27, అక్టోబర్ 2022, గురువారం

రామాయణానుభవం_ 202*

 *రామాయణానుభవం_ 202* 


సౌమిత్రి మళ్ళీ విజృంభించి ఇంద్రజిత్తు ధనుస్సును విరగగొట్టాడు. కవచంచీల్చి బాణాలు నాటాడు. వాడు రక్తం కక్కుకుంటూనే మరోధనుస్సు అందుకొని తీవ్రబాణాలతో రామానుజుణ్ని హింసించాడు. అప్పుడు లక్ష్మణుడు రెండు బాణాలతోరథసారధి కాళ్ళు విరగగొట్టాడు. మరొకబాణంతో శిరస్సు ఎగరగొట్టాడు. సారథి లేని అశ్వాలు మండలాకారంలో రథాన్ని త్రిప్పుతూ అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఆ సమయంలో అన్ని గుర్రాలనూ అన్నే బాణాలతో ఒకేసారి సౌమిత్రి సంహరించాడు.


ఇది పెద్ద అవమానంగా భావించి ఇంద్రజిత్తు మూడు బాణాలను సౌమిత్రి గుండెలకు గురిచూసి వదిలాడు. అతడిది అభేద్యకవచం అని తెలుసుకొని మరో మూడు బాణాలను నుదుటికి తగిలేట్టు వదిలాడు. అవి నాటుకొని సౌమిత్రి తల మూడు శిఖరాలున్న పర్వతంలా కనిపించింది.


అప్పుడు సౌమిత్రి వారుణాస్త్రం ప్రయోగించగా దానిని రౌద్రాస్త్రంతో త్రిప్పికొట్టి ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రం వేసాడు. లక్ష్మణుడు మళ్ళీ వారుణం ప్రయోగించి చల్లార్చాడు. రావణి ఆసురాస్త్రం ప్రయోగించగా రామానుజుడు మాహేశ్వరాస్త్రంతో మళ్ళించాడు. ఋషులు, దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, గరుడులు, ఉరగులు అంతా దేవేంద్రపురస్సరంగా ఆకాశంలో రక్షగా నిలిచి శుభవీక్షణాలు అందిస్తూండగా లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని సంధించాడు. నరశ్రేష్ఠుడు ధనుః శ్రేష్టానికి శరశ్రేష్ఠం సంధించాడు. మనస్సులో అన్నగారిని తలుచుకున్నాడు.


*ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది*

*పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్*


శ్రీరామచంద్రుడు- మా అన్నగారు ధర్మాత్ముడయితే, సత్యసంధుడైతే, పౌరుషంలో సాటిలేనివాడయితే ఓశరమా! ఇంద్రజిత్తును సంహరించు అంటూ ఐంద్రాస్త్రంగా అభిమంత్రించిన ఆ శరాన్ని విడిచిపెట్టాడు.


అంతే - శిరస్త్రాణంతో, ప్రకాశిస్తున్న కర్ణకుండలాలతో ఇంద్రజిత్తు శిరస్సు నేలకు రాలింది. చిరిగిన కవచంతో విరిగిన ధనుస్సుతో కళేబరమూ కూలిపోయింది. ఎగజిమ్మిన రక్తంతో వాడి తల ఎర్రగా కాల్చిన బంగారు ముద్దలా భాసించింది. చప్పగా చల్లారిన అగ్నిలాగా, కిరణాలు అణగిన సూర్యుడులాగా అయిపోయాడు.


అంతరిక్షంలో గంధర్వాప్సరసల గాన నృత్యాలూ ఋషిదేవతల ఆశీరభినందనాలూ మారుమ్రోగాయి.

** 


[ *_ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది_*

*_పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్_*


లక్ష్మణుడు చెప్పిన శ్లోకము రామాయణములోని ఒకమంత్రము. దీనిని సిద్ధి మంత్రమందురు. ఐంద్రాస్త్రమునకు కూడ శక్తిని ఒసంగినది. ఈ మంత్రము. ఇంతకు ముందు రౌద్ర,వారుణ, ఆగ్నేయాది ఆస్త్రములు వ్యర్ధమయినట్లే ఈ అస్త్రము కాకుండ చేసినది ఈ మంత్రమే దీనిలో లక్ష్మణుడు ఒక ప్రతిజ్ఞ చేయుచున్నాడు. దీనిచే రాముడు ధర్మాత్ముడని, సత్యసంధుడని, అప్రతిహతమగు పౌరుషముగలవాడవి ఋజువైనది. ఈ మూడు విషయములలో కొందరికి సందేహము ఏర్పడుచుండెను. 


వాటిని ఈశ్లోకం నివారించినది. చెట్టుచాటునుండి తన ఎదురుగ నిలిచి యుద్ధము చేయని వాలిని చంపిన రాముడు ధర్మాత్ముడా? 


తొలిరోజున పట్టాభిషేకమునకు సిద్ధపడి పట్టాభిషేకము చేసికొందునని తండ్రివద్ద ఒప్పుకొని ప్రజలవద్ద ఒప్పుకొని మరునాడు వారికి ఇచ్చినమాట తప్పి అరణ్యమున కేగిన రాముడు సత్యసంధుడా?


 ఖరునితో యుద్ధముచేయునప్పుడు ద్వంద్వయుద్ధములో మూడు అడుగులు వెనుకకు వేసిన రాముడు పౌరుషములో ఎదురులేనివాడా? 


ఈ సందేహములకు సమాధానము లక్ష్మణుని. ఈ ప్రతిజ్ఞ చెప్పినది.


రాముడు అగ్నిహోత్రుడిచ్చిన పాశయమునకు పుత్రుడుగాని దశరధునకు పుత్రుడా? అనుసందేహము కలుగునేమో అని దశరధుని శక్తి యే అందు నిక్షిప్తమయి పాయసముద్వారా రాముడు జనియించినాడు. కనుక రాముడు దాశరధియే. అంటే రాముడు దశరధుని పుత్రుడే అని ఈ ప్రతిజ్ఞఋజువుచేసినదిట. 


రామాయణమును పారాయణచేయువారు ఈ శ్లోకమును మూలమంత్రముగ జపింతురు.  ప్రతి సర్గకు ముందు చివరి కూడ దీనిని చదువుచుందురు.


ఏదైనాకార్యములో సిద్దితప్పక సిద్ధింపవలెనని కోరినవారు ఈశ్లోకమును ధ్యానించినచో జపించినచో తప్పకకార్యసిద్ధి అగును.


 రామాయణములో ఇట్టి మంత్రములు ఎన్నోఉన్నవి. అందు ఇది ప్రధానమైన మంత్రము.] *రామాయణానుభవం_ 203* 


సుగ్రీవ, విభీషణ, హనుమ, జాంబవంతులు లక్ష్మణుని అసమాన శౌర్యాన్ని వేనోళ్ల పొగిడారు.


శ్రీరాముడు లక్ష్మణుని విజయవార్తను విని అమితంగా సంతోషించాడు. ఆతనిని బిగ్గరగా కౌగిలించుకొని, తలను వాసన జూచి, దేహాన్ని అంతటిని ఆప్యాయంగా తడిమాడు.

*త్వయా లక్ష్మణ నాథేన సీతా చ పృథివీ చ మే* 

*న దుష్ప్రాపా హతే త్వద్య శక్రజేతరి చాహవే*

"తమ్ముడా! నీవు చేసిన మేలు అసమానమైనది. ఇక మన సీత మనకు లభించడం ముమ్మాటికి నిశ్చయము!" ఇంకా రావణుడు ఉన్నాడు కదా అంటావా? ఆయన జీవచ్ఛవము. బ్రతికి ఉన్నా శవముతో సమానమే" అని తనివి తీర కౌగిలించుకొన్నాడు.


వైద్యవరుడైన సుషేణుని పిలిచి, "వైద్య శిఖామణీ! మా తమ్ముడు అత్యంత సుకుమారుడు. ఆయన శరీరంలో అనేక బాణాగ్రాలు నాటుకొన్నాయి. వాటిని మెల్లగా వెలికి తీసి గాయాలను మానిపించి ఆరోగ్యవంతుని చేయుమని కోరాడు.


సుషేణుడు వెంటనే దివ్యౌషధాన్ని తెచ్చాడు. దాని గాలి సోకగానే శల్యాలు ఊడిపోయాయి. వ్రణాలు పూడిపోయాయి. శ్రమ అంతా క్షణంలో తీరిపోయింది. అందరూ ఆరోగ్యవంతులై మునుపటి ఉల్లాసంతో లేచి నిలుచున్నారు.


ఇంద్రజిత్తు మరణవార్తను రావణాసురుడికి తెలియజెయ్యడానికి మంత్రులంతా చాలా వ్యధ చెందారు. ఎట్టకేలకు నెమ్మదిగా విన్నవించారు. వింటూనే కలుషితాంతరంగుడై రావణుడు సొమ్మసిల్లి పడిపోయాడు. చాలాసేపటికి తేరుకున్నాడు.

*స తం ప్రతిభయం శ్రుత్వా వధం పుత్రస్య దారుణం*

*ఘోరమింద్రజితాః సంఖ్యే కశ్మలం చావిశన్మహత్*


హా పుత్రా ! రాక్షసచమూముఖ్య ! మహారథా! దేవేంద్రుణ్ని జయించి ఇప్పుడు ఈ లక్ష్మణుడి వాతపడ్డావా! బాణాలతో కాలాంతకులను భేదించావు. మందరశిఖరాలను ఛేదించావు. సౌమిత్రి చేతికి ఎలా చిక్కావయ్యా! రాజుకోసం యుద్ధంచేసి ప్రాణాలు అర్పించి మహా యోధుల మార్గాన్ని అనుసరించావు. తండ్రీ! నీ మరణవార్త విని దిక్పాలకులూ దేవతలూ ఋషులూ ఈ రోజు హాయిగా నిర్భయంగా నిద్రపోతారు. పుత్రకా! నీవు లేని ఈ లోకమంతా నాకు శూన్యంగా కనబడుతోంది. నీ అంతఃపురంలో రాక్షసకన్యకల విలాపాలు వినలేనురా బిడ్డా! యౌవరాజ్యాన్నీ, లంకనూ, రాక్షసులనూ, తల్లినీ, భార్యనూ, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు, ఎలా వెళ్ళావు? నేను చనిపోతే ఉత్తరక్రియలు చెయ్యవలసినవాడవు నువ్వు- ఇప్పుడంతా తలక్రిందులు చేసావు....


వేలకొలది సంవత్సరాలు నేను కావించిన కఠిన తపస్సు, బ్రహ్మదేవుని వరబలము, ఆయన ప్రసాదించిన ఆభేద్య కవచము, అమోఘ ధనుర్భాణాలు, కైలాసపర్వతాన్ని కంపింప జేసిన భుజబలము ఇవన్నీ నాకు శాశ్వతాలు, సహజాలు".


ఇటువంటి నన్ను ఎదిరించడానికి ఇంద్రునికే ధైర్యము లేదు. మానవ మాత్రులైన రామలక్ష్మణులు నా ముందు ఒక లెక్కా? నా ధనుర్బాణాలతో వారి శిరస్సులను సులభంగా ఖండిస్తాను".

*స పుత్రవధసం తప్తః శూరః క్రోధవశమ్ గతః*

*సమీక్ష్య రావణో బుద్ధ్యా వైదేహ్యా రోచయద్వధమ్*

రావణుని కోపము రామలక్ష్మణులపై నుండి సీతపైకి మరలింది. “ఈ సమస్త రాక్షస వీర వినాశానికి ముఖ్య కారణము మానవకాంత అయిన సీతే. 


నా కొడుకు మాయా సీతను కల్పించి, దాని శిరస్సును ఖండించి రామలక్ష్మణులను దిక్కులేని వారిగా దుఃఖింపజేశాడే. ఇప్పుడు నేను నిజమైన సీతాదేవి శిరాన్నే ఖండించి, దానిని రామలక్ష్మణులకు చూపెట్టి, దానితో వారి ప్రాణాలను బలిగొంటాను" అని హుంకరించాడు. తక్షణమే తన క్రూర కరవాలాన్ని తీసికొని తన మంత్రులు అంతః పుర స్త్రీలు వెంబడించగా వివేకశూన్యుడై అశోకవనానికి వెళ్లాడు.

*అభిదుద్రావ వైదేహీం రావణః క్రోధమ్ ఊర్చితః*

** 


రావణుడు వివేక శూన్యుడై సీతాదేవిని చంపాలని ప్రయత్నించడాన్ని సుపార్శ్వుడనే మంత్రివర్యుడు సహించలేదు. తగిన ఉపదేశం చేసి ఆ ప్రయత్నం ను విరమింప చేసాడు.

*కథం నామ దశగ్రీవ సాక్షాద్వైశ్రవనానుజా*

*హంతుమిచ్ఛసి వైదేహీం క్రోధాద్ధర్మమాపాస్య హి*


రావణుడు వివిధ బలాధ్యక్షులను పిలిచి, వారిని గౌరవించి "వీర వరులారా! మీ రీ రోజు యుద్ధరంగానికి వెళ్లి రామలక్ష్మణులను పట్టుకొని నా ముందుకు తీసిక రండి! లేదా వారిని చంపండి".


“ఈ రోజు మీకది సాధ్యం కాకున్నా రేపు వచ్చి నేను మీతో కలసి రామలక్ష్మణులను సంహరిస్తాను" అని


రావణుని మూలబలము మొత్తము కదలి వెళ్లి వానర బలాన్ని ఢీకొంది. రాక్షసులు కత్తులు, గదులు, శూలాలు మొదలైన ఆయుధాలతో ఎదుర్కొన్నారు. వానరులు చెట్లతో పెద్ద పెద్ద శిలలతో సమాధానము చెప్పారు.


యుద్ధము భయంకరమైంది. తెగిన తలలతో రణభూమి నిండి పోయింది. రక్తము ఏరులై ప్రవహించింది.


శ్రీరామచంద్రుడు తన కోదండాన్ని తీసికొని శత్రు మూకలలో చొచ్చి బాణవర్షంతో వారిని చీకాకు పరిచాడు. రామచంద్రమూర్తి ఎక్కడ చూచినా తానే అయి వీర విహారము చేశాడు. అయితే ఆయన ప్రయోగించే శరపరంపరలు ఆయనను మరుగు పరిచాయి. బాణాలు వచ్చి రాక్షసుల శిరస్సులను కూల్చుట చేత, ఆ బాణాలను ప్రయోగించడానికి రాముడు తప్పక ఉండి ఉంటాడనే అనే అనుమానమే రాముని ఉనికికి సాక్ష్యమైంది.


అంతేకాని రాముడెక్కడున్నాడో, ఆయన బాణాలను ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు విడుస్తున్నాడో, ఎప్పుడు వైరుల తలలు నరుకుతున్నాడో ఎవ్వరికి తెలియకుండా అయింది. నిరంతరమైన రామనామాంకితములైన బాణాల వర్షము శత్రుసేనపై కొనసాగుతూనే ఉంది.


శ్రీరామచంద్రుడు యుద్ధమును ప్రారంభించక పూర్వమే వానరులు యుద్ధం చేశారు. కాని ఆయన రణరంగంలోకి దిగాక వారికి ఆ అవసరమే లేకుండా పోయింది.


రామభద్రుడు “గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా రాక్షసులు తలలను నరకసాగింది. దాని వలన వారిలో ఒక భ్రమ ఏర్పడింది.

*తే తు రామ సహస్రాణి రణే పశ్యంతి రాక్షసాః*

*పునః పశ్యంతి కాకుత్స్థమేకమేవ మహాహవే*

ఆ భ్రమలో ప్రతి రాక్షసునికి ఎదుటి రాక్షసునిలో శ్రీరాముడు కనబడ్డాడు. అందువలన రాముని చంపుతున్నానని ప్రతి రాక్షసుడు ఎదుటి రాక్షసుని చంపడం మొదలైంది.


ఒకవైపు రామ బాణాలు రాక్షసుల తలలను వారి మొండాల నుండి వేరుచేస్తుంటే రెండవ వైపు రాక్షసులు కూడ తమలో తాము ఒకరినొకరు నరకు కోవడం జరిగింది.


జనస్థానంలో కూడ శ్రీరామచంద్రుడు ఇటువంటి అస్త్రాన్నే ప్రయోగించి పదునాల్గువేల మహా రాక్షస వీరులను మూడు గడియలలో మట్టి కరపించాడు.


అటువంటి మహా సంహార శక్తి తనలో మాత్రమే ఉందని, ప్రళయకాలంలో రుద్రుని యందు కూడ ఉంటుందని రామభద్రుడు సుగ్రీవ, విభీషణ, హనుమ, జాంబవదాదులను పిలిచి తెలిపాడు.

*ఏతదస్త్రబలాన్ దివ్యం మమ వా త్రయంబకస్య వా*

🌹 *రామాయణానుభవం_ 204* 


లంకా నగర స్త్రీ ల ఆహాకారాలు, రోదనధ్వనులు రావణుని చెవులలో నిండి పోయాయి. ఆయనకు ఎటు తోచని పరిస్థితి ఏర్పడింది. ఆయనలో ఒకవైపు భయము, మరొకవైపు కోపము కలిగాయి.


తన ముందు నిలిచిన భటులతో మహోదర, మహాపార్శ్వ, విరూపాక్షులను యుద్ధమునకు సిద్ధం కావాలని చెప్పి పంపాడు.


మరుక్షణంలో ఆ సేనా నాయకులు తమ సైన్య బలాలతో ప్రభువు ముందు నిలిచారు. ఆ అప్పుడు రావణుడు వారి ముందు వీరాలాపాలను పలికాడు.


"రాక్షస వీరులారా! నా భయంకర బాణాగ్నితో నా బాహుబలంతో ముందుగా రామలక్ష్మణులను నరకివేస్తాను. దానితో నా కోసము పోరు సల్పిన ఖరదూషణాదుల, ప్రహస్త, కుంభకర్ణ ఇంద్రజిదాదుల రుణం తీర్చుకొంటాను.


ఆ తరువాత హనుమ, సుగ్రీవాంగద, జాంబవదాది వానర వీరులను, సమస్త వానర సైన్యాన్ని సంహరిస్తాను. నా బాణమేఘాలతో సూర్యుని కప్పివేసి గుట్టలు, చెట్లు మొదలగు వాటిని కనిపింపకుండా చేస్తాను.


రావణునికి రణరంగానికి వెళ్లే దారిలో అనేక అపశకునాలు ఎదురయ్యాయి.అయినా అభిమానధనుడైన రావణుడు అపశకునాలను అలక్ష్యంచేసి యుద్ధభూమికి ముందుకు వెళ్లాడు.


రావణుడు రణరంగంలోకి ప్రవేశిస్తూనే, వానరసేనను భయంకరంగా చీల్చి చెండాడాడు. ఆయన బాణాగ్నికి వానరవీరులు మిడుతలయ్యారు.


వానరులు తలొక దిక్కుకు పారిపోతుండగా రావణుని రథము రామునికి ఎదురుగాపరుగెత్తింది.


కపిసైన్యము కకావికలు కావడాన్ని గమనించిన సుగ్రీవుడు రాక్షస సైన్యముపై శిలావర్షాన్ని కురిపించాడు. రాక్షసులు వందల వేల సంఖ్యలో శవాలై కుప్పలు కుప్పలుగా పడిపోయారు. 


సుగ్రీవునెదుర్కోవడానికి విరూపాక్షుడు రథముపై నుండి దిగి ఒక ఏనుగును ఎక్కాడు. భయంకర నాదాన్ని చేస్తూ వానరులను పారద్రోలాడు. సుగ్రీవునిని కూడ అనేక బాణాలతో నొప్పించాడు.


సుగ్రీవుడు విరూపాక్ష వధకై మనస్సులో నిశ్చయించుకొన్నాడు. అక్కడ ఒక మహావృక్షాన్ని పెకిలించి, విరూపాక్షుని గజముపైకి ఎగిరి ఆ వృక్షంతో దానిని చంపివేశాడు.


ఏనుగు నుండి క్రిందికి దుమికి విరూపాక్షుడు ఖడ్గాన్ని, సుగ్రీవుడిపై విసిరాడు. సుగ్రీవుడు క్రోధంతో ఒక శిలను వాడిపైకి వేశాడు. రాక్షసుడు ఆ మహాశిలను తప్పించుకొని సుగ్రీవునిని ఖడ్గంతో బలంగా కొట్టాడు. దానివలన కొంత సమయం సుగ్రీవుడు తెలివి తప్పి పడిపోయాడు. కొద్ది సమయంలోనే లేచి తన పాదాలతో బలంగా విరూపాక్షుని కవచాన్ని పగులకొట్టాడు. తన పిడికిలితో రాక్షసుని తలపై మోదాడు.


రాక్షసుడు దానిని తప్పించుకొని సుగ్రీవుని వక్షముపై కొట్టాడు. దానిని తప్పుకొని విరూపాక్షుని లలాటముపై వజ్రము వంటి అరచేతితో కొట్టాడు. దానితో విరూపాక్షుడు. రక్తము కక్కుకుంటూ, కళ్లు ఊడి, ఘోరంగా అరుస్తూ క్రిందబడి ప్రాణాలు వదిలారు. విరూపాక్షుని వధను గమనించిన రావణుడు తన దగ్గరలో ఉన్న మహోదరుని వానరసేన వధకు ప్రేరేపించాడు.


విరూపాక్షుని వధతో సంతసించిన వానర వీరులు రాక్షస సైన్యముపై విజృంభించారు. వానర విజృంభణను గమనించిన మహోదరుడు వానరులపై బాణవర్షాన్ని కురిపించాడు. వానర వీరులు సుగ్రీవుని ఆశ్రయించారు.

సుగ్రీవుడు ఒక మహా శిలను మహోదరునిపై వేశాడు. ఆ శిలను మహోదరుడు

మధ్యలోనే తన బాణాలతో త్రుంచాడు. సుగ్రీవుడొక సాలవృక్షాన్ని పెకిలించి రాక్షసునిపై

ప్రయోగించాడు. దానిని కూడ రాక్షసవీరుడు బాణాలతో ఖండించాడు..


సుగ్రీవుడొక పరిఘను చేత ధరించి, రాక్షసుని గుర్రాలను పడగొట్టాడు. మహోదరుడు ఆ రధాన్ని వదలి ఒక మహాగజాన్ని అధిరోహించాడు. రాక్షసుడు ఒక గదను చేబూని వానర పతిని ఎదిరించాడు. రాక్షసుడు ప్రయోగించిన గదను సుగ్రీవుడు తన పరిఘతో ఎదుర్కొన్నాడు. కాని గదా దెబ్బతో పరిఘ ముక్కలైంది. 

సుగ్రీవుడు ఒక ఇనుప రోకలిని తీసికొని రాక్షసుని గదపైకి విసిరాడు. గద ముసలము

ఒకదానితో ఒకటి ఢీకొని విరిగి క్రిందబడ్డాయి.


 అప్పుడు వానర రాక్షస నాయకులిద్దరు బాహుయుద్ధానికి పూనుకొన్నారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకొన్నారు.

మహోదరునికి మధ్యలో ఒక ఖడ్గం దొరికింది. సుగ్రీవుడు కూడ ఒక ఖడ్గాన్ని

దొరికించుకొన్నాడు. ఇద్దరి మధ్య ఖడ్గ యుద్ధం తీవ్రమైంది. సుగ్రీవుడు తన ఖడ్గంతో మహోదరుని శిరస్త్రాణాన్ని, కుండలాలతో కూడిన శిరస్సును ఖండించాడు.


ఈ విధంగా సుగ్రీవుని చేతిలో మహోదరుడు కూడ మరణించాడు.


ఇక అంగదుని చేతిలో మహాపార్శ్వుడి మరణం సంభవించింది.

సమరానికి వచ్చిన నలుగురిలో ముగ్గురు రాక్షస నాయకులు మరణించడంతో వానరులు సింహనాదం చేశారు. దేవతలు రావణుడొక్కడే మిగిలడం చూచి హర్షధ్వనులు కావించారు.

** 


రావణాసురుడి కోపం అవధులు దాటింది. రథచోదకా! సర్వరాక్షస సంహారం చేసిన రాముడు ఎక్కడ ఉన్నాడో చూసి అక్కడికి నన్ను తీసుకువెళ్లు. ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటాను అని ఆజ్ఞాపించాడు. వెంటనే రథం బయలుదేరింది. గ్రీష్మకాల సూర్యుడు కిరణాలను వెదజల్లినట్టు బాణాలను వేస్తూ సర్వవానరసైన్యాన్ని చెల్లాచెదురుచేస్తూ వెళ్ళి వెళ్ళి రాముణ్ని చూసాడు.

*తతో రాక్షశశార్దులో విద్రవ్యా హరివాహినిమ్*

*స దదర్శ తతో రామం తిష్ఠంతమపరాజితమ్* 

*లక్ష్మణేన సహ భ్రాత్రా విష్ణునా వాసవం యథా* 

*అలిఖన్తమివాకాశ్య మవష్టభ్య మహద్ధనుః* 

*పద్మపత్రవిశ్అలక్షన్ దీర్ఘబ్అహుమరిందమమ్*

ఇంద్రుడితో కూడిన విష్ణుమూర్తిలా లక్ష్మణుడితో కలిసి కూర్చున్న శ్రీరాముణ్ని చూసాడు. పద్మపత్ర విశాలాక్షుడూ ఆజానుబాహువూ అయిన రఘువీరుణ్ని చూసాడు. ఆకాశాన్ని తాకుతున్న మహాధనుస్సుతో మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న ఇనకులతిలకుడైన దాశరథిని చూశాడు.


రణభగ్నులై గాయాలతో తిరిగివస్తున్న వానరవీరులనూ వారివెనుక రథారూఢుడై తనకు ఎదురువస్తున్న దశకంధరుడినీ - అల్లంత దూరంలో చూసాడు రాముడు. ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో ధనుస్సు ఎక్కుపెట్టి టంకారం చేసాడు. లక్ష్మణుడుకూడా సన్నద్ధం అయ్యాడు. వారి ఇద్దరికీ ఎదురుగా రావణుడు సూర్యచంద్రుల ఎదుట రాహువులా కనిపించాడు.


మునుముందుగా యుద్ధం చేద్దామనే ఉత్సాహంతో లక్ష్మణుడు శరవర్షం కురిపించాడు. అన్ని బాణాలనూ రావణుడు మధ్యలోనే ధ్వంసం చేసాడు. అతడిని దాటి వచ్చి సుస్థిరంగా పర్వతోపమంగా నిలబడిన రామభద్రుణ్ని సమీపించాడు. వర్షాకాలమేఘం జలధారలతో కులపర్వతాన్ని ముంచెత్తినట్టు బాణాలు ప్రయోగించాడు. రాముడు అన్నింటినీ సులువుగా ఖండించాడు. ఇరువురూ యమాంతకులై తీవ్రంగా పోరు సల్పుతూంటే పంచభూతాలూ భయభ్రాంతాలయ్యాయి.


క్రుద్ధుడైన రాముడు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించగా, అది బాణరూపం విడిచి అయిదు పడగల పాముగా మారి బుసలు కొడుతూ రావణ ఫాలభాగాన్ని సోకి, ఏమీ చెయ్యలేక ఓడిపోయి, పాతాళంలోకి దూరిపోయింది. ఇరువురూ ప్రయోగిస్తున్న అస్త్రాలు - సింహ, వ్యాఘ్ర, కంక, కాక, గృధ్ర, శ్యేన, సృగాల ముఖాలతో వానర రాక్షసులందరినీ భయవిహ్వలులను చేసాయి. అందరూ యుద్ధం ఆపేసి ఈ మహావీరుల నేర్పు చూస్తున్నారు.


అంతలో లక్ష్మణుడు కల్పించుకొని రాక్షసేశ్వరుణ్ని వ్యాకులపరిచాడు. అతడు అతిక్రోధావిష్ణుడై శక్తిని ప్రయోగించాడు. అది మయునిచేత మాయాశక్తితో నిర్మింపబడింది. అమోఘమైన సృష్టి. ఎనిమిది ఘంటికలతో మహాధ్వనిచేస్తూ మంటలు వెలిగ్రక్కుతూ లక్ష్మణుని మీదకు ప్రయాణిస్తోంది. అతడు బాణాలతో ఎదుర్కొన్నాడు. కానీ ఫలితం లేకపోయింది. లక్ష్మణుడికి శుభమగుగాక అని రాముడు మనసులోనే పదే పదే అనుకున్నాడు. శక్తి ఆయుధం సౌమిత్రి శిరస్సుపై పడింది. శరీరంలోంచి భూమిలోకి అదృశ్యమయ్యింది. లక్ష్మణుడు మూర్ఛిల్లాడు.


క్షణకాలం రఘురాముడు నిశ్చేడయ్యాడు. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంతలోనే తేరుకుని, ఇది విషాదానికి సమయంకాదని నిశ్చయించుకొని, ప్రేమగా సోదరుణ్ని ఒకసారి చేతితో తాకి, సంరక్షణ బాధ్యతలు సుగ్రీవ హనుమంతులకు అప్పగించి రావణవధకు పూనుకున్నాడు.


*అస్మిన్ ముహూర్తే న చిరాత్సత్యం ప్రతిశృణోమివః* | *అరావణమరామం వా జగద్ద్రక్ష్యథ వానరాః* ॥


రాజ్యభ్రంశము, వనవాసము, దండకారణ్యక్లేశము, వైదేహీ అపహరణము, రాక్షసకృత ధిక్కరణము- అన్నింటికీ ఈ రోజే ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ రోజుతో ప్రపంచం అరావణమో అరామమో అవుతుంది.


సుగ్రీవ సఖ్యము, వానరవీర సమీకరణము, సేతుబంధనము, సముద్ర తరణము అన్నింటికీ ఏకైక లక్ష్యమూ ఏకైక ప్రయోజనమూ అయిన రావణవధను ఇప్పుడే నిర్వహిస్తాను. నా కంటబడిన రావణుడు ఇక జీవించి ఉండడానికి వీలులేదు.


*అద్య పశ్యన్తు రామస్య రామత్వం మమ సంయుగే*


కపివీరులారా! మీరంతా పర్వతాగ్రాలూ చెట్టుకొమ్మలూ అధిరోహించి మా యుద్ధవైశారద్యం తిలకించండి. రాముని రామత్వాన్ని ఈ రోజు మీరు చూద్దురుగాని.


అని ప్రతిజ్ఞచేసి సత్యపరాక్రముడయిన రాముడు నిశితబాణాలతో రావణుణ్ని హింసించాడు. అతడికి ఊపిరి ఆడకుండా చేసాడు. ఈ ప్రళయ ఝంఝామారుతానికి నిలవలేక రావణుడు మేఘశకలంలాగా చెదిరి పారిపోయాడు........

 *రామాయణానుభవం_ 205* 


శ్రీరాముడు, తనను నీడవలె విడువక అనుసరించిన వాడు, తన కొరకు భార్యను, తల్లిదండ్రులను, రాజ్యసంపదలను గడ్డిపోచవలె వదిలినవాడు, సుగుణ సముద్రుడు, ప్రాణప్రియుడు, తన తమ్ముడైన లక్ష్మణుడు కొన ఊపిరితో ఉన్న పామువలె నేలపై బాధతో పొరలడాన్ని చూచి, భరింపలేక పోయాడు.


ఆయన చేతినుండి విల్లు జారి పోతున్నది. మనస్సు మనస్సులో లేదు. దుఃఖము పొంగుకొస్తున్నది. తనకు ప్రాణముపై ఆశ నశిస్తున్నది. ఆయన లేని సీత ఎందుకు? జీవితమెందుకు? రాజ్య మెందుకు?” అనిపిస్తున్నది.


*దేశే దేశే కళత్రాణి దేశ దేశేచ బాంధవాః*

*తంతు దేశం న పశ్యామి* । *యత్రభ్రాతా సహోదరః*


ఒక వ్యక్తికి భార్య కావాలంటే ఎక్కడైనా, ఎందరైనా దొరుకుతారు. బంధువులు కావాలంటే దొరుకుతారు. కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరుకుతాడా ఎక్కడైనా?


పట్టరాని దుఃఖావేశంతో విలపిస్తున్న రాముణ్ని ఓదారుస్తూ సుషేణుడు - మహాత్మా! లక్ష్మణుడు జీవించే ఉన్నాడు. ముఖంలో కాంతి వైదొలగలేదు. అరచేతులు ఎర్రగా ఉన్నాయి. అంచేత కంగారు పడవలసింది ఏమీలేదు అన్నాడు.


 హనుమంతుణ్ని పిలిచి మొన్నొకసారి జాంబవంతుడు చెప్పగా ఓషధిపర్వతానికి వెళ్ళావుగదా! ఇప్పుడు మళ్ళీవెళ్ళి విశల్యకరణి అనే ఓషధిని త్వరగా తీసుకురా అని చెప్పాడు. ఆంజనేయుడు మనోజవంతో వెళ్లి ఏది ఓషధియో తెలియక తికమకపడి, వట్టి చేతులతో తిరిగివెళ్ళడం నచ్చక, ఇదివరకులాగానే మళ్ళీ ఆ మహాపర్వత శిఖరాన్ని పెకలించి తెచ్చాడు. సుషేణుడి ముందు నిలిపాడు. అతడు ఆ ప్రత్యేకమయిన ఓషధిని వెదికి పట్టుకొని సౌమిత్రికి వాసన చూపించాడు. అంతే పరిపూర్ణ ఆరోగ్యంతో లేచికూర్చున్నాడు. 


వానరులంతా సాధు సాధు అని కీర్తించారు. రాముడు- సోదరా! రా! రా! అంటూ కౌగిలించుకున్నాడు.


 ఆ క్షణంలో ఎందుకో ఏమో తెలియని ఒక నైరాశ్యానికి రాముడు గురిఅయ్యాడు. లక్ష్మణుడు ఉత్సాహపరచి - ఈరోజు సూర్యాస్తమయం అయ్యేలోగా రావణుణ్ని నీవు సంహరించాలి. ఇది నా కోరిక. నా ప్రార్ధన అని అన్నగారిని ఒప్పించాడు.

*అహన్ తు వధమిచ్ఛామి శీఘ్రమస్య దురాత్మనః*

*యావదస్తం న యాత్యేషా కృతకర్మా దివాకరః*

*

[భ్రాత అంటే “తమ్ముడు", "ఆప్త మిత్రుడు", "ఆప్తబంధువు". లక్ష్మణుడు రామునికి కేవలము తమ్ముడే కాదు ఆప్తమిత్రుడు, ఆప్తబంధువు కూడ.


ఇవన్ని కూడా ముఖ్యము కాదు. తన గురించి సౌమిత్రి హనుమతో చెప్పుతూ "అహమస్య అవరోభ్రాతా గుణైర్దాస్యముపాగతః" అని తెలిపాడు.


తనను తమ్ముడని రామచంద్రుడు అనుకొంటున్నాడు. కాని తన దృష్టిలో తాను "రామదాసుడే"! అదేమిటి తాను రామభద్రునికి తోబుట్టువు కదా? దాసుడెలా అవుతాడు?


శ్రీరామచంద్రుని కల్యాణ గుణాలు అటువంటివి. తనను దాసునిగా మార్చాయి.


దాసుడు స్వామికి పరతంత్రుడు. స్వతంత్రమైన ఉనికి లేదని భావించే వాడు. లక్ష్మణుడు కూడ తాను రామచంద్ర స్వామికి జీవితము ఉన్నంత వరకు పరతంత్రుడనని చెప్పుకొన్నవాడు.


"పరవానస్మి కాకుత్స! త్వవర్షం శతేస్థితే


ఇంతకు రామలక్ష్మణులు ఒకే తల్లికి పుట్టినవారు కాదు. అయితే మాత్రమేమిటి? లక్ష్మణుని సౌజన్యమటువంటిది. ఆయన సోదర "అనురాగము” (సౌభ్రాత్రము) అటువంటిది.


"న చతేన వినా నిద్రాం లభతేచ పురుషోత్తమః"


లక్ష్మణుడు ప్రక్కలో లేకుంటే రాముడు నిద్రపోయే వాడే కాడు.


అందుకే ఇప్పటి ఇద్దరు అన్నదమ్ములు బాగా జీవనం చేస్తుంటే రామలక్ష్మణులు లాగా వున్నారు అంటుంటారు.]


** 


రావణుడు వినూతనరథం అధిరోహించి రెట్టించిన నూతనోత్సాహంతో రణభూమికి అవతరించాడు. రామునితో తలపడ్డాడు.


రాక్షసేంద్రుడు రథంమీద, మానవేంద్రుడు నేలమీద - ఇది పైనుంచి చూస్తున్న దేవతలకూ దేవేంద్రునికీ నచ్చలేదు. వెంటనే మాతలి సారథిగా తన దివ్యరథాన్ని పంపించాడు.

రాముడు భక్తితో దానిని ప్రదక్షిణించి నమస్కరించి అధిరోహించాడు.

*ఇత్యుక్తః స పరిక్రమ్య రథన్ సమభివాద్య చ*

*ఆరురోహ తదా రామో లోకన్లక్ష్మ్యా విరాజయన్*

దాశరథి ప్రయోగిస్తున్న అస్త్రాలను అస్త్రాలతో శస్త్రాలను శస్త్రాలతో ఎదుర్కొంటూ సారధియైన మాతలినీ దివ్య రథాశ్వాలనూ రావణుడు దారుణంగా హింసించాడు. ఆ వీర విజృంభణకు లక్ష్మణాగ్రజుడు ఆర్తుడు అయ్యాడు. రావణ రాహువు రామచంద్రుణ్ని గ్రసించింది. ఆ సమయంలో రాక్షసేశ్వరుడు పది శిరస్సులూ ఇరవై బాహువులూ కలిగి ధనుర్ధారియై మహామైనా కపర్వతంలాగా రాముడికి కనిపించాడు.


నేను లేని సమయంచూసి నా భార్యను అపహరించిన ఈ దురాత్ముడి శరీరాన్ని ఈ పూట గ్రద్దలూ కాకులూ పీక్కుతినాలి. నా బాణాలవల్ల ఏర్పడిన గాయాలనుంచి ప్రవహించే రక్తాన్ని నక్కలూ కుక్కలూ త్రాగాలి అంటూ ఉత్సాహం ఉద్దీపింపజేసుకుని - అర్ధచంద్రాకార బాణాలను సంధించి, చెవిదాకా నారి సారించి వదులుతూ సీతాప్రాణవల్లభుడు విక్రమించాడు. వానర మహావీరులు శైలశృంగాలను విసిరి రావణుడిని అల్లకల్లోలం చేసారు. ధనుస్సు ఎక్కుపెట్టి బాణం తొడిగి విడిచిపెట్టే వ్యవధిని రాముడు రావణుడికి ఇవ్వడంలేదు. ఈ అవస్థను గమనించిన రావణ సారథి నిశ్చల చిత్తంతో రథాన్ని రణరంగంనుంచి తప్పించాడు.

*సుతస్తు రథనేతస్య తదావస్థం నిరీక్ష్య తామ్*

*శనైర్యుద్ధాదసంభాన్తో రథాన్ తస్యాపవాహయత్*

నాకు అపకీర్తి తెచ్చిపెట్టావని రావణుడు కోపించి దుర్భాషలాడగా- 


నీ మేలు కోరి ఇలా చేసాననీ, నీవు పరిశ్రాంతుడవయ్యావనీ, రథాశ్వాలు వానదెబ్బతిన్న గోవుల్లా అయిపోయాయనీ. అపశకునాలు కనిపిస్తున్నాయనీ గమనించి ఇలా చేస్తానని సూతుడు సమాధానం చెప్పాడు. దానికి సంతోషించి కంకణం బహూకరించి మళ్ళీ రామాభిముఖంగా నడిపించమని ఆజ్ఞాపించాడు. జయం పొందకుండా ప్రాణాలతో రణరంగంనుంచి వైదొలగనని ఖండితంగా చెప్పాడు.


సరిగ్గా అదే సమయానికి అగస్త్యమహర్షి రాముణ్ని సమీపించాడు. 

*రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్*

*యేన సర్వానరీన్వత్స సమరే విజయీష్యసే* 

రామభద్రా! సమరంలో విజయం చేకూర్చే అతిరహస్యమయిన ఒక సనాతన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. విను. దీనిని ఆదిత్యహృదయం అంటారు. ఇది శత్రువినాశకం. సర్వమంగళప్రదం. చింతాశోకప్రశమకమూ ఆయుర్వర్ధకము....

కామెంట్‌లు లేవు: