🕉 మన గుడి : నెం 1000
⚜ కేరళ : తిరువనంతపురం
⚜ శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం
💠 ఇంతకాలం తిరుపతి వెంకన్న.. 'సిరి' గల వాడు! ఇప్పుడు కేరళ పద్మనాభుడు.. అనంత 'సిరి' గల వాడు!! లక్ష కోట్లకు మించిన ఆస్తులు బయటపడిన ఈ దేవాలయం వెనుక కథలేంటో తెలుసుకుందామా!
💠 తిరువనంతపురంలో ముఖ్యంగా చూడవలసింది అనంత పద్మనాభస్వామి ఆలయం.
ఇది చాల ప్రాచీనమైన ఆలయం, 1733 లో మార్తాండవర్మ అనే రాజు పద్మనాభస్వామికి తన సర్వస్వం సమర్పించి 'పద్మనాభదాసు' అనే పేరుతో రాజ్యాన్ని పాలించిన పరమ భక్తుడు. ఇలా స్వామికి ప్రతినిధిగా ప్రజాపాలన చేసిన ప్రభువులు చాలా అరుదు.
రామాయణంలో పాదుకలను సింహాసనం పై ప్రతిష్ఠించి రామ రాజ్యానికి ధర్మకర్తగా వ్యవహరించిన భరతుడు ఇలాంటి మనస్తత్వానికి మంగళాచరణం చేశాడు.
ఆ తర్వాత మళ్ళీ మర్తాండవర్మ ఈ సంప్రదాయాన్ని పోషించిన పుణ్యజీవి.
💠 దళితులకు ఆలయంలో ప్రవేశం లభించింది కూడా మొట్టమొదట ఈ ఆలయంలోనే అని అంటారు.
గాంధీ మహాత్ముని ఆధ్వర్యంలో అది జరిగింది.
💠 ఆలయంలో స్వామి విగ్రహం శయన ముద్రలో ఉంటుంది. ఆదిశేషుడయిన అనంతుని వేయిపడగలపై ప యనించియున్న పద్మనాభస్వామిని దర్శించేందుకు ఒక్క ద్వారం చాలదు.
స్వామి 18 అడుగుల పాన్పు పై శయనించి ఉండటం వల్ల ఆయన నాభికమలం మాత్రం మధ్య ద్వారం నుంచి కనిపిస్తుంది.
ఒక వైపు నుంచి వక్షస్థలం, శిరస్సును చూడవచ్చు. మరోవైపునుంచి పాదాలను సేవించవచ్చు.
ఇంతటి విశాలమైన విగ్రహం మరే విష్ణు మందిరంలో కనిపించదు.
💠 మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి.
💠 ఆలయ ప్రాంగణంలో వందల కొలది స్తంభాలే కాక సీతా రామలక్ష్మణ హనుమదాదుల ఆలయాలు కూడా ఉన్నాయి. గర్భగుడిలో ప్రవేశించే ముందు యోగ నరసింహ స్వామి ఆలయం కూడా ఉంది.
🔆 స్థల పురాణం
💠 చాలాకాలం క్రితం దివాకరుడనే మునీశ్వరుడు కృష్ణుని కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి ఆ ముని సాలగ్రామాన్ని గటుక్కున మింగి పారిపోయాడు. ముని తరిమేసరికి ఓ చెట్టు చాటుకి వెళ్ళి మాయామయ్యాడు.
చూస్తుండగానే ఆ చెట్టు శేషతల్పం మీద పడుకున్న విష్ణుమూర్తిగా అతి పెద్ద విగ్రహంగా మారిపోయింది. అప్పుడా ముని ప్రార్థన మేరకు పరిమాణం తగ్గిపోయింది. అలా తగ్గిన విగ్రహాన్నే ఇప్పుడు కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భక్తులు దర్శిస్తారు. అయినా మూడు ద్వారాల నుంచి చూస్తే కానీ పూర్తిగా చూడలేనంత పెద్దగా ఇక్కడి విగ్రహం ఉంటుంది.
💠 నూరు అడుగుల ఎత్తుగా, ఏడంతస్తులతో నిర్మితమైన గాలిగోపురం అద్భుత శిల్పకళా వైభవంతో ఆకట్టుకుంటుంది.
అందమైన అలంకారాలతో చెక్కిన 365 గ్రానైట్ స్థంభాల మండపం. ప్రాచీన శిల్పుల నైపుణ్యాన్ని కళ్లకు కడుతుంది. స్కంద, పద్మ పురాణాల ప్రకారం ఏడు పరశురామ క్షేత్రాల్లో ఒకటిగా, 108 విష్ణు 'దివ్య దేశాలు'లో 59వ దివ్య దేశంగా ఈ ఆలయం భక్తులను ఆలరిస్తుంది.
💠 బిళ్వ మంగళ స్వామి అను ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణుభక్తుడై యుండెను .
అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతశయన రూపము ప్రత్యక్షమునిచ్చెను.
అంతట ఆ బ్రాహ్మణుడు సంతోషాతిరేకమున ఏమయినా పెరుమాళ్ కు నివేదించ వలయునన్న తపనతో పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమియు లేక పోయినందువలన ప్రక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కలనుంచి స్వామికి అర్పించెను .
ఈ ఆలయమున ఇప్పటికినీ అది ఆచారముగా కొనసాగించుచున్నారు .
కాని పచ్చి మామిడి కాయల ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదించుచున్నారు . నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికినీ సుప్రభాత సేవ చేయుదురు .
💠 ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.
💠 ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది.
💠 అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు.
ఈ దేవాలయం పేరు మీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది.
‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం.
💠 ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు.
💠 నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది.
ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు.
💠 సరిగా ఇలాంటి దేవాలయమే ఆది కేశవదేవాలయం అనే పేరిట ఇక్కడికి 45 కి.మీ. దూరంలో ఉంది.
అక్కడి స్వామి విగ్రహం కూడా 18 అడుగుల పొడవు ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండటం వల్ల ఆదికేశవులు అనంత పద్మనాభస్వామిని చూస్తూ ఉన్నారవి అంటారు.
రచన
🌀 Santosh Kumar