*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది మూడవ అధ్యాయము*
*బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుక ఉవాచ*
*43.1 (ప్రథమ శ్లోకము)*
*అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప|*
*మల్లదుందుభినిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః॥9908॥*
*శ్రీశుకుడు పలికెను* అంతశ్శత్రువులను జయించిన పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతఃకాలస్నానాది విధులను నిర్వర్తించుకొనిరి. పిమ్మట వారు మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.
*43.2 (రెండవ శ్లోకము)*
*రంగద్వారం సమాసాద్య తస్మిన్ నాగమవస్థితమ్|*
*అపశ్యత్కువలయాపీడం కృష్ణోఽమ్బష్ఠప్రచోదితమ్॥9909॥*
రంగస్థల ద్వారము కడకు రాగానే శ్రీకృష్ణుడు అచటనున్న *కువలయాపీడనము* అను ఏనుగును చూచెను. దానిని ఒక మావటివాడు అదుపు చేయుచుండెను.
*43.3 (రెండవ శ్లోకము)*
*బద్ధ్వా పరికరం శౌరిః సముహ్య కుటిలాలకాన్|*
*ఉవాచ హస్తిపం వాచా మేఘనాదగభీరయా॥9910*
అప్పుడు కృష్ణప్రభువు ఉత్తరీయమును నడుమునకు బిగించి, ముంగురులను సవరించుకొని, మేఘధ్వనులవలె గంభీరములైన వాక్కులతో మావటివానిని ఱెచ్చగొట్టుచు ఇట్లనెను-
*43.4 (నాలుగవ శ్లోకము)*
*అంబష్ఠాంబష్ఠ మార్గం నౌ దేహ్యపక్రమ మా చిరమ్|*
*నో చేత్సకుంజరం త్వాద్య నయామి యమసాదనమ్॰9911॥*
"ఓరీ మావటీ! వెంటనే తప్పుకొనుము. మా ఇరువురికి మార్గమునిమ్ము. లేనిచో నిన్ను, ఏనుగును ఇప్పుడే మృత్యుముఖమునకు చేర్చెదను".
*43.5 (ఐదవ శ్లోకము)*
*ఏవం నిర్భర్త్సితోఽమ్బష్ఠః కుపితః కోపితం గజమ్|*
*చోదయామాస కృష్ణాయ కాలాంతకయమోపమమ్॥9912॥*
శ్రీకృష్ణుడు హెచ్చరించినంతనే మావటివాడు మిగుల క్రుద్ధుడయ్యెను. పిదప అతడు మృత్యుదేవతవలె భయంకరమైన ఆ మదపుటేనుగును కృష్ణుని మీదికి ఉసిగొల్పెను.
*43.6 (ఆరవ శ్లోకము)*
*కరీంద్రస్తమభిద్రుత్య కరేణ తరసాగ్రహీత్|*
*కరాద్విగలితః సోఽముం నిహత్యాంఘ్రిష్వలీయత॥9913॥*
వెన్వెంటనే ఆ కువలయాపీడము ఱెచ్చిపోయి, శ్రీకృష్ణుని తన తొండముతో చుట్టివేసెను. అంతట ఆ స్వామి నేర్పుగా ఆ తొండమునుండి జాఱుకొని (తప్పించుకొని) దానిపై పిడికిలితో ఒక్కపోటు పొడిచి, తాను దాని కాళ్ళసందున దాగికొనెను.
*43.7 (ఏడవ శ్లోకము)*
*సంక్రుద్ధస్తమచక్షాణో ఘ్రాణదృష్టిః స కేశవమ్|*
*పరామృశత్పుష్కరేణ స ప్రసహ్య వినిర్గతః॥9914॥*
*43.8 (ఎనిమిదవ శ్లోకము)*
*పుచ్ఛే ప్రగృహ్యాతిబలం ధనుషః పంచవింశతిమ్*
*విచకర్ష యథా నాగం సుపర్ణ ఇవ లీలయా॥9915॥*
శ్రీకృష్ణుడు తన యెదుట ఎక్కడను కనబడకపోవుటతో ఆ మదపుటేనుగు ఒడలు తెలియని కోపముతో తొండముతో వాసన చూచుచు వెదకి వెదకి ఆ పురుషోత్తముని పట్టుకొనెను. అప్పుడు ఆ ప్రభువు శక్తియుక్తులను చూపుచు దాని పట్టునుండి బయటపడెను. పిదప ఆ స్వామి దాని తోకను పట్టుకొని, గరుత్మంతుడు సర్ఫమునువలె అవలీలగా దానిని ఇరువదియైదు బారల దూరము లాగివేసెను.
*43.9 (తొమ్మిదవ శ్లోకము)*
*స పర్యావర్తమానేన సవ్యదక్షిణతోఽచ్యుతః|*
*బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలకః॥9916॥*
*43.10 (పదియవ శ్లోకము)*
*తతోఽభిముఖమభ్యేత్య పాణినాఽఽహత్య వారణమ్|*
*ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే॥9917॥*
అనంతరము ఆ కువలయాపీడము పుంజుకొని, శ్రీకృష్ణుని పట్టుకొనుటకు ప్రయత్నించెను. ఆ ఏనుగు కుడివైపునకు తిరుగునప్పుడు అతడు ఎడమవైపునకును, అది ఎడమవైపునకు తిరుగునప్పుడు అతడు కుడివైపునకును తిరుగుచు, బాలకుడు ఆవుదూడనువలె ఆటపట్టించుచు ముప్పుతిప్పలు పెట్టెను. పిమ్మట ఆ ఏనుగునకు ఎదుట నిలిచి చేతతో దానిని ఒక దెబ్బకొట్టి పరుగిడసాగెను. ఆ విధముగా ఆ స్వామి దానికి అందినట్లే అందుచు, అందకుండాపోవుచు పదేపదే దానిని వంచింపదొడగెను.
*43.11 (పదకొండవ శ్లోకము)*
*స ధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః|*
*తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోఽహనత్క్షితిమ్॥9918॥*
పిమ్మట కృష్ణభగవానుడు పరుగెత్తుచు ఒకసారి లీలగా భూమిపై పడినట్లు నటించెను. వెంటనే లేచి నిలబడెను. ఆ సమయమున మిగుల ఱెచ్చిపోయియున్న ఆ మదపుటేనుగు నిజముగనే అతడు పడిపోయినాడని భావించి, ఆవేశమున తన దంతములతో నేలను క్రుమ్మసాగెను.
*43.12 (పండ్రెండవ శ్లోకము)*
*స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోఽత్యమర్షితః|*
*చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవద్రుషా॥9919॥*
*43.13 (పదమూడవ శ్లోకము)*
*తమాపతంతమాసాద్య భగవాన్మధుసూదనః|*
*నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే॥9920॥*
క్రమముగా మదపుటేనుగు యొక్క శక్తి క్షీణించుచుండెను. తన ప్రయత్నము ఎంతకును ఫలింపకుండుటచే అది రెట్టించిన కోపముతో బుసలు కొట్టుచుండెను. పరిస్థితిని గమనించిన మావటివాండ్రు దానిని గట్టిగా ఉసిగొల్పుటతో అది ఇంకను కినుకబూని కృష్ణునిమీదికి విజృంభించెను. అంతట కృష్ణపరమాత్మ తనపై దాడి చేయుటకై వచ్చుచున్న ఆ మదపుటేనుగును సమీపించి తన చేతితో దాని తొండమును గట్టిగా పట్టుకొని, నేలపై పడవేసెను.
*43.14 (పదునాలుగవ శ్లోకము)*
*పతితస్య పదాఽఽక్రమ్య మృగేంద్ర ఇవ లీలయా|*
*దంతముత్పాట్య తేనేభం హస్తిపాంశ్చాహనద్ధరిః॥9921॥*
అది క్రిందబడినంతనే ఆ ప్రభువు సింహమువలె విజృంభించి, అవలీలగా దానిని తన పాదములతో త్రొక్కిపట్టెను. వెంటనే ఆ స్వామి దాని ఒక దంతమును ఊడబెఱికి, దాని దంతముతోనే ఆ కువలయాపీడమును, మావటివాండ్రను చావగొట్టెను.
*43.15 (పదునైదవ శ్లోకము)*
*మృతకం ద్విపముత్సృజ్య దంతపాణిః సమావిశత్|*
*అంసన్యస్తవిషాణోఽసృఙ్మదబిందుభిరంకితః|*
*విరూఢస్వేదకణికావదనాంబురుహో బభౌ॥9922॥*
ఆ మదపుటేనుగు మృతకళేబరమును అచటనే విడిచిపెట్టి ఆ మహాత్ముడు దాని దంతమును చేబూని రంగస్థలమున ప్రవేశించెను. అప్పుడు శ్రీకృష్ణుని రూపవైభవము చూడముచ్చట గొలుపుచుండెను. ఏనుగు దంతమును భుజముపై వహించియున్న ఆ ప్రభువు శరీరముపై రక్తబిందువులు, ఏనుగుయొక్క మదజల బిందువులు ప్రస్ఫుటముగా కనబడుచుండెను. మదపుటేనుగుతో పోరాడిన సందర్భమున చెమర్చిన ఆయన ముఖారవిందమునగల చెమటబిందువులు వింతశోభల నీనుచుండెను.
*43.16 (పదహారవ శ్లోకము)*
*వృతౌ గోపైః కతిపయైర్బలదేవజనార్దనౌ|*
*రంగం వివిశతూ రాజన్ గజదంతవరాయుధౌ॥9923॥*
పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణుల చేతులలో ఆభ ఏనుగు దంతములు ఆయుధములవలె శోభిల్లుచుండెను. కొంతమంది గోపాలురు వారి చుట్టును చేరియుండగా ఆ సోదరులు మల్లరంగమున ప్రవేశించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి