🌹🌷🏹🪔🛕🪔🚩🌷🌹
*🌞ఆదివారం 13 ఏప్రిల్ 2025🌞*
*రామాయణం*
ఒకసారి చదివినంత మాత్రాన
మన సమస్త పాపాలని తీసేస్తుంది...
*వాల్మీకి రామాయణం*
*7 వ భాగం*
```
అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు, ఆ ప్రాంతం ఫలాలు, పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు… “పూర్వకాలంలో బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, ‘మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి” అని ఆదేశించాడు.
అప్పుడు వాళ్ళు కౌశాంబీ, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది, శోణానది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది, అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.
కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరు కుడా ఘ్రుతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి… “మీరు చాలా అందంగా ఉన్నారు, కాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతోకాలం ఉండలేరు, కొంత కాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది, కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్ళిచేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు” అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు.
వెంటనే ఆ నూరుగురు కన్యలు ఏక కంఠంతో...```
*”కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |*
*స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||*
*మా భూత్ స కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |*
*అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||*
*పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సః |*
*యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి ||*```
మాదగ్గర అపారమైన తపఃశక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము, మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జరిగితే, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము, ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు” అని ఆ కన్యలందరూ ఏక కంఠంతో చెప్పారు.
వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు, దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.
తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరికి వెళ్లి జరిగినది చెప్పారు.
అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, “అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని...```
*క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః |*
*క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||*```
స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు, మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు, అందం అంటే ఇదే. ఓర్పే దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే, ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది” అని చెప్పాడు.
అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో... “నేను నీకు ఏమిచెయ్యగలను” అని అడిగారు.
అప్పుడామె.... “నేను ఎవరికీ భార్యని కాను, కాని అపారమైన తపఃశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి” అని అడిగింది.
అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారు.
పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వాళ్ళు మళ్లీ పూర్వ సౌందర్యాన్ని పొందారు.
అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది” అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.
ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు.
*రేపు...8వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
.