🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏
రెండవ భాగం
మంగళసూత్రం:- సకల మంగళాలకు ఆలవాలమైన సూత్రం మంగళసూత్రం. పరిణయ బంధానికి చిహ్నం ఈ సూత్రం. ఉభయకుటుంబాల వంశాచారానికి తగినట్లు తయారుచేసిన బంగారు మాంగళ్యాలను పసుపుత్రాటితో గ్రుచ్చి మంగళదేవత గౌరీదేవి, లక్ష్మీదేవిలను ఆవాహనం చేస్తూ పూజించిన తర్వాత పురోహితుడు, పెద్దలు, ముత్తైదువలు శుభాన్ని కాంక్షిస్తూ మంచిహృదయంతో దానిని తాకుతారు. అటుపై వరుడు వధువు మెడలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలనడుమ పెద్దల ఆశీర్వాదముల సాక్షిగా ఈ మంత్రాన్ని చెప్తూ -
"మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్ "
భావం:- నా సుఖజీవనానికి హేతువులైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవూ నూరేళ్ళు వర్ధిల్లు. అని మూడు ముళ్ళు వేస్తాడు.
తలంబ్రాలు:- వధూవరులు ఒకరితలపై మరొకరు పసుపుతో తడిపిన లేక తెలుపు అక్షితలను దోసిళ్ళతో పోసుకోవడంను తలంబ్రాలు అంటారు. ఇక్కడ చెప్పే మంత్రాలలో కూడా ఓ పరమార్ధముంది. వరుడు వధువు దోసిట్లో ఎండుకొబ్బరిచిప్పతో అక్షతలను పోసి నేతితో ప్రోక్షిస్తాడు. తర్వాత పురోహితుడు వరుని దోసిట్లో అదే మాదిరిగా అక్షితలను పోసి నేతితో ప్రోక్షించి వధువుదోసిలిపై వరునిదోసిలి పెట్టి ఈ మంత్రాలను చదువుతాడు -
కపిలాగ్o స్మారయన్తు, బహుదేయం చాస్తు, పుణ్యం వర్ధతామ్, శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, దంపత్యో: సగ్రహే సనక్షత్రే సహా సోమేన క్రియేతాం, శాంతి రస్తు.
భావం:- కపిలవర్ణ ఆవులను స్మరించండి, అనేక దానాలను చేయండి, పుణ్యం వృద్ధిపొందాలి, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలి, విఘ్నాలు తొలగిపోవాలి, ఆయుస్సు ఆరోగ్యం కలగాలి, క్షేమం మంగళం కలగాలి, సత్కర్మలు వృద్ధి పొందాలి, గ్రహాలవలన నక్షత్రాలు వలన సోమునివలన దాంపత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి.
ఆపై వరుడు 'ప్రజామే కామ స్సమృధ్యతామ్' (నేను కోరే సంతానం సమృద్ధిగా ఉండాలి) అని అంటూ వధువుతలపై తలంబ్రాలు పోస్తాడు. అటుపై వధువు 'పశవో మే కామ స్సమృధ్యతామ్' (వారి పోషణకై నేను కోరిన పశు సమృద్ధి ఉండాలి) అని అంటూ వరునితలపై తలంబ్రాలు పోస్తుంది. 'యజ్ఞో మే కామ స్సమృధ్యతామ్' ( నేను కోరిన త్యాగం సమృద్ధిగా ఉండాలి) అని మరల వరుడు తలంబ్రాలు వేస్తాడు. ఇలా వధూవరులు బాసలు చేసుకుంటూ ఆనందంతో ముచ్చటగా మూడుసార్లు పోసుకున్నతర్వాత ఇద్దరు కలిసి
'శ్రియో మే కామ స్సమృధ్యతామ్' (మాకు కావాల్సిన సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలి) 'యశో మే కామ స్సమృధ్యతామ్' (మేము కోరిన కీర్తిప్రతిష్టలు సమృద్ధిగా ఉండాలి) అని అంటూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు.
బ్రహ్మముడి:- వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు -
'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి: / ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ //
భావం:- దాంపత్యసామ్రాజ్యాన్నిఅనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి.
పాణిగ్రహణం:- వివాహమందు ఇదీ ఓ ప్రధానఘట్టమే. వధూవరులు పరస్పరం ఒకరిచేతిని ఒకరు పట్టుకుంటారు. 'నా పెద్దల లాగానే నేను కూడా మంచి సంతానం కోసం నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, అర్యముడు సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసం నిన్ను గృహిణిగా చేస్తున్నారు అని అంటూ వధువుకు తన కుడిచేతిని అందిస్తాడు. వధువు వరునిచేతిని పట్టుకోవడంలో కూడా ఓ విశేషత ఉందని పెద్దలు చెప్తుంటారు. మొదట మగపిల్లవాడు కావాలంటే వరుడి బొటనవేలు మాత్రమే వధువు పట్టుకోవాలి. చిటికినవేలు పట్టుకుంటే ప్రధమ సంతానం ఆడపిల్ల అవుతుందని అంటారు. అందుకే ఆడమగ సంతానం అభిలాషిస్తూ అన్నివేళ్ళు కలిపి పట్టుకోమని అంటుంటారు.
సప్తపది:- పాణిగ్రహణం చేసిన తర్వాత వరుడు వధువుతో కల్సి తూర్పుకుగాని, ఉత్తరందిశగా గాని ఏడడుగులు వేయడాన్నే సప్తపది అంటారు. దీనివలన ఇద్దరిమద్య స్నేహబంధం ఏర్పడుతుంది. ఇక్కడ వరుని వెంట వధువు వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రయోజనం వుందని వరుడు వధువుకి ఇలా వివరిస్తాడు - నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి, నీవు నాతో వేసిన మొదటి అడుగు వలన అన్నాన్ని, రెండవఅడుగువలన బలాన్ని, మూడవఅడుగువలన మంచికార్యాలను, నాల్గోఅడుగువలన సౌఖ్యాన్ని, ఐదోఅడుగువలన పశుసమృద్ధిని, ఆరోఅడుగువలన రుతుసంపదలను, ఏడోఅడుగువలన ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక!
ఏడడుగులు వేసిన తర్వాత వరుడు వధువుతో మరల ఇలా అంటాడు...
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ