18, సెప్టెంబర్ 2024, బుధవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15 వ భాగము.*_ 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*విజయ యాత్ర:&


వాదోపవాదములు చేసి శత్రువులను జయించమని ఈశ్వరుని ఆజ్ఞ. విష్ణుసన్నిభుడైన వ్యాసభగవానుని బోధ. ఇక జ్ఞాన యుద్ధమే తరువాయి.


ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణపరమాత్మ అండ పాండవులకు లభించినట్లుగానే శివకేశవుల కరుణ శ్రీశంకరాచార్యులకు లభ్యమైంది. అర్జునుని అక్షయ తూణీరాల వంటివి శంకరుని సూత్ర భాష్యాలు. పార్థునకు దివ్యరథాలు ప్రాప్తించి నట్లు శంకరునికి ఉపనిషత్తులు చాలు. పదునెనిమిది అక్షౌహిణుల సేనల పోరాటమది. పదునెనిమిది రోజులుగా సాగినది. పదునెనిమిది అధ్యాయాల భగవద్గీత శంకరుని హృదయంలో చేరింది. ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు అధ్యక్షుడైనాడు.


ఇక్కడ 'స్వయం మంత్రీ స్వయం రాజా' అన్నట్లుగా శ్రీశంకరుడే అన్నీ నిర్వహిస్తాడు. అర్జునునకు తోడుగా నలుగురు సోదరులు ఉండగా ఇక్కడ దిగ్గజాల లాంటి పద్మ పాదాది శిష్యప్రకాండు లున్నారు. పాండవుల పక్షాన ధర్మము ఉన్నట్లే శంకరుని పక్షాన ధర్మముతో కూడిన ఆత్మవిశ్వాస శక్తి ప్రబలంగా ఉన్నాయి.


పాంచజన్యాన్ని మధు సూదనుడు, దేవ దత్తాన్ని విజయుడు పూరించి నట్లు ఒక సుముహూర్తాన శ్రీశంకరాచార్యుడు తత్త్వ శంఖారవం చేశారు. ఆ శంఖా రావము కాశీలోనే కాదు యావద్భారత దేశములోని ధర్మ శత్రువుల గుండెలు దద్దరిల్లేలా వినిపిం చింది. విన్న యతులు, యోగులు, ముముక్షువులు, సాధుజనులు కర్ణానందంగా విన్నారు. ఆ అవతార మూర్తి రాకకై చంద్రునికి సముద్రునిలా ఎదురు చూస్తు న్నారు. గంగాస్తవాలు చేసికొంటూ, గంగాస్మర ణలతో తనకు దగ్గరలోనే మెలగు చున్న శంకరసేనను చూచి గంగ ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగి పోతోంది. హరిహరులకు భేదము లేదని ఆచార్యులవారు బోధించేవారు. శంకరాచార్యుని వైష్ణవులు సాక్షాద్విష్ణువుగాను, శైవులు సాక్షాత్తు శివునిగాను భావించి నమస్కరించేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనే పంచాయతనాన్ని పూజించమని ఆదేశించేవారు. అందు ఎవరికి ఏది అభిమతమో దానిని ప్రధానంగా ఎంచి అర్చించు కొమ్మన్నారు. ఆనాడు శంకరుని వాక్కు వేదవాక్కు, శంకరాచార్యుల బోధాసుధారసం హృదయాంత రాళాలలో స్థిరీకరించని వారు లేరు. ఎండ మిక్కుటంగా ఉన్నపుడు చెట్లనీడల నాశ్రయించి విశ్రమించేవారు. సూర్యుడస్త మించు వరకు ప్రయాణము సాగిస్తూ సంధ్యను ఉపాసిస్తూ, రాత్రి వేళల గంగాతీరమందే ఉండి నిద్రించువరకు ధర్మ ప్రవచనాలతో కాలక్షేపం చేసేవారు.సర్వభూతాలు ఆ వైదిక వాక్కులకు పరవశ మయ్యేవి. దారిలో ఆచార్యుల బోధలు విన్నవారు ఈ శిష్యపరి వారంలో చేరి వీరివెంట వచ్చేవారు. శంకరపరివారం అలా దినదినాభివృద్ధి చెందింది. వారు వెళ్ళే దారిలో చరణాద్రి, తరువాత వింధ్యాద్రి కనిపించాయి. ఆచార్యుల వారు శిష్యులకు చెప్పారు వింధ్యాద్రి కథ. అగస్త్యుడు ఎలా ఆ నగాన్ని అణచి వుంచాడో.


*ప్రయాగ మహిమ:*


ప్రజాపతి బ్రహ్మ యాగాలనేకం చేసిన చోటు అవడం చేత దానికి ప్రయాగ అనే సార్థకనామం ఏర్పడింది. 'ప్రజాపతి అగ్ని వేది' అని కూడా దానికి నామాంతరం ఉన్నది. ఏ అంత రాయం లేకుండా అక్కడ నిరంతరం అగ్నికుండాలు వెలుగు తుండేవి. నూరు యాగాల ఫలితాన్ని మించిన ఫలం ప్రయాగలో నివసించినవారికి లభిస్తుంది. ఈ రహస్యం తెలిసిన మునులు మున్నగు వారెందరో అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. చతుర్వేదాధ్యయనం, రాజసూయ యాగం, నిత్యసత్య వ్రతం ఆచరించిన ఫలం ప్రయాగ తీర్థాన్ని దర్శించి సేవిస్తే వస్తుంది. భరతునికి భరద్వాజ మహర్షి విందు చేసినది ఈచోటనే. శ్రీరామ చంద్రుడు తన పాదధూళితో పావనం చేసిన భరద్వాజ ఆశ్రమం ఉన్నచోటు ఇదే. బహ్మ చతుర్వేదాలనూ వెలువరించినది ఇచ్చోటనే. అట్టి పరమ పవిత్ర మైన ప్రయాగను శంకరా చార్యుడు శిష్యగణం తో దర్శించుకొన్నాడు.


*అక్షయ వట వృక్షము* :


కల్పాంతంలో సకలమూ నశించగా శ్రీమహావిష్ణుని దయచేత

మార్కండేయమహర్షి మాత్రం సజీవుడై ఉంటాడు. అలా ఉండడానికి ఆశ్రయం ఇచ్చి నశ్వరం కానిది ఆ మహావట వృక్షం. ఆ వటవిటపి కథ అపూర్వం.


మొగలాయిల ప్రభుత్వకాలంలో హైందవ మతాన్ని కూల ద్రోసి వారి మతాన్ని మాత్రమే భారతదేశంలో నిల బెట్టడానికి వారు చేసిన యత్నాలు ఇంతా అంతా కాదు. అగ్బరు పాలనలో జరిగిందిది. ఈ వటవృక్ష మహిమ విని తమ మత వ్యాప్తికి పెద్ద అంత రాయంగా ఇది ఉందనుకొన్నారు. "అగ్బరు ది గ్రేట్!" అనే బిరుదు అంటించారు అగ్బరు కు పాశ్చాత్య చారిత్రకులు. సర్వమత సహనం కల వాడన్న పొల్లు గుణం కూడా ఆ మహావ్యక్తికి ఆపాదించారు. ఆయన చేసిన మతసహన మహాకార్యం ఏమిటి? ఆ వృక్షం ఆర్ష మతానికి ఆలంబనం గా ఉందన్న భావనతో దాని కొమ్మలు నరికించి మ్రోడుగా చేశాడు! మర్రి చావలేదు సరిగదా సహస్రముఖాలుగా చిగిర్చి ఇతోధిక ప్రాబల్యం సంతరించు కొంది. 


అగ్బరు గతించినా ఆతురుష్కుల ‘మత అసహనగుణం’ మాత్రం అంతరించ లేదు! తండ్రికి పట్టిన పిచ్చి వదలని జహంగీరు చెట్టు మొదల్నే నరికించాడు ఔరా! మన మహా విటపి మాత్రం మరింత చైతన్య శోభతో విస్తరిల్లింది. పట్టు వదలని ఆ రాజు మరగకాచిన నూనెనుపోయించాడా తరువు మొదట్లో! అయినా చెక్కు చెదరక నేటికీ కోటలా ఉన్న ఆ చెట్టు అక్షయవృక్ష మనే సార్థకనామంతో విరాజిల్లు తోంది.


గంగా యమునా సరస్వతులు ప్రయాగ లో కలిసి త్రివేణీ సంగమమయ్యింది. ఈ తీర్థంలో స్నాన మాడిన వారికి పరమ కైవల్యపదం లభిస్తుంది. కోరికలతో స్నానమాడితే సఫలీ కృతులవు తారు. లక్షలాది జనాలు నిరంతరమూ వచ్చి ఆ ప్రయాగ గంగలో మునిగి అనంతమైన పుణ్యాలు మూట కట్టుకొని పోతుంటారు. 'కుంభమేలా’ జరిగేది ఇక్కడే. యాత్రికులు హిరణ్యాలు పెట్టి పితృతర్పణాలను అర్పిస్తారు. అమావాస్య నాటికి ప్రయాగ చేరుకొన్న శంకరబృందం త్రివేణీ సంగమ స్నానము ఆచరించారు.


,*కుష్ఠురోగి బాగుపడుట:*


శిష్యు డొకడు అక్షయ వటవృక్షాన్ని చూద్దా మని వెళ్ళాడు. అక్కడ ఒక కుష్ఠురోగి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు, శరీరమంతా పుండ్లు పడి రక్తహీన మైన శరీరం తెల్లబడి చెప్పరాని బాధ పడుచున్నాడు. ఎందులకీ పాడు జన్మ అని విరక్తుడై ప్రాణత్యాగానికి సిద్ధ పడిన వానిని చూచి బ్రతికించాలన్న బీజాంకురం శిష్యుని హృదయంలో మొలకెత్తింది.


ఎలాగో గురువుగారి కడకు చేర్చాడా దీనుణ్ణి. శంకరాచార్యుని సన్నిధానంలో ఉన్న వారంతా కుష్ఠురోగిని చూచి దూరంగా తొలగి వెళ్ళారు. శంకరుడు ద్వంద్వా తీతుడు. సుఖము గలిగించే సార్థక నాముడు. దగ్గరకు రమ్మని పిలచాడు. ఏవేవో చికిత్సలు చేశాడు. ఆ చికిత్సల వలననో, శంకరుని అమృతహస్తమో, యోగ మహిమయో గాని ఆ రోగి పుండ్లు ఊడి మచ్చలు మటుమాయమై శరీరం కరివేరు పువ్వు రంగుతో వెలుగుతూ ఆతడు అనారోగ్యం వీడి తేజోవంతుడయ్యాడు. చూచిన వారందరు విభ్రాంతులయ్యారు. ఉదంకుడు అనే పేరు పెట్టి అతణ్ణి సంఘం లోనికి పంపించారు శంకరులు.


*కుమారిలభట్టు:*


గౌతమబుద్ధుడు అవతరించి మత ప్రచార మొనరించిన కొంత కాలానికి ఆయన శిష్యులు భిన్నవిధాలుగా శుష్క తర్కాలతో పలు రకముల పోకడలు పోయారు. కడకు దేవుడు లేడనీ, వేదాలనూ ఉపనిష త్తులనూ నిరసించటం ఆరంభించారు. ఆ విధంగా బౌద్ధమత స్వరూపం మారింది. జైనులు బౌద్ధమతాన్ని ఆదరించడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. నేర్పూ, చురుకు దనంతో వారి భావాలను బహుళం గా ప్రచారం చేసి ఆ మతవ్యాప్తికి చాలా శ్రమపడ్డారు. బౌద్ధ గురువులు పాండిత్య ము కలవారు కావడంతో వారు భావించినవే సత్యంగా గ్రంథస్థం చేశారు. అదీ ఆ నాటి పరిస్థితి.


సుమారు 2575 సంవత్సరాల క్రిందటి మాట. మహానదీ తీరంలో జయ మంగళము అనే గ్రామం ఉండేది. అందులో చంద్రగుణ యజ్ఞేశ్వరులనే పుణ్యదంపతులకు కుమారిలభట్టు ఉదయించాడు. వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసిం చాడు. జైమిని మహర్షి అడుగు జాడలలో మెలగుతూ వేదవిహిత కర్మకాండ లను తానాచరిస్తూ ఇతరుల చేత చేయించుచుండేవాడు. బౌద్ధ జైన మతాలకు రాజాశ్రయం లభించ డంతో ఆ మతస్థులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వైదిక మతం ప్రజలలో ఆదరణను కోల్పోతూ ఉంది. ఇది సహించ లేక పోయాడు కుమారిలభట్టు. రాజాశ్రయం పొంది ఉన్న ఆ మతాలను వెడలగొట్టాలి. అందుకు ముందుగా ఆమతంలో ఏముందో కూలంకుషంగా తెలిసి కొనాలి. అందుకని కుమారిలభట్టు బౌధ్ధభిక్షు వేషం దాల్చి తక్షశిలలోని విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. అందరితోబాటు విద్య నభ్యసిస్తూ ఆ మతం లోని గుట్టుమట్టులు కనిపెట్ట గలిగాడు. వాళ్ళు చేసే వేద నిందలు దుర్భరం గా ఉన్నా కార్యసాధక దీక్షతో వాటిని అన్నిటిని భరించాడు. విద్యాభ్యాసం చివరికి వచ్చేసరికి సహ శిష్యులు ఇష్టాగోష్టిలో శ్రుతి స్మృతులను కర్మకాండలను దుయ్యబట్టుతున్నారు. ఘోరాతిఘోరంగా సాగుచున్న వారి మాటలకు సహించి మౌనంగా ఉండలేక పోయాడు. సహేతుకంగా వారి వాదనలు త్రోసిపుచ్చి వారి నోళ్ళు మూత పడేలా తెలియ జేసాడు. సహశిష్యులందరు కలిసి కుమారిలుని ద్రోహిగా నిశ్చయించి గురువులకు నివేదించారు. అది విన్న గురువు అట్టివాడుండకూడ దనుకొని నిద్రించే సమయంలో అతనిని మేడపై నుండి క్రిందకు పడద్రోయ’ మని ఆదేశించాడు. చూచారా! 'అహింస’ కు పెద్ద పీటవేసిన మతస్థాపకుని శిష్యపరంపర! గురువు చెప్పినంత పనీ శిష్యులు చేశారు. అలా పడుతున్న కుమారిలభట్టుకు స్పృహ వచ్చి 'వేదములే మహత్తు కలవైనచో నాకెట్టి అపాయము రాకుండు గాక' అని తనకున్న నమ్మకాన్ని ఒడ్డుకొన్నాడు. దూదిలో పడ్డట్టు పడినా చావు తప్పి ఒక కన్ను పోయింది. దానితో అక్కడి నుండి తప్పించుకొనాలని నిశ్చయించాడు. నూలు పోగుతో బిగించు కొన్న తన కంకణాన్ని ఈ మారు ఉక్కుతీగతో బిగించాడు. అమరావతీ పట్టణం చేరుకొని భట్టపాదుడు అనే మారుపేరు పెట్టుకొన్నాడు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*15 వ భాగముసమాప్తము.* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

కామెంట్‌లు లేవు: