🙏మహాభారతం శాంతి పర్వం 🙏
అష్టమ భాగం
నారదుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు మౌనం వీడలేదు. అది చూసి వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియులకు రాజ్యపాలన కంటే వేరే ధర్మంకలదా ! అందువలన వేదవిహితమైన విప్రకర్మలు ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం వాటిల్లగలదు. వేదవిహిత విప్రకర్మలు ఆచరించని ఎడల రాజుకు పాపంసంక్రమించి ఉత్తమలోక ప్రాప్తికి ఆటంకంకలుగుతుంది. కనుక ప్రజాపాలనయే నీధర్మం " అన్నాడు.
ధర్మరాజు వ్యాసుడితో " వ్యాసమహర్షీ ! మీరు చెప్పింది నిజమే. నేను కూడా రాజ్యకాంక్షతో ఈ యుద్ధానికి తలపడి నరమేధం జరగడానికి కారణమయ్యాను. చంపకూడని వారిని చంపాను. నా ఆత్మ దహించుకు పోతుంది. అందువలన నా హృదయం దహించుకు పోతుంది. కాని మీ మాటలు తిరస్కరించుట భావ్యంకాదు. ఏమిచెయ్యాలో తోచడంలేదు. వ్యాసుడు " ఈ పనిచెయ్యాలి ఈ పనిచెయ్యకూడదు అని నిర్ణయించడానికి మనం ఎవ్వరం. మనం నిమిత్తమాతృలం. అంతా ఈశ్వరాజ్ఞతో జరుగుతూ ఉంటుంది. గొడ్డలి తీసుకుని చెట్టును నరికితే ఆపాపం గొండ్డలికి అంటుతుందా ! సర్వము పరమేశ్వర సంకల్పం చేతనే జరుగుతుందని తెలుసుకున్న నాడు నీకు ఏ పాపం అంటదు. నీవు కర్మ చెయ్యి కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించు. జ్ఞానులు వేదంలో చెప్పినదంతా పరమాత్మ పరంగా చేస్తాడు. అందు వలన వారికి ఏపాపపుణ్యములు అంటవు. యుద్ధంలో శత్రువులను చంపానని దానివలన పాపం అంటగలదని నీవు అనుకుంటే అందుకు తగిన ప్రాయశ్చితం చేసుకో. యజ్ఞయాగములు చేసి పాపపరిహారం చేసుకో. అంతే కాని పాపానికి భయపడి రాజ్యమును, రాజ్యపాలనను, ప్రజలను వదిలివేయడం భావ్యం కాదు " అన్నాడు.
ధర్మరాజు వ్యాసుడితో " ఓ వ్యాస మహర్షీ ! ఈ యుద్ధంలో నా కుమారులు, మనుమలు, అన్నలు, తమ్ములు, తండ్రులు, తాతలు, మామలు, గురువులు, సంబంధులు, మిత్రులు, అల్లుళ్ళు, బావలు, మరుదులు, ఎంతో మంది రాజులు, మహారాజులు, చక్రవర్తులు నా చేత చంపబడ్డారు. వారికి సంబంధించిన స్త్రీలు వారి భర్తల కొరకు, కొడుకుల కొరకు, తండ్రుల కొరకు శోకిస్తున్నారు. కొందరు ప్రాణాలు కూడా విడుస్తున్నారు కనుక స్త్రీలను చంపిన పాపం కూడా నాకు చుట్టుకుంటుంది. ఇన్ని పాపములు చేసిన నేను నిష్కల్మషుడను ఎలా ఔతాను. ఇంతగా పరితపిస్తున్న నాకు నా మనసు రాజ్యపాలనకు ఎలా సుముఖత చూపిస్తుంది. ఉగ్రమైన తపస్సు చేసి ప్రాణత్యాగం చేయడం కంటే నాకు మరో మార్గం లేదు " అన్నాడు.
ధర్మరాజు మాటలకు వ్యాసుడు " నీ మనసులో శోకము బాధను పక్కనపెట్టి నా మాటలు విను. నీవు చెప్పినవారంతా ఊరికే చావలేదు. రాజ్యముకు ఆశపడి వారి పేరుప్రతిష్టల కొరకు, వారి అభివృద్ధికొరకు యుద్ధం చేసారు. వారి చావువలన నీకు పాపం ఎలా అంటుకుంటుంది. వారికి ఏ కర్మ పరిపక్వమై ఆ మరణాలు సంభవించాయో ఎవరికి తెలుసు ? ఎప్పుడు ఎవరిని ఎలా చంపాలో యముడికి బాగా తెలుసు. ఆ విధంగానే యముడు ప్రాణం హరిస్తుంటాడు. అందుకు నీవు కారణమని తలచి శోకించుట వెర్రి. అందు కొరకు రాజ్యమునువీడి, ఇల్లువిడిచి అడవులకు వెళ్ళుట మరింత వెర్రి. మనలను తోలు బొమ్మల వలె ఆడించే వాడే ఇదంతా చేస్తున్నాడు. ఈ యుద్ధంలో చనిపోయిన రాజుల రాజ్యాలను వారి కుమారులకు పట్టాభిషేకం చెయ్యి. కుమారులు లేకున్న వారి కుమార్తెలకు పట్టాభిషేకం చెయ్యి. అందువలన వారి తల్లులు సంతోషిస్తారు. నీకుపుణ్యం, కీర్తి లభిస్తుంది. ధర్మజా ! యుద్ధంలో జరిగిన నరమేధానికి నీవు చింతించ పనిలేదు. దేవదానవ యుద్ధంలో దేవేంద్రుడు దానవులను అతికిరాతకంగా చంపి నెత్తుటేరులు పారించాడు. ఇంద్రుడు తన దాయాదులైన దానవులను చంపినందుకు మునులు శ్లాఘించారు కాని నిందించ లేదుకదా ! ఆ ఇంద్రుడికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇవ్వడం మానారా ! ఆ ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయి పాలించడం లేదా ! ధర్మరాజా ! నీవు కూడా దుష్టులైన నీ అన్నదమ్ములను పుణ్యమార్గంలో యుద్ధంచేసి సంహరించి క్షత్రియధర్మం ఆచరించావు. కనుక దేవేంద్రుడి వలె నీవు కూడా రాజ్యపాలనకు అర్హుడవే ! నీకు ఇష్టం అయితే యజ్ఞయాగాదులు చెయ్యి. ముఖ్యంగా అశ్వమేధం చెయ్యి. అశ్వమేధానికి కావలసిన ద్రవ్యాన్ని సమీకరించడానికి రాజ్యభారం వహించు " అన్నాడు.
వ్యాసుడి మాటలతో ధర్మరాజుకు శోకవిమోచనం కలిగింది. ధర్మరాజు " వ్యాస మునీంద్రా ! ఏ కర్మానికి ఏ పాపం వస్తుంది. ఏ పాపముకు ఏది ప్రాయశ్చిత్తం. నాకు వివరంగా చెప్పండి " అని ఆడిగాడు. వ్యాసుడు ధర్మరాజుకు ధర్మసూక్ష్మములు వివరించ సాగాడు. " ధర్మజా ! సూర్యుడు ఉదయించే కాలంలో అస్తమించేకాలంలో నిద్ర పోవడం. అతిథి ఇంటికి వచ్చినప్పుడు సత్కరించక పోవడం, పరస్త్రీలను కామించడం, గురువు మాటకు ఎదురు చెప్పడం, ఉన్న ఊరును నాశనం చెయ్యడం, వేదవిద్యను అమ్ముకోవడం, భగవంతుడిచ్చిన భూమిని అమ్ముకోవడం, సేవకులకు ఆపద వచ్చినప్పుడు కాపాడక పోవడం, ఎల్లప్పుడూ కపటంగా ప్రవర్తించడం, అడవులను తగులపెట్టడం, స్వధర్మం విడిచి పరధర్మం ఆచరించడం, తనకు ఇచ్చినపని చేయకపోవడం, జంతువులను కొట్టడం, హింసించడం, బ్రాహ్మణులకు చెందిన సంపదను హరించడం తనను శరణు వేడిన వాడిని రక్షించ పోవడం, బ్రాహ్మణులను చంపడం మహాపాపములు. అలాగే కొన్ని పనులు పైకి పాపం అనిపించినా అవి నిందించ తగినవి కాదు. అవి ఏమిటంటే యుద్ధంలో కత్తి తీసుకుని తనను చంపడానికి వస్తున్న వాడు వేదవిదుడైన బ్రాహ్మణుడైనా సరే అతడిని చంపితే పాపం రాదు.
అలాగే బ్రాహ్మణుడి ఆస్తిని సంపదను ఎవరైనా అపహరిస్తుంటే వారిని చంపడం పాపం కాదు. ప్రాణాపాయ సమయంలో, అన్నం, నీళ్ళు దొరకనప్పుడు కల్లు త్రాగినా, తాను తాగేది కల్లు అని తెలియకున్నా దాని వలన కలిగిన పాపం పుణ్య కార్యములు చేస్తే పోతుంది.ప్రాణ హాని కలిగినప్పుడు, ప్రమాదకరమైన ఆపదలు కలిగినప్పుడు బ్రాహ్మణుల ధనమును అపహరించినప్పుడు, వివాహసమయంలో పెద్దలు పనులు నిర్వర్తించే సమయంలో, గురువులను రక్షించే సమయంలో స్త్రీలతో మాట్లాడే సమయంలో తనకు ఉన్న సంపదలు సర్వము, నాశనం అయ్యే సమయంలో అబద్ధములు చెప్పినా అది పాపం కాదు. ఎవరికైనా స్వప్నంలో తేజోపతనము జరిగిన అది దోషం కాదు. అతడి బ్రహ్మచర్యముకు అది దోషం కాదు. అగ్నిలోనేతిని హోమంచేస్తే ఆదోషం పోతుంది. తన అన్న దుర్మార్గుడైనా, చెడు మార్గం పట్టినా, సన్యాసంస్వీకరించినా ఆ సమయంలో అన్న భార్యను స్వీకరించడం తప్పుకాదు. గోవులను రక్షించుటకు అడవిని తగులపెట్ట వచ్చు. అర్హుడు కానివాడికి దానం చెయ్యడం, తప్పుచేసిన సేవకుడిని శిక్షించక వదలడం పాపాలు కాదు.
ధర్మజా ! పైనచెప్పిన బ్రాహ్మణుడిని చంపినదోషం పోవడానికి తాను చేసినపని చెప్పుకుంటూ బిక్షాటన చేస్తూ ఒక్క సారి మాత్రమే భుజిస్తూ, బ్రహ్మచర్యం అవలంభిస్తూ, నేలమీద నిద్రిస్తూ 12 సంవత్సరాలు నియమనిష్టలతో జీవితం గడపాలి. లేనిఎడల ఆరుసంవత్సరాల కృఛ్రమవ్రతం ఆచరించాలి. లేనిఎడల మూడు సంవత్సరముల చంద్రాయణవ్రతం చేయాలి. నెలకు ఒక్కమారు తింటూ ఒక్కసంవత్సరం గడపాలి. అదీ లేనిఎడల అశ్వమేధయాగం చేయాలి. బ్రాహ్మణులకు ఒకలక్ష గోవులను కాని ఒకవంద గుర్రాలను కాని దానంచేయాలి. ఇందు వలన బ్రాహ్మణ హత్యాదోషం, బ్రాహ్మణసొత్తును అపహరించిన దోషంపోతుంది. ఇక సురాపానం చేసిన వాడికి ఆ సురను ఎర్రగాకాచి దానిని వాడిచేత త్రాగించాలి. లేని ఎడల కళ్ళు మూసుకుని నిప్పులలో దూకాలి. లేని ఎడల మహా ప్రస్థానం చేయాలి. లేనిఎడల భృహస్పతియాగం చేయాలి, లేనిఎడల భూదానం చేయాలి. అలాచేసిన సురాపానం చేసిన పాపం పోతుంది. గురువు భార్యను కామించిన వాడికి బాగా ఎర్రగాకాల్చిన ఇనుప స్త్రీవిగ్రహాన్ని కౌగలించుకునేలా చేయాలి. లేనిఎడల పురుషాంగం కోసి చేత్తో పట్టుకుని ఆకాశంవైపు చూస్తూ మరణించాలి. లేని ఎడల యుద్ధమున తన గురువుకొరకు ప్రాణత్యాగంచేయాలి. లేనిఎడల ఉన్నధనం అంతా బ్రాహ్మణులకు దానం చేయాలి. బ్రాహ్మణుడి బంగారం దొంగిలించిన పోవడానికి దనికి సరిపడినంత బంగారం తిరిగి ఇవ్వాలి, అసత్యదోషం పోవడానికి ఆ అసత్యం వలన ఎవరికి అపచారం కలిగిందో వారికి సంతోషం కలుగ చేయాలి. గురువును ఎదిరించిన పాపం పోవడానికి ఆ గురువుకు నమస్కరించి గురుదక్షిణ ఇవ్వాలి. పరభార్యను కామించిన వాడు ఆ పాపానికి ఒక సంవత్సరం కృచ్ఛమవ్రతం చేయాలి. వరసకాని స్త్రీని కామించిన వాడికి తడిబట్టలు కట్టుకుని బూడిదలో ఆరునెలలు నిద్రించాలి. పరపురుషునితో సంగమించిన స్త్రీకి రజోదర్శనంతో ఆ పాపం పోతుంది. నరకకూడని చెట్టునినరికినా, జంతువులను చంపినా దాని వలన కలిగేపాపం మూడు రోజులు ఉపవాసం ఉంటే పోతుంది. ఇంకా తెలిసి చేసినవి, తెలియక చేసినవి మితాహారం తీసుకుంటూ ఉదయం సాయంత్రం గాయత్రీ జపంచేస్తే పోతుంది. పూర్వజన్మలో చేసినపాపాలు దానధర్మాలు చేస్తూ పోగొట్టుకోవాలి. అంతే కాని నాస్తికులు, శ్రద్ధ, నియమం లేనివారు ఏమిచేసినా వారు చేసినపాపం పోగొట్టుకో లేరు. ధర్మజా ! ఆస్తికుడవు నియమనిష్టలు కలిగిన నీవు చేసిన స్వల్పపాపమును స్వల్ప ప్రాయశ్చితములతో పోగొట్టుకొన వచ్చు. నీవు చేసినపాపం యుద్ధంచెయ్యడం, అందు వీరులనుచంపడం. అది నీవు క్షత్రియధర్మంగా ఆత్మరక్షణకు చేసింది. కనుక అది పాపంకాదు అని నిరూపించాము నీలోకలిగిన అపారమైనకరుణ పశ్చాతాపంవలన నీవు పరిశుద్ధుడవు అయినావు. కనుక నీవు తప్పస్సు చేయవలసిన పనిలేదు కనుక నీవు నిశ్చింతగా రాజ్యపాలన చేయవచ్చు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ