*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది మూడవ అధ్యాయము*
*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*43.17 (పదిహేడవ శ్లోకము)*
*మల్లానామశనిర్నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్|*
*గోపానాం స్వజనోఽసతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రోః శిశుః|*
*మృత్యుర్భోజపతేర్విరాడవిదుషాం తత్త్వం పరం యోగినామ్|*
*వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతః సాగ్రజః॥9924॥*
మల్లరంగమునందు బలరామసహితుడైయున్న శ్రీకృష్ణుడు మల్లురకు మిగుల రౌద్రాకారముతో పిడుగువలె భీకరముగా తోచుచుండెను. సామాన్యజనులకు ఒక మహరాజువలె అద్భుతముగా కన్పట్టుచుండెను. స్త్రీలకు ఆకృతిదాల్చిన నవమన్మథునివలె శృంగార పురుషుడై భాసిల్లుచుండెను. గోపాలురకు ఆత్మీయుడుగా, వారిలో ప్రేమభావమును నింపుచుండెను. కుటిలులైన రాజులకు నియంతగా తోచుచుండెను. తల్లిదండ్రులలో శిశువువలె వాత్సల్య భావమును నింపుచుండెను. కంసునకు మృత్యుదేవతవలె భయానకముగా గోచరించుచుండెను. ఒక అద్భుత పురుషునివలె మూర్ఖులను కలవరపరచు చుండెను. యోగీశ్వరులకు శాంతస్వరూపమున పరతత్త్వముగా భాసిల్లుచుండెను. వృష్ణివంశజులకు పరదేవత వలె పూజ్యభావమును కలిగించుచుండెను. ఇట్లు ఆ పరమపురుషుడు వేర్వేరు వ్యక్తులకు వారి వారి మనోభావములకు అనుగుణముగా వివిధ రూపములలో తేజరిల్లుచుండెను.
పై సందర్భములో పోతనగారి పద్యరత్నము:
*సీస పద్యము*
మహితరౌద్రంబున మల్లుర కశనియై;
నరుల కద్భుతముగ నాథుఁ డగుచు
శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై;
నిజమృత్యువై కంసునికి భయముగ
మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై;
తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు
ఖలులకు విరసంబుగా దండియై గోప;
కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు
*ఆటవెలది*
బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై
శాంత మొనర యోగి జనుల కెల్లఁ
బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో
మాధవుండు రంగమధ్య మందు.
*భావము*
మల్లరంగం నడుమ బలరామ సహితుడైన కృష్ణుడు, రౌద్రరసంతో మల్లురకు పిడుగులా కనిపించాడు; అద్భుతరసంతో పురస్త్రీలకు పంచశరుడుగా భాసిల్లాడు; భయానకరసంతో కంసునికి వాడి పాలిటి మృత్యువుగా మూర్తీభవించాడు; బీభత్సరసంతో మూర్ఖులకు వికటుడుగా కనిపించాడు; కరుణరసంతో తండ్రికి కన్నబిడ్డడుగా కరుణ కలిగించాడు; వీరరసంతో దుర్మార్గులకు విద్వేషం కలిగించాడు; హాస్యరసంతో గోపకులను కులదీపకుడుగా గోచరించాడు; ప్రేమరసంతో చుట్టాలకు దేవుడుగానూ, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపుడుగానూ ప్రకాశించాడు.
*43.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*హతం కువలయాపీడం దృష్ట్వా తావపి దుర్జయౌ|*
*కంసో మనస్వ్యపి తదా భృశముద్వివిజే నృప॥9925॥*
పరీక్షిన్మహారాజా! సహజముగా కంసుడు ధీరుడే యనప్పటికిని, కువలయాపీడము హతమగుట చూచి, బలరామకృష్ణులు దుర్జయులు (అజేయులు) అని గ్రహించి, మిగుల భయగ్రస్తుడయ్యెను.
*43.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*తౌ రేజతూ రంగగతౌ మహాభుజౌ విచిత్రవేషాభరణస్రగంబరౌ|*
*యథా నటావుత్తమవేషధారిణౌ మనః క్షిపంతౌ ప్రభయా నిరీక్షతామ్॥9926॥*
గొప్ప భుజశాలులైన బలరామకృష్ణులు విచిత్రములగు వేషములతో, వస్త్రాభరణములతో, పూలహారములతో రంగస్థలమున విరాజిల్లుచుండిరి. అప్పుడు వారు ఉత్తమ వేషధారులైన నటులవలె తమ దివ్యశోభలతో సందర్శకుల మనస్సులను ఆకట్టుకొనుచుండిరి.
*43.20 (ఇరువదియవ శ్లోకము)*
*నిరీక్ష్య తావుత్తమపూరుషౌ జనా మంచస్థితా నాగరరాష్ట్రకా నృప|*
*ప్రహర్షవేగోత్కలితేక్షణాననాః పపుర్న తృప్తా నయనైస్తదాననమ్॥9927॥*
మహారాజా! రంగస్థలమునందలి మంచెలపై ఆసీనులైయున్న మథురానగరవాసులు, జానపదులు ఆ ఇరువురు మహాపురుషులను జూచినంతనే సంతోషాతిరేకముతో వారి ముఖములు మిగుల వికసించెను. వారు తమ నయనములనెడి పాత్రలద్వారా ఆ సోదరులయొక్క ముఖవర్చస్సులనెడి అమృతమును ఎంతగా గ్రోలుచున్నను వారికి తనివిదీరకుండెను.
*43.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా|*
*జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభిః॥9928॥*
*43.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*ఊచుః పరస్పరం తే వై యథాదృష్టం యథాశ్రుతమ్|*
*తద్రూపగుణమాధుర్యప్రాగల్భ్యస్మారితా ఇవ॥9929॥*
అప్పుడు బలరామకృష్ణులను దర్శించుచున్నవారు ఆ మహాత్ములయొక్క సౌందర్యరసమును కన్నులద్వారా త్రాగివేయుచున్నట్లుగను, తమ నాలుకలద్వారా రుచిచూచుచున్నట్లు గుటకలు వేయుచును, లావణ్య పరిమళములను ఆఘ్రాణించి పరవశించిపోవుచున్నట్లుగను, ఆ పరమ సుందరులను బాహువులతో హాయిగా కౌగలించు కొనుచున్నట్లుగను ఒప్పిరి. ఇంకను ఆ ప్రజలు గజదంతములను చేబూనియున్న ఆ మహాపురుషుల రూపవైభవములను, శౌర్యపరాక్రమాది గుణములను, దరహాస - భాషణ మాధుర్యములను, నిర్భయత్వమును, గుర్తునకు తెచ్చుకొనుచున్నవారివలె స్వయముగా తాము చూచిన ధనుర్భంగాది దృశ్యములను గూర్చియు. కర్ణాకర్ణిగా తాము వినిన గోవర్ధనోద్ధరణాది లీలలను గుఱించియు పరస్పరము ముచ్చటించుకొనిరి.
*43.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*ఏతౌ భగవతః సాక్షాద్ధరేర్నారాయణస్య హి|*
*అవతీర్ణావిహాంశేన వసుదేవస్య వేశ్మని॥9930॥*
సాక్షాత్తుగా సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడే సంకల్పమాత్రమున శ్రీకృష్ణుడుగను, తదంశతో బలరాముడుగను భూతలమున వసుదేవుని ఇంట అవతరించిరి.
*43.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*ఏష వై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులమ్|*
*కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేశ్మని॥9931॥*
ఈ శ్రీకృష్ణపరమాత్మ మథురలో దేవకీదేవి గర్భమున అవతరించిన వెంటనే వసుదేవునిచే గోకులమునకు చేర్చబడినాడట. ఇప్పటి వఱకును అచటనే గూఢముగా నివసించుచు నందుని గృహమున వృద్ధిపొందెను.
*43.25 (ఇరువది యైదవ శ్లోకము)*
*పూతనానేన నీతాంతం చక్రవాతశ్చ దానవః|*
*అర్జునౌ గుహ్యకః కేశీ ధేనుకోఽన్యే చ తద్విధాః॥9932॥*
*43.26 (ఇరువది యారవ శ్లోకము)*
*గావః సపాలా ఏతేన దావాగ్నేః పరిమోచితాః|*
*కాలియో దమితః సర్ప ఇంద్రశ్చ విమదః కృతః॥9933॥*
*43.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*సప్తాహమేకహస్తేన ధృతోఽద్రిప్రవరోఽమునా|*
*వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులమ్॥9934॥*
దివ్యతేజోమూర్తియైన ఈ శ్రీకృష్ణుడు ఒనర్చిన కృత్యములు అద్భుతములు. అతడు రక్కసియైన పూతనను మృత్యుముఖమునకు చేర్చెను. దానవుడగు తృణావర్తుని పరిమార్చెను. మద్దిచెట్లను నేలగూల్చి, నలకూబర మణిగ్రీవులకు శాపవిముక్తిని ప్రసాదించిరి. కుబేరుని భటుడైన శంఖచూడుని హతమొనర్చెను. కేశి రాక్షసుని చెండాడెను. ధేనుకాది అసురులను సంహరించెను. ఈ మహానుభావుడు దావాగ్ని ప్రమాదమునుండి గోవులను, గోపాలురను కాపాడెను. కాళియసర్పమును మర్ధించెను. దేవేంద్రుని గర్వమును అణచెను. ఒక్కచేతితో గోవర్ధనగిరిని ఎత్తి, దానిని అట్లే నిలిపి, ఏడు దినములపాటు సుడిగాలులతో గూడి, ఏకధాటిగా కురిసిన కుంభవృష్టినుండియు, పిడుగుపాటులనుండియు గోకులమును (గోవులను, గోవత్సములను, గోపికలను, గోపాలురను, పిల్లలను, వృద్ధులను - ఆ బాలగోపాలమును) పరిరక్షించెను.
*43.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*గోప్యోఽస్య నిత్యముదితహసితప్రేక్షణం ముఖమ్|*
*పశ్యంత్యో వివిధాంస్తాపాంస్తరంతి స్మాశ్రమం ముదా॥9935॥*
నిత్యము ఈ మహాత్ముని యొక్క ముదితముఖవికాసములను, దరహాస శోభలను, మధురప్రేక్షణములను గాంచుచు గోపికలు మిగుల ఆనందించుచుండెడివారు. ఆ ఆనందములో వారు తమ వివిధతాపములనుండి బయటపడి హాయిగా ఉండెడివారు.
*43.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*వదంత్యనేన వంశోఽయం యదోః సుబహువిశ్రుతః|*
*శ్రియం యశో మహత్వం చ లప్స్యతే పరిరక్షితః॥9936॥*
"ఈ పరమపురుషుడు దానవాది దుష్టుల బాధలనుండి ఈ యదువంశమును పరిరక్షించెను. ఈయన వలన ఈ వంశము మిగుల ఖ్యాతి వహించెను. ఈ పురుషోత్తముని కారణముగా ఇది మున్ముందు ఇతోధికముగా సిరిసంపదలతోను, యశోవైభవములతోను, మహత్త్వములతోడను వర్ధిల్లును" అని ప్రజలు అనుకొనుచుండిరి.
*43.30 (ముప్పదియవ శ్లోకము)*
*అయం చాస్యాగ్రజః శ్రీమాన్ రామః కమలలోచనః|*
*ప్రలంబో నిహతో యేన వత్సకో యే బకాదయః॥9937॥*
"ఈ మహాత్మునకు అన్నయు, కమలలోచనుడు, శుభలక్షణ సంపన్నుడు ఐన బలరాముడు ప్రలంబాసురుని హతమార్చెను. వత్సాసురుడు, బకాసురుడు మొదలగు దుష్టరాక్షసులను ఈ ప్రభువు సంహరించెను".
*43.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*జనేష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ|*
*కృష్ణరామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్॥9938॥*
ప్రజలు ఇట్లనుకొనుచుండగా రంగశాలయందు తూర్యాది వాద్యముల ఘోష మిన్నంటుచుండెను. అంతట చాణూరుడను మల్లయోధుడు బలరామకృష్ణులను సంబోధించుచు ఇట్లు నుడివెను-
*43.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*హే నందసూనో హే రామ భవంతౌ వీరసమ్మతౌ|*
*నియుద్ధకుశలౌ శ్రుత్వా రాజ్ఞాఽఽహూతౌ దిదృక్షుణా॥9939॥*
"నందకుమారా! కృష్ణా! బలరామా! 'మీరు మహావీరులనియు, మల్లయుద్ధమున నిపుణులు' అనియు విని, కంసమహారాజు మీ వల్ల క్రీడాసామార్థ్యములను ప్రత్యక్షముగా చూడగోరి ఇచటికి పిలిపించెను".
*43.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యః శ్రేయో విందంతి వై ప్రజాః|*
*మనసా కర్మణా వాచా విపరీతమతోఽన్యథా॥9940॥*
మహారాజునకు త్రికరణశుద్ధిగా (మనసా, వాచా, కర్మణా) ప్రియమును గూర్చెడి ప్రజలు శుభములను పొందెదరు. అట్లుగాక అప్రియమును కలిగించెడివారు కష్టనష్టముల పాలగుదురు.
*43.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*నిత్యం ప్రముదితా గోపా వత్సపాలా యథా స్ఫుటమ్|*
*వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః॥9941॥*
*43.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*తస్మాద్రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామ హే|*
*భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః॥9942॥*
*చాణూరుడను మల్లయోధుడు బలరామకృష్ణులను సంబోధించుచు ఇంకను ఇట్లు నుడువుచుండెను (ముప్పదియవ శ్లోకము నుండి కొనసాగించబడినది)*
"ప్రతిదినము ఆవులను, దూడలను మేపుచు వనములలో తిరుగుచుండునప్పుడు గోపాలురు (మీరు) మల్లయుద్ధములను నెఱపుచు ఆడుకొనుచుండిరి. ఈ విషయము అందఱును ఎఱిగినదే. కనుక యుద్ధక్రీడలలో (కుస్తీపోటీలలో) ఆఱితేఱిన మీరును మేమును ఇప్పుడు ఆ క్రీడలను ఆడి రాజుగారిని సంతోషింపజేయుదము. అట్లొనర్చుట వలన ప్రజలందఱును ప్రసన్నులగుదురు. రాజు సకల ప్రజలకు ప్రతినిధి గదా" అని పల్కెను.
*43.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*తన్నిశమ్యాబ్రవీత్కృష్ణో దేశకాలోచితం వచః|*
*నియుద్ధమాత్మనోఽభీష్టం మన్యమానోఽభినంద్య చ॥9943॥*
పరీక్షిన్మహారాజా! చాణూరుడు పలికిన మాటలను వినిన పిమ్మట, ద్వంద్వయుద్ధము చేయుట తమకుకూడ ఇష్టమైనదేనని శ్రీకృష్ణుడు భావించెను. పిమ్మట ఆ స్వామి వానికి తన అంగీకారమును తెలిపి దేశకాలములకు తగిన మాటలను ఇట్లు బదులుచెప్పెను-
*43.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*ప్రజా భోజపతేరస్య వయం చాపి వనేచరాః|*
*కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః॥9944॥*
*43.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితమ్|*
*భవేన్నియుద్ధం మాధర్మః స్పృశేన్మల్లసభాసదః॥9945॥*
"చాణూరా! మీరేగాదు. వనములలో సంచరించుచు జీవించుచున్నట్టి మేమును కంసమహారాజు యొక్క పాలనలోని వారమే. అందువలన ఆయనకు నిరంతరము ప్రియమును గూర్చుచుండుట మాకును కర్తవ్యమే. అంతేగాక! అది మాకు మిగుల శ్రేయోదాయకము గూడా. కనుక మల్లయోధుడా! మేము పసిబాలురము. మాతో సమానమైన బలముగల బాలురతోడనే యుద్ధక్రీడ సలుపుట ధర్మము. ఒకరు బలవంతులు, మఱియొకరు బలహీనులు ఐన వారిమధ్య ద్వంద్వయుద్ధము జరుగుట అధర్మము. అధర్మ యుద్ధము వలన ప్రాప్తించెడి పాపము (పాపఫలము) ప్రేక్షకులను తాకరాదుగదా" అనెను.
*చాణూర ఉవాచ*
*43.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరః|*
*లీలయేభో హతో యేన సహస్రద్విపసత్త్వభృత్॥9946॥*
*43.40 (నలుబదియవ శ్లోకము)*
*తస్మాద్భవద్భ్యాం బలిభిర్యోద్ధవ్యం నానయోఽత్ర వై|*
*మయి విక్రమ వార్ష్ణేయ బలేన సహ ముష్టికః॥9947॥*
*అంతట చాణూరుడు ఇట్లనెను* "కృష్ణా! నీవు గాని, బలరాముడుగాని, బాలురు గాని కిశోరులు ఎంతమాత్రమూగాదు. మీరు ఇరువురును బలపరాక్రమ సంపన్నులే. ఎందుకనగా, వేయి యేనుగుల బలముగల *కువలయాపీడము* అను మదపుటేనుగును (మేము అందఱమూ చూచుచుండగనే) మీరు అవలీలగా హతమార్చితిరి. అందువలన మిక్కిలి బలిష్ఠులైన మీరు బలసంపన్నులమైన మా వంటివారితో ద్వంద్వయుద్ధము చేయుట న్యాయమే. ఏవిధముగను అన్యాయము గాదు. కనుక, శ్రీకృష్ణా! నీ పరాక్రమము నాపై చూపుము. బలరాముడు తన బలమును ముష్టికునిపై ప్రదర్శింపగలడు".
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే కువలయాపీడవధో నామ త్రిచత్వారింశోఽధ్యాయః (43)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు 'కువలయాపీడము' అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట* యను నలుబది మూడవ అధ్యాయము (43)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319