*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*375వ నామ మంత్రము*
*ఓం కామ పూజితాయై నమః*
మన్మథునిచే ఉపాసింపబడిన (పూజింపబడిన) జగన్మాతకు నమస్కారము.
కామేశ్వరునిచే (శివునిచే) ఆరాధింపబడిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కామపూజితా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం కామపూజితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతకు పూజలు చేయు భక్తజనులకు ఆ తల్లి సకలార్థసిద్ధిని పరిపూర్ణముగా కలుగజేయును.
*హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః* (84వ నామ మంత్రము) - శివుని నేత్రాగ్నిచే బూడిదైన మన్మథుడిని మరల సజీవుని చేయుటలో పరమేశ్వరి తానొక సంజీవనౌషధియై ఒప్పారినది. రతీదేవి (మన్మథుని భార్య) సౌభాగ్యము నిలుపుటకై, శివుని నేత్రాగ్నికి భస్మమైపోయిన మన్మథుని అమ్మవారు సజీవుని చేయుటతో, కృతజ్ఞతా పూర్వకంగా మన్మథుడు అమ్మవారిని పూజించాడు. గనుకనే శ్రీమాత *కామపూజితా* యని అనబడినది. అసలు మన్మథుడు తొలుత జ్ఞానహీనుడు. తిరిగి అమ్మవారి వలన సజీవుడైన తరువాత జ్ఞాని అయాడు. అందువలన ఆ తల్లిని పూజించడం ప్రారంభించాడు. అమ్మవారు అందుకు సంతసించి మన్మథునికి పంచదశీ విద్య (శ్రీవిద్య) ప్రసాదించింది. పంచదశీ మంత్రోపాసన/ (శ్రీవిద్యోపాసన చేయు పదునాలుగు మందిలో (కొందరు పండ్రెండు మంది అని అంటారు) మన్మథుడు ఒకడు. ప్రస్తుతం మనం చేయు శ్రీవిద్యోపాసన మన్మథుడు చేయు శ్రీవిద్యోపాసనయే. గనుకనే అమ్మవారు *కామపూజితా* యని అనబడినది.
పరమేశ్వరుడు (కామేశ్వరుడు), ఆయన పంచకృత్యపరాయణుడు. ఆయనకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. తొలుతగా జగన్మాతను పూజించి సృష్టి ప్రారంభించాడు. అందుచే లలితాంబిక *కామపూజితా* యని అనబడినది.
లలితాంబికకు నమస్కరించునపుడు *ఓం కామపూజితాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి