*పుత్రోత్సాహం
➖➖➖✍️
"అమ్మా ! నువ్వు ఇలా నిర్లిప్తంగా కూర్చుని ...నీ ప్రమేయం లేదు అన్నట్టుంటే ...నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు! నాన్నలేని లోటు పూరించడం కష్టమే కానీ, నీ మౌనం భరించడం ఇంకా కష్టంగా ఉంది! అన్ని ఏర్పాట్లు చేసినా ఇంకా ఏదైనామిస్ అయ్యామేమోనని మనసు పీకుతోంది. 12వ రోజు సమారాధన కోసం నాన్నకు ఇష్టమైన ఐటమ్స్ కొన్ని పురమాయించాను! నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్తే నాకు బాగుంటుంది!"
కొడుకు సురేంద్ర మాటలకు దీర్ఘంగానిట్టూర్చింది వర్ధని!
"నాకేం తెలుసురా ఏం చెప్పాలో !ఇన్నాళ్లు నాన్న ఏది చెప్తే అదే మనం చేసాం. ఆయన ఈ లోకాన్ని విడిచి పోయినా ఆయన ఇష్టాయిష్టాలు ఇంకా నువ్వు గౌరవిస్తున్నావ్ అంటే, అది మా పూర్వజన్మ సుకృతం! నీకు ఏది బాగుంది అంటేఅదే చెయ్యి నాయనా!"
"ఆయనతోనే నా జీవితం అయిపోయింది. 45 ఏళ్ల దాంపత్యంలో చిన్నపిల్లలా ఆయన చిటికెన వేలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాను. ఆయన ఏది మంచిది అంటే అదే చేశాను. నాకంటూ ప్రాథమ్యాలు, ప్రాధాన్యతలు ఉంటాయనికూడా నాకు తెలియదు! సుమంగళి గా ఉండాలని పూజలు చేశాను, నోములు నోచాను. ఇహ ఆ భాగ్యం లేకుండాపోతోంది !నన్ను బోడమ్మను చేసి ఇంట్లో కూర్చో పెడతారు! ".. ఆఖరి మాటలు అంటుంటే దుఃఖం తన్నుకొచ్చింది వర్ధనికి!
తల్లి మాటలకు కలతచెంది ఆర్ద్రతతో ఆమె తలను తన చేతులతో చుట్టి, గుండెకు పొదువుకున్నాడు కొడుకు!
"నాన్నలేకపోతే ఏంటమ్మా నేనున్నాను కదా నీకు! నేను అన్నీ చూసుకుంటాను !బెంగ పడకు!"... అంటూ మాటిచ్చాడు సురేంద్ర!
బంధుమిత్రులు, ఇరుగుపొరుగు లు ఎంత ముఖం చిట్లించినా.. తన తల్లి తన మంగళ చిహ్నాలను తీయడం లేదనిసుస్పష్టం చేశాడు!. ఎందుకో ఆమెకే మనసొప్పక మంగళసూత్రాలు, నల్లపూసలు, మట్టెలు తీసేసింది వర్ధని!
తల్లిని దర్జాగా తీసుకువచ్చి తండ్రి కూర్చునే సోఫా లో కూర్చోబెట్టాడు సురేంద్ర! వచ్చినవారు చేసేదిలేక కాస్త జీలకర్ర నోట్లోవేసుకుని , ఆమెను పలకరించి భోజనాలకు లేచారు!
సురేంద్ర అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ గా ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నాడు. అతనితో పనులు చేయించుకున్న వారు, పనులు ఉన్నవారు , ఉపకారాలు పొందినవారు అతని దృష్టిలో పడడానికి...ఇదో ఒక మంచి అవకాశంగా భావించారు! బస్తాలతో కూరలు బుట్టల తో పళ్ళు డబ్బాలతో నేతి స్వీట్లు, మిఠాయిలు, కేన్ల కొద్దీ పాలు, పెరుగులు నెయ్యిలు, బస్తాలతో బియ్యం, అపరాలు ఒక్కటేమిటి అవసరానికి మించి వంద రెట్లు తెచ్చిపడేసారు ఇంటినిండా!
ఎవరేంటి తెచ్చినా కాదనలేదు సురేంద్ర! పరోక్షంగా అవి కొందరు అసహాయుల పోషణార్ధం పనికి వస్తాయనుకున్నాడు!
దాన ధర్మాలు, బ్రాహ్మణ దక్షిణలు భూరిగా ఇచ్చుకుని.. నలుగురు ‘ఆహా’ అని అనుకునే లాగా పూర్తిచేశాడు పితృకార్యాన్ని సురేంద్ర! ఇంటి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లో వెయ్యి మందికి పైగా సంతర్పణ భోజనం చేశారు! మరో వెయ్యిమందికి వండించి, శివార్లలో ఉన్న వృద్ధాశ్రమాలకు పంపించాడు సురేంద్ర! మిగిలిన సామానులు...కొంత విరాళం జోడించి..పిల్లలహోమ్ కు పంపేసాడు!
రెండు రోజుల్లో బంధువుల నిష్క్రమణతో ఇల్లు ఖాళీ అయిపోయింది! సెలవు అయిపోవడంతో కూతురు ఢిల్లీకి ప్రయాణం కట్టింది! వెళ్లేముందు పదేపదే తల్లి చుట్టూ తిరుగుతూ..." నాన్న నా గురించి ఏదైనా చెప్పారా ? నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అమ్మ.. " అంటూ అన్యాపదేశంగా ఏదో అడగాలని ప్రయత్నిస్తోంది! తల్లిని తనతో రమ్మని అడిగే ధైర్యం ఆమె చేయలేకపోతోంది!
ఆ మహానగరంలో తల్లికి అదనపు సౌకర్యాలు కలగజేసే పరిస్థితులు ఆమెకు ప్రస్తుతం లేవు! పైగా కొండంత కొడుకు అండ వదిలి తల్లి తనతో వస్తుందన్న ఆశ కూడా , ఆమెకు లేదు!
వర్ధనికి కూతురు ఆంతర్యం అర్థమయ్యింది! కోడల్ని పిలిచింది! "స్వర్ణా! లాకర్ లో ఉన్న నా బంగారాన్ని నువ్వు సగంతీసుకుని, మిగిలిన సగం మీ ఆడపడుచు కియ్యి".. అంటూ బ్యాంకు లాకరు తాళం కోడలు చేతిలో పెట్టింది!
"బంగారంలో సగమే అంటే.. ఈ ఇంట్లో కూడా నాకు సగం ఇచ్చి తీరాలి".... అంటూ... మొహం గంటు పెట్టుకుంది కూతురుధరణి!
వర్థని జవాబిచ్చే లోగానే, సురేంద్ర అక్కడ ప్రత్యక్షమయ్యాడు! “స్వర్ణా! అమ్మ కు తాళం ఇచ్చేసేయ్! ధరణి! అమ్మ ఇప్పుడుబంగారం పంచేసేది ఏమీ లేదు! అవన్నీ అమ్మకు కావాలి! నాన్న పోవడంతో, అమ్మ జీవితమేమీ ముగిసిపోలేదు! ముందు ముందు... తన చేతుల మీద జరగాల్సిన శుభకార్యాలు ఉన్నాయి! ఈ ఇల్లు కానీ, ఈ నగలు కానీ అమ్మ తనచివరి క్షణం వరకు అనుభవించి ..తన తదనంతరం ఆమె కోరుకున్న వారికి ఇచ్చే హక్కు... పూర్తిగా తనదే! ఢిల్లీలో నీ ఫ్లాట్ కోసం పదేళ్ల క్రితమే డబ్బు తీసుకున్నావు! ప్రస్తుతం అమ్మకు మిగిలి ఉన్న ఈ కాస్త ఆస్తి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు! ఇంటి ఆడపిల్లగా నీకు న్యాయమే చేస్తాం! నీ పుట్టింటి మీద నీకున్న హక్కులన్నీ అలాగే భద్రంగా ఉంటాయి! ఆనందంగావస్తూ పోతూ... పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళు! అమ్మని మాత్రం బాధ పెట్టొద్దు ఏవిధంగాను!" కాస్త గట్టిగాచెప్పాడు సురేంద్ర!
పక్క గదిలో పెట్టెలు సర్దుకుంటున్న అల్లుడికి ఈ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి! వచ్చినప్పటి నుండి చూస్తున్నాడు. సురేంద్ర ఎంత శ్రద్ధగా పితృకార్యం చేసాడో, ఎంత ఆత్మీయంగా తల్లినీ, ఇతర బంధువులనూ ఆదరిస్తున్నాడో! తల్లి పట్ల సురేంద్ర చూపిస్తున్న ప్రేమ... తన నిబద్ధతను నిలదీసినట్టు గా అనిపించింది అల్లుడికి!
ఉద్యోగంలోనూ, హోదా లోను, ఆస్తి లోనూ సురేంద్ర కు ఏ మాత్రం తక్కువ కాదు తను! కానీ తండ్రి పోయినపుడు అపరకర్మలన్నీ “మమ” అనిపించి, గయలో పిండం పెట్టి చేతులు దులుపుకున్నాడు! ఒక్కగానొక్క కొడుకు గా తన తల్లినిఆదరించక పోగా, అన్ని వసతులు ఉన్న రిటైర్మెంట్ హోమ్ లో పెట్టి తన బాధ్యత తీరింది అనుకుంటున్నాడు! భార్య చేతిలో తోలు బొమ్మలా ఆడుతూ తల్లిని దూరం చేసుకున్నాడు తను!
ఈరోజు సురేంద్ర మాటలు వింటుంటే, అతనిలో..మాతృ వాత్సల్యం నిద్ర లేచింది ! ఏదో దిశానిర్దేశం జరిగినట్లు అనిపించింది!
దిగ్గున లేచి పక్క గదిలోకి వెళ్ళాడు! సురేంద్ర భుజంమీద స్నేహంగా చేతితో తట్టి, ”సురేంద్ర నువ్వు చెప్పింది అక్షరాలనిజం ! నీ లాంటి కొడుకు ఉంటే ఏ తల్లి అయినా భర్త లేకపోయినా నిబ్బరంగా గుండెల మీద చెయ్యి వేసుకునిబ్రతకగలదు! చెప్పాలంటే ధరణికి ఏమి లోటు లేదు! ఇలా తండ్రి పోయిన వెంటనే పుట్టింట్లో తన హక్కులను సాధించుకోవడం అంత మంచి పని కాదు! తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను! అత్తయ్య గారు! మీరు ఎలాంటిబెంగ పెట్టుకోకుండా హాయిగా ఆరోగ్యంగా ఉండండి !మేము ప్రతి రోజు మీతో మాట్లాడుతూ ఉంటాం! ఏ అవసరం వచ్చినా, ధరణి మీకు సహాయంగా వస్తుంది! ఇది నా మాటగా తీసుకోండి!".. మనసు నిండుగా, ఆదరంగా మాట్లాడిన అల్లుడినిచూసి చాలా నిశ్చింతగా అనిపించింది వర్ధనికి!
మర్నాటి కల్లా ధరణి వెళ్ళిపోయింది! తల్లికి... తమ ఇంట్లో ..గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేటటువంటి మంచిగదిని అన్ని సౌకర్యాలతో... తయారుగా ఉంచమని ...స్వర్ణను, పిల్లలను ఇంటికి పంపేసాడు సురేంద్ర! తల్లి కొడుకుల మాత్రమేమిగిలారు ఆఇంట్లో! ఆ రాత్రంతా తండ్రి స్మృతులను తల్లి తో వల్లె వేశాడు సురేంద్ర! మౌన శ్రోతగా అన్నీ వింటూకూర్చుంది వర్ధని! ఆ స్మృతులలో వీలయినన్ని మంచివే ఏరి మాట్లాడుతూ ఎన్నో చేదుజ్ఞాపకాల ప్రసక్తే తేని కొడుకు సంస్కారానికి ముగ్దురాలయింది ఆమె!
ఆమె మరో ప్రస్థానంలో మొదటి ఉషోదయం అయ్యింది! ఆరింటికి తల్లి ఇచ్చిన కాఫీ తాగి.. "అమ్మా! కావలసినవన్నీ సర్దేసు కొన్నావు కదా! మరో గంటలో బయలుదేరాలిమనం! ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆఫీస్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది! "... అన్నాడు సురేంద్ర!
కొన్ని క్షణాల మౌనం తరువాత...." నేను కొన్నాళ్ళు ఇక్కడే , మన ఇంట్లో ఉందామని అనుకుంటున్నానురా! ఇల్లుపాడుపెట్టడం నాకు ఇష్టం లేదు"... తడబడుతూ చెప్పింది వర్ధని కొడుకుతో!
"ఇల్లేమీ పాడవదు అమ్మా! పని వాళ్ళని పంపి బాగు చేయిస్తూ ఉంటాను! నువ్వు ఒక్కతివే ఒంటరిగా ఇక్కడ ఉండలేవు !నాన్న జ్ఞాపకాలు నిన్ను వదలవు! నువ్వు మాతో ఉండడమే సరి ! నాకు కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది!" అన్నాడు సురేంద్ర!
"లేదు నాన్నా.. నన్ను అర్థం చేసుకో! నేను ఉండగలను! కొత్తమార్పులను వెంటనే తీసుకోలేను! నాకు కొంచెం సమయంకావాలి! ప్లీజ్!".... అంటూ బేలగా అభ్యర్ధించింది కొడుకును!
బేలగా అన్నా... తల్లి మాటల్లోని దృఢత్వాన్ని గుర్తించాడు అతను! తన మాటలతో ఆమె నిర్ణయం వీగిపోదని అర్థంఅయింది! ఎక్కువ రెట్టించకుండా
"సరే అమ్మా! నీ ఇష్టం! ఏ అవసరం ఉన్నా క్షణాల్లోనే నీ ముందుంటా!” అని, తల్లికిమాటిచ్చి సురేంద్ర కూడా వెళ్ళిపోయాడు!
ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయింది! పెద్దగా దిగులు అనిపించలేదు వర్ధనికి! తోటలోకి వెళ్ళింది. అడ్డదిడ్డంగాపెరిగి, వ్యాపించిపోయిన కొమ్మలతో...
రకరకాల మందారాలూ, నిత్యమల్లిచెట్లు, వందేళ్ళనాటి ఫలసాయంలేని చెట్లు... తోటంతా నీడలు పరుస్తూ! ఆ చెట్ల వలన ఇరుగుపొరుగులతో శాశ్వత శతృత్వాలు! అయినా మారని భర్త మొండివైఖరి తలుచుకుని భారంగా నిశ్వసించింది వర్ధని.
ఎంత విచిత్రమయిన మనిషో ఆయన. తా పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనే వ్యవహారం! పురాతనమయిన భావాలూ, ఆచారాలు! పొదుపు పేరిట అతికూడిక... ఇంటి ఆడపడుచులకు కూడా పూచికపుల్ల ఇవ్వనంత! అత్తగారి ఇత్తడి సామాన్లు, రాచ్చిప్పల్లో వంట. పెళ్ళయిన ఇరవై యేళ్ళకు వరకూ కుంపటి వంటే! ఆరోగ్యం పేరు చెప్పి పత్యపు తిండి. నెలకు కేజీ నూనె వాడకం కూడా ఎక్కువే! తన పుట్టిల్లు మధ్యతరగతయినా... సుష్టుగా అన్ని ఆధరువులతో భోంచేసేభోజనప్రియులు! “
“కొడుకు చేతికందే వరకూ ..ఏడాదికి మూడుచీరలే! పోనీ లేదా పోదా అంటే.. ఎగువమధ్యతరగతి నేపధ్యం. మంచిజీతమొచ్చే ప్రభుత్వ ఉద్యోగం! తన అభిప్రాయాలసాధనలో ఒకరకమైన నిరంకుశత్వం ఆయనది! తనకంటూ బంధువులూ, స్నేహబాంధవ్యాలూ నెరిపే అవకాశం ఇవ్వకుండా... ఇంటిని పుస్తిని చేసిన మహానుభావుడు ఆయన!”
“మెరిట్ లో మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్న సురేంద్రను , డాక్టర్ అవ్వడానికి పదేళ్ళు పడుతుందని, మెడిసిన్ చెయ్యనివ్వకుండా, బలవంతంగా
బీ. ఫార్మసీ లో పెట్టారు. ఇరవై యేళ్ళకే ఇంట్లోంచి బయటకెళ్ళిపోయి, స్కాలర్ షిప్స్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ, తండ్రి నుండి ఆర్ధికసహాయం ఆశించకుండా ఎంతో పైకి వచ్చాడు కొడుకు. తండ్రి దూరంచేసుకున్న బాంధవ్యాలను తన ఆత్మీయతతో దగ్గర చేసుకున్నాడు. తను జీవితంలో ఎదుగుతూ, ఎందరికో చదువులకూ, ఉద్యోగాలకూ చేయూతనిచ్చాడు. “
“చెప్పాలంటే కొడుకుని చూసే ఇప్పుడు తమను బంధువులు గౌరవించే స్థాయికి , నైతికంగా , సామాజికంగా ఎదిగాడుసురేంద్ర! కూతుర్ని నెత్తిమీద దేవతలా చూస్తూ, ఆడింది ఆట పాడింది పాటగా సాగించి, కొడుకును మాత్రం ఆంక్షల సంకెళ్ళతో అనుక్షణం క్రమశిక్షణ పేరిట దండిస్తూ, అవమానిస్తూ ఉన్న తండ్రికి ఎప్పుడూ గౌరవం తక్కువ చెయ్యలేదు ! తండ్రి మూర్ఖత్వం, నిరంకుశత్వం వలన తను ఎన్నో కోల్పోయినా, ఒక్కరోజూ తండ్రిని ద్వేషించలేదు! ఆయన ఇన్నేళ్ళకు కళ్ళుతెరిచి, వాడి మంచితనం అర్ధమయ్యి, కాస్త మృదుత్వం అలవాటుచేసుకుని, కొడుకుతో అనుబంధం పెంచుకునేసమయానికి ... మనిషే లేకుండా పోయారు! “....వర్ధని ఇలాంటి ఆలోచనలతోనే రోజులు గడిపేస్తోంది.
“ఇప్పుడు తనకు కావలసినది వండుకునే స్వేచ్ఛ ఉంది. కానీ తినడానికి మనసే లేదు. ఎక్కడికయినా వెళ్ళే స్వతంత్రంఉంది. కానీ ఎక్కడికెళ్ళాలో తెలీదు. “ఎంత పరాధీన తను! “.... వేము తిన్నంత చేదు ఆమె మనసులో! వారం కన్నాఎక్కువ ఉండలేకపోయింది ఆ ఇంట్లో ఒంటరిగా! దానికి పరిష్కారమూ సురేంద్రే చేసాడు.
మంచి ప్రణాళికతో... అన్ని ఏర్పాట్లూ చేసి, వర్ధనినీ, తమతోనే వుండే అత్తగారినీ, ధరణి అత్తగారినీ, ఇద్దరు మేనత్తలనూ కాశీ, ప్రయాగ, చార్ ధామ్, వైష్ణోదేవి యాత్రలకు పంపించే ఏర్పాటుచేసాడు!
భర్త పోయి నెలరోజులవ్వక మునుపే యాత్రలంటే లోకం నవ్వుతుందని... వర్ధని ససేమిరా అనేసింది. సురేంద్ర తల్లితోఒకటే అన్నాడు! “అమ్మా! జీవితం చాలా చిన్నది. ఇప్పటికే అరవైయేళ్ళు అసఫలంగా, పంజరంలో చిలుకలా గడిపేసావు. ఇక నుంచి ప్రతిక్షణం, నువ్వు కోల్పోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోవాలి! చేద్దామనుకున్నవీ, చూద్దామనుకున్నవీ మొదలుపెట్టాలి! నీకు నేనున్నానమ్మా! జీవితం మళ్ళీ మొదలుపెట్టు!! వెళ్ళిపోయిన వారి గురించి వగస్తూ కూర్చుని లాభంలేదు” అంటూ తల్లికి ధైర్యం చెప్పాడు!
వర్ధనికి తన జీవితంలో రెండవ అధ్యాయంమొదలయ్యింది!
రెండునెలల యాత్రలు, మరో రెండునెలలు ధరణి దగ్గర గడిపాకా.... సంతృప్తి చెందిన మనసు, మొట్టమొదటిసారి లోకాన్ని చూసిన ఆనందం, తన చుట్టూ ఇంత నాగరికత ఉందా అన్న విభ్రమంతో తిరిగివచ్చింది వర్ధని.
ఇల్లు బాగుచేయిస్తున్నానని, తల్లిని తమింట్లోనే పెట్టాడు సురేంద్ర! స్వర్ణతల్లి విద్యావంతురాలు, మంచి క్రియాశీలకురాలు. వర్ధనికి ఓపిగ్గా వివరిస్తూ...ఫోన్ లో ఫేస్ బుక్, వాట్సప్ పరిచయం చేసింది. ఎందరో పరోక్ష మిత్రబృందాలతో, సాహితీసౌరభాలతో వెలుగులీనే ఫేస్ బుక్ వర్ధనికి చక్కని కాలక్షేపంగా మారింది.
కొడుకు సేకరించిన ఎన్నో అపురూపమైన పుస్తకాల నిధి మరో పెన్నిధి అయ్యింది ఆమెకు. భర్త తనలో పెంచి, పోషించిన నిర్లిప్తత, నిరాశ, విరక్తి.... మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి! జీవితం నవనవోన్మేషంగా మారుతోంది. పిల్లలూ, పువ్వులూ, పుస్తకాలూ, పరిసరాలూ ఎన్నోనేర్పుతున్నారు!
తండ్రి సంవత్సరీకాలు కూడా ఎంతో శ్రద్ధగా పూర్తిచేసాడు సురేంద్ర! మాఘమాసం రాగానే, “రా అమ్మా! నీ ఇల్లుచూసుకుందువు గాని”... అంటూ వర్ధనిని బయలుదేరదీసాడు! ఆ వీధిలో బీటలువేసిన , నాచుపట్టిన గోడల్లోంచి రావిచెట్లు తొంగిచూస్తూ, అడవిలాంటి తోటతో , దిష్టిబొమ్మలా ఉండే తమ ఇల్లు- ఎంతో అందంగా, అధునాతనంగా, విశాలంగా తయారయ్యి ఉండడం చూసి, ఆమె సంభ్రమమొందింది. ముందుగా ఆమెను ఆకర్షించినది నందన వనంలాంటి తోట.
“అయ్యో! మామిడిచెట్టు, చింతచెట్టు ఏవిరా?”.... అంది కొడుకుతో! “అమ్మా! నేను కొన్నిరోజులు వాటితో మాట్లాడానమ్మా. మీరు పెద్దవారయిపోయారు. మీవలన ఈ స్వార్ధపూరిత అనాగరికులకు ఇబ్బందిగా ఉంది. మీ అనుమతితో మిమ్మల్ని తొలిగించవచ్చా! మీ కొమ్మలకు అంట్లు కట్టించి... నా తోటలో మీ వంశాన్ని కొనసాగిస్తా!”.... అంటూ వాటిని ప్రార్ధించేవాడినమ్మా! నమ్మూ, నమ్మకపో.... అవి రెండునెలల్లో వృద్ధాప్యం వచ్చినట్టు పూర్తిగా వడలిపోయి, మోడులయ్యాయి! అప్పుడే వాటిని కొట్టించి, ఆ కలపంతా మనింటికే వాడాను.“ అన్నాడు సురేంద్ర!
వర్ధనికి ఏమీఆశ్చర్యం అనిపించలేదు. కొడుకు అచ్చం తన పోలికే! కష్టమొచ్చినపుడు ఆ మాకులతోనే పంచుకునేది. అవి కూడా విన్నట్టేఉండేవి!
క్రింద మూడు, పైన మూడు అత్యంత సౌకర్యకరమైన పడకగదులు వేయించాడు. లేలేత భానుకిరణాలు పడుతుంటే ధ్యానం చేసుకోవడానికి అనువుగా చక్కని సన్ రూమ్ , తను కోరుకునే విధంగా.. విశాలమయిన పూజామందిరం, అందమైన తంజావూరు దేవతామూర్తుల పటాలతో మనోజ్ఞంగా చేయించాడు! అన్నిటికన్నా మిన్న వంటగది! మొత్తం అధునాతనంగా, సౌకర్యంగా! ఆనుకున్న పాంట్రీలో.... అన్ని వరుసల్లో... రకరకాల సైజుల్లో... అమర్చినస్టీలుడబ్బాలను, గాజుసీసాలను చూసి... వర్ధని కళ్ళలో మెరుపు, పెదాల మీద చిన్నచిరునవ్వు మెలిచాయి! ఇవన్నీ భర్తహయాంలో తన తీరని కోరికలు! సరుకులన్నీ చిన్నచిన్న పొట్లాలు కట్టించి, చెక్కబీరువాలో పెట్టించి తాళం వేసే వారాయన- తను దానధర్మాలు, దుబారా చేస్తుందని!
“నా కొడుక్కు అన్నీ తెలుసు తన గురించి! తన మనసులోని ప్రతి భావన, స్పందన, కోరిక, ఉద్వేగం...సమస్తం ఎరుకే ఈ పిల్లవాడికి!”... అనుకుంటూ
ఆ అమ్మమనసు పుత్రవాత్సల్యంతో ఉప్పొంగిపోయింది!
ఒక మంచిరోజు తల్లిని యజమానురాలి హోదాలో... గౌరవంగా ...తమజంటతో సమానంగా,పీటలమీదకూర్చుండపెట్టి గృహప్రవేశం చేయించాడు సురేంద్ర! తండ్రి తదనంతర ఆస్థులన్నీ తల్లి పేరిటకు మార్పించాడు! వర్ధని, స్వర్ణ తల్లితో పాటూ... ధరణి అత్తగారు కూడా ఆ ఇంటికే మారిపోయారు! ఇంట్లో పనులకు, వంటకు హెల్పర్స్ ను పెట్టాడు. వారికి సౌకర్యవంతంగా ఉండే విశాలమైన కారు కొని, డ్రయివర్ తో సహా, గుమ్మంలో పెట్టాడు! మేడమీద కు స్వర్ణా, పిల్లలతో... దిగిపోయాడు!
గృహప్రవేశం నాడు మేనత్తలు ముగ్గురినీ పిలిచి, వారు గతంలో అన్నగారిని అడిగి, భంగపడ్డ తమ తల్లిగారిబంగారం, మూడెకరాల భూమిపత్రాలు వారి చేతిలో పెట్టి,...” అత్తా! ఇది మీ అందరి ఇల్లూ కూడా! మీకు కావలసినన్నిరోజులు ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకోండి. మీకు ఏ అవసరానికయినా ఈ మేనల్లుడు ఉన్నాడని మర్చిపోకండి!”.... అంటూ ఆప్యాయంగా చెప్తుంటే.... వాళ్ళు కన్నీటితో...పరమానందభరితులయ్యారు!
“వదినా! నీ కడుపున రాములవారే పుట్టారు వీడి రూపాన! మా అన్నయ్యకు ఈ పుత్రోత్సాహం చూసే యోగం లేదు. వీడిని రాముడని ఎందుకు అన్నామంటే, ఒకవేళ దశరధుడు , కౌసల్య తన తోనే ఉండివుంటే.. సంపద ఉన్నా, లేకపోయినా... అయోధ్యలో నయినా , అడవిలోనయినా రాములవారు తల్లితండ్రులను ... అదే ప్రేమతో, వైభవంతో, అక్కరతో... లోటనేది రానీయకుండా చూసుకుని వుండేవారు నీ కొడుకులా!”...అంటూ... ఆ కన్నతల్లి కడుపు సంతోషంతో నింపేసారు!
ఆ విధంగా తల్లికి స్వయంప్రతిపత్తిని కల్పించి, సాధికారంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి మార్గం సుగమం చేసిపెట్టాడు సురేంద్ర! తల్లి మనసులో తండ్రిచేసిన ప్రతి అవమానాన్ని, ప్రతి గాయాన్ని తన బాధగా అనుభవించాడు అతను ఇన్నాళ్ళూ! తనకు శక్తి ఉన్నా... కొడుకు స్వార్జితంతో పూచికపుల్ల కూడా ముట్టననే తండ్రిఅసహనంతో, విచిత్ర వైఖరితో సర్దుకుంటూ...అతను పడ్డ మనక్షోభ ఇన్నాళ్ళకు ఉపశమించింది. ఆయనకు సజీవంగా ఏమీ చెయ్యలేకపోయినా, ఆయన మరణానంతరం ఆయన పేరిట పేదవిద్యార్ధులకు స్కాలర్ షిప్, వృద్ధాశ్రమాలకు విరాళాలరూపంలో ఇస్తూ... పితృూణం తీర్చుకుంటున్నాడు!
ఇది మలుపులున్న కధ కాదు! కానీ ఆదర్శవంతుడైన ఒక కొడుకు కధ! ఎందరో స్ఫూర్తిగా తీసుకోవలసిన ఒకనీతికథ! తల్లిదండ్రులు, సమాజం నాకేమిచ్చిందని... ప్రశ్నించకుండా... ‘వీరికి నేనేమి చెయ్యగలను’... అని ఆలోచిస్తూ , బాధ్యతలు సక్రమంగా, సంతోషంగా నిర్వహిస్తూ, కార్యాచరణలో పెట్టే క్రియాశీలి కధ!
పుత్రోత్సాహము తండ్రికీ
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగా
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏