ప్ర : కాళీ, చండీ, చాముండా - వంటి ఉగ్రదేవతలను ఉపాసించవచ్చా ? చండీసప్తశతి పారాయణ, చండీ హోమం వంటివి ఉగ్రదేవతోపాసన అని కొందరి మాట. ఎంతవరకు సమంజసం ?
జ : చండీ, కాళీ - ఉగ్రదేవతలు.... అనడం సరికాదు. ప్రతి దేవతోపాసనలోనూ ఉగ్రమూర్తులుంటారు. విష్ణూపాసనలో ఉగ్రనరసింహం, శివోపాసనలో వీరభద్ర - భైరవమూర్తులు వలెనే శక్తి ఆరాధనలో కాళీ, దుర్గా వంటి రూపాలు.
అసలు విశ్వవ్యాపక ఈశ్వరశక్తిలోనే ఉగ్ర, సౌమ్య - అనే రెండు భావాలూ ఉంటాయి. వీటినే వైదికభాషలో ఘోర, అఘోర - అని అంటారు. ఈ రెండూ ప్రకృతిలోనే గోచరిస్తాయి. ప్రాణాన్నిచ్చే జలమే ఉప్పొంగే ఉప్పెన అవుతోంది. జీవనదాత సూర్యుడే ప్రచండంగా గ్రీష్మంలో ప్రకాశిస్తాడు. ఈ రెండు విధాల వ్యక్తీకరణలు లోకక్షేమానికే.
అనంత కాలశక్తి కాళి. అధర్మాన్ని, దుష్టత్వాన్ని శిక్షించి, లోకరక్షణ చేసే పరమేశ్వర శక్తి చండి.రక్షణ స్వరూపిణి కనుకనే 'దుర్గ' అన్నారు.
ఇక 'చండీసప్తశతి' గ్రంథం అసలు పేరు 'దేవీమహాత్మ్యం'.
ఇది 'మార్కండేయ పురాణం'లోనిది.
ఈ స్వరూపాలను 'ఉగ్ర' అనడానికి లేదు. ఈ గ్రంథంలో చెప్పబడిన 'దేవి' - వేదాలలో లక్ష్మి, సరస్వతి, గౌరి,కాళీ, శ్రద్ధా, మేధా, గాయత్రి, స్వాహా, స్వధా - మొదలైన రూపాలలో ఉన్న పరాశక్తి జగన్మాత.
లోకరక్షణ కోసం దుష్టులను సంహరించి, ధర్మరక్షణార్థం - పలుమార్లు ఆవిర్భవించిన శక్తి. అసుర సంహారానికి కోపశక్తిగా 'చండి', లోకరక్షణకు మంగళస్వరూపిణి - ఈ రెండూ కారుణ్యరూపాలే.
సౌమ్యాని యాని రూపాణి
త్రైలోక్యే విచరంతి తే l
యాని చాత్యంత ఘోరాణి
తైరక్షాస్మాం స్తథా భువమ్ ॥ - అనే శ్లోకం దేవీమహాత్మ్యం లోనిదే.
'అమ్మా ! ముల్లోకాలలో చరించే నీ సౌమ్యరూపాలు, ఘోరరూపాలు మమ్ములను, ప్రపంచాన్ని రక్షించుగాక! " అని చక్కని భావమిది.
'సౌమ్యా సౌమ్యతరాఽశేష సౌమ్యౌభ్యస్త్వతిసుందరీ'
అనే వాక్యం కూడా ఈ గ్రంథంలోనిదే.
సమగ్రంగా దేవీతత్త్వం ఉన్న గ్రంథమిది.
చండీ, చాముండా- అనే మాటలకు తత్త్వపరంగా
'బ్రహ్మ విద్యాస్వరూపిణి' అనే అర్థం.
రక్షణనిచ్చే జగన్మాతను ఆరాధించడం వల్ల - మనలోని దష్టప్రవృత్తులు తొలగి సత్ప్రవర్తనలనే దైవీశక్తులు రక్షింపబడతాయి. సకామంగా పారాయణ, హోమం చేస్తే అభీష్టసిద్ధి లభిస్తుంది (అయితే ఆ కోరిక ధర్మబద్ధమైనది కావాలి). క్రమంగా జ్ఞానం, కైవల్యం లభిస్తాయి.
నిష్కామంగా ఆచరిస్తే మోక్షానికి కావాల్సిన జ్ఞానాన్నీ ప్రసాదిస్తుంది. ఆశించకుండానే ఐహిక జీవితంలోనూ అవసరమైన రక్షణ, సంపదలను అనుగ్రహిస్తుంది.
మేధాసి దేవి విధితాఽఖిల శాస్త్రసారా
దుర్గాసి దుర్గ భవసాగరనౌరసంగా ।
శ్రీః కైటభారి హృదయైక కృతాధివాసా
గౌరీ ! త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠా ॥
- అని దేవీమహాత్మ్యం లోని శ్లోకం.
" సకల శాస్త్రసారమైన మేధస్సు నీవే. దాటలేని సంసారసముద్రాన్ని నావ వలె దాటించే దుర్గవు నీవు. శ్రీమహావిష్ణువు హృదయాన అధివసించు లక్ష్మీవి నీవు. చంద్రశేఖరుడైన శివునియందున్న గౌరివి నీవు" అని భావం.
ఏ విధంగా చూసినా - అనంతశక్తి, అపార కరుణ కలిగిన జగన్మాత ఆరాధనలే చండీ , కాళీ వంటి పూజలు.
దేవీమహాత్మ్యం - పారాయణ, హోమాలు ఆ తల్లి దయను ప్రసాదించే సాధనలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి