ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
2, ఆగస్టు 2024, శుక్రవారం
Kasi yatra
కాశీ యాత్ర (మొదటి భాగము)
ఈ ఏడు ఫెబ్రవరి నెలలో నేను నా శ్రీమతి కలసి రామేశ్వరము ఒక యాత్రికుల సమూహంతో బస్సులో వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని బస్సుకు టికెట్ల డబ్బులు కూడా కట్టి చివరి నిమిషంలో కారణాంతరాలవల్ల ప్రయాణాన్ని విరమించుకోవలసి వచ్చింది. ఈశ్వరుని అనుగ్రహం లేదు అని సరిపెట్టుకున్నాము. ఈ విషయంలో మేము వ్యాకులపడి ఉన్నామని తలంచి మా కుమారుడు మమ్ములను ఉత్సాహ పరచనెంచి గత మార్చి నెలలో వారణాశి ప్రయాణముకు విమాన టికెట్లు బుక్కు చేసినాడు. మా ప్రయాణం ఏప్రియల్ 4వ తారీకు రాత్రి 7-40 నిముషములకు హైదరాబాదు విమానాశ్రయం నుండి మొదలై 9వ తారీకు ఉదయం 9-15 నిముషములకు తిరిగి హైదరాబాదు విమానాశ్రయంలో చేరుకోవటంతో ముగుస్తుంది.
ప్రయాణ సన్నాహాలు: రోజులు గడుస్తున్నాయి అనుకున్న ఏప్రియల్ 4వ తారీకు రానే వచ్చింది. నాకు ఆ రోజుకూడా రాజేంద్రనగర్ కోర్టులో ఒక కేసు వున్నది(నేను న్యాయవాదిని) . నా కుమారుడు అనుకున్న ప్రకారం రెండు రోజులముందే బెంగుళూరు నుండి వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రయాణానికి ఏమేమి సామానులు తీసుకొని వెళ్ళాలి అని నా కుమారుడు, నా శ్రీమతి మాట్లాడు కోని బ్యాగులు సర్దుకోవటం మొదలు పెట్టారు. నేను 4వ తారీకునాడు కోర్టుకు నా క్లయింటు కారులో వెళ్ళాను. అదృష్ట వశాత్తు మా జడ్జిగారు సెలవులో వున్నారు. కేసు తొందరగా వాయిదా వేసుకొని 12 గంటలకల్లా ఇంటికి చేరుకొని నా బ్యాగు సర్దుకున్నాను. మేము అనుకున్న ప్రకారము సాయంత్రము 5 గంటలకు రాపిడో క్యాబు బుకు చేసుకున్నాము. ఒక పది నిముషములలో క్యాబు వచ్చింది. ఒక అర గంటలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. క్యాబుకు 600 రూపాయలు అయ్యాయి. మేము ముందుగా నా ప్రింటరులో తీసుకున్న టికెట్ల ప్రింట్లను చూపించి విమానాశ్రయాయంలోకి ప్రేవేశించాము. తరువాత మా లగేజీలను తనిఖీచేసిన ఆమెతో మేము మా లగేజీలను క్యాబిన్లో కాకుండా మా వెంట తీసుకొని వెళతాము అని అడుగగా దానికి ఆమె సరే అని అన్నది. మీ వెంట లగేజి తీసుకునే పక్షంలో టాగ్లు వేసుకోవలసిన అవసరము లేదు అని అన్నది. తరువాత అక్కడి మానెటరును చూసుకొని మేము గేటు నెం. 17 లో విమానాన్ని ఎక్కాలని తెలుసుకొని చెక్ ఇన్ ద్వారాన్ని దాటి వెళ్ళాము. చెకిన్ లో మనము మన మనీపర్సు, మొబైలు ఫోనులు నడుము బెల్టులు కూడా అక్కడి ట్రేలలో పెట్టి అక్కడి యంత్రంద్వారా తనికీ చేయపడ్డ తరువాత మాత్రమే తీసుకొనాలి.
మాకు వారణాసి వెళ్ళటానికి ఇండిగో విమానంలో 45వ వరుసలో సీట్లు దొరికాయి. ఆ విమానంలో 7 కేజీల లగేజి మన వెంట మరియు 15 కేజీల లగేజి క్యాబిన్లో తీసుకొని వెళ్ళవచ్చు. గోళ్ళ రంగులు, రేజరులు, మండే పదార్ధాలు, సిగరెట్ లైటరులు, చాకులు, బ్లేడులు వెంట తీసుకోని వెళ్ళటానికి అనుమతి ఉండదు.
కాశీ యాత్ర (రెండవ భాగము)
కాశీలో కాలుమోపటం: మా విమానం రాత్రి 10 గంటలకు కాశీ చేరుకుంది. హైదరాబాదు నుండి 1035 కిలోమీటరులు (గగన దూరం) ప్రయాణించి మేము కాశీలో అడుగిడి నా ము మా వెంట తినుబండారాలు అంటే పులిహోర, ఇతరత్రా పదార్ధాలు ఏవి తీసుకొని వెళ్లనందున మాకు దిగగానే ఆకలి వేసింది. ఒక టాక్సీ మాట్లాడుకొని సైకిలు బాబా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళమని అడిగాము. నిజానికి మేము బ్రాహ్మణ కరివేన సత్రంలో బస చేద్దామని అనుకున్నాము. కాగా ఆ సత్రం పేరు చెపితే టాక్సీవాళ్ళు తెలియదనటంతో దానికి సమీపంలోని సైకిలు బాబా ఆశ్రమం అని చెప్పాము. ఒక అర్ధగంటలో బెంగాలీ టోలి (బెంగాలు ప్రైమరీ స్కూల్ ) వద్ద రోడ్డు మీద మా కారు ఆపి ఈ సందులోంచి వెళ్ళండి సందులోకి కారు రాదనీ చెప్పాడు డ్రైవరు. టాక్సీ డ్రైవరుకు 750 రూపాయలు చెల్లించి తినటానికి ఏదైనా దొరుకుతుందా అని అక్కడ చుస్తే ఒక రోడ్డుప్రక్క దోశ బండి కనిపించింది. బ్రతుకు జీవుడా అని తలా ఒక దోశ తిన్నాము. దాని రుచి కూడా మాకు తెలియ లేదు . బండివాడు దోశ లను తయారు చేస్తుంటే నేను ఆ సందులో కొంతదూరం నడచి విచారించ ప్రయత్నించాను. సందులో నాకు ఒక ముగ్గురు మనుషులు కనిపించారు అందులో ఇద్దరు పెద్దవారు ఒక బాలిక వున్నది. వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం నాకు ఆశ్చర్యం కలుగచేసింది. నేను తెలుగులో ఇక్కడ కరువేన సత్రం ఎక్కడో మీకు తేలుసా అని అడిగాను. ఈ సందులోంచి చివర వరకు వెళ్ళండి అని అన్నారు. ఆ సందు ఒక 5-6 అడుగుల వెడల్పు కన్నాలేదు. ఇంకా ముందుకు చాలా ఇరుకుగా వుంది. కాశీలో సందులు చిన్నగా ఉంటాయి అని అప్పుడు నాకు తెలిసింది. విద్యుత్ దీప కాంతితో సందు దేదీప్యమానంగా వుంది. నేను వచ్చి మా వాళ్లతో పాటు ఒక దోశ తిన్నాను. తరువాత ఎవరి బ్యాగు వాళ్ళం తగిలించుకొని సందులో ప్రయాణం అయ్యాము. నడచి, నడచి, నడచి చూసుకుంటూ వెళితే మాకు అఖిల భారతీయ బ్రాహ్మణ కరువేనా సత్రం కనిపించింది. అది చూడటానికి ఒక చిన్న ఇల్లుమాదిరిగా వుంది. మేము లోపలి వెళ్లగా అక్కడ ఒకరు వున్నారు. మాకు రూము కావాలి అని అడిగితె రెండవ అంతస్తులో ఎసి రూము వుంది రోజుకు కిరాయి 1200 అని చెప్పి అతని హెల్పరుకు మాకు రూము చూపించమని చెప్పాడు.
మీరు డబ్బులు రేపు చెల్లించండి ముందు గదిలోకి వెళ్లి విశ్రాన్తి తీసుకోండని ఆయన అన్నారు. అయన పేరు సుధాకర్ అని చెప్పారు. మేము కాలాతీతం చేయకుండా రూముకు వెళ్ళాము. అక్కడి మెట్లు చాలా ఇరుకుగా ఎత్తుగా వున్నాయి. ఎలాగో ఆలా మెట్లు ఎక్కి రూములోకి వెళ్ళాము. మేము వెంట తెచ్చుకున్న నీళ్ల బాటిలులోని నీళ్లుతాగి బ్రతుకు జీవుడా అని ప్రక్కమీద మేను వాల్చాము. నేను ఉదయం 3 గంటలకు లేచి దంతధావన చేసి తరువాత స్నానం చేసే సరికి దాదాపు 4 గంటలు కావచ్చింది. నా శ్రీమతిని, కుమారుడిని లేపి వాళ్ళను కూడా త్వరగా కాలకృత్యాలు తీర్చుకోమని చెప్పాను . మేము ముగ్గురం ఉదయం 5 గంటలకు తయారు అయి రూము బయటకు వచ్చాము. మాకు దోవ క్రొత్త నా కుమారుడు గూగులు మ్యాప్స్ పెట్టి మమ్మలను రోడ్డు మీదకు మార్గదర్శనం చేసాడు. ఒక 15 నిముషాలు నడచి మేము రోడ్డు మీదకు చేరాము. అక్కడ ఒక ఆటో లో మాకు కాలబైరవ డైవ దర్శనం చేయించి తరువాత విశ్వనాధుని ఆలయ దర్శనం చేయించవలెనని అడుగగా అతను నేను కాలాభిరవ దేవాలయానికి తీసుకొని వెళ్లి మిమ్ములను నంది సర్కిల్ దగ్గర దింపుతాను నాకు 300 రూపాయలు ఇవ్వాలని అన్నాడు. సరేనాని ఆటోలో కూర్చున్నాము. దాదాపు ఒక 3 కిలోమీటర్లు తీసుకొని వెళ్లి ఒక సందులో ఆటో ఆపి మీరు ఇటునుంచి వెళ్లి దైవదర్శనం చేసుకొని రండి నేను ఇక్కడే ఉంటానని అన్నాడు. కాలభిరావుని దేవాలయంలో రద్దీ ఎక్కువగా లేదు మేము ఒక 10-15 నిముషాలలో స్వామి దర్శనం చేసుకొని ఆటో చేరుకున్నాము. ఆటో ఒక 3,4 నిముషాలలో నంది సర్కిల్ చేరింది. నంది సర్కిల్లో రెండు వైపుల మాత్రమే వాహనాలను అనుమతిస్తారు రెండు రోడ్లలో అనుమతించరు. అందులో ఒక రోడ్డు మీద కొంత దూరం వెళ్లిన తరువాత మనం విశ్వనాధ ఆలయం వెళ్లే గేట్లు ఉంటాయి. గేటు నెం 4 క్రొత్తగా నిర్మించారని విన్నాము. మేము గేటు నెంబరు 2 నుండి లోపలి వెళ్ళాము. లోపలి మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. ఒక ముగ్గురు ప్రక్క ప్రక్కగా ఉంటే అటు గోడ ఇటు గోడ ఆనుతుంది కొన్ని చోట్ల ఇంకా ఇరుకుగా కూడా ఉంటుంది. అందులోంచి అక్కడి వారు మోటారు సైకిళ్ళు, స్కూటర్లు నడుపుతూ వెళతారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇరువైపుల రకరకాల దుకాణాలు. కొన్నిచోట్ల సందులలో అరుగులు కూడా వున్నాయి. ఆ అరుగులమీద కూడా దుకాణాలు వున్నాయి. రాగి, ఇత్తడి సామానులు, రుద్రాక్షమాలలు, పూలు,మొదలైనవి షాపులలో ఎక్కువగా కనపడతాయి. మారేడు దళాలు, ఉమ్మెత్త కాయలు, జిల్లేడు మొగ్గల మాలలు ఇతర పూలు, స్వీట్లు ఎక్కువగా కనపడ్డాయి. ఆ సందులో చాలా దూరం మాకు ఎటువంటి రద్దీ కనపడలేదు. కొంత దూరం వెళ్లిన తరువాత షాపులలో మీరు ఇక్కడ లాఖరులో మీ ఫోన్లు పెట్టుకోండి ప్రీ మీరు పూలు మాదగ్గర కొంటె చాలు అని అన్నారు. నా కుమారుడు ఒక షాపులో పూలు, స్వీట్లు పెట్టిన బుట్టను అడుగగా అతను రూ. 250 అన్నాడు. నేను రూ200 బ్యారం చేస్తే అందులోంచి కొన్ని ధ్రవ్యాలను తీసి మాకు ఇచ్చాడు. మేము ఆ బుట్ట పట్టుకొని కొంత దూరం వెళ్లగా అక్కడ ఒక షెడ్డు కనిపించింది. అక్కడ దాకా జనాలు ఎక్కువ లేరు. అక్కడినుంచి లైను మొదలైయింది. ఆడవారికి వేరు మొగవారికి వేరుగా లైన్లు వున్నాయి. అక్కడ చెక్ చేసి లోపలి హాలులోకి మమ్మలను పంపారు. అక్కడ మన దేవాలయాల బారికేట్లు కనిపించాయి. వాటిలో దాదాపు ఒక గంట నడచి మేము విశ్వనాధుని చేరుకున్నాము. ఉదయం 8-30 కల్లా మాకు దర్శనం అయ్యింది. కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చున్నాము. అక్కడ బోర్డులు తెలుగులో వ్రాసి ఉండటం ఆనందాన్ని కలుగచేసింది. కాశీలో తెలుగు వాళ్ళు చాలామంది వున్నారు. ఆలయానికి ఒక గోడకు ఆనుకొని ఒక పురాతన మసీదు ఉండటం నాకు బాధ కలిగించింది. 9గంటలకు ఆలయ ప్రాంగణాన్ని వదిలి 10 నిముషాలు నడచి మేము రోడ్డు మీదకు చేరుకున్నాము. అక్కడ ఒక హోటలులో టిఫినీ చేసాము. తరువాత కొంత దూరం నడచి ఆ ప్రక్కనే వున్నా గంగ ఘాటుకి వెళ్ళాము. పైన ఎండ బాగా ఎక్కువగా వుంది. మేము తిన్న టిఫిన్ ఎప్పుడో ఆవిరి అయ్యింది. ఇక ఎక్కువ సేపు ఎండలో ఉండలేక పోయాము. అక్కడి రోడ్డుకి ఇఱుపేపులా బట్టల దుకాణాలు రోడ్డుమీద వ్యాపారాలు నాకు హైదరాబాదులోని చార్మినార్ సెంటరు లాగ అనిపించింది. కొంత దూరం నడచి ఒక సైకిలు రిక్షా ఎక్కాము . సైకిలు బాబా ఆశ్రమం దాకా రావటానికి 70రూపాయలు అడిగాడు సరే అని అన్నము. . ఆ రిక్షా సీటు ఎత్తుగా వుంది ఇద్దరు కూర్చోవటానికి కూడా ఇరుకుగా వుంది. మరి నేను యెట్లా కూర్చోవాలని నా కుమురుడు అడుగగా నా సీటు మీద కూర్చో మని అన్నాడు అట్లానే తంటాలు పడుతూ ముగ్గురం కూర్చున్నాము. రిక్షావాలా కొంత దూరం తోసుకుంటూ నడిచి తరువాత తొక్కుకుంటూ చిన్నగా బెంగాలీ టోలి అంటే మా సందు కలిసే రోడ్డు వద్దకు వచ్చి ప్రక్కసందులో కొంత దూరం తీసుకొని వెళ్లి సైకిలు బాబా ఆశ్రమం దగ్గర రిక్షా ఆపాడు. అతను ఎక్కువగా కష్టపడ్డట్లు నేను భావించి వప్పుకున్న దానికన్నా ఎక్కువ అంటే 100 రూపాయలు ఇచ్చి అక్కడినుండి నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. సత్రం లో అడిగితె ఇప్పుడు వెళితే మీకు భోజనం పెడతారు అని ప్రక్కనుండి వెళ్ళమని మార్గదర్శనం చేస్తే మేము ప్రక్కవీధిలోని భోజనశాలకు వెళ్లి భోజనం చేసాము. అక్కడినుండి రూముకు చేరుకొని విశ్రాన్తి తీసుకొని మరల సాయంత్రం గంగా నదికి వెళ్ళటానికి ప్లాను చేసుకొన్నాము.
కాశీ యాత్ర (మూడవ భాగము)
5వ తారీకు సాయంత్రం 4గంటలకు సత్రం రూముకు తాళం వేసి నడుచుకుంటూ సందులన్నీ తిరిగి మేము బాపు పాండే ఘాట్ వద్దకు వెళ్ళాము. అక్కడ మెట్ల ప్రక్కన ఒక స్లోపు గోడ వున్నది నేను ఆ గోడమీదనుంచి నడవటం వలన క్రిందికి దిగటం తేలిక అయ్యింది. మేము కొంత క్రిందికి రాగానే ఒక పడవ వాడు మమ్ములను కలిసి రెండు వేలు ఇస్తే మొత్తం ఘాటులన్ని చూపించి వస్తానన్నాడు. నేను క్రింద నది దగ్గరకు తొందర తొందరగా వెళ్ళితే అక్కడ ఒక ఫెర్రీ షిప్ బయలుదేరటానికి సిద్ధంగా వున్నది నేను ఆ పడవ వానిని ఎంత తీసుకుడుంటావు అని అడిగితె మనిషికి 300 రూపాయలు అని అన్నాడు. కానీ మా కుమారుడు 15వందలకు చిన్న మోటారు బోటు మాట్లాడాడు. మా కాంట్రాక్టు ప్రకారం మమ్మలను ఆవలి వడ్డుకు తీసుకొని వెళ్లి మేము నదిలో స్నానం చేసే దాకా ఉండి తరువాత కాశీలోని గాటు లన్నీ చూపించి గంగ హారతిని చూపించి మరల మమ్మలను బాపు పాండే ఘాటులో వదలాలి. అదే ప్రకారం ముందుగా మమ్మల్ను ఆవలివడ్డుకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మేము ముగ్గురం స్నానాలు చేసాము. తరువాత నదికి ఎగువగా వెళ్లి ఒక్కొక్క గాటుని దూరం నుంచి చూపుతూ చివరి ఘాట్లు అంటే హరిచంద్ర ఘాటు మేము ఆ ఘాటుని చూసినప్పుడు ఒక నాలుగు చితులు కాలుతూ కనిపించాయి. తరువాత మణికర్ణికా ఘాటు అక్కడ కూడా నాలుగు చితులు కాలుతూ కనిపించాయి. నేను బోటులోంచే ఆ చితులకు నమస్కరించాను. ఆహ వాళ్ళ భాగ్యం ఏమిటి కాశీలో మరణించారు అని తలచాను. " కాశీని మరణాత్ ముక్తిహి" అని మనసులోనే అనుకొన్నాను. కాశీలోనే మరణించాలని చాలామంది వృద్ధాప్యంలో కాశీకి వచ్చి నివసిస్తారని నేను విన్నాను. యెంత ప్రయత్నించినా కానీ ఏ కొద్దిమందో ఆ పుణ్యస్థలంలో మరణించగలరని నానుడి. మమ్మలను అన్ని ఘాట్లు తిప్పుతూ చివరకు దశాశ్వమేధ ఘాటుకు తీసుకొని వచ్చి గంగ నదిలో నావను నిలిపాడు. అక్కడ దాదాపు రాత్రి 8 గంటలవరకు ఉండి గంగ హారతిని కన్నులపండుగగా తిలకించాము. హారతి కార్యక్రమం ముగియకముందే మమ్ములను నదిలో బాపు పాండే ఘాటు వద్దకు బోటు వాడు తీసుకొని వెళ్ళాడు. మేము అతనికి వప్పుకున్న ద్రవ్యం ఇచ్చి మేము నడుచుకుంటూ సత్రానికి చేరుకున్నాము. కరివేనసత్రంలో రాత్రి పుట భోజనం పెట్టరు . నా కుమారుడు వెళ్లి టిఫిన్ ప్యాక్ చేయించుకొని ఒక స్టీలు మగ్గునిండా మజ్జిగ తీసుకొని వచ్చాడు. మేము ఉప్మా తిని ఆ మజ్జిగ త్రాగినాము. నేను నా కుమారుడు అక్కడికి దగ్గరలోని తారక రామ ఆంధ్రశ్రమాన్ని వెళ్లి రూములగూర్చి విచారించాము. మీరు సామానుతో వస్తే కానీ మీకు రూము ఇవ్వము అని అక్కడి రిసిప్షన్లోని ఆయన అంటే తిరిగి సత్రానికి వచ్చి రూము కిరాయి రూ. 1200 కట్టి రూము కాళీ చేసి ఆంధ్రాశ్రమానికి వెళితే మాకు రెండవ అంతస్తులో 39 నంబరు గది రూ 375 కిరాయితో ఇచ్చారు. మేము ఎదురుగా వున్న లిఫ్ట్ ఎక్కి 2వ అంతస్తులోని గదికి వెళ్ళాము. అటెండరు గది తాళం తీసి మాకు గది వప్పచెప్పి తాళం చెవి తీసుకొని వెళ్ళాడు. అదేమిటని అడిగితె మీరు మీ సొంత తాళం వేసుకోవాలని అన్నాడు. నేను క్రిందికి వచ్చి అక్కడి సమీప షాపులో ఒక చిన్న తాళం రూ 50 పెట్టి కొన్నాను. ఆంధ్రశ్రమంలో బియ్యపు రవ్వ ఉప్మా పెడితే నేను గదికి తీసుకొని వచ్చి దానిని తిని మేము పడుకున్నాము.
కాశీ యాత్ర (నాలుగవ భాగము)
6వ తారీకు ఉదయం నేను 3-30 గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నా శ్రీమతిని, కుమారుడిని త్వరగా తయారు కమ్మని చెప్పగా ఉదయం 5 గంటలకు మేము రూముకు తాళం వేసి చిన్నగా ఆశ్రమం ప్రక్క సందునుండి సైకిలు బాబా ఆశ్రమం వరకు నడుచుకుంటూ వెళితే అక్కడ ఒక ఇ రిక్షా కనిపించింది 300 రూపాయలకు నంది సర్కిల్ వరకు రావటానికి వప్పుకొన్నాడు. ఈ బ్యాటరీ రిక్షాలు రోడ్డుమీద వెళితే మనకు ఎడ్ల బండి ఎక్కిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటె వాటి షాక్ అబ్సర్వర్స్ మంచిగా వుండవు. 15 నిముషాలలో మమ్మలను నంది సర్కిల్లో దించాడు. మేము ఆలస్యం చేయకుండా గేటు నెంబరు 1 ద్వారా వెళ్లి సాక్షి గణపతి మరియు అన్నపూర్ణ అమ్మవారిని, మరియు వారాహి మాత అమ్మవారిని చూడాలని సంకల్పం. కాగా అక్కడి పోలీసులు గేటు -1 నుండి వెళ్లనీయలేదు. మేము కొంచం ముందుకు వెళ్లి గేటు-2 నుండి వెళ్లి దైవానుగ్రహంతో ముందుగా సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాము. ఆంజనేయస్వామికి పూసినట్లు స్వామికి సిందూరం పూసి ఉంచారు. జనం ఎవరు లేరు. చక్కగా దర్శనం అయ్యింది. తరువాత వారాహి అమ్మవారి దర్శనానికి వెళితే అక్కడ చాలామంది క్యూలో వున్నారు. మేము క్యూ చివరకు వెళితే అక్కడ ఒక ఆంజనేయస్వామి దేవాలయం కనిపించింది ఆ స్వామిని దర్శించుకొన్నాము ఆ దేవాలయ ప్రాంగణం చిన్నగా వుంది అక్కడ్నుంచి చుస్తే గంగ నది కనిపిస్తున్నది. కొంచం సేపు అక్కడ ఉండి దేవాలయం క్రింద ఒక మునిసిపల్ నల్ల కనిపిస్తే కాళీ ఆయిన మా నీళ్ల సీసాను నింపుకొని మరల క్యూను ముందరగా వెళితే అక్కడ వున్న రోడ్డు ప్రక్క దుకాణం ఆమె మీరు ఒక్కొక్కరు రూ 300 ఇస్తే మీకు స్పెషల్ దర్శనం చేయిస్తాను. అది నాకు ఇవ్వనక్కరలేదు పూజారికి ఇవ్వండి అని మమ్మలను ఆపింది. నాకు ఎండకు అస్వస్థతగా ఉండటం చేత మనం వెళదాం అని మా వాళ్ళను తొందర పెట్టితే ఆమె బాబూజీ ఉండండి మీకు కుర్చీ వేస్తా అని ఒక కుర్చీ తెచ్చి వేసి నాకు త్రాగటానికి నీళ్లు ఇస్తా అని చెప్పి ఆమె కూతురుకు ఫురమిస్తే ఆ అమ్మాయి ఒక పెద్ద గ్లాసునిండా మజ్జిగ పంచదార కలుపుకొని వచ్చి నాకు ఇచ్చింది. అది తాగి నేను కొంత ఊరట చెందాను. ఇంతలో దేవాలయపు తలుపులు మూయటంతో క్యూలోని వాళ్లంతా వెళ్లారు. అక్కడ మేము ముగ్గురం మా ముందు దుకాణం ఆమె ఆపిన మొరొక 4గురు మాత్రమే మిగిలారు. ఇంతలో ఆ ప్రక్క ఇంట్లోంచి ఒక పూజారి వచ్చి కేతేనే లోగ్ హై అన్నాడు. తీన్ అని మా కాంట్రాక్టరు, చారు అని ఎదురు షాపు ఆమె అనటంతో జెల్ది ఆజావ్ అని దేవాలయపు తలుపు ప్రక్కన వున్న గది తలుపు తెరిచాడు. మేము ముగ్గురం మిగిలిన వార్ అందరం లోపలి వెళ్ళాం తీన్ తీన్ సౌ దేవ్ అని ముందుగా మా దగ్గర 900 రూపాయలు తీసుకున్నాడు. నాకు అంతా అయోమయంగా అనిపించింది. మమ్మలను చిన్నగా ఒక గదికి తీసుకొని వెళ్ళాడు అదే వారాహి అమ్మ దేవాలయం. నన్ను కూర్చో మని అన్నాడు నాకు తెలియక బాసుపేట్లు వేసుకొని కూర్చున్నాను. ఐస నై అని గొంతుకు కూర్చోమని చెప్పాడు అక్కడ 2.x 1 అడుగుల కంత ఒకటి వున్నది దానిలోంచి క్రిందికి చూడమని చెప్పాడు. అప్పుడు నాకు తెలిసింది అమ్మవారు క్రింద వున్నారని. నేను చుస్తే అమ్మవారి ముఖం ఒక ప్రక్కగా క్రింద కనిపించింది. చేలో చేలో అని నన్ను పంపించి మిగిలిన వారికి కూడా ఒక 2 నిముషాలలో దర్శనం చేయించి పంపాడు. మేము బ్రతుకు జీవుడా అని బయటకు వచ్చాము. తరువాత అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయట విచారించాం కానీ క్యూ చాల పెద్దగా ఉండటం చేత తల్లిని చూడకుండానే వెళదామని నిర్ణయించుకున్నాం. బయటకు అంటే సందులలోంచి రోడ్డు మీదకు రాగానే ఒక టీ దుకాణం కనిపించింది. మట్టి గ్లాసులల్లో టీ ఇస్తున్నాడు. గ్లాసు 15 రూపాయలు. తాగినవి పారేయటమే. నాకు ఆ మట్టి గ్లాసు నచ్చింది. నాకు ఒక కాళీ గ్లాసు కావలి అంటే 3రూపాయలకు ఇచ్చాడు. దానిని భద్రంగా తెచ్చుకొన్నాను.
ఆ రోడ్డుకు ఇరుపైపుల మన చార్మినార్ రోడ్డులాగా అన్నీ బట్టల దుకాణాలు,డ్రస్సులు అమ్ముతున్నారు. ఆడవారు చేతినిండా డబ్బులు తీసుకొని వస్తే మోయలేనన్ని బట్టలు కొనటం కాయం. కాకపొతే మాకు ఆకలి బాగా వేయటంతో ఏమి కొనకుండానే 1-30 గంటలకు నంది సర్కిలుకు నడుచుకుంటూ వచ్చి ఒక సైకిల్ రిక్షా ఎక్కి రూము దోవ పట్టము. రిక్షా వాడు రూ 100 తీసుకున్నాడు. రూములో కొంతసేపు ఉండి అక్కడినుండి కరివేనసత్రం భోజనాలయానికి వెళ్లి భోజనం చేసి ఇక ఈ రోజు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాము. నేను మాత్రం మరుసటి రోజు ప్రోగాంగూర్చి ఆలోచిస్తున్నాను. మేము ఆశ్రమ సందులోకి వస్తూవుంటే ఒకడు కరపత్రాలను పంచుతున్నాడు. అది గయ, ప్రయాగరాజుకు టూరులు అది చదివి నేను మరుసటి రోజు గయకు వెళ్ళటానికి కారు మాట్లాడుకున్నాను. గయా చూపించి తిరిగి తీసుకొని రావటానికి రూ 6000 అడిగాడు. ముందుగా అద్వాన్సు రూ 500 అడిగితె ఇచ్చాను. నాకు ఆతను డ్రైవరు ఫోను నంబరు ఇచ్చాడు. ఉదయం 5గంటలకు బెంగాలీ టోలి దగ్గరకు కారు వస్తుంది అని అన్నాడు. నేను ఇంటికి వచ్చి రేపటి ప్రోగ్రాం గురుంచి మావాళ్లకు చెప్పాను . సాయంత్రం ఆంధ్రశ్రమం నుంచి తెచ్చుకున్నటిఫిన్ బియ్యపురవ్వ ఉప్మా తిని పడుకున్నాము.
కాశీ యాత్ర (ఐదవ భాగము)
7వ తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు మీదకు)వెళ్ళాము మేము అక్కడకు చేరుకోగానే మా కారు సిద్ధంగా వుంది డ్రైవరు పేరు యాదవ్. మేము ఫోను చేసి కారుదగ్గరకు వెళ్లి మా లగేజీని డిక్కీలో పెట్టి కూర్చున్నాము. అది మారుతి డిజైర్ తెల్ల కారు. డ్రైవరు చిన్నగా కారు నడిపి ఒక అర్థగంటకు కాశీ పట్టణాన్ని వదలి గయావైపు వెళ్లే రోడ్డు ఎక్కించాడు. . మధ్యలో బనారస్ హిందూ యూనివర్శిటీ గేట్లను దాటుతూ మా కారు వెళ్ళింది. అందులో ఒక గేటు పేరు హైదరాబాదు గేటు అని డ్రైవరు చెప్పాడు. కొంతదూరం వెళ్లిన తరువాత కారును ఒక డాబా ముందు ఆపి మీరు ఇక్కడ టిఫిన్ చేయవచ్చు అన్నాడు. మేము టిఫిన్ చేసాము. అక్కడ కూడా మన టిఫిన్లే వున్నాయి. దోశ 70 రూపాయలు, ఇడ్లీ ప్లేటు (4 చిన్నవి) 50 రూపాయలు, టి 10 రూపాయలు. తరువాత ఎక్కడ ఆగకుండా మాకారు మధ్యాన్నం 12 గంటల సమయంలో గయను చేరింది. ముందుగా విష్ణు పాద ఆలయూయాన్ని చూసాము. అక్కడ క్యూ పద్దతి లేదు సెల్ఫోనులు లోపలి అనుమతించరు. ఒక్కసారిగా ఒక గుంపు గుంపుగా భక్తులను గుడిలోకి వదులుతారు. నాకు ఆ పద్ధతి మంచిగా అనిపించలేదు. ఎట్లాగో మేము ఆ గుంపులోవెళ్లి విష్ణుపాదాన్ని దర్శించుకొని వంటిగంటకల్లా బయటకు వచ్చాము. మా డ్రైవరు తిరిగి మమ్మలను ఊళ్లోకి తీసుకొని వచ్చాడు. ఊర్లో తెలుగులో ఆంధ్ర భోజనం అని వ్రాసి ఉన్న ఒక హోటలులో భోజనం చేసాము. ఏ మాత్రం రుచిగా లేదు ప్లేటుకు 120 తీసుకున్నారు. అక్కడినుంచి మేము అక్కడి శక్తిపీఠం అయినా మాంగల్యగౌరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఆ దేవాలయం ఒక చిన్న కొండ మీద వున్నది. మేము వెళుతుంటే ఎవరో భక్తులు అక్కడ ఇప్పుడు దర్శనం కావటం లేదు అందుకే మేము తిరిగి వెళుతున్నాము అని అన్నారు. వారి మాటలు మాకు కొంత నిరుత్సాహం కలుగ చేసింది. మేము అమ్మవారిని తలుచుకొని కొండ ఎక్కాము అక్కడ క్యూ చాలా పెద్దగా వుంది. అక్కడ ఒక టేబులు ముందు ఒక ముగ్గురు కూర్చొని వున్నారు. మేము వారలను విచారిస్తే కొంత సేపు లాగండి ఇక్కడికి డిప్యూటీ సీఎం వస్తున్నారు. ఆయన వెళ్లిన తరువాత మీరు ఒక్కొక్కరు రూ 250 కడితే ప్రత్యేక దర్శనం లభిస్తుందని అన్నారు. మేము రూ 750 ఇచ్చి టికెట్లు తీసుకున్నాము. ఒక ఆర్ గంటలోనే మాకు దర్శనమ్ అయ్యింది. నేను అమ్మవారు అంటే మన దేవాలయాలలో మాదిరిగా తల్లి విగ్రహం ఉంటుందని అనుకున్నా కానీ ఆలా లేదు ఒక చిన్న గది మధ్యలో ఒక చిన్న గద్దెమీద దీరఘాచేతురస్రాకారంలో వెండితాపడం చేసిఉంది. దానిమీద ఒక దీపం వెలుగుతున్నది. మేము కొండదిగి క్రిందికి రాగానే మా డ్రైవరు మమ్మలను బుద్ధగయాకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మా కారు వెళ్ళటానికి పర్మిషన్ ఉండదట అక్కడి వాహనాలలోనే వెళ్ళాలట. మేము ఒక ఈరీక్షను 400 రూపాయలకు మాట్లాడుకొని అన్ని బుద్ధ దేవాలయాలను చూసాము. ఎండ మండిపోతున్నది. మేము కారులో గొడుగులు తెచ్చాము కానీ వాటిని అక్కడే వదలటం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. 3-4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం చేసాము. సాయంత్రం 5 గంటల సమయంలో ఉదయం టిఫిన్ చేసిన హోటలులో మళ్ళి వెళ్లి టీ తాగి ప్రయాణం కొనసాగించాము. ఆ డాబా హోటలు చుట్టూ గోధుమ పంట కోతకు సిద్ధంగా ఉండి వుంది. నేను మొదటిసారి గోధుమ పంటను చూడటం. రాత్రి 7 గంటల సమయంకల్లా మమ్మలను వారణాసిలో బెంగాలీ టోలి వద్ద దింపాడు దారిలో ఒక పార్ధవ శరీరాన్ని ఊరేగిస్తూ తీసుకొని వెళుతున్నారు. ఈ బాడీని మణికంటిక గాటుకే తీసుకొని వెళతారు అని డ్రైవరు చెప్పాడు. నేను నా కాళ్ళ చెప్పులు కారులోనే విప్పి మోక్షప్రాప్తి పొందిన ఆ జీవికి నమస్కరించాను. ప్రతి రోజు రాత్రి 12 గంటల సమయంలో మణికంటిక గాటులో జ్వలించే చితి భస్మాన్ని తీసుకొని వచ్చి కాశీ విశ్వనాధునికి అభిషేకం చేస్తారని డ్రైవర్ చెప్పాడు. రాత్రి రూముకు చేరుకోగానే మేము ఆశ్రమంలో పెట్టిన టిఫిన్ తిని విశ్రాన్తి తీసుకున్నాము. మరుసటి రోజు ప్రయాగ వెళ్ళటానికి అదే డ్రైవరుతో మాట్లాడుకున్నాము ట్రిప్ ఖరీదు 3,400/-
7వ తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు మీదకు)వెళ్ళాము. మా డ్రైవరు సిద్ధంగా వున్నాడు. ఈ రోజు మనం తొందరగానే వస్తాము ప్రయాగ 110 కిలోమీటర్లే అని అన్నాడు. 8 గంటల సమయంలో ఒక హోటలు ముందు కారుని ఆపి టిఫిన్ చేయమన్నాడు. మేము టిఫిన్ చేసాము. అక్కడినుంచి దాదాపు 9-30 కల్లా ప్రయాగ గంగా బ్రిడ్జి మీదుగా ప్రయాగరాజ్కు తీసుకొని వెళ్ళాడు. బ్రిడ్జిమీద కారువున్నప్పుడు దూరంగా ఒక వంతెనను చూపించి అది యమునా నదిమీద వున్నదని చెప్పాడు. మమ్మలను యమునా నదీ తీరానికి తీసుకొని వెళ్లి మీరు బోటులో త్రివేణి సంగమంకు వెళ్లి స్నానాలు చేయమని చెప్పాడు. మేము ఒక చిన్నపడవను 1600 రూపాయలకు మాట్లాడుకొని వెళ్ళాము. అక్కడకు వెళ్లి స్నానాలు చేసి తిరిగి వడ్డుకు వచ్చాము. అక్కడే వున్న హనుమంతుని దేవాలయానికి వెళ్ళమని చెపితే మేము వెళ్ళాము. అక్కడ స్వామి పడుకొని వుంటారు. "లేటేహుయే బడా హనుమాన్ దేవల్ " అని చెప్పాడు. తొందరలోనే స్వామీ దర్శనం అయ్యింది. అక్కడినుంచి మమ్ములను ఇంకొక శక్తీ పీఠం అయిన మాతా మాధవేశ్వరి దేవాలయంకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మన దేవాలయాల్లో మాదిరిగానే బారికేట్లు వున్నాయి కానీ జనం ఎక్కువ లేక పోవటం వలన దర్శనం త్వరగానే అయ్యింది. అక్కడ అమ్మవారు ఒక ఉయ్యాల కట్టి క్రింద ఒక నాలుగు పలకల ఫలకం వుంది. విగ్రహం లేదు. అమ్మవారి దర్శనం అవ్వగానే మేము తిరోన్ముకులం అయ్యాము. ఈ రోజు సోమవారం కాబట్టి మ్యూజియంకు సెలవు అని చెప్పి మమ్మలను మ్యూజియంకు తీసుకొని వెళ్ళలేదు. మధ్యాన్నం 2-30కు రూముకు చేరుకొని సత్రంలో భోజనం చేసి విశ్రమించి మరుసటి రోజు హైదరాబాదు ప్రయాణానికి సంసిద్ధులం అయ్యాము. ఆ డ్రైవరుకు తిరిగి ఉదయం 5 గంటలకు వచ్చి మమ్మలను విమానాశ్రయంలో విడవాలని చెప్పాము. రాత్రే రూము రెంటు 1500 చెల్లించి రసీదు తీసుకున్నాము. ఆంధ్రశ్రమంలో సాయంత్రం 7ఇంటికి ఒక డాక్టరు రూము 1 లో వస్తారు అన్నారు. నేను నాకు కొంత జలుబుగా ఉంటే డాక్టరు దగ్గరకు వెళ్లి మందులు తీసుకున్నాను. మందులు కూడా ఉచితంగా ఇస్తారు.
9వ .తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి సామానులన్నీ తీసుకొని రూముకు తాళం వేసి గేటుదగ్గర వాచిమనుకు రసీదు చూపించి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు మీదకు)వెళ్ళాము. మా కారు మాకోసం సిద్ధంగా వుంది. కారులో కూర్చోగానే ఒక 40 నిముషాలలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. నేను డ్రైవరుకు 700 రూపాయలను ఇచ్చాను. టైము ప్రకారం మా విమానం 7-40 కి వచ్చింది. వారణాసిలో చెకింగ్ మన హైదరాబాదుకన్నా ఎక్కువగా వుంది. మా సూటుకేసును కాబిన్లో వేయక తప్పదన్నారు. దానికి ట్యాగ్ వేయించుకొని మిగిలిన రెండు బ్యాగులు నేనొకటి నా కుమారుడు ఒకటి పట్టుకొని విమానం ఎక్కాము. మా విమానం యెరిండియా ఎక్ష్ప్రెస్స్ మేము హైదరాబాదులో 10 గంటలకల్లా దిగాము. ఒక టాక్సీ మాట్లాడుకొని ఇంటికి చేరాము. దానితో మా యాత్ర పరిసమాప్తం ఐయ్యింది .
శుభం బురియత్
సర్వజన సుఖుఇనోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ
కాశీలో జీవనం
వివిధ ప్రాంతాలనుంచి అనేదానికన్నా వివిధ దేశాలనుంచి ఎంతోమంది కాశీకి వచ్చి రోజులకొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాలకొద్దీ నివసిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు లభించిన సమాధానం నేను ఏప్రిల్ 5వ తారీకు ఉదయం 8-30 నుండి 9 గంటలవరకు పొందిన అనుభవం, అనుభూతే సమాధానంగా లభించింది. కాశీవిశ్వేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే అనన్య సామాన్యమైన ఆధ్యాత్మిక అనుభూతి,. అక్కడి భక్తులందరూ నాకు ఈశ్వరుని ప్రమద గణాలుగా అనిపించారు. ఆలయ ప్రాంగణం సాక్షాతు కైలాసంగా అనిపించింది. ఈ సాధకుడు పొందిన దివ్యానుభూతిని వర్ణించ మాటలు లేవు. అటువంటప్పుడు ప్రతివారు ఈశ్వరుని సన్నిధిలో ఉండాలని అనుకోటంలో ఆశ్చర్యం ఏముంది. కాశీ పట్టణం ఎంతో పురాతనమైనది. సాక్షాత్తు పరమేశ్వరుడు నడచిన ప్రదేశం. అమ్మవారు తిరిగిన స్థలం. ఇప్పటికి అక్కడికి దేవతలు వస్తారని ప్రతితీ.
సాధకుల జీవనం:
అరిషడ్వార్గాలను వదిలి దేహాభిమానాన్ని త్యజించిన సాధకులు అనేకులు మనకు కాశీలో తారసపడతారు. బిక్షాటన చేస్తూ పరమేశ్వరుని కొలిచేవారు కొందరు ఆంధ్రశ్రమంలో రోజు 20,30 మంది సాధువులు వచ్చి కూర్చోవటం వారికి అక్కడ రోజు భోజనం పెట్టటం నేను చూసాను. . ఆలా కాశీలో ఎన్నిచోట్ల అన్నదానం జరుగుతుందో ఏమో మరి. ఇక కొందరు సాధువులు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం చేస్తూ జీవిస్తున్నారు. కొందరు. సాధువులే కాదు సామాన్యుజనం కూడా సాదారణ జీవనం పెట్టుబడి లేకుండా,లేక కొద్దీ పెట్టుబడితో జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా వివరిస్తాను.
కొద్దిపెట్టుబడితో అంటే : ఒక రూ 100-500 పెట్టుబడితో జీవనం. కొందరు సాధువులు ఒక చిన్న పళ్ళెరం పట్టుకొని అందులో భస్మం యెర్రని చెందనం, ఒక త్రీసులపు లేక మూడుగీతాల ముద్రలు కలిగిన ముద్రలు వెంట పెట్టుకొని భక్తులకు బొట్లు పెట్టి డబ్బులు వసులు చేసుకుంటున్నారు. హీనపక్షం వారు రోజుకు 1000 నుండి 1500 వరకు సంపాయించవచ్చు. మేము బోటులో గంగ హారతి చూస్తూవుంటే ఒక సాధువు ఒక పళ్ళెరంలో చిన్న దీపారాధన కుంది పెట్టుకొని చిన్న సీసాలో నూనె పెట్టుకొని అందరికి హారతి చూపిస్తున్నాడు. ఒక్కొక్కరు 10,20 ఇంకా కొంతమంది అంతకన్నా ఎక్కువ డబ్బులు వేయటం నేను చూసాను. చాలా తక్కువ పెట్టుబడితో ఈ రకంగా కూడా జీవించవచ్చు. అన్నీ పడవలు తిరిగితే అతనికి రూ 2000 వరకు కూడా రోజుకు రావచ్చు. కేవలం గంట నుండి 2 గంటల వరకు బొట్లు తిరిగితే సరి రోజంతా విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా జీవనం సాగించవచ్చు. దేవాలయూయానికి వెళ్లే మార్గంలో ఉమ్మెత్తకాయలు, జిల్లేడు పూవులు, జిల్లేడు పులా మాలలు, మారేడు దళాలు అమ్మే వాళ్ళు కొంతమంది ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం బయలు ప్రదేశాలకు వెళ్లి ఆకులు, అలమలు ఏరుకోరావటం చేసి సంపాదిస్తున్నారు. పెట్టుబడి ఏమిలేదు కేవలం తిరిగి ఏరుకొని రావటమే. చాలా తక్కువ ఖర్చుతో అంటే జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు ఉండే ప్రదేశానికి వెళ్ళటమే. ఆలా ఏమాత్రం ఖర్చు లేకుండా సంపాదన. నాకు అనిపించింది పుణ్యక్షేత్రాలలో ఏదో ఒక పని చేసి పొట్టపోసుకోవచ్చు అని.
ఇక కొంచం పెట్టుబడితో జీవనం:
కొంతమంది పిల్లలు 15 నుంచి 20 సం మధ్యవాళ్ళు ఒక కిరోసిన్ స్టవ్వును ఒక డబ్బాలో పెట్టి పైన ఒక రాతివెండి కెట్లి పెట్టి లెమెన్ టీ అమ్ముతూ సంపాదిస్తున్నారు. ఒక్కో టీకి రూ 20 తీసుకుంటున్నారు. వీళ్ళు రాత్రి గంగ హారతి సమయంలో బోట్లమీద తిరుగుతూ, పగటి పుట గల్లీలలో తిరుగుతూ అమ్ముతున్నారు. రోజుకు కనీసం రెండు, మూడు ట్రిప్పులు తిరిగితే 60 నుంచి 80 టీలు సునాయాసంగా అమ్మవచ్చు. వాళ్లకు వేయి రూపాయుయాలకన్నా ఎక్కువ గిట్టుబాటు కాగలవు.
చిన్న దుకాణాలు. రోడ్డు ప్రక్కన ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ సామానుల దుకాణాలు వీటికి 2000 నుండి 5000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది.
చొక్కాల వ్యాపారం. మహాదేవ అని ఇంకా ఇతర శివనామాలు హిందీలో వ్రాసినవి అచ్చువేసిన చొక్కాలు 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కొక్క చొక్కాకు రూపాయలు 50 లాభం రావచ్చు. అంతే కాక ఆడవారి డ్రస్సులు, చీరలు కూడా ఫూటుపాత్ మీద అమ్ముతున్నారు. ఈ వ్యాపారానికి కొంత ఎక్కువ పెట్టుబడి కావాలి. లాభం మంచిగా ఉంటుంది.
రాగి ఇత్తడి సామానులవ్యాపారం. రాగి చెంబులు, కంకణాలు,చిన్న పాత్రలు (గంగ నీరు పట్టుకోవటానికి) ఇవి ఇనుపవే కానీ రాగివాటిలాగా కనపడతాయి. ఇత్తడి కుందులు, చిన్నచిన్న వస్తువులు, శివలింగాలు, జంధ్యాలు, విబూది, రుద్రాక్షమాలలు, స్పటిక మాలల దుకాణాలు మనకు అడుగడుగునా కనపడతాయి. వస్తువుల ధరలు మనకు ఇక్కడికన్నా పెద్దగా తేడా నాకు కనిపించలేదు. రెండు ఇత్తడి కుందులు 150 చెప్పి రూ 120 కి ఇచ్చాడు.
చిన్న టీ స్టాళ్ళు , చిన్న ఇడ్లీ, వడ, దోశ హోటళ్లు అంటే రోడ్డు ప్రక్క బండ్లు అరుగు మీద పెట్టి అమ్మే చిన్న షాపులు మనకు కాశీలో కో కొల్లలు గా కనపడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ దాదాపు అందరు తెలుగులో మాట్లాడటమే కాదు ప్రతి సందులో మనకు తెలుగు బోర్డులు ఉండటం విశేషం. ఈ చిన్న వ్యాపారస్తులు అక్కడి ట్రావెల్స్ తో సంబంధం పెట్టుకొని తెలుగులో కరపత్రాలు ముద్రించి మేము గయకు, ప్రయాగకు, అయోధ్యకు కార్లు, చిన్న బస్సులు సప్లై చేస్తామని వ్యాపారం చేస్తున్నారు. వారికి ఒక్కొక్క త్రిప్పకు 500 ఆ పైన కమిషన్ లభిస్తుంది. వీరు వారి వ్యాపారానికి అనుబంధంగా ఈ కమీషను కూర్చొని సంపాదిస్తున్నారు.
ఇక తొక్కే రిక్షాలు ఈ రిక్షావాళ్లు 1-2 కిలోమీటర్ల దూరం వరకు వెళతారు 70 రూపాయలకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు.
బ్యాటరీతో నడిచే రిక్షాలు. వీరి సంపాదన చాలా బాగుంది. వీరు ఒక ట్రిప్పుకు 300 నుంచి 400 వందల వరకు అడుగుతున్నారు. వీరు రోజులో 20 ట్రిప్పుల కన్నా ఎక్కువ వేయగలరు అంటే వారి సంపాదన ఎలా ఉందో ఊహించండి. ఈ బ్యాటరీ రిక్షా ఖరీదు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ రిక్షాలు మెయింటెనెన్స్ ఫ్రీ కేవలం రెండు మూడు ఏళ్లకు ఒకసారి బ్యాటరీలు మార్చాలి. ఒక ఊడదీసిన రిక్షాను చూసాను అందులో లేడ్ యాసిడ్(Led Acid ) బ్యాటరీలు ఉన్నట్లు కనిపించింది. వారణాశిలో, గయలో, నాకు చాలా బ్యాటరీ రిక్షాలు కనిపించాయి. వీటిలో 8 మంది దాకా ప్రయాణించవచ్చు. వెడల్పు తక్కువగా వుంది ఎదురెదురుగా కుర్చునేటట్లు రెండు సీట్లు ఇంకా డ్రైవర్ పక్కన కూడా కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఈ రిక్షా వాళ్ళ సంపాదన చాలా బాగుంది.
ఆటోలు కూడా చాలా కనపడుతున్నాయి కానీ ఆటోలు బ్యాటరీ రిక్షాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. . ఇవి కాక టాక్సీ కారులు, మినీ బస్సులు అంటే ట్రావెలర్ వాళ్ళవి అన్నమాట, ఈ రకంగా రవాణా వాహనాల వాళ్ళు కూడా చాలా సంపాదిస్తున్నారు.
నేను ఒక గల్లీ లోంచి వెళ్తుంటే ఒక యువతితో పరిచయం అయ్యింది. ఆమె రెండు నెలల క్రితం ఆంధ్ర నుంచి వచ్చిందట, తెలుగు తప్ప ఏమీ రాదు. అక్కడ ఒక ఆశ్రమంలో ఆమె వుంటున్నది. ఆ ఆశ్రమ అరుగు మీద ఒక చిన్న దుకాణం పెట్టుకున్నది. అది ఆశ్రమం స్వామీజీ ఏర్పాటు చేశారని అన్నది. ఆమె రుద్రాక్ష మాలలు, తెలుగు పుస్తాకాలు, కొన్ని హిమాలయ డ్రగ్స్ వారి ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నది. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సాధువు వచ్చి రుద్రాక్షమాలలు 10 కొన్నాడు. వాటికి 600 రూపాయలు ఇచ్చాడు. నేను ఆమెతో హిమాలయ ఆయుర్వేదం కాక పతంజలి మందులు విక్రయించమని సూచించాను. రెండు మూడు సాదారణ వ్యాధులకు పనికి వచ్చే మందుల పేర్లు కూడా చెపితే ఆమె పుస్తకంలో వ్రాసుకుంది.
ఇన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నేను మన తెలుగువారు అనేకమంది వారణాసి వెళ్లి ఉండాలని కోరుకుంటున్నట్లు నాకు అర్ధమైనది. అలాంటి వారికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో నేను కాశీలో వివిధ రకాల ప్రజల జీవన సరళి గురించి నేను చూసి గమనించి అర్ధంచేసుకున్నది వివరించాను నాకు తెలిసినంతవరకూ కాశీలో మధ్యతరగతి వారే ఎక్కువగా వున్నారు. కేవలం తెలుగు వస్తే చాలు కాశీలో బ్రతకవచ్చు. నా వ్యాసం ఏ తెలుగు వారికైనా పనికి వస్తే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్లే.
.