు.
'ఓటుకు నోటు' ఆశిస్తున్న నేటి సామాన్య ప్రజలే రేపటి చరిత్ర నిర్మాతలనే చారిత్రక సత్యాన్ని ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్ర పురోగామి శక్తులు గుర్తించాలి. ఈ అవగాహనా వెలుగులో కొత్త చరిత్ర నిర్మాణం కోసం పునరంకితం కావడానికి ఎన్నికలు కూడా ఓ సందర్భం అవుతుందని ఆశిద్దాం!