శృంగేరి కథ కంచి(కి)లో
ఒకసారి మహాస్వామి వారి దర్శనానికి ఒక బ్రహ్మచారి అయిన యువకుడు వచ్చాడు. పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసి నిలుచున్నాడు. మహాస్వామి వారు ఆత్రుతగా అతణ్ణి చూసి “నువ్వు కుళితలై శంకరన్ కదూ? ఎలా ఉన్నావు?” అని అడిగారు. ”అవును పెరియవా. బావున్నాను అంతా మీ ఆశీర్వాదం.” శంకరన్ బదులిచ్చాడు.
“సరే ఇప్పుడు నీ వయసెంత?”
“ముప్పై సంవత్సరాలు పెరియవా”
మహాస్వామి వారు నవ్వుతూ “పెళ్ళి చేసుకోకుండా ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకుంటున్నావా?” అని అడిగారు.
”అవును పెరియవా” అన్నాడు శంకరన్.
”సరే. ఏమైనా విశేషమా ఇలా రావటం?” అని నవ్వుతూ “కారణం లేకుండా నువ్వు రావు కదా?” అని అన్నారు.
”అవును పెరియవా. ఒక సందేహ నివృత్తి కోసం ఇక్కడకు వచ్చాను.”
“అలాగా! సరే చెప్పు ఏమా పెద్ద సందేహం” అని అడిగారు.
“అది మంత్రజపం గురించిన ఒక సందేహం” శంకరన్ బదులిచ్చాడు. పరమాచార్య స్వామి వారు వెంటనే “అది మంత్ర జపం గురించినదైతే.. నువ్వు ఏదైనా మంత్ర జపం చేస్తున్నావా?”
“అవును పెరియవా”
“ఓహో మంత్రోపదేశం తీసుకున్నావన్నమాట.”
“అవును పెరియవా”
“గురువు ఎవరైతే”
“మైసూరు యజ్ఞ నారాయణ గణపదిగళ్” శంకరన్ బదులిచ్చాడు. ”మంచిది. చలా మంచి విద్వాంసుడు; మత్రం ఏదైనా”
శంకరన్ నోరు తెరువక ముందే స్వామి వారు “ఆగాగు.. ఆ మంత్రాన్ని అలా చెప్పకూడదు. అది నీలోనే రహస్యంగా ఉంచుకోవాలి. కేవలం అది ఏ దైవ సబంధమో చెప్పు చాలు”
“హనుమత్ ఉపాసనా పరమాణ మూల మంత్రం పెరియవా”
“సరే నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి ఈ మంత్ర జపంలో”
“అది పెరియవా నేను ఈ మంత్రాన్ని నాకు 23 సంవత్సరాల వయసున్నప్పటినుండి జపంచేస్తున్నాను మత్రోపదేశం పొందిన తరువాత. నేను గత ఏడు సంవత్సరాలుగా జపం చేస్తున్నాను. కాని నాకు ఏమి తెలియదు”
“నాకు ఏమి తెలియదు అనుటలో అర్థమేమి?” మహాస్వామి వారు ఆశ్చర్యంతో అడిగారు. ”నేను ఏమంటున్నానంటే, పెరియవా నాకు ఆ మంత్ర సిద్ధి కలిగిందో లేదో అర్థం కావటం లేదు” అని దిగాలుగా అన్నాడు.
పరమాచార్య స్వామి వారు వెంటనే “తెలుసుకుని ఏం చేస్తావు? ఏమైనప్పటికీ నీవు జపం చేస్తున్నది ఆత్మార్థం (ఆత్మజ్ఞానం) కోసమా? కామ్యార్థం (ఏదేని కొరిక తీరడం) కోసమా?”
“నేను చేస్తున్నది ఆత్మార్థం కోసమే పెరియవా. కాని నాకు ఆ మంత్ర సిద్ధి కలిగిందో లేదో, ఆ మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహం ఉందో లేదో అర్థంకావటం లేదు. దయచేసి నా మంత్ర జపం పురోగతి ఎలా ఉందో తెలపండి.” ఈ మాటలు చెప్తూ తల వంచుకుని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు.
”ఎవరైతే మంత్ర జపం చేస్తున్నారో వారికి స్వీయ అనుభవం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆ మత్రం ఫలించిందో లేదో అని. ఒకానొక సమయంలో అది నీకు కూడా సంభవిస్తుంది, శంకరా” అని వాత్సల్యంతో అన్నారు.
శంకరన్ కు తృప్తి కలగలేదు, “లేదు పెరియవా. నాకు ఇంతవరకూ ఎటువంటి అనుభవం కలగ లేదు. నాకు దాని గురించి ఏమి అర్థం కావట్లేదు గత 7 సంవత్సరాలుగా మా గురువు గారు చెప్పినట్టు చేస్తున్నా కూడా. ఒక్కోసారి నాకు చాలా అసహనంగా ఉంటుంది ఈ విశయమై. మీరే ఏదో ఒక దారి చూపించాలి” అని శంకరన్ రెండు చేతులు కలిపి అంజలి ఘటించి మహాస్వామి వారికి సాష్టాంగం చేసాడు.
పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి, తన భక్తుని మనస్థితిని అర్థంచేసుకుని ఇలా చెప్పారు. ”చాలా సంవత్సరాల క్రితం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి పీఠానికి మహాత్ముడైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారు పీఠాధిపతిగా ఉండేవారు. ఒకరోజు ఆ ప్రాంతం వాడైన ఒక శిష్యుడు వారి దర్శనార్థం వచ్చాడు.”
“వారికి సాష్టాంగం చేసి, తను తెచ్చిన జామ పళ్ళను వారికిచ్చాడు.”
“రా ఎలా ఉన్నావు? చెప్పు నీకేం కావాలి?” అని ప్రేమతో పలకరించారు.
”స్వామి, నాకు మా గురువు గారు ఉపదేశించిన మంత్రాన్ని నేను చాలా సంవత్సరాలుగా జపిస్తున్నాను. కాని నాకు మంత్ర సిద్ధి కలిగిందో లేదో తెలియడం లేదు. అది తెలుసుకోవడం ఎలా?” అని వినయంగా అడిగాడు.
స్వామి వారు వెంటనే “ఆత్మార్థం కోసం నువ్వు చేస్తున్న జపం కొనసాగించు. ఆ మంత్ర అధిష్టాన దేవత నీకు ఫలితాన్ని కచ్చితంగా ఇస్తుంది”
ఆ శిష్యుడు స్వామి వారి మాటలకి తృప్తి పడలేదు. “లేదు స్వామి నేను నాకు కలిగిన ఫల సిద్ధి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరే ఒక దారి చూపించాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని అన్నాడు.
స్వామి వారు ఆ శిష్యుడి మనస్థితిని అర్థం చేసుకుని దగ్గరకు పిలిచి “దిగులు పడకు. దానికి ఒక మార్గం ఉన్నది” అన్నారు.”
ఉన్నదా? ఐతే నాకు ఆ విషయం దయచేసి తెలియపరచండి స్వామి” అని అడిగాడు. నృసింహ భారతీ స్వామి వారు నవ్వుతూ “ప్రతి రోజూ నువ్వు జపం చేసుకునే ముందు చక్క పీట పైన వడ్లు పరిచి దాని పైన ఒక వస్త్రం కప్పి, దాని పైన కూర్చొని జపం చెయ్యి. రోజూ ఇలాగే చెయ్యి. ఏరోజైతే ఆ పీట పైనున్న వడ్లు వేయించినట్లు పేలాలుగా మారతాయో ఆ రోజు నీకు మంత్ర సిద్ధి కలిగినట్టు. అర్థం అయ్యిందా?” అని చెప్పారు.
శిష్యుడు అర్థం చెసుకున్నాడు కాని తనను సముదాయించడానికే ఇలా చెప్తున్నారేమో అని కాస్త గందరగోళ పడ్డాడు.
”స్వామి వారు నన్ను క్షమించాలి. కేవలం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జగద్గురు స్థానంలో ఉన్నవారిని పరీక్షిస్తున్నానని తప్పుగా భావింపవలదు. పీట పైన వడ్లు చల్లడం.. వాటిని వస్త్రంతో కప్పడం.. అవి వేయించటం.. ”
అతను పూర్తి చెయ్యకమునుపే స్వామి వారు నవ్వుతూ “నాకు అలాంటి అనుభవం కలిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ?“ అని ఒక చెక్క పీట తెప్పించి తూర్పు అభిముఖంగా వేయించారు. దాని పైన వడ్లు పోయమని చెప్పారు. తరువాత స్వామి వారు దాని పై వారి వస్త్రాన్ని కప్పి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు. ఈపాటికి అక్కడకు చాలా మంది వచ్చారు.
”కేవలం కొన్ని క్షణాల తరువాత వడ్లు టప టప మని పగులుతూ పేలాలుగా మారటం వినిపించింది. కొద్దిగా పొగ కూడా కనిపించింది. స్వామి వారు పైకిలేచి ధాన్యం పై పరచిన వస్త్రం తీయగానే పీట పైన తెల్లని మల్లెపూలవలే ఉన్న పేలాలు కనపడ్డాయి. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు.“
ఇది విన్న తరువాత శంకరన్ ఏదో మాట్లాడబోగా, పరమాచార్య స్వామి వారు అడ్డుపడుతూ “ఏమిటి శంకరా? చేసి చూపించమని నన్ను అడుగుతున్నావా?” అని గట్టిగా నవ్వారు.
శంకరన్ మహాస్వామి వారి పాదాల పై పడి తన అష్ట అంగములు నేలకు తగులుచుండగా “చాలు పెరియవా నాకు జ్ఞానోదయమైంది. మంత్రజపం శక్తిని దాని గొప్పని అర్థం చేసారు. నన్ను దీవించి పంపించండి.”
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।