*భక్తికి వశం..*
"మీతో మాట్లాడాలి..ఎప్పుడు వీలవుతుంది?.." అని ఒకతను నన్ను అడిగాడు.."మీరు చూస్తూనే వున్నారు కదా..ఖాళీగా వున్నాను..ఇప్పుడే మాట్లాడుకుందాము.." అన్నాను..అతను సందేహిస్తూ చుట్టూ చూసి.."నా ఉద్దేశ్యం మీ ఒక్కరితోనే మాట్లాడాలని.." అన్నాడు.."సరే..రండి..ఆ మంటపం లో కూర్చుని మాట్లాడుకుందాము.." అన్నాను..ఆరోజు బుధవారం..మందిరం లో భక్తులు లేరు..నేను, మా సిబ్బంది..అర్చకస్వాములు..అందరం కలిసి..రాబోయే శివరాత్రి కి చేయాల్సిన ఏర్పాట్ల గురించి ముచ్చట చేస్తున్నాము..ఆ సమయం లో ఇతను వచ్చాడు..
ఇద్దరమూ మంటపం లో ఓ ప్రక్కగా కూర్చున్న తరువాత.."ఇప్పుడు చెప్పండి.." అన్నాను.."మాది నెల్లూరు జిల్లా చెన్నాయపాలెం అండీ..ఆక్వా సాగు చేసి బాగుపడ్డాము..అప్పుడప్పుడూ అందులో ఒడిదుడుకులు ఎదురైనా..తట్టుకొని నిలబడ్డాము..నాకు ఇద్దరు అబ్బాయిలు..పెద్దవాడికి రెండేళ్ల క్రితం వివాహం చేసాను..రెండోవాడు చెన్నై లో ఉద్యోగం చేస్తున్నాడు..గత ఆరునెలలుగా ఒక సమస్యతో బాధపడుతున్నాము..మా అబ్బాయికి కోడలికి మధ్య విబేధాలు వచ్చాయి..ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది..మా కుల పెద్దల వద్ద పంచాయితీ పెట్టించాము..కానీ ఆ అమ్మాయి కానీ..వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ పంచాయతీలకు మేము రాము...అని చెప్పారు..పైగా మామీద వరకట్నం కేసు కూడా పెట్టారు..వ్యవహారం కోర్టుకు చేరింది..మాకు మనోవేదన పెట్టుకున్నది..ఆ పిల్లను బంగారం లాగా చూసుకున్నాము..మా పరంగా ఏ లోటూ చేయలేదు..పైగా పెళ్లి అయిన మరుసటి నెలలోనే..మా అబ్బాయిని కోడలిని నెల్లూరు లో ఇల్లు తీసి..అందులో కాపురం పెట్టించాము..నేనూ నా భార్యా వాళ్ళ సంసారం లో జోక్యం చేసుకోలేదు..అటువంటిది ఆ పిల్ల నా భార్య మీద కూడా కేసు పెట్టి..మూడురోజులు జైల్లో పెట్టించింది..బెయిల్ తీసుకొని బైటకు తీసుకువచ్చాము..మాకెందుకీ ఖర్మ పట్టింది అని కుమిలి పోతున్నాము..ఏ దిక్కూ తోచక నాలుగు వారాల నుంచీ ఈ స్వామివారి వద్దకు వస్తున్నాము..ప్రతి బుధవారం ఉదయం వచ్చి..గురువారం సాయంత్రం వెళుతున్నాము..స్వామివారు మమ్మల్ని గట్టున పడేస్తే అదే చాలు..గౌరవంగా ఉన్న వాళ్ళము..ఈ రకంగా బాధ పడాల్సివస్తుందని అనుకోలేదు.." అన్నాడు.."ఇప్పటికి నాలుగు వారాలు ఇక్కడికి వచ్చాము..ఇంకొక్క వారం వస్తే ఐదు వారాలు అవుతాయి.." అన్నాడు.."మీ భార్య కూడా వచ్చిందా..?" అన్నాను.."ఈ స్వామివారి వద్దకు రావడానికి ఆమె కారణం..తానే పట్టుబట్టి ఇక్కడకు తీసుకొచ్చింది.." అని చెప్పి..తాను లేచి వెళ్లి..మంటపానికి అవతల వైపు ఉన్న ఆడమనిషిని వెంట పెట్టుకొని వచ్చాడు..ఆమెను పరిచయం చేసాడు..
"అయ్యా..మాకు ఏమీ వద్దయ్యా..ఆ అమ్మాయి వాళ్ళు మాకు కట్నంగా ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా వెనక్కు ఇస్తాము..మేము పెట్టిన బంగారం వదులుకుంటాము..మా మీద కేసు లేకుండా ఉంటే..విడాకులు ఇచ్చేస్తాము..ఈ స్వామివారిని మేము కోరేది అదొక్కటే.." అన్నది..
"సరే..మరో వారం రండి..స్వామివారిని పరిపూర్ణంగా నమ్మితే..పరిష్కారం చూపకుండా వుండరు..ఇక మీ సమస్య ఎప్పుడు తీరుతుందో చూద్దాము.." అన్నాను.."అయ్యా..మీరు కూడా మా తరఫున స్వామివారికి ప్రార్ధన చేయండి..అందుకోసమే మిమ్మల్ని ఇలా ప్రక్కకు రమ్మనమని పిలిచాను..ఆ ఒక్క సహాయం మా కోసం చేయండి.." అన్నారు.."మీ గోత్రనామాలు ఇవ్వగలరా..రేపటి నుంచి ఉదయం స్వామివారి హారతులు కాగానే..మీ గోత్రనామాలతో అర్చన జరిపిస్తాను..చూద్దాము..స్వామివారు మీ వేదన తీరుస్తారనే నమ్మకం ఉంది.." అన్నాను.."తప్పకుండా ఇస్తాము.." అని ఒక కాగితం మీద వాళ్ళ గోత్రము..పేర్లు..వ్రాసి ఇచ్చారు..అర్చకస్వామిని పిలిచి..ఆ గోత్రనామాలతో ప్రతిరోజూ ప్రభాతసేవ అనంతరం అర్చన చేయమని ఇచ్చాను..సరే అన్నారు..
ఆ మరుసటి వారం..ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..వాళ్ళ ముఖాల్లో మునుపటి నిరుత్సాహం లేదు..ఇద్దరూ కాళ్ళూ చేతులు కడుక్కొని..స్వామివారి మందిరం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి..టికెట్ కొనుక్కొని..స్వామివారి సమాధి దర్శించుకొని..ఆ తరువాత నా దగ్గరకు వచ్చారు.."అయ్యా..చాలా వరకూ మా సమస్య తీరిపోయింది..ఆ అమ్మాయి వాళ్ళు పంచాయతీ కి వచ్చారు..మేము తీసుకున్న కట్నం డబ్బు మేము వెనక్కు ఇచ్చేతట్టు..మా బంగారం మాకు వాళ్ళు ఇచ్చేందుకు..ఒప్పందం జరిగింది..విడాకుల పత్రం కూడా రాసుకున్నాము..మామీద తప్పుడు కేసు పెట్టినట్టు బహిరంగంగా ఒప్పుకున్నారు..కోర్టులో కూడా కేసు వెనక్కు తీసుకున్నారు..కోర్టు నుంచి విడాకుల కాగితాలు రాగానే మా అబ్బాయిని తీసుకొని ఇక్కడకు వస్తాము..ఇక వాడికి మళ్లీ పెళ్లి చేయాలి..ఈ స్వామివారి దయ ఉంటే..అది కూడా త్వరలో జరుగుతుంది.." అని చెప్పారు..ఆరోజు కూడా స్వామివారి సన్నిధి లో వుండి..ప్రక్కరోజు వాళ్ళ ఊరు వెళ్లిపోయారు..
మరో ఆరేడు నెలల తరువాత..తమ పిల్లవాడికి వివాహం చేసి..కొడుకు కోడలు ను తీసుకొని స్వామివారి సన్నిధికి వచ్చారు.."అయ్యా..మా ప్రారబ్ధమో..పిల్లవాడి ఖర్మో ..తెలీదు కానీ..మాకు పట్టిన శని ఆరోజుతో వదిలింది..ఇప్పుడు లక్షణంగా ఉన్నాము..అంతా స్వామి దయ.." అని భక్తిగా చెప్పారు..తమ రెండో కుమారుడి వివాహం స్వామివారి సన్నిధిలో చేస్తామని మొక్కుకొని..అదే విధంగా మరుసటి సంవత్సరం ఆ రెండో కుమారుడి పెళ్లి..మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధి లో చేశారు..అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం లో రెండు సార్లు తమ కొడుకులు కొడళ్లు మనుమలతో సహా స్వామివారి వద్దకు వచ్చి అన్నదానం చేసి వెళుతుంటారు..
వాళ్ళు కోరుకునే కోరిక ఒక్కటే.."మమ్మల్ని చల్లంగా చూడు స్వామీ.." అని..ఆ పని స్వామివారు తప్పక చేస్తారు..ఎందుకంటే వాళ్లలో ని భక్తికి స్వామివారు వశం అయ్యారు కదా..!!
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)