*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15 వ భాగము.*_
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
*విజయ యాత్ర:&
వాదోపవాదములు చేసి శత్రువులను జయించమని ఈశ్వరుని ఆజ్ఞ. విష్ణుసన్నిభుడైన వ్యాసభగవానుని బోధ. ఇక జ్ఞాన యుద్ధమే తరువాయి.
ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణపరమాత్మ అండ పాండవులకు లభించినట్లుగానే శివకేశవుల కరుణ శ్రీశంకరాచార్యులకు లభ్యమైంది. అర్జునుని అక్షయ తూణీరాల వంటివి శంకరుని సూత్ర భాష్యాలు. పార్థునకు దివ్యరథాలు ప్రాప్తించి నట్లు శంకరునికి ఉపనిషత్తులు చాలు. పదునెనిమిది అక్షౌహిణుల సేనల పోరాటమది. పదునెనిమిది రోజులుగా సాగినది. పదునెనిమిది అధ్యాయాల భగవద్గీత శంకరుని హృదయంలో చేరింది. ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు అధ్యక్షుడైనాడు.
ఇక్కడ 'స్వయం మంత్రీ స్వయం రాజా' అన్నట్లుగా శ్రీశంకరుడే అన్నీ నిర్వహిస్తాడు. అర్జునునకు తోడుగా నలుగురు సోదరులు ఉండగా ఇక్కడ దిగ్గజాల లాంటి పద్మ పాదాది శిష్యప్రకాండు లున్నారు. పాండవుల పక్షాన ధర్మము ఉన్నట్లే శంకరుని పక్షాన ధర్మముతో కూడిన ఆత్మవిశ్వాస శక్తి ప్రబలంగా ఉన్నాయి.
పాంచజన్యాన్ని మధు సూదనుడు, దేవ దత్తాన్ని విజయుడు పూరించి నట్లు ఒక సుముహూర్తాన శ్రీశంకరాచార్యుడు తత్త్వ శంఖారవం చేశారు. ఆ శంఖా రావము కాశీలోనే కాదు యావద్భారత దేశములోని ధర్మ శత్రువుల గుండెలు దద్దరిల్లేలా వినిపిం చింది. విన్న యతులు, యోగులు, ముముక్షువులు, సాధుజనులు కర్ణానందంగా విన్నారు. ఆ అవతార మూర్తి రాకకై చంద్రునికి సముద్రునిలా ఎదురు చూస్తు న్నారు. గంగాస్తవాలు చేసికొంటూ, గంగాస్మర ణలతో తనకు దగ్గరలోనే మెలగు చున్న శంకరసేనను చూచి గంగ ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగి పోతోంది. హరిహరులకు భేదము లేదని ఆచార్యులవారు బోధించేవారు. శంకరాచార్యుని వైష్ణవులు సాక్షాద్విష్ణువుగాను, శైవులు సాక్షాత్తు శివునిగాను భావించి నమస్కరించేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనే పంచాయతనాన్ని పూజించమని ఆదేశించేవారు. అందు ఎవరికి ఏది అభిమతమో దానిని ప్రధానంగా ఎంచి అర్చించు కొమ్మన్నారు. ఆనాడు శంకరుని వాక్కు వేదవాక్కు, శంకరాచార్యుల బోధాసుధారసం హృదయాంత రాళాలలో స్థిరీకరించని వారు లేరు. ఎండ మిక్కుటంగా ఉన్నపుడు చెట్లనీడల నాశ్రయించి విశ్రమించేవారు. సూర్యుడస్త మించు వరకు ప్రయాణము సాగిస్తూ సంధ్యను ఉపాసిస్తూ, రాత్రి వేళల గంగాతీరమందే ఉండి నిద్రించువరకు ధర్మ ప్రవచనాలతో కాలక్షేపం చేసేవారు.సర్వభూతాలు ఆ వైదిక వాక్కులకు పరవశ మయ్యేవి. దారిలో ఆచార్యుల బోధలు విన్నవారు ఈ శిష్యపరి వారంలో చేరి వీరివెంట వచ్చేవారు. శంకరపరివారం అలా దినదినాభివృద్ధి చెందింది. వారు వెళ్ళే దారిలో చరణాద్రి, తరువాత వింధ్యాద్రి కనిపించాయి. ఆచార్యుల వారు శిష్యులకు చెప్పారు వింధ్యాద్రి కథ. అగస్త్యుడు ఎలా ఆ నగాన్ని అణచి వుంచాడో.
*ప్రయాగ మహిమ:*
ప్రజాపతి బ్రహ్మ యాగాలనేకం చేసిన చోటు అవడం చేత దానికి ప్రయాగ అనే సార్థకనామం ఏర్పడింది. 'ప్రజాపతి అగ్ని వేది' అని కూడా దానికి నామాంతరం ఉన్నది. ఏ అంత రాయం లేకుండా అక్కడ నిరంతరం అగ్నికుండాలు వెలుగు తుండేవి. నూరు యాగాల ఫలితాన్ని మించిన ఫలం ప్రయాగలో నివసించినవారికి లభిస్తుంది. ఈ రహస్యం తెలిసిన మునులు మున్నగు వారెందరో అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. చతుర్వేదాధ్యయనం, రాజసూయ యాగం, నిత్యసత్య వ్రతం ఆచరించిన ఫలం ప్రయాగ తీర్థాన్ని దర్శించి సేవిస్తే వస్తుంది. భరతునికి భరద్వాజ మహర్షి విందు చేసినది ఈచోటనే. శ్రీరామ చంద్రుడు తన పాదధూళితో పావనం చేసిన భరద్వాజ ఆశ్రమం ఉన్నచోటు ఇదే. బహ్మ చతుర్వేదాలనూ వెలువరించినది ఇచ్చోటనే. అట్టి పరమ పవిత్ర మైన ప్రయాగను శంకరా చార్యుడు శిష్యగణం తో దర్శించుకొన్నాడు.
*అక్షయ వట వృక్షము* :
కల్పాంతంలో సకలమూ నశించగా శ్రీమహావిష్ణుని దయచేత
మార్కండేయమహర్షి మాత్రం సజీవుడై ఉంటాడు. అలా ఉండడానికి ఆశ్రయం ఇచ్చి నశ్వరం కానిది ఆ మహావట వృక్షం. ఆ వటవిటపి కథ అపూర్వం.
మొగలాయిల ప్రభుత్వకాలంలో హైందవ మతాన్ని కూల ద్రోసి వారి మతాన్ని మాత్రమే భారతదేశంలో నిల బెట్టడానికి వారు చేసిన యత్నాలు ఇంతా అంతా కాదు. అగ్బరు పాలనలో జరిగిందిది. ఈ వటవృక్ష మహిమ విని తమ మత వ్యాప్తికి పెద్ద అంత రాయంగా ఇది ఉందనుకొన్నారు. "అగ్బరు ది గ్రేట్!" అనే బిరుదు అంటించారు అగ్బరు కు పాశ్చాత్య చారిత్రకులు. సర్వమత సహనం కల వాడన్న పొల్లు గుణం కూడా ఆ మహావ్యక్తికి ఆపాదించారు. ఆయన చేసిన మతసహన మహాకార్యం ఏమిటి? ఆ వృక్షం ఆర్ష మతానికి ఆలంబనం గా ఉందన్న భావనతో దాని కొమ్మలు నరికించి మ్రోడుగా చేశాడు! మర్రి చావలేదు సరిగదా సహస్రముఖాలుగా చిగిర్చి ఇతోధిక ప్రాబల్యం సంతరించు కొంది.
అగ్బరు గతించినా ఆతురుష్కుల ‘మత అసహనగుణం’ మాత్రం అంతరించ లేదు! తండ్రికి పట్టిన పిచ్చి వదలని జహంగీరు చెట్టు మొదల్నే నరికించాడు ఔరా! మన మహా విటపి మాత్రం మరింత చైతన్య శోభతో విస్తరిల్లింది. పట్టు వదలని ఆ రాజు మరగకాచిన నూనెనుపోయించాడా తరువు మొదట్లో! అయినా చెక్కు చెదరక నేటికీ కోటలా ఉన్న ఆ చెట్టు అక్షయవృక్ష మనే సార్థకనామంతో విరాజిల్లు తోంది.
గంగా యమునా సరస్వతులు ప్రయాగ లో కలిసి త్రివేణీ సంగమమయ్యింది. ఈ తీర్థంలో స్నాన మాడిన వారికి పరమ కైవల్యపదం లభిస్తుంది. కోరికలతో స్నానమాడితే సఫలీ కృతులవు తారు. లక్షలాది జనాలు నిరంతరమూ వచ్చి ఆ ప్రయాగ గంగలో మునిగి అనంతమైన పుణ్యాలు మూట కట్టుకొని పోతుంటారు. 'కుంభమేలా’ జరిగేది ఇక్కడే. యాత్రికులు హిరణ్యాలు పెట్టి పితృతర్పణాలను అర్పిస్తారు. అమావాస్య నాటికి ప్రయాగ చేరుకొన్న శంకరబృందం త్రివేణీ సంగమ స్నానము ఆచరించారు.
,*కుష్ఠురోగి బాగుపడుట:*
శిష్యు డొకడు అక్షయ వటవృక్షాన్ని చూద్దా మని వెళ్ళాడు. అక్కడ ఒక కుష్ఠురోగి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు, శరీరమంతా పుండ్లు పడి రక్తహీన మైన శరీరం తెల్లబడి చెప్పరాని బాధ పడుచున్నాడు. ఎందులకీ పాడు జన్మ అని విరక్తుడై ప్రాణత్యాగానికి సిద్ధ పడిన వానిని చూచి బ్రతికించాలన్న బీజాంకురం శిష్యుని హృదయంలో మొలకెత్తింది.
ఎలాగో గురువుగారి కడకు చేర్చాడా దీనుణ్ణి. శంకరాచార్యుని సన్నిధానంలో ఉన్న వారంతా కుష్ఠురోగిని చూచి దూరంగా తొలగి వెళ్ళారు. శంకరుడు ద్వంద్వా తీతుడు. సుఖము గలిగించే సార్థక నాముడు. దగ్గరకు రమ్మని పిలచాడు. ఏవేవో చికిత్సలు చేశాడు. ఆ చికిత్సల వలననో, శంకరుని అమృతహస్తమో, యోగ మహిమయో గాని ఆ రోగి పుండ్లు ఊడి మచ్చలు మటుమాయమై శరీరం కరివేరు పువ్వు రంగుతో వెలుగుతూ ఆతడు అనారోగ్యం వీడి తేజోవంతుడయ్యాడు. చూచిన వారందరు విభ్రాంతులయ్యారు. ఉదంకుడు అనే పేరు పెట్టి అతణ్ణి సంఘం లోనికి పంపించారు శంకరులు.
*కుమారిలభట్టు:*
గౌతమబుద్ధుడు అవతరించి మత ప్రచార మొనరించిన కొంత కాలానికి ఆయన శిష్యులు భిన్నవిధాలుగా శుష్క తర్కాలతో పలు రకముల పోకడలు పోయారు. కడకు దేవుడు లేడనీ, వేదాలనూ ఉపనిష త్తులనూ నిరసించటం ఆరంభించారు. ఆ విధంగా బౌద్ధమత స్వరూపం మారింది. జైనులు బౌద్ధమతాన్ని ఆదరించడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. నేర్పూ, చురుకు దనంతో వారి భావాలను బహుళం గా ప్రచారం చేసి ఆ మతవ్యాప్తికి చాలా శ్రమపడ్డారు. బౌద్ధ గురువులు పాండిత్య ము కలవారు కావడంతో వారు భావించినవే సత్యంగా గ్రంథస్థం చేశారు. అదీ ఆ నాటి పరిస్థితి.
సుమారు 2575 సంవత్సరాల క్రిందటి మాట. మహానదీ తీరంలో జయ మంగళము అనే గ్రామం ఉండేది. అందులో చంద్రగుణ యజ్ఞేశ్వరులనే పుణ్యదంపతులకు కుమారిలభట్టు ఉదయించాడు. వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసిం చాడు. జైమిని మహర్షి అడుగు జాడలలో మెలగుతూ వేదవిహిత కర్మకాండ లను తానాచరిస్తూ ఇతరుల చేత చేయించుచుండేవాడు. బౌద్ధ జైన మతాలకు రాజాశ్రయం లభించ డంతో ఆ మతస్థులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వైదిక మతం ప్రజలలో ఆదరణను కోల్పోతూ ఉంది. ఇది సహించ లేక పోయాడు కుమారిలభట్టు. రాజాశ్రయం పొంది ఉన్న ఆ మతాలను వెడలగొట్టాలి. అందుకు ముందుగా ఆమతంలో ఏముందో కూలంకుషంగా తెలిసి కొనాలి. అందుకని కుమారిలభట్టు బౌధ్ధభిక్షు వేషం దాల్చి తక్షశిలలోని విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. అందరితోబాటు విద్య నభ్యసిస్తూ ఆ మతం లోని గుట్టుమట్టులు కనిపెట్ట గలిగాడు. వాళ్ళు చేసే వేద నిందలు దుర్భరం గా ఉన్నా కార్యసాధక దీక్షతో వాటిని అన్నిటిని భరించాడు. విద్యాభ్యాసం చివరికి వచ్చేసరికి సహ శిష్యులు ఇష్టాగోష్టిలో శ్రుతి స్మృతులను కర్మకాండలను దుయ్యబట్టుతున్నారు. ఘోరాతిఘోరంగా సాగుచున్న వారి మాటలకు సహించి మౌనంగా ఉండలేక పోయాడు. సహేతుకంగా వారి వాదనలు త్రోసిపుచ్చి వారి నోళ్ళు మూత పడేలా తెలియ జేసాడు. సహశిష్యులందరు కలిసి కుమారిలుని ద్రోహిగా నిశ్చయించి గురువులకు నివేదించారు. అది విన్న గురువు అట్టివాడుండకూడ దనుకొని నిద్రించే సమయంలో అతనిని మేడపై నుండి క్రిందకు పడద్రోయ’ మని ఆదేశించాడు. చూచారా! 'అహింస’ కు పెద్ద పీటవేసిన మతస్థాపకుని శిష్యపరంపర! గురువు చెప్పినంత పనీ శిష్యులు చేశారు. అలా పడుతున్న కుమారిలభట్టుకు స్పృహ వచ్చి 'వేదములే మహత్తు కలవైనచో నాకెట్టి అపాయము రాకుండు గాక' అని తనకున్న నమ్మకాన్ని ఒడ్డుకొన్నాడు. దూదిలో పడ్డట్టు పడినా చావు తప్పి ఒక కన్ను పోయింది. దానితో అక్కడి నుండి తప్పించుకొనాలని నిశ్చయించాడు. నూలు పోగుతో బిగించు కొన్న తన కంకణాన్ని ఈ మారు ఉక్కుతీగతో బిగించాడు. అమరావతీ పట్టణం చేరుకొని భట్టపాదుడు అనే మారుపేరు పెట్టుకొన్నాడు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*15 వ భాగముసమాప్తము.*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
*శ్రీ శంకరాచార్య చరిత్రము 16 వ భాగము*_
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*అమరావతిలో కుమారిలభట్టు:*
అమరావతీ పట్టణాన్ని అప్పుడు సుధన్వుడు అనే మహారాజు పరి
పాలిస్తున్నాడు. అతడు ధర్మిష్ఠి, సజ్జనసమ్మ తుడు. భట్టపాదుడన్న పేరుతో రాజ దర్శనం కోసం వేచి ఉన్నాడు కుమారిలభట్టు. మాసిన బట్టలతోఉన్నా అతని ముఖం బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశి స్తోంది. రాజు వెంటనే స్వాగతం పలికాడు. భట్టపాదుడు రాజును వేదోక్తంగా ఆశీర్వదిం చాడు. ఆ రాజు కొలువులో చార్వాకులు చర్చలు చేస్తుంటారు. భట్ట పాదుడు వారితో వాదించి శాస్త్రాధారా లను ఎత్తి చూపుతూ వేద మత ప్రామాణ్యాన్ని నిరూపించాడు. బౌద్ధు లకూ వేదాలు సరి పడవు. కుమారిల భట్టు రాజాస్థాన చర్చలలో పాల్గొని సభకు ఒక విలువ తెచ్చాడు.అది గమనించినా రాజు ఏ పక్షమూ చేరకుండా మౌనం వహించేవాడు.
సుధన్వుని రాణి పూర్వాచార పరాయణురాలు. దైవభక్తితో ఉండే ఆమెకు మహారాజు నాస్తికు డగుతాడేమో నన్న భయం ఉంది. భర్తతో మాటాడగా మహారాజు 'నాస్తిక్యాని దే పైచేయిగా ఉంది కాబట్టి నే నేమీ చేయలేను' అని చెప్పాడు. ఈ రహస్యం తెలిసికొన్న భట్ట పాదుడు పట్టపుదేవిని ఆశ్రయించాడు. భట్ట పాదుని మహానుభావత్వం మీద సుముఖం గా ఉంది మహారాణి. రాజసభలో మతాలను గురించి కఠోర పరీక్ష పెట్టేటట్లుగా సుధన్వుని ఒప్పించమని వేడు కొన్నాడు భట్టపాదుడు. రాజు అంగీకరించి మరునాటి సభలో మతపరీక్ష జరగాలని ప్రకటించాడు.
భట్టపాదుడు లేచి “మహారాజా! ఎవరైతే పర్వత శిఖరాగ్రం నుండి క్రిందబడి బ్రతుకుతారో వారి మతమే శ్రేష్ఠమని ప్రభువులు నిర్ణయిం చాలి" అని కోరాడు. ముందుగా భట్టపాదుణ్ణి దింపు దామన్న భావంతో చార్వాకులు ఒప్పుకొన్నారు ఆ పరీక్షకు. ఈ సంగతి తెలిసిన మహారాణి భట్టపాదుని పిలిపించి అతనితో ఇలా అంది. "మహాశయా! ఏమిటీ ఘోరపరీక్ష? శాస్త్రాలఆధారములు చాలవా? యుక్తియుక్తమైన వాదనలతో వేదముల ఆధిక్యాన్ని నిరూపించ వచ్చు గదా! తొందర పడకండి భట్టూ!” అనిప్రార్థించింది. దానికి సమాధానంగా “అమ్మా! సకల శాస్త్రాలు వేదము అభ్యసించిన పిమ్మట జైన మతం లోని రహస్యాలను క్షుణ్ణంగా తెలిసి కొన్నాను. వేదములు పురుషులు సృష్టించినవి కావు. పరాత్పరుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి. వాటికీ భగవంతు నకూ అభేదము. ఈ విషయాలు నిరూపించా లంటే మాటలతో అయ్యేటట్లు లేదు. మాటకుమాట, యుక్తికి యుక్తి కలిగి తెలివి గల వాళ్ళు ఆ శుష్క పద్ధతులకే తల ఒగ్గు తారు. అందు చేత నాకు ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణము కన్న వేరుగతి కనిపించడం లేదు. తల్లీ! పరాత్పరుడు సత్య రూపుడు. ఆ సత్యాన్ని నమ్మిన నాకు భయ మేల?” అని బదులు పలికాడు.
మరునాడు పరీక్ష. పరీక్షకు మొదటి అవకాశం తాను తీసు కొంటానని అభిప్రాయం వెలిబుచ్చాడు భట్ట పాదుడు. చార్వాకులకు అది ఆనందదాయక మైంది. దీనితో తమ కొక పీడ విరగడ అవు తుందనుకొన్నారు జైనులు, బౌద్ధులు, చార్వాకులు! భట్టపాదుడు ఒక ఎత్తైన పెద్ద పర్వతం ఎక్కి అమాంతం క్రిందికి దూకివేసాడు. చెక్కు చెదరకుండా నిక్షేపంగా ఉన్న భట్టపాదుని చూచి ఆ క్షణంలోనే జయజయ ధ్వానాలతో ఆయనకు నీరాజనాలు సమర్పించారు. భట్ట పాదునికి మహారాజ సభలో అగ్రస్థానంలో వేదఘోషల మధ్య సత్కారం చేశారు. సుధన్వ మహారాజు వేదమతమే సర్వ శ్రేష్ఠమనీ,సర్వోన్నతమనీ ప్రకటించాడు. చార్వాకులు అంతటితో వదలి పెట్టలేదు. ఇంద్రజాలం, మంత్ర తంత్ర విద్యలతో భట్టపాదుడు మనల్ని మభ్యపెడుతున్నాడు అన్న వాదనలను లేవదీశారు. రాజు ఆ వాదనలను అంగీక రించ లేదు. అయినా మరొక పరీక్ష పెడదా మని నిర్ణయించాడు. మూతి గట్టిగా బిగించిన ఒక భాండాన్ని తెప్పించి 'ఈ భాండంలో ఏముందో” రహస్యంగా పత్రాలపై లిఖించండి. సరిగా చెప్పగల వారి మతమే గొప్పదని నిర్ణయిస్తాము తక్కిన వారికి మరణ శిక్ష.' అని ప్రకటించాడు. చార్వాకులకు అది ఒక గడ్డు సమస్యగా ఉండి వ్యవధి కోరారు. రాత్రంతా కలిసిఒకచోట మీన మేషాలు లెక్కలు కట్టారు. భట్టపాదుడు కుత్తుక బంటి నీటిలో నిలబడి రాత్రంతా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడు. తెల్లవారింది. రాజ్యసభ కిటకిట లాడుతుండగా రాజు పత్రాలు తెమ్మన్నాడు. భాండం లోపల పాము ఉందని చార్వాకులు వ్రాసి ఇచ్చారు.
భట్టపాదుడు అందు శేషశాయి ఉన్నాడు అని వ్రాశాడు. ఇంతలో ‘భట్టపాదునిదేసరియైన ది' అన్న ఆకాశవాణి వినిపించింది. సందేహ నివృత్తి కొరకు భాండము తెరచి చూచారు. రాజు ఆశ్చర్యచకితుడై నాడు. శేషశాయియే కన్పడ్డాడు. నిజానికి రాజు లోన పెట్టినది పామునే. చార్వాకులు ఈ రహస్యాన్ని ఎవరి ద్వారానో సేకరించి ఉంటారు. ఈ పరీక్షలో కూడ భట్టపాదుడే నిర్ద్వందంగా నెగ్గినట్లు ప్రకటించి నాటి నుండి వేదాలే ఆదరణీయాలు అన్న రాజాజ్ఞ వెలువడింది.
అప్పుడు జైన బౌద్ధమతవాదులు రాజుతో ఇలా విన్నవిం చారు: “రాజా! ఇన్నాళ్ళూ ప్రత్యక్ష ప్రమాణం కల వేద మతాన్ని దూషించి మహాపాతకం చేశాము. అవతార పురుషుడైన ఈ మహాత్మునితో పోటీపడ్డాము. మేము శిక్షార్హులం. శిక్ష త్వరలో అమలు చెయ్యండి" అని వేడుకొన్నారు. వారు అంతా కూడి ఇరువది ఒక్కరు. వరుసగా నిలబడి ఉన్నారు. ఖడ్గం పుచ్చుకొని శిరచ్ఛేదం చేద్దామని వధకారుడు సిద్ధమవుతున్నాడు. ఇంతలో అటు నుండి నరకమని కేక విన బడింది.
సరేనని ఆ పని చేస్తుంటే చివర నున్నవాడు అమర సింహడు తాను భట్టపాదునితో మాట్లాడ గోరాడు. ఆ వార్త విన్న మహారాజు భట్టపాదుని తోడ్కొని వచ్చాడు. వారికి నమస్కరించి అమర సింహుడు తన కోరికను ఈ విధంగా విన్నవించాడు: "స్వామీ! లోకోపకార దృష్ట్యా ఒక ఉద్గ్రంధా న్ని రచిస్తున్నాను. అది పూర్తి కావచ్చింది. అది సంస్కృత భాష అధ్యయనానికి మకుటాయ మాన మైనది. నా గ్రంథం పూర్తి అయ్యే వరకు నేను బ్రదికి ఉండడం అవసరం అనిపించి ఈ నా ప్రార్థన మన్నిస్తారని వేడుకొంటున్నాను. ఇది జీవితాశతో కోరు కొంటున్నది కాదు”. తరువాత తన గ్రంథము లోని కొన్ని శ్లోకాలనువినిపించాడు.
వెంటనే భట్టపాదుడు అది అత్యంత విశిష్టమైన గ్రంథము. అట్టి గ్రంథ రచయితను లేకుండా చేసి లోకానికి లోటు కలిగించ కూడదని చెబుతాడు. వధ మానిపించాడు. ఆ గ్రంథమే ‘అమర కోశము' అనే పేరుతో ప్రఖ్యాతి గాంచినది.
*తుషానల ప్రవేశము*:
'కర్మాచరణము కన్న మానవునకు కావలసినది వేరొండు లేదనే దృఢసంకల్పంతో చేసిన కృషిలో సఫలీకృతుడనయ్యాను. ఈ యత్నంలో కపటవేషం ధరించి గురుద్రోహం చేశాను. ఈ పాపానికి నిష్కతిగా నాకు నేనే శిక్ష విధించు కోవాలి' అని నిశ్చయించుకొన్నాడు కుమారిలభట్టు! ఊకను రాశిగా పోయించి అందులో తాను పరుండి నిప్పును తానే ముట్టించు కొన్నాడు. ఇలా చేస్తున్నాడన్న వార్త తృటిలో దేశ మంతా వ్యాపించి శంకరాచార్యుడు కుమారిల భట్టును దర్శించడానికి బయలు దేరాడు.
"కుమారిలా! ఏమిటీ ఘోరము? నీవు అపరాధాలు చేసే వాడవా? ఎందుకీ క్రూర కార్యం చేపట్టావు?” అని శంకరుడు అడుగగా "శంకరానందస్వామీ! మీరు ఇచ్చటికి వచ్చి నాకు తమ దర్శన భాగ్యం కల్పించారు. ధన్యుణ్ణి. నేను రెండు అపరాధములు చేసిన వాడను. ఒకటి శిష్యరికం కపటంగా చేసి ఆ గురువు మతాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొన్న గురుద్రోహిని. రెండవది ఆత్మ తత్త్వాన్ని మరుగుపరచి కర్మ వాదాన్ని ఒక్కటీ అమలు పరచిన వాడను. అందు వలన ఆత్మద్రోహం చేశాను. దీనికి శాస్త్రరీత్యా తుషానల ప్రవేశం చేసి సజీవ దహనమే ప్రాయశ్చిత్తము” అని వినయంగా సమాధాన మిచ్చాడు కుమారిలభట్టు.
అందుకు శంకరుడు "భట్టాచార్యా! నీవు కర్మమతాన్ని ఉద్ధరించు టకే కదా అవతార మెత్తితివి! నీవు చేయదలచినదంతా చేశావు. పవిత్రుడవు నీకు ప్రాయశ్చిత్త మెందుకు? లెమ్ము. ఈ శిక్ష మానుకొమ్ము!” అని ఆదరంగా పలికాడు శంకరుడు.
"అవతారమూర్తీ! నీకు తెలియనిదేమున్నది? సృష్టి స్థితి సంహారాలు నీ అధీనములు. శాస్త్రాన్ని కాదన జాలను. కాదంటే ప్రపంచమే నన్ను నిందిస్తుంది. ఇది మీకు తెలియనిది కాదు. నన్ను బ్రదికించడం తమ కొక లెక్కా? మీరు కేవలం శివావతారులు. మీకు జయం తప్పదు. మాహిష్మతీపురంలో మండనమిశ్రుడను పేరు కలవాడు ఉన్నాడు. అతడు నా శిష్యుడు. నా యంతటి వాడు. అతని భార్య అపర సరస్వతి. సూత్రభాష్యా నికి వార్తికాలు వ్రాయగల సమర్థుడు అతడే. ఆతనిని జయిస్తే మీ అవతార ఆశయం నెరవేరు తుంది. పరాత్పరా! అవసానకాలమందు అవతారమూర్తుల సన్నిధానం లభించడం నా పూర్వపుణ్యఫలం. నాకు ఆత్మ తత్త్వాన్ని ఉపదేశించి సర్వబంధ విముక్తుణ్ణి చేయండి" అని ప్రార్థించిన కుమారిలుని కోరిక మన్నించి తత్త్వోపదేశం చేయగా మరుక్షణం కుమారిలుడు బంధనా లను త్రెంచుకొని ముక్తుడై మౌనం దాల్చి కన్ను మూశాడు.తుషానలం ఒక్కసారి గుప్పుమన్నది. కుమారిలుడు కైవల్యం చేరుకొన్నాడు.
*ప్రభాకరాచార్యుడు:*
ప్రయాగ కెదురుగా గంగానదికవ్వల ఒడ్డున ఉన్నది ప్రతిష్ఠాన పురం. ఒకప్పుడు చంద్రవంశపు రాజులు దాన్ని రాజధానిగా చేసికొని పరిపాలించే వారు. ఒకప్పుడు అది దగ్ధం కాబడి నేటికీ శిథిలావస్థలో కాన వస్తుంది. కుమారిల భట్టు శిష్యులలో ఒకడు ప్రభాకరా చార్యుడు అనే వాడు ఆ పట్టణంలో నివసిస్తున్నాడు. అతడు మహాపండితుడు. కర్మ కాండ యందే నిష్ఠతో యజ్ఞ యాగాది క్రతువు లెన్నో చేసి దేవతలను తృప్తి పరచేవాడు. కర్మకాండలో నూతన పద్ధతులను ప్రవేశ పెట్టినవాడు. తనంతటి వాడు లేడన్న ధైర్యంతో ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాడు. అందు చేతనే కాబోలు శంకరాచార్యుల ప్రశస్తి విన్నా శంకరుని దర్శనానికి వచ్చే యత్నం చేయలేదు. ప్రయాగలో ఉండగా శంకరునికి ఆయన సంగతి తెలిసి ప్రభాకరాచార్యుని చూడడానికి శంకరా చార్యులే బయలు దేరాడు. తన్నుచూడడా నికి వస్తున్నాడంటే తానే అధికుడననే భావన చోటు చేసు కుంది ప్రభాకరా చార్యుని మనస్సులో!
శంకరాచార్యులను కలిసిన తర్వాత ఆ మనోదౌర్బల్యం చెల్లా చెదరయ్యింది. శంకరుని తన మతంలో కలుపుకొనడానికి ఇది మంచి అదనని కలగన్న ప్రభాకరుడు శంకరుల వాక్పటిమకు తట్టుకోలేక దాసోహమన్నాడు. ఆ శ్రీ శంకరాచార్య వాఙ్మయ మహా సముద్రంలో ఎన్ని ఏఱులు అప్పటికే చేరాయో కదా! ఇదొక లెక్కా!
ప్రభాకరాచార్యులకు ఒక మూగగా పుట్టిన కొడుకు ఉన్నాడు. అప్పటికి పదమూడేండ్ల వయస్సు. పేరు పృథివీ ధరుడు. అయిదేళ్ళ ప్రాయంనుండి మాటా మంతీ లేకుండా మౌనంగా ఉండి పోయాడు. అతనికి పైపెచ్చు ప్రాపంచిక దృష్టి లేదు. అమ్మా అని పిలిచి ఎరుగడు. వైద్యాలకు ఏ విధం గాను పిల్లవాడి పరిస్థితి మెఱుగుపడటం లేదు. శ్రీశంకరుల దగ్గరకు తీసికొని వచ్చి "స్వామీ! ఈ నా పుత్రుని మామూలు మనిషిగా మార్చగల సర్వశక్తి సంపన్నులు మీరు.
నా పైన దయతో మమ్ములను కాపాడ వలసినదనిప్రార్థించాడు ప్రభాకరాచార్యుడు.
శంకరాచార్యుడు ఆ బాలుని బాగుగా పరిశీలించారు. అంతర్గర్భితమైన గొప్ప భావాలు ఆ బాలునిలో ఉన్నట్లు తెలిసి కొన్నారు. తండ్రిది కర్మజీవనం. ఆ వయస్సులోనే బాలునికి జ్ఞానదృష్టి పెంపొంది తనతో మాటలాడి తన భావాలు వినేవారు ఎవ్వరూ లేరన్న నిర్ధారణతో చిన్నప్పటి నుండే మౌనం వహించినటుల తెలిసిపోయింది శంకరునికి. ప్రేమ, ఆదరము చూపి బాలుని యథా జీవన స్రవంతి లోనికి తేవచ్చు నని గ్రహించారు. బాలకుని తలపై చేయి వేసి “బాలకా! నీవు ఎవ్వడవు? నీకు ఎవరితో సంబంధ మున్నది? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? నీ పేరేమిటి? నాప్రశ్నలకు సమాధాన మిచ్చి నన్ను సంతోష పెట్టుము” అని అడిగారు శంకరస్వామి.
*హస్తామలకుడు:*
శంకరాచార్యుల వారి ప్రశ్నలకు ఆ బాలకుడు ప్రబుద్ధుడై, వెనువెంటనే అపూర్వమైన వాగ్ధాటి తో ఈ క్రింది శ్లోకాలుగా సమాధానాలు చెప్పాడు:
*“నాహం మనుష్యో న చ రేవ యక్షా,*
*న బ్రాహ్మణో నైవచవైశ్య శూద్రాః*
*న బ్రహ్మచారీ న గృహీ వనస్థో,*
*భిక్షుర్న చాహం నిజబోధ రూపః|*
*మనశ్చక్షురాదేర్వియుక్తః స్వయంయో,*
*మనశ్చక్షురాదే ర్మనశ్చక్షురాదిః*
*మనశ్చక్షురాదే రగమ్యస్వరూపః*
*సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా!॥*
అట్లు పృథివీధరుడు తన అనుభూతిని శంకరాచార్య స్వామికివిన్నవించు కొన్నాడు. విన్న అందరూ ఆ దృశ్యాన్ని చూచి విభ్రాంతులయ్యారు. శంకరుని మహిమకు జోహారులర్పించారు. ఆమలకం హస్తంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆత్మ తత్త్వం పృథివీధరు నిలో వ్యక్తం కావడంతో అతనికి ‘హస్తామలకుడు' అని నామకరణంచేశారు శంకరాచార్యులు.
అప్పుడు శంకరుల వారు ప్రభాకరా చార్యునితో "ప్రభాకరా చార్యా! చూచావు కదా! ఈ నీ పుత్రుడు ఎట్టివాడో! ఈతడు సర్వజ్ఞుడు. ఇటు వంటి వాళ్ళు చూచే వాళ్ళకు పిచ్చివాళ్ళలా కనబడ తారు. ఇతడు నీ దగ్గఱ ఉండడం కల్ల. వీని చిత్తమేనాడో పరమేశ్వ రాయత్త మయింది. బాహ్య ప్రపంచంతో నిమిత్తం లేనివాడు. మాతో ఉండదగ్గవాడు. కావున నాతో పంపి వేయి” అని చెప్పగా అంగీకరించి సంతోషం తో కుమారుని శంకరులకప్పగించాడు. ఈ విధంగా పృధివీ ధరుడు హస్తామలకుడుగా శ్రీశంకరాచార్యుల శిష్యుడు అయ్యాడు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*16 వ భాగము సమాప్తము*
🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦
_*శ్రీ శంకరాచార్య చరిత్రము 17 వ భాగము.*_
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*మాహిష్మతీ పురము:*
మాహిష్మతీపురంలోని మండనమిశ్రుని కలవాలని ఆయత్త పడుచున్నారు శంకరా చార్యులు. అది చాలా దూరంలో ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే తప్ప వేరు సాధనాలు లేనిపరిస్థితి. ఈనాడు యంత్రాలతో జరుగుతున్నవి ఆనాడు యోగశక్తులతో జరిగేవి. వ్యవధి చాలా తక్కువ గా ఉండడంతో యోగ బలంతో శంకరుడు శిష్యపరి వారంతో సహా గగనమార్గాన మాహిష్మ తీపురం సమీపించారు. దగ్గరలో నున్న ఒక చక్కని ఉద్యానవనంలో ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసికొన్నారు.
మాహిష్మతీపురం ఆ నాటి మహానగరాలలో ఒకటిగా పేరెన్నిక గన్నది. తారలకెగబ్రాకు సౌధరాజములు, బహు సుందరమైన దివ్య భవనాలు వారికి దర్శన మిచ్చాయి. బిందెలు చంకన పెట్టుకొని వచ్చే పరిచారికలు కనబడగా మండనమిశ్రుని నివాస గృహం జాడఅడిగారు శిష్యులు. ద్వారం దగ్గర
పంజరాలు, అందులో రామచిలుకలు, గోరు వంకలు ఉంటాయి. అవి ఈవిధంగా చర్చిస్తుంటాయి:
“స్వతః ప్రమాణం,
పరతః ప్రమాణం
ఫలప్రదం కర్మ
ఫల ప్రదోషః
జగధ్రువం స్యా
జ్జగ దధ్రువం స్యాత్”
అని గీర్వాణభాషలో బదులు పలికారా భామలు! చిలుకలు, గోరువంకలు, పరిచారిక లు సంస్కృతంలోనే మాటలాడడం చూచిన వారంతా ఆశ్చర్య పడ్డారు ఆ మండన మిశ్రుడు ఇంక ఎంత మహా పండితుడో కదా అని. శిష్యులకు ఆ చిలుక పలుకులకు అర్థం తెలియక తికమకపడి గురువు గారిని అడిగారు. అపుడు శంకరులు “చిలుకలు మన మాడిన మాటలే విన్నంత మాత్రాన తిరిగి చెప్పుతాయి. వాటికి ఆ నేరుపు ఉండడం సృష్టివిచిత్రం. దేశంలోని పండితులకు అన్నీ సందేహాలే. మండనమిశ్రుని వద్దకు వచ్చి అడుగు తుంటారు. శాస్త్ర ఆధారాలతో వారి సందేహనివృత్తి చేస్తాడు మండనమిశ్ర పండితుడు. ఆ ప్రశ్నలూ జవాబులూ వినిన చిలుకలు వాటినే మననం చేసుకొంటూ ఉంటాయి. మనకు చెప్పిన మాటలకు అర్థం ఇది.
మీమాంసకులు స్వత: ప్రమాణము అందురు. జ్ఞానులు అపౌరుషే యాలు అంటారు. మిగిలిన వాళ్ళు పరత ప్రమాణములంటారు. అంటేపౌరుషేయాలని. తరువాతి దానికిది మూలం: ఎవడు చేసికొన్న కర్మననుస రించి దాని ఫలాన్ని వాడే పొందుతాడు. సత్కర్మ అయితే సత్ఫలితాన్నీ, దుష్కర్మ అయితే చెడ్డ ఫలితాన్ని పొందుచున్నాడు. దుఃఖ ప్రారబ్ధమయినా, సుఖ ప్రారబ్ధమయినా అనుభవించి తీరాలని శాస్త్రాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఇందులో పరాత్పరునికి సంబంధంలేదు. అతడు కర్మనూ ఇవ్వడు ఫలితాన్నీ ఇవ్వడు. కేవలం సాక్షీభూతుడు.
ఇంక మూడవ భాగం : జగత్తు నిత్యం కాదని వేదాంతులంటారు. త్రాడును చూచి పాము అనుకొంటారు. అది పాము కాదని తేలే వరకు అది పాము లాగే కనిపిస్తుంది. త్రాడు పాము కాదని తెలిసిన తర్వాత త్రాడు త్రాడుగనే ఉంటుంది. అలాగే జగత్తును తెలిసికొన్న తర్వాత జగత్తు అనిత్యమే అవుతుంది. ఇది ఇట్లుండగా విజ్ఞులు జగత్తును 'మిథ్య' అన్నారు. చూపులకు నిజంలా గోచరిస్తుంది. అట్టిది నిజం కానిది ఎట్లు? ఈ జగత్తు ఒకప్పుడు నాశం కావలసిందే. అందుకే దీనిని 'మిథ్య అన్నారు.” అని వివరంగా బోధించారు.
పరిచారికలు చెప్పిన గుఱుతులు ఆధారంగా తెలిసికొన్నారు వారు మండనమిశ్రుని ఇల్లు. అది మహారాజ గృహంలాఉంది. శంకర బృందాన్ని చూచిన చిలుకలు కిలకిలా రావాలు చేశాయి.
మండనమిశ్రుని ఇంట ప్రవేశము:
సింహద్వారం గట్టిగా బిగించబడి ఉంది. అన్ని ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి. ఇక మార్గాంతరం లేక శిష్యుల్ని అరుగు మీద కూర్చోబెట్టి శంకరుడు ఒక్కసారిగా గగనాని కెగిరి మండువా లోనుండి ఇంట్లోనికి ప్రవేశించాడు. శంకరుని సమదృష్టి పుట్టుకతో వచ్చినదే. ఇది నా ఇల్లు అది వారిది అన్న భేదం ఆయనకు ఎప్పుడూ లేదు. ఆ రోజు మండనమిశ్రుని తండ్రి తద్దినం. ఏ లోపమూ రాకూడదని గృహద్వారాలు అన్నీ మూసివైచాడు. భోక్తలు మరెవరో కాదు. విష్ణు సన్నిభుడైన వ్యాస మహర్షి. ఆయన శిష్యుడు జైమిని మహర్షి!
మంత్రపూతంగా వారిద్దరినీ ఉచితాసనాలపై కూర్చుండ బెట్టి కాళ్ళు కడుగుతున్నాడు మండనమిశ్రుడు.
ఆ సమయంలో శంకరా చార్యస్వామి ఆ ముగ్గురి ఎదుట ప్రత్యక్ష మయ్యాడు. కర్మ భ్రష్టులన్నా యతులన్నా మండనుడు మండి పడతాడు. వాళ్ళను చూస్తేనే సచేల స్నానం చేయాలన్న మతమా యనది. తలుపులన్నీ బిగించి ఉన్నా ఎలా చొరబడ్డాడీతడు? అని కోపంతో పరవళ్ళు త్రొక్కుచున్నాడు. ఆ నాడు బౌద్ధ భిక్షువుల ప్రాబల్యం మూలాన వేదమతస్థులలో సన్న్యసించే వారు తక్కువ. అందుచేత సన్న్యాసులకు ఆదరణ లేదు. తద్దినం పెట్టే టప్పుడు మౌనంగా ఉండాలన్న నియమాన్ని కూడా త్రోసిపుచ్చి మండనమిశ్రుడు అతి క్రుద్ధుడై చింత నిప్పుల లాంటి కళ్ళతో శంకరుని ఇలా అడిగాడు:
మండనుడు: కుతో ముండీ! (ఓ బోడీ! ఎక్కడ నుండి నీ రాక? ఎక్కడి వరకు ముండ నం చేసి కొన్నావు?)
శంకరుడు: ఆగళాన్ముండీ! ( కంఠం వఱకే ముండనం చేయించు కొన్నాను. కంఠం వరకే క్షౌరం చేయించుకొనే వాడను)
మండనుడు : పన్థస్తే పృచ్ఛతే మయా. (నీ మార్గము నాచే
అడుగబడుచున్నది)
శంకరుడు: కిమాహి పంథా: (నిన్ను గూర్చి మార్గ మేమనెను?)
మండనుడు : త్వ న్మాతా ముండే త్యాహ! (ముండ అని చెప్పింది మీ యమ్మ!)
శంకరుడు : తథైవహి! (బాగు! బాగు! నీవు మార్గం అడిగి నందుకు మీ అమ్మ ముండ అని నీకు తగినదేచెప్పింది!)
మండనుడు : సురా పీతా కిమ్? ( కల్లు త్రాగావా ఏమిటి? కల్లు పచ్చగా ఉంటుందా?)
శంకరుడు : నైవ శ్వేతాయత స్మర! (కల్లు పచ్చగా ఉండదు. తెల్లగ ఉంటుంది. మరచితివా! జ్ఞాపకం తెచ్చుకో!)
మండనుడు : త్వం తద్వర్ణం జానాసి కిం? (నీకు అలవాటు కనుక దాని వర్ణం బాగా తెలుసు కాబోలు!)
శంకరుడు : అహం వర్ణం, భవా న్రసం! (నాకు రంగు తెలిస్తే నీవు రుచి తెలిసిన వాడవు!)
మండనుడు : మత్తో జాత: కలం జాశీ విపరీతాని భాషతే! (కలంజ భక్షణంతో విపరీతంగా మాటాడు చుంటివే! నా వలన కుమారుడు కలంజాన్ని తిన్న వాడై విపరీతంగా మాట్లాడుచున్నావు)
శంకరుడు : సత్యం బ్రవీతి! పితృవ త్వత్తో జాత: కలంజ భుక్! (నా వలన కలంజం తినువాడు పుట్టెనని నిజమే పల్కావు!)
మండనుడు : కంథాం సహసి దుర్బుద్ధే! గర్దభే నాపి దుర్వహమ్! శిఖాయజ్ఞోపవీతాభ్యాం కస్తే భారో భవిష్యతి? (దుర్బుద్దీ! గాడిద మోయలేని బరువును ఎలా మోస్తున్నావు? జుట్టూ జందాలు బరువయ్యాయా?)
శంకరుడు : దుర్బుద్ధే! తవ పిత్రాపి దుర్భరామ్ కన్థం వహామి శిఖా యజ్ఞోపవీతాభ్యాం శ్రుతిర్భారో భవిష్యతి! (మీ తండ్రి మోయలేని బరువును మోస్తున్నాను. శిఖాయజ్ఞోప వీతాలు శ్రుతికి బరువు కాని నాకు కాదు. శ్రుతులు చదువ లేదా? విరాగులైన యతులకు అది ధర్మమే. నా ధర్మం గ్రహించే శక్తి నీకు లేకపోయింది!)
మండనుడు: వేదవిహితంగా పెళ్ళాడి పెళ్ళాన్ని పోషించలేక ఆమెను విడచి, శిష్యులంటూ ప్రోగు పెట్టుకొని వాళ్ళచేత మూటా ముల్లె మోయిస్తూ త్రిప్పుకొనే నీ బండారం బయటపడిందిలే! ఇదంతా వేషంగాక మరేమిటి?
శంకరుడు: బ్రహ్మచారివై గృహాన్ని విడిచి గురువు నాశ్రయించి సకల విద్యలు నేర్చి అందులో ఉన్న రహస్యాన్ని గ్రహించలేక స్త్రీలోలుడైన వానికి బ్రహ్మసాక్షాత్కారం పొందాలంటే ఏం తెలుస్తుంది?
మండనుడు: నవమాసాలూ మోసి కని పెంచే తల్లులనే దూషిస్తున్నావు. ఇంత కన్న దారుణముందా?
శంకరుడు : ఎంత తెలివి లేనివాడవోయి! నేనేమీ తల్లిని దూషించడం లేదు. ఆడుదాని యోని నుండి బయట పడ్డావా! ఆమె స్తన్యం కుడిచితివా! అలాటి ఆడు దాని కుచాలను పట్టి కులుకుతావా! పుట్టిన స్థానాన్నే కామిస్తావా! నీకు పశువులకు తేడా ఏమిటి?
మండనుడు: త్రేతాగ్నులను వదలితే వీరహత్యను పొందు చున్నాడని వేదాలే వచిస్తున్నవి. ఇది నీకు ధర్మమే?
శంకరుడు: భవబంధనాలను తెంచే వేదాంత తత్త్వాన్ని తెలిసికోని వాడు ఆత్మహత్య చేసికొన్నట్లే అని వేదంలోనే ఉన్నది. అన్నిటి కన్న మిన్న కదా ఆత్మ హత్య!
మండనుడు: తలుపులు బిగిస్తే లోనికి రాకూడదన్న జ్ఞానం ఉండ నక్కఱలేదా? దొంగ వలె దూరావు!
శంకరుడు : డేగ ఆహారాన్ని తన్నుకొని దూరంగా పోయి మ్రింగుతుంది. ఆ డేగ వలె యతుల కివ్వ దగ్గ దాన్ని ఇవ్వకుండా చేస్తున్నావు. కర్మాను ష్ఠానం చేయడం లేదా? గృహస్థాశ్రమంలో ఉండి ఎవరికీ కనిపించకుండా అతిథుల్నీ అభ్యాగ తుల్నీ పూజించడం మానుకొన్నావా?
మండనుడు : కర్మకాలే న సంభాష్య అహమ్! (పవిత్ర మైన శ్రాద్ధకర్మ సమయంలో ఒక మూర్ఖునితోసంభాషించ వలసి వచ్చిందే!)
శంకరుడు: పండితుడవే! కవివే! విద్య లేని వాని వలె, సామాన్యుని వలె మాటాడుచున్నావు. నీవు అనవలసినది 'కర్మకాలే న సంభాషాహమ్!’ యతి భంగంగా మాటలాడే తెలివి కలవాడివి!
మండనుడు: యతిభంగానికై వర్తించే వానికి యతిభంగ దోషం రాదులే!
శంకరుడు : యతిని అవమానింప వచ్చన్న మాట?
మండనుడు : ఈ కలి లోనా సన్న్యాసం? దురాచారాలు, దుష్ట బుద్ధులుచెలరేగుతుంటే బ్రహ్మజ్ఞానమా? పలురకాల రుచుల కోసం కాక యోగివేషా లెందుకు?
శంకరుడు: అవునులే! కలికాలంకాక ఇలాంటి దురాచారాలు అగ్ని హెూత్రాలు ఎందుకు? విషయ వాంఛలు చంపుకోలేక వేసే వేషాలు కాక?
మండనుడు : జడుని వలె అయిపోయావు. అందుకే వేదాలకు వ్యతిరేకంగా పలుకు తున్నావు!
శంకరుడు: పాంచభౌతిక శరీరమే జడం. చిదాత్మ కాదు.
మండనుడు: దరిద్రుడా! పరమ పవిత్రమైన పురుష జన్మ ఎత్తి జడత్వాన్ని పొంది ?
శంకరుడు : యతిని పూజింపని వాడే దరిద్ర చక్రవర్తి!
మండనుడు: మాటలు మంచిగా రావా?
శంకరుడు : పాపం చేస్తే మాటలు పరుషములవుతాయి.
మండనుడు : దొంగవై దొంగలచే ఆశ్రయింప బడ్డావు.
శంకరుడు: అరిషడ్వర్గాలచే పీడింపబడ్డవాడే దొంగలచే ఆశ్రయింప బడిన వాడని తెలిసికోలేవా?
మండనుడు : నా పిలుపు లేకుండా నా ఇంట్లో ఏల ప్రవేశించావు?
ఆ వాద ప్రతివాదనలు ఇప్పుడప్పుడే ముగిసే లా లేవని ఎంచిన వ్యాసమహర్షి కలుగ జేసికొని మండన మిశ్రునితో ఇలా చెప్పాడు:
"మండనమిశ్రా! తనంతట తానుగా వచ్చిన యతిని ఆదరింపక ఏవేవో అసందర్భపు మాటలు చెబుతావెందుకు? వచ్చిన యతి సామాన్యుడుకాదు. విజ్ఞానఖని. స్వయంగా వచ్చిన అభ్యాగతుడు విష్ణువుతో సమానుడై యుండగా పూజించడం మాని దూషిస్తున్నావు. నీ యింటికి నిజంగానే విష్ణువు వచ్చి యున్నాడు. ఆలస్యం చేయక యతిని ఆనందంతో యథావిధి గా సత్కరించు.” వ్యాస మహర్షి ఆజ్ఞతో మండనమిశ్రుడు కోపం చంపుకొని శాంతం వహించాడు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ శంకరాచార్య చరిత్రము*
*17 వ అధ్యాయము సమాప్తము*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥