27, అక్టోబర్ 2022, గురువారం

రామాయణానుభవం_ 202*

 *రామాయణానుభవం_ 202* 


సౌమిత్రి మళ్ళీ విజృంభించి ఇంద్రజిత్తు ధనుస్సును విరగగొట్టాడు. కవచంచీల్చి బాణాలు నాటాడు. వాడు రక్తం కక్కుకుంటూనే మరోధనుస్సు అందుకొని తీవ్రబాణాలతో రామానుజుణ్ని హింసించాడు. అప్పుడు లక్ష్మణుడు రెండు బాణాలతోరథసారధి కాళ్ళు విరగగొట్టాడు. మరొకబాణంతో శిరస్సు ఎగరగొట్టాడు. సారథి లేని అశ్వాలు మండలాకారంలో రథాన్ని త్రిప్పుతూ అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఆ సమయంలో అన్ని గుర్రాలనూ అన్నే బాణాలతో ఒకేసారి సౌమిత్రి సంహరించాడు.


ఇది పెద్ద అవమానంగా భావించి ఇంద్రజిత్తు మూడు బాణాలను సౌమిత్రి గుండెలకు గురిచూసి వదిలాడు. అతడిది అభేద్యకవచం అని తెలుసుకొని మరో మూడు బాణాలను నుదుటికి తగిలేట్టు వదిలాడు. అవి నాటుకొని సౌమిత్రి తల మూడు శిఖరాలున్న పర్వతంలా కనిపించింది.


అప్పుడు సౌమిత్రి వారుణాస్త్రం ప్రయోగించగా దానిని రౌద్రాస్త్రంతో త్రిప్పికొట్టి ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రం వేసాడు. లక్ష్మణుడు మళ్ళీ వారుణం ప్రయోగించి చల్లార్చాడు. రావణి ఆసురాస్త్రం ప్రయోగించగా రామానుజుడు మాహేశ్వరాస్త్రంతో మళ్ళించాడు. ఋషులు, దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, గరుడులు, ఉరగులు అంతా దేవేంద్రపురస్సరంగా ఆకాశంలో రక్షగా నిలిచి శుభవీక్షణాలు అందిస్తూండగా లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని సంధించాడు. నరశ్రేష్ఠుడు ధనుః శ్రేష్టానికి శరశ్రేష్ఠం సంధించాడు. మనస్సులో అన్నగారిని తలుచుకున్నాడు.


*ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది*

*పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్*


శ్రీరామచంద్రుడు- మా అన్నగారు ధర్మాత్ముడయితే, సత్యసంధుడైతే, పౌరుషంలో సాటిలేనివాడయితే ఓశరమా! ఇంద్రజిత్తును సంహరించు అంటూ ఐంద్రాస్త్రంగా అభిమంత్రించిన ఆ శరాన్ని విడిచిపెట్టాడు.


అంతే - శిరస్త్రాణంతో, ప్రకాశిస్తున్న కర్ణకుండలాలతో ఇంద్రజిత్తు శిరస్సు నేలకు రాలింది. చిరిగిన కవచంతో విరిగిన ధనుస్సుతో కళేబరమూ కూలిపోయింది. ఎగజిమ్మిన రక్తంతో వాడి తల ఎర్రగా కాల్చిన బంగారు ముద్దలా భాసించింది. చప్పగా చల్లారిన అగ్నిలాగా, కిరణాలు అణగిన సూర్యుడులాగా అయిపోయాడు.


అంతరిక్షంలో గంధర్వాప్సరసల గాన నృత్యాలూ ఋషిదేవతల ఆశీరభినందనాలూ మారుమ్రోగాయి.

** 


[ *_ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది_*

*_పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్_*


లక్ష్మణుడు చెప్పిన శ్లోకము రామాయణములోని ఒకమంత్రము. దీనిని సిద్ధి మంత్రమందురు. ఐంద్రాస్త్రమునకు కూడ శక్తిని ఒసంగినది. ఈ మంత్రము. ఇంతకు ముందు రౌద్ర,వారుణ, ఆగ్నేయాది ఆస్త్రములు వ్యర్ధమయినట్లే ఈ అస్త్రము కాకుండ చేసినది ఈ మంత్రమే దీనిలో లక్ష్మణుడు ఒక ప్రతిజ్ఞ చేయుచున్నాడు. దీనిచే రాముడు ధర్మాత్ముడని, సత్యసంధుడని, అప్రతిహతమగు పౌరుషముగలవాడవి ఋజువైనది. ఈ మూడు విషయములలో కొందరికి సందేహము ఏర్పడుచుండెను. 


వాటిని ఈశ్లోకం నివారించినది. చెట్టుచాటునుండి తన ఎదురుగ నిలిచి యుద్ధము చేయని వాలిని చంపిన రాముడు ధర్మాత్ముడా? 


తొలిరోజున పట్టాభిషేకమునకు సిద్ధపడి పట్టాభిషేకము చేసికొందునని తండ్రివద్ద ఒప్పుకొని ప్రజలవద్ద ఒప్పుకొని మరునాడు వారికి ఇచ్చినమాట తప్పి అరణ్యమున కేగిన రాముడు సత్యసంధుడా?


 ఖరునితో యుద్ధముచేయునప్పుడు ద్వంద్వయుద్ధములో మూడు అడుగులు వెనుకకు వేసిన రాముడు పౌరుషములో ఎదురులేనివాడా? 


ఈ సందేహములకు సమాధానము లక్ష్మణుని. ఈ ప్రతిజ్ఞ చెప్పినది.


రాముడు అగ్నిహోత్రుడిచ్చిన పాశయమునకు పుత్రుడుగాని దశరధునకు పుత్రుడా? అనుసందేహము కలుగునేమో అని దశరధుని శక్తి యే అందు నిక్షిప్తమయి పాయసముద్వారా రాముడు జనియించినాడు. కనుక రాముడు దాశరధియే. అంటే రాముడు దశరధుని పుత్రుడే అని ఈ ప్రతిజ్ఞఋజువుచేసినదిట. 


రామాయణమును పారాయణచేయువారు ఈ శ్లోకమును మూలమంత్రముగ జపింతురు.  ప్రతి సర్గకు ముందు చివరి కూడ దీనిని చదువుచుందురు.


ఏదైనాకార్యములో సిద్దితప్పక సిద్ధింపవలెనని కోరినవారు ఈశ్లోకమును ధ్యానించినచో జపించినచో తప్పకకార్యసిద్ధి అగును.


 రామాయణములో ఇట్టి మంత్రములు ఎన్నోఉన్నవి. అందు ఇది ప్రధానమైన మంత్రము.] *రామాయణానుభవం_ 203* 


సుగ్రీవ, విభీషణ, హనుమ, జాంబవంతులు లక్ష్మణుని అసమాన శౌర్యాన్ని వేనోళ్ల పొగిడారు.


శ్రీరాముడు లక్ష్మణుని విజయవార్తను విని అమితంగా సంతోషించాడు. ఆతనిని బిగ్గరగా కౌగిలించుకొని, తలను వాసన జూచి, దేహాన్ని అంతటిని ఆప్యాయంగా తడిమాడు.

*త్వయా లక్ష్మణ నాథేన సీతా చ పృథివీ చ మే* 

*న దుష్ప్రాపా హతే త్వద్య శక్రజేతరి చాహవే*

"తమ్ముడా! నీవు చేసిన మేలు అసమానమైనది. ఇక మన సీత మనకు లభించడం ముమ్మాటికి నిశ్చయము!" ఇంకా రావణుడు ఉన్నాడు కదా అంటావా? ఆయన జీవచ్ఛవము. బ్రతికి ఉన్నా శవముతో సమానమే" అని తనివి తీర కౌగిలించుకొన్నాడు.


వైద్యవరుడైన సుషేణుని పిలిచి, "వైద్య శిఖామణీ! మా తమ్ముడు అత్యంత సుకుమారుడు. ఆయన శరీరంలో అనేక బాణాగ్రాలు నాటుకొన్నాయి. వాటిని మెల్లగా వెలికి తీసి గాయాలను మానిపించి ఆరోగ్యవంతుని చేయుమని కోరాడు.


సుషేణుడు వెంటనే దివ్యౌషధాన్ని తెచ్చాడు. దాని గాలి సోకగానే శల్యాలు ఊడిపోయాయి. వ్రణాలు పూడిపోయాయి. శ్రమ అంతా క్షణంలో తీరిపోయింది. అందరూ ఆరోగ్యవంతులై మునుపటి ఉల్లాసంతో లేచి నిలుచున్నారు.


ఇంద్రజిత్తు మరణవార్తను రావణాసురుడికి తెలియజెయ్యడానికి మంత్రులంతా చాలా వ్యధ చెందారు. ఎట్టకేలకు నెమ్మదిగా విన్నవించారు. వింటూనే కలుషితాంతరంగుడై రావణుడు సొమ్మసిల్లి పడిపోయాడు. చాలాసేపటికి తేరుకున్నాడు.

*స తం ప్రతిభయం శ్రుత్వా వధం పుత్రస్య దారుణం*

*ఘోరమింద్రజితాః సంఖ్యే కశ్మలం చావిశన్మహత్*


హా పుత్రా ! రాక్షసచమూముఖ్య ! మహారథా! దేవేంద్రుణ్ని జయించి ఇప్పుడు ఈ లక్ష్మణుడి వాతపడ్డావా! బాణాలతో కాలాంతకులను భేదించావు. మందరశిఖరాలను ఛేదించావు. సౌమిత్రి చేతికి ఎలా చిక్కావయ్యా! రాజుకోసం యుద్ధంచేసి ప్రాణాలు అర్పించి మహా యోధుల మార్గాన్ని అనుసరించావు. తండ్రీ! నీ మరణవార్త విని దిక్పాలకులూ దేవతలూ ఋషులూ ఈ రోజు హాయిగా నిర్భయంగా నిద్రపోతారు. పుత్రకా! నీవు లేని ఈ లోకమంతా నాకు శూన్యంగా కనబడుతోంది. నీ అంతఃపురంలో రాక్షసకన్యకల విలాపాలు వినలేనురా బిడ్డా! యౌవరాజ్యాన్నీ, లంకనూ, రాక్షసులనూ, తల్లినీ, భార్యనూ, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు, ఎలా వెళ్ళావు? నేను చనిపోతే ఉత్తరక్రియలు చెయ్యవలసినవాడవు నువ్వు- ఇప్పుడంతా తలక్రిందులు చేసావు....


వేలకొలది సంవత్సరాలు నేను కావించిన కఠిన తపస్సు, బ్రహ్మదేవుని వరబలము, ఆయన ప్రసాదించిన ఆభేద్య కవచము, అమోఘ ధనుర్భాణాలు, కైలాసపర్వతాన్ని కంపింప జేసిన భుజబలము ఇవన్నీ నాకు శాశ్వతాలు, సహజాలు".


ఇటువంటి నన్ను ఎదిరించడానికి ఇంద్రునికే ధైర్యము లేదు. మానవ మాత్రులైన రామలక్ష్మణులు నా ముందు ఒక లెక్కా? నా ధనుర్బాణాలతో వారి శిరస్సులను సులభంగా ఖండిస్తాను".

*స పుత్రవధసం తప్తః శూరః క్రోధవశమ్ గతః*

*సమీక్ష్య రావణో బుద్ధ్యా వైదేహ్యా రోచయద్వధమ్*

రావణుని కోపము రామలక్ష్మణులపై నుండి సీతపైకి మరలింది. “ఈ సమస్త రాక్షస వీర వినాశానికి ముఖ్య కారణము మానవకాంత అయిన సీతే. 


నా కొడుకు మాయా సీతను కల్పించి, దాని శిరస్సును ఖండించి రామలక్ష్మణులను దిక్కులేని వారిగా దుఃఖింపజేశాడే. ఇప్పుడు నేను నిజమైన సీతాదేవి శిరాన్నే ఖండించి, దానిని రామలక్ష్మణులకు చూపెట్టి, దానితో వారి ప్రాణాలను బలిగొంటాను" అని హుంకరించాడు. తక్షణమే తన క్రూర కరవాలాన్ని తీసికొని తన మంత్రులు అంతః పుర స్త్రీలు వెంబడించగా వివేకశూన్యుడై అశోకవనానికి వెళ్లాడు.

*అభిదుద్రావ వైదేహీం రావణః క్రోధమ్ ఊర్చితః*

** 


రావణుడు వివేక శూన్యుడై సీతాదేవిని చంపాలని ప్రయత్నించడాన్ని సుపార్శ్వుడనే మంత్రివర్యుడు సహించలేదు. తగిన ఉపదేశం చేసి ఆ ప్రయత్నం ను విరమింప చేసాడు.

*కథం నామ దశగ్రీవ సాక్షాద్వైశ్రవనానుజా*

*హంతుమిచ్ఛసి వైదేహీం క్రోధాద్ధర్మమాపాస్య హి*


రావణుడు వివిధ బలాధ్యక్షులను పిలిచి, వారిని గౌరవించి "వీర వరులారా! మీ రీ రోజు యుద్ధరంగానికి వెళ్లి రామలక్ష్మణులను పట్టుకొని నా ముందుకు తీసిక రండి! లేదా వారిని చంపండి".


“ఈ రోజు మీకది సాధ్యం కాకున్నా రేపు వచ్చి నేను మీతో కలసి రామలక్ష్మణులను సంహరిస్తాను" అని


రావణుని మూలబలము మొత్తము కదలి వెళ్లి వానర బలాన్ని ఢీకొంది. రాక్షసులు కత్తులు, గదులు, శూలాలు మొదలైన ఆయుధాలతో ఎదుర్కొన్నారు. వానరులు చెట్లతో పెద్ద పెద్ద శిలలతో సమాధానము చెప్పారు.


యుద్ధము భయంకరమైంది. తెగిన తలలతో రణభూమి నిండి పోయింది. రక్తము ఏరులై ప్రవహించింది.


శ్రీరామచంద్రుడు తన కోదండాన్ని తీసికొని శత్రు మూకలలో చొచ్చి బాణవర్షంతో వారిని చీకాకు పరిచాడు. రామచంద్రమూర్తి ఎక్కడ చూచినా తానే అయి వీర విహారము చేశాడు. అయితే ఆయన ప్రయోగించే శరపరంపరలు ఆయనను మరుగు పరిచాయి. బాణాలు వచ్చి రాక్షసుల శిరస్సులను కూల్చుట చేత, ఆ బాణాలను ప్రయోగించడానికి రాముడు తప్పక ఉండి ఉంటాడనే అనే అనుమానమే రాముని ఉనికికి సాక్ష్యమైంది.


అంతేకాని రాముడెక్కడున్నాడో, ఆయన బాణాలను ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు విడుస్తున్నాడో, ఎప్పుడు వైరుల తలలు నరుకుతున్నాడో ఎవ్వరికి తెలియకుండా అయింది. నిరంతరమైన రామనామాంకితములైన బాణాల వర్షము శత్రుసేనపై కొనసాగుతూనే ఉంది.


శ్రీరామచంద్రుడు యుద్ధమును ప్రారంభించక పూర్వమే వానరులు యుద్ధం చేశారు. కాని ఆయన రణరంగంలోకి దిగాక వారికి ఆ అవసరమే లేకుండా పోయింది.


రామభద్రుడు “గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా రాక్షసులు తలలను నరకసాగింది. దాని వలన వారిలో ఒక భ్రమ ఏర్పడింది.

*తే తు రామ సహస్రాణి రణే పశ్యంతి రాక్షసాః*

*పునః పశ్యంతి కాకుత్స్థమేకమేవ మహాహవే*

ఆ భ్రమలో ప్రతి రాక్షసునికి ఎదుటి రాక్షసునిలో శ్రీరాముడు కనబడ్డాడు. అందువలన రాముని చంపుతున్నానని ప్రతి రాక్షసుడు ఎదుటి రాక్షసుని చంపడం మొదలైంది.


ఒకవైపు రామ బాణాలు రాక్షసుల తలలను వారి మొండాల నుండి వేరుచేస్తుంటే రెండవ వైపు రాక్షసులు కూడ తమలో తాము ఒకరినొకరు నరకు కోవడం జరిగింది.


జనస్థానంలో కూడ శ్రీరామచంద్రుడు ఇటువంటి అస్త్రాన్నే ప్రయోగించి పదునాల్గువేల మహా రాక్షస వీరులను మూడు గడియలలో మట్టి కరపించాడు.


అటువంటి మహా సంహార శక్తి తనలో మాత్రమే ఉందని, ప్రళయకాలంలో రుద్రుని యందు కూడ ఉంటుందని రామభద్రుడు సుగ్రీవ, విభీషణ, హనుమ, జాంబవదాదులను పిలిచి తెలిపాడు.

*ఏతదస్త్రబలాన్ దివ్యం మమ వా త్రయంబకస్య వా*

🌹 *రామాయణానుభవం_ 204* 


లంకా నగర స్త్రీ ల ఆహాకారాలు, రోదనధ్వనులు రావణుని చెవులలో నిండి పోయాయి. ఆయనకు ఎటు తోచని పరిస్థితి ఏర్పడింది. ఆయనలో ఒకవైపు భయము, మరొకవైపు కోపము కలిగాయి.


తన ముందు నిలిచిన భటులతో మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షులను యుద్ధమునకు సిద్ధం కావాలని చెప్పి పంపాడు.


మరుక్షణంలో ఆ సేనా నాయకులు తమ సైన్య బలాలతో ప్రభువు ముందు నిలిచారు. ఆ అప్పుడు రావణుడు వారి ముందు వీరాలాపాలను పలికాడు.


"రాక్షస వీరులారా! నా భయంకర బాణాగ్నితో నా బాహుబలంతో ముందుగా రామలక్ష్మణులను నరకివేస్తాను. దానితో నా కోసము పోరు సల్పిన ఖరదూషణాదుల, ప్రహస్త, కుంభకర్ణ ఇంద్రజిదాదుల రుణం తీర్చుకొంటాను.


ఆ తరువాత హనుమ, సుగ్రీవాంగద, జాంబవదాది వానర వీరులను, సమస్త వానర సైన్యాన్ని సంహరిస్తాను. నా బాణమేఘాలతో సూర్యుని కప్పివేసి గుట్టలు, చెట్లు మొదలగు వాటిని కనిపింపకుండా చేస్తాను.


రావణునికి రణరంగానికి వెళ్లే దారిలో అనేక అపశకునాలు ఎదురయ్యాయి.అయినా అభిమానధనుడైన రావణుడు అపశకునాలను అలక్ష్యంచేసి యుద్ధభూమికి ముందుకు వెళ్లాడు.


రావణుడు రణరంగంలోకి ప్రవేశిస్తూనే, వానరసేనను భయంకరంగా చీల్చి చెండాడాడు. ఆయన బాణాగ్నికి వానరవీరులు మిడుతలయ్యారు.


వానరులు తలొక దిక్కుకు పారిపోతుండగా రావణుని రథము రామునికి ఎదురుగాపరుగెత్తింది.


కపిసైన్యము కకావికలు కావడాన్ని గమనించిన సుగ్రీవుడు రాక్షస సైన్యముపై శిలావర్షాన్ని కురిపించాడు. రాక్షసులు వందల వేల సంఖ్యలో శవాలై కుప్పలు కుప్పలుగా పడిపోయారు. 


సుగ్రీవునెదుర్కోవడానికి విరూపాక్షుడు రథముపై నుండి దిగి ఒక ఏనుగును ఎక్కాడు. భయంకర నాదాన్ని చేస్తూ వానరులను పారద్రోలాడు. సుగ్రీవునిని కూడ అనేక బాణాలతో నొప్పించాడు.


సుగ్రీవుడు విరూపాక్ష వధకై మనస్సులో నిశ్చయించుకొన్నాడు. అక్కడ ఒక మహావృక్షాన్ని పెకిలించి, విరూపాక్షుని గజముపైకి ఎగిరి ఆ వృక్షంతో దానిని చంపివేశాడు.


ఏనుగు నుండి క్రిందికి దుమికి విరూపాక్షుడు ఖడ్గాన్ని, సుగ్రీవుడిపై విసిరాడు. సుగ్రీవుడు క్రోధంతో ఒక శిలను వాడిపైకి వేశాడు. రాక్షసుడు ఆ మహాశిలను తప్పించుకొని సుగ్రీవునిని ఖడ్గంతో బలంగా కొట్టాడు. దానివలన కొంత సమయం సుగ్రీవుడు తెలివి తప్పి పడిపోయాడు. కొద్ది సమయంలోనే లేచి తన పాదాలతో బలంగా విరూపాక్షుని కవచాన్ని పగులకొట్టాడు. తన పిడికిలితో రాక్షసుని తలపై మోదాడు.


రాక్షసుడు దానిని తప్పించుకొని సుగ్రీవుని వక్షముపై కొట్టాడు. దానిని తప్పుకొని విరూపాక్షుని లలాటముపై వజ్రము వంటి అరచేతితో కొట్టాడు. దానితో విరూపాక్షుడు. రక్తము కక్కుకుంటూ, కళ్లు ఊడి, ఘోరంగా అరుస్తూ క్రిందబడి ప్రాణాలు వదిలారు. విరూపాక్షుని వధను గమనించిన రావణుడు తన దగ్గరలో ఉన్న మహోదరుని వానరసేన వధకు ప్రేరేపించాడు.


విరూపాక్షుని వధతో సంతసించిన వానర వీరులు రాక్షస సైన్యముపై విజృంభించారు. వానర విజృంభణను గమనించిన మహోదరుడు వానరులపై బాణవర్షాన్ని కురిపించాడు. వానర వీరులు సుగ్రీవుని ఆశ్రయించారు.

సుగ్రీవుడు ఒక మహా శిలను మహోదరునిపై వేశాడు. ఆ శిలను మహోదరుడు

మధ్యలోనే తన బాణాలతో త్రుంచాడు. సుగ్రీవుడొక సాలవృక్షాన్ని పెకిలించి రాక్షసునిపై

ప్రయోగించాడు. దానిని కూడ రాక్షసవీరుడు బాణాలతో ఖండించాడు..


సుగ్రీవుడొక పరిఘను చేత ధరించి, రాక్షసుని గుర్రాలను పడగొట్టాడు. మహోదరుడు ఆ రధాన్ని వదలి ఒక మహాగజాన్ని అధిరోహించాడు. రాక్షసుడు ఒక గదను చేబూని వానర పతిని ఎదిరించాడు. రాక్షసుడు ప్రయోగించిన గదను సుగ్రీవుడు తన పరిఘతో ఎదుర్కొన్నాడు. కాని గదా దెబ్బతో పరిఘ ముక్కలైంది. 

సుగ్రీవుడు ఒక ఇనుప రోకలిని తీసికొని రాక్షసుని గదపైకి విసిరాడు. గద ముసలము

ఒకదానితో ఒకటి ఢీకొని విరిగి క్రిందబడ్డాయి.


 అప్పుడు వానర రాక్షస నాయకులిద్దరు బాహుయుద్ధానికి పూనుకొన్నారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకొన్నారు.

మహోదరునికి మధ్యలో ఒక ఖడ్గం దొరికింది. సుగ్రీవుడు కూడ ఒక ఖడ్గాన్ని

దొరికించుకొన్నాడు. ఇద్దరి మధ్య ఖడ్గ యుద్ధం తీవ్రమైంది. సుగ్రీవుడు తన ఖడ్గంతో మహోదరుని శిరస్త్రాణాన్ని, కుండలాలతో కూడిన శిరస్సును ఖండించాడు.


ఈ విధంగా సుగ్రీవుని చేతిలో మహోదరుడు కూడ మరణించాడు.


ఇక అంగదుని చేతిలో మహాపార్శ్వుడి మరణం సంభవించింది.

సమరానికి వచ్చిన నలుగురిలో ముగ్గురు రాక్షస నాయకులు మరణించడంతో వానరులు సింహనాదం చేశారు. దేవతలు రావణుడొక్కడే మిగిలడం చూచి హర్షధ్వనులు కావించారు.

** 


రావణాసురుడి కోపం అవధులు దాటింది. రథచోదకా! సర్వరాక్షస సంహారం చేసిన రాముడు ఎక్కడ ఉన్నాడో చూసి అక్కడికి నన్ను తీసుకువెళ్లు. ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటాను అని ఆజ్ఞాపించాడు. వెంటనే రథం బయలుదేరింది. గ్రీష్మకాల సూర్యుడు కిరణాలను వెదజల్లినట్టు బాణాలను వేస్తూ సర్వవానరసైన్యాన్ని చెల్లాచెదురుచేస్తూ వెళ్ళి వెళ్ళి రాముణ్ని చూసాడు.

*తతో రాక్షశశార్దులో విద్రవ్యా హరివాహినిమ్*

*స దదర్శ తతో రామం తిష్ఠంతమపరాజితమ్* 

*లక్ష్మణేన సహ భ్రాత్రా విష్ణునా వాసవం యథా* 

*అలిఖన్తమివాకాశ్య మవష్టభ్య మహద్ధనుః* 

*పద్మపత్రవిశ్అలక్షన్ దీర్ఘబ్అహుమరిందమమ్*

ఇంద్రుడితో కూడిన విష్ణుమూర్తిలా లక్ష్మణుడితో కలిసి కూర్చున్న శ్రీరాముణ్ని చూసాడు. పద్మపత్ర విశాలాక్షుడూ ఆజానుబాహువూ అయిన రఘువీరుణ్ని చూసాడు. ఆకాశాన్ని తాకుతున్న మహాధనుస్సుతో మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న ఇనకులతిలకుడైన దాశరథిని చూశాడు.


రణభగ్నులై గాయాలతో తిరిగివస్తున్న వానరవీరులనూ వారివెనుక రథారూఢుడై తనకు ఎదురువస్తున్న దశకంధరుడినీ - అల్లంత దూరంలో చూసాడు రాముడు. ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో ధనుస్సు ఎక్కుపెట్టి టంకారం చేసాడు. లక్ష్మణుడుకూడా సన్నద్ధం అయ్యాడు. వారి ఇద్దరికీ ఎదురుగా రావణుడు సూర్యచంద్రుల ఎదుట రాహువులా కనిపించాడు.


మునుముందుగా యుద్ధం చేద్దామనే ఉత్సాహంతో లక్ష్మణుడు శరవర్షం కురిపించాడు. అన్ని బాణాలనూ రావణుడు మధ్యలోనే ధ్వంసం చేసాడు. అతడిని దాటి వచ్చి సుస్థిరంగా పర్వతోపమంగా నిలబడిన రామభద్రుణ్ని సమీపించాడు. వర్షాకాలమేఘం జలధారలతో కులపర్వతాన్ని ముంచెత్తినట్టు బాణాలు ప్రయోగించాడు. రాముడు అన్నింటినీ సులువుగా ఖండించాడు. ఇరువురూ యమాంతకులై తీవ్రంగా పోరు సల్పుతూంటే పంచభూతాలూ భయభ్రాంతాలయ్యాయి.


క్రుద్ధుడైన రాముడు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించగా, అది బాణరూపం విడిచి అయిదు పడగల పాముగా మారి బుసలు కొడుతూ రావణ ఫాలభాగాన్ని సోకి, ఏమీ చెయ్యలేక ఓడిపోయి, పాతాళంలోకి దూరిపోయింది. ఇరువురూ ప్రయోగిస్తున్న అస్త్రాలు - సింహ, వ్యాఘ్ర, కంక, కాక, గృధ్ర, శ్యేన, సృగాల ముఖాలతో వానర రాక్షసులందరినీ భయవిహ్వలులను చేసాయి. అందరూ యుద్ధం ఆపేసి ఈ మహావీరుల నేర్పు చూస్తున్నారు.


అంతలో లక్ష్మణుడు కల్పించుకొని రాక్షసేశ్వరుణ్ని వ్యాకులపరిచాడు. అతడు అతిక్రోధావిష్ణుడై శక్తిని ప్రయోగించాడు. అది మయునిచేత మాయాశక్తితో నిర్మింపబడింది. అమోఘమైన సృష్టి. ఎనిమిది ఘంటికలతో మహాధ్వనిచేస్తూ మంటలు వెలిగ్రక్కుతూ లక్ష్మణుని మీదకు ప్రయాణిస్తోంది. అతడు బాణాలతో ఎదుర్కొన్నాడు. కానీ ఫలితం లేకపోయింది. లక్ష్మణుడికి శుభమగుగాక అని రాముడు మనసులోనే పదే పదే అనుకున్నాడు. శక్తి ఆయుధం సౌమిత్రి శిరస్సుపై పడింది. శరీరంలోంచి భూమిలోకి అదృశ్యమయ్యింది. లక్ష్మణుడు మూర్ఛిల్లాడు.


క్షణకాలం రఘురాముడు నిశ్చేడయ్యాడు. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంతలోనే తేరుకుని, ఇది విషాదానికి సమయంకాదని నిశ్చయించుకొని, ప్రేమగా సోదరుణ్ని ఒకసారి చేతితో తాకి, సంరక్షణ బాధ్యతలు సుగ్రీవ హనుమంతులకు అప్పగించి రావణవధకు పూనుకున్నాడు.


*అస్మిన్ ముహూర్తే న చిరాత్సత్యం ప్రతిశృణోమివః* | *అరావణమరామం వా జగద్ద్రక్ష్యథ వానరాః* ॥


రాజ్యభ్రంశము, వనవాసము, దండకారణ్యక్లేశము, వైదేహీ అపహరణము, రాక్షసకృత ధిక్కరణము- అన్నింటికీ ఈ రోజే ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ రోజుతో ప్రపంచం అరావణమో అరామమో అవుతుంది.


సుగ్రీవ సఖ్యము, వానరవీర సమీకరణము, సేతుబంధనము, సముద్ర తరణము అన్నింటికీ ఏకైక లక్ష్యమూ ఏకైక ప్రయోజనమూ అయిన రావణవధను ఇప్పుడే నిర్వహిస్తాను. నా కంటబడిన రావణుడు ఇక జీవించి ఉండడానికి వీలులేదు.


*అద్య పశ్యన్తు రామస్య రామత్వం మమ సంయుగే*


కపివీరులారా! మీరంతా పర్వతాగ్రాలూ చెట్టుకొమ్మలూ అధిరోహించి మా యుద్ధవైశారద్యం తిలకించండి. రాముని రామత్వాన్ని ఈ రోజు మీరు చూద్దురుగాని.


అని ప్రతిజ్ఞచేసి సత్యపరాక్రముడయిన రాముడు నిశితబాణాలతో రావణుణ్ని హింసించాడు. అతడికి ఊపిరి ఆడకుండా చేసాడు. ఈ ప్రళయ ఝంఝామారుతానికి నిలవలేక రావణుడు మేఘశకలంలాగా చెదిరి పారిపోయాడు........

 *రామాయణానుభవం_ 205* 


శ్రీరాముడు, తనను నీడవలె విడువక అనుసరించిన వాడు, తన కొరకు భార్యను, తల్లిదండ్రులను, రాజ్యసంపదలను గడ్డిపోచవలె వదిలినవాడు, సుగుణ సముద్రుడు, ప్రాణప్రియుడు, తన తమ్ముడైన లక్ష్మణుడు కొన ఊపిరితో ఉన్న పామువలె నేలపై బాధతో పొరలడాన్ని చూచి, భరింపలేక పోయాడు.


ఆయన చేతినుండి విల్లు జారి పోతున్నది. మనస్సు మనస్సులో లేదు. దుఃఖము పొంగుకొస్తున్నది. తనకు ప్రాణముపై ఆశ నశిస్తున్నది. ఆయన లేని సీత ఎందుకు? జీవితమెందుకు? రాజ్య మెందుకు?” అనిపిస్తున్నది.


*దేశే దేశే కళత్రాణి దేశ దేశేచ బాంధవాః*

*తంతు దేశం న పశ్యామి* । *యత్రభ్రాతా సహోదరః*


ఒక వ్యక్తికి భార్య కావాలంటే ఎక్కడైనా, ఎందరైనా దొరుకుతారు. బంధువులు కావాలంటే దొరుకుతారు. కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరుకుతాడా ఎక్కడైనా?


పట్టరాని దుఃఖావేశంతో విలపిస్తున్న రాముణ్ని ఓదారుస్తూ సుషేణుడు - మహాత్మా! లక్ష్మణుడు జీవించే ఉన్నాడు. ముఖంలో కాంతి వైదొలగలేదు. అరచేతులు ఎర్రగా ఉన్నాయి. అంచేత కంగారు పడవలసింది ఏమీలేదు అన్నాడు.


 హనుమంతుణ్ని పిలిచి మొన్నొకసారి జాంబవంతుడు చెప్పగా ఓషధిపర్వతానికి వెళ్ళావుగదా! ఇప్పుడు మళ్ళీవెళ్ళి విశల్యకరణి అనే ఓషధిని త్వరగా తీసుకురా అని చెప్పాడు. ఆంజనేయుడు మనోజవంతో వెళ్లి ఏది ఓషధియో తెలియక తికమకపడి, వట్టి చేతులతో తిరిగివెళ్ళడం నచ్చక, ఇదివరకులాగానే మళ్ళీ ఆ మహాపర్వత శిఖరాన్ని పెకలించి తెచ్చాడు. సుషేణుడి ముందు నిలిపాడు. అతడు ఆ ప్రత్యేకమయిన ఓషధిని వెదికి పట్టుకొని సౌమిత్రికి వాసన చూపించాడు. అంతే పరిపూర్ణ ఆరోగ్యంతో లేచికూర్చున్నాడు. 


వానరులంతా సాధు సాధు అని కీర్తించారు. రాముడు- సోదరా! రా! రా! అంటూ కౌగిలించుకున్నాడు.


 ఆ క్షణంలో ఎందుకో ఏమో తెలియని ఒక నైరాశ్యానికి రాముడు గురిఅయ్యాడు. లక్ష్మణుడు ఉత్సాహపరచి - ఈరోజు సూర్యాస్తమయం అయ్యేలోగా రావణుణ్ని నీవు సంహరించాలి. ఇది నా కోరిక. నా ప్రార్ధన అని అన్నగారిని ఒప్పించాడు.

*అహన్ తు వధమిచ్ఛామి శీఘ్రమస్య దురాత్మనః*

*యావదస్తం న యాత్యేషా కృతకర్మా దివాకరః*

*

[భ్రాత అంటే “తమ్ముడు", "ఆప్త మిత్రుడు", "ఆప్తబంధువు". లక్ష్మణుడు రామునికి కేవలము తమ్ముడే కాదు ఆప్తమిత్రుడు, ఆప్తబంధువు కూడ.


ఇవన్ని కూడా ముఖ్యము కాదు. తన గురించి సౌమిత్రి హనుమతో చెప్పుతూ "అహమస్య అవరోభ్రాతా గుణైర్దాస్యముపాగతః" అని తెలిపాడు.


తనను తమ్ముడని రామచంద్రుడు అనుకొంటున్నాడు. కాని తన దృష్టిలో తాను "రామదాసుడే"! అదేమిటి తాను రామభద్రునికి తోబుట్టువు కదా? దాసుడెలా అవుతాడు?


శ్రీరామచంద్రుని కల్యాణ గుణాలు అటువంటివి. తనను దాసునిగా మార్చాయి.


దాసుడు స్వామికి పరతంత్రుడు. స్వతంత్రమైన ఉనికి లేదని భావించే వాడు. లక్ష్మణుడు కూడ తాను రామచంద్ర స్వామికి జీవితము ఉన్నంత వరకు పరతంత్రుడనని చెప్పుకొన్నవాడు.


"పరవానస్మి కాకుత్స! త్వవర్షం శతేస్థితే


ఇంతకు రామలక్ష్మణులు ఒకే తల్లికి పుట్టినవారు కాదు. అయితే మాత్రమేమిటి? లక్ష్మణుని సౌజన్యమటువంటిది. ఆయన సోదర "అనురాగము” (సౌభ్రాత్రము) అటువంటిది.


"న చతేన వినా నిద్రాం లభతేచ పురుషోత్తమః"


లక్ష్మణుడు ప్రక్కలో లేకుంటే రాముడు నిద్రపోయే వాడే కాడు.


అందుకే ఇప్పటి ఇద్దరు అన్నదమ్ములు బాగా జీవనం చేస్తుంటే రామలక్ష్మణులు లాగా వున్నారు అంటుంటారు.]


** 


రావణుడు వినూతనరథం అధిరోహించి రెట్టించిన నూతనోత్సాహంతో రణభూమికి అవతరించాడు. రామునితో తలపడ్డాడు.


రాక్షసేంద్రుడు రథంమీద, మానవేంద్రుడు నేలమీద - ఇది పైనుంచి చూస్తున్న దేవతలకూ దేవేంద్రునికీ నచ్చలేదు. వెంటనే మాతలి సారథిగా తన దివ్యరథాన్ని పంపించాడు.

రాముడు భక్తితో దానిని ప్రదక్షిణించి నమస్కరించి అధిరోహించాడు.

*ఇత్యుక్తః స పరిక్రమ్య రథన్ సమభివాద్య చ*

*ఆరురోహ తదా రామో లోకన్లక్ష్మ్యా విరాజయన్*

దాశరథి ప్రయోగిస్తున్న అస్త్రాలను అస్త్రాలతో శస్త్రాలను శస్త్రాలతో ఎదుర్కొంటూ సారధియైన మాతలినీ దివ్య రథాశ్వాలనూ రావణుడు దారుణంగా హింసించాడు. ఆ వీర విజృంభణకు లక్ష్మణాగ్రజుడు ఆర్తుడు అయ్యాడు. రావణ రాహువు రామచంద్రుణ్ని గ్రసించింది. ఆ సమయంలో రాక్షసేశ్వరుడు పది శిరస్సులూ ఇరవై బాహువులూ కలిగి ధనుర్ధారియై మహామైనా కపర్వతంలాగా రాముడికి కనిపించాడు.


నేను లేని సమయంచూసి నా భార్యను అపహరించిన ఈ దురాత్ముడి శరీరాన్ని ఈ పూట గ్రద్దలూ కాకులూ పీక్కుతినాలి. నా బాణాలవల్ల ఏర్పడిన గాయాలనుంచి ప్రవహించే రక్తాన్ని నక్కలూ కుక్కలూ త్రాగాలి అంటూ ఉత్సాహం ఉద్దీపింపజేసుకుని - అర్ధచంద్రాకార బాణాలను సంధించి, చెవిదాకా నారి సారించి వదులుతూ సీతాప్రాణవల్లభుడు విక్రమించాడు. వానర మహావీరులు శైలశృంగాలను విసిరి రావణుడిని అల్లకల్లోలం చేసారు. ధనుస్సు ఎక్కుపెట్టి బాణం తొడిగి విడిచిపెట్టే వ్యవధిని రాముడు రావణుడికి ఇవ్వడంలేదు. ఈ అవస్థను గమనించిన రావణ సారథి నిశ్చల చిత్తంతో రథాన్ని రణరంగంనుంచి తప్పించాడు.

*సుతస్తు రథనేతస్య తదావస్థం నిరీక్ష్య తామ్*

*శనైర్యుద్ధాదసంభాన్తో రథాన్ తస్యాపవాహయత్*

నాకు అపకీర్తి తెచ్చిపెట్టావని రావణుడు కోపించి దుర్భాషలాడగా- 


నీ మేలు కోరి ఇలా చేసాననీ, నీవు పరిశ్రాంతుడవయ్యావనీ, రథాశ్వాలు వానదెబ్బతిన్న గోవుల్లా అయిపోయాయనీ. అపశకునాలు కనిపిస్తున్నాయనీ గమనించి ఇలా చేస్తానని సూతుడు సమాధానం చెప్పాడు. దానికి సంతోషించి కంకణం బహూకరించి మళ్ళీ రామాభిముఖంగా నడిపించమని ఆజ్ఞాపించాడు. జయం పొందకుండా ప్రాణాలతో రణరంగంనుంచి వైదొలగనని ఖండితంగా చెప్పాడు.


సరిగ్గా అదే సమయానికి అగస్త్యమహర్షి రాముణ్ని సమీపించాడు. 

*రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్*

*యేన సర్వానరీన్వత్స సమరే విజయీష్యసే* 

రామభద్రా! సమరంలో విజయం చేకూర్చే అతిరహస్యమయిన ఒక సనాతన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. విను. దీనిని ఆదిత్యహృదయం అంటారు. ఇది శత్రువినాశకం. సర్వమంగళప్రదం. చింతాశోకప్రశమకమూ ఆయుర్వర్ధకము....

Bhagavatham

 [ Srimadhandhra Bhagavatham -- 41 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

నాభి ఒక కొత్త మార్గమును ఆవిష్కరించాడు. ఆయన యజ్ఞముయొక్క  గొప్పతనమును ఆవిష్కరించాడు. యజ్ఞము చేత భక్తిచేత పరమేశ్వరుడిని కట్టి ఎలాగ తన కొడుకుగా తెచ్చుకోవచ్చునో నిరూపించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చునో తెలియజేశాడు. ఆయన భగవంతుడిని మోక్షం ఇమ్మని అడగలేదు. ఋషభుడిని కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షమును పొందాడు. ఇది నాభి వృత్తాంతము.

ఋషభుడు చాలాకాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు. తరువాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు పిల్లలను పిలిచి ఒకమాట చెప్పాడు. ఋషభుడి చరిత్రవింటున్న వారికి చదువుచున్న, వారికి సాక్షాత్తుగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెపుతారు. ‘కుమారులారా! కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమయిన ఉపాధిని పొందిన మనిషికూడా అన్ని కష్టాలు పడుతున్నాడు. దేనివల్లనో తెలుసా? కేవలము కామము చేత కష్టములు పడుతున్నాడు. కామము అంటే కేవలము స్త్రీ పురుష సంబంధమయిన గ్రామ్యసుఖము మాత్రమే కాదు. కామము అంటే కోరిక. కోరికకు ఒక లక్షణము ఉంటుంది. అది లోపల అంధత్వమును ఏర్పరుస్తుంది. మీరు ఒక కోరికకు లొంగినట్లయితే ఒక పరిమితమయిన కోర్కె పెట్టుకొని మీ శక్తిని దృష్టిలో పెట్టుకుని అక్కడవరకు ప్రయాణము చేయడము గృహస్థాశ్రమంలో దోషం కాదు.   వాళ్ళను చూసి వీళ్ళను చూసి అలవికాని కోర్కెను పెంచుకుంటే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. ధర్మము గాడితప్పవచ్చు లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమయిన దానికి తిరగడములో చేయవలసిన ఈశ్వరారాధన   వదులుకుంటున్నారు. కోరికలు బంధించి వేసి కళ్ళల్లో ధూళి పోసి కనపడకుండా చేస్తాయి. మనిషి కుక్కకన్నా హీనం అయిపోతాడు. అందరిచేత ఛీ అనిపించుకుంటాడు. కామమును అదుపు చెయ్యి. మనసులో ధారణ ఉండాలి, పూనిక ఉండాలి.  కామము పెరిగిపోవడమే బంధహేతువు అవుతుంది. దీనిని విరగ్గొట్టడానికి నేను రెండుమార్గములు చెపుతాను. అందులో మొదటిది తపము చెయ్యడం. తపము లేక ధ్యానము చెయ్యండి. ఈశ్వరునియందు భక్తిని పెంపొందించుకోండి. రెండవది సజ్జనసాంగత్యము. సజ్జనసాంగత్యము ఒక్కటే ఈశ్వరుని దగ్గరకు తీసుకువెళుతుంది. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి. క్రమక్రమముగా అంతటా ఈశ్వరుడిని చూడడము నేర్చుకోవాలి. ‘నేను, నాది’ అనే భావన విడిచిపెట్టాలని బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన రూపమును చూసి ఏమి అందగాడని ప్రజలంతా మోహమును పొందారు. ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. స్నానం లేదు. ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ఇంతకు పూర్వం ఋషభుడిని చూసిన వారు ఇప్పుడు ఆయనను చూసినా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అలా వెళ్ళిపోయి చాలా కాలానికి ‘అజగరవ్రతము’ అని ఒక చిత్రమయిన వ్రతం పట్టాడు.

అజగరము అంటే కొండచిలువ. కొండచిలువ ఎలా భూమిమీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒకచోట భూమిమీద పడి ఉండిపోయాడు. అతడు పొందిన యోగసిద్ధికి సిద్దులన్నీ  మేము నిన్ను వరిస్తున్నాము స్వీకరించండి’ అని అడిగాయి. నాకీ సిద్ధులు అక్కరలేదని వెళ్ళిపొమ్మన్నాడు. అలా చాలాకాలం పడివుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందున్న అరణ్యమునందు నడుస్తున్నాడు. ఆయన అలా నడిచివెడుతుంటే అక్కడ వున్న చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి ఒక అగ్నిహోత్రము బయలుదేరింది. పెద్ద అగ్నిజ్వాలలు రావడం ప్రారంభించాయి. ఆయన వాటివంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. అవి వచ్చి అంటుకుంటే శరీరము పడిపోతుంది అనుకున్నాడు. యధార్థమునకు అలా ఉండడము అంత తేలికకాదు.  ఋషభుడి కథ అసుర సంధ్యవేళ ఎవరు వింటున్నారో వాళ్లకి సమస్త కామితార్థములు ఇవ్వబడతాయని చెప్పబడింది. ఆ అగ్నిహోత్రం శరీరమును పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది. తాను ఆత్మలో కలిసిపోయాడు. ఋషభుడు ఇలా శరీరమును వదిలిపెట్టాడని రాజ్యమును ఏలుతున్న అరహన్ అనే రాజు తెలుసుకున్నాడు. తెలుసుకుని ‘మనకు ఒక సత్యం తెలిసింది. లోపల ఉన్నది ఆత్మ. ఈ శరీరము మనది కాదు. కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళెవరూ స్నానం, సంధ్యావందనం చేయనక్కరలేదు. దేవాలయములకు వెళ్ళక్కరలేదు. పూజలు చేయనక్కర లేదు. బ్రాహ్మణులను గౌరవించనక్కరలేదు. యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతారు’ అని చెప్పాడు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలుపెట్టారు.

  వ్యాసులవారు ఇది మహాదోషము అన్నారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణము. మీరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానిని అనుకరించలేరు. ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు. మీరు కర్మ చెయ్యాలి. అదే మిమ్మల్ని జ్ఞానిని చేస్తుంది.  మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేయాలి. అది వైరాగ్యమును ఇచ్చి ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు. ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు. అదే అరహన్ చేసిన భయంకర కృత్యము. ఒక మహాపురుషుని జీవితకథగా దీనిని విని, చేతులు ఒగ్గి నమస్కరించాలి. అలా చేస్తే మీకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి మీరు కృష్ణ పాదములను చేరుకుంటారు. మీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది.

2. భరతుని చరిత్ర:

మహానుభావుడయిన ఋషభుని కుమారుడే భరతుడు. ఆయన పరిపాలించాడు  కనక మనదేశమునకు భరతఖండము అను పేరువచ్చింది. ఆయన విశ్వరూపుడు అనే ఆయన కుమార్తె ‘పంచజని’ని వివాహం చేసుకుని సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, దూమ్రకేతువు, అను ఐదుగురు బిడ్డలను కన్నాడు. ఆయన భక్తి వైరాగ్యములతో కొన్ని వేల సంవత్సరములు భరత ఖండమును పరిపాలించాడు. ఆయనలా పరిపాలించిన వారు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమునకు ‘భరత ఖండము’ అన్న పేరు వచ్చింది.

ఆయన ఒకరోజు  ‘ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను? ఇక్కడి నుండి బయలుదేరి పులహాశ్రమమునకు వెళ్ళిపోతాను. అక్కడ గండకీనది ప్రవహిస్తోంది.  సాలగ్రామములు దొరుకుతూ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను’ అని బయలుదేరి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారు జామునే సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణ దర్శనము తెల్లవారిన తరువాత జరుగుతుందనే ఉద్దేశంతో నదీస్నానం కొరకని చీకటి ఉండగానే వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని జపం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక చిత్రమయిన సంఘటన జరిగింది. అక్కడికి నిండుచూలాలయిన ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతలో అక్కడే అరణ్యంలో సింహం ఒకటి అరణ్యము బ్రద్దలయిపోయేటట్లు గర్జించింది. సింహం అరుపు విని నిండుగర్భిణి అయిన లేడి భయపడిపోయి నీటిలోకి దూకేసింది. వెంటనే దానికి ప్రసవమై ఒక లేడిపిల్ల పుట్టింది. లేడి వరదలో కొట్టుకుపోయింది. దానిని భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పిల్లను తెచ్చాడు. అయ్యో! తల్లి మరణించిందే అనుకుని ఈ లేడిపిల్లను ఆశ్రమములో తనపక్కన పెట్టుకున్నాడు. మెల్లమెల్లగా దానికి లేత గడ్డిపరకలు తినిపించడము కొద్దిగా పాలుపట్టడము దానిని పులో, సింహమో వచ్చి తినేస్తుందని ఎవరికీ దొరకకుండా ఆశ్రమంలో తలుపులు వేసి పడుకోబెట్టడము చేసేవాడు. ఎప్పుడూ లేడిపిల్ల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. జపం మొదలు పెట్టేవాడు.   నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడి ఎక్కడికయినా వెళ్ళిపోతుందేమో ఏ పులో దానిని తినేస్తుందేమోనని దానిని చూసుకుంటూ ఉండేవాడు. రానురాను ఆయన దేనికోసం తపస్సుకు వచ్చాడో అది మరచిపోయి లేడిపిల్లను సాకడములో పడిపోయాడు.

భరతునికి అంత్యకాలం సమీపించింది. ప్రాణం పోతున్నది. మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను. నా లేడి ఏమయిపోతుందోనని ఆ లేడివంక చూస్తూ కన్నులనీరు పెట్టుకుని లేడినే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు. ఈశ్వరుడికి రాగద్వేషములు ఉండవు. ఆఖరి స్మరణ లేడిమీద ఉండిపోయింది  లేడిగా పునర్జన్మను ఇచ్చారు. ‘అయ్యో! నేను లేడిని పట్టుకోవడం వలన కదా నాకీ సంగం వచ్చింది. అసలు నేను ఎవరినీ ముట్టుకోను’ అని వ్రతం పెట్టుకున్నాడు. పచ్చగడ్డి తింటే దానిమీద వున్న క్రిములు చచ్చిపోతాయని ఆ లేడి (భరతుడు) ఎండుగడ్డిని మాత్రమే తినేది. అంత విచిత్రమయిన వ్రతం పెట్టుకుని పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచాడో ఆ పులహాశ్రమమునకు వచ్చాడు. ఆ లేడి లోపల ఎప్పుడూ నారాయణ స్మరణము చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితమును గడిపి అంత్యమునందు భగవంతుడినే స్మరిస్తూ శరీరము విడిచిపెట్టింది. మోక్షం పొందడానికి మరల మనుష్య శరీరములోకి రావాలి. ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు.



భరతుడు ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. ఆయన పుట్టిన తరువాత కొంతకాలమునకు ఉపనయనము చేశారు. తరువాత ఆయనకు మనస్సులో ఒక భావన ఉండిపోయింది. ‘అప్పుడు పులహాశ్రమానికి వెళ్లాను. లేడిమీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగోలాగ కష్టపడి మనసులో భగవంతుడిని పెట్టుకుని లేడిని వదిలి ఇపుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నేను గాయత్రిని చేయడం, ఈయన చెప్పిన మంత్రములన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని నాకు పెళ్ళి చేసి నన్ను సంసారంలో పడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మరల భ్రష్టుడనయిపోయి మరల ఎటు జారిపోతానో! అందుకని నేనెవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. నేనొక వెర్రివాని వలె వుంటే నాకు పిల్ల నిచ్చేవాడెవడు ఉంటాడు?’ అని నిర్ణయించుకుని వెర్రివాడిలా అలా కూర్చుని ఉండేవాడు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లి సహగమనం చేసింది. సవతి బిడ్డలయిన అన్నదమ్ములు 'వీడికేమి వచ్చు. వీడికి శాస్త్రం ఏమిటి! వీడిని గొడ్లశాల దగ్గర కూర్చోబెట్టండి. పొలానికి పంపించండి. ఆ పనులన్నీ చూస్తుంటాడు అని అతనిని ఒరేయ్ పేడ ఎత్తరా అనేవారు. ఎత్తేవాడు. పాసిపోయిన అన్నం పెడితే మారుమాట్లాడకుండా అదే తినేవాడు. ‘సర్వం బ్రహ్మమయం జగత్’ అని బ్రహ్మమునందు మనస్సు కుదుర్చుకుని ఉండిపోయాడు. ఒకరోజు అన్నదమ్ములు ‘నువ్వు పొలానికి వెళ్ళి పంటని కాపలా కాయమన్నారు. ఆయన పొలం వెళ్ళి మంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు.

లోకమునందు కొంతమంది చిత్రవిచిత్రమయిన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికా దేవికి మంచి అవయవ హీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారు అనుకుని వీడెవడో బాగానే ఉన్నాడు. మాట కూడా మాట్లాడడం లేదు వీడిని తీసుకుపోదాం అని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నారు. బ్రహ్మజ్ఞానుల జోలికి వెళితే లేనిపోని ప్రమాదములు వస్తాయి. చక్కగా కట్టించేసుకున్నాడు. పద అన్నారు. వెళ్ళిపోయాడు. ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఏదో పెట్టారు. తినేశాడు. తరువాత వంగు, నరికేస్తాము అన్నారు. వంగాడు. కత్తియందు బ్రహ్మము, నరికేసేవారియందు బ్రహ్మం. అంతటా బ్రహ్మమును చూసి తలవంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహములో నుంచి బయటకు వచ్చి ‘ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నవాడు. ఆయన మీదనా మీరు కత్తి ఎత్తుతారు అని కత్తి తీసి ఆ వచ్చినవారి శిరసులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు. బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరల తిరిగి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తుంటే సింధుదేశపు రాజు రహూగణుడు (రాహుగణుడు) ఇక్షుమతీ నదీతీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తపోపదేశం కోసమని వెళుతున్నాడు. బోయీలు పల్లకిని మోస్తున్నారు. ఒక బోయీకి అలసట వచ్చింది. వాడిని అక్కడ వదిలేశారు. నాలుగో బోయీ కోసం చూస్తుంటే ఈయన కనపడ్డాడు. మంచి దృఢకాయుడై ఉన్నాడు. ఈయనను తీసుకురండి పల్లకీ మోస్తాడు అన్నారు.

బాగా పొడుగయిన వాడు పల్లకీ పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఈయన పల్లకీ మోస్తున్నాడు. అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనంద పడిపోవడములో ఒక్కొక్కసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి అడుగులు తడబడేవి. ఎత్తు పల్లములకు లోనయి పల్లకీ లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకి అంచుకు గట్టిగా తగిలేది. ఆయన రెండుమూడు మాటలు చూసి ‘ఎందుకురా అలా ఎగిరెగిరి పడుతున్నారు. ఒంటిమీద తెలివి ఉందా’ అని అడిగారు. వాళ్ళు ‘అయ్యా! మా తప్పు కాదు. కొత్త బోయీ సరిగా లేడు. వీడి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు’ అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ బోయీవంక చూసి పరిహాసమాడాడు. మోస్తున్న వాడు బ్రహ్మజ్ఞాని. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. రాజుగారు పల్లకి తెర తప్పించి క్రిందికి చూసి ‘తిన్నగా నిందించకుండా పరిహాసపూర్వకమయిన నింద చేశాడు. అలా చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తాను అన్ని మాటలు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు. ఈయన మరల బ్రహ్మమునందు రమించిపోతూ మళ్ళీ దూకాడు ఎందుకో మళ్ళీ రాజుగారి బుర్ర ఠంగుమని తగిలింది. అపుడు రాజు ‘ఒరేయ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపడడము లేదు. నిన్ను రాజ దండనము చేత నా మార్గములోనికి తిప్పే అవసరము నాకు కనపడుతోంది. పలకవేమిటి?’ అన్నాడు. ఇప్పటివరకు పుట్టిన తరువాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ‘రాజా, నువ్వు మాట్లాడింది నిజమే. నువ్వు ఎవరికి శిక్ష వేస్తావు? ఈ దేహమునకు శిక్ష వేస్తాను అంటున్నావు. ఈ దేహం నేను కాదు. నేను ఆత్మని ఉన్నవాడిని నేను. ఇది నీ మాయని నీ అజ్ఞానమును బయటపెడుతున్నది’ అన్నాడు.

ఈమాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. ‘ మోస్తున్న వాడెవడో సామాన్యుడు కాదు. ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు’ అని పల్లకి ఆపమని గభాలున క్రిందికి దూకి ఆయనవంక చూస్తే గుర్తుపట్టడానికి యజ్ఞోపవీతం ఒక్కటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా! నన్ను పరీక్ష చేయడానికి బహుశః కపిలుడే ఇలా వచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు? నిజం చెప్పండి. మీవంటి బ్రాహ్మణులు జోలికి నేను రాను. మీమాటలు నన్ను చాలా సంతోష పెట్టాయి. నాకొక్క మాట చెప్పండి. లేనిది ఎలా కనపడుతోంది? ’ అని క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళమీద పడ్డాడు రాజు. భరతుడు నవ్వి ‘రాజా! నువ్వు ఉపదేశం పొందడానికి అర్హత పొందావు. అందుకని చెపుతున్నాను. ‘నేను’ అనబడే పదార్థము ఈ కన్నుల చేత చూడలేనిది కాదు. ఈ కన్నులకు కనపడుతుంది. దీనిని తిరస్కరించక పోతే ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇంకా నీకు బోధ ఎందుకు? ఈ నేత్రానికి మూడిటి వలన అనేకము కనపడతాయి. అవి కాలము, బుద్ధి, నామములు. రూపము ఉంటే నామము ఉంటుంది. నామము ఉంటే రూపము ఉంటుంది. నామము రూపము రెండూ లేకపోయినట్లయితే మాయ పోయినట్లు అవుతుంది. రూపము చేత నామము మారదు. నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. ఈ రెండూ అశాశ్వతమే. నామము, రూపము రెండూ అబద్ధమే. నామ రూపములుగా కాలగతియందు బుద్ధిచేత తిరస్కరింపబడుతుంది. మాంస నేత్రముచేత మగ్నము చేయబడుతుంది. అది నీవు తెలుసుకుంటే నేను చెపుతాను. ఒక్కమాట ఆలోచించు. ఇది పృథివి. ఈ భూమిమీద నా చరణములు పృథివి. నా చరణముల మీద నా కాళ్ళు పృథివి. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారమునకు నీవు ఒక పేరు పెట్టుకున్నావు. ‘నేను మహారాజును – వాడు బోయీ’ అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడడానికి ఆధారమయిన ఆత్మ, నాలో వున్న ఆత్మ ఒక్కటే. రెండూ రెండు శరీరములను ధరించాయి. ఈ రెండూ నామరూపముల చేత గుర్తించ బడుతున్నాయి. ఇవి మాయ వీటికి అస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్లే. నీకు తత్త్వం అర్థం అయింది. సంసారం అనే అడవి దీనిని అర్థం కాకుండా చేస్తుంది. అక్కడ బంధుత్వములనే తోడేళ్ళు ఉంటాయి. అవి మేకలవెంట తరుముకు వచ్చినట్లు వస్తాయి. ప్రతివాని ఇంట్లో ఈగలు ఉంటాయి. పొమ్మంటే పోవు. వాటిని తోలుకు తిని బతుకుతూ ఉంటారు. అలాగే పిల్లలు భార్య వెంబడించి ఉండనే ఉంటారు. కామము పోయినట్లు ఉంటుంది. మళ్ళీ వచ్చి చేరుతుంది. రాజా వ్యవసాయం బాగా చెయ్యాలని ఆనుకున్న వాడు కలుపుమొక్కని కత్తిరిస్తే సరిపోదు. మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయటపారేసి ఎండిపోయిన తరువాత తగులబెట్టెయ్యాలి. తరించాలనుకున్నవాడు కామమును ముందు గెలవాలి.

అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెళుతుండగా నిన్ను చూసి ఆరుగురు దొంగలు వెంట పడతారు. ఆ ఆరుగురు ఎక్కడో లేరు. ఇక్కడే ఉన్నారు. అయిదు ఇంద్రియములు, మనస్సు – ఈ ఆరుగురు లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకు పోతారు. నువ్వు పతితుడవయిపోయి పతనమయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం శరీరంలోకి వెడుతూ ఉండడం ఇది ‘నేను’ అనుకోవడము దీని అనుబంధములతో మగ్నం అయిపోవడం ఈశ్వరుడిని తెలుసుకోవడం. అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు. రాజా! ఏనాడు నీ జ్ఞాన నేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల పాదసేవ చేస్తావు. వారి పాదముల మీద పడతావు. బ్రహ్మ జ్ఞానమును పొందుతావు. భక్తితో ఉంటావు. కర్మా చరణమును చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి పొందవలసిన స్థితి. అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రహూగణుడు విని వైరాగ్యమును పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతమును తెలుసుకున్నాడు భరతుడు మోక్షమును పొందాడు.

ఇలా ఎంతోమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది. మనిషి సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అరణ్యమునకు వెళితే మోక్షం వచ్చేస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు. ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటకు వెళ్ళి ఋషభుడు మోక్షమును పొందాడు. ఇంట్లో ఉంటే నన్నేదో పట్టేసుకుందని భయపడిపోయి అరణ్యము వెళ్ళి మూడు జన్మలు ఎత్తి మోక్షం పొందాడు భరతుడు. పాడుచేసేది ఇల్లు కాదు. లోపల వున్న మనసు. అందుకే ఆధునిక కవి ఒకమాట అన్నారు.

'తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకు నిలయమయిన మనస్సును ప్రక్షాళన చేయాలి. నీ మనస్సే నీ ఉన్నతికి గాని, పతనమునకు గాని కారణము అవుతోంది అని ఒక అద్భుతమయిన విషయాన్ని నలుగురి యందు నాలుగు విషయములను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమయిన ఘట్టమును గృహస్థాశ్రమంలో తరించడానికి మనకి ఉన్న అనుమానములను నివృత్తి చేస్తూ వ్యాసభగవానుడు ఇచ్చిన అమృతఫలములను పోతనగారు ఆంధ్రీకరించి మనలను ఉద్దరించారు.



షష్ఠ స్కంధము – అజామిళోపాఖ్యానం:

ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రమించే స్థితిని కలిగి ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామీళుడు. ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. అజామీళునికి యజ్ఞోపవీతము ఉన్నది సంధ్యావందనం చేసిగాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణము శాంతము.

దాంతుడై ఉన్నాడు. దాంతుడు మనసును గెలవడం. మనస్సు ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనసును ఇంద్రియములను గెలిచాడు. ఇక్కడే ఒక విషయమును గుర్తుపెట్టుకోవాలి. ఒకరాజు ఒక రాజ్యమును గెలిస్తే ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందనే నమ్మకమేమీ ఉండదు. ఈయనకన్నా బలవంతుడయిన రాజు వచ్చి ఈయనను చంపి ఆ రాజ్యం ఆయన కొల్ల గొట్టవచ్చు. అలాగే ఇంద్రియములను గెలిచినా వాడు మరొక పదినిమిషములు గడిచిన తరువాత పతనమై క్రిందపడి పోవచ్చు. ఆయన మోక్షమును పొందితే ఆయన ఇంద్రియములను మనసును గెలిచినట్లు లెక్క. అవి ఏ క్షణంలో అయినా కాటు వేయడానికి నిరంతరము కాచుకుని ఉంటాయి. మంచి యౌవనమును పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై, దాంతుడై ధర్మసంశీలుడై ఉన్నాడు.

శీలము అంటే స్వభావము. అజామీళుడు నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించ గలిగినవాడు. తన ధర్మమును తాను నెరవేర్చిన వాడు. అంతమాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతము తీసుకువచ్చాడు. ఎన్నోమంత్రముల సిద్ధిని పొందాడు. అతని శరీరము మంత్రపూతమయింది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు.

అజామీళుడు సత్యభాషణ నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామీళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు.

భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీళుడి యౌవనం గురించి పోతన గారు అన్ని పద్యములు వ్రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి. దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకో గలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యౌవనము మాత్రమే. ఈ యౌవనమును ప్రధానముగా రెండు భ్రంశము చేస్తాయి. ఒకటి అర్థార్జన. అర్థ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుట యందు నిమగ్నమయిన వాడు, బెల్లపు పరమాన్నమయినా అదే రుచి, పంచదార పరమాన్నమయినా అదే రుచి – ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామినీ పిశాచము పట్టుకుని తన ధర్మపత్ని జంట ఉండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించి పోతున్నాడు. ఈ రెండింటి చేత యౌవనము నశించిపోతున్నది. అలా నశించిపోవడం అత్యంత ప్రమాదకరము.

అజామీళుడికి యౌవనం అంకురించింది. మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపుపురుగు నశించి పోతుంది. దీపపు పురుగు దీపమును చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళుతుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపము ఆకర్షించేదానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యౌవనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించి పోయింది.

పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటకాడు రెండు మూడురోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆపాట విని దానికోసం పరుగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు. చెవి వలన లేడి మరణిస్తోంది.

చర్మమునకు కండూతి’ అనగా దురద ఉంటుంది. ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం. ఏనుగులను పట్టుకునే వారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలయిన పరికరములు అక్కడ పెడితే ఏనుగు అక్కడకు వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుతుంది. ఆ ఊగుడికి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈవిధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించి పోతున్నది.

నాల్గవది రసనేంద్రియము – నాలుక. దీనివలన పాడయిపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణ వాయువును తీసుకుని బ్రతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులు అంటే ఎంత ఇష్టమో. ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈవిధంగా రసనేంద్రియం చేత చేప నశించి పోతోంది.

ఇక వాసన. పద్మమునందు సుగంధము ఉంటుంది. ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడినుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వులలో మకరందమును పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్క సారి చీకటిపడి పువ్వు ముకుళించుకు పోతుంది. అది పువ్వులో చిక్కుకు పోతుంది. ఆ సమయమునకు నీళ్ళు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండముతో పీకివేసి నేలమీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ ఉన్న సీతాకోకచిలుక ఏనుగు పాదము క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది.

ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించి పోతోంది. ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమయినా మిమ్మల్ని కరచి వేయవచ్చు. ఇంద్రియములను త్రిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. అజామీళుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతమును అందరూ వినవచ్చు. యౌవనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు. ఆయనను తండ్రిగారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు పువ్వులు తీసుకు రావలసినదని చెప్పారు. తండ్రి మాటప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిధలు కోసి సంతోషముగా ఇంటివైపుకి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కల్లుకుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమయిన జన్మను పొందిన ఒక స్త్రీ, ఆ కల్లును తాను విశేషముగా సేవించి శారీరకమయిన తుచ్ఛమయిన కామమునందు విశేషమయిన ప్రవేశము అనురక్తయిన ఒక స్త్రీ కల్లు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమయిన అభినివేశము ఉన్న వాడితో ఆనందముగా పునః పునః రతిక్రీడ జరుపుతున్నది.

అజామీళుడు ఆ సన్నివేశము చూశాడు. శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు. భాగవతం చెప్పగలిగాడు. అజామీళుడి మనస్సును ఆ దృశ్యము ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడడం ప్రారంభం అయింది. అలా నిలబడి తమకముతో ఆ సన్నివేశమును వీక్షించాడు. ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభం అయింది. వారిద్దరూ వెళ్ళిపోయిన తరువాత తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చి అసురసంధ్య వేళ సంధ్యావందనమునకు కూర్చున్నాడు. మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము కాదు. పొదలమాటున తన కన్ను దేనిమీద నిలబడిందో అది కనపడుతోంది. ఇంట ధర్మపత్నియై సుగుణాల రాశియై సౌందర్యవతియైన భార్య ఉన్నది. ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. అతడు చూసిన సన్నివేశము వీటన్నింటిని తొలగదోసినది. ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి, తండ్రికి తెలియకుండా ఆహీనకుల సంజాత అయిన ఆ స్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనమును దోచుకున్నాడు. కులట స్త్రీయందు తొమ్మిదిమంది బిడ్డలను కన్నాడు.

అతడు చేసిన ఒకే ఒక మంచి పని – ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిడ్డడికి ‘నారాయణ’ అని పేరు పెట్టడము. ఆఖరి పిల్లాడు అవడము వలన వాడిమీద మమకారము ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రమ్మనేది. అందుకుగాను దొంగతనములు చేయడం మొదలు పెట్టాడు. ఎంతో వేదము చదువుకుని, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినవాడు, శాంతు డై, దాంతుడై సకల వేదములను చదివి, మంత్రసిద్ధులను పొందిన అజామీళుడు ఈవేళ ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేడని అనిపించుకున్నాడు.

ఇంత పతనము ఒక్క ఇంద్రియలౌల్యం వల్ల వచ్చింది. మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియములను గెలవడం ఎంతో కష్టము.




ఇంద్రియములను గెలవడం చాలా కష్టం. ఇంద్రియములను తొక్కిపట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు కాటువేసి మనిషిని పతనం చేస్తాయి. ఈవిధంగా అజామీళుడు చిట్టచివరకు దొంగ అయ్యాడు. అతను గ్రహించుకోలేనిది ఒకటి ఉన్నది. దాని పేరు కాలము. అది ఎవ్వరి గురించి ఆగదు. ఎప్పుడో ఒకరోజు మహా మరణకాలము వస్తుంది. ఆ మృత్యువు కబళించక ముందే ఈశ్వరనామమును చెప్పుకోవాలి. అజామీళుడు భోగములు, సుఖములు శాశ్వతం అనుకున్నాడు. అతనిని తీసుకువెళ్ళి పోయే సమయం వచ్చేసింది. భటులు భయంకరమయిన రౌద్ర రూపములతో వచ్చారు.  అంతా వచ్చి ఏడుపులు మొదలుపెడతారు. ఆ సమయంలో రక్షించేది ఏదయినా ఉన్నది అంటే అది నీవు చేసుకున్న సాధన ఒక్కటే! స్వామి నామమును ఉచ్ఛరించగలగాలి. శరీరమును విడిచి పెట్టేటప్పుడు మురికిలో పడిన ఉత్తరీయము తీసి విసిరి పారేసినట్లు శరీరమును వదిలి ఈశ్వర పాదములయందు ప్రవేశించ గల ధృతిని పెంచుకో' అంటారు. అందుకు సాధన అవసరం. యమదూతలు వచ్చి అజామీళుడి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళను చూసేసరికి ఈయనకు విపరీతమైన భయం వేసింది. అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నముగా నారాయణా! అని తన కొడుకును తలచుకుంటూ గొణిగాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇంతవరకు ఎంత భయమును పొందాడో ఆ భయమును మాయం చేయగలిగిన విచిత్ర విషయమును చూశాడు.

నలుగురు దివ్య తేజోవంతులయిన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశములను తీసివేయమని చెప్పారు. యమధర్మరాజు భటులు ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నించారు. ‘మేము ఎవరిమో చెప్తాము. ముందు ఆ పాశములను తీసివెయ్యండి’ అన్నారు. యమదూతలు తమ పాశములను విడిపించారు. అజామీళుడికి పూర్వపు ఓపిక వచ్చింది. వాళ్ళ మాటలు బయట వాళ్ళకు వినబడడం లేదు. కానీ అజామీళుడు మాత్రం వాళ్ళ మాటలను వింటున్నాడు. ఆవచ్చిన వాళ్ళు ఎవరా? అని అజామీళుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. యమదూతలు 'వీడెవడో తెలుసా! పరమ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి? మీరు ఎందుకు వదలమంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎవరు? అని అడిగారు.

విష్ణుదూతలు 'మమ్ములను విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠమునుండి వచ్చాము. అజామీళుడిని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు. అందుకని వచ్చాము’ అన్నారు.

యమభటులు ‘ఇది ధర్మమా? ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతాము?’ అని అడిగితే విష్ణుదూతలు ‘ ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా గలిగిన యమధర్మరాజు గారిని అడగండి. మీరు ఇతడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు. మేము ఇతని కోటిజన్మల పాపముల గురించి మాట్లాడుతున్నాము. అంత్యమునందు శరీరమునందు ప్రాణోత్క్రమణం జరుగుతున్న సమయములో ఇతడు ఈశ్వరుని నామమును పలికాడు. అది అమృత భాండము. శ్రీహరి నామమును పలికిన కారణం చేత కోటిజన్మల పాపరాశి ధ్వంసము అయిపోయింది. ఇతనిని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు’ అన్నారు. యమదూతలు ‘అయితే వీడు చేసిన పాపములు అన్నీ ఏమయ్యాయి?' అని అడిగారు. విష్ణుదూతలు నీవు మాతో రావచ్చు అని అజామీళుడిని వైకుంఠమునకు తీసుకు వెళ్ళిపోయారు. ఆయన శ్రీమన్నారాయణునిలో ఐక్యం అయిపోయాడు. భాగవతుల తోడి అనుబంధమే మనలను రక్షిస్తుంది.

వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజుగారి వద్దకు వెళ్ళి 'మాకో అనుమానం. ఇన్నాళ్ళ నుండి నీవు తీసుకురమ్మన్న వాళ్ళను మేము వెళ్ళి తీసుకు వచ్చేవాళ్ళం. ఈవేళ మేము వెళ్లేసరికి అక్కడికి నలుగురు వచ్చి అజామీళుడిని వదిలిపెట్టమన్నారు. తెలిసో తెలియకో భగవంతుని నామం చెప్పడం వలన అతని పాపములు పోయాయి అంటున్నారు. పాపములు అలా నశించి పోతాయా? మా సందేహములను నివృత్తి చేయవలసింది' అని కోరారు. యమధర్మరాజు తన భటులను అందరినీ పిలిపించి ఒక సమావేశమును ఏర్పాటు చేసి 'జీవులు తమ జీవితములయందు అనేక పాపకర్మలను చేసి ఉంటారు. చేసినపాపం నశించడం మాట ఎలా ఉన్నా చేసిన పాపము చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. దానికి ప్రాయశ్చిత్తకర్మ అంటారు. ప్రాయశ్చిత్తము చేత వారు చేసిన పాపముల వ్యగ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కర్మను భక్తివైపుకి తిప్పుకోవాలి. భక్తికి బదులు వెర్రి అనుమానములు ప్రారంభమయిపోకూడదు. కలలో ఇందిరారమణుని పాదములు కనపడని వాడు ఎవడయినా ఉంటే వాడిని మీరు తీసుకువచ్చేయవచ్చు. అర్హతను మరచి పెద్దలు వ్రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని, యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించని వాళ్ళను, దేవుని ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడడానికి అడుగుతీసి అడుగు పెట్టని దుర్మార్గమయిన పాదములు ఉన్నవారిని, మహాభాగవతులయిన వారి పదముల అడుగున ఉన్న ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నిలబడడమేమిటని ధ్వజ స్తంభములా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకు వచ్చేయండి. నే చెప్పిన వారినే కాదు. ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని నాలుగు తరముల వరకు ఏరి అవతల పారెయ్యండి. అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడేవారిని కూడా లాగి అవతల పారవేయవచ్చు.

నా స్వామి చరణములు నాకు చాలని స్వామి పాదములను గట్టిగా పట్టుకొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో ఆయన పేరు చెబుతుంటారో అటువంటి వారిని, ఈశ్వరుని నామం చెప్పిన వారిని, వారికి సంబంధించిన నాలుగు తరముల వాళ్ళని, వారితో కలిసివుండే వాళ్ళని తొందరపడి తీసుకురావద్దు. బాగా పరిశీలించండి. సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా అక్కడికి విష్ణుదూతలు కనుక వచ్చినట్లయితే మీరు వచ్చేయండి. వాళ్ళ జోలికి వెళ్ళవద్దు’ అని తీర్పు చెప్పాడు. దీనిని బట్టి మనకు అన్నిటికన్నా ఈశ్వరనామము గొప్పదని తెలుస్తోంది. నామమును పట్టుకోవడం ముందు నేర్చుకోవాలన్న విశిష్టమయిన విషయమును చెప్పినది ఈ ఆఖ్యానము. ‘నిరంతరము నా నాలుకమీద ఈశ్వరనామము నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వరా! నిర్హేతుకముగా కటాక్షించు’ అన్నారు రామదాసుగారు. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం!! అని మార్కండేయుడు ఈశ్వరనామమును చెపుతుంటే స్వామి యమధర్మరాజు గారిని తన్నాడు.

వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం

భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్

కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే

మచ్చేతో మణి పాదుకా విహరణం శంభో! సదాఽo గీ కురు!!

అంటూ శంకరభగవత్పాదులు శివానందలహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవము కలిగిన నామము ఏది ఉన్నదో ఆ నామము వ్యాసభగవానుడి అనుగ్రహముగా, పోతనామాత్యుల అనుగ్రహముగా, మన గురువుల అనుగ్రహముగా, శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహముగా, నిరంతరము మన నాలుకయందు నర్తించు భాగ్యము మనకు కలుగుగాక! అని ఈశ్వరుడు మనలను కటాక్షించుగాక!

ఈ అజామిళోపాఖ్యానం ఎవరు చదివిన వారికి, విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరించిన వాళ్లకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదని వ్యాసమహర్షి అభయం ఇచ్చారు. అదీ దాని ఫలశ్రుతి!





కార్తీకపురాణం 2వ అధ్యాయం*

 *కార్తీకపురాణం 2వ అధ్యాయం*

                 🌺🌺🌺🌺🌺🌺🌺🌺


                *సోమవార వ్రత మహిమ*


వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు.

”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను.

అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది.

ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు.

ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను,సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు.

”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత,

తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

కుక్క కైలాసానికి వెళ్లుట…

”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడుఏ. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.

దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”


*ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.*

కర్మ - ఎలా పని చేస్తుంది

 *_నేటి మాట_*

      

              *కర్మ - ఎలా పని చేస్తుంది?? అది ఎలా వుంటుంది??*


కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకి లను చూడటానికి, చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు...


దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే 'నాయనా! నీవే పరమాత్మవి కదా!!...

నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి ' అని అడిగింది...

అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు ..

*'అమ్మా! నన్ను క్షమించు, నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? '* చిరునవ్వు తో!...

దేవకి ఆశ్చర్య చకితురాలయింది, 

*'కృష్ణా ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు?*' అని అడిగింది...

కృష్ణుడు అన్నాడు ...

*'అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు...!'*

దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, *'అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో? అని*


కృష్ణుడు ఇలా అన్నాడు, *'ఇంకెవరు?యశోద మాత! 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది.'*


ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు, ఇంకా మానవ మాత్రలం మనమెంత!!...


               *_🪷శుభమస్తు🪷_*

     🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

శివానందలహారీ

 శివానందలహారీ


మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ 

కర  శ్చాభ్యర్చాయాం శ్రుతీ రపి కథాకర్ణనవిధౌ

తవ ధ్యానే బుద్ధి ర్నయనయుగళం మూర్తి విభవే

పరగ్రంథాన్ కై ర్వా పరమ శివ జానే పరమతః  



సీ. భవ్యమౌ భవదీయ పాదాబ్జములయందు

            నిరతంబు నా మది నిలుచు గాక !

     పావనంబగు నీదు ప్రార్థనా శ్లోకముల్

           వాక్కులో  నిరతంబు వఱలు గాక !

     పూతాత్మతో నీదు పూజ సల్పుటకునై

           యుభయ కరంబులు నుండు గాక !

     నిగమ బోధితమైన నీ కథా మధురిమల్

            వీనులు నిరతంబు వినును గాక !

     నీ ధ్యాన మందునే నిరతంబు నా బుద్ధి

            నిలకడ తోడను నిలుచు గాక !

     దివ్యమౌ నీ మూర్తి తిలకించు తపనతో 

            మన్నేత్ర యుగ్మమ్ము మసలు గాక !

తే. ఇంతకంటెను వేఱగు నెఱుక తెలియ 

     నిచ్చగించను ఫాలాక్ష ! యెన్నడేని

     నాదు సర్వేంద్రియములతో నీదు సేవ

     సల్పు మది నిమ్ము శంకరా ! చాలు నదియె    



గోపాలుని మధుసూదనరావు శర్మ

తల్లి తండ్రుల గురించి

 131)ఆత్మ విద్య -మీ జన్మ రహస్యం :-రాజకీయ అంటే 1)రా -రావణుడు,2)జ -జరా సంధుడు,3)కి -కీచకుడు. 4)య -యముడు.5)ము -ముషీక సురుడు. వీలందరు రాక్షషులు రాజకీయములో ఈ రాక్షశాసులను లో లేను జయించగలగాలి.


*తల్లి తండ్రుల గురించి ధర్మ శాస్త్రం ఏమి చెబుతుంది.* 


(1) ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి. 

(2) ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి.

(3) ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును. 

(4) సత్యం తల్లి జ్ఞానం తండ్రి. 

(5) పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. 

(6) తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి. 

(7) ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం. 

(8) ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు. 

(9) తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. 

(10) తల్లిని మించిన దైవం లేదు ? గాయత్రిని మించిన మంత్రం లేదు. 

శుభం సర్వే జనాః స్సుఖినో భవంతు

సమస్త సన్మంగళాని భవంతు.

ప్రత్యుపకారం-మైనాకుడు-హనుమ

 3 ప్రత్యుపకారం-మైనాకుడు-హనుమ


కృతే చ ప్రతికర్తవ్యమ్ ఏష ధర్మః సనాతనః | సోయం త్వత్ప్రతికారార్థీ త్వత్తః సమ్మానమర్హతి || 5/1/114 ఉపకారికి ప్రత్యుపకారము చేయడం సనాతన ధర్మం.


నీకు సహాయం చేయడంవల్ల, ఇక్ష్వాకువంశీయులకు ప్రత్యుపకారము చేసినట్లవుతుందని సముద్రుని భావన. నా ఆతిథ్యం స్వీకరిస్తే, సముద్రుని గౌరవించినట్లే అవుతుంది.


ఉపకారాలూ - ప్రత్యుపకారాలూ 1. సగరపుత్రులు త్రవ్వగా విశాలమై, అది సముద్రునికి ఉపకారం - సగర వంశీయుల పనిపైనున్న హనుమకి ఆతిథ్య సంకల్పం, సముద్రుని ప్రత్యుపకారం.


2. వాయువు మైనాకుని సముద్రంలో


పడవేయగా, వాయువు వలన మైనాకునికి ఉపకారం- వాయుపుత్రునికి ఆతిథ్యాహ్వానం, మైనాకుడు వాయువుకు చేసిన ప్రత్యుపకారం.


3. సముద్రుడు తనలో ఉంచుకొనడంతో, సముద్రుని వలన మైనాకునికి ఉపకారం - సముద్రుడు చెప్పినది చేసి, మైనాకుడు సముద్రునికి చేసినది ప్రత్యుపకారం.

Cherish every Moment.*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*Out of 100, Only 8 live >65 years of age.*


_Hats off to whoever has compiled this statistics! Read and understand how lucky we are!!_ 


The current population of Earth is around 7.8 billion.

For most people, it is a large figure, that is all.


 However, someone has condensed the 7.8 billion in the world into 100 persons, 

and then into various percentage statistics. 

The resulting analysis is relatively much easier to comprehend.


*Out of 100 persons:*

11 are in Europe

5 are in North America

9 are in South America

15 are in Africa

60 are in Asia


*Out of 100 persons:*

49 live in the countryside

51 live in towns/ cities


*Out of 100 persons:*

77 have their own houses

23 have no place to live.


*Out of 100 persons:*

21 are over-nourished

63 can eat full

15 are under-nourished

1 ate the last meal, but did not make it to the next meal.


*Out of 100 persons:*

The daily cost of living for 48 is less than US $2.


*Out of 100 persons:*

87 have clean drinking water

13 either lack clean drinking water or have access to a water source that is polluted.


*Out of 100 persons:*

75 have mobile phones

25 do not.


*Out of 100 persons:*

30 have internet access

70 do not have conditions to go online


*Out of 100 persons:*

7 received university education

93 did not attend college.


*Out of 100 persons:*

83 can read

17 are illiterate.


*Out of 100 persons:*

33 are Christians

22 are Muslims

14 are Hindus

7 are Buddhists

12 are other religions

12 have no religious beliefs.


*Out of 100 persons:*

26 live less than 14 years

66 died between 15 - 64 years of age

*8 are over 65 years old*.


*Out of100 persons in the world, only 8 can live or exceed the age of 65.*


*Conclusion*

If you have your own home,

Eat full meals and drink clean water,

Have a mobile phone,

Can surf the internet, and

have gone to college,

You are in the miniscule privileged lot. 

(in the less than 7% category)


*If you are over 65 years old. Be content and grateful.  Cherish life, grasp the moment.*


*You did not leave this world before the age of 64 years like the 92 persons who have gone before you. You are already the blessed amongst mankind.*


Take good care of your own health because nobody cares more than you yourself!


*“Thank nature for all the Blessings”*

*Cherish every Moment.*

🪷🪷🪷

కార్తీక దీపాలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి?* 


*దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి*?


Kartheeka Deepam: దైవ భక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయిన కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. 


కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ, వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడనీ కథలున్నాయి. ఈ నెలరోజులూ ఇంట్లో దీపాల కన్నా చెరువులు, నదుల్లో దీపాలు వదులుతుంటారు. ఏ నదీతీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడుతుంటంది.... సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది. ఇంతకీ కార్తీకమాసం నెలరోజులూ నదుల్లో, చెవులుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు.... .దీనివెనుకున్న ఆంతర్యం ఏంటంటే..


నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం

అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం

శివమ్ శివమ్ భవ హరం హరం

శివమ్ శివమ్ భవ హరం హరం


ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రం అయిన న-మ-శి-వా-య అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలున్నాయి. ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే. పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు. ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏంటంటారా.. ముందుగా శివం-పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది.


ఆత్మ జ్యోతి స్వరూపం

ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు. జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే. ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామంటారు. అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు.


అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువును తులసి దళాలు, కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతో.... శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమగతులు కలుగుతాయంటారు. ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానంచేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదంటారు. 


సేకరణ వెంకటరమణ సోమ...✍️

శివుని స్తోత్రం చేసేదే నాలుక

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లో* : సా జిహ్వా యా శివం స్తోతి తన్మనో ధ్యాయతీశ్వరం

తౌ కర్ణా తత్కథాలోకౌ తౌ హస్తా తస్య పూజకా

తే నేత్రే పశ్యతః పూజాం hb

        *"శివుని స్తోత్రం చేసేదే నాలుక.... శివుని ధ్యానించేది మనస్సు.... శివుని కథలను వినడానికి ఉత్సాహ పడేవి చెవులు.... శివార్చన చేసేవి చేతులు..... శివ పూజ చూసేవి కన్నులు.... శివునికి నమస్కరించేది శిరస్సు....శివ క్షేత్రాలకు భక్తితో వెళ్ళేవి పాదాలు‘‘‘అని అర్థం* ..... 


          శివ భక్తి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు ఇంతకంటే వేరే మాటలు ఉండేవేమో!!. సకల చరాచర జగత్తుకు ఆధారభూతమైన సచ్చిదానంద స్వరూపమే శివుడు.....*"శివ"అనే మాటకు మంగళం, క్షేమం, భద్రం, శాంతి, సౌఖ్యం, శుభం, శుద్ధత అను అనేక అర్థాలున్నాయి*.....ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికీ అవసరమే.....అందరూ కోరుకునేవే....భక్తితో శివారాధన చేస్తే ఇవన్నీ సిద్ధిస్తాయి....*అందరమూ భక్తితో పరమ శివుని కొలిచి మన జీవితాలను సార్థకం చేసుకుందాము*.....స్వామి అనుగ్రహంతో మన జీవన గమనాన్ని సుఖమయం చేసుకుందాము...


*అందరికీ కార్తీకమాసం శుభాకాంక్షలు* 🙏

✍️VKS©️MSV🙏

జయా - జాయా

 జయా - జాయా


దాదాపు ముప్పైఅయిదు సంవత్సరాల క్రితం శ్రీమఠంలో నవరాత్రి సందర్భంగా సరస్వతి పూజ రోజు జరిగిన సంఘటన ఇది. ఎప్పటిలాగే మహాస్వామివారు త్రిపురసుందరి సమేత చంద్రమౌళిశ్వర పూజ పూర్తీ చేసి ఆరోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతి పూజ మొదలుపెట్టారు. వైదికులొకరు స్వామివారి దగ్గర కూర్చొని చేతిలోని పుస్తకం సహాయంతో మంత్రభాగం చెబుతున్నారు.


సంకల్పము, ఆవాహనము, ప్రాణ ప్రతిష్ట, అంగ పూజ అయిన తరువాత సరస్వతి అష్టోత్తరం చదవడం ఆరంభించారు. ప్రతి నామము చివర నమః తరువాత స్వామివారు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తున్నారు. 

ఆ వైదికులు అష్టోత్తరం చదువుతూ, 


“ఓం బ్రహ్మజయాయై నమః” అని చెదివారు.


ఈ నామం చేదివిన తరువాత మహాస్వామివారి చేతిలోని పూవు సరస్వతి అమ్మవారి పాదాలను తాకలేదు. ఆలాగే స్వామివారి చేతిలోనే ఉన్నది. మరలా అలాగే అదే మంత్రాన్ని చెదివారు వైదికులు. ఊహు! ఇప్పుడు కూడా స్వామివారు పువ్వు సమర్పించలేదు. అలా ఎన్ని సార్లు నామమును చదివినా మహాస్వామివారిలో కించిత్ చలనం కూడా లేదు. 


చేతిలో పువ్వును పట్టుకుని అలా స్థాణువులా ఉండిపోయారు.

ఏం అపచారం జరిగిందో అని అక్కడున్నవారందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు మహాస్వామి వారు చేతిలోని పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం లేదు?


ఈ విషయం శ్రీమఠం మేనేజరుకు చేరింది. విశ్వనాథ అయ్యర్ తొ పాటు ఆయన కూడా పూజ జరుగుతున్నా స్థలానికి వచ్చారు. ఆయన వైదికుణ్ణి ఆ నామాన్ని పలుకమని అడుగగా ఆయన అలాగే నామాన్ని చెప్పాడు “ఓం బ్రహ్మజయాయై నమః” అని.


ఎటువంటి చలనము లేక మహాస్వామివారి చేతిలో పుష్పం అలాగే ఉండిపోయింది. అదృష్టవశాత్తు అక్కడే ఒక సంస్కృత పండితుడు కూడా ఉన్నాడు. ఆ నామాన్ని ఆయన సవరించి దాన్ని ఇలా పలకమని ఆదేశించారు.


“ఓం బ్రహ్మ జాయాయై నమః”


వెంటనే మహాస్వామివారి చేతిలోని పుష్పం అమ్మవారి పాదాలపై పడింది.


ఈ రెండునామాలకి ఉన్న తేడా ఏమిటి అంటే, 


“ఓం బ్రహ్మ ‘జాయాయై’ నమః” అంటే బ్రహ్మ పత్ని అయిన అమ్మవారికి ప్రణామములు అని. “ఓం బ్రహ ‘జయాయై’ నమః” అంటే బ్రహ్మను గెలిచిన అమ్మవారికి ప్రణామములు అని అర్థం. మహాస్వామివారు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా పూజ చేసేవారు కాని, యాంత్రికంగా చేసేవారు కాదు. వారి పూజకట్టులో మడికట్టులో వారికి వారే సాటి కాని వేరొకరు కాదు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నాగులచవితి

 నాగులచవితి గురించి సందేహ వివరణ


తేదీ 28.10.2022 శుక్రవారం చవితి  ఉదయం 10.33 ని.లకు ప్రారంభం అయి తేదీ 29.10.20220 శనివారం ఉదయం 8.13 ని.ల వరకు ఉంటుంది. 


సాధారణంగా చవితి మధ్యాహ్నం వరకు ఉన్న సమయంలో నాగదేవత ఆరాధన చేయాలి. అంటే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్న శుక్రవారం నాడు మాత్రమే నాగులచవితి చేయాలి. అలాకాకుండా శనివారం ఉదయం 6.00 నుండి 7.40 వరకూ దుర్ముహూర్తం ఉంది. అంటే శనివారం కేవలం 33 నిముషాలు మాత్రమే చవితి ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఉండదు. 

అందుచేత శుక్రవారం నాడు ఉదయం 10.33 తరువాత నాగులచవితి పండుగ ఆచరించడం సాంప్రదాయం. 

దీని గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శనివారం అని అంటారు. కానీ అది నిజం కాదు. ఈ విషయం మీకు తెలిసిన వారికి తెలియచేయండి. 


తేదీ 28.10.2022 శుక్రవారం నాడు మాత్రమే నాగులచవితి చేయాలి. 


రకరకాల వాట్సాప్ గ్రూపు లో శనివారం అని అంటున్నారు. అటువంటి మెసేజులు వస్తే వెంటనే దానిని మిగతా వారికి గుడ్డిగా పంపకుండా ఆలోచన లేకుండా అనుసరించవద్దు.

⚘️⚘️⚘️GOOD IMC ⚘️⚘️⚘️

ఇట్లు

మీ

నాగరాజు శర్మ