3, డిసెంబర్ 2021, శుక్రవారం

శివుడికి జలుబు

 "శివుడికి జలుబు చేసింది"


     నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా. కనీసం మాతో మాట్లాడే టైమ్ కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగు తూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీ దేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబు తో వణికి పోతున్నాడు శివుడు.😖😞😤


నెల రోజుల బట్టి మొత్తుకుంటున్నా! చెబితే విన్నారు కాదు. ఏదిబడితే అది. పండా, కాయా, రేషన్ చెక్కరా, కల్తీ తేనె....ఏమీ చూడకుండా.. అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థ పడుతున్నారు..🤨😙


పాపం భక్తులు.... ప్రేమతో పోస్తున్నారు కదా అని........ఏమీ అనలేకపోయాను.😌


"భక్తులు ప్రేమతో కాదు. TV ఛానెళ్లల్లో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయమేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక బెనిఫిట్ ఇస్తారట గా మీరు? నవ్వుతూ అంది అమ్మవారు.


" నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. భక్తి తో నన్ను తలుచుకుంటే చాలు. ఈ స్కీం లు నావి కావు. అప్పటికీ చాగంటి చేత, గరికపాటి చేత చెప్పిస్తున్నా ఎవ్వడూ వినిపించుకోవట్లేదు.😟😟


"కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా."


'ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి.' ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు.


"సర్లేండి. ఈ కషాయం తాగండి". ఇచ్చింది పార్వతి.


ఇదంతా చూస్తున్న నారదుల వారు, వెళ్లి వైకుంఠంలో చెప్పాడు.


వెంటనే TV ఆన్ చేసిన అమ్మవారికి...షాక్ తగిలింది. విశాఖ, కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాలప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీద కు *భక్తి* తో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అసలే చలికాలం.


అది చూసి, విష్ణువు పకపకా నవ్వసాగాడు.


" మరీ సంబర పడిపోకండి. ధనుర్మాసం కూడా వస్తుంది. మాకూ నవ్వే అవకాశం వస్తుంది"అంటూ, ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారదా అంది మహాలక్ష్మమ్మ.

🙏🙏🙏



నిజ భక్తితో ఆలోచించండి. 🙏