20, జనవరి 2026, మంగళవారం

పంచాంగం

 


మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 20 జనవరి 2026*

           *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

           1️⃣1️⃣0️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


  *సంపూర్ణ మహాభారతము*


               *110 వ రోజు*                

*వన పర్వము చతుర్థాశ్వాసము*


          *వామదేవుడు*```


ఒకరోజు శలుడు వేటకు వెళ్ళాడు.

ఒక మృగం అతని బాణం దెబ్బ తిని పారిపోయింది. రాజు సారధితో ఆ మృగాన్ని వెంటాడమని చెప్పాడు. 


సారధి ‘రాజా ఆ మృగం చాలా వేగంగా పరుగెత్తింది. మనం ఎంత వేగంతో రథం నడిపినా దానిని చేరలేము. మన గుర్రాలు వామ్య జాతికి చెందినవి అయితేనే ఆ మృగాన్ని పట్టగలము. అలాంటి గుర్రాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి’ అని అన్నాడు. 


వెంటనే ఆ రాజు వామదేవుని వద్దకు వెళ్ళి ‘మునీంద్రా! నేను ఒక మృగాన్ని కొట్టాను. అది దెబ్బతిని పారి పోయింది. ఆ మృగాన్ని పట్టుకోడానికి నీ అశ్వములను ఇవ్వు’ అని అడిగాడు. 


వామదేవుడు ‘రాజా! ఆ గుర్రాలను తీసుకు వెళ్ళి నీపని కాగానే నాకు తిరిగి ఇవ్వు’ అన్నాడు. 


అలాగే అని చెప్పి శలుడు ఆ అశ్వములను తీసుకు వెళ్ళి మృగాన్ని పట్టుకుని రాజధానికి వెళ్ళాడు. ఇంత వేగం కలిగిన గుర్రాలు రాజుల వద్ద ఉండాలి కాని ఆ మునికి వీటితో పని ఏమి? అనుకుని వాటిని తన వద్దనే ఉంచుకున్నాడు. ఎన్ని రోజులకూ రాజు తన గుర్రాలను తిరిగి ఇవ్వక పోవడంతో వామదేవుడు తన శిష్యుడు ఆత్రేయుడిని ఆ గుర్రాలను తీసుకు రమ్మని రాజు వద్దకు పంపాడు. 


ఆత్రేయుడు రాజు వద్దకు వెళ్ళి ‘రాజా! మీరు నా గురువుగారైన వామదేవుని దగ్గర ఉన్న అశ్వములను తీసుకుని తిరిగి ఇవ్వలేదు. వాటిని స్నేహపూర్వకంగా ఇస్తే నేను వాటిని తీసుకు వెళతాను’ అన్నాడు. 


అందుకు శలుడు కోపించి ‘ఆయన పంపడం నీవు రావడం చాలా బాగుందిలే వెళ్ళు’ అన్నాడు. 


ఆత్రేయుడు ఆ విషయం తన గురువుకు చెప్పాడు.```


      *శలుడి గర్వభంగము*```


వామదేవుడు ఆగ్రహించి రాజు వద్దకు వచ్చాడు. ‘రాజా! నీకు ఇది తగదు. నీవు అప్పుగా తీసుకున్న గుర్రాలను తిరిగి ఇవ్వు. నీ పని అయింది కదా. అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వక లోభంతో అలాగే ఉంచుకోవడం పాపం కదా. అలాంటి పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు.’ అన్నాడు. 


శలుడు ‘అయ్యా! విప్రులకు గుర్రాలు ఎందుకు? కావాలంటే రెండు ఎద్దులను ఇస్తాను తీసుకుపో. అవి నచ్చక పోతే కంచరగాడిదలను ఇస్తాను కానీ గుర్రాలను మాత్రం ఇవ్వను. ఊరికే ఆశలు పెట్టుకోవద్దు’ అన్నాడు. 


వామదేవుడు ‘రాజా ఇది అధర్మం. విప్రుల సొమ్ము తీకుని ఇవ్వననడం, పాపం కాదా?’ అన్నాడు. 


శలుడికి కోపం వచ్చింది. ‘ఈ బ్రాహ్మణుని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండి’ అని భటులకు ఆజ్ఞాపించాడు. 


వామ దేవుడికి కోపం వచ్చింది. అతని ముఖం నుండి ఎందరో రాక్షసులు పుట్టుకు వచ్చి రాజును భటులను చంపారు. శలుడు చనిపోయిన తరువాత నలుడు రాజయ్యాడు. వామదేవుడు నలుని దగ్గరకు వచ్చి 

‘రాజా మీరు ధర్మ పరులు. నా గుర్రాలను నాకు ఇప్పించండి’ అని అడిగాడు. 


నలునికి కూడా కోపం వచ్చింది ‘ఈ బ్రాహ్మణుడిని చంపటానికి విషం పూసిన బాణం తెప్పించండి’ అని భటులను ఆజ్ఞాపించాడు. 


అందుకు వామదేవుడు నవ్వి ‘రాజా! అంతఃపురంలో ఉన్న నీ కుమారుని అది చంపగలదు జాగ్రత్త’ అని హెచ్చరించాడు. 


అంతలో అంతఃపురం నుండి హాహాకారము చేస్తూ చనిపోయిన రాజకుమారుని తీసుకు వచ్చారు. 


అది చూసి నలుడు కోపంతో ఒళ్ళు మరచి ‘అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుని నేనే సంహరిస్తాను’ అని విల్లు ఎక్కు పెట్టాడు. కాని అతని రెండు చేతులు,విల్లు,బాణం స్తంభించి పోయాయి. 


రాజుకు గర్వం దిగి పోయింది. ప్రజలను చూసి ‘నా గర్వం అణిగి పోయింది బ్రాహ్మణశక్తి ముందు నా శక్తి పనికిరాదని తెలుసుకున్నాను వామదేవుడికి నమస్కరిస్తున్నాను’ అన్నాడు. 


వామదేవుడు ప్రసన్నమై రాజకుమారుని బ్రతికించి నలుని యధాస్థితికి తీసుకు వచ్చాడు. 


నలుడు గుర్రాలను వామదేవుడికి తిరిగి ఇచ్చాడు. ధర్మరాజా బ్రాహ్మణుల మహిమ అలాంటిది” అని మార్కండేయుడు చెప్పాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏