22, జనవరి 2023, ఆదివారం

మాఘ పురాణం*_ _*1 వ అధ్యాయము*

 🌴🌹🌷🌞🛕🌞🌷🌹🌴

*ఆదివారం 22 జనవరి, 2023*


      _*మాఘ పురాణం*_

    _*1 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మాఘ మాస మహిమ*


☘☘☘☘☘☘☘☘


*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*

         ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బహు గణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలాగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము నొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది. గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను , వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.

రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. *ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు*. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగవా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*


దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమున చేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము (వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయునను కొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కేగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియొక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

*ఒకటవ అధ్యాయం సమాప్తం* 

🌴🌹🌷🌞🛕🌞🌷🌹🌴

మాఘ మాసం

 🌴 *మాఘ మాసం*🌴

     🍃_*విశిష్టత*_🍃


🔯మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *_శుక్ల పక్ష చవితి_* దీనిని *_తిల చతుర్థి_* అం టారు. దీన్నే *_కుంద చతుర్థి_* అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు 

*_దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!_*

అని చేసిన తరువాత 


*_సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!_* 


అని చదవాలి. 


*_సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి._*


ఈ మాసాన్ని *_కుంభమాసం_*  అని కూడా అంటారు.కొంతమంది *_ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు_*


.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. 


*_మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి_* అంటారు.

ఈ పంచమి నాడే *_సరస్వతీదేవి_* జన్మించిందట. 


ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.


అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక 


*_మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"_* అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి. సూర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున *_అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట_*. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. *_నమస్కారం ప్రియ:సూర్య:_* అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున *_చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం_*.


సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం *_సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్_* అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో *_మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట._* స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణాలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. *_భీష్మ ఏకాదశి_* నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే *_ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే._* ఈ విధంగా *_మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే._*


🌴🌹🌷🌞🛕🌞🌷🌹🌴

 🍁 మాఘ స్నానం శ్లోకం 🍁


*దుఃఖ దరిద్ర నాశాయ*

*శ్రీ విష్ణో తోషణాయచ*

*ప్రాతః స్నానం కరోమ్యత్య*

*మాఘే పాప వినాశనం*


🌞 *సూర్యోదయం కంటే* *ముందే పై👆శ్లోకం పఠిస్తూ* 

*స్నానం చేయడం అత్యంత* 

*పుణ్యప్రదం, 🙏మహాదేవ*

🌴🌹🙏🌞🛕🌞🙏🌹🌴

సంక్రాంతి పండుగ

 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది.


అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.

 

1935 నుండి 2007 వరకు జనవరి 14న,

2008 నుండి 2080 వరకు జనవరి 15న,

2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.


ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు నుండి మిధునరాశి లోకి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు.


ఇక, సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.


ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. జనవరి 16న సంక్రాంతి రావడం ఎలాగూ మనం చూసే అవకాశం లేదు.


👆 పొద్దున్నే ఓ జ్ఞానగుళిక..😆😆

దేవుడే ప్రభువు

 దాస భూతమిదం తస్య జగస్థావర జంగమం

శ్రీమన్నారాయణ స్వామీ జగతాం ప్రభురీశ్వరః (పద్మ పురాణం)


"సమస్త సృష్టికి ఆ దేవుడే ప్రభువు; చర-అచర ప్రాణులు, వస్తువులన్నీ అతని సేవకులే". ప్రాపంచిక భౌతిక విషయాసక్తి - "నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నేనే యజమానిని. ఇదంతా నా సుఖం కోసమే. నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది" - అనే ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది. దీనికి విరుద్ధమే ఆధ్యాత్మిక చైతన్యం. అది ఈ విధమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది, "భగవంతుడే సమస్త జగత్తుకి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం అతని నిస్వార్ధ సేవకుడిని/సేవకురాలిని. నాకున్న దాన్ని అంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి. " అని. ఆప్రకారముగా, తనే తన కర్మల ఫలములను అనుభవించేది అని అనుకోరాదు. 

ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో (2-47)

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి||

(శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ ఆ‌ కర్మ‌ ఫలములపై నీకు ఎటువంటి హక్కు లేదు. నీవే ఆ కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోకు. అలా అనుకుని చేయవలసిన కర్మలు మానుటయందు ఆసక్తి చూపరాదు) అని అర్జునునికి జ్ఞాన బోధ చేశారు.

విశ్వమంతా ఎవరి కడుపులో ఉందో

 శ్లోకం:☝️

*నిర్మలస్య కుతః స్నానం*

 *వస్త్రం విశ్వోదరస్య చ ।*

*అగోత్రస్య త్వవర్ణస్య*

 *కుతస్తస్యోపవీతకమ్ ।।*


భావం: సదా పవిత్రంగా ఉండేవాడికి స్నానం వల్ల ప్రయోజనం ఏమిటి? విశ్వమంతా ఎవరి కడుపులో ఉందో వాడికి బట్టలెలా కట్టాలి? గోత్రం, వర్ణం లేనివాడు యజ్ఞోపవీతం ఎలా ధరిస్తాడు. అని పరమాత్మను వర్ణిస్తోంది ఈ శ్లోకం.