దేవుడు ( ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)
అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనక్కాల గట్టిగా పట్టుక్కూచున్న భార్య, దాంతో తెగ స్పీడుగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ. వాళ్ళ మావగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్టు మోడలు కవాసాకీ నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చేరు.
కాకినాడలోని మావగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి, పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయల్దేరాడు. దేవరపల్లి వీధి దాటి కుంతీమాధవస్వామి గుడి దగ్గరకొచ్చేసరికి ఎక్కణ్ణుంచొచ్చిందో ఓ సూడిగేదె అడ్డొచ్చేసరికి సడన్ బ్రేకు వేసాడు హరికృష్ణ. దాంతో నూటిరవై కిలోమీటర్ల స్పీడులో వస్తున్న బండికాస్తా స్కిడ్డైపోయి భార్యాభర్తలిద్దరూ కిందడిపోయేరు. ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం, చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు.
రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచొచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి, బొట్టు బీదరాజు గాడి ఆటోలో పక్కీధిలోనున్న వెంకట్రాజుగారాసుపత్రికి తీసుకెళ్లిపోయేరు.
బంగళా పెంకేసున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు, ఆరెంపీ అని రాసుంది. అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత 'షిట్.. ఇన్ని ఇంజ్యూరీస్ తో సఫర్ అవుతూంటే ఆరెంపీ డాక్టర్ దగ్గిరకా? ఈ ఊళ్ళో అపోలో గానీ కేర్ గానీ లేవా' అంటూ అరిచినా వీళ్ళని తీసుకొచ్చిన జనం పట్టించుకోకుండా ఇద్దరినీ వెంకట్రాజు గారిదగ్గిరకట్టుకెళ్ళిపోయి ' డాట్రారండీ.. మరేమోనండీ.. ఈళ్ళిద్దరికీ యాక్సిడెంటైపోనాదండి' అంటూంటే ఆ వెంకట్రాజు గారు మీరందరూ బయటుండండి అని అందరినీ బయటకంపేసి, ఇద్దరి దెబ్బల్నీ శుభ్రం చేసేసి పైన టింక్చర్ అయోడిన్ పూస్తూ చెప్పేడు ' కొద్దిగా మంటగానుంటుంది.. కానీ ఓర్చుకోండి.. గాలికి ఒదిలేసి కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత ఈ దెబ్బల మీద కొబ్బరి నూనె రాయండి చాలు.. త్వరగా ఎండిపోతాయి.. ఇప్పుడు మీ ఇద్దరికీ టెటనస్ ఇంజక్షన్ ఇస్తాను'..
హరిత ఏడుస్తా అరిచింది' ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ హీ ఈజ్.. ఎట్లీస్ట్ ఆస్క్ హిమ్ టు యూజ్ ఎ స్టెరిలైజ్డ్ సిరంజ్'
వెంకట్రాజు నవ్వుతూ బదులిచ్చాడు 'మేడమ్.. ఐ మైట్ లుక్ చీప్.. బట్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ చీప్.. నేను స్టెరిలైజ్డ్ మాత్రమే కాదు.. ప్రతీ పేషంటుకీ కొత్త సిరంజీ వాడతాను' అని కొత్త సిరంజీలతో ఇద్దరికీ ఇంజక్షన్లు చేసేడు.
లేవడానికి ఇబ్బంది పడుతున్న హరిత పాదం పట్టుకుని పెయిన్ ఎక్కడుందీ అని అడుగుతూంటే 'మోకాలు దగ్గర చెప్పలేనంత నొప్పి, అయినా నేను కాకినాడెళ్ళి అపోలో లో స్కాన్ చేయించుకుంటాను' అంది
ఆ అమ్మాయి మాటల్ని పట్టించుకోకుండా మోకాలి దగ్గర పరీక్ష చేసిన వెంకట్రాజు గారు చెప్పేరు 'మీ మోకాలి దగ్గర చిన్న డిస్ లొకేషన్.. పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఇప్పుడే ఫిక్స్ చేస్తాన' ని ఆ పిల్ల అరుపులు పట్టించుకోకుండా మోకాలి దగ్గర చిన్నగా తిప్పేడు. ఆ హరిత ఒక్కసారే అరుపులూ, ఏడుపూ ఆపేసి 'ఇదేంటీ.. నెప్పి అలా ఎలా పోయిందీ' అని ఆశ్చర్యపోయింది.
'ఏమీలేదమ్మా.. చిన్న డిస్ లొకేషన్..పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఫిక్స్ చేసేసేను.. మీ వారికి కాళ్లూ చేతులూ కొట్టుకుపోవడం తప్ప పెద్ద ఇన్జ్యూరీస్ ఏవీ లేవు.. పెయిన్ కిల్లర్ వాడండి.. రాస్తాను ' అని ప్రిస్క్రిప్షన్ రాస్తూంటే ఆ హరిప్రసాదు అడిగేడు' మీ ఫీజెంతండీ? '
'
ఇంజక్షన్లకీ, అయోడిన్ కీ కలిపి డెబ్భై రూపాయలివ్వండి చాలు' అని బదులిచ్చిన వెంకట్రాజు గారి కాళ్ళకి దణ్ణం పెట్టి, ఫీజు చెల్లించుకునెళ్ళిపోయారా దంపతులు
ఏ ఊరినుంచొచ్చాడో ఎవరికీ తెలీదు కానీ దేవరపల్లి వీధి లో ఇల్లద్దెకు తీసుకుని ప్రాక్టీసు మొదలెట్టేడా వెంకట్రాజు. ఈయన ఉత్త ఆరెంపీ అంటెహె అనుకుంటూ మొదటెవరూ ఆయన క్లీనిక్ వేపు కన్నెత్తి చూసేవోరు కాదు. ఈయనే ఓ చిన్న పెట్టట్టుకుని ప్రతీ పాకమ్మటా తిరిగి అందరి ఆరోగ్యం వాకబు చేస్తూండేవోడు.
ఎవరికైనా వైద్యం చేసినప్పుడు డబ్బివ్వబోతే 'డబ్బులక్కరలేదు.. ఇవ్వాళ మీ ఇంట్లో భోజనం పెట్టండనేవోడు.. ఊళ్లో వేరే డాక్టర్లు లా కాకుండా టెస్టులూ అయీ ఎంతో అవసరమైతే తప్ప రాసేవోడు కాదు. ఏ రోగినైనా మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి రోగమేంటో తేల్చేసేవోడు.
శివాలయం పూజారి ఏకాంబరశాస్త్రి గారి కోడలు కాన్పయ్యిన తర్వాత కాకినాడ డాక్టర్లు ఏవో బోలెడు మల్టీ విటమిన్ టాబ్లెట్లూ గట్రా రాసేసేరు. అసలే ఇంతింత ఆదాయం తో అంత మందుల ఖర్చు ఎలా భరించాలిరా దేవుడా అని ఆయన బాధ పడుతూంటే 'అయ్యో.. భలే వారండీ.. ఆ టాబ్లెట్లయీ ఏమఖ్ఖర్లేదు.. శుభ్రంగా రోజూ తెలగపిండి కూర మునగాకేసి వండి పెట్టండి.. తల్లికీ బిడ్డకీ మేలని' చెప్పేడు. ఈయన చెప్పింది కరెక్టుగా పనిచెయ్యడంతో ఆ ఏకాంబరశాస్త్రి గారి పరివారం అంతా వెంకట్రాజు మీద నమ్మకం పెంచేసుకున్నారు.
అలాగే ఎవరికైనా పాలేళ్ళకీ, రిక్షా వాళ్ళకీ అందుబాటులో ఉన్న పసుపు, మెంతులు, జీలకర్ర వంటివి ఉపయోగించి చిట్కా వైద్యం నేర్పించేసేడు. దాంతో చుట్టుపక్కల జనం ప్రతీదానికీ ఊళ్లో ఉన్న అల్లోపతీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు కాదు పైగా వెంకట్రాజంటే ఆళ్ళందరి దృష్టిలో దేవుడితో సమానంగా చూసుకునేవారు
అదేంటండీ డాక్టర్ గారూ ఇంకా పెళ్లి చేసుకోలేదేంటండీ అని ఎవరైనా అడిగితే మనకయన్నీ ఎందుకండీ.. మీరందరూ నా కుటుంబంలాంటోరే కదా.. మళ్ళీ నాకు వేరే కుటుంబం గట్రా ఎందుకండీ అని నవ్వేసేవోడు.
ఓసారి కాకినాడ పచ్చిగోళ్ళ వాసు గారి హోల్సేలు మందుల షాపులో తనక్కావలసిన మందులవీ కొనుక్కుని తిరిగి పిఠాపురం వెళ్ళడానికి సర్పవరం జంక్షన్లో షేర్ ఆటో కోసం చూస్తూండగా 'డాక్టర్ గారూ' అని గట్టిగా ఎవరో పిలిచేసరికి ఎవరా అని చూడగా రోడ్డవతల కారాపినుంచున్న ఆ హరికృష్ణ దంపతులు కనబడ్డారు.
వెళ్లి బాగున్నారా అని పలకరిస్తే 'బావున్నామండీ.. ఆ రోజు మీరు చేసిన సహాయం మర్చిపోలేము.. మళ్ళీ మాకు పిఠాపురం వచ్చే పని పడక అటువేపు రాలేకపోయేము. మీరేమనుకోకుండా మా ఇంటికి భోజనానికి రావాలిప్పుడురావాలిప్పుడు' అంది హరిత.
'నేను చేసిందేముందమ్మా.. ఇంకోసారొస్తాను మీ ఇంటికి ' అంటున్నా పట్టించుకోకుండా ' మీరు రాకపోతే నా మీద ఒట్టేనండి ' అని బలవంతంగా వెంకట్రాజుని వాళ్ళింటికి తీసుకెళ్లిపోయారా దంపతులు. దారిలో చెప్పింది హరిత' మా నాన్నగారు కూడా డాక్టరేనండి మీలాగే.. కాకపోతే ఎండి.. కార్డియాలజీ'
'అవునా.. మంచిదండి' బదులిచ్చాడు వెంకట్రాజు
'ఇక్కడ అపోలో హాస్పిటల్ లో మా మావగారు కార్డియాలజీ ఛీఫ్ అండి' కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు హరికృష్ణ
హరిత వాళ్ళింటికెళ్ళేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. లోపలికెళ్ళి చూసేసరికి హరిత తండ్రి రాజేశ్వరరావు గారు కుప్పకూలిపోయున్నారు.
ఆయన భార్య శాంత అంబులెన్స్ పిలవమని కేకలు పెడుతూ ఏడుస్తూంది. హరిత ని చూడగానే 'నీకిందాకటి నుంచి ఫోనుచేస్తున్నాను.. తియ్యవేం?' అని అరిస్తే 'అయ్యో.. ఫోను మ్యూట్ లో పెట్టి మర్చిపోయేను' బిక్కమొహం వేసుకుని బదులిచ్చింది హరిత
'మీరు కంగారు పడకండత్తయ్యా.. నేను అంబులెన్స్ కి ఫోన్ చేసాను.. వెంటనే వస్తుంది' అని హరికృష్ణ ఆశ్చర్యంగా చూసేడు.
అప్పటికే రాజేశ్వరరావు గారి ఛాతీ మీద మోదుతూ మధ్య మధ్యలో ఆయన నోట్లో నోరెట్టి ఊదుతూ కనిపించాడు వెంకట్రాజు.
'ఈయనెవరే? ఏం చేస్తున్నాడు మీ నాన్న గారిని? ' అని అడిగిన శాంత గారిని' ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు.. నువ్వు ఆట్టే టెన్షన్ పడకు మమ్మీ ' అంది హరిత
కాస్సేపటికి ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది.' సిపిఆర్ చేసేను.. డేంజరు తప్పినట్లే.. కాకపోతే ఈయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం' అని ఆ రాజేశ్వరరావు గారిని అపోలో లో చేర్పించి వెళ్లిపోయాడు వెంకట్రాజు.
కొన్నాళ్ళకు వెంకట్రాజు ఇంటి ముందు కారాగింది. హరిత తన తండ్రిని వెంకట్రాజు క్లినిక్ లోకి తీసుకొచ్చి చెప్పింది 'నాన్నగారు కోలుకుంటే అన్నవరం లో వెయ్యిన్నొక్కటి కొబ్బరి కాయలు కొడతానని అమ్మ మొక్కుకుంది.. వెళ్తూ మీకు కనిపించెళ్దామని తీసుకొచ్చేను'
వెంకట్రాజు ' నమస్కారమండీ.. బాగున్నారా?' అని పలకరించేడు. రాజేశ్వరరావు గారు తల పంకించి క్లినిక్ అంతా చూసి మాట్లాడకుండా 'ఇంక మనం వెళ్ళాలి.. లేకపోతే గుడి కట్టేస్తారు' అన్నారు
వెంకట్రాజు చిరునవ్వుతో చూస్తూండగా వారంతా కారెక్కి వెళ్లిపోయేరు.
అన్నవరం కొండెక్కిన తర్వాత హుండీ లో ఓ కవరు వేసి వెళ్లిపోయారు రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత ఎప్పుడూ తను డాక్టర్నని చెప్పుకోలేదు, ప్రాక్టీసూ చెయ్యలేదు.
స్వామి వారి హుండీ లో వేసిన కవర్లో చించేసిన ఆయన ఎండీ సర్టిఫికెట్, కార్డియాలజీ లో ఆయన సాధించిన గోల్డ్ మెడల్స్ తో పాటు వెంకట్రాజు ( బ్రాకెట్లో దేవుడు) ని కులపిచ్చి తో ఏడుసార్లు కార్డియాలజీ సబ్జెక్టు లో ఫెయిల్ చేసి మెడిసిన్ వదిలెళ్ళిపోయేలా చేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరం కూడా ఉంది.