ఆయుర్వేద ఔషధాలలోని రకాలు -
* కషాయము -
కషాయము కాచునప్పుడు పైన మూత వేయకుండా కాయవలెను . మూసినచో కషాయము చెడిపోవును . కషాయము నందు ఉపయోగించవలసిన ద్రవ్యములు దినుసు (మూలిక) 4 తులముల చొప్పున గ్రహించి వాటిని మెత్తగా నలుగగొట్టి కొత్త కుండ యందు వేసి అందు 2 శేర్ల మంచినీటిని పోసి మందాగ్ని చేత కాచి అష్టాశముగా దింపి వడగట్టి బాలురకు పావుతులము నుంచి తులము మోతాదులో మరియు పెద్దవారికి 4 తులముల మోతాదు వరకు ఇవ్వవచ్చును . ఇందు చక్కర చేర్చవలసి వచ్చిన వాతరోగులకు 4 వ భాగము , పిత్తరోగులకు 8 వ భాగము , శ్లేష్మరోగులకు 16 వ వంతు ఇవ్వవలెను . తేనె కలుపవలసి వచ్చిన శ్లేష్మరోగులకు 4 వ వంతు , పిత్తరోగులకు 8 వ వంతు , వాతరోగులకు 16 వ వంతు చేర్చవలెను . జీలకర్ర , గుగ్గిలము , శిలాజిత్ , క్షారములు , ఇంగువ వంటివి పావుతులము కన్నా ఎక్కువ చేర్చకూడదు .
* కల్కము -
అల్లము తదితర శుష్కపదార్థాలను ఉదకము ( నీరు ) చే నూరి తీసేడు రసమును కల్కము అందురు . ఈ కల్కము నందు ద్రవ్యము తులప్రమాణములో ఉండవలెను . ఈ కల్కమున నెయ్యి , తేనె , నూనె కలపవలసి వచ్చినప్పుడు ఒకదాని మీద మరొకటి రెట్టింపుగాను , బెల్లము మరియు చక్కెర సమభాగాలుగా చేర్చవలెను .
* చూర్ణము -
ఎండిన ద్రవ్యములను మెత్తగా నూరి వస్త్రగాలితము ( మెత్తని వస్త్రము నందు నూరిన చూర్ణం వేసి జల్లెడ పట్టుట ) చేసి అరతులము నుంచి 1 తులము వరకు , చిన్నవారు ఒక మాషము ( 1 గ్రాము ) నుంచి 3 మాషములు
(3 గ్రాములు ) వరకు దేహతత్వమును , వ్యాధి బలమును , దేశ కాలభేదములను బట్టి గుర్తెరిగి పుచ్చుకొనవలెను .
ఈ చూర్ణములో బెల్లము కలపవలసి వచ్చిన చూర్ణపు మోతాదుకు సమానంగా , చక్కెర కలపవలసి వచ్చిన చూర్ణముకు రెట్టింపు మోతాదులో కలపవలయును . ఇందు ఇంగువను కలపవలసి వచ్చిన ఇంగువను నేతితో పొంగించి కలుపవలెను . నెయ్యి కలపవలసి వచ్చిన ఇంగువకు రెట్టింపు మోతాదులో , నీటిని కలపవలసి వచ్చిన చూర్ణముకు నాలుగురెట్లు చేర్చవలెను .
చూర్ణము అయినను , మాత్రలు అయినను , లేహ్యమైనను , కల్కమ్ అయినను సేవించిన పిదప పాలు మొదలగువాటిని తాగవలసిన యెడల వాతరోగము నందు 12 తులములు , పైత్యరోగము నందు 8 తులములు , శ్లేష్మరోగము నందు 4 తులములు పుచ్చుకొనవలెను .
చూర్ణమును భావన ( నానబెట్టి ఆరబెట్టుట ) చేయవలసిన చూర్ణమును , చూర్ణం మునుగునంతవరకు రసము పోసి ఆ రసం ఇగురునంత వరకు భద్రపరచి ఉంచవలెను . ఒకసారి భావన చేయుటకు 24 గంటలు పట్టును .
* ఔషధాలు పుచ్చుకొనవలసిన కాలనిర్ణయం -
చూర్ణరూపము , కషాయ రూపము మొదలగు ఔషధములను ఉదయము మరియు సాయంకాలము పుచ్చుకొనవలెను . ముఖ్యముగా ఉదయం ప్రాతఃకాలం అనగా సూర్యాస్తమయానికి ముందు సాయంకాలం సంధ్యాసమయం తరువాత అనగా చీకటి పడిన తరువాత పుచ్చుకొనుట ఉత్తమం . అసాధ్యరోగములకు అనేకసార్లు , వమనము , విరేచనాదులకు ప్రాతఃకాలము నందు కలికాదులకు సాయంత్రసమయం ఉత్తమం .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .